సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, March 30, 2019

ఇష్టకామేశ్వరి






శ్రీశైలానికి సుమారు 14,15కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు ఇష్టకామేశ్వరి. మొదటిసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు కొనుక్కున్న స్థల పురాణం పుస్తకంలో ఆ ఆలయాన్ని గురించి చదివినప్పటి నుంచీ ఆ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని! ఆ తర్వాత వెళ్ళినప్పుడు కూడా వర్షాకాలంలో ఆ అడవి మార్గం వైపు ట్రిప్స్ ఉండని కారణంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం దొరకలేదు. ఆ తర్వాతి ప్రయాణంలో మాత్రం మొత్తానికి దేవి దర్శనభాగ్యం కలిగింది.

ఎత్తుపల్లాలు, రాళ్ళు రప్పలు ఉన్న అటువంటి దట్టమైన అడవి మార్గంలో ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి.  ఇదివరలో రెండు మూడు గంటలు పట్టేదిట ఈ ప్రయాణానికి. ఆ దారిలో కాస్త కంకర పోయడం వల్ల గంటన్నరే పడుతోందిట ఇప్పుడు. తారు రోడ్డుపై ఒక అరగంట, నలభై నిమిషాలు ప్రయాణించాకా దారి ఎడమ పక్క ఉన్న అడవిమార్గం వైపుకి మళ్ళుతుంది. కేవలం జీప్ లు మాత్రమే ఆ దారి గుండా ప్రయాణించగలవు. ఎగుడుదిగుడుగా, ఎక్కడ జీప్ లోంచి జారి పడిపోతామో అనిపించేలా ఎత్తి కుదిపేస్తున్న జీపులో దాదాపు గంట పైగా ప్రయానించడం ఒక గొప్ప సాహసవంతమైన అనుభూతి!! జీప్ లో వెనుక కూచుని దాటి వచ్చిన రాళ్ళు నిండిన, ఎగుడుదిగుడు ఎత్తుపల్లాల దారిని చూస్తూంటే...బాబోయ్ ఈ దారిలోంచి బయటకు వచ్చామా అనిపిస్తుంది.




ఎంతో చాకచక్యంగా జీప్ నడపగలిగిన అనుభవం ఉన్నవారే ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చగలరు. మొదటిసారి వళ్ళినప్పుడు మనిషికి ’ఏడువందల ఏభై ఫిక్స్డ్ రేట్ ’ అంటే చాలా ఎక్కువ అనుకున్నాం కానీ తిరిగివచ్చేప్పుడు జీప్ మళ్ళీ తారు రోడ్డు ఎక్కాకా మాత్రం ధర న్యాయమైనదే అనిపించింది. చాలా రిస్క్ తో కూడుకున్న ప్రయణమే అది. హృద్రోగులూ, ఒళ్ళునెప్పులూ, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆ దారిలో వెళ్లకపోవడం మంచిది. అసలు ఇంత రిస్క్ అవసరమా? ఆ రాళ్ళల్లో టైరు చిక్కుకుని ఈ జీప్ ట్రబుల్ ఇచ్చి మధ్యలో ఆగిపోతే? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని ఈ కీకారణ్యంలోంచి బయటపడగలమా? ఎక్కడో అడవిలో మారుమూల ఉన్న ఆ విగ్రహాన్ని చూడకపోతే ఏమి? అసలిక్కడ ఈ విగ్రహం ఉందని ఎవరు కనిపెట్టారో..? లాంటి ప్రశ్నలు ఈగల్లా ముసిరేస్తాయి ఆ దారిలో వెళ్తున్నప్పుడు. కానీ గుడి దగ్గర జీప్ ఆగిన తర్వాత, దిగి ఒక్కసారి చుట్టూరా ఉన్న అక్కడి నిశ్శబ్దమైన, ఆహ్లాదకరమైన పరిసరాలను చూశాకా, జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారన్నా ఇలాంటి ప్రదేశాన్ని చూసి తీరాలి అని వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనిపించి తీరుతుంది.


