సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label అపురూప గళాలు. Show all posts
Showing posts with label అపురూప గళాలు. Show all posts

Monday, May 27, 2013

"త్రిపుర" గారి రేడియో ఇంటర్వ్యూ + ఒక కథానిక, వారి కథా రచనల మీద డా.వి.చంద్రశేఖరరావు గారి అభిప్రాయం


'ఇవి కథలా, కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా?'
'ప్రతి కథ గురించీ సమీక్షిస్తే పరిచయం అసలు కథ కన్నా పెద్దదవుతుంది.'
'ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది.' 
అంటారు 'పాలగుమ్మి పద్మరాజు'గారు.. "త్రిపుర కథలు" పుస్తకంలోని తన పరిచయవాక్యాల్లో. 



పద్మరాజుగారి ప్రశంసను అందుకున్నది విలక్షణమైన కవీ, కథకుడు శ్రీ రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు. "త్రిపుర" పేరుతో అతి తక్కువ రచనలు చేసి ఎంతో ప్రత్యేకతను సొంతం చేసుకున్న నైరూప్య చిత్రకారుడు. ఒక తాత్విక రచయిత. ఇంతకు మించి వారి గొప్పతనం గురించి చెప్పేంత సాహసం చెయ్యను. ఎందుకంటే సాహిత్యం గురించి ఏమీ తెలియని చిన్నతనంలో మా ఇంట్లో ఉన్న త్రిపుర కథల పుస్తకం చదవడానికి ప్రయత్నించిన అజ్ఞానిని. ఇప్పుడు సాహిత్యసాగరం లోతులు తెలిసిన సంపూర్ణ అజ్ఞానిని. 


త్రిపుర గారి మరణవార్త తెలిసాకా, నా దగ్గర ఉన్న రెండు ఆడియో లింక్స్ బ్లాగ్ లో పెట్టాలని... రకరకాల సాంకేతిక ఇబ్బందుల తర్వాత ఇప్పటికి కుదిరింది. అవి.. త్రిపుర గారి రేడియో ఇంటర్వ్యూ ఒకటి, రెండవది ఆయన కథానిక + కథా రచనల మీద డా.వి.చంద్రశేఖరరావు గారి అభిప్రాయం.  


1) "త్రిపుర" గారితో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు చేసిన ఒక రేడియో ఇంటర్వ్యూ ఇక్కడ వినటానికి పెడుతున్నాను. ఇది 1999 march 20న విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమైంది. 

 



2) 'గొలుసులు-చాపం-విడుదల భావం' కథానిక + త్రిపుర కథా రచనల మీద 'డా.వి.చంద్రశేఖరరావు' గారి అభిప్రాయం:




***     ***

"త్రిపుర" గారి గురించి అంధ్రజ్యోతిలో ఇవాళ వచ్చిన వాడ్రేవు చినవీరభద్రుడుగారి వ్యాసం:

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/05/27/ArticleHtmls/27052013004003.shtml?Mode=1


Vadrevu Ch Veerabhadrudu గారి మాటల్లో:
"త్రిపురగారి మీద నా వ్యాసం ఈరోజు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది. అయితే ఆ శీర్షిక 'విబంధుడు ' నేను పెట్టింది కాదు. ఆ పదానికి అర్థం నాకు తెలియదు. అలాగే ఆ వ్యాసంలో రెండు పేరాలు ఎడిట్ చేసారు. అందువల్ల పూర్తి వ్యాసాన్ని మిత్రులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను."

పూర్తి పాఠంతో ఇక్కడ:
http://www.scribd.com/doc/143874732/The-legacy-of-Tripura-in-Telugu-Literature


Saturday, October 27, 2012

పాలగుమ్మి విశ్వనాథం గారి "మా ఊరు" కబుర్లు - పాటలు




ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి మరణ వార్త యావత్ సంగీతలోకాన్నీ, వారి అభిమానులనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంగీతజ్ఞుడు స్వరపరిచిన లలితగీతాలబాణీలు తెలుగువారికి చిరస్మరణీయాలు. ముఖ్యంగా లలిత సంగీతానికి పాలగుమ్మివారు అందించిన సేవ అనంతం.  ఆయన పాటలు చాలా వరకూ వారి వెబ్సైట్ 'http://palagummiviswanadham.com/’ లో వినటానికి, కొన్ని డౌన్లోడ్ కు కూడా విశ్వనాథంగారు ఉండగానే అందుబాటులో పెట్టడం హర్షించదగ్గ విషయం. 


గత నవంబర్ లో దూరదర్శన్ వాళ్ళు ప్రసారం చేసిన ’మా ఊరు’ అనే కార్యక్రమంలో విశ్వనాథంగారు కూడా పాల్గొన్నారు. ఆయనపై అభిమానం కొద్దీ మా నాన్నగారు ఆ కార్యక్రమాన్ని బయట రికార్డ్ చేయించుకున్నారు. ఆయన ఇంటర్వ్యూ ఉన్న బిట్ వరకూ ఎడిట్ చేసి ఆ కార్యక్రమ్మాన్ని ఇక్కడ పెడుతున్నాను. విశ్వనాథం గారు పాడిన ’మా ఊరు ఒక్కసారి పోవాలి..’ పాట కూడా ఇందులో ఉంది. ఆ కార్యక్రమానికి సిగ్నేచర్ ట్యూన్ క్రింద ఈ పాటనే పెట్టుకున్నారు.



ఆయన పాడిన ఇతర లలిత గీతాల్లో "అమ్మదొంగ..’, "ఎన్నిసారులు అన్నదో..’ , "ఎంత సుందరమైనదో..’ మొదలైనవి నాకు ఇష్టమైన పాటలు.  

1) శ్రీమతి బి.వరహాలుగారు పాడిన ’అమ్మదొంగ..నిన్ను చూడకుంటే..." క్రింద లింక్ లో వినవచ్చు:
http://samgeetapriyaa.blogspot.in/2012/10/blog-post_27.html


2) ఎన్నిసారులు అన్నదో ఎన్నెన్ని తీరులు విన్నదో..
http://www.palagummiviswanadham.com/music/bhava-geethaalu/sweeyarachanalu/ennissarulu.mp3


3) ఎంత సుందరమైనది భగవానుడొసగిన బహుమతి...
http://www.palagummiviswanadham.com/music/bhava-geethaalu/sweeyarachanalu/enthasundaramainadi-palgummi.mp3




గుడిపూడి శ్రీహరి గారు రచించిన "పాలగుమ్మి విశ్వనాథం గారి ఆత్మకథ" చాలా బావుంటుంది. ఆ పుస్తకం సి.పి.బ్రౌన్ అకాడమీ వాళ్ళు ప్రచురణ. అప్పట్లో పుస్తకం రిలీజైందని తెలిసిన వెంఠనే అన్నయ్యను సి.పి.బ్రౌన్ అకాడమీ వాళ్ల షాపుకి పంపి తెప్పించుకున్నాం. ఈ ఆత్మకథను చాలా ఆసక్తికరంగా రాసారు శ్రీహరి గారు. ముఖ్యంగా విశ్వనాథంగారి చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చూపిన తెగువ,ధైర్యం, వారు పడ్డ ఇక్కట్లు చదువుతూంటే కళ్ళు చెమరుస్తాయి.

సంగీతం పట్ల ఎంతో అంకితభావం ఉన్న ఇటువంటి కళాకారులు చాలా అరుదు, అవసరం అనే చెప్పాలి.


Friday, October 12, 2012

"దేవరకొండ బాలగంగాధర తిలక్" -- "శిఖరారోహణ"


ఆధునిక తెలుగు సాహిత్యంలో అతితక్కువ రచనలతో తనదైనటువంటి గాఢముద్రను వేసిన శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి జీవితం,సాహిత్యం గురించి కవి, రచయిత, విమర్శకుడు శ్రీ ఇంద్రగంటి శ్రికాంతశర్మ గారు ఒక పుస్తకం రాసారు. పుస్తకం పేరు "దేవరకొండ బాలగంగాధర్ తిలక్". సాహిత్య అకాదెమీ వారి ప్రచురణ. (వెల నలభై రూపాయిలు). శర్మగారు చిన్నప్పుడు తణుకులో తాను తిలక్ గారిని కలుస్తుండే రోజుల నుండీ ప్రారంభించి, తిలక్ జీవితం, తిలక్ జీవనదృక్పథం , సాహిత్య వ్యక్తిత్వం, కథలు, కవితలు, నాటకాలు, నాటికలు మొదలైన తిలక్ ఇతర రచనలన్నింటి గురించీ ఎంతో వివరంగా చెప్పుకుంటూ వచ్చారు ఈ పుస్తకంలో. పుస్తకం చివరలో మార్క్సిస్టు విమర్శకులు "అర్వీయార్" గారి వ్యాసం "తిలక్ కవిత్వంలో విషాద అలంకారికత" అనే అనుబంధాన్ని కూడా జత చేసారు. 


తిలక్ గురించి శర్మ గారు చెప్పిన కొన్ని విశేషాల సారం: 

ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయోద్యమకాలానికి చెందిన కవి, కథకుడు, నాటకరచయిత శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్(1921-1966). అందమైన రూపం, ఆ రూపాన్ని మించిన అందమైన మనసు; సున్నితత్వం,భావుకత కలగలిసిన వ్యక్తిత్వం వారిది. ప్రారంభంలో భావకవిత్వాన్ని రాసినా ఆ తర్వాత ఆనాటి అభ్యుదయోద్యమప్రభావాన అభ్యుదయ గీతాలను, వచన పద్యాలనూ రాసారు. ఆదర్శవంతమైన నాటకాలనూ, ఉత్తమమైన కథలనూ కూడా తిలక్ రాసారు. ఆయన మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న "అమృతం కురిసిన రాత్రి"; ఇంకా "గోరువంకలు", "తిలక్ కథలు" ; "సుప్తశిల", "సుశీల పెళ్ళి" నాటికలు మొదలైన రచనలు సాహిత్యాభిమానుల మన్ననలనందుకున్నాయి. 


సాహిత్యంలో తన ముందు తరానికి చెందిన కాల్పనికతకు, తన కాలం నాటి సామ్యవాద ధోరణికీ సమన్వయాన్ని సమకూరుస్తూ తనకు మాత్రమే సొంతమైన ఒక ప్రత్యేకశైలిని ఏర్పరుచుకున్న కవి శ్రీ తిలక్. మద్రాసులో ఇంటర్ చదివిన తిలక్ ఆ తర్వాత మరెక్కడా చదవలేదు. పధ్నాలుగు పదిహేనేళ్ల వయసు నుండే పద్య రచనను ప్రారంభించిన తిలక్ అభ్యుదయ రచనోద్యమకాలంలో కవిగా , సోషలిస్ట్ గా మారారు. డిగ్రీలు చదవకపోయినా తమ ఇంట్లోని ఐదారువేల పుస్తకాల వల్ల తిలక్ తెలుగు,ఇంగ్లీషుల్లో మంచి చదువరి అయ్యారు. స్వస్థలమైన తణుకులోనే ఉండిపోయారు. తిలక్ కవిత్వంలో కృష్ణశాస్త్రి గారి ప్రభావంతో కాల్పనిక సౌందర్యమూ, శ్రీశ్రీ ప్రభావంతో సామాజిక వాస్తవికత చోటు చేసుకున్నాయి. కవిత్వంలో తిలక్ ది ప్రత్యేకమైన శైలి. తెలుగు,సంస్కృత, అన్యదేశ సమాసాలు ఆయన రచనలలో కనబడతాయి. ఆయన కథల్లో మానసిక విశ్లేషణ, తాత్వికత, విశ్వశాంతి, అభ్యుదయభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యం అధ్యయనం చేసేవరికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందేమో అనిపించింది నాకు. 

తిలక్ సొంత గళంలో ఆయన "వెన్నెల" కవితనిఇదివరకూ బ్లాగ్లో పెట్టాను.. http://trishnaventa.blogspot.in/2009/11/blog-post_17.html

***   ***    *** 

 శిఖరారోహణ: 

'ముందుమాట'లో శ్రీకాంత శర్మ గారు విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి బాలగంగాధర్ తిలక్ జీవన సాహిత్యాల గురించి ప్రసారమైన ఒక డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించారు. తను ఆకాశవాణిలో పనిచేసే కాలంలో శర్మగారే రచించిన ఈ డాక్యుమెంటరీ పేరు "శిఖరారోహణ". దీనికి ప్రయోక్తగా శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి(మా నాన్నగారు) వ్యవహరించారు. ఆ కార్యక్రమంలో ఆనాటి ప్రముఖ రచయితలు శ్రీ సోమసుందర్, ఆర్.ఎస్.సుదర్శనం, నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తిలక్ సోదరులు గంగాధర రామారావు పాల్గొన్నారు. ఆకాశవాణి కళాకారులు పద్యాలు, వచన కవిత్వం చదివారు. గంట నిడివి ఉన్న ఈ కార్యక్రమం 1983లో ప్రసారమైంది. తిలక్ కవిత్వం పై ఆసక్తి ఉన్న పాఠకులు ఈ కార్యక్రమాన్ని క్రింద లింక్ లో వినగలరు.. 

