సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label అభిప్రాయాలు..భావాలు. Show all posts
Showing posts with label అభిప్రాయాలు..భావాలు. Show all posts

Tuesday, October 29, 2024

OTT Entertainment : 2


కొన్నేళ్ల క్రితం మనందరమూ ఇళ్ళల్లో బందీలమైన pandemic కాలంలో ఈ ఓటిటి వినోదం చాలామందిని తన దాసులుగా చేసేసుకుంది. ఒక సినిమాకి వెళ్తే ఐదువందల నుంచీ వెయ్యి రూపాయిల దాకా అవలీలగా ఖర్చవుతున్న కాలంలో ఇంట్లో కూర్చోపెట్టి, మూడు వెబ్ సిరీస్ లు, ఆరు సినిమాలు కాదు ముఫ్ఫై వెబ్ సిరీస్ లు , ఆరువందల సినిమాలు చందాన వినోదాన్ని చూపెడుతుంటే నాబోటి మధ్య తరగతి ప్రేక్షకులు ఎక్కడ వద్దనగలరు? వద్దంటే సినిమాలు...సినిమాలు.. సినిమాలు!! బోర్ కొట్టినప్పుడో, బయటకు వెళ్ళలేకపోయినప్పుడో, ప్రపంచాన్ని మర్చిపోవాలనుకున్నప్పుడో.. ఈ ఓటిటి ప్రపంచం రెండు చేతులు చాచి మనల్ని తన కౌగిట్లోకి తీసుకుని ఎవరి అభిరుచికి తగ్గ సినిమాలు వారికి చూపించి ఆహ్లాదపరుస్తోంది. నేను కూడా నే చూసిన కొన్ని సినిమాల గురించి సిరీస్ రాద్దామని 2021లో ఒక సిరీస్ మొదలుపెట్టాను కానీ రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకూ మళ్ళీ రాయలేకపోయాను. ఇటీవలే ఓటిటిలో చూసిన ఒక చిత్రవిచిత్రమైన సినిమా గురించి రాయడానికి ఇవాళ్టికి కుదిరింది ! 


గత వారంలో అనుకుంటా ఒకానొక ఉదయాన 339వ సారి "సాగరసంగమం" అనే చిత్రరాజాన్ని పెట్టి, సగం అయ్యాకా ఆఫీసుకి వెళ్పోయారు ఇంటాయన. సరే మరింక మొదలుపెట్టాకా కట్టేయలేము గనుక చివరిదాకా చూసేసి, పక్కనే ఉన్న తువ్వాలుతో కళ్ళు తుడిచేసుకుని...వాటే మూవీ, వాటే డైరెక్టర్, వాటే స్టోరీ..అనేసుకుని, ఇంటి పనుల్లో పడిపోయాను. మధ్యాహ్నం మరోసారి టీవీ తిప్పుతూంటే ఒకానొక సినిమా కనబడింది. అంతకు ముందు నాలుగైదు సినిమాల్లో నటించినా గుర్తింపు పెద్దగా రాలేదు కానీ ఒక బ్లాక్బస్టర్ మూవీలో అమితంగా అందంగా కనిపించడం వల్ల అచానక్ సెన్సేషనల్ స్టార్ అయిపోయిన ఒక అమ్మడు నటించిన సిన్మా! ఇంతకాలం ఒక హీరో ఇద్దరు లేక ముగ్గురు వీరోవిన్లను చూడడానికి అలవాటు పడ్డ కళ్ళకి ఒక వీరోవిన్, ఇద్దరు హీరోలు కనబడేసరికీ వింతగా ఉంది చూద్దాం అని మొదలుపెట్టాను. 


సినిమా గడుస్తున్న కొద్దీ దేదో సినిమాలో అల్లు అర్జున్ లా "దేవుడా..," అని కొన్నిసార్లు రిపీటేడ్ గా అనుకోవాల్సి వచ్చింది!!!! పొద్దున్న నేను చూసిన సినిమా ఏమిటీ...ఆ కథ ఏమిటీ...భారతీయ సనాతన సాంప్రదాయానికి పెద్ద పీట వేసిన ఆ విలువలు ఏమిటీ...ఇప్పుడు నేను చూస్తున్న ఈ కథ ఏమిటి? దేవుడా! కలికాలం బాబూ కలికాలం అంటే ఇదే అనిపించింది. కథ కొంచెమైనా చెప్పకపోతే ఈ ఘోషకి అర్థం ఉండదు మరి. 