జీప్ ఆగిన ప్రదేశం నుండి ఒక అర కిలోమీటరు లోపలికి నడవాలి. చుట్టూరా దట్టంగా పెరిగిన ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పచ్చదనం, రంగురంగుల అడవిపూలు, తలెత్తి పైకి చూస్తే చెట్ల మధ్య నుండి కనబడే నీలాకాశం, ఎత్తైన చెట్ల తాలూకూ పచ్చని ఆకుల మధ్య నుండి పడుతున్న సూర్యకిరణాలు, మధ్యలో దారికి అడ్డంగా పారుతున్న బుల్లి సెలయేరు, ఆ నీటిలో కదులుతున్న నల్లటి చిన్ని చిన్ని చేపపిల్లలు...పక్కగా పెద్దపెద్ద బండరాళ్ల మధ్యన ఎత్తుగా పేర్చి ఉన్న రాళ్లపై కాస్త ఎత్తుమీద ఎప్పటిదో వినాయకుడి రాతివిగ్రహం...ఇలాంటి మనోహరమైన ప్రదేశాన్ని చూడగానే - చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాల్లో చదువుకున్న జానపద కథల్లోకి వచ్చేసామా అనిపించింది నాకు!











నిశ్శబ్దంగా ఉన్న ఆ అటవీప్రాంతంలో, పక్షుల కిలకిలారావాల మధ్యన, కాసేపు ఆ నెలయేటి పక్కనే ఉన్న బండరాళ్ల మీద కూర్చుని పారుతున్న నీళ్ల మధ్యన గబగబా కదిలే ఆ బుల్లి బుల్లి చేపపిల్లలను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. తిరిగి ఎత్తైన చెట్ల మధ్యన నడుచుకుంటూ గుడివైపుకి వెళ్తుంటే అప్రయత్నంగా "ఆకులో ఆకునై..పూవులో పూవునై..." అన్న పాట గుర్తురాక మానదు! అటువంటి పరిసరాల్లో, ఆ క్షణంలో కలిగే అనుభూతి వర్ణించనలవి కాదు. ప్రపంచానికి దూరంగా, జనావాసంలేని ఈ చోట, వాల్డెన్ దగ్గర థోరూ లాగ కొన్నాళ్ళైనా ఉండిపోగలిగితే ఎంత బావుంటుందో.. అనిపించింది. కానీ ఇలా వెలుతురులో కాక చీకటి పడ్డాకా లైట్లు లేని ఈ ప్రాంతంలో ఏ జంతువో వస్తేనో.. అని భయం కూడా వేసింది.





అడవి మధ్యలో అంత లోపలికి ఆ చిన్న ఆలయాన్ని ఎవరు నిర్మించారో, ఎంతో మనోహరంగా ఉండే ఆ చిన్న అమ్మవారి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారో తెలియదు కానీ అక్కడ లభించే ప్రశాంతతని బట్టి ఆ ప్రాంతం చాలా మహిమాన్వితమైనదిగా తోస్తుంది. గుడి ఎదురుగా ఉత్తరముఖంగా ప్రవహించే వాగులో వర్షాకాలంలో బాగా నీళ్ళు నిండి ఉంటాయిట. ఏ గుడి దగ్గరైనా ఉత్తరముఖంగా నదీ ప్రవాహం ఉంటే ఆ ప్రాంతాన్ని దర్శించుకోవడం చాలా మంచిదని ఎక్కడో చదివిన గుర్తు. క్రిందకు దిగి ఆ వాగులో కాళ్ళు కడుక్కుని అమ్మవారిని దర్శించుకోవాలని అక్కడివారు చెప్పారు. ఆలయం బయట ఒకవైపు పురాతనమైన మహిషాసురమర్దిని విగ్రహం, మరోవైపు గణపతి విగ్రహాలు ఉన్నాయి. గుడి ద్వారం క్రిందుగా ఉన్న చిన్న గుహలో ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది. పద్మాసనంలో ధ్యాన నిమగ్నమై ఉన్న ఈ నల్లటి విగ్రహం అరుదైన క్వార్టజైట్ రాతిపై చెక్కబడింది. చతుర్భుజాలలో పై రెండు చేతులు రెండు కలువ మొగ్గలను పట్టుకుని ఉండగా, ఎడమ చేయి శివలింగాన్నీ, కుడి చేయి రుద్రాక్షమాలనూ పట్టుకుని ఉన్నాయి. అమ్మవారికి స్వయంగా కుంకుమబొట్టు పెట్టే అవకాశం ఉందిక్కడ. అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు చిత్రమైన తరంగాలు శరీరంలోకి పాకినట్లు అనిపించింది. అమ్మవారి ముందర వెలిగించిన దీపం తప్ప వెలుతురు లేని ఆ చిన్న గుహలో ఎంతో ప్రశాంతత ఉంది. మనసు చాలా నిశ్చలంగా  మారిపోయి ఇంకాసేపు అలాగే అక్కడే కూర్చుండిపోయాను. ఎక్కువ జనం లేనందువల్ల ఆ అవకాశం దొరికింది. బయటకు వచ్చేసి ఆలయం ప్రాంగణంలో కూడా గచ్చు మీద చాలా సేపు ప్రశాంతంగా అమ్మనే ధ్యానిస్తూ కూర్చున్నా. అంత ప్రశాంతంగా, ఆనందంగా మునుపెన్నడూ లేదసలు.