 


పైన కార్యక్రమం వినలేనివారికి ఇదే కార్యక్రమంలో "అమృతం కురిసిన రాత్రి" లోని "వానలో నీతో" అనే కవిత ఒక్కటీ విడతీసి క్రింద లింక్ లో ఇస్తున్నాను. ఇందులో కవిత చదివిన గళం నాన్నగారిది. 

Monday, May 28, 2012

పుచ్చా పూర్ణానందం గారూ - మీసాల సొగసులు



ఒకప్పుడు మనకున్న అతితక్కువ హాస్య రచయితల్లో ఒకరు పుచ్చా పూర్ణానందంగారు. మేము వారిని పూర్ణానందంతాతగారు అనేవాళ్ళం. విజయవాడలో పేరుమోసిన లాయరైన వీరు నటులు, హాస్యరచయిత కూడానూ. పూర్ణానందం గారి అల్లుడు శ్రీ జె.వి.నారయణమూర్తిగారు నాన్నకు ప్రాణ స్నేహితుడు. ఇప్పటికి ఏభైఏళ్ళు వాళ్ల స్నేహానికి. ముందర అలా పూర్ణానందంగారు పరిచయంట. తర్వాత నాన్న రేడియోలో చేరాకా వారితో స్నేహం బలపడిందిట. విజయవాడలో వాళ్ళ పెద్దబ్బాయి ఇల్లు మా ఇంటి దగ్గర ఉండేది. వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అటువైపే ఉన్న మా ఇంటికి వస్తూండేవారు పూర్ణానందంతాతగారు మా చిన్నప్పుడు. అప్పటికి గుబురు మీసాల తాతగారిలానే తెలుసు. పూర్ణానందం గారు గొప్ప హాస్య రచయిత అనీ, ఎంతో సాహితీవిజ్ఞానం గల సరస్వతీపుత్రులని పెద్దయ్యాకా వారి పుస్తకాలు చదివాకా కానీ తెలీలేదు. "మీసాల సొగసులు" ఇంకా 'ఆవకాయ - అమరత్వం', ’ఆషాఢపట్టి’ మొదలైనవి వీరి ప్రముఖ రచనలు. జంధ్యాల సినిమాలైన ఆనందభైరవి, రెండు రెళ్ళు ఆరు, హైహై నాయికా, శ్రీవారి శోభనం మొదలైన సినిమాల్లో కూడా నటించారు.





విజయవాడ ఆకాశవాణి కోసం ఆయన రాసి, చదివిన హాస్య ప్రసంగాలను ఒకచోట చేర్చిన పుస్తకమే "మీసాల సొగసులు". అన్నింటికన్నా ముందు ఈ పుస్తకానికి వారు రాసిన మున్నుడి(ముందుమాట) చాలా బావుంటుంది. మనిషి జీవితంలో హాస్యం ఎంత ప్రధానమైనదో, హాస్యం వాల్ల కలిగే ఉపయోగాలేమిటో..అన్నింటి గురించీ ఎందరో మహానుభావుల ఆంగ్ల ఉల్లేఖనాలతో చక్కగా చెప్తారు పూర్ణానందంగారు. పుస్తకం చదువుతుంటే సార్ధక నామధేయులు అనిపించకమానదు. మొత్తం పదిహేను వ్యాసాలు ఉన్న ఈ పుస్తకంలో ప్రతి వ్యాసం కూడా ఒక విజ్ఞానగని అనిపిస్తుంది నాకు. వ్యాసాల్లో ఉదహరించిన పద్యాలూ, ప్రాచీన కవుల,రచయితల ఉల్లేఖనాలు.. అన్నీ కూడా వారికున్న విద్వత్తునీ, సాహితీ జ్ఞానాన్నీ తెలుపుతాయి. తాంబూలమ్, అతిథుల బెడద, పిల్లి ఎదురొచ్చింది, కాకిగోల, నల్లకోటు, భార్యతో బజారుకెళ్ళకు - మొదలైన ఈ వ్యాసాల పేర్లన్నీ కూడా హాస్యభరితమైనవే. ఈ పుస్తకం ముఖ చిత్రం బాపూ వేసినది. పుస్తకంలోని బొమ్మలు వేసినది కార్టునిస్ట్ శ్రీ బాలి. పుస్తకంలో అక్కడక్కడా చెప్పిన కొన్ని జోక్స్ క్రింద రాస్తున్నాను.. భలే ఉంటాయి..

1) ఒక శిష్యుడు గురువుగారిని భోజనానికి పిలిచాడట. ఎందుకో అతని గయ్యాళి పెళ్ళానికి పులుసుకుండ అతని నెత్తినకొట్టి పగులకొట్టి, కుండ ఖరీదు కుడా ఇమ్మన్నదట.అప్పుడా గురువుగారు
"భాండాని శతసహస్రం భగ్నాని మమ మస్తకే,
అహో గుణవతి భార్యా భాండమూల్యంన యాచతే"
అన్నాడట.
అంటే 'నా నెత్తిన లక్ష కుండలు పగిలాయి కానీ, మా ఆవిడే గుణవంతురాలు,కుండ ఖరీదు అడగలేదూ అని.


2)ఓ గృహస్తు తనని కుమ్మిందని కోపం వచ్చి వాళ్ల పాడి ఆవుని అమ్మేసాడుట భార్య ఊళ్ళో లేనప్పుడు. వాళ్లావిడ వచ్చాకా "ఇదేమిటండి,కొమ్ము విసిరినంత మాత్రాన రెండుపూటలా పాలిచ్చి ఇల్లు గడుపుతున్న పాడిగేదెను అమ్ముకుంటారా? నేను మీతో సర్దుకుపోవటం లేదు?" అందట.


