సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, March 14, 2011

ప్రకృతి వైపరీత్యాలు

నాల్రోజులు పాటు టివీ, న్యుపేపర్లు చదవలే. ఊరెళ్ళి వచ్చి టివీ పెట్టగానే కనబడ్డా వార్తలు కలవరపెట్టాయి. రాష్ట్ర రాజధానిలో విగ్రహాల కూల్చివేత, జపాన్లో భయంకర సునామీ..భూకంపం....ఇవాళ పొద్దున్నేనేమో రేడియేషన్ భయం..అంటూ వార్తలు..! రాష్ట్రంలో సంగతి గురించి విచారించటం తప్ప ఏమీ చెయ్యలేం. పాపం విగ్రహాలేం చేసాయి...వాటి తాలూకు మనుషులకు కాదు ఇది తెలుగు జాతికి జరిగిన అవమానం అనిపించింది నాకు. రాష్ట్ర భవిష్యత్తు కాలానికే తెలుసు కదా అనుకున్నా..

సూర్యుని కిరణాలు మొదట తాకే నేల కాబట్టి "Land of Rising sun" అని చిన్నప్పుడు చదువుకున్న పాఠo. ప్రపంచయుధ్ధంలో పెద్దఎత్తున నష్టపోయాకా, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు చవి చూశాకా కూడా మళ్ళీ నిలదొక్కుకుని ఆ దేశం సాధించిన ప్రగతి నన్ను అబ్బురపరుస్తాయి. ఇవాళ మరోసారి జపాన్ దేశం లో జరిగిన భీభత్సాన్ని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తోంది. రైల్లో వస్తూంటే "పేపరే చూడలేదు ఈ నాలుగురోజులు. ప్రపంచం ఏమౌతోందో.." అన్నాను. నిజంగానే నాలుగురోజుల్లో ఎన్ని దుర్ఘటనలు జరిగిపోయాయో..

What are natural calamities and how does they occur? అని చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో ప్రశ్న ఉండేది. అది గుర్తొచ్చింది ఇవాళ న్యూస్ చూడగానే.. ప్రపంచంలో ఏదో ఒక చోట మానవుడి ప్రమేయం లేకుండా ప్రకృతి చేసే విలయతాండవ రూపమే ఈ వైపరీత్యాలు... మరి అవి ఎందుకు వస్తాయి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అంటూ పెద్ద జవాబే ఉండేది స్కూలు పుస్తకాల్లో. కానీ వేదాంతధోరణిలో చెప్పాలంటే భూమి మీద పాపాలు పెరిగిపోయినప్పుడు భూమి భారాన్ని దించటానికి దేవుడు ఇలాంటి వైపరీత్యాలు సృష్టిస్తూ ఉంటాడు అని ఎక్కడో చదివిన గుర్తు.

ప్రపంచం ఎంత అభివృధ్ధి చెందినా, అధునాతన సాంకేతికపరిజ్ఞానాన్ని సంపాదించినా ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఆ పరిజ్ఞానానం అంతా మూగపోతుంది. చూస్తూ ఉండటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయతలో మిగిలిపోతుంది. అంతా ప్రకృతి మాయ. జపాన్ లో ఈ వైపరీత్యం వాల్ల మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని, నష్టపోయిన కుటుంబాలు కొంతమేరకైన బాగుపడాలనీ, కనబడకుండా పోయిన కుటుంబసభ్యులు వారి వారి కుటుంబాలను మళ్ళీ చేరుకోవాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. మీరూ ప్రార్ధించండి.

'Japan Earthquake: before and ఆఫ్టర్' అని ఒకచోట దొరికిన ఫోటోలు నేను ఇప్పుడే చూసాను. క్రింద లింక్ లో చూడండి...
http://www.abc.net.au/news/events/japan-quake-2011/beforeafter.htm

Tuesday, March 8, 2011

అభివందనం..



అన్నివేళలా పక్కనుండగల శక్తి
ఏది, ఏంత చెప్పినా వినే ఓరిమి
అర్ధం చేసుకునే సహనం
శ్రధ్ధ తీసుకోగల అభిమానం
అనురాగం ఆత్మీయత నిండిన
నవనీత హృదయ మగువ.

అన్నదమ్ములకు అనురాగం అందించినా
తల్లిదండ్రులకు అభిమానం పంచినా
స్నేహసౌరభాలు పంచిఇచ్చినా
భార్యగా బంధాలు పెనవేసినా
మాతృత్వపు మమకారాలు చూపినా
అత్తింట బాధ్యతలు తనవి చేసుకున్నా
ఉద్యోగభారాన్ని సమర్ధంగా మోసినా
ఎక్కడ ఎన్ని అవతారాలెత్తినా
తన స్త్రీత్వమనే అస్థిత్వాన్ని పదిలపరుచుకుంటుంది అతివ.


అపురూపమైన ఈ అస్థిత్వాన్ని గుర్తించలేని నిర్భాగ్యులు కొందరైతే
అదే అస్త్రంగా తమ స్త్రీత్వాన్ని ప్రజ్వలించుకునేవారు కోకొల్లలు.
పరిపూర్ణమైన ఆ స్త్రీత్వానికి వందనం.
ప్రతి బంధంలో ప్రాణం నింపే ప్రతి అతివకూ అభివందనం.




Sunday, March 6, 2011

ఒళ్ళు మండుతోంది..

ఆ దృశ్యం చూసినప్పటి నుంచీ.
నిన్న పొద్దున్నుంచీ.
ఒళ్ళు మండుతోంది.
బుడుగు భాషలో చెప్పాలంటే నడ్డి మీద చంపెయ్యాలన్నంత ఖోపం. ప్రతి పనికీ ఆ వీధిలోంచి వెళ్ళక తప్పదు. నిన్న కూడా ఆ ఇంటి మీదుగా నాలుగైదుసార్లు వెళ్ళాల్సివచ్చింది. అలా వెళ్ళినప్పుడల్లా మనసు రగిలిపోయింది. ఇవాళ పొద్దున్న కూడా పాల కోసం వెళ్తూంటే మళ్ళీ అల్లంత దూరంలో ఆ ఇల్లు కనబడగానే నిన్నటి విషయం గుర్తుకొచ్చి భలే కోపం వచ్చింది. అసలు మొదటి నుంచీ అతనిది ఏదో తేడా బొమ్మ అనే అనుకుంటూ వస్తున్నా. ఇప్పుడిక కన్ఫార్మ్ అయిపోయింది. ఇప్పటిదాకా అతనిపై ఉన్న కాస్త జాలీ కూడా ఎగిరిపోయింది. దగ్గరకు వెళ్ళీ, ఏమయ్యా ! నీకసలు మనసుందా? మనిషివేనా? అని కడిగెయ్యాలని. బాగా మనసారా తిట్టాలని...అనిపించింది. కానీ ఏం చేయలేని నిస్సహాయత. నాకేం హక్కుంది? అతని ఇల్లు అతని ఇష్టం.

మేం ఈ ఏరియాలోకి వచ్చాకా ఏదన్నా పని మీద వెళ్లాలంటే ఆ వీధి లోంచే వెళ్ళాలి. బస్టాప్ దాకా వెళ్ళాలంటే ఐదు నిమిషాల నడక. దారిలో చాలా ఇళ్ళున్నా నా దృష్టి వీధికి ఎడమవైపున్న ఆ ఇంటి మీద పడటానికి ఒక బలమైన కారణం ఉంది. సన్నజాజి తీగ. నాకెంతో ప్రీతిపాత్రమైన పూలు. కాస్తా కూస్తా కాక ఇంత లావు మొదలుతో ఖాళీగా ఉన్న డాబా పైకి పాకిన పెద్ద తుప్పులా ఉన్న సన్నజాజితీగను చూసి రోజూ ఆనందిస్తూ ఉండేదాన్ని. ఇంకెంత మరో నెలారెంణెళ్ళు ఆగితే చెట్టంతా పువ్వులే అన్న ఊహ నన్ను చాలా సంబరపెట్టేది. ఆ తరువాత,ఆ ఇంటి గేటు దగ్గరే ఎప్పుడూ కనబడుతూ ఉండే సర్దార్జీ ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగేది. ఏభై యేళ్ళకు ఏ మాత్రం తక్కువ ఉండదు అతని వయసు. అంత పెద్ద ఇంట్లో అతను కాక ఒక ముసలి తల్లి మాత్రం కనబడుతూ ఉంటూంది. మరెవరూ కనబడేవారు కాదు. పైగా రోజూ ఏ వేళలో అటువైపు వెళ్ళినా ఆ గేటు దగ్గరే కుర్చీలో నిద్రోతూనో, నించునో కనబడతాడు ఆయన. రోజూ అదే దారి కావటంతో కొన్నాళ్ళకు గేట్లో ఆయన కనబడకపోతే ఆశ్చర్యం వేసేది. ఇవాళేంటి లేడు అని. ఆయన గురించి బస్టాప్ వచ్చేదాకా మాకు డిస్కషను. "ఎందుకండీ ఆయన అక్కడే నిలబడతాడు? ఏం పని లేదా? ఆ ఇంట్లో ఇంకెవరూ లేరేంటి? పెళ్ళవలేదంటారా? " అని తనని ప్రశ్నలతో వేధించేదాన్ని. "మనకెందుకు? అతని ఇల్లు అతని ఇష్టం. నించుంటాడో కూచుంటాడో." అనేవారు తను. "అలాక్కాదండీ, అలా వీధిలో నించునే ఉంటాడెందుకు? వేరే పనేం లేదా? అదేం టైం పాస్? ఏ పుస్తకమో చదువుకోవచ్చు కదా? కంప్యూటర్ లేదంటారా? లేదా టివీ చూడొచ్చు కదా? ముప్పొద్దులా అలా గేట్లోనే ఉంటాడేం? వాళ్ళీంట్లో ఏవైనా విలువైన వస్తువులున్నాయేమో? వాటికి కాపలాగా అలా నింఛుంటాడేమో?" అని అనేదాన్ని.
ఓ రోజలాగే ఏదో అనబోయాను. "అతని కాలు వైపు చూడు" అన్నారు తను. అప్పుడు చూశాను అతని ఒక కాలు బాగా లావుగా వాచి ఉంది. ఏదో కట్టు కూడా ఉంది. చూట్టానికి భయం వేసింది. "ఓహో అదన్నమాట సంగతి. ఏదో దెబ్బ తగిలి ఇలా ఇంట్లో ఉండిపోతున్నాడన్న మాట" అన్న సమాధానం దొరికింది. కానీ దెబ్బ తగిలితే ఇంట్లోనే ఉండచ్చు కదా. ఇలా వీధిలో నిలబడటం ఎందుకు? పైగా ఓ కుర్చీ కూడా వేసుకుని రాత్రిళ్ళు కూడా అక్కడే కూచుని కనిపిస్తాడు. కాలక్షేపానికి ఏం చేయాలో తెలియదా ఈయనకి?" అని బోలెడు ప్రశ్నలు నాకు. మరో రోజు వాళ్ళింటి గోడ దగ్గర ఏదో తుక్కు పోతున్నారని ఎవరినో తిడుతున్నాడు. ఆ తరువాత సంత రోజున కూరలవాళ్ళు ఆ ఇంటి ముందు కూరలు పరచబోతే ఒప్పుకోలేదు. ఇంతోటి ఇంద్ర భవనానికీ అడ్డామా అని నవ్వుకున్నాం. కూరలవాళ్ళు సణూక్కుంటూంటే మేమూ నవ్వుకున్నాం. కిరికిరీ మనిషన్న మాట. అనుకున్నాం.

ఇక నిన్న పొద్దున్నే వెళ్తూంటే ఆ ఇంటివైపు చూసి అవాక్కయ్యాను. తరువాత బోలెడు ఖోపం వచ్చేసింది. ఓళ్ళు మండిపోయింది. ఇంతకీ ఏం చేసాడో తెలుసా? అంత లావు మొదలుతో మరో నెల్లో పూయబోయే సన్నజాజి తీగ మొదలంటా నరికించేసాడు. అదేం పాపం చేసింది పాపం? నోరు లేని జీవం. పచ్చగా ఉన్న తీగను ఎలా నరకాలనిపించిందో. పరీక్షగా చూస్తే ఇంటికి రంగులేస్తున్న పనివాళ్ళు కనబడ్డారు. ఇంటికి రంగు వెయ్యటానికి అడ్డం వస్తోండని కొట్టించేసాడన్న మాట. కాసిని కొమ్మలు కొట్టించి మిగతాది ఉంచచ్చు కదా. ఇప్పుడా ఇంటి అందానికి ఇదేం అడ్డం వచ్చింది? ఉండేది ఇద్దరే కదా. ఎలాగోఅలా ఈ కిరికిరీ అంకుల్ ను మంచి చేసుకుని వేసం కాలంలో ఆ సన్నజాజి పూలూ రోజూ కోసుకోవచ్చని ఎన్ని కలలు కన్నాను..? ఒప్పుకోకపోతారా? అనుకున్నా. అంత పెద్ద తీగెకు ఎన్ని పూవులు పూస్తాయో కదా...కోసుకున్నా కోసుకోకపోయినా చూసి ఆనందించచ్చు. అటు వెళ్ళినప్పుడల్లా గుప్పుమనే వాసన ఆస్వాదించచ్చు అని ఆశపడ్డాను...

అసలు నా ఆశల సంగతి వదిలేస్తే పచ్చని చెట్టు నరకాలన్న ఆలోచన ఎంత భయంకరమైనది? మనసున్న మనిషెవ్వడూ అలా చెయ్యడసలు. మనుషులను హింసిస్తే శిక్షిస్తారు. జంతువులను హింసిస్తే కూడా శిక్షిస్తారు. కానీ పచ్చని ప్రాణమున్న చెట్టుని కొట్టేస్తే ఏ శిక్షా లేదేం? అలాంటి చట్టం కూడా ఎవరన్నా చెయ్యకూడదూ? మొక్కలకు మాత్రం ప్రాణాం ఉండదా? పొద్దున్నే లేవగానే చల్లని గాలితో ఎంత అందంగా పలకరిస్తాయి? ఆ పలకరింపులోని చల్లదన్నన్ని ఎవరూ గమనించరా? అందమైన పువ్వులతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మొక్కల మధ్యన కూచుంటే చిన్నగా తలలూపుతూ ఎన్ని కబుర్లు చెప్తాయో...అవి ఎవరికీ వినిపించవా? ఏమిటో మొక్కలంటే మనుషులకి అంత అలుసు. జంతువులు ఇంకా కుయ్యో మొయ్యో అని అరుస్తాయి. పాపం మొక్కలకు, చెట్లకు అలా అరవటం కూడా రాదు. వాటిని నరుకుతుంటే బాధ ఎవరితో చెప్పుకుంటాయి? చిరంజీవి లెవెల్లో " మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా.." అని భారీ డైలాగు వాటి తరఫున చెప్పే నాధుడు లేడనే కదా మొక్కలంటే మనుషులకు అలుసు. అందుకే ఒళ్ళు మండుతోంది...

***** ****
పూయలేకపోయిన నా ప్రియమైన సన్నజాజులు...

Saturday, March 5, 2011

ఇవేం పూలు?


ఏమిటీ కాగితం పూలు అనేద్దామనుకుంటున్నారా? అదేం కదు. ఇవి "చుక్కాకు పులు". ఆకుకూరల్లో ఒకటైన చుక్కాకుకు ఈ పూలు పూసాయి.నేనూ ఇదే చూడటం.కుండీలో పెంచిన చుక్కాకు పప్పులోకి రెండు కోతలు అయిపోయాకా ఇలా పూలు వస్తూంటే బాగున్నాయని ఉంచేసాను. కుండీ నిండుగా ఇలా పూసేసాయి. కాగితo పూల్లాగా ఉన్న ఈ పూలు చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇలా ఉంచేస్తే ఎండిపోయి విత్తనాలయిపోతాయని ఉంచేసాను. బాగున్నాయి కదా.