గుడి బయట కాస్త దూరంలో కనబడుతున్న ఐదారు గుడిసెలల్లో నివసించే చెంచులే గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారట. రోజూ అక్కడకు వచ్చే భక్తుల కోసం నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. అక్కడకు వచ్చే చాలా మంది భక్తులు, వారిని తీసుకువచ్చే జీప్ డ్రైవర్లు అమ్మవారి ప్రసాదం తినే వెళ్తారుట. మేము కూడా కాస్తంత వేడి వేడి అన్నం ప్రసాదంగా తిని బయల్దేరాం. అటునుండి తిరిగిరావడానికి వెలుతురు ఉండగానే సాధ్యపడుతుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటిగంట వరకే  అటు వెళ్ళే వాహనాలు శ్రీశైలం నుండి బయలుదేరతాయిట. ఐదు,ఐదున్నరగంటల ప్రాంతంలో ఎట్టిపరిస్థితుల్లో అడవిలోంచి బయటకు వచ్చితీరాలి. కాస్త చీకటి పడినా ప్రయాణం అసాధ్యమే ఆ దారిలో. రోడ్డు ఇలా ఉంది కాబట్టే ఆ ఆలయం ఇంకా అంత ప్రశాంతంగా ఉందేమో... మార్గం కనుక బాగుండి ఉంటే ఈపాటికి  అక్కడొక క్యూ కాంప్లెక్స్, బిల్డింగులు, భారీ జన సముదాయాలతో ఆ చల్లని వాతావరణం కూడా వేడిగా మారిపోయి ఉండేదేమో అనిపించింది.

తిరుగు ప్రయాణంలో జీప్ కుదుపులకి నే వీడియో తీస్తున్న కేమెరా క్రింద పడిపోయి, భుజం జీప్లోని రాడ్ కి గుద్దుకుపోయింది. చాలా రోజుల వరకూ ఆ భుజంనొప్పి తగ్గనే లేదు కానీ అమ్మవారిని దర్శించుకున్న చాలారోజుల వరకూ ఆ ప్రయాణం మిగిల్చిన మధురిమలు మనసుని ఉల్లాసపరుస్తూనే ఉంటాయి. అందుకే ఆ దారమ్మట వెళ్ళే సాహసం మరోసారి చెయ్యాలని కోరిక... అమ్మ దయ ఉంటే సాధ్యం కానిదేది? ఆవిడ పిలుపుకై ఎదురుచూడటమే చెయ్యవలసింది!