ఒకానొక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడి, వెంట పడి, ఒప్పించి పెళ్ళి చేసుకుంటాడు. కెరీర్ పరంగా ఆమెకు ఒక కల ఉంటుంది. దానికి సహాయపడతానన్న భర్తగారు పెళ్లవ్వగానే అదంతా మర్చిపోయి, తనను ఒక మామూలు హౌస్ వైఫ్ గా మాత్రమే చూడడం  అమ్మాయికి నచ్చదు. ఒక రెండు, మూడు దెబ్బలాటల తర్వాత కట్టీఫ్ అనేసుకుని ఇద్దరూ విడిపోతారు! విడాకుల కాగితాలు కూడా ఇచ్చిపుచ్చేసుకుంటారు. అమ్మాయి వేరే ఊరుకి వెళ్పోతుంది. ఇక్కడి దాకా బానే ఉంది. ఇప్పుడు ఆ కొత్త ఊరిలో ఆమె పని చేసే చోట మరో అబ్బాయి పరిచయమవుతాడు. ఒకానొక రోజున అమ్మాయికి కొంచెం మందు ఎక్కువవుతుంది. మీరు చదివినది నిజమే. గతంలో సినిమా కథల్లో అబ్బాయికి మందు ఎక్కువ అయ్యి పిచ్చి పిచ్చి పనులు చేసినట్లు చూపెట్టేవారు. వెనుకటి కాలపు నలుపు తెలుపు సినిమాల్లో కథానాయకులు తండ్రుల ముందర సిగ్రెట్లు వంటివి కాల్చేవారు కాదు. వాళ్లని చూసి పారేసినట్లు చూపెట్టేవారు. మా కాలంలో సినిమాల్లో తండ్రులు, పిల్లలని పక్కన కూర్చోపెట్టుకుని గ్లాసులు అందిస్తూ ఉండడమే చూశాము. ఇప్పుడు కాలం మారింది. ఇక అమ్మాయిలు సైతం - సిగరెట్లు మాత్రమే కాక పబ్బుల్లో గ్లాసులు, ఏకంగా సీసాలు కూడా ఖాళీ చెయ్యడం వినోదంగా చూపిస్తున్నారు చాలా సినిమాల్లో. అదేమిటంటే ఈట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ మోడ్రన్ లైఫ్ స్టైల్ అనేస్తున్నారు ఈజీగా! స్వేచ్ఛ పేరుతో మహిళలకు మంచికన్నా చెడే ఎక్కువగా ఎదురౌతున్న కాలం అని ఎవరూ గమనించట్లేదో ఏమో తెలీదు మరి :( నవతరం సినిమాల్లో మహిళలు నిండుగా బట్టలు వేసుకోవడం అనే కాన్సెప్ట్ నే మర్చిపోయారు. పైగా సినిమాల్లో చూసి బయట కూడా అలాంటి దుస్తులే ధరిస్తున్నారు. అదే కల్చర్ ని ఫాలో అవుతున్నారు చాలామంది విద్యార్థినులు. వెరీ పిటీఫుల్!


 సరే ఇంతకీ ఈ చిత్రరాజం తాలుకు కథలోకి వచ్చేస్తే, కాస్త మందు ఎక్కువైన సదరు అందమైన వీరోవిను కొత్త వర్క్ ప్లేస్ లో స్నేహితుడైన అబ్బాయితో నైట్ స్టాండ్ చేస్తుంది. ఇదేమి కథరా అనుకునేలోగా కాసేపట్లో అక్కడికి "ఐ కాన్ట్ ఫర్గెట్ యూ" అనుకుంటూ విడాకులు ఇచ్చేసిన మొదటి భర్తగారు వస్తారు. ఆ తర్వాత జరిగిన కథను ఇక ఇక్కడ రాయలేను. "heteropaternal superfecundation" అనే ఒక అరుదైన, వింత  కాంప్లికేషన్ ని వీరోవిన్ ప్రెగ్నెన్సీకి తగిలిస్తారు. సిన్మా చివరికి మాత్రం భార్యాభర్తల్ని కలిపేసి కథ సుఖాంతం చేసేసారు. అసలు ఇలాంటి కథ రాసి "సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు బాబూ?" అని సదరు కథా రచయితని అడగాలని అనిపించింది.