Thursday, March 3, 2011

ఇవాళేం చేసానంటే..


ఆయ్యో ఇవాళ బ్లాగనేలేదు... అసలు రోజూ రాయాలా? రూలేమీ లేదు. కానీ వీలైనంతవరకూ నాకోసం నేను ఈ ఈ-కబుర్లు రాస్కుంటూనే ఉంటాను. ఇంతకీ టపా రాయకుండా ఇవాళ ఏం చేసినట్లు? నిన్న చాంతాడంత క్యూ ఉందని సాములారి దర్శనం చేసుకోకుండా వచ్చేసాం కదా. అందుకని పొద్దున్న పనులయ్యాకా మళ్ళీ గుడికి వెళ్ళి ఓసారాసాములారిని పలకరించి, కాసిన్ని పాలు అభిషేకించి, ఓ దణ్ణమెట్టేసుకుని వచ్చేసామన్నమాట. ఇప్పుడొచ్చావ్... అప్పుడొచ్చావ్...అని కోప్పడడు కదా పెద్దాయన. మనుషులకైతేనే భయపడాలి. దేవుళ్ళకు భయపడక్కర్లేదు. ఎందుకంటే మనమేంటో ఎదుటోళ్ళకన్నా, మనకన్నా, బాగా తెలిసినది దేవుళ్ళకే కాబట్టి.

ఇంకా ఏవేవో పనులు...ఇప్పుడేమో మరి రాత్రయిపోయింది కదా ఇంకేం కబుర్లాడతాను? టయిం లేదు...ప్చ్! అంద్కని ఇప్పుడే చేసిన "stuffed capsicum" కూర ఫోటో పెట్టేస్తాను చూసేయండి...ఈసరి గ్రేటెడ్ పనీర్ అదీ వేయకుండా సాత్వికమైన కర్రీలా వండేసాను. టేస్ట్ కూడా బానే ఉంది. మీకు నచ్చిందనుకోండి, "రుచి..." బ్లాగ్ లో మళ్ళీ చేసేస్కుందాం. ఎల్లెల్లవమ్మా. నువ్వు చెప్పేదేమిటి? గూగులమ్మ నడిగితే రెసిపీ చెప్పేస్తుంది అంటారా? అయితే నేనే తినేసి హాయిగా బజ్జుంటాను.


అదిగో బొమ్మ బాగుంది కదా...అడిగేయండి...అడిగేయండి..ఎలా చేసానో చెప్పేస్తాను..!!

Wednesday, March 2, 2011

మహా దేవ శంభో ...



(బిక్కవోలు గుడిలో ఫోటో)

శివరాత్రి సందర్భంగా శివునిపై కొన్ని ఓల్డ్ గోల్డీస్...

మహా దేవ శంభో (భీష్మ)

హర హర మహాదేవ(దక్ష యజ్ఞం)

దేవ దేవ ధవళాచలమందిర(భూకైలాస్)


నీలకంధరా దేవా(భూకైలాస్)

శైలసుత హృదయేశా(వినాయక చవితి)


------------------------

అదివరకూ నేను టపాయించిన తనికెళ్ల భరణిగారి రచించి, పాడిన "నాలోన శివుడు కలడు" పాటలు:
http://trishnaventa.blogspot.com/2009/11/blog-post_16.హ్త్మ్ల్

ఆదిశంకరాచార్య విరచిత "నిర్వాణ షట్కం" :
http://trishnaventa.blogspot.com/2010/05/blog-post_18.హ్త్మ్ల్

Tuesday, March 1, 2011

జ్ఞాపకాల పూలు



పొద్దున్నే మెలుకువ వచ్చి లేచి కళ్ళు నులుముకుంటూ లైటు కనబడుతున్న వంటింటి వైపు వెళ్తే, అక్కడ రేడియో లోంచి వినబడుతున్న ప్రసార విశేషాలు, అప్పుడే తీసిన కాఫీ డికాషన్ తాలుకూ ఫ్రెష్ సువాసన, పొయ్యి మీద పెట్టడానికి రెడీగా ఉన్న ఇడ్లీ ప్లేట్లు, చెమట ఇంకటానికి మెడ చుట్టు చుట్టుకున్న పల్చటి తెల్లటి తువ్వాలుతో మామ్మయ్య దర్శనం అయ్యేది.(మా నాన్నమ్మను మేము "మామ్మయ్య" అని పిలిచేవాళ్లం). సెలవుల్లో ఊరు వెళ్లినన్నాళ్ళూ రోజూ అదే దృశ్యం. ఇంకా ముందర లేస్తే వంటింటి బదులు దొడ్లో లైటు, అక్కడ వారగా ఉండే సిమెంట్ గోలెం మందారాలు పుసిందా? అన్నట్లు గోలెం నిండుగా పరుచుకుని ఉన్న ఎర్రటి రేకమందారాలు(ముందు రోజు సాయంత్రమే ఎవరో ఒకరు మొగ్గలు కోసి అందులో వేసేవారు)...తులసి కోట దాటి తలుపు తీస్తే దొడ్లో ఏవో పనులు చేస్తూనో, మొక్కలకి నీళ్లు పోస్తూనో కనబడేది మామ్మయ్య. చీకట్లు తొలగుతూ తెల్లవారేవేళ అలా లేచి మామ్మయ్యను చూడటం ఒక అపురూపంగా తోచేది మాకు. ఆ దృశ్యం చూడటానికి వీలైనన్నిసార్లు పొద్దున్నే లేవటానికి ప్రయత్నించేవాళ్ళం నేనూ, మా తమ్ముడూ.

అదే వర్షాకాలమైతే దొడ్లో నూతి నిండా నీళ్ళు ఉండేవి. చేద వేయనక్కర్లేకుండా చెంబుతో ముంచితే నీళ్ళు అందేంత పైకి నీళ్ళు ఉండేవి. క్రితం రోజు సాయంకాలం మందార మొగ్గలు కోసి నూతిలో వెసేసేవారు. అప్పుడు పొద్దున్నే లేవగానే నూతి గోడల అంచుదాకా పైకి ఉన్న నీటిలో విచ్చుకున్న ఎర్రటి రేకమందారాలు ఎంత అందంగా ఉండేవో మాటల్లో చెప్పటం కష్టం. అప్పట్లో డిజిటల్ కెమేరాలు, మొబైల్ కెమేరాలు లేవు. లేకపోతే ఎన్ని ఫోటోలు తీసిఉందునో అనుకుంటూ ఉంటాను. దాదాపు పదమూడు రకాల మందారాలు పెంచేది మామ్మయ్య. అన్నీ పెద్ద పెద్ద వృక్షాలయి బోలెడు పూలు పూసేవి. పారిజాతాలు, కాసిని మల్లెలు, సంపెంగలు, నిత్యమల్లి, చామంతులు, దేవకాంచనాలు మొదలైన మిగిలిన పూలు కూడా పూసేవి. పాండ్స్ టాల్కం పౌడర్ ఏడ్ లో కనబడే ఫ్లవర్స్ లాగ ఉండేవి దేవకాంచనాలు. (అవి తెలుపు, లేవెండర్, గోధుమ రంగుల్లో ఉన్న చెట్లు చూసాను నేను. ఇంకా రంగులు ఉన్నాయేమో తెలీదు.) మా ఇంట్లోని దేవకాంచన వృక్షం తెల్లటి తెలుపు పులు పూసేవి. అందుకని మేము వాటిని "డ్రీమ్ ఫ్లవర్స్" అనేవాళ్లం. ఇక పనిమనిషి లక్ష్మి వస్తునే మిగిలిన పువ్వులన్నీ పూజకు కోసి తెచ్చాకా, అవి ఇంట్లోని నాలుగు వాటాలవాళ్లకు పంచబడేవి. సన్నజాజులు మాత్రం నేనక్కడ ఉన్నన్ని సాయంత్రాలు నా జడల్లోకే. మంచినీళ్లకు ఎవరొస్తేవాళ్ళు వాళ్ల వాటా తాలుకు పూలు పట్టుకెళ్ళేవారు. ఇంటివాళ్లం మనమే కదా అన్ని పూలూ మనమే వాడుకోవచ్చు కదా అనడిగేదాన్ని నేను. వాళ్ళూ దేవుడికి పెడితే మంచిదే కదా అనేది మామ్మయ్య. సాయంత్రాలు రెండ్రోజులకోసారి ఎరుపు, పసుపచ్చా రంగుల్లో పూసిన కనకాంబరాలు, దోడ్లో పెరిగిన మరువమో, ధవనమో కలిపి అమ్మ దండ కడితే రెండు జడలకీ వంతెనలాగ అటు నుంచి ఇటు వచ్చేలా నా జెడల్లో కట్టిన దండ పెట్టేది అమ్మ.

డాబా మీదకు వెళ్ళి, సన్షేడ్ మీదకు దిగి మరీ దొరికినన్ని సన్నజాజులు కోసుకు రావటం నా సాయంత్రపు దినచర్య. ఆల్రెడీ జళ్ళో కనకాంబరం దండ ఉంటే అవి రేప్పొద్దున్నకి ఫ్రిజ్ లో దాచేవాళ్ళు. తరువాత ఆకు సంపెంగ చెట్ల చుట్టూ తిరిగి వాసనబట్టి పువ్వులు ఎక్కడ ఉన్నాయో చూసి, ఇవాళ విడుస్తాయనిపించిన పూలు కోసి నీళ్లల్లో వేయటం ఓ పని. ఆ తర్వాత అన్నయ్యను నిచ్చెన వేయించి సింహాచలం సంపెంగ చెట్టు ఎక్కించి అందుబాటులో ఉన్న పూలన్నీ కోయించటం. "పువ్వుల కోసం నువ్వడగటం వాడెక్కటం బాగానే ఉంది" అని పెద్దవాళ్లు మందలించటం సరదాగా ఉండేది. ఆరు ఏడు అయ్యాక సాయంత్రమే కోసి నీటిలో వేసి మూత పెట్టిన ఆకు సంపెంగలు వంటింట్లోకి వెళ్తూనే గుప్పుమనేవి. రోజూ ఏడెనిమిది పూల దాకా పూసేవి ఆకుపచ్చ సంపెంగలు.

అలా శెలవులకు ఊరెళ్లినప్పుడల్లా నన్ను పలకరించే రకరకాల పూలన్నీ మామ్మయ్య ప్రేమగా పెంచినవే. తన చేత్తో వేస్తే ఏ మొక్క అయినా, కొమ్మ అయినా బ్రతికేది. పూల మొక్కలే కాక దబ్బకాయ, జామ, పనస, అరటి మొదలైన పెద్ద చెట్లు కూడా తన సంరక్షణలో పెరిగేవి. మామ్మయ్య పోయిన తరువాత తనను వీడి ఉండలేనట్లుగా తను పెంచిన దొడ్లోని చెట్లన్నీ చాలా వరకూ వాడి ఎండిపోయాయి. మామ్మయ్యకూ మొక్కలకీ ఉన్న ఆ అనుబంధం ఎంతో అపురూపమైనది..చిత్రమైనది. ఆ తోట, ఆ ఇల్లు, పూలు ఇప్పుడు లేకపోయినా తలచినప్పుడల్లా ఇప్పటికీ చుట్టుముట్టే ఈ జ్ఞాపకాల పూలన్నీ మనసులో పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి.


మధుర గీతాలు: ఇది కథ కాదు(1979) పాటలు

"ఇది కథ కాదు" సినిమాలో ఎంత వాస్తవికత ఉందో పాటలూ అంత అర్ధవంతంగా బావుంటాయి. బాలచందర్(దర్శకత్వం), ఆత్రేయ(సాహిత్యం), ఎం.ఎస్.విశ్వనాథన్(సంగీతం) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పాటలు మనసుకు దగ్గరగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి. ఇందులో " తకధిమితక ధిమితకధిమి " పాట, "గాలికదుపు లేదు.." పాట సాహిత్యపరంగా నాకు చాలా నచ్చే పాటలు. ఒకో వాక్యంలో ఎంత అర్ధం దాగి ఉందో అనిపిస్తుంది. ముఖ్యంగా "జత జతకొక కథ ఉన్నది" పాటలో ప్రతీ వాక్యమూ ఎంత అనుభవపూర్వకంగా రాసారో ఆత్రేయగారు అనిపిస్తుంది. నాకు చాలా నచ్చే పాట అది. "గాలికదుపు లేదు" పాటలో జానకి గారి గళం నిజంగా గంగ వెల్లువలా పరవళ్ళు తొక్కుతుంది. వేరొకరెవరు పాడినా ఈ పాటకు న్యాయం చెయ్యలేకపోయేవారేమో.

ఆత్రేయ రచన పాటలకు ప్రాణమైతే, ఎమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం ఊపిరి. బాలు, సుశీల ల యుగళగీతం "సరిగమలు గలగలలు" పాట వింటుంటే చక్కనైన ఏ జంటయినా ముచ్చటగా ఇలానే పాడుకుంటారేమో అనిపిస్తుంది. "జూనియర్ జూనియర్.." పాటలో బాలు పలికించిన భావాలు కమల్ నటనతో పోటీ పడతాయి. సుశీలమ్మ గొంతులో "జోలపాట పాడి ఊయలుపనా" పాట హృదయాన్ని భారం చేస్తుంది. ఓసారి ఈ పాటలు చూసేస్తూ...గుర్తుకు తెచ్చేసుకుందామా...

1)తకధిమితక ధిమితకధిమి..


తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే ఛమ్ ఛమ్
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం

ఈలోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణము
ఆడించువాడెవ్వడైనా ఆడాలి ఈ కీలుబొమ్మ
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం

వెళ్తారు వెళ్ళేటివాళ్ళు
చెప్పేసెయ్ తుది వేడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు
వింటారు నీ గుండె రొదలు
కన్నీటి సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు

ఏనాడు గెలిచింది వలపు తానోడుతే దాని గెలుపు(౨)
గాయాన్ని మాన్పేది మరుపు ప్రాణాన్ని నిలిపేది రేపు(౨)
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు

2)గాలికదుపు లేదు కడలికంతు లేదు



గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికేమనసుకి గిరిగీస్తే అది ఆగేదేనా

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడి కేది కట్టుబాటు?
మళ్ళి మళ్ళి వసంతమొస్తే మల్లె కేది ఆకుచాటు?

ఓ తెమ్మెరా ఊపవే ఊహల ఊయల నన్ను
ఓ మాలికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకు
తల్లి మళ్ళి తరుణయ్యింది పువ్వు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతె తప్పేముంది?


3)సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము




4)జూనియర్ జూనియర్..
ఇటు అటుకానీ హృదయం తోటి
ఎందుకురా ఈ తొందర నీకు


5)"జోలపాట పాడి ఊయలూపనా, నా జాలి కథను చెప్పి జోల పాడనా" పాటను పి.సుశీల పాడారు. ఈ సాంగ్ వీడియో లింక్ దొరకలేదు.



ఈ సినిమా పాటలన్నీ వినేందుకు లింక్:
http://webcache.googleusercontent.com/search?q=cache:hJr90aoyqeoJ:www.cinefolks.com/telugu/AudioSongs/movie/Idhi%2BKadha%2BKaadu+gaali+kadupu+lEdu+song&cd=4&hl=te&ct=clnk&gl=in&source=www.google.co.ఇన్



http://webcache.googleusercontent.com/search?q=cache:hJr90aoyqeoJ:www.cinefolks.com/telugu/AudioSongs/movie/Idhi%2BKadha%2BKaadu+gaali+kadupu+lEdu+song&cd=4&hl=te&ct=clnk&gl=in&source=www.google.co.in


Monday, February 28, 2011

వంటరాని మగాడు (Just for fun..)