క్రిందటేడాది మొదట్లో మళ్ళీ రెండవసారి అక్కడకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఈసారి జీప్ లో సీటు ధర ఇంకా పెరిగింది. మనిషికి వెయ్యి రూపాయిలు తీసుకున్నారు. పిల్లలకైనా అదే రేటు. అక్కడకు వెళ్ళే భక్తులు పెరగడం వల్ల ఈసారి కాసిని మార్పులు కనబడ్డాయి అక్కడ. ఇదివరకూ ఒకటో రెండో కనబడే జీప్ లు ఇప్పుడు ఐదారు ఆగి ఉన్నాయి. జీప్ ఆగింది మొదలు గుడి దాకా కొందరు చెంచులు కూర్చుని ఏవేవో వనమూలికల అమ్మకాలు చేస్తున్నారు. దారిలోని వినాయకుడి విగ్రహం వద్ద ఉండే సెలయేరు ఎండిపోయింది. నీళ్ళు లేవు, చేపలూ లేవు. గుడి వద్ద పువ్వులు, అగరుబత్తీ, కొబ్బరికాయలు మొదలైన అమ్మకాలు, డబ్బులు తీసుకునే చెప్పుల స్టాండు కూడా వెలిసాయి. గుడి ఎదురుగా ఉండే సెలయేట్లో కూడా నీరు బాగా తగ్గిపోయింది. రెండేళ్ల క్రితం ఏ నిర్మలమైన వాతావరణాన్ని చూసి ముచ్చట పడ్డానో అది కాస్త తగ్గిందనే చెప్పాలి. గుడి దగ్గర క్రితంసారి ఆడుకుంటూ కనపడిన నాలుగైదు చిన్న చిన్న కుక్కపిల్లలు ఇప్పుడు చాలా పెద్దవి ఐపోయాయి. రక్షణ కోసం వాటిని అక్కడే ఉండనిస్తారుట. ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం గురించి ఉన్న నమ్మకాలను పక్కన పెడతే; అక్కడ పార్వతీ దేవి తపస్సు చేసిందట అని ఎవరో అన్నారు. అంతేకాక ఎందరో ఋషులు, మునులు, దేవీ ఉపాసకులు తపస్సు చేసిన ప్రాంతం , అతి పురాతనమైన ఆలయం , అమ్మవారిది ఎంతో ప్రత్యేకమైన, మహిమాన్వితమైన విగ్రహం కాబట్టి, అమ్మ దర్శనం ఎంతైనా అభిలషనీయం. డివైన్ వైబ్రేషన్స్ బాగా ఎక్కువగా ఉన్న అతికొద్ది స్థలాల్లో ఇదీ ఒకటిగా పరిగణించవచ్చు. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని దట్టమైన అడవిలోకి ఒక అడ్వంచరస్ ట్రిప్ కు వెళ్ళాలనుకునేవారికి కూడా ఈ ట్రిప్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా మిగులుతుంది. ఈ ట్రిప్ కి వర్షాకాలం ముందర గాని పూర్తయిన సమయంలో గానీ వెళ్తే అడవిలోని పచ్చదనాన్ని మరింతగా ఆస్వాదించగలం.






Saturday, March 23, 2019

అత్తయ్యగారు


ప్రియమైన అత్తయ్యగారికి నమస్కరించి,

మేమంతా కులాసా. మీరు ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళయిందో కదా మీకు ఉత్తరం రాసి! మేము బొంబాయి లో ఉన్నప్పుడు మీరు మీ అబ్బాయి మీద బెంగ పెట్టుకున్నారని వారానికో ఉత్తరం అన్ని విశేషాలతో తప్పనిసరిగా రాసేదాన్ని. మీరెంత మురిసిపోయేవారో ఆ ఉత్తరాలు చదువుకుని. మళ్ళీ ఇన్నాళ్ళకి మీకు ఉత్తరం రాస్తున్నాను.