వీరోవిన్ కి పెళ్ళి అయ్యిందని తెలియగానే తన ప్రేమని పాతాళానికి తొక్కిపెట్టేసి, భార్యా భర్తల్ని కలిపేసి, జీవితాంతం వాళ్లకి గుళ్ళో పూజలు చేయించే హీరో ఉన్న పొద్దుటి సినిమా కథకి, ఈ మధ్యాహ్నం చూసిన చిత్ర విచిత్రపు సినిమా కథకీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా! అంత నచ్చకపోతే చూడడం మానేయచ్చు కానీ అసలీ కథకు ముగింపు ఏమి ఇచ్చాడా అని చివరివరకూ చూసాను. కాకపోతే రిమోటు నా చేతిలో ఉంది కాబట్టి కాస్త ఫాస్ట్ ఫార్వార్డ్ చేసేస్తూ, చివరిగా మరోసారి ..  దేవుడా అనుకుని టివీ కట్టేసాను.


ఈ సిన్మాలో ఒక పాట మాత్రం బాగా హిట్ అయ్యింది. మూడు,నాలుగేళ్ళ బుడతలు కూడా ఆ డాన్స్ స్టెప్స్ వేసేసి రీల్స్ చేయడం చూసాను కానీ అది ఈ సినిమాలోదని చూసినప్పుడు తెలిసింది. 


Wednesday, July 12, 2023

మౌనం?




ఏమిటీ మౌనం? ఎప్పుడు మళ్ళీ రాస్తావు? అని ఎవరైనా స్నేహితులు అడిగినప్పుడల్లా మనసుకి చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు అడిగారు చాలా రీసెంట్ గా.

మాటల్లో చెప్పలేనంత ఆనందం... 

ఇన్నాళ్లైనా ఇంకా రాయమని అడిగేవారు ఉన్నారన్న తృప్తి,

మళ్ళీ బ్లాగ్ వైపు చూసేలా చేస్తుంది!

ఇది నా ప్రపంచం. 

నా అక్షరాలు నా ఉనికిని వెతుక్కుంటూ దిగంతాల వరకూ పయనించే ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ బ్లాగ్లోనే!

ఈ పయనం ఎన్నో అవాంతరాలను, ఆక్రందనలను, అవమానాలను,  తట్టుకుని, దాటుకుని, ఇంకా సాగుతూనే ఉంది.

మౌనంలో కూడా పయనమే ఉంది.

అప్పుడప్పుడూ కొన్ని సమాధానాలు చెప్పాలనిపిస్తుంది..

కానీ మౌనం అన్నింటినీ మించిన గొప్ప సమాధానం కదా!  

నామటుకు నాకు -

అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఇదే సత్యం.

మౌనమే ప్రశ్న.

మౌనమే జవాబు.

మౌనమే ప్రశాంతత.

మౌనమే జ్ఞానం.

ఇంతకు మించి వేరేమీ లేదు.

చివరకు మిగిలేది అంతకన్నా ఏదీ లేదు.


Saturday, September 11, 2021

OTT Entertainment : 1


ఇవాళ ఒక కొత్త సినిమా చూసిన తర్వాత కొన్ని ఆలోచనలు -

సినిమా బానే ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే, మనకి కావాలి అనిపించేవి, ఇలా జరిగితే బాగుండు.. అనిపించేవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. నిజ జీవితంలో అలా ఏమీ జరగవు. అసలు అలాంటి ఒక ఊహజగత్తులో బ్రతకడమే ఎంత తప్పో తెలిసేసరికీ సగానికి పైగా జీవితం అయిపోతుంది. వెర్రిమొర్రి కథలతో సినిమాలు తీసేసి ప్రజలపై రుద్దేసి డబ్బు చేసుకోవడమే తప్ప ఇవి ప్రజల జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో అన్న ఆలోచన ఎవరికి ఉండదు. ఇది మా జీవనోపాథి అంటారు సినీమారాజులు. చూడడం చూడకపోవడం, మన తప్పొప్పులు  మన బాధ్యత. కానీ రివైండ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా మొదలుపెట్టడానికి ఇది వీడియోనో, రిమోట్ కంట్రోలో కాదుగా... అసలు సిసలైన జీవితం!! ఒక్క రోజు, ఒక్క క్షణం పోయినా మళ్ళీ వెనక్కు రావు! వెనక్కి తెచ్చుకోలేము. 