3)పండక్కి వచ్చిన కొత్త అల్లుడ్ని అత్తగారు, "నాయనా, భోజనం పొద్దు పోతుందేమో. అరిశెలు,మినపసున్నుందలూ తీసుకుంటావా?పిల్లలతో చద్ది అన్నం తింటావా? లేదా మీ మామగారి దేవతార్చన అయ్యేసరికీ పన్నెండు దాటుతుండి..వారి పంక్తిన భోంచేస్తావా? అని అడిగితే, "అత్తగారు, మూడూ చేస్తాను" అన్నాడట.


4)ఒక పిచ్చాసుపత్రి సూపరింటెండెంట్ ఓ విజిటర్ కి హాస్పటల్ చూపిస్తున్నాడట.వీళ్ళు వెళ్ళిన చోటికల్లా ఓ ఆడమనిషి వచ్చి చేతులు ఊపుతూ,భయంకరమైన చూపులతో వెంబడిస్తోందట. అప్పుడా విజిటర్ "ఏమండి, ఈమె కొత్త పేషంతా? వాలకం చూస్తే భయమేసేలా ఉంది..ఈమెపై మీకు కంట్రొలు లేదా? " అనడిగాడుట.
అప్పుడు సూపరింటేండెంట్ "లేదండి" అన్నాడుట. విజిటర్ ఏం? అని ప్రశ్నించాడుట..
"ఆమె నా భార్యండి" అన్నాడుట సూపరింటేండెంట్.


*************************************************


"మీసాల సొగసులు" పుస్తకంలో ప్రతీ వ్యాసానికి మొదట్లో ఒక కార్టూన్ ఉంది. ఆ కార్టూన్లు చాలా బాగున్నాయి. వ్యాసాల సారాంశం తెలపటం కన్నా ఈ కార్టూన్లు పెడితే బావుంటుందనిపించింది నాకు. మొత్తం పదిహేను కార్టూన్లు చూసి ఆనందించండి..

































*** *** ***


రేడియోకి పూర్ణానందంగారు చదివిన ఈ పుస్తకంలోని వ్యాసాలు రెండింటిని ఆయన సొంత గళంలో ఇక్కడ వినేయండి:

తాంబూలమ్ :


పిల్లి ఎదురొచ్చింది:


*** *** ***

పూర్ణానందంగారి శత జయంతి సందర్భంగా శ్రీ సుధామ గారు రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.






Thursday, May 24, 2012

"రజనీ ఆత్మకథా విభావరి" - రెండు మంచి ప్రసంగాలు



రేడియో చరిత్ర తెలిసిన నిన్నటితరం వారందరికీ
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు చిరపరిచితులు. సహస్రచంద్ర దర్శన సౌభాగ్యం కలిగిన వీరు వేంకట పార్వతీశకవులలో ఒకరైన శ్రీ వేంకటరవుగారి కుమారులు. రజనిగారి గొప్పతనం గురించి నేనెంత చెప్పినా చంద్రునికో నూలుపోగు చందానే ఉంటుంది. అంతటి అత్యుత్తమ ప్రతిభాశాలి మన తెలుగువారవ్వటం మన అదృష్టం. ఆయన ఏ బెంగాలీవారో అయ్యుంటే ఇంతకు నాలుగురెట్లు ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపు వచ్చి ఉండేదేమో కూడా..! నా దృష్టిలో రజని గారి సేవలను అందుకున్న "ఆకాశవాణి" అదృష్టవంతురాలు. రేడియోలో ఉదయం ప్రసారమయ్యే "భక్తిరంజని"ని వీరి పేరున "భక్తరజని" అనేవారంటే అందుకు వారి కృషే కారణం. ఇక లలిత సంగీతానికీ, గేయరూపకాలకూ రజనిగారి చేసిన సేవ అనంతం. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీతసాహిత్యాలు ఆయన ఉఛ్వాసనిశ్వాసాలు ! సంగీతంలో ఎన్నో రకాల పరిశోధనలూ, ప్రయోగాలు చేసారు. రజనిగారు రవీంద్రసంగీతాల్ని తెలుగులోకి అనువదించి, స్వరపరిచిన విశేషాలు, వారికి సంగీత నాటక అకాడమీ వాళ్ళు చెన్నై లో "టాగూర్ రత్న అవార్డు " ఇచ్చిన విషయం సంగీతప్రియ బ్లాగ్లో ekla chalo re పాట గురించి రాసినప్పుడు రాసాను.


రజని గారి గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Balantrapu_Rajanikanta_Rao




కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న
"ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర", "శతపత్ర సుందరి", "మువ్వగోపాలపదావళీ", పిల్లల కోసం రాసిన "జేజిమావయ్య పాటలు" మొదలైనవి రజనిగారు సాహిత్య ప్రపంచానికి అందించిన కలికితురాయిలు. "కొండ నుండి కదలి దాకా" అని గోదావరీనది మీద రజనిగారు చేసిన సంగీత రూపకం జపాన్ దేశ పురస్కారాన్ని అందుకుంది. ఇంతటి గొప్ప వ్యక్తి తన స్వీయచరిత్రను ఇంత ఆలస్యంగా రాయటమేమిటో అని ఆశ్చర్యం వేసినా ఇప్పటికైనా వారు పుస్తకం రాసినందుకు చాలా సంతోషించాను నేను.


ఈ ఏటి ఉగాది నాడు(23-3-12) రజనిగారి స్వీయ చరిత్ర "రజనీ ఆత్మకథా విభావరి" సభాముఖంగా విడుదల చేసారు. పుస్తకంలో రజనిగారు తన బాల్యం, పిఠాపురం కవిపండితులు, రేడియో అనుబంధాలు అనుభవాలూ; సాలూరి రాజేశ్వరరావు, శ్రీ గోపీచంద్, బాల సరస్వతి, ఓలేటి, చలం, విశ్వనాథ, శ్రీపాద పినాకపాణి మొదలైన మహామహులతో తనకున్న జ్ఞాపకాలు, తన రచనలు, సత్కారాలూ పురస్కారాలు మొదలైన అంశాలను గురించి తెలిపారు. రేడియో పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కొని దాచుకోవాల్సిన పుస్తకం ఇది.

ఎంతో వైభవంగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభ తాలూకూ ఆడియో వీడియోలు నేను విని, చూడటం జరిగింది. అందులో ఇద్దరు వక్తల ప్రసంగాలు విని నేనెంతో ముగ్ధురాలినయ్యాను. శ్రీ గొల్లపూడి మారుతీరావుగారు, శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారూ తమ ప్రసంగాల్లో ఎన్నో కబుర్లను, విశేషాలనూ తెలిపారు. అవి బ్లాగ్మిత్రులకు అందించాలని ఈ టపా...! వీడియో పెట్టడం కష్టమైనందువల్ల ఆడియో మాత్రం అందించగలుగుతున్నాను. ఈ ప్రసంగం విని గొల్లపూడి గారు "గొప్ప వక్త" అని మరోసారి అనుకున్నాను.