మిమ్మల్ని తలుచుకోని రోజు లేదండీ. ఏదో ఒక విషయంలో, ఏదో కారణంగా మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు. ఒకటా రెండా పదిహేనేళ్ల సాంగత్యం మనది. నిజం చెప్పాలంటే మీ అబ్బాయి కన్నా మీతోనే కదా నేను ఎక్కువగా గడిపినది. కానీ మనం కలిసి ఉన్న ఏడేళ్ళూ కూడా మీరు అత్తగారిగా, నేను కోడలిగానే మసిలాము. మీకు అత్యంత ప్రియమైన అబ్బాయిని నాకు ఇచ్చేసాన్న మీ బాధ నన్ను ఒక కోడలిగా మాత్రమే చూసేలా చేసింది. మిమ్మల్ని సంతృప్తి పరచాలని, మీతో మెప్పించుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో దేవుడికి బాగా తెలుసు. నా ప్రతి పనిలోనూ మీరు వెతికే పొరపాట్లు..నన్ను చాలా బాధ పెట్టినా, అవి ఇప్పుడు నేను ప్రతి పనినీ పర్ఫెక్ట్ గా చేసేలా చేసాయని ఇప్పుడు కదా నాకు అర్థం అయ్యింది! "మీ అమ్మాయికి అభిమానం ఎక్కువ, చిన్న మాట కూడా పడదు" అని మీరు అమ్మతో చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. ఇన్నాళ్ళకు ఒక్క విషయం నాకు బాగా అర్థం అయ్యిందండీ.. ఇష్టం ఉన్నచోట తప్పు కూడా చిన్న పొరపాటులానే అనిపిస్తుంది. ఇష్టం లేని చోట చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పులానే తోస్తుంది. ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం లోనే ఉంటుంది.

మనిద్దరి దృష్టికోణం మారడానికి పదేళ్ళు పట్టింది. ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎదురుచూసిన నాకు మీరు ఏకంగా ప్రసంశల శాలువానే కప్పేశారు. మీరు నా మీద ప్రేమగా రాసిన కవితని ఎంత భద్రంగా దాచుకున్నానో!!

జీవితంలో కొన్ని చేదు అనుభవాలు మనకి చాలా మంచిని చేస్తాయనే సత్యం స్వానుభవం మీదనే ఎవరికైనా అర్థం అవుతుందేమో. ఐదేళ్ల క్రితం నా జీవితంలో నాకు తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బకి ఏడాది దాటినా నేను నిలదొక్కుకోలేక,  బాధతో విలవిల్లాడిపోతుంటే ఎంత ధైర్యం చెప్పారూ..! అసలు అది ఎంతో పెద్ద సర్ప్రైజ్ నాకు. ఆ సాయంత్రం నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నా పక్కన కూర్చుని, కళ్ల నీళ్ళు తుడిచి.. పదేళ్ళుగా నేను మీ నోటి వెంట విన్నలని తపనపడుతున్న మాటల కన్నా పదిరెట్లు ఎక్కువ మెచ్చుకోలు మాటలు చెప్పి, ఎంతగా ఓదార్చారో! నా జీవితపు చివరి క్షణాల దాకా ఆ మాటలు నేను మర్చిపోనండీ. అంతగా ధైర్యం చెప్పారు. ఈవిడ మనసులో నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందా? ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయాను. నేను మొదటిసారి మీ ప్రేమను అర్థం చేసుకున్నది ఆరోజే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక కోడలిగా నేనేనాడూ నా బాధ్యతను విస్మరించలేదు. మీకూ తెలుసు. కానీ ఆ రోజు నుండీ నా బాధ్యతకు, అభిమానం కూడా తోడైంది.
నేను వినాలని తపించిన మాటలనే కాకుండా, మరో రెండు మూడు ప్రశంసా వాక్యాలు మీ నోట వినడం నిజంగా నా అదృష్టం. నాతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా ఎంతో సంతృప్తిగా మీరన్న మాటలు నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని మిగిల్చాయండీ. ఈ జీవితానికి అంతకన్నా ఏం కావాలి? నాకు ఎదురైన చెడు ఈ విధంగా మిమ్మల్ని నాకు దగ్గర చేసింది.

కానీ అసలు మీరు ఎందుకని వెళ్పోయారండీ? ఎందుకంత తొందరపడ్డారు? ఏమంత వయసైందని? మీరు లేకపోతే మీ పిల్లలు ఎలా తట్టుకోగలరనుకున్నారు? ఎంత ప్రేమగా పెంచారు వాళ్లని.. మీ ప్రపంచమంతా వాళ్ళతోనే నింపుకుని, వాళ్ళే లోకమై బ్రతికారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు దిగమింగారో, ఎన్ని అవమానాలు సహించారో మీ అబ్బాయి చెప్పినప్పుడూ, తల్చుకున్నప్పుడూ నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మొదట్లో మీ వైఖరి వల్ల మీపై కోపం ఉన్నా కూడా, మీలో ఉన్న ఈ గొప్ప తల్లిప్రేమను చూసి నేను చలించిపోతూ ఉండేదాన్ని. మీపై కొండంత గౌరవం ఉండడానికి కూడా కారణం ఇదే. మీలాంటి గొప్ప తల్లిని నేనెక్కడా చూడలేదండీ. నిజం! ఖాళీగా ఎప్పుడూ ఉండేవారు కాదు. ఓపిక ఉన్నంతవరకూ చివరిదాకా తోచిన సాయం చేశారు. మీరు బాలేకుండా ఉండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండిపోండి.. అంటే అలాగే అనేసి, కాస్త బావుండి నడవగలిగే ఓపికరాగానే బ్యాగ్ సర్దేసేవారు. నేను కోప్పడితేనేమో, "అమ్మలా కోప్పడుతున్నావు.. పోనీలేమ్మా. ఇక్కడ కూర్చునేది అక్కడ కూర్చుంటా. నేను చేసేదేముందని..పిల్లలకి కాపలా. అంతేగా" అనేసి నా నోరు మూసేసేవారు. వచ్చి వెళ్పోయే ప్రతిసారీ మాత్రం "వస్తాలే. బాధపడకు. ఎప్పటికైనా మీ దగ్గరకు రావాల్సిందాన్నేగా. చివరిరోజులు పెద్దకొడుకు దగ్గరే.." అనేవారు. మాట నిలబెట్టుకున్నారు. చివరికి వచ్చారు. కానీ ఎలా వచ్చారు? కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లుగా... ఎంత పిలిచినా పలకలేనంత నిద్రలోకి వెళ్పోయి, ఎన్ని మాటలు మాట్లాడినా కళ్లు విప్పలేనంత నిద్రలోకి వెళ్పోయి వచ్చారు. మీరు అదృష్టవంతులు. అనాయాస మరణం ఎందరికి దక్కుతుంది?  పది నెలలు అయిపోయాయి అత్తయ్యగారూ... మేమే ఇంకా నమ్మలేకపోతున్నాం. ఇంకా ఆ షాక్ లోంచి బయటకు రాలేకపోతున్నాం. నిత్యం తలుస్తున్నాం. మీరు నాకు అప్పుడప్పుడూ చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ఎంతగా పనికి వస్తున్నాయో, ఎంత అనుభవంతో చెప్పారో  కదా అని రోజూ అనుకుంటూ ఉంటాను. మిమ్మల్ని తలిచినప్పుడల్లా ఎటువంటి గిల్టీనెస్ నాకు లేకుండా చేసి వెళ్పోయారు. అదీ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం.

ఇవాళ మీ పుట్టినరోజు! పదిహేనేళ్ళుగా మీకు పుట్టినరోజుకు చీర పెట్టడం అలవాటు. ఈసారి ఎవరికి పెట్టను? కొని అయితే ఉంచాను. ఎవరికో ఒకరికి పెడతానులెండి. చీర పెట్టినప్పుడల్లా "నా పుట్టినరోజు నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోవు" అనేవారు. పొద్దున్నుంచీ మీ మాటలు, అలోచనలు, అవే తలపులతో గడిపాను. ఎవరికైనా సరే కడుపునిండా భోజనం పెట్టడం మీకు ఇష్టం కదా అందుకని మీ అబ్బాయితో అన్నదానానికి డబ్బు కట్టించాను. మీరు తప్పకుండా ఆనందిస్తారని నాకు తెలుసు.

మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీర్వచనాలు మాకు తప్పక ఉంటాయి. అవే మాకు శ్రీరామరక్ష. చాలా రాసేసాను. ఇంక ఉంటానండీ, missing you...
                                                        ప్రేమతో.. మీ కోడలు.

Friday, March 15, 2019

ఆత్రుత







లిటరల్  గా లాప్టాప్ పై పేరుకున్న దుమ్ముని గుడ్డముక్కతో తుడిచి, ఈ అక్షరాలు రాయడం మొదలుపెట్టాను. ఉదయం నుంచీ మనసులో తిరగాడుతున్న భావాలను అక్షరాలుగా మార్చాలన్న ఆత్రమే దానికి కారణం. క్రింద ఫ్లోర్ లో జరిగిన సహస్రనామ పారాయణ పూర్తయి ఇంట్లోకి అడుగుపెట్టగానే నా కోసం ఎదురుచూస్తున్న కొరియర్ ని చూడగానే ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం కలిగింది. 19-27 మధ్య అంటే నెక్స్ట్ వీక్ లో రావాల్సిన పుస్తకం అప్పుడే వచ్చేసింది. ఇదివరకూ కష్టపడి బస్సుల్లో కాసేపూ, కాలినడకన కాసేపూ వెళ్ళి, నాలుగైదు షాపుల్లో వెతికితే కావాల్సిన పుస్తకాలు దొరికేవి. ఇప్పుడు కేవలం ఫోన్ లో ఓ బటన్ నొక్కితే చాలు కావాల్సిన పుస్తకం ఇంటికొచ్చేస్తోంది. ఎంత హాయో! కానీ చదవడానికి సమయం ఏదీ? చదవాలని గత కొన్నేళ్ళుగా కొంటున్న రెండు, మూడు వందల పుస్తకాలు అలా క్యూ లో నిలబడి ఉండగా... మధ్యలో ఎప్పుడో మూడేళ్ల క్రితమేమో నా reading genre మారిపోయింది. సొంత సంపాదనతో కొంటున్నానన్న ఇష్టం వల్లనో, నేను దృష్టి పెట్టిన కొత్త సాహితీ ప్రకియపై ఉన్న మక్కువ వల్లనో ఆర్డర్ చేసి తెప్పించుకున్నవి చాలా వరకూ చదివేస్తున్నాననే చెప్పాలి. ఇప్పుడసలు పాత పుస్తకాలపై ధ్యాస పోవట్లేనే లేదు. నా సాహితీ తృష్ణ కేవలం నా కొత్త సాహితీ ప్రకియపైనే స్థిరంగా నిలిచిపోయింది. ఎందుకో ఇవన్నీ కొన్నాను.. ఇప్పుడిక ఏం ఉపయోగం నాకివి? అనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి.  గతమంతా నిరర్థకం, నేటి ఉనికే యదార్థం! అనే స్థితికి చేర్చిన ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞురాలిని. కానీ పాత పుస్తకాల్లో చాటిచెప్పాల్సిన కొన్ని ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు ఉన్నాయి. సమయం అనుకూలిస్తే వాటి గురించి రాయాలనే సంకల్పం మాత్రం ఉంది.