ఇంత చిన్న విషయం అర్థం కాదా మనుషులకి? అర్థం అయినా అర్థం కానట్టు బ్రతికేస్తారా? ఇన్నాళ్ళూ నువ్వూ చూశావు కదమ్మా నానారకాల సినిమాలూ...ఇప్పుడేమో బోధిచెట్టు క్రింద జ్ఞానోదయమైన బుధ్ధుడిలా పెద్ద చెప్పొచ్చావులే పో పోవమ్మా! జీవిత సత్యాలు అందరికీ తెలుసు. ఇది జగన్నాటకంలో భాగం. అంతే! అంటారు మేధావులు. 


అయినా నా పిచ్చి కానీ ఎవరు చెప్తే ఎవరు వింటారు? నేను విన్నానా? ఎవరి జ్ఞానం వాళ్లకి రావాల్సిందే. అంతవరకూ మన జపం మనం చేసుకుంటూ చూస్తూ ఉండడమే :-) 

Friday, September 10, 2021

random thoughts...



2021... వచ్చి  ఎనిమిది నెలలు గడిచిపోయాయి.. ఇవాళ్టి వినాయకచవితి కూడా స్దబ్దుగా గడిచిపోయింది ! ఈ కాలం ఇలా త్వరగా గడవడం  మంచిదే కానీ మరీ ఇంత త్వరగానా .. అనిపిస్తోంది . ఏ హడావుడి లేకుండా పండుగ వెళ్పోయింది .  ఏమో నాకైతే అలానే అనిపించింది .  రోడ్డు మీద పత్రి  అమ్మేవాళ్ళు కూడా ఇదివరకటిలా పది అడుగులకొకళ్ళు లేరు. మా వైపున పత్రి అమ్మకం ఉన్న ఒక్క చోటా కూడా ఇదివరకటిలా అన్ని రకరకాల ఆకులు అమ్మలేదు .  జిల్లేడు ఆకులూ , తామరపూలు , తామర ఆకులూ , ఏవి లేవు .  ఇదివరకూ చాలామంది నానారకాల ఆకులూ అమ్మేస్తున్నారు అని విసుక్కునేవాళ్ళం .  అయినా వాళ్లకి ఆ ఒక్కరోజే ఉపాధి .  ఎక్కడెక్కడికి  వెళ్లి ఇవన్నీ తెస్తారో వీళ్ళు  అని ఆశ్చర్యపోయేవాళ్ళం కూడా. మన జీవితాలలోకి  ఈ మహమ్మారి ఎన్ని మార్పులు తెచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ రోజువారీ ఉపాధి అవకాశాలు మాత్రం బొత్తిగా శూన్యం అయిపోయాయి .  నిరుపేద జీవితాలపై మాత్రం ఇది చాలా బలమైన దెబ్బ అనే చెప్పాలి . ఈ గడ్డు కాలం సమసి , వారి జీవితాలు వికసించే రోజులు మళ్ళీ రావాలని ఆ వినాయకుడుని ప్రార్థిస్తున్నాను . 


***           ***             ***


పుస్తకం  తెరిచి ఎన్నాళ్లైయిందో ! ఇంటి పనితోనో , ఆఫీసు పనితోనే రోజులు గడిచిపోతున్నాయి .  OTT ల పుణ్యమా అని నానావిధ సినిమాలకేకొదవాలేదు. అవి పనులు చేసుకుంటూ  కూడా చుసేయచ్చు .  కానీ పుస్తకానికి ఏకాంతం , ఏకాగ్రత రెండూ కావాలి.   ఎప్పుడైనా సమయం  దొరికితే కాసేపు పడుకుందాం , రెస్ట్ తీసుకుందాం అన్న ఆలోచనే తప్ప  చదువుదామనే ధ్యాసే ఉండడం  లేదు .  