గొల్లపూడి మారుతీరావుగారి ప్రసంగం:




భట్టుగారి ప్రసంగం:




చిన్ననాటి నుండీ ఇంట్లో మనిషిలాగ రజనిగారి చుట్టు తిరిగగలగటం, ఇవాళ ఆయన స్వీయచరిత్రను గురించి బ్లాగ్లో రాయ గలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను.


ఈ పుస్తకం కాపీల కోసం అడ్రస్:

సత్యం ఆఫ్సెట్ ఇంప్రింట్స్
బృందావనం,డో.నం.49-28-5,
మధురానగర్, విశాఖపట్నం -16.
ph-0891-2735878,9849996538


Saturday, March 31, 2012

శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారి "జానకితో జనాంతికం" ఆడియో



శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారి రచన "జానకితో జనాంతికం" ఒక అద్భుతమైన వాక్ చిత్రం. 1975లో ఆయనే సొంతంగా చదవగా విజయవాడ ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఒకసారి దువ్వూరివారు విజయవాడ రేడియోస్టేషన్ కి విచ్చేసిన సందర్భంలో ఏదైనా మాట్లాడవలసిందిగా వెంకటరమణశాస్త్రిగారిని కోరితే, ముందస్తు తయారి లేకపోయినా అప్పటికప్పుడు "జానకితో జనాంతికం" స్క్రిప్ట్ చదివారిట వారు. రికార్డింగ్ సదుపాయాలు సరిగ్గాలేని అప్పటి పాత విజయవాడ ఆకాశవాణి స్టూడియోలో రికార్డింగ్ జరిగిందిట.


అప్పటికే పెద్ద వయసు అయినా, ఇందులో దువ్వూరి వారు తన స్వరంలో కనబరిచిన ఆర్ద్రత, సీతమ్మవారిపై కనబరిచిన గౌరవాభిమానాలు, వాయిస్ మాడ్యులేషన్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒక వాక్యాన్ని ఎలా పలకాలి, మైక్ ముందర ఎలా మాట్లాడాలి అని కొత్తగా ఆకాశవాణిలో చేరినవారికి చెప్పటానికి టేపుని వినిపిస్తూ ఉండేవారుట.

రేపటి శ్రీరామనవమి సందర్భంగా దువ్వూరివారి స్వరంలో ఉన్న వాక్ చిత్రాన్ని టపాలో అందించాలని ప్రయత్నం. చాలా పాత రికార్డింగ్ అవటం వల్ల స్పష్టత కాస్త తక్కువైంది.. ! దువ్వూరివారి స్వరంలో ఉన్న పాత రికార్డింగ్ క్రింద లింక్లో వినవచ్చు.

 

పదిహేనేళ్ల క్రితం ఒక శ్రీరామనవమి సందర్భంలో ఆంధ్రప్రభ పత్రిక వారు వాక్ చిత్రాన్ని అక్షరరూపంలో ప్రచురించారు. కాపీ ఇక్కడ చూడవచ్చు.


దువ్వూరి వారి స్వీయ చరిత్ర ( కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర ) గురించి పుస్తకం.నెట్ లో ప్రచురితమైన 'మెహెర్'గారి వ్యాసం ఇక్కడ చూడవచ్చు.


Thursday, December 29, 2011

"నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" ఆడియో సీడీ రూపంలో



అలనాటి రేడియో నాటకాలకు ప్రాణమైన సుతిమెత్తని స్వరం ఆమెది. నాటకంలో ఆవిడ పాత్ర ఉన్నదంటే చెవులు రిక్కించుకుని నాటకం వినేవారు ఆమె ఆభిమానులు. నాటకం సాంఘికమైనా, పౌరాణికమైనా అందులోని పాత్ర కు అనుగుణంగా తన స్వరాన్ని మలుచుకోగల నిష్ణాతురాలు శారదా శ్రీనివాసన్ గారు. తనకు రేడియోతో గల అనుబంధాన్ని, ఎందరో ప్రముఖులతో పరిచయాలనూ, స్నేహాలనూ ఒక జ్ఞాపకాల మాలగా చేసి, ఇటీవల ఆరునెలల క్రితం శారదా శ్రీనివాసన్ గారు "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" పుస్తకం రచించారు. ఈ పుస్తకం ఎంతోమంది రేడియో అభిమానుల ప్రశంసలను అందుకుంది.




పలువురు బ్లాగ్మిత్రులు కూడా ఈ పుస్తక పరిచయాన్ని మనకందించారు. క్రింద ఉన్న linksలో ఆయా టపాలను చూడవచ్చు:
http://manishi-manasulomaata.blogspot.com/2011/07/blog-post.html

http://nemalikannu.blogspot.com/2011/09/blog-post_08.html



pustakam.net/?p=8205

pustakam.net/?p=8205




'సుధామధురం' బ్లాగర్, ప్రసిధ్ధ కవి, రచయిత, రిటైర్డ్ రేడియో కళాకారులు శ్రీ సుధామ గారు తమ టపాలో ఈ పుస్తక పరిచయానికి, శారదా శ్రీనివాసన్ గారిని గూర్చిన మరిన్ని మంచి కబుర్లను కూడా జతచేసారు.
sudhamadhuram.blogspot.com/2011/09/blog-post_11.html





ఇప్పుడు సరికొత్త విషయం ఏమిటంటే పలువురు మిత్రుల, అభిమానుల కోరికపై "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" పుస్తకం ఇప్పుడు సీడీ రూపంలో మన ముందుకు వచ్చింది. తన అనుభవాలను ఆవిడ స్వరంలోనే వినాలని, ముఖ్యంగా దూరదేశాలలో ఉన్న రేడియో అభిమానులు డ్రైవింగ్ చేసుకుంటూ కూడా వినేలాగ కావాలని పట్టుబట్టడంతో ఈ సీడీ రూపకల్పన త్వరత్వరగా జరిగింది. ఈ సీడీ మొన్న జరిగిన పుస్తక ప్రదర్శనలో SR communications ద్వారా వెలువడిందని తాజా వార్త. ఈ సంగతి శారదత్త(మా ఇంట్లో అందరం ఆవిడను అభిమానంగా అలా పిలుస్తాము) స్వయంగా ఫోన్ చేసి బ్లాగులో రాయమని చెప్పారు. నేను కూడా సీడి వినాల్సి ఉంది.