"వంటొచ్చిన మగాడు" అని మా అన్నయ్యను దృష్టిలో పెట్టుకుని చాలా కాలం క్రితం ఒక టపా రాసాను. ఆ తరువాత "వంటరాని మగాడు" అని రెండవ భాగం రాస్తానని అన్నాను కానీ అది రాయటం కుదరనేలేదు. కొందరు బ్లాగ్మిత్రులు రెండవభాగం ఏదని అడిగారు అప్పట్లో.. అయినా ఎందుకనో ఆ రెండవభాగం రాసే మూడ్ అప్పుడు పోయింది. ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ రెండవ భాగం రాయాలని సంకల్పం కలిగింది. రెంటికీ లింక్ అయితే లేదు కానీ మొదటిది చదవనివారు అక్కడకు వెళ్ళి ఓ లుక్కేస్తే బాగుంటుందని అభిప్రాయం.
( http://trishnaventa.blogspot.com/2009/10/just-for-fun.html )
************
వంటరాని మగాడు:

వంటరాని మగవాళ్ళలో నాకు తెలిసినంతలో ముఖ్యంగా మూడు రకలవాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా ఉంటారేమో నాకైతే తెలీదు..:))

1) కొందరికి వండటం రాదు కానీ వారు పెట్టినది తిని ఎంజాయ్ చెయ్యగలరు. వీరితో ఏ ఇబ్బందీ ఉండదు.

2)మరొకరకం వారు వండటం రాకపోయినా వంటలకు వంకలు పెడుతూ ఉంటారు వండిపెట్టేవారి ఒళ్ళుమండెలా. భోజనం తింటున్నంతసేపూ వారి సాధింపుల రికార్డ్ మోగుతూనే ఉంటుంది. ఆ వంకలన్నీ టేస్ట్ లు తెలియటం వల్ల కదా అని ఈ రకం వారితో కూడా కాస్తంత సర్దుకుపోవచ్చు అని నా అభిప్రాయం.

3)కానీ మూడో రకం వారున్నారే వారితోనే మహా కష్టం. వాళ్ళకు వండటమూ రాదు. తినటమూ రాదు. అసలు ఫలానాది తినాలన్న కోరికా ఉండదు. పదార్ధాల్లో ఉప్పు కారాలు ఎక్కువయ్యాయో, తక్కువయ్యాయో తెలియదు. ఏం వండాలో, ఎంత వండాలో, వండితే తింటారో తినరో కూడా తెలీని ఈ రకం వారితోనే అసలైన తంటాలన్నీ!!

ఇప్పుడు ఈ మూడు రకాలవాళ్లతో భార్యల సంభాషణలు ఎలాగుంటాయంటే : (ఇది ఎవరినీ నొప్పించటానికి కాదు...కేవలం సరదాకే అని మరొకసారి మనవి)

1) వండటం రాకపోయినా తినేవారు:


"ఇవాళ ఏం వండను?"
"ఏదో నీకు తోచినది వండు. ఏదైనా పరవాలేదు."

"ఆహా చారు అదిరింది. ఎంత బాగుందో"
"ఈ కూర కూడా సూపర్. అసలు నీ వంటే వంట. ఉండు ఈసారి మా బాస్ ను భోజనానికి పిలుస్తాను"

"ఏమిటీ ఊరు వెళ్తావా? మరి నా భోజనం? అసలే నాకు బయట తిండి పడదు. త్వరగా వచ్చేయ్..."
" ...?? మీకు వండి పెట్టడం కోసం నేను వచ్చేయాలా? అంటే మీకు మీ తిండిని గురించిన జాగ్రత్తే తప్ప నా మీద బెంగ ఉండదన్న మాట...."

******* ********** ********
2) వండటం రాకపోయినా తింటున్నంత సేపూ వంకలు పెట్టేవారు:

"ఏమండీ ఇవాళేం వండమంటారు?"
"గుత్తివంకాయ కూర , కొబ్బరి పచ్చడి చేసి, పప్పుపులుసు పెట్టు"

"ఏమిటిది? ఇదసలు గుత్తివంకాయ కూరేనా? అసలు మసాలా ఏది? ఏమేం వేసావిందులో..?
ఇది కొబ్బరి పచ్చడా? దీన్నిండా కొబ్బరి ముక్కలే కనబడుతున్నాయి. మెత్తగా గ్రైండ్ చెయ్యటం రాదా నీకు? మా అమ్మయితే రోట్లో కూడా ఎంత మెత్తగా రుబ్బేదనుకున్నావు"
(ఇలా ఎవరితోనన్నా కంపారిజన్ లు చేసినప్పుడు సదరు అమ్మగారికి రోకలి తెచ్చి అయ్యగారి నెత్తిన ఒక్కటిచ్చుకోవాలన్నంత కోపం వస్తుంది.)

"ఇది పప్పు పులుసా? చారా? తేడా ఏం కనబడటం లేదు. ఈ పోపేమిటి ఇలా మాడిపోయింది? మాడిపోయిన పోపుని చూస్తే నాకెంత ఒళ్ళుమంటో నీకు తెలుసుకదా? అయినా మాడిస్తే ఏమిటర్ధం?...."
"అయితే మీకు నచ్చేట్టు మీరే వండుకోండి. వండిన ప్రతిదానికీ వంక పెడితే నేను వండలేను.."
"నాకు వంటొస్తే నిన్నెందుకు చేసుకోవటం? హాయిగా నాక్కావాల్సిన పదార్ధం నేనే వండుకుని తినేవాడిని"
"అంటే కేవలం వండిపెట్టడానికే నన్ను చేసుకున్నారా..?"

****** ******* ******

3) వండటమూ రాదు. తినటమూ రాదు :

"ఏమండీ ఇవాళ ఏం వండను?"
" రోజూ ఎందుకలా అడుగుతావు? ఏదో ఒకటి వండు."
"ఇవాళ ఇది చెయ్యి అని అసలెప్పుడూ అడగరా?"
"ఏమో నాకు అలా అడగాలని అనిపించదు.."

**** ***** ******

"కూర బాగుందా?"
"బానే ఉంది."
"పప్పు?"
"బానే ఉంది"
"రాత్రికి మొన్న చేసిన కూర చెయ్యనా?"
"ఏ కూర? నాకు గుర్తులేదు.."

**** **** *****
"ఎందుకు కూర ఉంచేసారు? మొన్న తిన్నారు కదా?"
"ఆ రోజు నచ్చింది. ఇవాళ నచ్చలేదు. ఎప్పుడు వండినా తినితీరాలని రూల్ లేదుగా.."

"ఈ పచ్చడెందుకు వదిలేసారు?"
"నేనెప్పుడూ తినలేదిది"
"ఓసారి టేస్ట్ చేసి చూడచ్చు కదా నచ్చుతుందేమో..?"
"ఎప్పుడూ తినని కొత్త పదార్ధాలు నేను తినను"

**** ***** *****

"ఇది మీరు చిన్నప్పటినుంచీ బాగా తినే కూర అన్నరు కదా..వదిలేసారేం?"
"చూడటానికి బాలేదు"
"తింటే బాగుంటుందేమో...ట్రై చేయచ్చు కదా.."
"ఇదివరకూ చెప్పను నీకు చూడగానే బాగుంటే తప్ప నేను ఏదీ తిననని"
"మరి ఇక ఏం వండాలి నేను?"
"......."
"ఏరోజూ ఇది కావాలని అడగరు. కొత్త పదార్ధాలు తినరు. పాత పదార్ధాలు ఒకోసారి తింటారు. ఒకోసారి తినరు. మీతో వేగటం నావల్ల కాదు బాబూ.."
"చేసుకున్నాకా తప్పదు మరి...ఈ జన్మకిలాక్కానీ..."

********** ******** *********

విశ్లేషణ:వంట రాని మగవాళ్ళలో మొదటి కేటగిరీనే బెస్ట్. అవసరార్ధం తప్పదనో, నిజంగానే భార్య వంట నచ్చో మెచ్చుకుంటూ తినేస్తారు. ఎవర్నన్నా భోజనానికి పిలిచినా, పిలవకపోయినా భార్య వంట మెచ్చుకుంటారు.

ఇక రెండో రకం వారితో సర్దుకుపోవచ్చు. వంకలు పెడ్తున్నారని కోపం వచ్చినా ఫలానాది తినాలని ఉందనీ, ఫలానాది బాలేదనీ చెప్పటం వల్ల కాస్త తినటం పట్ల ఆసక్తి ఉందని గమనించొచ్చు. వంట వచ్చిన ఇల్లాలికి మనశ్శాంతి.

కానీ ఆ మూడో రకం వాళ్ళతో మాత్రం చాలా కష్టం.

ఏమైనా నా ఓటు మాత్రం వంటొచ్చిన మగవాళ్ళకే. వీరి తాలూకూ భార్యలు చాలా అదృష్టవంతులు అని నా అభిప్రాయం.(ఇక్కడ మా అన్నయ్యకూ జై...!!)అదేం లేదు.దూరపు కొండలు నునుపు.. అంటారా?

Sunday, February 27, 2011

మా వీధిలో "కూరల సంత"


"సంత" అంటే కొన్ని చిన్న చిన్న దుకాణాల సముదాయం...అంటే మార్కెట్ అనుకోవచ్చు. అన్నిరకాల వస్తువులు దొరికే సంతలు ఉంటాయి. మల్టీపర్పస్ అన్నమాట. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన సంతలు కూడా ఉంటూంటాయి. అక్కడ దొరికే వస్తువుని బట్టి ఆ సంతకు ఆ పేరు ఉంటుంది. పూల సంత, పుస్తకాల సంత, కూరల సంత, పశువుల సంత...అలా అన్నమాట. పూర్వం పల్లెటూర్లలో, గ్రామాల్లో ఊరి చివరలో వారంలో ఒక రోజున, ఎక్కువగా ఆదివారాలు ఈ సంతలు ఏర్పాటు చేసేవారు. పట్టణాల్లో కూడా సంతలు పెడుతూంటారు. మా అత్త, నాన్న, నాన్నమ్మ మొదలైనవారు చెబితే వినటమే కానీ నేనెప్పుడూ ఏ సంతా చూడలేదు. ఈ మధ్యనే ఓ నెల నుంచీ మా వీధిలో కూరల సంత పెడుతున్నారు కొత్తగా.

ఇక కూరలమార్కెట్ కో, రిలయన్స్ కో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి శనివారం హాయిగా ఇంటి దగ్గరే తక్కువ రేట్లకు కూరలు కొనేసుకుంటున్నాను. అసలు మార్కెట్ కు వెళ్ళి కూరలు కొనటం అనేది నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఆకుపచ్చగా, తాజాగా ఉన్న కూరలను చూస్తూంటే ఉత్సాహం పెరిగిపోయి, చేతిలోని సంచీ నిండి, చెయ్యి ఆ బరువును మొయ్యలేకపోతోంది అన్న స్పృహ కలిగేదాకా కూరలు కొనేస్తునే ఉంటాను. ఒకటా రెండా? దాదాపు పధ్ధెనిమిది,ఇరవైఏళ్ల అలవాటు. పైగా నాకు కరివేపాకు కోసమో,కొత్తిమీర కోసమో అడుగడుక్కీ వీధిలోకి పరుగెట్టడం ఇష్టం ఉండదు. వారనికి సరిపడా కూరలతో పాటూ కర్వేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు మొదలైన "కుక్కింగ్ ఏక్సెసరీస్" అన్నీ మర్చిపోకుండా తప్పనిసరిగా కొనేస్తాను. మా వీధిలోని సంత పుణ్యమా అని అన్నీ అందుబాటులోకి వచ్చేసరికీ అసలా కూరల్ని చూడగానే ఆనందతాండవమే. మొదటి రెండువారాలూ భారీజనాలను చూసి భయపడి నేను అటుకేసి వెళ్ళలేదు కానీ ప్రతి శనివారం "కూరల సంత" పెట్టడం చూసి రెండువారాల నుంచీ నేనూ కొనటం మొదలెట్టా.


సాయంత్రం ఆరుదాటితే జనం పెరిగిపోతారని గమనించి మూడూ నాలుగు మధ్యన వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. కూరలే కాక ఉసిరి కాయలు, చింతకాయలు, పండు మిర్చి, పెద్ద మిరపకాయలు మొదలైనవి కూడా ఉంటున్నాయి. క్రితం వారం పండు మిర్చి ఓ పావు కొని కొరివికారం, పెద్ద మిరపకాయలతో ఊరు మిరపకాయలు పెట్టాను. నిన్న ముద్దుగా బొద్దుగా ఉన్న చింతకాయలు కొన్నా. ఇంకా పచ్చడి పెట్టాలి. అప్పుడే తోటలోంచి కోసుకొచ్చినట్లు ఉన్న ఆకుకూరలు, తాజా కూరలు భలే ముచ్చటగా ఉన్నాయి. కూరలు అమ్మే ఒకమ్మాయి నన్ను గుర్తుపట్టి "అమ్మా నువ్వు మార్కెట్టుకు వస్తూంటావు కదా" అని అడిగింది. "ఎలా తెలుసు నేను?" అనడిగాను. మేము అక్కడివాళ్ళమే. జనాలు ఎక్కువరావట్లేదని ఇలా ఒకో వారం ఒకో వీధిలోకీ వచ్చి అమ్ముతున్నామమ్మా. ఇలా వస్తే మాకూ బేరాలు బాగా అవుతున్నాయి. నువ్వు వస్తూంటావు కదా నిన్ను గుర్తుపట్టా" అంది. "జనాల దగ్గరకు మీరు వెళ్లండి..."అన్న "మిష్టర్ పెళ్ళాం" సినిమాలో ఆమని డైలాగ్ గుర్తు వచ్చింది.

మధ్యాన్నం ఒంటిగంట నుంచీ రాత్రి తొమ్మిదింటిదాకా ఉంటున్నారు వీళ్ళంతా. ధరలన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. పావుకేజీలు కావలన్నా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎవరి జాగాల్లో తుక్కు వారే క్లీన్ చేసుకుని తీసుకెళ్ళిపోవాలని రూల్ కూడా పెట్టడంవల్ల మర్నాడు పొద్దున్నే వీధంతా సంత మొహం ఎరుగనట్లు మామూలుగా కూడా ఉంటోంది. అది మరీ నచ్చేసింది నాకు. ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ కాలంలో ఇలాంటి సంతలు ఎంత అవసరమో అనిపించింది. కూరల మార్కెట్ రేట్లకు డబుల్ రేటు పెంచేసి అమ్మే వీధుల్లోని కూరల కొట్లువాళ్ళకీ, సూపర్ మార్కెట్ల వాళ్లకీ ఇలాంటి సంతలే తగిన సమాధానం.



Saturday, February 26, 2011

కుంపటి


"కుంపటి". నాకు భలే ఇష్టమైన వస్తువుల్లో ఒకటి. పైన ఫోటోలోది మొన్న అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్న బుజ్జి కుంపటి.కుంపటి పై ఉన్న ఆ ట్రయాంగిల్ చట్రం గిన్నె నిలబడటానికి వాడేది. దీనితో నాకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఇంట్లో పెద్దది, చిన్నది రెండు కుంపటిలు ఉండేవి. గ్యాస్ స్టౌ మీద వంట చేసినా కూడా కిరోసిన్ స్టవ్, బాయిలర్ స్నానానికి నీళ్ళు కాచేందుకు, కొన్ని పదార్ధాలు చేసేందుకు కుంపటి వాడేది అమ్మ. వంకాయ కాల్చి పచ్చడి చేయటానికీ, తేగలు కాల్చటానికీ, మొక్కజొన్నపొత్తులు కాల్చటానికీ వాడేది. దోసకాయ కూడా కుంపటి మీద కాల్చి పచ్చడి చేస్తారని విన్నాను. అరటికాయ కాల్చి పొడి కూర కూడా చేస్తారు. ఇలా రకరకాలుగా కుంపటి వాడుతూండేది అమ్మ.

మాఘమాసంలో గుండ్రని ఇత్తడిగిన్నెలో పాలు,బియ్యం వేసి కుంపటి మీద అమ్మ చేసే అన్నం పరమాన్నం ఎప్పుడు నైవేద్యం పెడుతుందా అని ఎదురు చూసేదాన్ని...త్వరగా తినేయటానికి. చిక్కుడు కాయలకు పుల్లలు గుచ్చి రథంలా తయారుచేసి, చిక్కుడాకుల మీద వండిన పరమాన్నం పెట్టి నైవేద్యం పెట్టాకా తినటానికి ఇచ్చేది...ఆ రుచే రుచి. గ్యాస్ స్టౌ మీద అన్నం పరమాన్నం చేసినా కుంపటి మీద అమ్మ వండిన ఆ రుచి రాదు. ఇంకా ఉల్లిపాయలు కాల్చి పెట్టేది కుంపటి మీద. గోంగూర పచ్చడి చేసుకుని, కుంపటి మీడ కాల్చిన ఉల్లిపాయలు నంచుకుని తింటే ఉంటుందీ...ఆహా ఏమి రుచీ అని పాడుకోవాల్సిందే.


ఏదైనా చేసే ముందు కుంపటి వెలిగించే డ్యూటీ నాకిచ్చేది అమ్మ. బొగ్గులు వేసి, కాస్తంత కిరసనాయిలు పోసి, కాగితం ముక్కలూ అవీ వేసి కుంపటి వెలిగించి, విసనకర్రతో బొగ్గులు మండేలా చేయటం ఎంత కష్టమైన పనో అసలు. అయినా సరదా కొద్దీ ఎప్పుడూ ఆ పని తమ్ముడికి ఇవ్వకుండా నేనే చేసేదాన్ని. మధ్యలో ఆరిపోతూ ఉండే బొగ్గుల్ని మళ్ళీ మండించటం కూడా ఓ పెద్ద పనే. చాలా రోజుల్నుంచీ అమ్మ దగ్గర నుంచి కుంపటి తెచ్చుకోవాలని. ఇన్నాళ్ళకు కుదిరింది. ఇనుము ఊరికే తీసుకోకూడదని కాస్తంత డబ్బులు ఇచ్చి, అటక పైకెక్కి వెతుక్కుని మరీ అమ్మ దగ్గర నుంచి (పెద్దది అమ్మకు ఉంచేసి)ఈ బుజ్జి కుంపటి తెచ్చుకున్నాను. "తాతా చూడు, బయటవాళ్ళకు ఇచ్చినట్లు అమ్మ అమ్మమ్మకు డబ్బులు ఇస్తోంది" అని మా అమ్మాయి నవ్వు. ప్రస్తుతం బొగ్గులు, కిరసనాయిలు సంపాదించే మార్గం చూడాలి. వీధి చివరి ఇస్త్రీ వాళ్ళని అడిగితే ఇస్తారేమో మరి.

"స్వర్ణకమలం"లో "ఇదేంటి సార్, మీ మొహం ఇలా కుంపట్లో కాలిన కుమ్మొంకాయలాగ అయిపోయింది" డైలాగ్, మొన్న మొన్నటి "అష్టాచెమ్మా" సినిమాలో తనికెళ్ళభరణిగారు స్వయంగా కుంపటిపై వంకాయ కాల్చి పచ్చడి చేసే సీన్ మర్చిపోగలమా? గ్యాస్ స్టౌ లు, కనీసం కిరసనాయిలు స్టౌ లు కూడా లేని పూర్వం మన అమ్మమ్మలు, బామ్మలూ మరి అద్భుతమైన వంటలన్నీ ఈ కుంపటి పైనే చేసేవారు. అంతటి ప్రశస్తమైన చరిత్ర కలిగిందీ కుంపటి. ఐదు నిమిషాల్లో కుక్కర్ కూత రాకపోతే గాభరా పడే మనం అసలు వాళ్ళు అలా ఎలా వండేవారా అని వండరవ్వక మానం. తల్చుకుంటే అమ్మో అనిపిస్తుంది. ఓర్పూ, సహనం అనేవి ఇలా నెమ్మదిగా కుంపటిపై వండటం వల్లనే వాళ్ళకి అలవడేవేమో అని నాకో అనుమానం. అసలు ఇప్పటికీ ప్రతీ ఇంట్లోనూ ఒక కుంపటి ఉండాలని నా అబిప్రాయం. ఏమంటారు?

Friday, February 25, 2011

ప్రేమించి చూడు(1965)


బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కాక ముళ్ళపూడి వెంకటరమణగారు మూగమనసులు, దాగుడుమూతలు, నవరాత్రి, రక్త సంబంధం, ప్రేమించి చూడు వంటి సుపర్ హిట్ చిత్రాలకు కూడా "మాటలు" రాసారు. అందులో నాకు బాగా ఇష్టమైన సినిమా "ప్రేమించి చూడు". హాస్యరసం ప్రధానాంశమైన ఈ చిత్రం సంగీతభరితంగా, ఆనందకరంగా ఉంటుంది. "కాదలిక్క నేరమిల్లై" పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం సి.వీ. శ్రీధర్ అందించారు. ఈ చిత్రానికి తెలుగులో దర్శకులు పి.పుల్లయ్య. ముళ్ళపూడివెంకటరమణగారు మాటలు(డైలాగులు) రాసారు.

సినిమాలో ముఖ్యంగా రేలంగి పాత్ర నాకు చాలా నచ్చేస్తుంది. రేలంగి చెప్పే ప్రతి డైలాగూకూ మనం నవ్వకుండా ఉండలేము. బుచ్చబ్బాయ్ పాత్రలో రేలంగి జీవించారనే చెప్పాలి. "పెద్దమ్మాయ్ బిఎస్సీ , చిన్నమ్మయ్ పి.యు.సీ" డైలాగ్; డైరెక్టర్ అవ్వాలనుకునే కొడుకు చెప్పే సినిమా కథ విని భయపడే సీన్; కూతుళ్ళు ఏదంటే అది ఒప్పేసుకునే ఆ వల్లమాలిన ప్రేమ, పేద్ద ధనవంతుడిలాగ మారువేషం వేసుకొచ్చిన జగ్గయ్యను నమ్మి కాకాపట్టి ఎలాగైనా ఒక కుమార్తెను అతనికి కోడల్ని చేయాలని పడే తాపత్రయం, ఆ క్రమంలో జగ్గయ్యకి తందానతాన అంటూ చెప్పే డైలాగులు నవ్వు తెప్పిస్తాయి.

కథలోకి వస్తే, బుచ్చబ్బాయ్(రేలంగి) ఒక ఎస్టేట్ యజమాని. లక్షల ఆస్తి, అందమైన బంగ్లా ఉంటాయి. ఒక కుమారుడు(చలం), ఇద్దరు కుమార్తెలు(కాంచన, రాజశ్రీ) ఉంటారు. తన వెనుక తండ్రి ఆస్తి ఉందన్న ధీమాతో ఎలాగైనా సినిమాకి దర్శకత్వం వహించాలనే కోరిక అతని కుమారుడిది. కుమార్తెలు అంటే బుచ్చబ్బయ్ కి వల్లమాలిన ప్రేమ. వాళ్ళు ఎంతంటే అంత. పట్నంలో చదువుకుంటున్న వాసూ, కాంచనమాల ప్రేమించుకుంటారు. బుచ్చబ్బాయ్ ఎస్టేట్లోనే అసిస్టెంట్ మేనేజర్ గా చేరతాడు రంగారావు(నాగేశ్వరరావు). ఒక చిన్న తగాదాతో అతనికి పరిచయమౌతుంది బుచ్చబ్బాయ్ చిన్న కూతురు రత్నమాల. కోపంతో అతన్ని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేయిస్తుంది. స్నేహితుల సాయంతో బుచ్చబ్బాయ్ బంగ్లా ముందు డేరా వేసి ధర్నాకి దిగుతాడు రంగడు. ఈ సీన్లో వచ్చే "మేడ మీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు..." పాటను ముళ్ళపూడి గారే రాసారు. బుచ్చబ్బాయ్ పని కావాలోయ్...అంటూ సాగే ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది.

ఈ జగడంలో రత్నమాల, రంగారావు ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఒక మామూలు స్కూలు టీచర్ కుమారుడైన రంగడి పేదరికం పెళ్ళికి అడ్డంకిగా నిలుస్తుంది. అందుకని రంగా తన స్నేహితుడైన వాసు(జగ్గయ్య)కి గడ్డం తగిలించి కోటీశ్వరుడైన శ్రీనివాస భూపతిగా బుచ్చబ్బాయ్ కి పరిచయం చేస్తాడు. ధనాశాపరుడైన బుచ్చబ్బాయ్ ఆస్తి కలిసి వస్తుందని ఒక కుమార్తెను శ్రీనివాసభూపతి తన కొడుకుగా నమ్మించిన రంగాకి ఇచ్చి వివాహం జరిపించాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అనుకోకుండా బుచ్చబ్బాయ్ ను కలుస్తాడు అతని బాల్య మిత్రుడు సుబ్బారాయుడు. ఇద్దరు కలిసి సుబ్బారాయుడి కుమారుడికి బుచ్చబ్బాయ్ పెద్ద కుమార్తె కాంచనమాలను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయిస్తారు. సుబ్బారాయుడు కుమారుడే వాసు అని కాంచనకు తెలిసి వివాహానికి ఒప్పుకుంటుంది ఆమె. కానీ శ్రీనివాస భూపతి వేషంలో ఉన్న వాసు గడ్డం తీసివేస్తే రత్నమాల, రంగల పెళ్ళి ఆగిపోతుంది. ఉంచితే వాసు,కాంచనల పెళ్ళి అవ్వదు.

ఈలోపూ పట్నంలో ఒక ఇంట్లో రంగా ఫోటో చూసిన సుబ్బారాయుడు ఆ సంగతి బుచ్చబ్బాయ్ కి చెప్తాడు. రంగా, వాసుల నాటకం బయటపడిపోతుందా? వాళ్ల పెళ్ళిళ్ళు అవుతాయా? బుచ్చబ్బయ్ కుమారుడు సినిమా తీసాడా? మొదలైన ప్రశ్నలకు సినిమా చూడటమే సమాధానం. సినిమాలో చలం,గిరిజల జంట, గిరిజ తండ్రి పాత్ర, వాళ్ల ముగ్గురి సంభాషణలు హాస్యాన్ని పండిస్తాయి. మాస్టర్ వేణూ సంగీతం సినిమాకు సగం విజయాన్నందించింది. "దొరికేరూ దొరగారూ", "వెన్నెల రేయీ ఎంతో చలీ చలీ", "అందాలే తొంగి చూసే హా హా హా..", నాయికానాయకులు నలుగురూ కలిసి పాడే "ప్రేమించి చూడు పిల్లా పెళ్ళడుదాము మళ్ళా" అనే టైటిల్ సాంగ్, ఏ.ఎన్.ఆర్ ఇద్దరు అక్కచెల్లెళ్ళనూ ఏడిపిస్తూ పాడే "మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద", పైఅన్ చెప్పుకున్న "మేడ మీడ మేడ కట్టి", చలం, గిరిజల పాట "కళ కళాలాడే కన్నులు" , అన్నింటిలోకీ రొమాంటిక్ అయిన "అదిఒక ఇదిలే" పాట Bésame Mucho అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది. (ఈ సంగతి అదివరకూ ఓ టపాలో రాసాను.) నాకు కూడా అన్నింటిలోకీ "మీ అందాల చేతులు", "అది ఒక ఇదిలే" రెండూ ఇష్టమైన పాటలు.
రమణగారి గుర్తు చేసుకుంటూ ఆయన ఈ సినిమాకి రాసిన పాట మరోసారి చూసేద్దామా మరి..

ఏం రాయను...?



అవును..ఏం రాయను..? ముళ్ళపూడి వెంకటరమణ గారి గొప్పతన్నాని నేను అక్షరాల్లోకి ఒదిగించగలనా? అసాధ్యం. నిన్న పొద్దున్నే పూజకు కూర్చున్నాను.. టివీలో స్క్రోలింగ్ వెళ్తోంది అని "ముళ్లపూడిగారి వార్త" చెప్పారు తను. గబుక్కున లేచి రాబోయాను. "ఇంకేమీ చూపించటం లేదు. పూజ పూర్తి చేసుకుని రా. కంగారు పడకు" అన్నారు తను. స్తోత్రాలేవో చదువుతున్నాను కానీ స్థిమితం లేదు. ధ్యాస అక్కడ లేదు. నిన్న దేవుడికి పువ్వులు తేవటం కుదరలేదు. మందిరం బోసిగా ఉంది నా మనసులాగే..అనుకున్నా. అయ్యో, బాపూ గారు ఎలా ఉన్నారో...అని అలోచన. యాంత్రికంగా పూజ అయ్యిందనిపించి, పాపను స్కూలుకు పంపించాకా టీవీ ముందుకు చేరా. స్క్రోలింగ్స్ లో తప్ప ఎక్కడా ఎవరు ఈ సంగతి మాట్లాడటంలేదు. ఇక బ్లాగులు తెరిచను. వరుసగా అన్నీ రమణగారిపై టపాలు...! ఆఫీసుకి వెళ్తూ తను చెప్పారు.."ఆ టివీ చూసి, బ్లాగులు చదివి బాధపడుతూ కూర్చోకు. అవన్నీ కట్టేసి ఏ పుస్తకమో చదువుకో.." అని.

టీవీ అయితే కట్టేసాను కానీ బ్లాగులు మూయలేదు. పనుల మధ్యన తెరుస్తూ మూస్తూ ముళ్ళపూడిగారిపై వచ్చిన ప్రతి టపా చదువుతూ పొద్దంతా గడిపేసాను. మధ్యలో బాపూరమణల సినిమానవల ఒకటి పూర్తిచేసేసాను. చాలా రోజులకు ఒకపూటలో మొత్తం పుస్తకాన్నిచదివేసాను మునుపటిలా. మొన్ననే వస్తూ వస్తూ నాన్న దగ్గర నుంచి కొన్ని సినిమా నవలలు తెచ్చుకున్నాను. విచిత్రమేమిటంతే వాటిల్లో మూడు బాపూరమణల సినిమాలే. వాటి గురించి వీలు చూసుకుని రాయాలి. అయితే వీటి సినిమా సీడీలు మాత్రం దొరకలేదు. ఇటీవలే ఒక ప్రముఖ మ్యూజిక్ స్టోర్స్ లో సీడీలు వెతుకుతూ అక్కడ నించిన్న అమ్మాయిని బాపూ సినిమాలేమైనా ఉన్నాయా అంటే "బాపూ" ఎవరు? అంది. ఓసినీ నీకిక్కడ నించునే అర్హత ఉందా అసలు? అని మనసులో తిట్టుకుని, గొప్ప తెలుగు సినిమాలు తీసిన డైరెక్టర్ అమ్మా అని మాత్రం చెప్పి ముందుకెళ్ళిపోయా. ఇంకేం చెప్పాలి?

ఏమాటకామాటే చెప్పాలి. తమిళులకున్న భాషాభిమానం తెలుగువాళ్లకు లేదు. బొంబాయిలో Matunga road ఏరియా దగ్గరకు వెళ్లినప్పుడలా అనుకునేదాన్ని ఇలాంటి మహా నగరంలో చిన్న తమిళ్నాడును సృష్టించగల ప్రాంతీయాభిమానం తమిళులకే ఉంది అని. కాలేజీ రోజుల్లో కలకత్తా వెళ్ళినప్పుడు "శాంతినికేతన్" చూడటానికి వెళ్ళం. బోల్ పూర్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి రిక్షాలో వెళ్ళాలి శాంతినికేతన్ కి. (ఇప్పుడు ఆటోలు గట్రా వచ్చాయేమో తెలీదు) వెళ్తూంటే ఆ రిక్షానడిపే అతను దారి పొడుగునా అక్కడి విశేషాలు, రవీంద్రుడు చేసిన పనులు, శాంతినికేతన్ ఎలా కట్టారు? టాగూర్ ఏం ఏం చేసారు మొదలైన డీటైల్స్ అన్నీ ఎంతో చక్కగా హిందీలో వివరించాడు మాకు. రిక్షా అబ్బాయికి కూడా ఎంత శ్రధ్ధా? అని ఆశ్చర్యపోయాం మేము. మన తెలుగువారికా శ్రధ్ధ ఉందా?