ఇదివరకూ  ఇంట్లో సామాను కూడా ఎటునుంచి ఇటు , ఇటు నుంచి అటూ అవలీలగా జరిపేసి సర్దేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక్కరోజు సర్దితే నాలుగురోజులు మరేపని చెయ్యలేని స్థితి .  ఇది వయసు ప్రభావమా ? లేక పనిపనిషి లేకుండా గత రెండేళ్ల నుండీ చాకిరి చేసుకుంటున్న వత్తిడి ప్రభావమా ? అన్నది తేల్చుకోవడం కష్టమే!


***      ***.    ***


ఈ టపాలో  ప్రత్యేకత ఏమిటంటే నా కొత్త లాప్టాప్ లో  ఇంకా సరైన సదుపాయాలు లేక డైరెక్ట్ గా బ్లాగ్ నుండే డ్రాఫ్ట్ లోoచి ఈ టపా రాస్తున్నాను. ఎలాగైనా ఇవాళ రాయాలనే సంకల్పంతో ! అక్షరాలు వెతుక్కుoటూ రాస్తుంటే బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తల్లో  ఒక టపా రాయడానికి ఎన్ని కష్టాలు పడేదాన్నో, ఎన్ని తప్పులు వచ్చేవో గుర్తుకొస్తోంది. 

నవ్వు వస్తోంది .... మళ్ళీ  గతం తాలూకూ చెరగని చేదు గురుతులు కలవరపెడుతున్నాయి కూడా! కానీ ఒకటి మాత్రం నిజం - ఏది జరిగినా మన మంచికే అని నేను ఎప్పుడూ నమ్మే సూత్రం . ఈ బ్లాగు రాతలు నాకు కేవలం చేదు  జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చినా , ఈ రాతలు నాకు తెలుగు టైపింగ్ నేర్పాయి .  ఎలా రాయాలో ,  ఎంత రాయగలనో , ఏది రాయగలనో తెలిపాయి .  నా జీవితకాలపు  కలను నిజం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించింది ఈ బ్లాగ్ రాతలే! భగవంతుడు నాకు అన్ని విధాలా సహకరించాడనే చెప్పాలి.  ఆ నిరాకార స్వరూపుడికి కృతజ్ఞతలు . 


***     ***    ***


చాలా కాలం నుంచి తెలిసిన కొందరి గురించి మనకి ఏర్పడిన అభిప్రాయాలను మార్చుకోవడం కష్టమే  అయినా ఒకోసారి మార్చుకోవాల్సి వస్తుంది .  ఇలాంటివాళ్ళు  అనుకున్నాము ... కాదన్నమాట  అని ఆశ్చర్యం వేసినా నిజరూపం తెలిసాకా అసలు కొందరితో మాట్లాడాలనే అనిపించదు .  ఎదురైనా తప్పించుకు తిరుగుతాం. 


***     ***      ***


ఏకాంతాన్ని  ఆస్వాదించడం మొదలైయ్యాకా మనుషులకు దూరంగా ఉండడమే ఆనందాన్ని ఇస్తోంది .  మనసు మరింత ఏకాంతాన్ని కోరుకుంటుందే తప్ప మరో ఊసే గుర్తుకురాదు .  భగవధ్యానం , ఆధ్యాత్మిక జీవితం , మరిన్ని  ఆధ్యాత్మికమైన  విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి  ఇదివరకటి మామూలు పుస్తకాల వైపుకి దృష్టిని మరలనివ్వడమే లేదు .  ఇందులో ఉన్న ప్రశాంతత మరెందులోను లేదు అన్న సత్యం ఆలస్యంగానైనా తెలిసిరావడం పూర్వజన్మ సుకృతమే  అనుకుంటాను. గత ఆరేళ్లలో  ఆత్మోన్నతికి ఉపయోగపడే  ఎన్నో మంచి మంచి పుస్తకాలు తెప్పించుకున్నాను. కొన్ని చదివాను .. ఆనందించాను. ఇంకా చాలా చదవాలి .  అటువంటి  ఏకాగ్రతనిచ్ఛే ఖాళీ సమయాన్ని ఇమ్మని భగవంతుడిని కోరుకుంటున్నాను . 










Sunday, January 2, 2011

మరో దశాబ్దపు మొదటిరోజు

రంగులు దిద్దుతున్న మా "ముగ్గుగుమ్మ"

దశాబ్దపు మొదటిరోజు అయితే ఏమన్నా కొమ్ములుంటాయా? ఏమీ ఉండవు. అదీ ఒక మామూలు రోజే...it's just an other day...another day !! కానీ నేను మాత్రం bryan adams "Here I am - this is me" పాట గుర్తొచ్చి "It's a new day - it's a new plan ... It's a new world ... it's a new start ..." అని పాడుకున్నా !! ఎందుకంటే మనిషి ఆశాజీవి. నిన్న నిరాశను మిగిల్చినా రేపు బాగుంటుందేమోని అని ఆశ పడతాడు మనిషి. ఆశ లేకపోతే కొత్త ఉదయాలను చూడటం కష్టం. కొత్త కేలండర్లతో అలాంటి ఆశలు రేపేకొత్త సంవత్సరం అంటే నాకు ఇష్టం. మామూలుగానే గడచిపోవచ్చు..మరో ఏటికి ఇది just another year అయిపోవచ్చు. కానీ ప్రస్తుతానికి it's a new start.

చాలాసందర్భాల్లో నేను మారిపోయాననుకుంటూ ఉంటాను...కానీ మనిషిలో ఆలోచనకు మార్పు వస్తుంది కానీ బేసిక్ స్వభావం ఏదైతే ఉందో అది అరిచి గీపెట్టినా మారదు. గ్రీటీంగ్స్ తయారు చేసి పోస్ట్ చేసేరోజులు పోయాయి కాబట్టి ఎప్పటిలానే రెండ్రోజుల ముందరే (అందరికన్నా ముందు విషస్ చెప్పాలనే అజ్ఞానపు తాపత్రయం) మైల్ బాక్స్ లో ఉన్న ఎడ్రస్లన్నింటికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాను. ఎప్పటిలానే మావారూ నవ్వారు.."వీళ్ళలో సగం మంది కూడా తిరిగి జవాబివ్వారు. ఎందుకు పంపిస్తావు?" అని. ఒక విష్ పంపినందువల్ల తప్పేముంది? కొట్టరు కదా. "Be aware that your kindness may be treated as your weakness...but still be kind" అన్నరు స్వామి. నా అలవాటునాది. ఓపిక, వీలు ఉన్నన్నాళ్ళు పంపిస్తాను. అంతే.

కౌన్ట్ డౌన్ లెఖ్ఖపెట్టుకుంటూ టీవీ చానల్స్ తిప్పుతూ కూచునే రోజులు పోయి నాలుగైదేళ్ళు అయ్యింది. చిన్నప్పుడు, పెద్దయ్యాకా కూడా హడావుడి పడిపోయి ప్రోగ్రామ్స్ మొదలెయ్యేలోపూ బయట న్యూ ఇయర్ ముగ్గు పూర్తి చేసేసి, టివీ ముందుకి చేరిన రోజుల్ని, పన్నెండవ్వగానే లైన్స్ కలవవని అరగంట ముందుగానే స్నేహితులకీ, బంధువులకీ ఫోన్లు చేసిన క్షణాల్ని తలుచుకుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు. ముగ్గు వెయ్యటం మాత్రం ఇప్పటికీ మానలేదు నేను. ఈసారి నా న్యూ ఇయర్ ముగ్గు వేస్తూండగానే మొదలయ్యింది. నిశ్శబ్దంలో నేనూ, చీకటిలో ఓపిగ్గా తోడు నించున్న తనూ ఇద్దరమే ఒకరికొకరం విషెస్ చెప్పుకున్నాం. పేచీపెట్టి రంగులు కొనిపించుకుని తానే రంగులు మా పాప వేస్తానని మరీ మరీ చెప్పటం వల్ల ముగ్గు మాత్రం వేసి ఊరుకున్నా. పొద్దున్నే లేచి రంగులు ప్లేట్లో పెట్టుకుని పాప ముగ్గుకి రంగులు దిద్దుతూంటే "ముగ్గు గుమ్మ" అనుకున్నా. నా వారసత్వాన్ని,అభిరుచుల్నీ అన్నివిధాలా కాపాడుతుంది అనిపించే నా బంగారాన్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఇక పొద్దున్నే పనులన్నీ అయ్యాకా నేను చేసిన మంచి పని ఏమిటంటే ఫోన్ నంబర్ల బుక్ దగ్గర పెట్టుకుని అందరు మిత్రులకీ ఫోన్లు చేయటం. ఇది గత కొన్నేళ్ళుగా నేను మానేసిన పని. కొందరి లైన్లు కలవలేదు. కొందరు పలికారు. నాతో ఇంగ్లీష్ ఎంఏ చదువుకున్న ఒక పాత స్నేహితురాలు లైన్ దొరికింది. ఇప్పుడు బొంబాయిలో ఉన్నారుట. ఇద్దరు అబ్బాయిలు. బోలెడు జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తాలే అన్నా. "నువ్వు ఉత్తరాలు బాగా రాస్తావు. మళ్ళీ నీ ఉత్తరం చదవాలని ఉంది. ఎడ్రస్ కి ఉత్తరం రాయవే" అని పోస్టల్ ఎడ్రస్ ఇచ్చింది. దాదాపు మూడునాలుగేళ్ళ క్రితాం దాకా ఊరు మారినా తనకు లెటర్స్ రాస్తూనే ఉండేదాన్ని. లెటర్ పాడ్స్, స్టాంపులు, రంగురంగుల ఎన్వలాప్ కవర్లు... గత జన్మేమో అనిపిస్తాయి జ్ఞాపకాలు.

