సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label మనోభావాలు. Show all posts
Showing posts with label మనోభావాలు. Show all posts

Saturday, December 4, 2021

మనోభావాలు

 


రెండు, మూడు రోజులుగా పరస్పర విరుధ్ధమైన ద్వంద్వ  భావాలు  మనసులో ఒకేసారి పొటీపడుతున్నాయి.

"ఏదో ఒకటి రాయాలి.. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ప్రతి దృష్టికోణంలోనూ ఏదో ఒక వైరుధ్యం ఉంటుంది. ఎవరి భావాలువారివి కాబట్టి నా బ్లాగులో నా రాతలు నేను రాసుకోవాలి అనే నిరంతర తపన" ఒకవైపు!

" ఏదీ కూడా శాశ్వతం కానీ కనురెప్పపాటి జీవితంలో ఏం రాస్తే ఏమిటి? నేను రాయకపోతే వచ్చే అణుమాత్రం నష్టం కూడా లేనప్పుడు, ఏం రాసి ఏం ప్రయోజనం? అనే నిర్లిప్తత మరోవైపు!!


పాటలు పోగేసుకున్నాను, అక్షరాలను వెతుక్కున్నాను, మాటలు సమీకరించుకున్నాను, ఎంతో రాయాలనే తపన కూడా ఉంది కానీ పైన పేర్కొన్న ద్వంద్వ భావాలలో నన్ను రెండవదే ఎక్కువగా ప్రభావితంచేస్తోంది. ఒకానొక అనాస్థ దశలో ఎలాగైతే నిర్లిప్తంగా నాకత్యంత ప్రియమైన ఈ బ్లాగు మూసేసి ఏకాంతంలోకి వెళ్పోయానో, ఇప్పుడూ అదే అనాస్థ దశ. మూగగా, స్తబ్దంగా, భావాలను ముందుకు నడవనివ్వని ఒక నిస్తేజ స్థితి ఆవరించి ఉంది.

కాదు.. ఇది వైరాగ్యం కానే కాదు.. అంతకు మించిన ఏదో భావం!

ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మలోని పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కలిగే నిర్లిప్త భావమేమో... బహుశా!!


కానీ నేను సమీకరించుకున్న పాటలతో, మాటలతో ఒక మహానుభావుడికి అంజలి ఘటించే ప్రయత్నం త్వరలో తప్పకుండా చేస్తాను.


Saturday, May 15, 2021

శాంతిః శాంతిః శాంతిః

 



చెట్టంత మనుషులు.. 

బాగా తెలిసిన ఎందరో మనుషులు..

మొన్న ఒక వార్త, నిన్న ఒక వార్త... 

ఇలా ఎన్నెన్నో వింటూంటే దిగులుమేఘాలు కమ్మేస్తున్నాయి..

తెలిసినవాళ్లందరినీ పేరుపేరునా ఎలా ఉన్నారండీ అని పలకరించాలనిపిస్తోంది. 

కానీ ఎవరిని పలకరిస్తే ఏ వార్త వినాల్సివస్తుందో అని భయంగా కూడా ఉంది.

నిన్నటిదాకా ఆరోగ్యంగా, ఆనందంగా మన మధ్య తిరిగినవారు...

ఇవాళ మాయమైపోతున్నారు..

ఎంతటి మహమ్మరి ఇది..

జాతీయ విపత్తు కాదు ఇంకేదో పేరు పెట్టాలి దీనికి..

ఊహూ...ఏ మాట సరిపోవట్లేదు..

అక్షరాలు కుదరట్లేదు...:((

ఇంత అన్యాయమా...అయ్యో.. అని మాత్రం దు:ఖం కలుగుతోంది!!!

ప్చ్!!!

శాంతించు భూమాతా... ఎందరిని నీలో కలిపేసుకుంటే నీ కోపం తీరుతుంది?

శాంతిః శాంతిః శాంతిః


 द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः
पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः ।
वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः
सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॥
 शान्तिः शान्तिः शान्तिः ॥


యజుర్వేదంలోని ఈ శాంతి మంత్రార్ధాన్ని క్రింద లింక్ లో చూడచ్చు -

https://www.siddhayoga.org/shanti-mantras/om-dyauh-shanti



Thursday, December 31, 2020

నాకై నేను వెతికే క్షణాలు...

                     


నేను నేనుగా మిగిలి, నాకై నేను గడిపే క్షణాలు చాలా ఉండేవి. అలాంటి కొన్ని క్షణాలు ఉండేవి కదూ... అని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన రోజులు గడుపుతున్నాం. నేను, నాలాంటి వందల, వేల, లక్షల మహిళలు. ఈ దశాబ్దానికి ఆఖరి రోజు ఇవాళ. పన్నెండు దాటి ఇరవై నిమిషాలు అయ్యింది. ఇవాళ బలవంతాన పడుకోకుండా కూర్చుని కాసేపు ