సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కొన్ని పుస్తకాలు. Show all posts
Showing posts with label కొన్ని పుస్తకాలు. Show all posts

Friday, August 2, 2019

ఇప్పపూలు

  


                                                  

ఆహ్లాదానికో, పొద్దుపోవడానికో చదివే కాలక్షేపపు సాహిత్యంలా కాకుండా వివేకాన్నీ, ఆలోచననీ, ఆవేశాన్నీ నిద్ర లేపే ఉపయోగకరమైన సాహిత్యం మరింతగా అందుబాటులోకి రావాలని  తోపించడమే "ఇప్పపూలు" కథాసంకలనం ప్రత్యేకత. "ఇప్పపూలు" కథలు పాఠకులని నాగరిక సమాజం నుండి అమాంతం అడవుల్లోకి తీసుకుపోతాయి. ప్రకృతి శోభ, కొండా కోనా అందాలు, రకరకాల పశుపక్ష్యాదులు, వన్యమృగాలు, అటవీ సంపద, గిరిజనుల పాటా పదం.. అన్నింటినీ చూసి ఆస్వాదించి ఆనందించే లోపూ అక్కడి గిరిజనుల జీవితాలలో అలుముకున్న అలజడుల తాలూకూ విషాదం హృదయాలను దిగాలు పెట్టేస్తాయి..! వీళ్ళ కోసం మనమేం చెయ్యగలము? అన్న ప్రశ్న డ్రిల్లింగ్ మషీన్ లా మెదడుని దొలిచేస్తుంది. గిరిజన తెగలన్నింటికీ ఒకో ప్రత్యేకత, ఒకో దైవం, విశ్వాసాలూ, నమ్మకాలూ ఉన్నాయి. ఎన్ని విశిష్టతలు ఉన్నా వీరందరూ గురైయ్యే దోపిడీ విధానం మాత్రం ఒక్కటే! కాంట్రాక్టర్లు, దొంగ వ్యాపారులు కాలుపెట్టాకా పల్చబడిన అడవి, గిరిజనుల భూమి తగాదాలు, వారి నిరక్షరాస్యత వల్ల జరిగే మోసాలూ.. అవన్నీ గిరిజన యాస, భాష, మాండలీక పదజాలంలో రాస్తేనే చదువరులకి గిరిజనుల ఆవేదన వాడిగా తగలాలనేనేమో పుస్తకంలోని చాలా కథలు ఆయా ప్రాంతాల మాండలీకాలనూ, గిరిజన యాసనూ మనకు పరిచయం చేస్తాయి.

2009 వరకూ గిరిజన సంచార తెగలపై కథాసంకలనం రాలేదు కాబట్టి గిరిజన సంచార తెగల జీవితం, సంస్కృతి, వాటి పరిరక్షణకై సాగే సంఘర్షణల ఇతివృత్తంతో ఒక  కథాసంకలనం తేవాలనే సంకల్పంతో 2009లో ప్రతిభాప్రచురణలు వారు "ఇప్పపూలు" అనే కథా సంకలనాన్ని వెలువరించారు సంపాదకులు ప్రొ.జయధీర తిరుమల రావుజీవన్ గార్లు. 1930 నుండీ వస్తున్న గిరిజన, సంచార తెగల కథాసాహిత్యాన్ని తమ శక్తిమేరకు పరిశీలించి, లభ్యమైనంతలో ఉత్తమ రచనలను ఈ సంకలనంలోకి తెచ్చామని, ఇంతకన్నా సమగ్రమైన సంకలనం తేవాలనే ఆశనీ వ్యక్తపరుస్తూ అందుకు తగ్గ ప్రోత్సాహాన్నీ అభిలషించారు. పుస్తకాన్ని "గిరిజన హక్కులు మానవహక్కులేనని ఎలుగెత్తిన బాలగోపాల్ కు.." అంకితమిచ్చారు. కథల చివరన ప్రచురణా కాలం తేదీ వివరాలు, పుస్తకం చివరన కథారచయితల వివరాలూ, చిరునామాలు అందించారు.

కథాన్వేషణలో 1930 మొదలు 1970 వరకూ జరిగిన కథారచనలు పరిశీలిస్తే గిరిజనజీవితాల ఇతివృత్తంతో వేళ్ల మీద లెఖ్ఖించగలిగిన కథలే లభ్యమయ్యాయట. 1970లో శ్రీకాకుళ, తర్వాత1980 ఉత్తర తెలంగాణా గిరిజన ఉద్యమాల నేపధ్యంలో అనేక కథలు వచ్చినా, ఉద్యమానంతరం అవీ మందగించాయిట. వాటిల్లో కూడా అదీవాసీలపై జరుగుతున్న ఆర్ధిక దోపిడీ గురించి రాసినంతగా గిరిజన సంస్కృతిపై నాగరిక సంస్కృతి చేస్తున్న దాడిని గురించిన కథలు కనబడలేదట. అభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరున జరుగుతున్న అనేక విధ్వంసాల కారణాలుగా పెద్ద ఎత్తున నిర్వాసితులౌతూ, మనుగడే ప్రశ్నార్థకంగా మారిన గిరిజనుల దయనీయ స్థితిగతుల గురించి ఈతరం కథకులు దృష్టిపెట్టకపోవడం శోచనీయమంటారు ప్రచురణ కర్తలు.

ఈ పుస్తకంలోని ముందుమాటలు చాలా ప్రభావవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వందేళ్ళ తెలుగు కథ వాస్తవికత, అవాస్తవికత, హాస్యం, శృంగారం, స్త్రీవాదం, కుటుంబ సమస్యలు, సమాజంలోని ఇతర సమస్యలు మొదలైనవాటి గురించే ఎక్కువ మాట్లాడింది కానీ అడవిలో పుట్టి పెరిగి, ప్రతి చెట్టుపుట్ట, ఆకూపువ్వూ తమ సొత్తైనా కూడా అడుగడుగునా ఆంక్షలకు లోబడుతూ అన్యాయానికి గురౌతున్న గిరిజనుల వ్యధలను, ఆరాట పోరాటాలనూ అక్షరీకరించడంపై కథారచయితలు దృష్టి సారించలేదన్న ఆవేదనని సంపాదకులు తమ ముందుమాటలో వ్యక్తపరిచారు. శ్రీకాకుళం, నల్లమల, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల్లో ఉన్న కోయ, గోండు, పరిధాను, బంజార, సవర, మేరియా, చెంచు, కోదు వంటి ౩౩ గిరిజన తెగల గురించిన 29 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సంచార,అరసంచార తెగలైన గంగిరెద్దులు, నక్కల వారి గురించి రెండు కథలున్నాయి. "మీటూ భూక్య"అనే మౌఖిక కథ కూడా ఉంది. ఏడాదిలో ఆరునెలలైనా ఊరూరా తిరిగి జీవనాలు సాగించే మందహెచ్చులు, డక్కలి, పెద్దమ్మలవారు, కిన్నెర వాద్యకారులు, శారదలు మొదలైన సంచార,అర సంచార సమూహాల గురించి ప్రత్యేకంగా మరో సంకలనాన్ని తేవాలనే అభిలాషను ప్రచురణకర్తలు వ్యక్తం చేసారు.

సంకలనంలోని మొదటిదైన "చెంచి" (భారతి,1932) కథలో అమాయక జంటైన చెంచి,చెంచుగాడు ఒకరికోసం ఒకరు పడే తాపత్రయం, కథాంతం మనసును తడిచేస్తాయి. "పులుసు" కథలో బోడేమ్మ ముసలిపై పోలీసు బూటూ కాలు పడినప్పుడు మనలో మరిగే ఆవేశం "ఇప్లవం వొర్దిల్లాలి" అని ఆమె అరిచినప్పుడు చల్లబడుతుంది. ఎ.అప్పల్నాయుడు గారి "అరణ్యపర్వంలో మాకీ యాపీసులొద్దు, ఆపీసర్లొద్దు,అప్పూ సప్పులొద్దు. ఆకటి సబ్సిడీలొద్దు, వొద్దు బాబో వొద్దు. మీ కాయితం కలాల వాయికొంటపాళీలాటలొద్దే వొద్దు! మమ్మల్ని పావులు మింగేత్తాయి.అవును బావ్. మమ్మల్నొగ్గీయండి. యిది నా ఒక్కడి గోశ కాదు. మా అడవి బతుకోలందరి గోస..! " అని ప్రార్ధించే కొయ్యంగాడి మాటలు గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలతో పాటూ నాగరీకుల వికృతరూపాన్నీ కళ్లముందుంచుతాయి. ఈ కథ తరువాయి కథలన్నీ గిరిజనలపై కాక, వారి ఆస్తులపై, వన సంపదలపై జరుగుతున్న రకరకాల అన్యాయాలను, దోపిడీ విధానాలను గురించి చెప్తాయి. అభివృధ్ధి, వన్యపరిరక్షణ ముసుగులో జరుగుతున్న వివిధ అక్రమాల గురించి చదవడం ఆవేశాన్నే కాక, తెలివైన మనిషులు తెలివిలేని మనిషులను ఇన్ని రకాలుగా మోసం చెయ్యగలరా అన్న ఆశ్చర్యం కూడా కలగుతుంది. "జంగుబాయి" కథలో గోండుల ఆచారాలూ, మూఢవిశ్వాసాలనూ ఒకపక్క, కొత్తగా అడవికి వచ్చిన స్కూల్ మాష్టారి భార్యకు ఎదురైన అనుభవాలూ, భయాలూ, కొన్ని విషయాలలో కలగజేసుకోవాలనున్నా చెయ్యలేకపోయిన ఆమె నిస్సహాయతను కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి.

వాడ్రేవు వీరలక్ష్మి గారి "కొండఫలం"లో గిరిజనుల భూమి తగాదాలను పరిచయం చేస్తే, "గోరపిట్ట", "ఆర్తి", "కలలోని వ్యక్తి","గోస","పయనం" మొదలైన కథలు గిరిజన తెగల నిస్సహాయతను, తద్వారా ఉద్యమం దిశగా సాగిన కొందరి పయనాలనూ తెల్పుతూ తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. కొండవీటి సత్యవతి గారి "గూడు" లో తండావాసులందరికీ ఇళ్ళూ కట్టించాలని ఆఫీసర్ చందన పడే తాపత్రయం స్ఫూర్తిదాయకంగా ఉండి, ఆఫీసర్లందరూ ఇలా పాటుపడితే గిరిజనుల బ్రతుకులు ఎంత మెరుగౌతాయో కదా అనిపిస్తుంది. "అరణ్య రోదన", ""పోటెత్తిన జనసంద్రం" రెండు కథలూ పోలవరం ప్రాజక్ట్ గురించిన ఎన్నో విషయాలను ఎరుకపరుస్తాయి. ఇవన్నీ ఒకరకమైతే చివరలో రచనైన "మూగబోయిన శబ్దం" కథ ద్వారా రచయిత్రి పద్దం అనసూయ చెప్పినట్లు ’మతమే లేని కోయ జాతిలోకి మతం వేరుపురుగులా ప్రవేశించిందన్న ’ సత్యం కలవరపరుస్తుంది. ఈ కథల్లోని మాన్కు, శిడాంశితృ, డోబి, యిస్రూ, వడ్డియా, గైతా మొదలైన చిత్రమైన పేర్లు, ఆ పేర్ల తాలూకూ మనుషులూ వాళ్ళ అమాయకత్వాలతో సహా గుర్తుండిపోతారు. డోలోళ్ళ పూర్భం గానం , గుస్సాడి నృత్యం, ధింసా నృత్యం.. మన:ఫలకంపై ఆ నృత్యాల తాలూకూ చిత్రాలను చూపెడతాయి. "ఆకాశం పండిన పత్తిచేను గాలికి కదులుతున్నట్లుగా ఉంది..", "పొట్టలు విచ్చుకుని తెల్లగా నవ్వుతూ భూమి మీద రాలిన నక్షత్రాల్లా పత్తిచేలు..", "అడవిలో కాస్తున్న ఎండ కూడా వెన్నెలలా చల్లగా ఉంది..", "గూడేనికి పచ్చల హారం తొడిగినట్లుగా అన్నివైపులా చేలూ,చెలమలూ.." మొదలైన అలంకార వాక్యాలు అడవి అందాలను కళ్ళ ముందు నిలబెడతాయి.

ఇటువంటి గుర్తుండిపోయే కథల ఎంపికే కాకుండా తెలుగు కథాసాహిత్యంలో తొలి గిరిజన కథకుడుగా భావించే చింతా దీక్షితులు కన్నా ముందే గూడూరు రాజేంద్రరావు "చెంచి" అనే కథను రాసారన్న సమాచారం సంపాదించడం సులభసాధ్యమైన విషయం కాదు. ఇలానే పుస్తకం పేరుని గురించి వివరిస్తూ గిరిజ తెగలలో, వారి సమాజంలో, కర్మకాండలో, పూజలో, విశ్వాసాలలో, నమ్మకాలలో ఇప్పపూలకి ఎంతో ప్రాధాన్యత ఉన్నందువల్ల; ఇంతకు మునుపే బోయి జంగయ్య గారు "ఇప్పపూలు" పేరుతో తమ కథా సంపుటిని వెలువరించినా, ఈ సంకలనానికి వారి అనుమతితో, "గిరిజన సంచార తెగల కథలు" అనే ఉప శీర్షికతో ఇప్పపూలు పేరునే నిర్ణయించామని తెలియపరచడం మొదలైనవాటి వల్ల ఈ పుస్తకం తయారీ వెనుక ఉన్న సంపాదకుల శ్రధ్ధ, గిరిజనుల సంక్షేమం పట్ల వారి తపన వెల్లడౌతాయి.


Monday, May 6, 2019

మహాత్మునికీ గాంధీకీ మధ్య

                            
                             


భారతదేశం యావత్తూ మహాత్మునిగా కొనియాడిన బోసినవ్వుల బాపూకి భార్యా, పిల్లలు ఉంటారని, దేశాన్ని ఒక్క త్రాటిపై నడిపించి నిర్దేశించడం మాత్రమే కాక బాపూజీకి వ్యక్తిగత జీవితం కూడా ఉంటుందనే ఆలోచన చిన్నతనంలో ఉండేది కాదు. "గాంధీ" చిత్రం ద్వారా మాత్రం వారి వ్యక్తిగత జీవితం గురించి, కస్తూరి బా గురించీ కొన్ని వివరాలు తెలిసాయి. అయితే వారి పిల్లల గురించిన వివరాలు మరెక్కడా చదివిన గుర్తు లేదు. కాలేజీ రోజుల్లో ఒక ఆంగ్ల పత్రికలో వారి మొదటి కుమారుడి గురించి ఆర్టికల్ చదివి, భద్రపరిచిన గుర్తు. అప్పటి నుండీ హరిలాల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. కొన్నేళ్ళ క్రితం నటుడు అక్షయ్ ఖన్నాతో అనిల్ కపూర్ "గాంధీ, మై ఫాదర్" అనే చిత్రం నిర్మించారు. ఒక నవల ఆధారంగా చిత్రాన్ని తీసారని అన్నారు. ఆ నవల నాకు దొరకలేదు కానీ ఇన్నేళ్ళ తెరువాత ప్రముఖ గుజరాతీ రచయిత దినకర్ జోషీ నవల(ప్రకాశవో పరభావో)కు కూచి కామేశ్వరి గారి అనువాదం నాకు లభించింది.  అదే "మహాత్మునికీ గాంధీకీ మధ్య"! బాపూని ఒక సాధారణ తండ్రిలా మనకు చూపెట్టే కథ ఇది. గాంధీ మహాత్ముని పెద్ద కుమారుడైన హరీలాల్ జీవిత కథ. ఒక వ్యధాభరితమైన యదార్థ గాధ. 

ఈ నవల ద్వారా నాకొక మంచి రచయిత పరిచయమయ్యారు. దినకర్ జోషీ గారి వంటి డేడికేటెడ్ రైటర్ గురించి ఇప్పటికైనా నేను తెలుసుకోవడం చాలా ఆనందకరమైన సంగతి. కథా సంకలనాలు, నవలలూ, అనువాదాలు, సాహిత్య వ్యాసాలు అన్నీ కలిపి ఇప్పటివరకూ జోషీ గారివి 152 పుస్తకాల ప్రచురించబడ్డాయి. ఎనభై వసంతాలు దాటిన వయసులో కూడా సాహిత్యాభివృధ్ధికి ఆయన ఇంకా చేస్తున్న సేవ అపారమైనది. గుజరాతీ రచనలను ఎక్కువమందికి చేరవేయాలనే సదుద్దేశంతో ఆయన "గుజరాతీ సాహిత్య ప్రదాన్ ప్రతిష్ఠాన్ " అనే సంస్థను మొదలుపెట్టారుట. “We talk about Shakespeare, Tennyson…and Dostoevsky, but we don’t read books of our own languages. We lose out on a lot. It doesn’t make sense..” అంటారాయన. ప్రాంతీయ భాషా సాహిత్యానికి ఎంత ప్రాధ్యాన్యత ఉందో, మన సాహిత్యానికి మనం ఎంత విలువ ఇవ్వాలో తెలియచెప్తూ ఆయన అన్న ఈ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. ఎవరి భాషను వారు నిలబెట్టుకోవడానికి సాహిత్యకారులు, రచయితలు ఎంతటి కృషి చేయ్యవలసి ఉందో ఈ మాటలు చెప్తాయి.

"మహాత్మునికీ గాంధీకీ మధ్య" నవలలో ఏ ఒకరి పక్షాన్నీ వహించకుండా బాపూకీ, వారి కుమారుడికీ మధ్యన నిలబడి, ఇధ్దరి దృష్టికోణాల్లోంచీ వారి వారి జీవితాలను మనకు చూపెట్టి; తుది నిర్ణయాన్ని పాఠకులకే వదిలేయడం రచయిత సామర్ధ్యానికి నిదర్శనం. నాకు మాత్రం వారు బాపూ వైపుకి సమానమైన న్యాయం చూపెట్టడానికి ఎక్కువ కష్టపడ్డారేమో అనే అనిపించింది. వ్యక్తిగతంగా గాంధీజీ పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ హరిలాల్ జీవితగాధ చదువుతున్నంత సేపూ హరిలాల్ పై అవ్యాజమైన కరుణ కలుగుతుంది. జాతిని నడిపించిన మహాత్ముడి కుమారుడికా ఈ దురవస్థ? అయ్యో బిడ్డా.. ఎన్ని ఇక్కట్లపాలయ్యావయ్యా అని మనసు దు:ఖపడుతుంది. అతడి బలహీనతలపై జాలి కలుగుతుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా అతడు చూపే వివేకం, వాటిని అతడు ఎదుర్కున్న నేర్పూ, సామర్ధ్యాలను చూసి ఆశ్చర్యం వేస్తుంది. చదువుతునంత సేపూ దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు గాంధీ గారు అని సరిపెట్టుకోలేకపోయాను. కాస్తంత ఆధారం, రవ్వంత ప్రేమ, కొద్దిపాటి మార్గదర్శకత్వం దొరికి ఉండుంటే అతడి జీవితం ఏ ఉన్నత శిఖరాల వైపుకు పయనించి ఉండేదో అన్న ఆలోచన రాకమానదు.  ఏదేమైనా గాంధీజీ ఒక చోట అన్నట్టు కర్మ ఫలాన్ని మార్చడం ఎవరి తరం?! ఆ తల్లికి ఆ ఆక్రోశం, ఆ తండ్రికా అవమానం, ఆ బిడ్డకా పతనం రాసిపెట్టి ఉన్నాయి..!!

హరిలాల్ మరణవార్తతో, కేవలం వేళ్ళపై మాత్రమే లెఖ్ఖపెటగలిగిన సభ్యుల సమక్షంలో జరిగిన అతని అంత్యక్రియ ఘట్టంతో మొదలౌతుంది హరిలాల్ జీవితగాథ. ఉత్సాహవంతుడైన యువకుడిగా గాంధీ బాటలో సత్యాగ్రహంలో, పలు స్వాతంత్ర్యౌద్యమాల్లో పాల్గొన్న ఎంతో తెలివైన వ్యక్తిగా, ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించే ప్రాసంగికుడిగా పాఠకులకు పరిచయమైన హరిలాల్ జీవనపయనం పాఠకుల ఉత్సాహాన్నీ, ఆశ్చర్యాన్నీ చివరిదాకా ఆపకుండా నడిపిస్తుంది. అతడి వ్యక్తిత్వ పతనం ఎలా మొదలైంది, ఎటువంటి దీనావస్థలో చివరికి ఒంటరిగా మిగిలాడు అన్న సంగతులు పాఠకుడి కళ్ళని చెమ్మగిల్లకుండా ఆపలేవు. ఆ పతనానికీ, జరిగిన విషయాలన్నింటికీ మూలకారణంగా స్వకర్మనో, తల్లిదండ్రులనో కాక విధిని నిలబెట్టడం అనేది జోషీ గారి విఙ్ఞతకు నిదర్శనం.

పుస్తకం పూర్తయిన తర్వాత అంతర్జాలంలో హరిలాల్ గురించిన మరిన్ని వివరాల కోసం వెతుకుతూంటే ఎన్నో ఆశ్చర్యకరమైన వివరాలు దొరికాయి. పలు వార్తాపత్రికల్లో అచ్చయిన గాంధీగారి స్వదస్తూరీ తాలూకూ ఉత్తరాలూ.. కొన్ని సంగతులు.. వాటిని సొమ్ము చేసుకోవడానికి వాటి హక్కుదారులు చూపిన ఉత్సుకత.. వగైరా వగైరా! వాటి వల్ల అర్ధమైంది ఏమిటంటే, హరిలాల్ జీవితంలోని కొన్ని సత్యాలని విపులీకరించకుండా రచయిత ఎంతో శ్రధ్ధతో ఈ కథని తీర్చిదిద్దారని, తద్వారా గాంధీమహాత్మునికి, హరిలాల్ కి కూడా ఎంతో గౌరవాన్ని మిగిల్చినవారయ్యారని!! శ్రీ దినకర్ జోషీ పట్ల మరింత గౌరవం పెరిగింది. ఈ కథ అనే కాదు కానీ కొన్ని చారిత్రక విశేషాలను, మనుషులను గురించి చదివిన ప్రతిసారీ నన్నో ప్రశ్న వేధిస్తూ ఉంటుంది - గతించిన చరిత్ర తెలిసినవాళ్ళ కన్నా తెలియనివాళ్ళే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, ఎవరిదైనా గాథ రాసేప్పుడు వారి చరిత్రల్లోని లోటుపాట్లని, చీకటి కోణాలను యదార్థం పేరుతో తెలియనివాళ్ళకు తెలియచెప్పి ఆ మనుషులకు అప్పటిదాకా ఉన్న గౌరవాన్ని తుడిచిపెట్టేయడం అనేది ఎంతవరకూ సమంజసం? అని! ఇప్పుడా గతించిన చీకటిని తవ్వుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది? సమాజం, మానవాళి మరింతగా ఎదగటానికి మాత్రమే చరిత్ర ఉపయోగపడాలి. అంతే తప్ప ఎవరికీ ఏమాత్రం ఉపయోగకరం కాని గత కాలపు అభ్యంతకరమైన విశేషాలనూ, వివరాలనూ కెలికి, వెలికితీయడమనేది గతించిన వారిని అవమానించడమే కాక వ్యర్థ ప్రయాస అన్నది నా స్వాభిప్రాయం. 

ఈ నవల గురించి మరి కొన్ని వాక్యాలు రాస్తే పుస్తకాభిమానులతో ఈ పుస్తకం చదివించాలన్న నా ఉద్దేశం చప్పబడిపోతుందన్న అభిప్రాయంతో వ్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. ఈ నవల ద్వారా గాంధీగారి గురించి, కస్తూరి బా గురించీ, వారి ఇతర కుటుంబ సభ్యుల గురించీ, మనుషుల్లోని భిన్న స్వభావాల గురించీ ఎన్నో తెలియని విషయాలను తెలియపరిచిన శ్రీ దినకర్ జోషీ అభినందనీయులు.


Friday, April 19, 2019

అల్లం శేషగిరిరావు కథలు




సమకాలీన సామాజిక పరిస్థితులను, జీవితాలనీ ముందు తరాలకు అద్దం పట్టి చూపించే ఉత్తమ సాహితీ ప్రక్రియ కథానిక. తెలుగు కథానిక ఎందరో కథకుల చేతుల్లో ఎన్నో రూపాంతరాలను చేందుతూ వందేళ్ళ మైలు రాయిని కూడా దాటి ఇంకా మున్ముందుకు పయనిస్తోంది. ఇటువంటి సుదీర్ఘ ప్రయాణంలో కొందరు ఉత్తమ కథకులు తమ కలాల ద్వారా సమాజానికి అందించిన స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ ప్రతి తరానికీ పరిచయం చేయాలనే సదుద్దేశంతో సమాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తూ ’అరసం’ గుంటూరుజిల్లా శాఖవారు, ప్రముఖ కథకుల ప్రసిధ్ధ కథానికలను సమర్ధులైన సంపాదకులచే ఎంపిక చేయించి "కథాస్రవంతి"  శీర్షికతో పలు కథాసంపుటాలు ప్రచురించారు. వాటిలో ఒక కథాసంపుటి "అల్లం శేషగిరిరావు కథలు". జనవరి,2015 ప్రచురణ.


విలక్షణమైన శైలితో,అరుదైన కథావస్తువుతో రచనలు చేసిన శేషగిరిరావు గారు 17 కథలు, ఒక రేడియో నాటిక రాసారు. "శబ్దాన్ని అక్షరీకరించడం, నిశ్శబ్దాన్ని దృశ్యీకరించడం" తెలిసిన ఆయన తెలుగు హెమింగ్వే గా ప్రసిధ్ధిగాంచారు. వీరి కథలు ఇంగ్లీషు, మళయాళం, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి. ’అరణ్యఘోష ’, ’మంచి ముత్యాలు’ వీరి కథా సంపుటాలు. "బాధతో, భయంతో, బాధ్యతతో" రచించిన శేషగిరిరావుగారి కథలు మనిషికి మనిషి చేసే అన్యాయానికి దర్పణాలు. వీరికి 1981 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, నూతలపాటి గంగాధరం స్మారకసాహిత్య పురస్కారం లభించాయి. 



ఈ సంకలనంలో ప్రిన్స్ హెమింగ్వే, వఅడు, ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్, చీకటి, నరమేథం, శిధిల శిల్పాలు.. మొత్తం ఆరు కథనికలు ఉన్నాయి. అన్నీ కూడా చాలావరకూ వేట కథలే. వేటకథలు అల్లంవారి ప్రత్యేకత.  "ఎడిటర్లూ, స్నేహితులూ అంతా అడవి నేపథ్యంలోనే కథలు రాయమంటే రాస్తూ అలా ముద్రపడిపోయాననీ, ఆ ముద్రను కాపాడుకోవడం కోసం రాత్రిపూట కొండల్లో, చిట్టడవుల్లో తిరుగుతూ నానా యాతనలూ పడుతున్నానని” హాస్య ధోరణిలో రచయిత తనకు తెలిపిన వైనాన్ని పుస్తకం ముందుమాటలో ఏ.ఎన్.జగన్నాధశర్మ గారు తెలిపారు. ఈ కథలన్నీ కూడా సమాజంలోని కొన్ని అట్టడుగు వర్గాల జీవనవిధానాలను, వారి కన్నీళ్ళను, వేదనలనూ కళ్ళకు కట్టినట్టు చూపెడుతూ ఒక రకమైన ఆర్ద్రతతో మనసును కమ్మేస్తాయి. సామాజిక వ్యంగ్యానికి నిదర్శనమనిపించే "నరమేథం" కథలో ఒక నిరుపేద ఢక్కువాడి జీవితం, వాడి ఆకలి, నిస్సహాయపు చావు గుండెల్ని పిండేస్తాయి.  "నరనారాయణుల ధన,మాన ప్రాణాల రక్షణకి సాయుధులైన పోలీసులు తుపాకులతో గుడిని గస్తీ కాస్తున్నారు" అనే వాక్యం వాడిగా తగులుతుంది.



చిత్రోపమమైన "వఅడు" కథలో ప్రతి సన్నివేశం ఒక దృశ్యాన్ని మన:ఫలకంపై నిలబెడుతుంది. అధికారుల కోపాలకి, చికాకులకీ చిరుఉద్యోగస్థులు ఎలా అన్యాయంగా బలౌతూ ఉంటారో తెలిపే కథ ఇది. ప్రధాన పాత్రధారి ’మిలట్రీ మాన్ ’ చిన్నయ్య చాలా కాలం గుర్తుండిపోతాడు. ఇలాంటి చిన్నయ్యలు ఓ పది మంది ఉంటే చాలు సమాజం ఎంతగా బాగుపడగలదో కదా.. అనిపించకమానదు. ఈ కథానిక దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్ లో "దర్పణ్" సిరీస్ లో బాసు ఛటర్జీ దర్శకత్వంలో సింగిల్ ఎపిసోడ్ గా ప్రసారమైంది. అంతేకాక రంగస్థల నాటకంగా మలచబడి 2000 లో నంది నాటకోత్సవాలలో వెండి నంది బహుమతిని పొందటమే కాక పలు పరిషత్ పోటీలలో ఉత్తమ ప్రదర్శనా బహుమతులందుకుని ప్రేక్షకాదరణ పొందింది.



"ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్" కథలో పులి వేట కోసం విశ్వాసపాత్రుడైన తన నౌకరునే ఎరగా వాడుకునే కర్కోటకుడైన కనకరాజు పాత్ర మనుషుల్లో పెరిగిపోతున్న నిర్దయతకు ప్రతికృతి. అటువంటి వంచన మొదటికే మోసాన్ని తెస్తుందన్న సత్యాన్ని చిట్టిబాబు మృతి ద్వారా తెల్పుతారు రచయిత.



ఈ కథాసంపుటిలో ఎక్కువగా ఆకట్టుకుని, చదివిన చాలాకాలం వరకూ పాఠకుల్ని ఆలోచనల్లో ముంచివేసే ఆర్ద్రమైన కథ "చీకటి". "వంశీకి నచ్చిన కథలు" కథాసంకలనంలోనూ, "కథానేపథ్యం" పుస్తకం లోనూ ఈ కథ చదివిన మీదట మూడోసారి సుపరిచితమైన పాత మిత్రుడిలా పుస్తకంలో పలకరిస్తుందీ కథానిక. తానా ప్రచురణల వారి "కథానేపథ్యం" లో ఈ కథ రాయడం వెనుక గల కథాకమామిషులను ఆసక్తికరంగా చెప్తారు శేషగిరిరావు. ఒక ఏజన్సి ప్రాంతంలో రచయిత పనిచేసినప్పుడు ఒక రిటైర్డ్ పెద్దాయన చెప్పిన విషయాల ఆధారంగా ఈ కథ రాసారుట. దానికి మూలం కూడా అతను చెప్పిన ఒక చిన్న సంఘటన. ఆ చిన్న సంఘటన నేపథ్యాన్ని ఈ కల్పిత కథకు జోడించాననీ శేషగిరిరావు చెప్తారు. వేట నేపథ్యంతో సాగే ఈ కథలో ప్రధానపాత్రధారి డిబిరిగాడు. పెంపుడు కొంగ నత్తగొట్టుని చెంకన పెట్టుకు తిరుగుతూ, అరవై దాటి  వయసు ముదురినా ఒడిలిపోని శరీరంతో, అడవి జంతువులా తీక్షణంగానూ, పరిశీలనగానూ ఉన్న చీపికళ్ళతో ఉండే డిబిరిగాడు నక్కలోళ్ళనే సంచార తెగకు చెందినవాడు. ఇటువంటి కొన్ని సంచార తెగల తాలూకూ జీవనవిధానాల గూర్చి కూడా చక్కని సమాచారం కథలో దొరుకుతుంది. రచయిత యొక్క సునిశితమైన పరిశీలనా దృష్టిని ఈ కథలోని ప్రతి వాక్యమూ తెల్పుతుంది. బాతుల వేటకై బయల్దేరిన ఇద్దరు అపరిచితుల కలయిక, విరుధ్ధమైన వారి జీవననేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలూ తెలిపుతుందీ కథ. కథలో డిబిరి గాడి జీవనగాధ విన్నప్పుడు సంచార తెగల జనజీవితం ఇంత దుర్భరంగా, హృదయవిదారకంగా కూడా ఉంటుందా.. అని దిగ్భ్రాంతి కలుగుతుంది. డిబిరిగాడి అవతారం గురించిన వర్ణన, అతడు ఎదుర్కొన్న సమస్యలు, పడిన బాధలూ వింటున్న వర్మ తో పాటు పాఠకుల రోమాలూ నిక్కబొడుచుకుంటాయి. కథ చదివిన చాలారోజుల వరకూ డిబిరిగాడి ఆకారం కలల్లో, ఆలోచనల్లో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. 


Friday, March 27, 2015

CHAI - The Experience of Indian Tea





కేవలం ఉత్తర భారత దేశంలోనే కాదు ఇవాళ్టి రోజున దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వేకువ ఝామున, సాయంత్రాల్లోనూ.. వీధి సందు మలుపుల్లో, బజార్లలో, ఫంక్షన్ ప్లేసెస్ లో, సందర్శనా స్థలాల్లో ఓ నాలుగు చెక్రాల చెక్క బండి కనిపిస్తుంది. దాని మీద ఓ పక్కగా చిన్న స్టౌ, ఒక పొయ్యి మీద మరుగుతూన్న టీ పొడి, మరో పొయ్యి మీద మరుగుతున్న పాలు, పక్కనే సీసాల్లో పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలూ, టీ బిస్కెట్లు మొదలైనవి కనబడుతూ ఉంటాయి. బ్లాక్, పుదీనా, లెమన్, స్ట్రాంగ్, లైట్ అంటూ ఐదారు రకాల టీలను అవలీలగా క్షణాల్లో కలిపి ఇచ్చేస్తూ ఉంటారు బండి వాళ్ళు. వారిలో చిన్న చిన్న కుర్రాళ్ళు, ఆడవాళ్ళు, వయసు మీరిన తాతలూ కూడా గంటల తరబడి అలా టీలు చేస్తూనే ఉంటారు. ఆ టీ బండివాళ్ల చురుకుదనం చూస్తే ఆశ్చర్యం వేస్తూంటుంది ఒకోసారి. ప్రాంతాలను బట్టి టీ ఇచ్చే కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, వాటి సైజులూ ఉంటాయి. కాలేజీలో ఉండగా మేము కలకత్తా వెళ్ళినప్పుడు మొదటిసారి టీని మట్టి ముంతల్లో తాగడం చూశాను. ఆ పధ్ధతి చాలా నచ్చింది కూడా. వేడి వేడి టీ తో పాటూ కలిసే ఆ మట్టి వాసన, ఆ రుచి చాలా స్పెషల్ గా, డిఫరెంట్ గా తోచాయి నాకు. 


 బేసిగ్గా నేను కాఫీ లవర్ ని. కానీ పదేళ్ళ క్రితం ఓ సందర్భంలో బాగా ఇష్టమైనదాన్ని వదిలేస్తానని అనుకున్నప్పటి నుండీ కాఫీ వదిలేసి టీ వాడకం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆ కాఫీ ఇష్టం అలానే ఉంది కానీ తాగాలనిపించే బలహీనతను, ఆలోచనను దరికి చేరనివ్వను. అందుకు బదులుగా బ్లాక్ టీ, గ్రీన్ టీ, లీఫ్ టీ, డస్ట్ టీ, ఆరెంజ్ టీ, లెమన్ టీ, గులాబీ టీ, ఐస్ టీ, జాస్మిన్ టీ, తులసీ టీ, ఆర్గానిక్ టీ, ఆయుర్వేదిక్ టీ, ఇన్స్టెంట్ టీ అంటూ రకరకాల టీల ప్రయోగాలు చేస్తూ, ఆస్వాదిస్తూ, టీ ప్రేమికురాలిగా మారిపోయాను. ఎక్కడైనా కొత్తరకం టీ రెసిపీ కనిపిస్తే ప్రయత్నించడం హాబీ అయిపోయింది.



కొద్ది రోజుల క్రితం చైనా నుండి వచ్చిన ఫ్రెష్ గ్రీన్ టీ బాక్స్ + ఈ చాయ్ పుస్తకం తీసుకువచ్చారు శ్రీవారు. టీ నీకే గానీ పుస్తకం చూసి ఇచ్చేయాలి అన్నారు. ఎక్కడిదంటే ఫలానా ఫ్రెండ్ ఇచ్చారు.. ఈ పుస్తకం ఆయనకు గిఫ్ట్ గా వచ్చిందిట. నువ్వు చదువుతావని తెచ్చానన్నారు. కట్ చేస్తే ఇన్ని రోజులకి ఆ పుస్తకం చదవడం పూర్తి చేసాను. అది కూడా బుక్ ఇచ్చేయాలని అయ్యగారు తొందరపెడితే బలవంతాన చదివాను. ఈ పుస్తకం ప్రధానాకర్షణ అందులోని పెద్ద పెద్ద కలర్ఫుల్ ఫోటోస్. టీ ప్లాంటేషన్స్, జార్స్, సిటీస్, టీ దుకాణాలు, కలర్ఫుల్ సీల్డ్ టీ పేక్స్.. గట్రాలతో ఉన్న రంగురంగుల బొమ్మలు నిజంగా మనోహరంగా ఉన్నాయి. పుస్తకంలోని ఫోటోలను వాడుకోకూడదనే నిబంధన ప్రకారం అవేమీ ఈ పోస్ట్ లో పెట్టట్లేదు. కవర్ పేజీ మినహా టపాలోని ఫోటోలన్నీ గూగులమ్మ సహాయంతో సేకరించినవి.


2014 లో ప్రచురించబడిన అయిన ఈ పుస్తకానికి ఇద్దరు రచయితలు. రాజన్ కపూర్, రేఖా సరిన్. ఒకరు అవార్డ్ గ్రహీత అయిన ఫోటోగ్రాఫర్, ఒకరు అవార్డ్ గ్రహీత అయిన జర్నలిస్ట్ కమ్ ఎడిటర్. ముందుగా వారిద్దరూ పుస్తకాన్ని అంకితం చేసిన పధ్ధతి, ఆ మాటలు బావున్నాయి..

ఇక ఈ పుస్తకంలో ఏం కబుర్లు ఉన్నాయంటే.. అసలు మొట్టమొదట భారతదేశానికి టీ ఆకు ఎలా వచ్చి చేరింది, ఉత్తమమైన నాణ్యత ఉన్న టీ ఆకుని పండించడానికి కొందరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని పరిశోధనలు ప్రయత్నాలూ చేసారో వివరంగా వివరించారు. టీ తోటలు పెంచే ప్రదేశాలూ.. వాటి వివరాలు, ఆయా ప్రాంతాలు చేసే టీ ఉత్పత్తి, టీ ఆకు రకాలు  వివరాలు; అసలు టీ ఆకు ఎలా తయారవుతుంది? ఆ ఆకుపచ్చని లేత చిగుర్లు మన ఇంటికి చేరే రంగురంగుల టీ పేకెట్లలోకి టీ పొడిలా ఎలా మారతాయి.. మొదలైన వివరాలు వివరించారు రచయుత.


మొదటి అధ్యాయంలో దేశంలో రకరకాల ప్రాంతాల్లో టీ ఉపయోగాలనూ, పధ్ధతులనీ వివరించారు. కాశ్మీరు లోని కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ టీ ఆకుతో kahwa అనే టీ తయారు చేస్తారుట. ఏలకులు, దాల్చిన చెక్క నీటిలో మరిగించి, తర్వాత టీ ఆకు కలిపి చివరగా అందులో కుంకుమపువ్వు (కాశ్మీరుప్రాంతంలో saffron పంటలు విరివిగా పండిస్తారు కదా అందుకని) కూడా కలుపుతారుట. ఇక ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది బ్లేక్ టీ పొడి, పాలు, కలిపి దాల్చినచెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, మిరియాలు మొదలైన మసాలా మిశ్రమాలతో కలిపి టీ తయారు చేసుకుంటారు. అస్సాం లో అల్లం, బిర్యానీ ఆకు వేసిన స్ట్రాంగ్ గా, ఉప్పగా ఉండే టీ దొరుకుతుందిట. అక్కడ కొన్నిచోట్ల ఎక్కువగా ఉండే మలేరియాను పోగొడుతుందిట ఆలాంటి చాయ్. పంజాబ్ లో బ్రేక్ఫాస్ట్ టీతో పాటుగా స్టఫ్డ్ పరాటాలు కూడా ఉంటాయి. ఇంగ్లీషువారి కేక్లు, సేండ్ విచ్ లాగ. ఇంకా కొన్ని చోట్ల ఆలూ బోండాలు, పకోడీలు, సమోసాలు, పేస్ట్రీ పఫ్ లు మాత్రమే కాక జిలేబీ, రసగుల్లా, గులాబ్ జామూన్ మొదల్లైన స్వీట్లు కూడా టీ తో పాటూ ఆస్వాదిస్తూ ఉంటారు. చెన్నై లో ఒక ప్రాంతంలో ఉన్న మూసా టీ స్టాల్ కు ముఫ్ఫై ఏళ్ళ చరిత్ర ఉందిట. రోజుకు రెండు మూడొండల మంది కష్టమర్లు టీ తాగడానికి అక్కడకు వస్తారుట. కేరళలో దాల్చిన చెక్క, ఏలకుల తో పాటూ నట్ మెగ్ మిరియాలు కూడా వేస్తారుట టీలో. హైదరాబాదీలు ఆస్వాదించే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ల గురించి చెప్పేదేముందీ!




తర్వాత టీ తయారీ ఎలా మొదలైందో వివరంగా తెలిపారు. టీ ఉత్పాదనలో  మొదటి స్థానంతో ఏకచ్ఛత్రాధిపత్యాన్నీ పొందుతున్న చైనా గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చెయ్యడానికి ఇండియాలో ఎక్కడ టీ ఉత్పాదనలు చేయవచ్చో ప్రయత్నించడం మొదలుపెట్టారుట బ్రిటిష్ వారు. ఆ వెతుకులాటలో అస్సాం అడవుల్లో చైనా టీ ఆకు కన్నా బలంగా ఉన్న టీ ఆకులను కనుగొన్నారుట. అస్సాం అడవుల్లో 600-700 cm ఎత్తు పెరిగిన టీ చెట్లను, వాటికి ఉన్న 20-22 cm పొడవు, 10 cm వెడల్పు ఉన్న టీ ఆకులను చూసి ఆశ్చర్యపోయారుట. మొదటిసారిగా ఒక స్కాటిష్ వ్యాపారస్థుడు అక్కడి ఆదివాసీలు టీ ఆకులను వాడడం చూశాడుట. చైనాలో కాక వేరే ప్రాంతాల్లో టీ ఆకు పండిచగలిగితే చరిత్ర సృష్టించచ్చని ఉత్సాహపడ్డాడుట కానీ అది ఫలరూపాన్ని పొండటానికి చాలా ఏళ్ళే పట్టిందిట. ఎంతో మంది బ్రిటిష్ ఆఫీసర్లు, వ్యాపారవేత్తల కృషి ఫలితంగా 1839లో భారత దేశంలో మొట్టమొదటి టీ కంపెనీ.. "అస్సాం టీ కంపెనీ" స్థాపించబడింది. అప్పుడు అస్సాం లోనే కాక దేశంలో ఏ ఏ ఇతర ప్రాంతాల్లో టీ ఆకుని పండిచవచ్చో పరిశోధించడం మొదలుపెట్టారుట. అలా అస్సాం నుండి కలకత్తా, డార్జలింగ్, ఉత్తర హిమాలయాల్లోని కాంగ్రా వేలీ, తర్వాత దక్షిణంలో ఊటీ (నీలగిరీస్), కూనూర్, మున్నార్, చిక్ మంగుళూర్, కూర్గ్ మొదలైన ప్రదేశాల్లో టీ ఉత్పాదనలు మొదలైయ్యాయి. డార్జలింగ్ టీ, ఆర్థడాక్స్ అస్సాం టీస్, కాంగ్రా టీ, దూరాస్ & టెరై, నీల్గిరీ టీ మొదలైన టీ కంపెనీలు మొదలై పాపులర్ అయ్యాయి.




టీ ప్లాంటర్స్ అని పిలవబడే ఎస్టేట్ మేనేజర్లు, టీ గార్డెన్ లో వర్కర్లు, వాళ్ల జీవన విధానాలను గురించి ఒక పూర్తి అధ్యాయం ఉంది. తర్వాత అధ్యాయంలో టీ ఆకులు సేకరించడం మొదలు అవి పేక్ అయ్యేదాకా ఏం ప్రాసెస్ జరుగుతుంది అన్న సంగతులన్నీ విపులంగా వివరించారు. మొదట్లో టీ ఫాక్టరీలలో సరైన సదుపాయాలు లేక టీపొడి తయారీ చాలా కష్టతరంగా ఉండేదట. తర్వాతర్వాత నెమ్మదిగా మార్పులు వచ్చి ఇప్పుడు టీ ఫ్యాక్టరీలు చక్కని కంప్యూటర్ కంట్రోల్డ్ సొఫిస్టికేటేడ్ పరికరాలతో ఉండటం వల్ల టీ పొడి కూడా హైజినిక్ గా చక్కని అంతర్జాతీయ ప్రమాణాలతో గా తయారవుతోందిట. 




మూడు పద్ధతుల్లో టీ ఆకు తయారీ జరుగుతుందిట. మొదట ఆకుపచ్చని ఆకుల ఆక్సిడేషన్ ఆపివేసి గ్రీన్ టీ ఆకును, తర్వాత పార్షియల్ ఆక్సిడేషన్ ప్రక్రియతో బ్లాక్ టీ ఆకును, చివరగా టీ ఆకులను పూర్తిగా ఆక్సిడైజ్ చేసి Orthodox, CTC (crush-tear-and curl) అనే రెండు రకాల టీ ఆకులను తయారు చేస్తారుట. ఈ రకంగా అంచలంచలుగా ఎన్నో వ్యయప్రయాసల తర్వాత తయారైన టీ ఆకు, టీ పొడి "టీ టేస్టర్" దగ్గరకు వెళ్తుంది. అచ్చం ఒక లేబ్ టెక్నీషియన్ లాగ ప్రతి కంపెనీ లోని టీ టేస్టర్స్ తన వద్దకు వచ్చిన టీని పరీక్షించి, దాని నాణ్యతను సర్టిఫై చేస్తారు. ఈ పనికి గాని టీ టేస్టర్ కి ఐదేళ్ల అనుభవం అవసరమై ఉంటుందిట. నాణ్యత గల టీ గా ఎన్నికకాబడ్డ టీ   కి చివరగా ఆక్షన్స్ ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. ఎన్నో ప్రైవేటు సంస్థల మధ్యన జె.థామస్ అనే కంపెని మాత్రం, ఏడాదికి కొన్ని మిలియన్ కిలోగ్రాముల టీ ఆక్షనింగ్ చేస్తూ 150ఏళ్ళగా ప్రముఖ టీ ఆక్షన్ సెంటర్ గా ప్రసిధ్ధి చెంది ఉందిట.


 చివరి అధ్యాయంలో రకరకాల దేశాల్లో టీ ని ఎలా తయారుచేస్తారు, ఎలా ఆస్వాదిస్తారు, టీ ఎన్ని రకాలుగా + ఎలా వాడితే శరీర అందానికీ, శరీరం రిలాక్సవడానికి ఉపయోగపడుతుంది అనే విషయాలు ఉన్నాయి. ఈ అధ్యాయం లో ఇచ్చిన రకరకాల టీలు.. వైట్ టీ, గ్రీన్ టీ, యెల్లో టీ, ఆర్గానిక్ టీ, ఫ్లేవర్డ్ టీ, సెంటెడ్ టి, హెర్బల్ టీ, ఇంస్టెంట్ టీ మొదలైనవాటి రంగులు, అవి ఉంచిన టీ జార్స్, కప్స్, కలర్ ఫుల్ సీల్డ్ పేక్స్ కళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. చిట్టచివరగా రకరకాల టీ ల తయారీలు, కొన్ని రకాల టీలతో చేసుకునే రెసిపీలు ఉన్నాయి. వాటి తాలూకూ రంగురంగుల ఫోటోలు కూడా నయనానందకరంగా ఉన్నాయి.

ఈ పుస్తకం ధర రీత్యా కొనుక్కోమని చెప్పను కానీ ఎక్కడైనా లైబ్రరీలోనో, ఓ హోటల్లోనో లభ్యమైతే తప్పకుండా ఓసారి పేజీలు తిరగేసి ఆనందించతగ్గ పుస్తకం అని మాత్రం చెప్తాను.
http://www.accdistribution.com/us/store/pv/9789381523919/chai/rekha-sarin-rajan-kapoor


చాయ్ బుక్ కబుర్లు అయిపోయాయి. ఇదిగోండి ఓ కప్పు టీ తాగండి..:)




Note: All the photos in this post are sourced from royalty free Google images. No authenticity claimed. No legal or any claims tenable.

Wednesday, December 17, 2014

కిటికీ బయటి వెన్నెల



కథలు రకరకాలు. ఉల్లాసాన్ని, ఆనందాన్నీ కలిగించే కథలు చాలానే కనిపిస్తూంటాయి కానీ ఆలోచింపచేసే కథలు అరుదుగా కనబడతాయి. వాడ్రేవు వీరలక్ష్మిగారి కథలు చదివినప్పుడల్లా నాకు ఆలోనలతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతూంటుంది.. దైనందిక జీవితంలో సామాన్యంగా మనం తక్కువగా ఆలోచించే విషయాలపై కథ రాయాలనే ఆలోచన వీరికి ఎలా కలుగుతుందా.. అని! అయితే ఈ విషయాలు తేలికపాటివి కావు. సమాజంలో మార్పు రావాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు, అంశాలూనూ. 


వాడ్రేవు వీరలక్ష్మి గారి మూడవ కథాసంపుటి "కిటికీ బయటి వెన్నెల" చదువుతుంటే నాకు అందులో ప్రకృతి, చెట్లు, పువ్వులు తాలూకా సున్నిత భావుకత్వం కన్నా కథల్లో దాగున్న విషయాంశాలూ, వాటిల్లో చర్చించిన గంభీరమైన సమస్యలు ఎక్కువగా ఆలోచింపజేసాయి. బహుశా నా మనసు సున్నితత్వాన్నీ, భావుకత్వాన్నీ దాటి సమాజంలోని సమస్యలను చూసే స్థాయికి ఎదిగి ఉంటుంది! వీరలక్ష్మి గారి "ఆకులో ఆకునై"తో మొదలైన నా అంతర్జాల సాహిత్య వ్యాసాలు పరిణితి చెందుతూ నాలో నాకే ఒక కొత్త కోణాన్ని చూపెడుతున్నాయనుకుంటాను నేను! నాకు లభ్యమైన 'కొండఫలం' , 'మా ఊళ్ళో కురిసిన వాన' , 'భారతీయ నవల' మొదలైన ఆవిడ పుస్తకాల గురించి రాసాను కానీ "సత్యాన్వేషి చలం" గురించి ఇంకా రాసే సాహసం చెయ్యలేదు నేను. అందుకు గానూ ముందు చలం రచనలన్నీ చదవాల్సి ఉంది. చదవగలనో  లేదో ప్రస్తుతానికి తెలీదు. ఇంకా వీరలక్ష్మి గారి 'ఉత్సవ సౌరభం', 'సాహిత్యానుభవం' పుస్తకాలు సంపాదించవలసి ఉంది. 


"జీవితానికి పరిమళం అద్దిన కథలు" అంటూ సత్యవతి గారు ఈ కథానికలకు రాసిన ముందుమాట అసలు ఇంకేమీ రాయక్కర్లేనంతగా, రాయడానికేమీ మిగలనంతగా బాగుంది! వీటిలో మూడు కథల్ని ముందరే చదివాను. "కిటికీ బయటి వెన్నెల" 'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక' లో , "బరువు భారాలు" ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో, "గీతల్ని చెరపవచ్చు" నవ్య పత్రికలోనూ చదివాను. నాలుగు నెలల క్రితం నవ్య పత్రికలో ప్రచురితమైన ఆ కథ బాగుందని నే రాసినప్పుడు, త్వరలో మూడవ సంపుటి రాబోతోందని చెప్పి సభకు ఆహ్వానించారు వీరలక్ష్మిగారు. ఆ తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఎంతో అభిమానంగా "కిటికీ బయటి వెన్నెల" పుస్తకావిష్కరణకు రావలసిందని సాదరంగా ఆహ్వానించారావిడ. నే కూడా పొంగిపోయాను.. కానీ సరిగ్గా సమయానికి ఆరోగ్యం బాగోలేక ఆ సభకు వెళ్లలేకపోయాను :( ఆలస్యంగానన్నా పుస్తకం ఇన్నాళ్ళకు చదవగలిగాను.. నా అభిమాన రచయిత్రి స్వయంగా పంపించబట్టి. ఆవిడ సంబోధన చూసినప్పుడల్లా అనుకుంటాను.. ఆవిడ అక్షరాల్లాగానే మనసు, మాట కూడా మెత్తన అని. ఏదో ముఖస్తుతి కోసం చెప్తున్న మాటలు కావివి. పెద్దగా పరిచయం లేకపోయినా ఎంతో ఆప్యాయంగా పలకరించగలగడం కొందరికే సాధ్యపడుతుంది. 


ఈ కథాసంకలనంలోని పాత్రలు నిత్యం మన చుట్టూ కనబడేవారే. అందుకనే కొన్ని సందర్భాల్లో ఈ కథల్లో పాత్రల ఆలోచనలు కూడా మన ఆలోచనాధోరణి లాగానే ఉంటాయి. ప్రతి కథా ఒకో సమస్యను, వాటి విభిన్న దృక్కోణాలనూ చూపెడుతుంది. సమస్యలన్నీ కూడా ఎక్కువశాతం స్త్రీలవే. పాత్రలు, వాళ్ల ఆలోచనలూ మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు చదువుతుంటే ఈ సమస్యపై ఎవరైనా ఎక్కువ దృష్టి పెడితే బాగుండును.. సమస్య తీరవచ్చు లేదా ఏదైనా పరిష్కారం దొరకచ్చేమో అనిపిస్తుంది. కొన్నింటిలో ఆశావాహమైన ముగింపు పాఠకులకు కూడా చీకటిలో మిణుకుమనే నక్షత్రంలా దారి చూపగలదు.


'పునరుత్థానం' కథలో అన్ని రకాలుగా చిన్నాభిన్నమైపోయిన తన జీవితాన్ని ఆదిలక్ష్మి బాగుచేసుకున్న తీరు మోడులోంచి చిగురించే ఆకుపచ్చని ఆశలా తోస్తుంది. రచయిత్రి చెప్పినట్లు బతుకు బరువైనప్పుడల్లా ఎవరో ఒక ఆదిలక్ష్మి మనకు ప్రేరణ అవ్వగలదేమో.
'ఈ విషానికి ఈ తేనె చాలు' కథానికలో వింధ్య, అనురాధల జీవితాలు ఆలోచింపజేస్తాయి. వింధ్యను నిర్వేదం నుండి బయటకు లాగడానికి అనురాధ పడే తాపత్రయం, ప్రయత్నాలు బాగున్నాయి కానీ చివరలో వినోద మాటలు ఎందుకనో పూర్తిగా ఒప్పుకోలేకపొయాను. 

'దిశానిర్దేశకులు' అన్నింటిలో నాకు బాగా నచ్చిన కథ. కాలేజీ స్టూడెంట్స్ పై సినిమాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఒక అధ్యాపకురాలి కన్నా బాగా ఎవరు చెప్పగలరు? విద్యార్థులను ఈ రాంగ్ నోషన్స్ నుండి, సినిమా ప్రభావం నుండీ తప్పించగలిగితే దేశ భవిష్యత్తు ఎంతో బాగుపడగలదు అని నేను నిరంతరం అనుకుంటూ ఉంటాను. "తన్మయి"లో బామ్మ తాయారు కథ వెనుకటి కాలంలోని ఎందరో నిస్సహాయ స్త్రీల వేదనకు అద్దం పడుతుంది.


"కిటికీ బయటి వెన్నెల" కథ చదివితే నాకు మా పాత ఇంటి ఎదురు వీధిలో మా బాల్కనీ వైపుకు కనబడే మరో బాల్కనీలో రోజూ కనబడుతుండే ఆంటీ గుర్తుకువచ్చారు. రచయిత్రి లాగనే నేనూ ఆ బాల్కనీ లోంచి కనబడే సన్నివేశాలనూ, మనుషులనూ బట్టి ఫలానా కాబోలు.. బహుశా ఇలా జరిగిందేమో అనుకుంటూ ఉండేదాన్ని. ఏ మాత్రం పరిచయం లేకపోయినా రోజూ చూడ్డం వల్ల ఓ వారమెపుడైనా కనబడకపోతే ఏ ఊరెళ్ళారో.. ఎలా ఉన్నారో.. అనుకుంటూ ఉండేదాన్ని. వినాయకచవితి పందిట్లో కనబడితే దగ్గరకు వెళ్ళి పలకరించి నేను ఫలానా అని చెప్తే.. అవును ఇల్లు ఖాళీ చేసేసారుటగా అన్నారావిడ!

'నీడ' కథలో ఈ వాక్యాలు బాగా నచ్చాయి "...ముఖ్యంగా సమాజ సేవ చెయ్యడానికి మనం ఎందుకు ముందుకొస్తున్నామో ఒక్కసారి ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి సార్. లోకాన్ని మనం ఒక్కళ్ళం బాగుచెయ్యలేం. కానీ బాగుచెయ్యాలన్న తపనలో మన లోపల కల్మషాలు పోవాలి. పోతాయి కూడా. ఎప్పుడంటే - హృదయం పనిచేసినపుడు, హృదయం మాత్రమే పనిచేసినపుడు.. "


"ఆ రాత్రి" కథలో  "...కానీ ఇది మరెందరో ఆడపిల్లల భద్రతను దెబ్బ తియ్యడం లేదూ.." అన్న రజని ప్రశ్న పుస్తకం మూశాకా కూడా పదే పదే నా మనసులో తిరిగింది. నిజమే! ఇదే అసలు చాలా నేరాలకు మూల కారణం. కానీ ఎవరు మారుస్తారు ఈ అలవాట్లనీ, ఈ సమాజాన్నీ, ఈ పధ్ధతులనీ??


మనుషుల్ని మనుషుల్లా చాలామంది చూస్తారు. కానీ రచయిత్రి తన సునిశితమైన పరిశీలనాదృష్టితో మనిషి మనసులోని భావాల్ని కూడా చదవగలరు. మనుషుల్లో ఇంకా దయ, మానవత అనేవి పుష్కలంగా ఉన్నాయనీ, అవసరమైనప్పుడు అవి తప్పక బయటకు వస్తాయని "గీతల్ని చెరుపుకోవచ్చు" కథ ద్వారా ఒక ఆశావహ దృక్పధాన్ని చూపెడతారు రచయిత్రి. "ఈ విభజన రేఖలూ, సరిహద్దులూ, దూరాలూ ఉంటాయి. కానీ జీవితం అప్పుడప్పుడు వాటిని చెరిపేసి, మనుషుల్ని కలిపే సందర్భాలను కూడా పట్టుకొస్తుంది" అంటారావిడ. మానవత్వం పై , మనుషులపై ఎంత నమ్మకమో వీరికి అనిపించక మానదు ఈ కథ చదివితే.


ఒక బస్సు ప్రయాణంలో పూర్తయిన ఈ కథల పుస్తకం పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయా.. స్టాప్ వచ్చింది దిగమని శ్రీవారు వెనుకనుండి కదిపేవరకూ!! "బాధలన్నీ పాత గాధలైపోయెనే.." అని బుక్ కవర్ పై ఓ చివర్న రాసినట్లుగా పాతవైనా మెరుపు తగ్గని కథలు ఇవి. మరిన్ని ఆలోచనాత్మకమైన కథల్ని వీరలక్ష్మిగారి నుంచి ఆశిస్తున్నాను..

***    ***     ***

* "మనిషి ఎదుటి మనిషిని రాగద్వేషమిశ్రితమైన మనిషిగా అంగీకరించగలగటం ఎంతో గొప్ప సంగతి. అదే జరిగితే ఈ వాదాలేవి అక్కర్లేదు. ఈ అర్ధం చేసుకోలేకపోవడాల దగ్గరే మానవ దు:ఖమంతా ఉంది."
- వాడ్రేవు వీరలక్ష్మీదేవి.
('ఆకులో ఆకునై', 'మా ఊళ్ళో కురిసిన వాన' రెండు పుస్తకాల్లో ఉన్నాయి నాకెంతో ఇష్టమైన ఈ వాక్యాలు. ఇవొక్కటే చాలు నేనావిడ అభిమానినని గర్వంగా చెప్పుకోవడానికి.)

***    ***    ***

Thursday, November 6, 2014

శ్రీ శివమహాపురాణము


 రెండు నెలల క్రితం మావారికి ఓ చిన్న ఏక్సిడెంట్ అయ్యి కాస్త బాగానే దెబ్బలు తగిలాయి. ముందెళ్ళిన డాక్టర్ మామూలు దెబ్బలే అన్నారు గానీ తర్వాత వెళ్ళిన మరో డాక్టర్ గారు ఏంకిల్ దగ్గర హైర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది. రెస్ట్ గా ఉండమన్నారు. సో, ఓ మూడు వారాలు క్రేప్ బ్యాండేజ్ వేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్కున్నారు అయ్యగారు. అదేదో ఏడ్ లో "మరక మంచిదేగా.." అన్నట్లు తనకు దెబ్బలు తగిలించి దేవుడు మాకు మేలే చేసాడు. పెళ్ళయిన ఇన్నేళ్ళకి ఆ మూడువారాలు కాస్త ఖాళీగా తను ఇంట్లో ఉన్నారు. ఆ దెబ్బల వల్ల సత్కాలక్షేపం కూడా జరిగింది. తీరుబడిగా పనులు చేస్కోవడమే కాక తీరుబడిగా పురాణకాలక్షేపం చేసుకుని మహదానందాన్ని కూడా ప్రాప్తం చేసుకున్నాము.. కుంటున్నాము కూడా! ( బయటకు వెళ్పోవడం మొదలెట్టాకా పురాణపఠనం స్పీడ్ తగ్గి, ఇంకా రెండు ఛాప్టర్లు మిగిలి ఉన్నాయి.) మధ్యలో కొన్నాళ్ళు మా అత్తగారు కూడా ఉన్నందున ఆవిడ కూడా పురాణశ్రవణం చేసుకున్నారు. 

మాకో అలవాటు ఉంది..(చాలామందికి ఉండే ఉంటుంది) చాలా బాగున్న పుస్తకం కలిసి చదవడం. ఒకళ్లతర్వాత ఒకళ్ళం తలో ఛాప్టర్ చదవడం. ప్రసాద్ గారి నాహం కర్తా హరి: కర్తా, ఇల్లేరమ్మ కథలు, దీపశిఖ, ఆ కుటుంబంతో ఒక రోజు, మోహన్ కందా గారి పుస్తకం... ఇలా కొన్ని పుస్తకాలు కంబైండ్ స్టడీ చేసాం. ఆమధ్యన కోటీలో పాత పుస్తకాల స్టాల్స్ దగ్గర ఏవో పుస్తకాలు కొంటుంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి "శ్రీ శివమహాపురాణము" దొరికింది. పుస్తకం కొత్తగానే ఉన్నా పాతపుస్తకాల దగ్గర పెట్టీ మూడొందల ఏభైకే అమ్మేస్తున్నారు. క్రిందటి పుస్తకప్రదర్శనలో చాగంటివారి భాగవత,రామాయణ, శివమహాపురాణా ప్రవచనాల పుస్తకాలను మూడింటినీ కలిపి డిస్కౌంట్లో అమ్మారు. అప్పటికే చాలా కొనేసినందువల్ల ఇక అవి తీసుకోలేకపోయాము. మూడింటిలో అమ్మ దగ్గర భాగవతప్రవచనం ఉంది. (సగభాగం ఇంకా పూర్తి చెయ్యాల్సి ఉంది.)  మిగతావి కూడా కొనుక్కోవాలని మనసులో ఓ మూల కోరిక ఉంది. ఇప్పుడిలా అనుకోకుండా "శ్రీ శివమహాపురాణం" కొనడం జరిగింది. భగవత్ కృప!


కాకినాడలోని అయ్యప్పస్వామి గుడిలో మండలం రోజులు చాగంటివారు చెప్పిన ప్రవచనాలుట ఇవి. (టివీలో వచ్చే ఉంటాయి.) వాటికి పుణ్య దంపతులు శ్రీ పురిఘళ్ళ సత్యానంద శర్మ, శ్రీమతి భాస్కరం గార్లు అక్షరూపాన్ని అందించారు. ఆకర్షణీయమైన బాపూ బొమ్మలతో ఎమెస్కో బుక్స్ వాళ్ళు ప్రచురించారు. వినడం కన్నా పుస్తకం చదవడమే ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని మాకనిపించింది. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలను గురించి , వాటి చరిత్ర, కొన్ని ప్రదేశాల్లో ఉన్న విగ్రహామూర్తులను గురించీ చదువుతుంటే అసలు ఇప్పటిదాకా చూసిన కొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలు మళ్ళీ వెళ్ళి చూడాలనిపించింది. శివుడంటే ఇదివరకటి కంటే ఎక్కువగా ఆరాధన కలిగింది. నా రాముడితో సమానంగా నా మనస్సులో స్థానాన్నధిస్టించాడు ఈశ్వరుడు :)


పుస్తకంలో ముందర కొందరు నాయనార్ల చరిత్రలు ఉన్నాయి. శివుని అనుగ్రహం వల్ల తరించిపోయిన మహాపురుషులైనవారీ నాయనార్లు. ఒక్కొక్కరి కథా ఒకో పాఠం అని చెప్పాలి. తర్వాత పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యాలనూ, వాటి చరిత్రనూ, ప్రాముఖ్యతనూ తెలియజేసారు. మాకు ఇప్పటికి శ్రీశైలంలో మల్లికార్జునుడు, త్ర్యంబకంలోని త్ర్యంబకేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఘృష్ణేశ్వర్ లోని ఘుష్ణేశ్వరుడు, భీమశంకర్ లోని భీమేశ్వరుడూ ఐదు క్షేత్రాల్లోని శివలింగాలను చూసే సదవకాశం కలిగింది. అరుణాచల పర్వతం విశిష్ఠత, రమణ మహర్షి చరిత్ర, అరుణాచలేశ్వర దేవాలయం గురించీ చదువుతుంటే మాత్రం రెక్కలు కట్టుకుని ఆ కొండకు ఎగరి వెళ్ళాలనిపించింది. ఆ దర్శనం, గిరిప్రదక్షిణ ఎప్పటికి ప్రాప్తమో..


పుస్తకంలోని కొన్ని తెలియని, తెలిసిన మంచి విషయములు:

* మన శరీరంలో ఉండే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన్, నాగ, కూర్మ, క్రుకుర, ధనంజయ, దేవదత్తములనే పది వాయువులు, వాటి పనులూ చెప్పారు. శివుడి ఆజ్ఞ వలననే వాయువు జీవుల శరీరములందు ఉండి ఈ పదిరకముల వివిధ కర్మలనూ చేస్తాడుట.

* పూర్వం స్నానం చేసి అగ్నిదేవుడికి నమస్కరించి కట్టె వెలిగించి, మడిబట్ట కట్టుకుని అన్నం వండడం కూడా గౌరవంగా చేసేవారు. 

* "పిల్లలను పోటో పరీక్షలకు తయారుచేస్తున్నాం. కానీ పాపభూయిష్టమైన ప్రవర్తనతో వాళ్ళను పెంచి పెద్దచేస్తున్నాం. వాడు రోడ్డుమీదికి వెడితే వాడి కన్నులు చెదరగొట్టి పాపభూయిష్టమైన నడవడి వైపుకి తీసుకువెళ్ళే వాల్ పోస్టర్లు! ఏషాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడుచెయ్యగలిగిన పుస్తకాలు! ఎన్ని ఛానళ్ళు నొక్కినా అన్నింటిలో వ్యగ్రతతో కూడిన విశేషములు! మీరు వానికి మురికినీరు పట్టించి వాడు వాడు ఆరోగ్యంగా బ్రతకాలంటే వాడు ఎలా బ్రతుకుతాడు?ఈవేళ సమాజానికి భాద్యత లేదు. ప్రభుత్వానికి బాధ్యత లేదు. పెద్దలకు బాధ్యత లేదు...." 
"పురాణముల ప్రయోజనం మీ బాధ్యతలను గుర్తు చెయ్యడం. పురాణం ఎప్పటిదోనని, అది పనికిమాలినదని మీరు అనవద్దు. అది ఎప్పటికీ నవీనమే. అది మీ బాధ్యతను మీకు గుర్తుచేస్తుంది. లోక సంక్షేమము ఎక్కడ ఉందో దానిని మీకు జ్ఞాపకము చేస్తుంది."

* తల్లిదండ్రులు ఏ ఏ సంస్కారములతో ఉన్నారో వి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కారరూపంలో సుఖమును గానీ, దు:ఖమును గానీ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందుకని క్షేత్రశుధ్ధి కొరకు, భావపరిపుష్టి కొరకుమనవాళ్ళు పూర్వం కొంతకాలం భార్యాభర్తలు దేవతారాధనం చేసేవారు. బాగా మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమయిన తరువాత సంతానము కనేవారు. ఈశ్వరారాధనలో పరిపుష్టి లోపించినట్లయితే, నిష్ఠ లోపించినట్లయితే సంతానమునందు వ్యగ్రతతో కూడినవారు జన్మిస్తారు. కాబట్టి సంస్కార బలం ఉన్న పిల్లలు కలగడానికి బాధ్యత తల్లిదండ్రుల యందు ఉంటుంది. ఇంత చేసినా దుర్మార్గుడో, దుర్మార్గురాలో పుడితే అది బిడ్డ ప్రారబ్ధం. దాని పాపం మీకు అంటదు అని శాస్త్రం చెప్పింది.

* ప్రదూషవేళ (కాలము స్ఫుటముగా మార్పు చెందే రెండు సంధ్యాసమయాలూ) జరుగుతూండే శివుడి ఆనందతాండవం సమయంలో శివస్వరూపాన్ని చూసే అధికారం నలుగురికే ఉందిట. నందీశ్వరుడు, భృంగి, పతంజలి, వ్యాఘ్రపాదుడు.

* కావ్య కంఠగణపతి ముని కథ కమనీయం.

* మధురమైన ముత్తుస్వామి దీక్షితులు జీవిత కథ..

* శంకరాచార్యులవారు, శ్రీ చంద్రశేఖర పరమచార్యుల వారి గురించిన కొన్ని తెలియని విశేషాలు..

* భృగుమహర్షి కుమారుడైన భార్గవుడు మహాపురుషుడిగా ఎలా మారాడు, శుక్రాచార్యుడన్న పేరు ఎలా ప్రకాశించిందో తెలిపే కథ విచిత్రమైనది. ఈశ్వరుడి కృపాకటాక్షాలను తెలిపేదీనూ!

* శివకోటి, రామ కోటి రాసిన పుస్తకాలలో ఎంతో శక్తి ఉంటుంది. అటువంటి పుస్తకాలు ఒక స్తూపంలో పెట్టినట్లయితే ఆ స్తూపము అపారమైన శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ శక్తికి ప్రసరించే లక్షణం ఉంది. ఊళ్ళో ఎవరికయినా ఆపద వచ్చినట్లయితే ఆ స్తూపం చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. స్తూపంలో ఉన్న శక్తి బయటకు తరంగములుగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మీరు ఆ తరంగములలోకి వచ్చి తిరుగుతున్నట్లయితే ఏ ఆలోచన చేస్తే మీకా కష్టం పోతుందో ఆ శక్తి అందులోంచి మీ మనసు లోకి ప్రవేశించి నిర్ణయం వైపుకి బుధ్ధిని మారుస్తుంది. కాబట్టి ఉళ్ళో ఉన్నవాళ్ళు ప్రమాత్మ ప్రు రాసిఉన్న స్తూపం కట్టుకోవాలి. రాననాం ఎంత గొప్పదో శివనామమూ అంతే గొప్పది.



* స్కందోత్పత్తి - కుమారసంభవం:
కాళిదాసు రచించిన "కుమారసంభవం" పేరు వినడమే తప్ప కథ తెలియదు. ఇంతకుమునుపెక్కడా కూడా కుమారస్వామి జననానికి సంబంధించిన కథ వినలేదు కూడా. మొత్తం పుస్తకంలో మేము ఆసక్తికరంగా చదివిన వృత్తాంతమిది. పార్వతీపరమేశ్వరులిద్దరి దయ,కారుణ్యము ఒకచోట ప్రోగు చెస్తే ముద్ద చేస్తే అదే సుబ్రహ్మణ్యుడుట. ఇది గర్భిణి అయిన స్త్రీ వినడానికి యోగ్యమయినదిట. ఏ జ్యోతి స్వరూపమునకు సంబంధించిన కథ స్త్రీ వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్న బిడ్డ సంస్కార బలములు మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలు ఉంటాయో వాటిని వినాలని, అవి ఔషధాలుగా మారి లోపల ఉన్న పిండము మనస్సుని ఆరోగ్యవంతంగా మారుస్తాయి. అందుకే స్కందోత్పత్తి గర్భిణి వినాలని శాస్త్రం చెప్పిందిట. ఆయురారోగ్యాలూ, వంశాభివృధ్ధి, ధనం, దీర్ఘమైన ఆరోగ్యం మొదలైనవి సుబ్రహ్మణ్యారాధన వల్ల కలుగుతాయిట.


ఇలా చెప్పుకుపోతే ఎన్నో కథలు, వింతలూ, విశేషాలూ..! మధ్యమధ్య చాగంటివారు ఉదహరించిన వివిధ సంస్కృత శ్లోకాలూ, శివానందలహరి, భాగవతం మొదలైనవాటి నుండి తీసుకున్న పద్యాలన్నీ కూడా మధురమైన భక్తితత్వంతో నిండి ఉన్నాయి.


ఇంకో మూడు,నాలుగు రోజుల్లో పారాయణ పూర్తవుతుంది. చదువుతున్న కాలంలో ఎదురైన చిన్న చిన్న విశేషాలు:

* గత రెండునెలల కాలం కూడా మాకెంతో పరీక్షాసమయం. కొన్ని చికాకులూ, సమస్యలతో సతమతమై అయోమయావస్థలో ఉన్న మాకు శివానుగ్రహం వల్లనే ఈ పురాణపఠనం చేసే సదవకాసాశం కలిగి, తద్వారా మా భారాలని తేలిక చేసుకోగలిగే మనస్థితిని శంకరుడే కల్పించాడని మేమిద్దరం కూడా విశ్వసిస్తున్నాం. 

* సెప్టెంబర్ లో ఒకనాడు మా అత్తగారు హాస్పటల్లో సీరియస్ గా ఉన్న రోజున.. ఆ అర్థరాత్రి పూట ఒక్కదాన్నీ హాల్లో కూచుని ఈ పుస్తకాన్ని కాగలించుకుని శివా..శివా.. శివా.. అన్న ఒక్క నామాన్ని మాత్రమే జపిస్తూ గడిపిన గంటలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈశ్వరానుగ్రహం వల్లనే ఆవిడ అప్పటికప్పుడు మామూలై ఆ పూటే మా ఇంటికి రాగలిగారని మేం నమ్మాము.

* సరిగ్గా శరన్నవరాత్రుల్లోనే "గౌరీపూజ", "అమ్మవారి రూపములు" ఛాప్టర్లు చదవడం చిత్రమనిపించింది. 

* నిన్న ఏదో పని మీద ఓ ఆఫీసుకి వెళ్తే అక్కడ మావారికి తెలిసినాయన, "పొద్దున్నే శ్రీశైలం వెళ్ళి వచ్చాను.. ప్రసాదమిదిగో.." అని ఇచ్చారుట. మేం వెళ్ళలేకపోతున్నామని శివుడు ప్రసాదం పంపాడని మురిసిపోయాం ఇద్దరం.

ఇవి చిన్న విశేషాలే అయినా మా మనసులని ఎంతో ప్రభావితం చేసినవి. ఆసక్తి ఉన్నవారు తప్పక ఈ శివమహాపురాణపఠనాన్ని చేసి ఈశ్వరానుభూతిని పొందవలసినదని మనవి.

***

లోకుల్ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ
చీకాకున్ బడనీ మహాత్ముడననీ..
మూకీభా వమునన్ తిట్టనీ త్రోయనీ
నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!
(శంకరాచార్యులు)


మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..!

Monday, September 22, 2014

ముగ్గురు కొలంబస్ లు


కొన్ని పుస్తకాలు విజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని భక్తిని ప్రబోధిస్తాయి. కొన్ని మార్గనిర్దేశం చేస్తాయి. మరికొన్ని తెలివితేటల్ని పెంచుతాయి. ఇన్నింటిలో మనకేది కావాలో ఆ తరహా పుస్తకాల్ని మనం చదవుకుంటూ ఉంటాం. ఇవే కాక కేవలం హాస్యభరితమైన రచనలు కొన్ని ఉంటాయి. అవి కేవలం మానసిక ఉల్లాసాన్ని మాత్రమే అందిస్తాయి. అలాంటి పుస్తకాలు చదువుకునేప్పుడు మన ఒత్తిడులన్నీ మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వేసుకోగలం. అలాంటి ఉల్లాసకరమైన రచనలు చెయ్యగల తెలుగు హాస్య రచయితలు బహుతక్కువ మంది ఉన్నారు. వారిలో డా.సోమరాజు సుశీల గారు ఒకరు. పూర్వం మన దర్శక,రచయిత శ్రీ జంధ్యాలగారి రచనల్లో కనిపించే సున్నితమైన వ్యంగ్యంతో కూడిన హాస్యం వీరి రచనల్లోనూ కనిపిస్తుంది. ఏ ఒక్క కథనూ చిన్న నవ్వు నవ్వకుండా, ఓ ఆలోచనలోకి దిగకుండా పూర్తిచెయ్యలేము. ఆ కథల్లో అప్పుడప్పుడూ కనబడే జీవిత సత్యాలను చదువుతుంటే ఓ కన్నీటి పొర కూడా అడ్డుపడుతుంది. రచనావ్యాసంగాన్ని ఎంతో ఆలస్యంగా మొదలుపెట్టినా, ఒక్క ఇల్లేరమ్మ కథలతోటే ఎంతో ప్రఖ్యాతి గడించి, మంచి రచయితగా తెలుగు పాఠకుల హృదయాల్లో పెద్ద పీట వేసుక్కూర్చుండిపోయారు సుశీల గారు.



తన అనుభవాలతో పారిశ్రామిక కథలైన "చిన్న పరిశ్రమలు పెద్ద కథలు(1999)" , తర్వాత సుశీలగారు ఆత్మకథారూపంలో రచించిన  "ఇల్లేరమ్మ కథలు(2000)", "దీపశిఖ(2009)" ఎంతో ఆదరణ పొందాయి. ప్రతి తెలుగువారింటా తప్పక ఉండవలసిన పుస్తకాల జాబితాలో చేరిపోవాల్సినటువంటి రచనలివి. ఇనాళ్ళకు మళ్ళీ అదే పంథాలో రచించిన "ముగ్గురు కొలంబస్ లు (2014)" సాహిత్యాభిమానులందరూ చదివి తీరాల్సిన పుస్తకం. ఎంతో ఉల్లాసాన్నీ, ఆనందాన్నీ, తృప్తినీ మనకందించే పుస్తకం. "సోమరాజు సుశీల రచనలు చదువుతుంటే ఏదో అవలీలగా రాసేసారనిపిస్తుంది. కానీ చాలా ఆలోచించి, ఒకటికి రెండుసార్లు తిప్పి తిప్పి రాస్తే గానీ ఆ క్లుప్తత రాదని గ్రహించడం అంత సామాన్యం కాదు. సున్నితమైన హాస్యం తగుపాళ్ళలో మేళవించి, చిక్కటి సీరియస్ నెస్ లని పల్చని చేయడం రచయిత్రికి బాగా తెలుసు. అందుకే సోమరాజు సుశీల కథల్లో అక్షరాలు శాటిన్ మీద ముత్యాల్లా పరుగులు తీస్తాయి. డా.సోమరాజు సుశీల కథల్ని అభిమానించే చాలామంది పాఠకుల్లో నేనూ ఒక్కణ్ణి.." అంటారు శ్రీరమణగారు 'దీపశిఖ' ముందుమాటలో. నాదీ అదే మాట.


ఏవో పన్నుల్లో బిజీగా ఉండి ఈమధ్యన నెట్ ఎక్కువ చూడట్లేదు. చాలా ఆలస్యంగా ఇటీవలే పుస్తకం.నెట్ లో "ముగ్గురు కొలంబస్ లు" పుస్తకానికి జంపాల చౌదరి గారి ముందుమాట ' అంతా మనవాళ్ళే ' చదివాను. వెంఠనే నవోదయాకి ఫోన్ చేసి పుస్తకం గురించి అడిగితే రావడం, కాపీలు అయిపోవడం కూడా అయిపోయింది అన్నారు. వారమంతా రెండుమూడుమాట్లు చేస్తూనే ఉన్నాం కాపీలు తెప్పించారా? అని. ఈలోపూ నాకు తొందర ఎక్కువై మావారిని బయల్దేరదీసి జంపాలగారు తన వ్యాసంలో ఇచ్చిన "ఉమా బుక్స్, 58, న్యూ బోయినపల్లి" అడ్రసు వెతుక్కుంటూ కొలంబస్సుల్లా మేమూ వెళ్ళాం. వీధి అదే కానీ ఎక్కడా ఉమాబుక్స్ అన్న బోర్డు కనబడలే. బయట అడిగితే ఇక్కడే ప్రింటింగ్ ప్రెస్సూ లేదన్నారు. 58 నంబరు ఇంటి సందులో అటుఇటు రెండుమూడుసార్లు తిరిగాం. నే లోపలికి వెళ్ళి అడుగుదామంటే .. రెడిడెన్స్ లాగుంది డిస్టర్బ్  చేస్తే బాగోదేమో.. అని మావారు సందేహించారు. అంత దూరం నుండీ ఉసూరంటూ వెనక్కి వచ్చేసాం. ఇంటికొచ్చాకా నాకనుమానం వచ్చి ఇల్లేరమ్మ కథలు పుస్తకం తీసి చూస్తే అది సుశీల గారి ఇంటి అడ్రసే!! అయ్యో.. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఉంటే ఆవిడని కలిసేవాళ్ళం.. అని మావారిని ఆడిపోసేసుకున్నా.. పాపం! మరో నాల్రోజులకి కాపీలు వచ్చాయని తెలిసాకా మొన్న శుక్రవారం మళ్ళీ పొలోమని మూడు బస్సులు అవీ మారి నవోదయాకెళ్ళి, ఎలాగో వెళ్లా కదా అని మరో నాలుగుపుస్తకాలు జతపరిచి ఓ ఐదు పుస్తకాలు కొని తెచ్చేసుకున్నా. మరో నాలుగడుగులేసి విశాలాంధ్రకు కూడా వెళ్దామనుకున్నా కానీ మరీ పర్సు ఖాళీ అయిపోతే పాపం మావారు చిన్నబుచ్చుకుంటారని ఆ సాహసం చెయ్యలేదు..:)


ఇంతకీ ఈ పుస్తకంలో సుశీలగారు ఏం రాసారూ అంటే.. ఆవిడా, వారి శ్రీవారు, అత్తగారూ.. ముగ్గురూ కలిసి వాళ్లమ్మాయి ఇంటికి అమెరికా వెళ్ళి వచ్చిన విధానాన్ని, అక్కడి వింతలూ విశేషాలనూ, అమెరికన్ల జీవన విధానాలనీ హాస్యభరితంగా తెలియబరిచారు. ".. చెమర్చే కన్నుల్లోవి ఏ భాష్పాలో తెలియని అయోమయంలో రోజులు గడిపేస్తున్న అమ్మానాన్నలకు.." అన్న వాక్యం చదవగానే నా కళ్ళ వెంట మా అమ్మానాన్నల కంటి తడి కదిలింది. ఒక గడియారానికి అమెరికా టైం సెట్ చేసి ప్రతి వారాంతం తమ్ముడి ఫోన్ కోసం చెవులు(కళ్ళు కాదు) కాయలు కాసే ఎదురుచూపు + వెళ్ళినవాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తారో తెలియని సందిగ్థం.. కలగలిసిన వాళ్ల ఆత్రం.. నా మదిలో మెదిలాయి. అమెరికాలో పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈ పుస్తకం చదివితే ఇది తమ కథేనని తప్పకుండా ఫీల్ అవుతారు.


నామటుకు నేను ఈ పుస్తకంలో చాలా సారూప్యాల్ని వెతుక్కున్నాను. సుశీలగారిలానే పుట్టినరోజుల్ని అమితంగా ఇష్టపడడం, తెలుగు ఇంగ్లీషు రెండు పుట్టినరోజుల్ని కొత్తబట్టలతో జరుపుకోవడం, కూరల షాపింగ్ అంటే కొట్టుకుపోవడం, వండివార్చడం..భోజనం విషయాలు, మాటనేసి అయ్యో ఎందుకన్నానని తర్వాత ఫీలవ్వడం, కూతురి కబుర్లు, ముఖ్యంగా చిన్నతనంలో అమ్మని ఏడిపించిన సంఘటనలు..మాటలు.. ఇవన్నీ చదువుతుంటే అచ్చంగా నా గురించి నేనే చదువుకుంటున్న భావన. ఇక వారి అత్తగార్ని గురించి చదివితే మా అత్తగారు గుర్తొచ్చి అందరు మొగపిల్లల తల్లులూ ఇంతేనన్నమాట అనుకున్నా. వాళ్లమ్మగారి గురించి చెప్తూంటే నా పెళ్లయి వెళ్పోయాకా ఎలా ఉండేదని మా అమ్మ చెప్పేదో అవే మాటలు గుర్తొచ్చాయ్!


ఓ చోట "ఒకవేళ దైవం రక్షించకో, రక్షించో మన స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు ముక్కలైపోతే మేం ఏది లాభమనుకుంటే అటువైపు మాట్లాడచ్చు. మాకా వెసులుబాటు ఉంది.." అంటారు సుశీల గారు. మా మావగారిది కృష్ణాజిల్లా అయినా, ఆయన పదమూడే ఏటే వాళ్ల కుటుంబమంతా హైదరాబాద్ వలస వచ్చేసారు. మావారిక్కడే పెరిగడం వల్ల యాదృచ్ఛికంగా నేనూ అదేమాట అనేదాన్ని..! ఇంకా ఆవిడ శ్రీవారు ముసుగు తన్ని పడుకోవడం, దుప్పట్లోంచే రేడియో వినడం మొదలైనవి చదివితే ఆయన అచ్చంగా నాన్నకు మారురూపేమో అనుకున్నా. ఇప్పటికీ తెల్లారింది మొదలు, రాత్రి జైహింద్ చెప్పేదాకా నాన్న ట్రాన్సిస్టర్ ఆయన పక్కన మోగుతూనే ఉంటుంది. ఆబ్బబ్బా మరీ అన్నీ వినేయాలా.. కట్టేయ్ నాన్నా అని విసుక్కుంటూ ఉంటా నేను వెళ్ళినప్పుడల్లా. అనౌన్సర్ గా తన జీవితంలో మూడొంతుల భాగం రేడియో స్టేషన్లోనే గడిపారు మరి.. రేడియో వినడం ఏలా మానతారు?! ఇంక ఆయనను బయటకు తీసుకువెళ్ళాలంటే సుశీల గారు పడే పాట్లన్నీ మా అమ్మా పడుతుంది పాపం. ఆయన ఇల్లు కదిలి వెళ్ళాలంటే ప్రళయం రావాలి. అన్ని ప్రయాణాలూ రిజర్వేషన్లు చేయించుకోవడం కేన్సిల్ చేయించుకోవడం.. ఇదే పని అమ్మకి. ఇంకా సుశీల గారి అభిప్రాయాలు కొన్ని చదువుతూంటే, ఆరే..ఇలాగే కదా నేనూ అనుకునేది అనుకున్నా చాలాసార్లు. అలాగ చాలా సారూప్యాలు దొరికాయీ పుస్తకంలో నాకు.


సుశీల గారి అమ్మాయి పక్కింటి అమ్మాయి కేరెన్, ఆ అమ్మాయి చదివిన యూనివర్సిటీ మెడికల్ స్కూళ్లో మెడిసన్ చదివే కుర్రాడు, అతని తండ్రీ, ఫార్మసీ స్కూల్ డీన్ అయిన కార్పెంటర్ ఆయనా; జీన్ అనే కాంట్రాక్టర్ జీవితాలను గురించి, ఏణ్ణార్థం పిల్లని ఎంతో డీసిప్లీన్డ్ పెంచుతున్న వాళ్ళమ్మాయి గురించీ తెలుసుకోవడం ఆనందాన్నిచ్చింది.


పుస్తకం మీరు తప్పకుండా కొని చదవండి. పుస్తకంలో బాగా నచ్చిన చాలా వాక్యాలు రాయాలనున్నా.. కొన్ని వాక్యాలు మాత్రం కోట్ చేసి ఆపేస్తాను..

* "మా కన్నతల్లి తన చేతులతో చెరువుమట్టితో వినాయకుడిని చెయ్యకుండానే చవితిపండుగలు, బొమ్మల కొలువులమర్చకుండానే దసరా పండుగలూ, చుక్కల ముగ్గులు పెట్టకుండానే సంక్రాంతి పండుగలూ అలా ఎన్నో సందడి ళేకుండా వచ్చి వెళ్ళిపోవడం చూడడానికి అలవాటుపడిపోయాం."

* "మారిపోతున్న మన దేశకాల పరిస్థితుల్లో నిరాదరణకు గురౌతున్నది పెద్దవాళ్ళే. "

* " జీవితంతో పోరాడుతూ డీలా పడకుండా పదిమందికీ సంతోషాన్ని పంచుతున్న కేరన్ లాంటి అరుదైన వ్యక్తుల గురించి అనవసరపు బెంగలు పెట్టుకుణే అధికారం నాకెవరిచ్చారు?"

* "ఇంతేనా ఈ దేశం గొప్ప. ఈ మాత్రానికేనా ఇళ్ళూ వాకిళ్ళూ, అమ్మలు. నాన్నలూ, అందర్నీ వదిలేసుకుని చలికి వణుక్కుంటూ, పనులు చేసుకుంటూ, బట్టలుతుక్కుంటూ, వారానికోసారి వండుకుంటూ, పిల్లలకోసం ఆరటపడుతూ, ఉద్యోగాల కోసం జాగ్రత్తపడుతూ మెతుకు మిగల్చకుండా, డాలర్ చేజారకుండా...ఇదేనా అమెరికా జీవితం.. ఈ భాగ్యానికేనా మన దేశంలో తల్లలంతా బిడ్డలు పుట్టినప్పటినుంచీ నోములూ వ్రతాలూ చేసి వెంకటేశ్వరుడి హుండీలో చదువు బిళ్ళలేసి, కళ్ళల్లో వత్తులేసుకుని చదివించీ,ఇళ్ళువాకళ్ళు తాకట్టు పెట్టి ఇక్కడికి పంపేది? నిజమే ఇక్కడుంటే అంతా స్వాతంత్రమే. అదేమిటని అడిగే అమ్మలుండరు. ఎండుకని అడిగే అత్తలుండరు. ఆరాలు తీసే చుట్టాలుండరు. గదమాయించే పెద్దవాళ్ళుండరు."

* "వెడితే విసుక్కోకుండా అతిధ్యమివ్వగల నంబర్లు ఓ ముఫ్ఫై పైగా దొరికాయి.."

* "మన ఇండియాలో అమ్మలుంటారు, నాన్నలుంటారు, అన్నదమ్ములుంటారు, భార్యలుంటారు, భర్తలుంటారు. అక్కడ కూడా వాళ్ళంతా ఉంటారు. వీళ్ళు కాకుండా మాజీ భర్తలు, భార్యలు, భావి భర్తలు, భార్యలు, అప్పటికే వాళ్ళు కన్న పిల్లలు ఇట్లా తామరతంపరగా అనంతమయిన పరివారాలుంటాయి.."

* "దేశమేదయినా, పధ్దతులలో తేడాలున్నా మానవస్వభావం మాత్రం ఒకటే అనిపించింది."

*" కొన్ని యూనివర్సలు సత్యాలుంటాయి. అవేమిటంటే ఎక్కడున్నా అల్లుళ్ళు బంగారు తండ్రులు, కొడుకులు చవటవాజమ్మలూ... కూతుళ్ళు అపర లక్ష్మీసరస్వతి అవతారాలు..కోడళ్ళ గురించి మాట్లాడకపోవడమే శ్రేయోదాయకం. వసుదైక కుటుంబం అంటే అదే కాబోలు."

*" భూతల స్వర్గంలాంటి ప్రదేశంలో సన్నటి సెలయేటి ఒడ్డున ఒక చిన్న గూడు. అన్నపూర్ణ లాంటి భార్య. ఏ మనిషికయినా ఇంతకంటే ఏం కావాలి. ఏవరైనా ఏం చేసుకుంటారు లక్షలూ, కోట్లు.."

సుశీల గారు పుస్తకం చివర్లో రాసిన వాక్యం మాత్రం సూపర్!
విమానం దిగాకా ఎయిర్పోట్ లో ఫ్రూటీ తాగాకా..
"ఖాళీ డొక్కులు ఎక్కడ పారేయాలో తెలియక "ట్రాష్ కాన్ కహా హై" అని ఎవర్నో అడిగా. "ఎక్కడైన పడేయండి పర్వాలేదు" అంటూ ఒక తెలుగాయన కాబోలు నవ్వుతూ చెప్పాడు.
విన్నారా! మన దేశం కదా. మనిష్టవే ఇష్టం.
బోలో స్వతంత్ర భారత్ కీ జై! "

Tuesday, August 19, 2014

తెలుగు వెన్నెల్లో తేనె మనసులు




మూడేళ్ల క్రితమనుకుంటా ఒకసారి మా పిన్ని వాళ్ళమ్మాయి చెప్పింది.. నర్సాపురంలో నా చిన్నప్పటి క్లాస్ మేట్ ప్రసూన అనీ.. ఆ అమ్మాయికి కూడా బ్లాగ్ ఉంది.. కవితలు అవీ రాస్తుంది అని. అప్పుడు చూశాను రెక్కల సవ్వడి బ్లాగ్. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. తనతో వ్యక్తిగత పరిచయంలేకున్నా అప్పట్నుంచీ బ్లాగ్ లోనే కాక వివిధ జాల పత్రికల్లో తను రాసే కవితలూ, కథలూ కూడా చదువుతూన్నా! ఈ అమ్మాయీ మంచి ఆర్టిస్ట్ కూడా. బొమ్మలు వేస్తుంది. తన కథలకి తానే బొమ్మలు వేసుకోవడం విశేషం. 'వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది ఉత్తమ రచనల పోటీలో తన కవితకు బహుమతి వచ్చింది.

ఒక మెట్టు పైకెళ్ళి ఈ మధ్యన ప్రసూన ఒక నవల రాసింది. 'కినిగె తెలుగు నవలల పోటీ 2014' కోసం ప్రసూన నవలను రాసింది. ముఖచిత్రం కూడా తనే వేసుకుంది. పేరేమిటంటే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". పేరు తమాషాగా ఉందే అనుకుని.. ఏమి రాసిందా అని ఆసక్తిగా నవల చదివాను. ఇట్స్ డిఫరెంట్..! రొటీన్ లవ్ స్టోరీనో, ఏదో సోషల్ మెసేజ్ ఉన్న నవలికో కాదు. ఇది మన తెలుగు భాష గురించిన కథ. ఇంగ్లీషు చదువుల వల్ల మన పిల్లలకు దూరమైపోతోందేమో అని మనం భయపడుతున్న మన తెలుగు భాష ఇంకా ఇంకా ప్రాచుర్యంలోకి ఎలా తీసుకురావచ్చో.. ఎలా పిల్లలకు తెలుగు నేర్పవచ్చో.. ఒక ఆలోచన చేసి చూపించిందీ నవలలో ప్రసూన. నూతనమైన, ఆచరయోగ్యమైన ఆలోచన.


 
మార్కులు ఎక్కువ రావనో, వేరే భాష కంపల్సరీ అనో స్కూళ్ళలో తెలుగు భాషే ఉండట్లేదు కొందరు పిల్లలకు. సెకెండ్ లాంగ్వేజ్ స్పానిష్షో, ఫ్రెంచో ఉంటున్నాయి కొన్ని స్కూళ్ళల్లో. ఇందువల్ల ఇంగ్లీషు, హిందీ, ఇతర ప్రాంతీయ భాషలూ సులువుగా వచ్చేస్తున్నాయి పిల్లలకు కానీ మనదైన తెలుగు భాష మాత్రం సరిగ్గా పలకడానికి కూడా రావట్లేదు. కొందరు పిల్లలకు తెలుగు రాయడం, చదవడం కూడా రాదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. కొన్ని పదాలకు అర్థాలే తెలీనివాళ్ళు కొందరైతే, అసలు తెలుగు చదవడమే రాని పిల్లలు కొందరు. మా అమ్మాయి రెండో తరగతి దాకా స్టేట్ సిలబస్ అవ్వడం వల్ల అప్పటిదాకా తెలుగు సబ్జెక్ట్ ఉండేది కానీ మూడవ తరగతిలో సెంట్రల్ స్కూల్ కి మార్చాకా తనకి స్కూల్లో తెలుగు సబ్జెక్ట్ లేదు. వచ్చిన కొద్దిపాటి భాషా మర్చిపోకుండా ఇంట్లో రోజూ న్యూస్ పేపర్ చదివించడం, తెలుగు కథల పుస్తకాలు కొని చదివించడం, గుణింతాలూ, వత్తులూ రాయించడం చేస్తుంటాము మేము. నేనప్పుడప్పుడు అశ్రధ్ధ వహించి వదిలేస్తున్నానని వాళ్ళ నాన్నగారు రోజూ రాత్రి పాప చదువుకునే బెడ్ టైం స్టోరీస్ తెలుగు కథలే చదవాలని రూల్ పెట్టేసారు. ఆ విధంగానైనా తెలుగు మరిచిపోకుండా ఉంటుందని, తెలుగు చదవడం అలవాటవుతుందనీ మా ప్రయత్నం. అచ్చం ఇలానే ప్రసూన కూడా తన మొదటి నవలలో కూడా పిల్లలకు తెలుగు ఎలా నేర్పచ్చు అనే ఆలోచనకి ఓ ప్రణాలికని తెలిపింది.

 
హైదరాబాద్ లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో చందన అనే పాప ఉంటుంది. ఊరు నుండి వచ్చిన వాళ్ళ స్వామి తాతయ్యగారు అక్కడ నివసిస్తున్న పిల్లలందరికీ తెలుగు ఎలా నేర్పించారు. తాతా మనవరాలు కలిసి "తెలుగు వెన్నెల" పేరుతో తెలుగు తరగతులను నడిపించి, ఎంతోమంది పిల్లలకు తెలుగు భాష ఎలా నేర్పించారో తెలిపే కథే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". మన బిజీ స్కెడ్యూల్స్ లోంచి కాస్తంత వెసులుబాటు చేసుకుని మన పిల్లలు మాతృభాష మర్చిపోకుండా చెయ్యాల్సిన బాధ్యత పెద్దలదే అన్నది ఈ నవలలో అంతర్లీనంగా ఉన్న సందేశం. ఇదొక్కటే కాక పిల్లలకు నేర్పించాల్సిన చెయ్యవలసిన కొన్ని మంచి అలవాట్లు, విషయాల ప్రస్తావన కూడా కథలో ఉంది. ఇది పిల్లల నవల.. అనుకోవచ్చు. పిల్లలకు మన మాతృభాష పట్ల మక్కువ ఎలా కలిగించాలో పెద్దలకు తెలిపే నవల అనుకోవచ్చు. కథ, కథాగమనం సంగతి ఎలా ఉన్నా, ఇదొక విభిన్నమైన మంచి ప్రయత్నమని ఖచ్చితంగా చెప్పచ్చు.  కథలో తాతామనవరాళ్ల మధ్యన ఉన్న గాఢానుబంధం నన్ను బాగా ఆకట్టుకుంది. నాకు తాతయ్యలంటే మహా ఇష్టం. ఎందుకంటే నాకు ఊహ వచ్చేసరికీ ఇరువైపుల తాతయ్యలూ ఫోటోల్లో కనిపించారు మరి :(


అయితే, ఈ "తెలుగు వెన్నెల" తరగతులు, కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇందులో అమితోత్సాహంతో పాల్గోవడం వంటివి నాకు కొధ్దిగా హైలీ ఐడియలిస్టిక్ గా అనిపించాయి. ఈకాలంలో అసలు కొందరన్నా అలా ఉంటారా అన్నది నాకు సందేహమే! ఉంటారేమో మరి..!! కథాస్థలం హైదరాబాద్ కాకుండా ఏ అమెరికానో, మరో దేశమో అయి ఉంటే పాత్రల్లో తెలుగు భాష పట్ల కనిపించిన ఇంటెన్స్ ఫీలింగ్స్ ఏప్ట్ గా అనిపించేవేమో అనిపించింది నాకు. ప్రసూనకి ఇది మొదటి ప్రయత్నం కాబట్టి కథాగమనంలో లోటుపాట్లు పట్టడం సబబు కాదనిపించింది నాకు.




నే గమనించిన.. నాకు ఇబ్బంది కలిగించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అక్షర దోషాలు. నవలాంశమే తెలుగు భాష నేర్చుకోవడం అయినప్పుడు మరి అందులో అక్షర దోషాలు దొర్లితే చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. వీటిని సరిచేసే పధ్ధతి ఏదైనా ఉందేమో రచయిత్రి కనుక్కుని అవన్నీ సరిచేస్తే బాగుంటుంది. ఇదొక్కటీ తప్పిస్తే.. పిల్లలకు మాతృభాష పట్ల ఆసక్తి కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న సందేశం బాగుంది. ఇలా ఒక ప్రణాలిక ద్వారా కాకపోయినా ఎవరి ఇంట్లో వాళ్ళం మన పిల్లలకు అప్పుడప్పుడన్నా మాతృభాష పట్ల అభిమానం ఏర్పడే ప్రయత్నాలు చేస్తూంటే బాగుంటుంది. ఈ నవల కినిగె.కాం లో లభ్యమవుతోంది.




బ్లాగ్ముఖంగా ప్రసూన చేసిన ఈ మొదటి ప్రయత్నాన్ని అభినందిస్తూ, తన నుండి ఇంకొన్ని మంచి కథానికలూ, నవలలూ రావాలని కోరుకుంటున్నాను.