తెలుగు సాహితీ ప్రపంచానికి రమణగారు చేసిన సేవ తక్కువా? సినీ ప్రపంచంలో బాపూరమణ ద్వయం తీసిన సినిమాలకే కాక రక్త సంబంధం, మూగ మనసులు, ప్రేమించి చూడు మొదలైన మంచి మంచి సినిమాలకు రమణగారు అందించిన "మాటలు" ఎంత అద్భుతమైనవి? ఇవాళ్టికీ ఇంట్లో మాటల్లో వాడుకునే "బుడుగు" డైలాగ్స్ కు పోటీ ఏవైనా ఉన్నాయా? అసలు "బుడుగు"లాంటి గొప్ప కేరెక్టర్ ను తెలుగు సాహిత్య ప్రపంచంలో మరెవరైన సృష్టించగలిగారా? మరి అటువంటి మహానుభావులకు తెలుగువారు ఏమి అవార్డులు ఇచ్చారు? ప్రభుత్వం ఏమి చేసింది? మనిషి పోయిన తరువాత ఎన్ని గౌరవాలు ఇస్తే మాత్రం ఏం లాభం? వారసులు తడిమి చూసుకోవటానికి తప్ప అవి ఎందుకైనా పనికివస్తాయా? బ్రతికి ఉండగా వారి గౌరవాన్ని వారికి అందిస్తే అది వారి ప్రతిభకు గుర్తింపు అవుతుంది. వారు చేసిన సాహిత్యసేవకు, కళా సేవకూ విలువనిచ్చినట్లౌతుంది. రమణగారూ దూరమైపోయినా కనీసం బాపూగారికయినా ప్రభుత్వం ఏదైనా ప్రతిష్ఠాత్మకమైన అవార్డుని ఇప్పటికైనా అందిస్తే బాగుంటుంది అనిపిస్తోంది.

సినీజగత్తులో పేరు పొందిన వ్యక్తులెవరైనా పోయినప్పుడు దూరదర్శన్ వాళ్ళు(DD-1) వారి తాలూకూ సినిమాలను వరుసగా ఓ పదిరోజులనుకుంట టివీలో వేసేవారు. నేను స్కూల్లో ఉన్న రోజుల్లో అలా ఎన్ని మంచి మంచి హిందీ సినిమాలు చూసానో. అంతా దూరదర్శన్ పుణ్యమే. హృషీకేష్ ముఖర్జీ, గురుదత్, రాజ్ కపూర్, బిమల్ రాయ్ మొదలైనవారి మేటి సినిమాలన్నీ నేను చూసినది టీవీలోనే. నాన్నతో పాటూ అర్ధ్రరాత్రి దాటినా ఆ సినిమాలన్నీ వదలకుండా చూసేదాన్ని. అది మన తెలుగువాళ్ళు ఎందుకు చెయ్యరో నాకు అర్ధమే కాదు. పోయినప్పుడనే కాదు, ఫలానావారి స్మృత్యార్ధం అని ఎస్.వీ.రంగారావు, నాగయ్య, సావిత్రి మొదలైన గొప్పనటులు నటించిన సినిమాలు, విఠలాచార్య, ఆదుర్తి సుబ్బారావు మొదలైన గొప్ప దర్శకులు తీసిన చిత్రాలు ఓ వారం రోజులపాటు వేయచ్చు కదా. లేకపోతే ఇప్పటి తరానికి పూర్వసినీవైభవం తెలిసేది ఎలా? కొన్ని ఛానల్స్ వాళ్లు ఏ.ఏన్.ఆర్ హిట్స్ అనీ, ఎన్.టీ.ఆర్ హిట్స్ అనీ వేస్తున్నట్లున్నారు. ఇప్పుడిక టివీ పెద్దగా చూడను కాబట్టి నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ లో ఏదైనా ఓ ఛానల్ వాళ్ళైనా బాపూరమణల సినిమాలు ఓ వారం రోజులు చక్కగా వేస్తే ఎంత బాగుంటుంది? కనీసం వారు తీసిన సినిమాలన్నీ సీడీల రూపంలోనో డివీడీల రూపంలోనో బయటకు వస్తే ఎంత బాగుంటుంది? ఆ మ్యూజిక్ స్టోర్స్లో అమ్మయికి బాపూగారి గొప్పతనం అర్ధమైతే ఎంత బాగుంటుంది?

"అంతులేని ఆవేదన ఎందుకే కడలీ" అని ఓ ప్రైవేట్ సాంగ్ ఉంది. అలాగ ఏదో రాయాలని తాపత్రయం తప్ప ఏం రాసి ఏం ప్రయోజనం? నేను రాస్తే ప్రభుత్వం అవార్డులిచ్చేయదు. పోయిన మనిషి తాలూకూ ఎడబాటుని బాపుగారు, ఆయన మనుషులు అనుభవించకా తప్పదు. ఏదో హృదయ ఘోష ఇలా అక్షరాలోకి మార్చి నే "తుత్తి"పడ్డం తప్ప...! వెళ్పోయినవాళ్ళు బానే ఉంటారు స్వర్గంలో. ఉన్నవాళ్ళకే బాధ. ఆ ఎడబాటులోని వ్యధ, లోటు మరెవరూ పూడ్చలేనివీ. బ్రతికి ఉన్నంతకాలం అనుభవించవలసినవీనూ.

ఆత్రేయగారి మాటల్లో అందంగా చెప్పాలంటే "పోయినోళ్ళందరూ మంచోళ్ళు...ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు"...అంతే కదా..

Monday, January 24, 2011

క్షమ


"क्रॊध कॆ बोझ को मन पे उठाये काहे चेल्ता है प्राणी
क्षमा जो शत्रु को भी कर दे, वहि मुक्त है...वहि ग्यानी"


bhootnath సినిమాలో జావేద్ అఖ్తర్ "समय का पैय्या चेलता है.." పాటలోని మొదటి రెండు వాక్యాలూ..ఇవి.

"మనసులో కోపమనే బరువును ఎందుకు మోస్తూంటాడు ప్రాణి
శత్రువును సైతం క్షమించినప్పుడే ముక్తి....అతడే జ్ఞాని.." -- అని అర్ధం !!

మొదటి రెండు వాక్యలూ అయ్యాకా bhootnath సినిమాలో "సమయ్ కా పైయ్యా చెల్తా హై" అనే పాట మొదలౌతుంది. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన పోయింట్ ఇది. శత్రువును సైతం క్షమించగలగటానికి ఎంతో ధీరత్వం ఉండాలి. ఉదాత్తత ఉండాలి. మనల్ని బాగా బాధపెట్టినవాళ్లనీ, సూటిపోటి మాటలతో మనసుని గాయపరచిన వాళ్ళనీ, తమ చేతలతో మనసుని ముక్కలు చేసిన వాళ్ళనీ మనం క్షమించగలమా? చాలా కష్టం..! కానీ ఈ పాటలోని వాక్యాలు విన్నాకా అనిపించింది...నిజమే, ఎందుకు మనం ఇతరులపై కోపాన్నీ, బాధనీ, దు:ఖాన్నీ మోసుకుంటూ బ్రతుకుతాం? వాళ్ల పాపానికి వాళ్ళని వదిలేసి మన మనసులని ఎందుకు తేలిక చేసుకోమూ...అని. లేకపోతే మనం కూడా అమితాబ్ పాత్ర మాదిరి చనిపోయాకా భూతంగా మారిపొతామేమో....ఈ లెఖ్ఖన ప్రపంచంలో ఎన్ని కోట్ల,బిలియన్ల భూతాలు తిరగాడుతూ ఉన్నాయో..అనిపించింది కూడా!!


(పై వాక్యాలు "భూత్ నాథ్" సినిమా చూశాకా నేను గతంలో రాసిన టపాలోనివి.)

***********************
జీవితంలో చాలా కష్టమైన పని, ప్రశాంతత నిచ్చేపని "క్షమించటమే" అని అనుభవపూర్వకంగా అర్ధమయ్యాకా ఈ వాక్యాలను మళ్ళీ రాయాలని అనిపించింది.

ఇంతకు మించి రాసేదేమీ లేదు.

రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల”


పెళ్ళి నాటికి ఇరవై సంవత్సరాలు నిండిన “కమల” విద్యావంతురాలు. తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించికున్న విజ్ఞానవంతురాలైన గృహిణి. అత్తవారింట్లో ఆదర్శ గృహిణిగా తాన్ను తను తీర్చిదిద్దుకోవాలని తహ తహలాడిన స్త్రీ. సమాజంలోనూ, వ్యక్తుల్లోనూ అభివృధ్ధిని కాంక్షించే అభ్యుదయవాది. పెళ్ళైన ఏడేళ్ళలో ముగ్గురు పిల్లల తల్లి అయి, వైవాహిక జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ దాదాపు గడపివేసిన అనుభవజ్ఞురాలు. రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల” నవలా నాయిక.

“చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు మూర్ఖంగా ప్రేమించినా, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గుడ్డిగా ఆరాధించినా ఫలితం ఒకటే – అశాంతి ! మనస్పర్థ !” అన్న నేపధ్యంతో 1966లో జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన నవల రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల”. నేను 1996లో కొనే సమయానికి ఆరు పున:ముద్రణలు పూర్తి చేసుకుంది.

మూర్తిని ప్రేమించి వివాహమాడిన కమల ఎన్నో కలలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దాలనీ, భర్తకు తన చేతులతో వండివడ్డించాలనీ ఆశ పడుతుంది. కానీ పద్ధతీ తీరూ లేని అత్తవారిల్లు, మర్యాదా మన్ననా తెలియని ఇంట్లో మనుషులు, చాలా సందర్భాల్లో మూర్ఖంగా ప్రవర్తించే అత్తగారు, ఇంట్లో ఏమి జరిగినా, కారణమెవరో తెలిసినా స్పందించని భర్త, కమలను ఎంతో నిరాశకు,ఆవేదనకూ గురిచేస్తారు. దుర్మార్గురాలు కాకపోయినా కోడలిపై అధికారం చెలాయించటం జన్మ హక్కుగా భావించే సగటు అత్తగారు శేషమ్మ. పనిపాటలు తెలిసి, ఇంటిని అందంగా తీర్చిదిద్దగల నేర్పు ఉన్న కమలపై తన అత్తగారి పెద్దరికాన్ని అన్నివిధాలుగా చెలాయిస్తుంది శేషమ్మ. ఆమె చేసే మూర్ఖపు పనులు అత్తాకోడళ్ళ మధ్య సర్వసాధారణమైన మనస్పర్ధలకు తావునిస్తాయి. తర్కానికీ, న్యాయానికీ చోటులేని నిర్ణయాలు చేయటం ఆ అత్తగారి హక్కు. వాటికి తప్పనిసరిగా తలవంచటం మాత్రమే ఆ కోడలు చాలా ఏళ్లపాటు చేయాల్సివచ్చిన అనివార్యకార్యం. కొన్నేళ్ళపాటు ఎదురులేని సంసారసార్వభౌమత్వం వహించాకా కొత్తగా కోడలు వచ్చి కొత్త సవరణలు చేయటం సహించలేకపోవటం అత్తగారనబడే పాత్రకున్న జన్మహక్క మరి.

ఇంటిని అందంగా తయారుచేయాలన్న కోరికను భర్త సలహాపై తమ గదిమటుకే పరిమితం చేసుకోక తప్పదు కమలకు. పొందికగా తయారైన తమ గదిని చూసి విస్మయం చెందుతాడు ఆమె భర్త. గది నచ్చినా, మెచ్చని సుగుణం సొంతమైన అత్తగారు మెల్లగా సణుక్కోవటం వినబడుతుంది ఆమెకు. గౌరవం పొందాల్సిన మామగారి ధోరణి చిరాకునూ, జుగుప్సనూ కలిగిస్తాయి కమలకు. సర్ది పెట్టిన తమ పక్క మీద మధ్యాహ్నాలు నిద్రపోవటం మొదలెట్టిన మామగారి అలవాటుని ఇంట్లో అందరితో ఒప్పించి మాన్పించి "ఎంతైనా గడుసుది" అన్న కొత్త బిరుదు పొందుతుంది కమల.

భార్యాభర్తలకు ఏకాంతానికీ, మురిపాలకూ అడ్డంపడుతూ తలదూరుస్తు ఉండే తల్లి మూర్తి దృష్టిలో అమాయకురాలు. అతని దృష్టిలో భార్య బుర్రకి ఆలోచనలెక్కువ. ఆడంబరాలకూ, సంబరాలకూ ఆర్భాటం చేయటం, కొడుకు సంపాదనను దుబారా చేయటం, అవసరం ఉన్నా లేకపోయినా బంధువులను ఆహ్వానించి అతిథిసత్కారాలు చేయటం, కొడుకుతో అప్పు చేయించైనా ఆదపాదడపా కూతురుకి ఆర్ధిక సహాయం అందించటం శేషమ్మకు అలవాటు. అందుకు భర్త చేసే సమర్థన భార్యాభర్తల ఘర్షణను పెంచటానికి తప్ప మరెందుకు ఉపయోగపడదు. బిడ్డ కష్టార్జితంతో వేడుక చేసుకు ఆనందించే ఆ తల్లిదండ్రుల అనురాగాన్ని ఏ కోణంలోంచీ సమర్ధించలేకపోతుంది కమల. అనుమతి లేకుండా తన ఉత్తరాలను చదివే ఆడపడుచును, తల్లి అండతో వచ్చినప్పుడల్లా ఇల్లు దోచుకుపోయే ఆమె తీరు కమలను ఆందోళపరుస్తాయి. 

పిల్లలు పుట్టాకా జరిగే సంఘటనలూ, పరిస్థితులు కమలను మరీ కలవరపెడతాయి. పిల్లలకు ఇష్టమైన పేరు పెట్టడానికి కూడా పేచీలు, మగపిల్లవాడికి చిన్నప్పుడే ఆడపిల్లను లోకువచేయటం నేర్పిస్తున్న అత్తమామల ప్రవర్తన ఆమెకు చాలా బాధను కలగజేస్తాయి. ఇంకా ఇంకా పెరుగుతున్న సమస్యలు, చికాకుల వల్ల భార్యాభర్తల మధ్యన పెరుగుతున్న దూరం ఎంతవరకూ వెళ్ళింది? వాళ్ళ కథ ఎలా ముగింపుకి వచ్చింది? అన్నది మిగిలిన కథ.  ఒక మామూలు మధ్యతరగతి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే చక్కని కథనంతో "చదువుకున్న కమల" ప్రతి చదువుకున్న అమ్మాయి ఆలోచనలను ప్రతిబింబింపచేస్తుంది.


ఈ నవల అరుణా పబ్లిషింగ్ హౌస్,విజయవాడ ద్వారా ప్రచురింపబడింది. (వారి ఫో.నం.0866-431181)


.... -----   ......   -----   .....    ------
 "వనితామాలిక"లో ప్రచురితం : ఇక్కడ చదవచ్చు..

Saturday, January 22, 2011

"యాహూ హోం పేజ్" లో తళుక్కుమన్న "Deol ladies"


పై ఫోటో లో ఉన్నది ప్రఖ్యాత హిందీ నటి హేమమాలిని, ఆమె కుమార్తెలు ఈషా, అహానా. "Namaste India" అనే Indo-American Association for Arts and Entertainment తాలూకూ లాంచ్ ప్రోగ్రాంలో నృత్యం చేస్తున్న ఫోటోలు ఇవి.

"యాహూ హోం పేజ్" లో "Deol ladies" పేరుతో కనబడ్డ ఈ ఫోటోలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. వెంఠనే కాపీ చేస్కున్నాను. 62ఏళ్ళ ఈ అందమైన నటికి నృత్యం పట్ల ఉన్న passion,dedication నాకు ఆమె పట్ల గౌరవాన్ని పెంచుతాయి. కుమార్తెల కన్నా ఈమే ఎక్కువ అందంగా ఉందే అనిపిస్తుంది. పెరిగే వయసుతో పోటీపడే సౌందర్యం ఆమెది.