తరువాత మైల్ బాక్స్ తెరిచాను ఎవరన్నా జవాబులు రాసారేమో అని. కొందరు రాసారు. ఒక కాలేజీ మిత్రురాలు డిగ్రీ క్లాస్మేట్స్ కొందరు కలిసారనీ వివరాలు అవీ రాసింది. ఆశ్చర్యంగా కొన్ని పేర్లు నాకు గుర్తుకు రాలేదు. నాక్కూడా మరపు వచ్చేస్తోంది అని అర్ధమైంది. లేకపోతే నేను ఏదన్నా మర్చిపోవటమా? ఎంఏ ప్రెండ్ చెప్పిన కొన్ని వార్తలు, ఇప్పుడీ స్నేహితురాలు రాసిన కొన్ని విషయాలు చాలా బాధాకరమైనవి ఉన్నాయి. న్యూ ఇయర్ పూటా ఇలాంటి వార్తలేమిటీ అనుకున్నాను... కానీ నాకు ఒక సంగతి అర్ధమైంది. బహుశా దేవుడు నాకు పెద్ద గీత చూపిస్తున్నడేమో అని. పెద్ద గీత ముందు చిన్న గీత ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది కదా. గతించిన కాలంలో నీపై రోకలి పోటు పడకుండా సుత్తి దెబ్బతో సరిపెట్టాను అని దేవుడు చెప్తున్నాడన్న మాట అనుకున్నాను.


విజయవాడలో పుస్తక ప్రదర్శన మొదలు. పధ్నాలుగేళ్ళు పాటు విడువకుండా వెళ్ళాను. వీలవదు కానీ ప్రతి ఒకటవ తారీఖున వెళ్ళాలని మనసు కొట్టుకుంటుంది. ఇంకా...బయట అమ్మొచ్చిన మొక్కలబ్బాయిని పిలిచేసి, నన్ను బయటకు పిలిచేసి నాతో చేమంతి మొక్కలు కొనిపించేసింది మా చిన్నారి.బయటకు వెళ్ళి వస్తూంటే దారిలో పండగకు ముగ్గు వెయ్యటానికి అని మరో ఐదారు రంగుల పేకెట్లు వాళ్ళ నాన్నతో కొనిపించేసుకుంది. మరోసారి పుత్రికోత్సాహం పెల్లుబికింది. మిగిలిన దినచర్య మామూలే.. కొత్త సంవత్సరం అని పొద్దుపోక మానుతుందా? వెలుతురు నిశీధిగా మారింది. రాత్రి గడిచి మరో ఉదయం ప్రారంభమైంది...ఎన్నో సత్యాలను కళ్ల ముందు ఉంచిన దశాబ్దపు మొదటి రోజు ఇలా గడిచింది.


మరొక ఉదయం
మరొక రేపు
మరొక చిరునవ్వు
మరొక వసంతం
మరొక హేమంతం
మరొక సంవత్సరం...మళ్ళీ మొదలు !!