శారదా శ్రీనివాసన్ గారి మరో సీడీ వివరలు:


శారద గారి "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖుల్లో ఒకరు ప్రముఖ రచయిత "డా. పోరంకి దక్షిణామూర్తి" గారు. వారు రచించిన "ముత్యాల పందిరి" అనే నవలను పూర్తిగా శారదత్త స్వరం లో ఈ రెండవ సీడీలో వినవచ్చుట. ఈ నవల మొత్తం తెలంగాణా మాండలికంలో ఉంటుందిట. అయితే, ఈ సీడీ ఇంకా తయారీలో ఉందని సమాచారం.

Wednesday, August 3, 2011

"నేనెందుకు రాస్తున్నాను.." శ్రీ వేగుంట మోహన్ ప్రసాద్ గారి రేడియో ప్రసంగం....కొన్ని జ్ఞాపకాలు !


"మో" ఎవరు అని అడిగే ఎవరన్నా రేడియోలో ప్రసారమైన ఈ ప్రసంగం వినవలసిందే...
"నేనెందుకు రాస్తున్నాను.." అని 28 -11 -89 లో (అంటే సుమారు 22 సంవత్సరాల క్రితం) ప్రసారమైన మోహన్ ప్రసాద్ గారిది ఒక రేడియో ప్రసంగం ఉంది. అది కేసెట్లో రికార్డ్ చేసాం ప్రసారమైనప్పుడు. చాలా సార్లు వింటూ ఉండేవాళ్ళం. ఎంతో బాగా మాట్లాడారు మోహన్ ప్రసాద్ గారు ఇందులో. క్రిందన ఇస్తున్నాను. నాన్న ద్వారా తెలిసిన ఆయనపై అభిమానంతో ఈ ఆడియో లింక్ ఇక్కడ పెడుతున్నాను..


Get this widget | Track details | eSnips Social DNA

కొన్నేళ్ళ తర్వాత మళ్ళి ఇవాళ ఈ కార్యక్రమం వింటుంటే కాలం ఎలా పరుగులు తీస్తుందో కదా అనిపించింది...ఒకనాడిలా వీరిని గురించిన దుర్వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు..! మొన్న వారికి తనికెళ్ళ భరణి సాహితీ అవార్డ్ వచ్చినప్పుడు కూడా నాన్న అనుకున్నారు వెళ్లి కలవాలి అని..ఇంతలోనే ఈ దిగ్భ్రమ వార్తా !

*** *** ***

పొద్దున్నే టివిలో స్క్రోలింగ్ లో ఒక వారట చూసి వెంతనే నాన్నకి ఫోన్ చేశా..ఇది నిజమేనా? అని..
నిజమేనన్నారు... ఎంతో దిగులు వేసింది..
ఏవో జ్ఞాపకాలు అలా ముసిరాయి..

ఆకాశవాణి వార్షిక పోటీలకు రేడియో వాళ్ళు చేసిన ప్రతి అవార్డ్ ప్రోగ్రాం ఢిల్లీ కి వెళ్ళే ముందు వాటిని అక్కడి జడ్జస్ చదవటానికి వీలుగా తెలుగుతో పాటుగా హిందీ లోకీ, ఇంగ్లీషు భాషల్లో కీ మొత్తం కార్యక్రమాన్ని అక్షర రూపంలో ట్రాన్స్లేట్ చేసి , వాటికి ఓ పుస్తకం గా బైండ్ చేసి కార్యక్రమంతో పాటుగా పంపేవారు. అలా నాన్న చేసిన కొన్ని కార్యక్రమాలను ఇంగ్లీషు లోకి అనువదించారు ఆధునిక తెలుగు కవులలో 'మో' గా ప్రసిధ్ధి చెందిన శ్రీ వేగుంట మోహన్ ప్రసాద్ గారు. వారు నాకు మొదట తెలిసింది నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో. వారు నాకు మొదట తెలిసింది నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో. అప్పుడు ఆయన విజయవాడ సిద్దార్ధా కాలేజిలో ఇంగ్లీషు లెక్చరర్ గా చేసేవారు. మొదట వారు అనువదించినది 'నేను కాని నేను' అనే కార్యక్రమాన్ని. అది మోహన్ ప్రసాద్ గారికి చాలా నచ్చింది. నాన్న కలవటానికి వెళ్ళినప్పుడు లోపలి తీసుకువెళ్ళి ఎంతో అభిమానంగా మాట్లాడారుట. ' ఇలా ఇంటి లోపలి చాలా తక్కువమందిని అనుమతిస్తాను..' అన్నారని నాన్న సంతోషంగా చెప్పటం నాకింకా గుర్తు.

రేడియో కార్యక్రమాలను అనువదించేప్పుడు సాధారణంగా తెలుగు స్క్రిప్ట్ చదివి ఆంగ్లంలోకి రాసేస్తుంటారు. కానీ మోహన్ ప్రసాద్ గారు ప్రోగ్రాం కేసెట్ అడిగి , వినీ ఆంగ్లంలోకి అనువాదం చేసేవారుట. ఢిల్లీలో జడ్జీలు కూడా ఎవరు అనువాదం చేసారు అని అడిగి, చాలా బావుందని మెచ్చుకునేవారుట . ఈ అనువాదాల కారణంగా నాన్నకు అపురూపమైన వారి స్నేహం లభించింది. అప్పుడప్పుడు కలిసినప్పుడు కబుర్లు మాతో చెప్పేవారు. అలా 'మో' గారిని ఎప్పుడూ కలవకపోయినా నాన్న ద్వారా తెలుసు. అప్పుడప్పుడు మోహనప్రసాద్ గారివి కొత్త పుస్తకాలు ప్రచురణ జరిగినప్పుడు నాన్నకు ఒక కాపీ పంపేవారు. క్రింద ఫోటోలోది అలా వారు పంపిన పుస్తకంలోని వారి సంతకం..




శ్రీ వేగుంట మోహన్ ప్రసద్ గారి గురించి రచయిత్రి చంద్రలత గారు పుస్తకం.నెట్ లో రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.

Monday, June 13, 2011

ప్రముఖ నాట్యాచార్యులు స్వర్గీయ డా.నటరాజ రామకృష్ణ గారి రేడియో ఇంటర్వ్యూ


మరుగున పడిన రెండువేల ఏళ్ళ చరిత్ర గల "ఆంధ్ర నాట్యాన్ని", ఏడొందలఏళ్ళ చరిత్ర గల కాకతీయులనాటి వీరరస ప్రధానమైన "పేరిణి శివతాండవాన్ని" వెలికి తీసి, మళ్లీప్రచారంలోకి తీసుకువచ్చి తిరిగి జీవం పోసిన ఘనత ఇటీవలే స్వర్గస్తులైన ప్రముఖ నాట్యా చార్యులు డా. నటరాజ రామకృష్ణ గారిది. ఇవే కాక మరుగున పడిన మరిన్ని ప్రాచీన నృత్యరీతులను మళ్ళీ ప్రచారంలోకి తీసుకురావటానికి ఆయన చేసిన కృషి అపూర్వమైనది. నృత్యం పట్ల అత్యంత అంకితభావం ఉన్న అంత గొప్ప కళాకారులు తెలుగువారవ్వటం మనకు గర్వకారణం.

1983లో ఉగాది నాడు వారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి "ప్రత్యేక జనరంజని" కార్యక్రమాన్ని రూపొందించే సదవకాశం మా నాన్నగారికి వచ్చింది. క్రితంవారంలో డా.రామకృష్ణ గారి ఆకస్మిక మృతి పట్ల విచారపడుతూ, ఆనాటి ఇంటర్వ్యూ విశేషాలను మా నాన్నగారు తలుచుకున్నారు. "ఆ రికార్డింగ్ ఉంది. కేసెట్ అన్నయ్యతో పంపిస్తాను నీ బ్లాగ్లో పెట్టమని" చెప్పారు నాన్న. ఆయన కోరిక మేరకు ఈ ఇంటర్వ్యును ఈ టపాలో పెడుతున్నాను. ఆసక్తి గలవారు క్రింద ఉన్న రెండు లింక్స్ లోనూ ఆనాటి కార్యక్రమాన్ని వినవచ్చు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసినది మా నాన్నగారు శ్రీ ఎస్.బి.శ్రీరామ్మూర్తిగారు. అసలు నాట్యం లో ఏమేమి ప్రధానపాత్ర వహిస్తాయి, భారత దేశంలోని రకరకాల నాట్య రీతులు మొదలైన విశేషాలను గురించి రామకృష్ణ గారు ఈ ఇంటర్వ్యూ లో చెప్పారు.


కార్యక్రమం నిడివి తగ్గించటం కోసం మధ్యలో వేసిన పాటలు చాలావరకూ ఎడిట్ చేసాను. క్రింద ఉన్న లింక్స్ లోని రెండు భాగాల్లో ఈ కార్యక్రమాన్ని వినవచ్చు..

1983 ఉగాదినాటి "ప్రత్యేక జనరంజని" మొదటి భాగం,రెండవ భాగం:

 

Sunday, November 28, 2010

రమేష్ నాయుడు పాట అయన గళంలో..


నాకిష్టమైన సంగీత దర్శకుల్లో ఒకరైన "రమేష్ నాయుడు"గారి గురించి తృష్ణ బ్లాగ్ లో ఆ మధ్యన ఒక టపా రాసాను. దాంట్లో ఆయన పాడిన పాట పెడదామంటే అప్పుడు ఆడియో ఎంత వెతికినా దొరకలేదు నాకు. ఇప్పుడు సర్దుళ్లలో బయటపడింది. "చిల్లర కొట్టు చిట్టెమ్మ" చిత్రంలో ఆయన పాడిన "తల్లి గోదారికే ఆటుపోటున్నాది..." పాటకు స్టేట్ గవర్నమెంట్ ఆ ఏడు బెస్ట్ సింగర్ అవార్డ్ ను అందించింది. సుమధుర సంగీతకారుడే కాక మంచి గాయకులు కూడా అనిపించే రమేష్ నాయుడు గారి గళాన్ని విని మీరూ ఆనందించండి..

పాట: "తల్లి గోదారికే ఆటుపోటున్నాది..."
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
పాడినది: రమేష్ నాయుడు 




సాహిత్యం:తల్లి గోదారికే ఆటు పోటుంటే
తప్పుతుందా మనిషికీ...తలరాత
తప్పుతుందా మనిషికీ..

ఎలుగు ఎనకాలనే సీకటుందని తెలిసి(2 )
సీకటికి దడిసేదేమిటి...
ఓ మనసా..

భగ భగ మండే సూరీడుని పొగమబ్బు కమ్మేయదా
చల్లగా వెలిగే సెందురున్ని అమవాస మింగేయదా(2 )
ఆ సూర్యచంద్రులే అగచాట్లపాలైతే
తప్పుతుందా మనిషికీ...తలరాత
తప్పుతుందా మనిషికీ ...

అవతార పురుషుడు ఆ రామచంద్రుడు
అడవులపాలు కాలేదా
అంతటా తానైన గోపాల కృష్ణుడు
అపనిందలను మోయలేదా
అంతటి దేవుళ్ళే అగచాట్ల పాలైతే
తప్పుతుందా మనిషికీ...తలరాత
తప్పుతుందా మనిషికీ...





Friday, August 13, 2010

కృష్ణశాస్త్రిగారి గళం


భాషా పాండిత్యం లేని నాబోటి సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా సరళమైన కవిత్వాన్ని రాయగల నేర్పు ఒక్క కృష్ణశాస్త్రిగారికే ఉందనటం అతిశయోక్తి కాదు. అటువంటి మహానుభావుని గళం వినాలనే కుతూహలం లేనిదెవరికి? 5-2-54 లో కాకినాడ లోని సరస్వతీ గానసభ వజ్రోత్సవాల(గోల్డెన్ జూబిలీ) సందర్భంగా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చేసిన ప్రసంగంలోని కొంత భాగం ఇక్కడ పెడుతున్నాను.

ఈ సభ జరిగిన నాలుగైదేళ్ల తరువాత ఆయన స్వరం బొంగురుపోవటం, తప్పనిసరిగా ఆపరేషన్, తదనంతరం ఆ స్వరం మూగపోవటం జరిగింది. అందువల్ల చాలా మందికి ఈ అద్భుత కవి స్వరం ఎలా ఉంటుందో తెలియదు. ఆంధ్రా షెల్లీ గా ప్రఖ్యాతిగాంచిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గళాన్ని ఈ బ్లాగ్ ద్వారా వినిపించటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

Sunday, April 4, 2010

చలం గారి మాటలు...

"escapist అంటే... " అంటూ ప్రఖ్యాత రచయిత చలంగారు చెప్పిన ఈ మాటలు నన్ను ఎంతో ఉత్సాహపరుస్తాయి.
"చలం" గారి ఈ మాటల్ని మీరు కూడా వినండి..







Tuesday, November 17, 2009

తిలక్ గళంలో ఆయన "వెన్నెల"

పదహారేళ్ళ క్రితం ఒక జనవరి నెల పుస్తకమహోత్సవం లో కవితలు నచ్చి "అమృతం కురిసిన రాత్రి" మిగతా పుస్తకాలతో పాటూ కొనుక్కుని ఇంటికి తెచ్చాను. ఏం కొన్నావని చూసిన నాన్న "ఈ పుస్తకం ఎందుకు కొన్నావు?"
అని అడిగారు. "నచ్చింది...కొన్నాను..." అన్నా. "ఈ కవితలను నువ్వు అర్ధం చేసుకోగలవా?" అన్నరు. "ఊ..." అన్నాను. "ఈ తిలక్ ఎవరో తెలుసా?" అన్నారు. తల అడ్డంగా ఊపాను. "మూర్తి బాబయ్య మేనమామగారు. రామారావు అంకుల్ వాళ్ళ తమ్ముడు." అన్నారు. "ఈ పుస్తకం పాత ముద్రణ మనింట్లో ఉంది. ఎప్పుడైనా చూసావా?" అన్నారు... లేదన్నాను. దాంట్లోని ఒక కవితను తిలక్ గారు స్వయంగా చదివిన రికార్డింగ్ ఇంట్లో ఉంది వినమన్నారు.

అలా పరిచయమయ్యింది "అమృతం కురిసిన రాత్రి" నాకు. మూర్తి బాబయ్య గిటార్ వాయిస్తే,తిలక్ గారు పాడేవారట, లేకపోతే ఎవరిచేతైనా పాడించుకుంటూ వినేవారట. కొన్ని కవితలని మూర్తిబాబయ్య ట్యూన్ కట్టి పాడించారు. "గగనమొక రేకు కన్నుగవ సోకు..." పాట నేను నేర్చుకుని పాడేదాన్ని... (నాన్న చిరకాల స్నేహితుడు మూర్తిబాబయ్యే "గమ్యం" సినిమాకు సంగీతం చేసిన ఈ.ఎస్.మూర్తి.)

తిలక్ గారు స్వయంగా చదివిన "వెన్నెల" కవిత బ్లాగ్మిత్రుల కోసం.....



కార్తిక మాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి ఒంటిని హత్తుకుంది
శిశువులాంటి వెన్నెల
నవ వధువులాంటి, మధువులాంటి వెన్నెల
శిశిరానికి చెలించే
పొరల పొరల వెన్నెల
శరద్రధుని సౌధానికి కట్టిన
తెరల తెరల వెన్నెల
ఎంత శాంతంగా,
హాయిగా, ఆప్యాయంగా ఉందీ !
చచ్చిపోయిన మా అమ్మ
తిరిగొచ్చినట్టుంది
స్వర్గంలో ఎవరో సంగీతం
పాడుతున్నట్టుంది.
ఎంత నీరవ నిర్మల సౌందర్యం
నన్నావరించుకుంది ?
ఏ చామీకర చషకంతో
నా పెదవుల కందిస్తున్నది ?
ఈ రాత్రి నిద్రిత సర్వధాత్రి మీద
ఎవరు ఈ తళుకు తళుకు
కలల పుప్పొడిని వెదజల్లారు !
ఎవరీ మెరిసే ముఖమల్
జంఖానా పరిచి వెళ్ళారు !
ఓహో ! చంద్రకిత ధాత్రి
ఓహో ! కోరకిత గాత్రి
ఓహో ! శరధ్రాత్రి !
వ్యధలతో బాధ్యతలతో
భయాలతో మహితమైన
నా మనస్సుకిప్పుడూరట కలుగుతోంది.
ఈ వెన్నెల నా మనస్సులోకి
జారుతోంది
నా గుండెల పగుళ్ళనుండి కారుతోంది
నా అంతరాంతర రంగస్థల
ఏకాకి నటుడినైన నన్ను
తన మైత్రీ మధుర భావంతో
క్రమ్ముకుంటోంది
నా లోపలి లోపలి గుప్త
వీణా తంత్రీ నివహాన్ని
వేపధు మృదు లాంగుళుల
తాకి పలికిస్తోంది.
నన్ను బతికిస్తోంది
నా బతుక్కి అందాన్ని
అర్ధాన్నీ ఆశనీ
రచిస్తోంది
నా రచన తానైపోయింది
వెన్నెల వంటి నా ఉద్రేకానికి
తెలుగు భాష శరద్వియ
ద్విహార వనమై నడిచిపోయింది
చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా ఉంది
విరిసిన చేమంతిపువ్వులా ఉంది
పడకగదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా ఉంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు ఉంది
విరహిణి కన్నీరులా ఉంది
విరజాజుల తావితో కలిసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మోహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోని కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికంలేని కొండజాతి
నాతి వలపులాగుంది
ఇది సృష్టి సౌందర్యానుభూతికి టీక
ఇది తరుణ శృంగార
జీవన హేలకు ప్రతీక
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు
గానపు తెన్నుల
జారెను తోటల
కొబ్బరి మొవ్వుల
ఇంటిముందు బోగన్ విల్లా పువ్వుల
ధనికుల కిటికీ పరదా చిరుసందుల
సురతాలస నిద్రిత సతి కపోలమ్ముల
జారిన జార్జెత్ చీర జిలుగుటంచుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
నిరుపేదల కలలో
కదలిన తీయని ఊహల
ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ముల
ఊరి బయట కాలీకాలని
చితి కీలల
ఆడవిలో వికసించిన ఒంటరి పువ్వుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
(1965)

(ఇది పుస్తకంలోని కవిత. తిలక్ గారు చదివిన దాంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి.)

ఈ పుస్తకంలో "అమృతం కురిసిన రాత్రి", "నువ్వు లేవు నీ పాట ఉంది", "నేను కాని నేను" నాకు బాగా నచ్చే కవితలు.