ఇంతకీ అసలు చెప్తున్న కథ నాకు వచ్చిన కొత్త పుస్తకం గురించి కదూ.. ఆత్రంగా చదవాలని కవర్ కట్ చేసి పుస్తకం బయటకు తియ్యగానే, ఈమధ్య నాలో బలంగా ఏర్పడిన ఒక లక్ష్యం కళ్లముందు కనబడగానే ఎంతో ఆనందం. ప్రేమగా అట్టని తడిమాను. పేజీలు కాస్త అటు ఇటు తిప్పేసరికీ భోజనాల టైమైంది. తినేస్తే హాయిగా పుస్తకం చదువుకోవచ్చు కదా అని గబగబా ఆ పని పూర్తి చేసి, అంట్లు పెడదామని బాల్కనీ లోకి వెళ్లగానే మిషన్లో ఆరిన బట్టలు కనబడ్డాయి. అయ్యో ఇవి ఆరెయ్యనేలేదు అనుకుని గబగబా ఆపని చేసి, బకెట్టు పెట్టేద్దామని బాత్రూమ్ లోకి వెళ్లగానే పొద్దున్నే మిషన్ లో వెయ్యకుండా అతి ప్రేమగా నానపెట్టిన తెల్ల బట్టలు కనబడ్డాయి. చచ్చాన్రా దేవుడా అనుకుని గబగబా అవి ఉతికి ఆరేసి లోపలికి వస్తూంటే నిన్న బయటకు వెళ్తూ వెళ్తూ మడతపెట్టకుండా కుర్చీలో పాడేసిన నిన్నటి బట్టల కుప్ప దీనంగా పిలిచింది. లాభంలేదు అనుకుని అవన్నీ మడతలు పెట్టి, అలమార్లలో సర్దేసి హాల్లోకి వచ్చేసరికీ సోఫాలో మావిడల్లం కవర్ కోపంగా చూసింది. క్రితం నెల్లో హార్టీకల్చర్ ఎక్స్పో లో ఎంతో మోజుతో కొన్న అరకేజీ మావిడల్లం! పచ్చడి చేద్దామని ఇప్పటికి నాలుగుసార్లు ఫ్రిజ్ లోంచి తియ్యడం, టైమ్ లేక సాయంత్రమో రాత్రో తిరిగి ఫ్రిజ్ లో పెట్టేయడం. మావిడల్లం కొన్నప్పుడు తాజాది కావడం వల్ల ఇంకా బాగుంది. లేకపోతే ఎండిపోయేదే. ఇవాళన్నా పచ్చడి చేసేయాలి అని దాని పని పట్టాను. ఈలోపూ పనిమనిషి వచ్చే టైమైపోయి, తను వచ్చేసింది. తను పని పూర్తిచేసి వెళ్ళగానే ఇంక రొటీన్ మామూలే. మొక్కల పని, ఆ తర్వాత వాకింగ్, పూజ, మళ్ళీ వంట.. వరుస పనులే. పొద్దున్ననగా పుస్తకం వస్తే రాత్రి దాక చదవడానికి కాదు కదా ఈసారి తిరగెయ్యడానికే టైం లేదు. క్లైమాక్స్ లో ఏమౌతుందో అర్థం కాకుండా ఉన్న సస్పెన్స్ సినిమా ప్రేక్షకుడిలా ఉంది నా ఆత్రుత. రేపటికైనా ఈ పుస్తకం చదవడానికి టైమ్ దొరికితే బాగుండు. 

ఈ పోస్ట్ రాయకుండా ఈ పది నిమిషాలూ పుస్తకం చదవడానికి వాడుకుని ఉండచ్చు. కానీ దుమ్ము పేరుకున్న లాప్టాప్ పై దృష్టి పడగానే ఎందుకనో ఇవాళ రాయాలనిపించింది. కారణాలు లేకుండా ఏమీ జరగవు కదా. తీరిగ్గా ఊసుపోకుండా గడిపేలాంటి సమయం నాకు ఐదేళ్ల క్రితమూ లేదు. ఇప్పుడూ లేదు.  ఒకప్పుడు ఇష్టమైనవి, ఇవే నా తోడు అనుకున్న వాటి కోసం తీరుబడి చేసుకుని, పనిమనిషిని పెట్టుకోకుండా కూడా చాలా పనులే చెయ్యగలిగాను. ఏనాడైతే కొన్ని భ్రమలు బూడిదయ్యాయో, అప్పుడిక తీరుబడిలేని మరో దినచర్యని తయారుచేసుకుని, భగవంతుడు చూపెట్టిన మరో దారిలో నడక మొదలుపెట్టాను.

పుస్తకం చదవడం త్వరగా పూర్తయితే.. ఆ కబుర్లు త్వరలో పంచుకుంటాను.