చిన్నప్పుడూ టివీలో "నూపుర్" అని హేమమాలిని డైరెక్ట్ చేసిన సీరియల్ వచ్చేది. విడువకుండా చూసేవాళ్ళం. హేమమాలిని, కబీర్ బేడీ ముఖ్య పాత్రలు పోషించారు ఈ సీరియల్లో. ఎంతో ఇష్టంతో భరతనాట్యం నేర్చుకుని, నృత్యానికే జీవితం అంకితం చేయాలనుకునే మహిళ జీవిత కథ అది. గుల్జార్ రచించారు. కుమార్తెలతో పాటూ ఉన్న పై ఫోటోలను పొద్దున్నే యాహూ లో చూడగానే ముచ్చట వేసి ఈ టపా రాయాలనిపించింది. ఆమె తన కుమార్తెలు కూడా ఆ కళను నేర్పటం భరతనాట్యం పట్ల ఆమెకు ఉన్న ప్రేమను, అంకితభావాన్ని తెలుపుతాయి. ఆమె సంకల్పమే కాక వారు కళను నేర్చుకోవటం, అది వారికి అబ్బటం కూడా అదృష్టమే.



Wednesday, January 19, 2011

వెన్నెల్లో వాకింగ్...


భోజనమయ్యాకా పది నిమిషాలు వాకింగ్ చేద్దామని బయటకు వచ్చా...లైట్ వెయ్యకుండానే సందంతా పరుచుకున్న తెల్లని వెన్నెల రారమ్మని పిలిచింది. చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకుని నడవటం మొదలెట్టాను. మెట్ల మీద కూడా వెన్నెలే. చిన్నప్పుడు నేర్చుకున్న లలితగీతం ఒకటి గుర్తుకొచ్చింది. అందులో "వెన్నెలలో వెండి మెట్ల దారురలో రావా...ఈ పుల బాటసారి మదిని వసంతమై పోవా.." అనే వాక్యం గుర్తుకొచ్చింది ఈ మెట్ల మీద పరుచుకున్న వెన్నెలను చూడగానే. ఇలాంటి వెన్నెల నిండిన మెట్లను చూసే రాసి ఉంటారు రచయిత అనుకున్నా. చలి తగ్గిపోయింది అప్పుడే. స్వెట్టర్ అవసరం అనిపించలేదు.


ఎఫ్.ఎమ్ ఛానల్స్ తిప్పుతూ నడుస్తున్నా. "వయ్యారి గోదారమ్మా..." మొదలైంది.. బాలు నవ్వుతో. ఆహా...అనుకున్నా.
"వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం?
కడలి ఒడిలో కలిసిపొతే కల వరం ! "
వేటూరిగారి మాట విరుపులో కూడా విరహమే.


"నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగా
మువ్వగోపాలుని రాధిక
ఆకాశవీణ గీతాలలోనా
ఆలాపనై నే కరిగిపొనా..."
వేటూరి గారి కలం లోంచి ఒలికిన ఆణిముత్యాల్లో ఇదీ ఒకటి. ఏం సాహిత్యం రాసారో కదా అనుకున్నా. కొన్ని పాటలు అదివరకు చాలా సార్లు విన్నవే అయినా , చాలారోజుల తరువాత మరోసారి విన్నప్పుడు కొత్తగా అనిపిస్తాయి. పాట అయిపోయింది. వెంఠనే మరొ వేటూరి గీతం మొదలైంది. ఇది ఇంకా బాగుంటుంది..


సా...నిసరి సా..నీ....మొదలైంది. "అన్వేషణ"లో "కీరవాణి " పాట..


"ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా.."


...నీ కన్నూలా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై.."
ఏం రాసారు...తిరుగుందా ఈ సాహిత్యానికి? కొత్త సినిమాల్లో ఇలాంటి పాటలేవీ? ఈ సాహిత్యం ఒక ఎత్తైతే, వీటికి ఇళయరాజా సంగీతం మరో ఎత్తు. రెండు పాటలకీ అద్భుతమైన సంగీతాన్ని అందించి ఇన్నాళ్ళ తరువాత కూడా వింటూంటే మైమరచిపోయేలా చేయటం ఆయనకే సొంతం. అప్పటి గోల్డెన్ ఇరా లో ఆయన అందించిన బాణీలన్నీ ఇలాంటివే. అతి చెత్త మూడ్ లో ఉన్నా కూడా స్టార్టింగ్ హమ్మింగో, ట్యూనో వినగానే అప్రయత్నంగా గొంతు కలిపేస్తాం పల్లవితో..! అలాంటి ట్యూన్స్ ఇళయరాజావి.


ఆలోచనలు నడుస్తూండగానే మరో రెండు పాటలు అయిపోయాయి. పది నిమిషాలనుకున్న నడక కాస్తా అరగంట దాటింది. ఇక ఈపూటకు చాల్లెమ్మని ఇంట్లోకి వచ్చేసా. వస్తూనే నా వెన్నెల్లో వాకింగ్ నీ, ఆలోచనల్ని ఇలా టపాయించేసా...

Wednesday, January 12, 2011

గాలిపటాలు



ఊరినిండా అడుగడుగునా అమ్మకానికి పెట్టిన గాలిపటాలను చూస్తూంటే "స్నేహం" సినిమాలోని "ఎగరేసిన గాలిపటాలు"పాట గుర్తుకు వచ్చింది.ఆ పాటలోని కొన్ని వాక్యాలు...

"ఎగరేసిన గాలిపటాలు...
దసరాలో పువ్వుల బాణం..
దీపావళి బాణా సంచా..
నులివెచ్చని భోగిమంటా..

చిన్ననాటి ఆనవాళ్ళు
స్నేహంలో మైలురాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు
చిగురించిన మందారాలు...."

పి.బి.శ్రీనివాస్ పాడిన ఈ పాట ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలని తట్టిలేపుతుంది. నాకు గాలిపటాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఇంటిపక్కన ఉండే మా కన్నా పెద్ద పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూంటే అదేదో 8th wonder లాగ చూసేవాళ్ళం. అసలు నలుపలకలుగా ఉన్న ఆ కాగితం అలా గాల్లో అంత ఎత్తుకి ఎలా వెళ్తుంది అని ఆశ్చర్యం కలిగేది. ఎగరేస్తు దూరంగా ఉన్న గాలిపటాలతో పోటీ పడటం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు గాలిపటాలను ఇంకా ఇంకా ఎత్తుకు ఎగరేసుకోవటాలు, పడగొట్టడాలూ భలేగా ఉండేది. మధ్య మధ్య ఆ పిల్లలు దారం పట్టుకొమ్మని చెప్పి ఏదో పని మీద వెళ్ళివచ్చేవారు. మహాప్రసాదం లాగ ఆ దారన్ని అతి జాగ్రత్తగా పట్టుకుని, ఆ గాలిపటం దగ్గర్లో ఎగిరే మరే గాలిపటానికీ చిక్కకుండా వెళ్ళినవాళ్ళు వచ్చేదాకా కాసేపన్నా గాలిపటాన్ని ఎగరవేయటం గొప్ప థ్రిల్ గా ఉండేది. అలా కాసేపు గాలిపటాన్ని పట్టుకోవటం కోసం పెద్దపిల్లలందరూ గాలిపటం ఎగరేస్తున్నంత సేపూ అక్కడే నిలబడి చూస్తూ ఉండేవాళ్ళం..ఓ సారివ్వవా? అని అడుగుతూ...అదో మధురమైన జ్ఞాపకం.

గాలిపటం ఎగరేయటం నేర్పమంటే, "చిన్నపిల్లలు మీకు రాదు" అనేసేవారు వాళ్ళు. ఉక్రోషం వచ్చి నేనూ,మా తమ్ముడూ కలిసి గాలిపటం కొనుక్కొచ్చి మేడ మీదకి వెళ్ళి, ఒకళ్ళం దారాన్ని పట్టుకుంటే ఒకళ్ళం గాలిపటం పట్టుకుని దూరంగా పరిగెత్తుకువెళ్ళి దాన్ని ఎగరేయటానికి ప్రయత్నించేవాళ్ళం. కాస్త ఎగిరేది. క్రింద పడిపోయేది. కొన్ని కాస్త దూరం ఎగిరి ఏ చెట్టు కొమ్మకో చిక్కుకుని చిరిగిపోయేవి. అలా గాలిపటాన్ని ఎగరేయాలన్న కోరిక కోరికలాగే ఉండిపోయింది. అన్నయ్యకూ ,తమ్ముడికీ కూడా రాదు ఇప్పటికీ. పెళ్ళయ్యాకా మావారు, మా మరిది ఇద్దరూ గాలిపటాలు ఎగురవేయటంలో ఎక్స్పర్టులు అని తెలిసి చాలా సంతోషించాను. ఇంట్లో పాత సామానుల్లో గాలిపటాల దారాలు అవీ చూసి సంబరపడిపోయేదాన్ని. కానీ కొన్ని కారణాలవల్ల చాలా ఏళ్ళు గాలిపటాలు ఎగరేయటం మాకు కుదరనే లేదు. క్రితం ఏడు మా పాప వీధుల్లో అమ్ముతున్న గాలిపటాలను చూసి కావాలని మారాం చేసింది. కొనిపెట్టాం. వాళ్ళిద్దరూ మేడ మీదకు వెళ్ళి ఎగరేసుకుని వచ్చారు. కానీ ఏవో పనుల్లో ఉండి నాకు వెళ్ళి చూడటం కుదరనేలేదు. పనయ్యి నేను పైకి వెళ్దామని బయల్దేరేలోపూ వాళ్ళు క్రిందకు వచ్చేసారు.

ఈసారి మళ్ళీ పాప గాలిపటాలు కొనమని గొడవచేస్తూంటే ఈ చిన్నప్పటి ఊసులన్నీ గుర్తుకొచ్చాయి. ఈసారి ఏమైనాసరే గాలిపటాన్ని స్వయంగా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. మరి ఏమౌతుందో చూడాలి..
ప్రతి ఏడూ గుజరాత్ లో ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈసారి కూడా 21st ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ ఈ నెల తొమ్మిది నుండీ ఇవాళ్టివరకూ జరిగింది. గుజరాత్ అంతా టూరిస్ట్ లతో మహా సందడిగా ఉంటుంది ఈ సమయంలో. ఒక కైట్స్ ఫెస్టివల్ తాలూకూ క్లిప్పింగ్ చూడండి...రకరకాల గాలిపటాలు భలే అందంగా ఉన్నాయి ఈ వీడియోలో.



2010 లో జరిగిన 20th kites festival తాలూకూ వీడియో లింక్:
http://www.youtube.com/watch?v=6eWny8zBa8s&feature=fvw.


Tuesday, January 11, 2011

తనికెళ్ళ భరణి గారి "నక్షత్ర దర్శనమ్"


"నాకూ వీళ్ళంటే ఇష్టం...
నాకంటే వీళ్ళంటే మీకు కూడా ఇష్టమే....!
నా ఇష్టాన్ని ఇలా వ్యాసాలుగానూ...
కవితలుగానూ రాసుకున్నాను !
....వెల్లకిలా పడుకుని వినీలాకాశంకేసి చూస్తే వేల నక్షత్రాలు
కనిపిస్తున్నా గుప్పెడు కోసి...గుండెలకద్దుకుంటున్నా !"

అంటారు తనికెళ్ళ భరణిగారు ఈ పుస్తకంలో తన మాటగా. సినీ, సంగీత, సాహిత్య ప్రపంచాల్లో తళుక్కుమన్న కొందరు మహోన్నత వ్యక్తుల గురించిన భరణిగారి అభిప్రాయాలసారమే ఈ "నక్షత్ర దర్శనమ్". భరణిగారి రచనలకు ప్రత్యేక పరిచయాలవసరం లేదు. పుస్తకంలోని నాలుగు వాక్యాలు చదివితే చాలు. పుస్తకం మొత్తం చదివేదాకా వదలం. అంత మంచి భాష, భావమూ ఆయనది. ఈ పుస్తకంలోని కొందరు వ్యక్తుల గురించిన రాసిన వ్యాసాలు, కవితల్లోంచి కొన్ని వాక్యాలు చూడండి మీకే తెలుస్తుంది.

జేసుదాసు:
శంఖంలాంటి ఆయన గొంతు పూరించిన
ఓంకారం వింటూ
పరమశివుడే పరవశుడై ధ్యానం చేసుకుంటాడు
భగవద్గీత సారాన్ని
నరుడికీ నారాయణుడికీ
ఈయనే స్వయంగా భోదిస్తున్నట్లుంటుంది
చెంబై వైద్యనాథ్ భాగవతార్
ఆశీర్వాద బలం....భారతదేశం చేసుకున్న పుణ్యఫలం
ఆయన గళం !


బాలమురళి:
ద్వాపర యుగంలో
గొపికల్తో సరసాలాడ్తూ
బృందావనంలో
నల్లనయ్య మర్చిపోయిన
పిల్లనగ్రోవి బాలమురళి


ఆయన గానం
ఉషోదయాన వెలిగే
ముద్ద కర్పూరం
ఆయన తిల్లాన
అర్ధరాత్రి వేసే
అగరు ధూపం.


కృష్ణశాస్త్రి:
ఆయన రాసిన "జయజయజయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి " గురించి----
ఆ పాట భారతమాత పాదాలకి పూస్తే పారాణి అవుతుంది !
అరచేతులకు రాస్తే గోరింటాకులా పండుతుంది !
మెడకు పూస్తే మంచి గంధమౌతుంది !
కురులకి రాస్తే సంపెంగ నూనె అవుతుంది !
పెదాల అరుణిమతో కలసి తాంబూలమౌతుంది !!
జన్మనిచ్చిన భరతమాత ఋణం తీర్చుకున్నాడు కృష్ణ శాస్త్రి ఈ పాటతోటీ!


గురుదత్:
కన్నీరు పన్నీరు కలలతో కలిపి వెండితెర మీద బంగారు బొమ్మలు గీసిన "రవివర్మ" గురుదత్.
గురుదత్ వాడినవి రెండే రంగులు. నలుపు.. తెలుపు...!
నలుపుతో నవరసాలనీ ఆవిష్కరించాడు. తెలుపుతో ఆత్మానందాన్ని ప్రతిబింబింపజేసాడు.
ఘనీభవించిన శోకాన్ని పలకలు చేసి...సినీ యమునానదీ తీరాన నల్లని తాజ్మహల్ కట్టుకున్న విషాద షాజహాన్ - గురుదత్!


రేఖ:
ఆమె చూపు మార్మికంగా
నవ్వు నర్మగర్భంగానూ
మాట తాత్వికంగానూ
మనిషి సామన్యంగానూ ఉంటుంది
ఆమెని యావత్ భూగోళం ప్రేమించింది !


హరిప్రసాద్ చౌరాస్యా:
ఆయన వెదురు మీద
పెదవి ఆన్చి ఊదితే చాలు
అందులోంచి విచిత్రంగా
ఆకుపచ్చని సీతాకోకచిలుకలూ
పసుప్పచ్చని పావురాలూ
ఇంద్రధనుస్సులూ
చంద్రోదయాలూ..!!


బ్రహ్మానందం:
అరగుండు నుంచీ
సంపూర్ణంగా ఎదిగిన నటుడు
ఎక్కడ చిక్కాలో
ఎక్కడ చెక్కాలో...
ఎక్కడ మొక్కాలో..
ఎక్కడ నొక్కాలో తెలిసిన జ్ఞాని !


జాకీర్ హుస్సేన్:
నక్షత్రాల్ని దోసిట్లో పట్టి
తాజ్మహల్ మీద
ధారగా పోస్తున్నట్టూ
కాశ్మీర్ లోయల్లో
ఊయలలూగుతున్నట్టూ...


ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి:
ఆమె భజగోవింద శ్లోకాలు
ఆదిశంకరుల మెళ్ళో రుద్రాక్షమాలలు
ఆమె విష్ణు సహస్రం
ఏడుకొండలవాడికి క్షీరాభిషేకం
ఆమె మీరా భజన్లు
గిరిధర గోపాలుడికి వెన్నముద్దలు...

*** *** ***

ఇవన్నీ కొన్ని మీగడ తరకలు. అంతే. ఇంకా

ఎన్.టీ.ఆర్
ఏ.ఎన్.ఆర్
ఎస్వీఆర్
రేలంగి
రమణారెడ్డి
సావిత్రి
భానుమతి
శ్రీశ్రీ
చలం
జంధ్యాల
వేటూరి
ఆరుద్ర
సినారే
సుశీల
ఘంటశాల
బాలు
చిరంజీవి....
ఇంకా ఎందరో....!
వీరిని గురించి రాసిన మొత్తం కవితో, వ్యాసమో చదివితీరాల్సిందే. ఎన్నని కోట్ చెయ్యను..?!
వంద పేజీల ఈ పుస్తకం వెల వంద రూపాయిలు.
దొరికేది "నవోదయా"లోనూ... "విశాలాంధ్ర"లోనూ.
ఉండాల్సింది మన పుస్తకాల గూట్లో.

*** *** *** ***

(తెలియనివారి కోసం)
అదివరకూ నేను కొన్ని టపాల్లో రాసిన తనికెళ్ళ భరణిగారి రచనల లింక్స్:

నాలోన శివుడు కలడు

ఆటగదరా శివా !!

పరికిణీ

july10th/2010 hindu న్యూస్ పేపర్ లో వచ్చిన భరణిగారి
interview లింక్:

Saturday, January 8, 2011

వ్యాపారమైన ఆటకు కురుస్తున్న కోట్లు !!





"బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ...ఆడి చూడు క్రికెట్టు టెండుల్కర్ అయ్యేటట్టు.." అని పదకొండేళ్ళ క్రితం సిరివెన్నెలగారు రాసారు ఓ పాటలో. అప్పుడేమనుకుని రాసారో కానీ ఇప్పుడు నిజంగా అలాగే పాడాలనిపిస్తోంది కురుస్తున్న కాసులవర్షాన్ని చూస్తూంటే. ఇవాళ సెట్ మాక్స్ ఛానల్ లో వచ్చిన IPL,2011 auction చూస్తే పదిటీముల్లోనూ స్థానం సంపాదించుకున్న ప్రతి అంతర్జాతీయ ఆటగాడూ గత జన్మలో అంతో ఇంతో పుణ్యం చేసుకుని ఉంటారు ఇవాళీ రోజున కోట్లు సంపాదించుకుంటున్నారు... అనిపించకమానదు. మన దేశంలో ఎవరు ప్రవేశపెట్టారో గానీ పల్లెటూరిలో పిల్లలను సైతం చైతన్యవంతులను చెయ్యగల శక్తి, క్రేజ్ ఈ ఆటకు ఉంది. ఇది మన జాతీయక్రీడ కాకపోయినా పసిపిల్లలు సైతం "ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్,స్లీప్ క్రికెట్" అంటారు. శెలవు రోజుల్లో బేట్ బాల్ పట్టుకున్న పిల్లలు కనిపించని వీధులను వేళ్లతో లెఖ్ఖపెట్టచ్చు మన దేశంలో. ఆ ఒక్క విషయంలోనూ యావత్ దేశం సమైక్యంగా ఉంటుంది.ఇక నాలుగేళ్లక్రితం వరకూ ఏ దేశం ఆటగాళ్ళు ఆ దేశంలోనే. ఎవరి ఆట వాళ్ళదే. టోర్నమెంట్లు వస్తేనే కలిసేవి ఈ ఆటాడే దేశాలన్నీ. కానీ సరదాకు ఆడే ఆటలను కూడా వ్యాపారం చెయ్యగల మేధస్సు మానవుడిది.


ఈ ఆటతో ఇప్పటికే చాలా మంది చాలానే గడించారు. అయినా దాహం తీరలేదు. మానవుడి మేధస్సుకి అందని ఆలోచన లేదు కాబట్టి నాలుగేళ్ల క్రితం ఒక బుర్రలో ఈ ఆలోచన తళుక్కుమంది. అంతే..బిగ్ గేమ్ విత్ బిగ్ మనీ, బిగ్గర్ ఎంటర్టైన్మెంట్, బిగ్గెస్ట్ బిజినెస్ అయిపోయింది క్రికెట్. వేలు కాదు, లక్షలు కాదు కోట్లతో వ్యాపారం. వివిధ దేశాల ఆటగాళ్లకు నోట్లకట్టలు చూపెట్టారు. డబ్బుకు లోకం దాసోహం అయ్యింది. ఒక ఆటగాని కోసం ఇవాళ టివీలో కోట్లు గుమ్మరిస్తున్న వేలంపాట చూసి నేనైతే "ఔరా" అనేసాను. వేలంపాట ఎంత రక్తిగా సాగిందంటే...మాటల్లో చెప్పలేను. టీం మెంబర్స్ సెలక్ట్ అయ్యేదాకా టీవీ ఛానల్స్, న్యూస్ రిపోర్టర్లు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్లు ఉత్కంఠతతో ఊపిరిబిగపట్టారు. గుండ్రని టేబుళ్ల చూట్టూ కూర్చున్న వ్యక్తులు ఈ వేలంపాటలో కోట్లతో చేసిన వ్యాపారాన్ని చూస్తే కళ్ళు తిరిగాయి.  $2.4million, $ 2.1million, $ 1.9million, $1.8million...ఇలా సాగాయి ఫైనల్ రేట్లు..!!

ఎందుకొచ్చిన చదువులు? ఉద్యోగాలూ? అనిపించింది. IPL లో పాల్గొనే టీమ్స్ తెచ్చుకున్న మొత్తం సొమ్ము, ఖర్చు పెట్టిన సొమ్ము, వాళ్ళ వద్ద మిగిలిన సొమ్ము తాలూకూ లెఖ్ఖలు కార్యక్రమం చివరలో స్క్రీన్ పై వేసారు. base price, sold price మధ్యలో వేలంపాటు పెరుగుదల నాకు "సంత"ను గుర్తుచేసాయి. కాకపోతే ఇది రాయల్ సంత, మోడ్రన్ సంత. అంతే తేడా. ఏ సంత అయితేనేం.. కోట్లెవరికి చేదు? క్రితం ఏడాది జరిగిన IPL రచ్చ తెలియందెవరికి? అప్పుడే మళ్ళీ బరి సిధ్ధమైపోయింది. అయినా నా పిచ్చిగానీ డబ్బుతో కొట్టుకుపోయే అపకీర్తి పరువును పోగొడితే మాత్రం పట్టించుకునేదెవరు? జనం ఎంత వెర్రివాళ్ళు కాకపోతే జనాల సెంటిమెంట్లతో ఇలా కొన్ని కోట్ల మిలియన్లడాలర్ల వ్యాపారం చెయ్యగలుగుతారు వీళ్ళు అనిపించింది.


నేనూ ఒకప్పుడు విపరీతంగా క్రికెట్ చూసేదాన్ని. మా తమ్ముడు అంటించిన పిచ్చి అది. కాలేజీ రోజుల్లోని క్రేజీ హాబీల్లో ఒకటి. కానీ ఇప్పుడు మాత్రం చూడాలని అనిపించదు. ఒకసారి నాలుగైదు టోర్నమెంట్స్ వరుసగా ఓడిపోయారు మనవాళ్ళు, అప్పుడూ విపరీతంగా బాధపడిపోయాను. మనం రోజంతా పనులు మానుకుని, టివీకి కళ్ళప్పగించి చూస్తే వాళ్ళు ఓడిపోయి మనల్ని ఇంకా నిరాశపరచటం. మనమేమో ప్రపంచాన్ని కోల్పోయినట్లు రెండ్రోజులు దిగాలుపడిపోవటం. ఆడినవాళ్ళు, ఓడినవాళ్ళు బానే ఉంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. జనాలు ఎత్తినప్పుడు గంతులేస్తారు. జనాలు తిట్టినప్పుడు చెవులు మూసుకుంటారు. ఓడినా గెలిచినా సంపాదన ఉంటుండి వాళ్లకి. మరి మనకీ? మాచ్ చూసిన టైమ్ వేస్టు, మనసుని దిగాలుపరుచుకుని మూడ్ పాడుచేసుకోవటం వల్ల ఓడిపోయారని బాధ, కోపం, ఉక్రోషం వల్ల మన ఎనర్జీ వేస్ట్. ఆ సమయంలో ఓ మంచి పుస్తకం చదువుకుంటే, ఓ మంచి పాటలు వింటే, ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అప్పటినుంచీ ఇక క్రికెట్ చూడటం మానేసా. చూసినా లాస్ట్ ఓవర్ టైంకి టీవీ పెడితే ఫైనల్ రిజల్ట్ తెలిసిపోతుంది.


చూట్టూ చూస్తే వందకి తొంభై మంది ఆటపై ఇష్టం ఉన్నవాళ్ళే. మన దేశం ఆడకపోయినా, ఏ దేశం ఆడుతున్నా "క్రికెట్ క్రికెట్ కోసం చూడాలంటూ.." చూసేస్తాడు మా తమ్ముడు. ఇక మా ఇంట్లో అత్తగారి దగ్గర నుంచీ పనమ్మాయి దాకా అందరు ఈ ఆట చూసేవాళ్ళే. వయసుతోనూ, ఆటకు సంబంధించిన కనీస పరిజ్ఞానం పనిలేకూండా క్రికెట్ చూసేవాళ్ళు లక్షల్లోనే ఉన్నరు మన దేశంలో. "ఏమిటీ క్రికెట్ చూడవా?" అని నన్నొక వింత గ్రహాంతరవాసినో, వెర్రిబాగుల్దాన్నో చూసినట్టు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే నా నిర్ణయం నాదే. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటే నాకేంటి? అంటాను నేను. ఓ పాట వింటేనో, పుస్తకం చదివితేనో, మంచి సినిమా చూస్తేనో కలిగే ఉల్లాసం, ఉత్సాహం నాకు ఆ ఆట చూస్తే రాదు మరి. "పుర్రెకో బుద్ధి..." అన్నారు అందుకే మరి.




IPL,2011 auction చరిత్ర, కబుర్లు, వివరాలు కావాలంటే ఈ లింక్ కు వెళ్లండి:
http://en.wikipedia.org/wiki/2011_Indian_Premier_League

----------------------------------------------
Note: ఈ టపాలోనివి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. క్రికెట్ ప్రేమికులని కించపరచటానికి ఎంతమాత్రం కాదని మనవి.

Thursday, January 6, 2011

తోటయ్య


పని మీద బయటకు వెళ్ళివస్తున్న నాకు మా సందు మొదట్లో సైకిల్ మీద భుజానికి కొబ్బరితాడుతోనో దేనితోనో తయారుచేసిన గుండ్రని బంధాలు రెండు తగిలించుకుని, నడుంకి కత్తి కట్టుకుని వెళ్తున్న ఒక వ్యక్తిని చూడగానే "తోటయ్య" గుర్తుకొచ్చాడు. కాకపోతే సైకిల్ అబ్బాయి సైకిల్కు కుండ కూడా వేళ్ళాడుతోంది. కాబట్టి ఇతను తాడిచెట్టో, ఈతచెట్టో ఎక్కి కల్లు తీసే మనిషై ఉంటాడు. మా తోటయ్య మత్రం కొబ్బరికాయలు తీసిపెట్టేవాడు. ఆ అవతారాన్ని పరికరాల్నీ చూడగానే నాకు "తోటయ్య" గుర్తుకొచ్చాడు. జీవితంలో అనుబంధం లేకపోయినా ఏళ్లతరబడి చూసిన కొందరు వ్యక్తులు అలా గుర్తుండిపోతారు.


కాకినాడలో మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను తరచూ చూస్తూండేదాన్ని తోటయ్యని. సన్నగా నల్లగా తలపాగాతో, పాతబడి నలిగి మాసిన తెల్ల పంచెతో ఓ పాత డొక్కు సైకిల్ మీద వస్తూండేవాడు. మేం వెళ్పోయే ముందు రోజు మా నాన్నమ్మ అతనికి కబురు పంపేది. "పాపగారూ, ఎప్పుడు వచ్చారు?" అని పలకరించేవాడు. అతను నవ్వగానే గారపట్టి అక్కడక్కడ ఊడిన పలువరస కనబడేది. కాస్త దగ్గరగా వెళ్తే చుట్ట కంపు కొట్టేది. మా దొడ్లో మూడు కొబ్బరు చెట్లు ఉండేవి. ఆ ఇల్లు అమ్మేదాకా మేం బయట కొబ్బరికాయలు కొని ఎరుగం. ఆ తరువాత చాలా రోజులు బయట కొట్లో కొబ్బరికాయ కొనటానికి మనసొప్పేది కాదు. ప్రతిసారీ మా సామానుతో పాటూ కొబ్బరికాయలతో నిండిన పెద్ద సంచీ కూడా మాతో ప్రయాణం చేసేది సర్కార్ ఎక్స్ ప్రెస్ లో.


ఇంతకీ తోటయ్య సందులోంచి దొడ్లోకి వస్తూనే వేషం వేసేసుకునేవాడు. చొక్కా తీసేసి, పంచె కాళ్లకూ, నడుంకీ బంధాలు తగిలించుకుని(కొబ్బరిపీచుతోనో దేనితోనో చేస్తారేమో మరి..వాటిని బంధాలని అనేవారు) చెట్టు ఎక్కటం మొదలెట్టేవాడు. పైన ఫోటోలో మనిషి కాళ్ళకి వేసుకున్నలాంటిదే ఇంకా మందంగా ఉన్నవి భుజాన తెచ్చుకుని, ఒకటి నడుముకీ, ఒకటి కాళ్ళకీ వేసుకుని కొబ్బరిచెట్టేక్కేవాడు మా తోటయ్య. స్పైడర్ మేన్ లాగ చెక చెకా చెట్లు ఎక్కుతున్న అతన్ని వింతగా చూసేవాళ్లం ఎక్కిన ప్రతిసారీ. "లోపలికి వెళ్లండి కాయలు మీద పడతాయి" అని నాన్నమ్మ కసురుతూంటే దొడ్డిగుమ్మం కటకటాలు దగ్గర నిలబడి చూస్తూండేవాళ్లం. పడిపోకుండా అలా ఎలా ఎక్కుతాడు? అని భలే ఆశ్చర్యం వేసేది. "ఇలా ఎక్కటం ఎక్కడ నేర్చుకున్నావు తోటయ్యా?" అని అడిగితే "భలేవారే పాపగారు" అని నవ్వేసేవాడు. మేం పెద్దయ్యాకా కూడా వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయలు దింపేవాడు తోటయ్య. పెద్దరికం మీదపడిన ఆనవాళ్ళు, ముడతలు బడిన చర్మం, మరింత సన్నబడిన శరీరం...ఎలా ఉన్నా ఎప్పుడూ అదే స్పీడ్, మార్పు లేని ఆ ఎక్కే పద్ధతి నన్ను అబ్బురపరిచేవి.


ఎన్ని మార్లు కాయలు ఉంటాయి? పనేం లేదు.వెళ్పో...అస్తమానూ వచ్చేస్తున్నాడు డబ్బులు వస్తాయి కదా అని ఒకోసారి నాన్నమ్మ విసుక్కునేది. అయినా వెళ్పోకుండా డొక్కలేమన్నా కొట్టాలేమో చూడండి...అనేవాడు. ఎండిన మట్టలు అవీ కొట్టించి, దొడ్లో ఇంకేమన్నా పని ఉంటే చేయించుకుని పాత చొక్కాలూ,పాంట్లూ, నాలుగు డబ్బులిచ్చి పంపేసేది నాన్నమ్మ. పోనీలే పాపం అని నేను తృప్తి పడేదాన్ని. ఖాళీ చేతులతో అతన్ని పంపటం నాకేకాదు నాన్నమ్మకీ నచ్చేది కాదు. వేసంకాలం శెలవుల్లో అయితే బొండాలు దింపి పెట్టేవాడు. చివర చివరలో చూపు సరిగ్గా ఆనేది కాదు. అయినా వచ్చేవాడు. కాయలు కోసేవాడు. అప్పటికే పెద్దవాడు.. తోటయ్య ఇప్పుడు ఈ భూమి మీద లేడేమో కూడా...! రోడ్డుపై ఇలా భుజాన బంధాలు తగిలించుకుని, నడుంకి కత్తి కట్టుకుని వెళ్ళే ఎవర్ని చూసినా తోటయ్యే గుర్తుకొస్తాడు...ఇవాళ్టిలాగే.


ఇలా కాకినాడతో అనుబంధం గుర్తుచేసే వ్యక్తుల గుర్తించి చెప్పాలంటే ఎందరో ఉన్నారు. సామర్లకోట నుంచి ప్రతి నెలా పప్పునూనె తెచ్చిపెట్టే అబ్బాయి, రోజూ సైకిల్ బండి మీద కూరలు తెచ్చి రోజూ దెబ్బలాడుతూనే కూరలు ఇచ్చివెళ్ళే కూరలబ్బాయి, ఆ ఇల్లు కొన్నప్పటినుంచీ, మేం పుట్టి పెరిగి పెళ్ళిళ్ళయి, మళ్ళీ ఆ ఇల్లు అమ్మేదాకా మా ఇంట్లో పని చేసిన పనమ్మాయి లక్ష్మి, ఏ కరంట్ రిపేరు పనులొచ్చినా వచ్చే ఆస్థాన కరంటబ్బాయి...ఎందరో..!!


ఈ క్రింద వీడియోలో కొబ్బరిచెట్టేక్కుతున్న మనిషిని చూడండి.

"ఎగిరిపోతే ఎంత బావుంటుందీ..." పాట మాతృక

మన పాత తెలుగు సినిమా పాటల్లో మారువేషాలు ధరించిన పాశ్చాత్య బాణీలు ఎన్నో ఉన్నాయి...అయితే అలనాటి తెలుగు సినీసంగీత దర్శకులు ఒరిజినల్ ట్యూన్స్ తయారు చెయ్యటం లో సిద్ధహస్తులు కాబట్టి ఈ పాశ్చాత్య బాణీల నుంచి తగినంతవరకే ఇన్స్పిరేషన్ పొందేవారు. కొద్ది ఉదాహరణలు చూడండి :


ప్రేమించి చూడులో "అది ఒక ఇదిలే" పాట "Bésame Mucho" అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది.

ఇద్దరు మిత్రులు లో "హలో హలో ఓ అమ్మాయి" పాట "Ya Mustafa", అనే famous Egyptian song నుంచి,

చిట్టి చెల్లెలు లో "ఈ రేయి తీయనిది" పాట "love is blue" song music నుంచీ,

ఆత్మీయులు సినిమాలో "మదిలో వీణలు మ్రోగే" పాట ముందరి ఆలాపన Cliff richards పాడిన "ever green trees" -నుంచి ఇన్స్పైర్ అయ్యింది.

ఇలా పాశ్చాత్య బాణీల నుంచే కాక కొన్ని హిందీ పాటల నుంచి తెలుగుకు, తెలుగు పాటల నుంచీ హిందీ పాటలకూ కూడా ఎగుమతి అయిన బాణీలు ఉన్నాయి. పాత పాటలు వింటూంటే మరెన్నో పాటలు గుర్తుకు వస్తూంటాయి. అలానే ఈ మధ్యన ఒక కొత్త తెలుగు పాటకు మాతృక కనుక్కున్నా నేను. క్లారినేట్ మీద వాయించిన సిని గీతాల కేసెట్ వింటూంటే ఈ పాట వచ్చింది. ఇదేదో తెలుసున్న పాటలా ఉందే అని మళ్ళీ వెనక్కి తిప్పి వినే సరికీ అసలు పాట గుర్తువచ్చింది. అదేమిటంతే "వేదం" చిత్రానికి కీరవాణి గారు స్వరపరిచిన "ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..". ఈ పాట పల్లవి మటుక్కే ఇన్పైర్ అయ్యింది. మీరూ ఓ సారి వినేయండి ఇక్కడ:http://ww.smashits.com/music/artists/play/songs/9769/t-g-m-parvez-mehdi-toot-jaye-na-bharam/80755/RESHMI-SALWAR-KURTA-JALI-KA-INSTRUMENTAL.html

ఈ పాట "రేష్మీ సల్వార్ కుర్తా జాలీ కా.." అని "నయా దౌర్" సినిమా లోది. ఇక్కడ ఉన్న లింక్ ఆ పాటకు క్లారినేట్ మీద "మాష్టర్ ఇబ్రహిం" వాయించారు. ఈ పాట పల్లవి వినగానే మీకు "ఎగిరిపోతే.." పాట గురువచ్చేస్తుంది.

Wednesday, January 5, 2011

మణిరత్నం మొదటి చిత్రం


"పల్లవి అనుపల్లవి"...మణిరత్నం మొదటి చిత్రం. నాకిష్టమైన దర్శకుల్లో ఒకరు. ఈ దర్శకుడి చిత్రాలన్నీ దాదాపు చూసేసాను. ఒక్క "రావణుడ్నే" భయపడి చూడలేదు. చూడాలనిపించలేదు. ఎప్పుడో టివీలో చూసిన ఈ దర్శకుడి మొదటి చిత్రం నాకు నచ్చిన చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రాన్ని గురించి నాకు నచ్చిన సినిమాకబుర్లు రాసుకునే బ్లాగ్ (http://maacinemapegi.blogspot.com/ )లో రాసాను. ఆ బ్లాగ్ తెలియనివాళ్ళు అక్కడ ఓ లుక్కేయండి... http://maacinemapegi.blogspot.com/2011/01/1983.html

పల్లవి అనుపల్లవి(1983) - మణిరత్నం మొదటి చిత్రం


కొన్నేళ్ళక్రితం అన్నయ్య కొత్తగా ఐడియా మొబైల్ కొనుకున్నప్పుడు ఫోన్ చేయండని నంబర్ చెప్పాడు. రింగ్ చెయ్యగానే ఐడియా మొబైల్ వాళ్ళ Ad theme music వినబడింది..."9..8...tararaa..." అంటూ విన్పించిన ఆ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు అనిపించింది. రెండు రోజులు బుర్ర బద్దలుచేసుకున్నాకా గుర్తువచ్చింది...అదీ మణిరత్నం మొదటి సినిమా "పల్లవి అనుపల్లవి" సినిమాలోని పాట తాలూకూ మ్యూజిక్ అని. వెంఠనే అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పా. వాడు ఇళయరాజాకు ప్రరమ భక్తుడు. ఆ తరువాత తెలిసిన కథ ఏమిటంటే ఐడియా మొబైల్ ఏడ్స్ డైరెక్ట్ చేసిన బాలకృష్ణన్(చీనీ కం, పా దర్శకుడు)కూడా ఇళయరాజా అభిమానేట. ఇళయ్ అనుమతి తీసుకుని ఆ ఏడ్ లో ఆ ట్యూన్ వాడుకున్నారట. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటైన ఆ పాట ఇదే --
"కనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం.."



1983లో కన్నడంలో మణిరత్నం మొదటిసారి దర్శకుడి పాత్ర వహించిన సినిమా "ಪಲ್ಲವಿ ಅನುಪಲ್ಲವಿ". రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మణిరత్నమే. తరువాత ఈ సినిమాను తమిళంలోనూ, తెలుగులోనూ డబ్బింగ్ చేసారు. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో హీరో. "వంశవృక్షం" తరువాత ఆయన నటించిన మరో ప్రాంతీయ భాషా చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు "బాలూ మహేంద్ర" ఈ సినిమకు సినిమాటోగ్రాఫర్. కథ కూడా ఒక అసాధరణమైన కథ. ఈసినిమాకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మణిరత్నం "బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్" అందుకున్నాడు. పాట గురించి ఇందాకా చెప్పేసాను. ఇక ఇళయరాజా అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తనివితీరదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం. ఈ మ్యూజిక్ వినండి మీకే తెలుస్తుంది..



ఈ సినిమా అందమంతా ఈ సంగీతం లోనే ఉంది. పాటలు ఒరిజినల్ వి బాగుంటాయి. తెలుగులో డబ్బింగ్ కాబట్టి అంత ప్రాముఖ్యాన్ని పొందలేకపోయాయేమో. ముఖ్యంగా నేపథ్యసంగీతం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

స్త్రీ మనసు లోతుల్ని మగవాడు ఎప్పటికీ సరిగ్గా అర్ధం చేసుకోలేడేమో అన్న పాయింట్ ని నిజం చేస్తుంది ఈ చిత్ర కథ. కథలో అనిల్ కపూర్, లక్ష్మి, కిరణ్ వైరలే(ఈమె సాగర్, అర్థ్, ప్రేమ్ రోగ్, సాథ్ సాథ్, నమ్కీన్, నరమ్ గరమ్ మొదలైన హిందీ సినిమాల్లో నటించారు) ముఖ్య ప్రాత్రలు. సినిమా కథలోకి వెళ్తే విజయ్,మధు ప్రేమికులు. ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్ళిన విజయ్ కు అను పరిచయమౌతుంది. భర్త నుంచి విడిపోయి ఉంటున్న అనుకి ఒక ఏడేనిమిదేళ్ల కొడుకు ఉంటాడు. విజయ్ కీ, అను కొడుకు కూ మంచి స్నేహం ఏర్పడుతుంది. అదే స్నేహం అనూతో కూడా ఏర్పడుతుంది. అందమైన అనుబంధంగా మారుతుంది. కానీ అది చిన్న ఊరు కావటంతో ఊళ్ళో జనాలు వీరిద్దరి స్నేహాన్నీ అపార్ధం చేసుకుంటారు. ఒకానొక ఉత్తేజకరమైన పరిస్థితుల్లో ఊరందరి ముందూ ఆమె ఒప్పుకుంటే ఆమెను పెళ్ళి చేసుకుంటానంటాడు విజయ్.

అదే సమయంలో విజయ్ కోసం ఆ ఊరు వచ్చిన మధు ఆ మాటలు విని మనసు చెదిరి వెళ్పోతుంది. అలాంటి తెలివితక్కువ స్టేట్మెంట్ ఇచ్చినందుకు అనూ విజయ్ ను బాగా కోప్పడుతుంది. తన భర్తను ఇంకా ప్రేమిస్తున్నాన్నీ, విజయ్ లో ఒక మంచి స్నేహితుణ్ణి మాత్రమే చూసాననీ అనూ చెబుతుంది. వాళ్ల స్నేహం ముగిసిపోతుందా? విజయ్ మధుని మళ్లీ కలిసాడా? వారిద్దరు ప్రేమా ఏమౌతుంది? అను సంగతి ఏమైంది? అన్నది మిగిలిన కథ.

కథలో మనకు బాగా నచ్చేది అనూ పాత్ర అని వేరేచెప్పఖ్ఖర్లేదు. ఒక స్వచ్ఛమైన స్నేహాన్ని స్నేహంలా చూడలేని కథానాయకుడి కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ ను చూస్తే జాలి వేస్తుంది. అతని భావం అలా మారకుండా అనూని మంచి స్నేహితురాల్లా ఎందుకు చూడలేదూ? అనూ గొడవలో పడి తనకోసమే ఎదురుచూస్తున్న ప్రేమికురాలి సంగతి ఎలా మర్చిపోగలడు? అని అతనిపై కోపం వస్తుంది. అనిల్ కపూర్ నాకు బాగా ఇష్టమైన హీరోల్లో ఒకరు. కాబట్టి ఆయన నటన గురించి చెప్పేదేముంది? లక్ష్మి సహజ నటన ఎప్పటిలానే ప్రశంసలు అందుకుంటుంది. ప్రేమికురాలు పాత్రలో కిరణ్ వైరలే కూడా మంచి నటన కనబరుస్తారు సినిమాలో. లక్ష్మి కొడుకుగా వేసిన చిన్న పిల్లవాడు భలే ముద్దుగా ఉంటాడు.

చిన్నప్పుడెప్పుడో టివీలో వచ్చినప్పుడు చూసిన సినిమా. ఇంతకంటే గుర్తు లేదు. కానీ ఒక్కసారి చూసినందుకూ, మణిరత్నం మొదటి సినిమా అనీనూ నాకు బాగా గుర్తుండిపోయింది. చాలా రోజుల్నుంచీ ఈ సినిమ గురించి రాయాలని గుర్తున్నంతవరకూ రాసేసా..:) యూట్యూబ్లో లక్కీగా పాటలు దొరికాయి. సినిమా సీడీ అయినా డివీడీ అయినా దొరుకుతుందేమో కనొక్కోవాలి.

Tuesday, January 4, 2011

మరో మంచి ఇండోర్ ప్లాంట్ (నిన్నటి టపాలోని మొక్క గురించి)


నిన్న పెట్టిన "ఇదేం మొక్కో చెప్పుకోగలరా?" టపాకు ఆరు వ్యాఖ్యలు వచ్చాయి. రాసిన అందరికీ బోలెడు థాంక్స్ లు. అందులో ఇద్దరు(సూర్యుడు గారు, స్నేహ గారు) కరెక్ట్ గా రాసారు. అది potato మొక్క. పైన ఫోటోలో దుంప కనబడుతోంది చూడండీ...


మా చిన్నప్పుడు ఒకసారి ఓ బంగాళాదుంపకు బాగా మొలకలు వచ్చేసాయని మట్టిలో పాతిపెట్టాం. అది పెరిగి అందమైన మొక్కగా తయారైంది. బాగా పొడుకు అయిపోతే నాన్న నాలుగు పుల్లలతో చిన్నపాటి పందిరి కూడా కట్టారు వంగిపోకుండా. కొన్నాళ్ళకు మొక్క ఎండిపోయింది. తవ్వితే క్రిందన చిన్న చిన్నవి నాలుగైదు బంగాళాదుంపలు ఉన్నాయి. ఎంతో అపురూపంగా ఆ బుజ్జి బుజ్జి దుంపలను ఉడకపెట్టుకుని తిన్నాం. ఇది చిన్ననాటి ఊసు.


అలానే మొన్నొకరోజు ట్రేలోని ఓ బంగాళాదుంపకి బాగా మొలకలు వచ్చేసాయి. ఎందులో పాతుదాం అని ఆలోచిస్తూంటే, బీట తీసినా పడేయలేక దాచిఉంచిన ఒక 'అన్ బ్రేకబుల్ డిష్' కనపడింది. వెంఠనే మట్టివేసి potato పాతేసాను. చల్లదనం వల్ల ఓ వారానికి బాగా ఏపుగా పెరిగింది. మరో వారానికి ఇదిగో పైన ఫోటోలోలా అయ్యింది. ఇండోర్ ప్లాంట్ లాగ చక్కగా ఇంట్లో ఏదో ఓ చోట పెట్టుకుంటే ఎంతబాగుంటుందో కదా అని ఐడియా వచ్చింది. మీరూ వేసి చూడండి. చలికాలం కాబట్టి ఇప్పుడే బాగా పెరుగుతుంది. మొక్క పెరిగాకా ఇంట్లో పెట్టినా అప్పుడప్పుడు ఎండలో పెట్టడం మర్చిపోకండేం...:)


గతంలో ఒకసారి చిలకడ దుంపతో అందమైన ఇండోర్ ప్లాంట్ ఎలా తయారౌతుందో రాసాను. ఆ టపా తర్వాత నుంచీ రెగులర్గా మీ బ్లాగ్ చదువుతున్నాం అని కొందరు రాసారు కూడా.

Monday, January 3, 2011

ఇదేం మొక్కో కనుక్కోగలరా..?

మంచి ఇండోర్ ప్లాంట్ అవ్వగల ఈ మొక్క ఏమిటో చెప్పుకోగలరా...