Friday, June 27, 2014

కొత్త పుస్తకాలు: 4. శ్రీకాంతశర్మ సాహిత్యం



ఈ నాలుగవ పుస్తకం నేను కొనలేదు. నాన్నగారికి మిత్రులు శర్మగారు బహుకరిస్తే నే తస్కరించుకు తెచ్చుకున్నా :)
నాన్నగారి మిత్రులు, కవి, రచయిత, విమర్శకులు, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సమగ్ర సాహిత్యం వస్తుందని తెలిసినప్పటి నుండీ ఆత్రంగా ఎదురుచూసాము. 'సృజన', 'సమాలోచన' పేర్లతో రెండు భాగాలు ప్రచురింపబడిన ఈ సమగ్ర సాహిత్యాన్ని నవోదయావారు ప్రచురించారు. రెండు సంపుటాలూ కలిపి వెల 2,500/- శర్మగారు తన సప్తతి (డెభ్భైయ్యవ జన్మదినం) సందర్భంగా మే నెల 29న ఈ పుస్తకాలను మార్కెట్లో విడుదల చేసారు. ఆయనకు ఆర్భాటాలు నచ్చని కారణంగా సభా సమావేశాలు పెట్టి విడుదల చెయ్యలేదు. మొదటి భాగం 'సృజన'లో శర్మ గారి కవిత్వ, లలితగీతాల సంపుటిలు, యక్షగానాలు, కథలూ, నవలలు, నాటకాలు, నాటికలు(ఇరుగు-పొరుగు) ఉన్నాయి. రెండవ భాగం 'సమాలోచన'లో సాహిత్యదీపాలు, అలనాటి నాటికలు, ఆలోచన, సంచలనమ్, తెలుగు కవుల అపరాధాలు, మనలో మనమాట, ఇంద్రధనుస్సు, పరిపరి పరిచయాలూ ఉన్నాయి.



ఇందులోని రచనలన్నీ వివిధ పత్రికలలో, సాహిత్య సదస్సులలో, రంగస్థలంపై, రేడియోలో వెలుగు చూసాయి. ఈ మొత్తం ఇరవై పుస్తకాలలో పధ్నాలుగు పుస్తకాలు ఇదివరలో విడివిడిగా వెలువడ్డాయి. కవిత్వంలో అనుభూతిగీతాలూ, శిలామురళి, ఏకాంతకోకిల, ఆలాపన; ఇంకా రెండవ సంపుటిలో సాహిత్య దీపాలు, ఆలోచన, పరిపరిపరిచయాలూ ఇదివరకూ నాన్నగారి వద్ద చదివాను నేను. మిగిలినవి నేను కూడా ఇంకా చదవవలసి ఉంది. ఆసక్తిగల సాహితీమిత్రుల కోసం ముందు పుస్తకం విడుదల గురించి ఈ కొద్దిపాటి వివరాలతో టపా రాస్తున్నాను. 



చిన్నప్పటి నుండీ ఎరిగున్న నాన్నగారి స్నేహితులుగా కాకుండా, ఒక కవిగా నాకు శర్మ గారంటే ఎంతో గౌరవం, అభిమానం. ఒక విజ్ఞాన ఖని ఆయన. మా ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటూంటే ఓ పక్కగా కూచుని వాళ్ళ సాహిత్యపుకబుర్లన్నీ వినడం భలే సరదాగా ఉండేది నాకు. ఇలా శర్మగారు అని రాయాలంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. శ్రీకాంతశర్మ మావయ్యగారు అని పిలిచేవాళ్ళం ఆయనను. అలానే బావుంటుంది పిలవడం ఇప్పటికీ. మావయ్యగారు పాట రాస్తే సగం పదాలకు అర్థాలు అడిగి తెలుసుకునేవాళ్ళం మేం పిల్లలం. ఇప్పుడు తెలిసినంత కొద్దిపాటి తెలుగు కూడా చిన్నప్పుడు తెలీదు కదా. కొన్ని పాటల్లోని తోతెంచనా, దరిసి, ననలు తొడగవా, తమి పిలుపు మొదలైన పదాలు ఇంకా గుర్తున్నాయి.. అవి తెలుగువా అని ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ తరంవారి పాండిత్యం, తెలుగు భాషాపరిజ్ఞానము ఇప్పటి తరాలకు సగమన్నా వచ్చేనా అని దిగులు కలుగుతూ ఉంటుంది నాకు. రచనా వ్యాసంగాల కోసం కాదు కానీ గ్రంధస్తమై ఉన్న తెలుగు సాహిత్యాన్ని చదవుకోవడానికన్నా మన పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన అవసరం ఉంది. 


ఎప్పుడో రచనాకాలం దాటిన కొన్ని దశాబ్దాల తరువాత ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న కొన్ని సమగ్ర సాహిత్యాల్లా కాకుండా, వర్తమానంలో తన సాహిత్యసంపుటిల్లో ఏ ఏ రచనలు కలపాలో, వేటిని తీసివెయ్యాలో మొదలైనవన్నీ శర్మగారు స్వయంగా చూసుకుని అచ్చుకు ఇవ్వడం నాకు ఆనందాన్ని కలిగించింది. "వెనుతిరిగి చూసుకుంటే.." అనే ముందుమాటలో శర్మ గారు చెప్పిన ఈ చివరి మాటలు నాకు బాగా నచ్చాయి..
"నా వ్యక్తిగత విశ్వాసాలు - నేను నా పఠనం ద్వారా, అనుభవాల ద్వారా, తర్కించుకుని ఏర్పరుచుకున్నవి. ఈ ప్రపంచంలో సర్వ విశ్వాసాలకీ, చర్యలకీ, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు; సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం. అయితే - ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యం. అందుచేత - సాహిత్య పఠనం, రచన, వ్యాసంగాలలోకి మనసు పెట్టేవాళ్ళు తమ మనస్సులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవలసి రావచ్చు; కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనస్సులోకి వెలుతురు తాకే అవకాశం ముఖ్యం - దానిని మూసి పెట్టకూడదు.
ఈ సందర్భాలలో, ఈ సంపుటాలలోని నా రచనలు ఏ మాత్రమైనా మీకు ఉపకరిస్తే, యాభైయ్యేళ్ళ నా సాహితీ వ్యాసంగం చరితార్థమైందని భావిస్తాను
."



 

ఈ సంపుటాలలోని వ్యాసాలూ, కథలు, నవలలు చదివాకా మరెప్పుడైనా వివరంగా మళ్ళీ రాస్తాను.
మొదటి సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:




 రెండవ  సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:


Wednesday, June 25, 2014

కొత్తపుస్తకాలు: ౩. స్వరలహరి


మన తెలుగు సినీ సంగీతదర్శకుల గురించి ఒక రచయిత లేదా ఓ అభిమాని వ్యాసమో పుస్తకమో రాస్తే ఒకలా ఉంటుంది. అదే ఆయా సంగీతదర్శకులతో కలిసి పనిచేసి, స్నేహం కలిగిన ఓ గాయకుడు రాస్తే విభిన్నంగా ఉంటుంది. అటువంటి విభిన్నమైన ప్రయత్నమే ఈ పుస్తకం. సినీ సంగీతాకాశంలో తన స్వరాలతో ఓ అందమైన ఇంద్రధనస్సుని సృష్టించుకున్న స్వర్గీయ శ్రీ పి.బి.శ్రీనివాస్ రచన ఈ "స్వరలహరి". నేపథ్యగాయకుడు కాక మునుపు శ్రీ పి.బి.శ్రీనివాస్ పత్రికారంగంలో వివిధ కలంపేర్లతో రచనలు చేసేవారుట. భాష మీద పట్టు, చదివించే గుణం, మధ్య మధ్య వాడిన ఛలోక్తులు ఆయన ఎంత మంచి రచయితో తెలియజేస్తాయి. పి.బి తన వ్యాసాలలో చేసిన తమాషా ప్రయోగాలు తిరుపతి లడ్డూలోని జీడిపప్పులా, కలకండ పలుకుల్లా పాథకుల్ని ఆకట్టుకుంటాయి అని సంపాదకులు డా.కొంపల్లె రవిచంద్రన్ అంటారు.


1963-1964 ప్రాంతంలో జ్యోతి మాస పత్రికలోధారావాహికగా వెలువరించిన ఈ వ్యాసాలను గ్రంధరూపంలోకి తెచ్చింది "కళాతపస్వి క్రియేషన్స్". అన్ని విశాలాంధ్ర బుక్ హౌసుల్లోనూ లభ్యమౌవుతున్న ఈ పుస్తకం వెల కేవలం నూటఏభై రూపాయలు. ఆయన స్వర్గస్థులవ్వకముందరే పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నారుట కానీ సాధ్యమవలేదుట. ఈ ప్రయత్నం ప్రధమ వర్ధంతి లోపునన్నా పూర్తయినందుకు ఆనందం వ్యక్తం చేసారు ప్రచురణకర్తలు. వ్యాసాల మధ్యన ప్రచురించిన ఎన్నో అరుదైన, అపురూపమైన ఫోటోలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ఈ పుస్తకంలో పి.బి. ఒక పదకొండు మంది సంగీత దర్శకుల గురించి రాసిన వ్యాసాలు ఉన్నాయి. కేవలం సంగీత దర్శకుల వివరాలూ, పాటల ,సినిమాల వివరాలే  కాక వ్యతిగతంగా వారెలా తనకు పరిచయమో, వారితో జరిగిన కొన్ని సంఘటనలు, వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఘటనల ఉదాహరణలు, వారి అలవాట్లను గురించి ఎంతో చక్కగా వివరిస్తారు పి.బి ఈ వ్యాసాల్లో. ఈ వివరాలే ఈ పుస్తకానికో ప్రత్యేకతను తెచ్చాయి. వ్యాసం పూతయిన తరువాత ప్రతి సంగీత దర్శకుడి తాలూకూ చిన్న బయోడేటా కూడా ఒక పేజీలో అందించడం బాగుంది.

నేను ఎక్కువ వివరాలు రాయను కానీ ఒక్కో దర్శకుడి గురించి పి.బి. చెప్పిన ఒకటి రెండు విశేషాలు రాస్తాను.


హాయిగా పాడుదునా? (సాలూరి రాజేశ్వరరావు)
సాలూరివారు మంచి క్రియాత్మక హాస్యప్రదర్శనాప్రియులు(ప్రాక్టికల్ జోకర్) కూడానట. ఒకసారీ ఏవో రిహార్సల్స్ అయ్యాకా ఒక ఆంగ్ల చిత్రానికి వెళ్ళే ప్లాన్ వేసుకున్నారుట అందరూ. రాజేశ్వరరావుగారి కారు సర్వీసింగ్ కి వెళ్ళిందిట. నేను పికప్ చేసుకుంటాను ముమ్మల్నని పి.బి అడిగితే, మీకెందుకు శ్రమ, చిన్న పనిచూసుకుని నేనే ఆటో రిక్షా మీద థియేటర్ వద్దకు వచ్చేస్తానని చెప్పారుట. పి.బి., అసిస్టెంట్స్ థియేటర్ వద్ద చాలా సేపు నించుని నుంచుని అలసిపోయి సాలూరివారు లేకుండా సినిమా చూడాలనిపించక వెనక్కివెళ్పోతుంటే అప్పుడు వచ్చారుట. సినిమా అయ్యాకా చెప్పారుట.. మీతో ఆటో రిక్షాలో వస్తానన్నాను కదా. ఆటో కోసం టాక్సీ వేసుకుని  ఊరంతా వెతికి ఈ ఆటో దొరికి వచ్చేసరికీ ఇంత లేటయ్యింది. మీరు ఎదురు చూస్తుంటారని వచ్చాను లేకపోతే రాకపోదును అన్నారుట.


వేణు -గానలోలుడు
మాష్టర్ వేణు గా పిలవబడే మద్దూరి వేణుగోపాల్ కు హార్మోనియం,పియానో, సితార్,గిటార్,దిల్రుబా,మేండొలీన్, ఎకార్డియన్, ఫ్లూట్,సెల్లో,ఉడొఫోన్,జలతరంగిణి,హేమండ్ ఆర్గన్ మొదలైన పదిపదిహేను వాయిద్యాల్లో ప్రావీణ్యం ఉండేదిట. ఎవరైనా ముఖ్య వాయిద్యగాళ్ళు రికార్డింగ్కి రాలేకపోతే తానే ఆ స్థానాన్ని భర్తీ చేసేసేవారుట. నౌషాద్ కు వీరాభిమానిట. నౌషాద్ సంగీతం ముందర ఎవరి సంగీతం రక్తి కట్టదని ఆయనకొక నిశ్చితాభిప్రాయం ఉండేదిట.


 సుసర్ల దక్షిణామూర్తి:
లతా మంగేష్కర్ చేత ప్రప్రధమంగా తెలుగు సింహళ భాషలలో పాడించిన ఘనత సుసర్లవారిది. భానుమతికి భానుమతి చేతే "అందంలో పందెమేస్తా" అని పాడించారు.  "చల్లని రాజా ఓ చందమామ", "జననీ శివకామినీ" మొదలైన హిట్స్ ఇచ్చారు. చక్కని పాటలెన్నో పాడి ప్లేబాక్ సింగర్ గా కూడా పేరు గడించారు.


పాటల టంకశాల ఘంటసాల
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని  పధ్ధెనిమిది నెలలు జైలుకెళ్ళి వచ్చారుట ఘంటసాల. తర్వాత ఒక నాటక కంపెనీని నడుపుతూ  నష్టాల్లో ఉండగా సముద్రాల రాఘవాచారిగారు వీరి గొంతు బాగుందని మద్రాసు రామ్మన్నారుట. నాటక కంపెనీ మూసేసి ఇరవై రూపాయిలతో మద్రాసు చేరుకున్నారుట ఘంటసాల.


సప్తస్వరాల ఉయ్యాల
తెలుగువారు ఎక్కువగా పాడుకునే సినిమా పాటల్లో ఎక్కువభాగం పెండ్యాల నాగేశ్వరరావు గారివేనట. జగదేకవీరునికథ లో శివశంకరీ పాటకు నాయకుని గానానికి శిల కరిగిపోవలసి ఉంది.మీరెలా కరిగిస్తారోమరి అన్నారుట దర్శకులు కె.వి.రెడ్డిగారు. అహర్నిశలూ శ్రమించి ఆ పాటకు  బాణీ రూపొందించారుట ఆయన.


ఇంకా ఈ పుస్తకంలో...
* స్వరపరాయణ ఆదినారాయణ రావు గారు,
* రసికజన మనోభిరామ అశ్వత్థామ(సుప్రసిధ్ధ వైణికురాలు గాయిత్రి వీరి కుమార్తె),
* స్వరాల రాజు టి.వి.రాజు(పూతి పేరు తోటకూఅ వెంకటరాజు),
* జంట స్వరాలు(ఎం.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి),
* స్వరసప్తాచలపతి తాతినేని చలపతి,
*జనం నోట తనపాట పలికించిన చిలక కె.వి.మహాదేవన్ (పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహాదేవన్)
మొదలైన సంగీతకారుల గూర్చిన కబుర్లు ఉన్నాయి.

ఇలా ఇందరు మహానుభావుల గురించిన ఎన్నో కబుర్లు ఉన్న ఈ పుస్తకం మరి దాచుకోవలసిన తాయిలమే కదా!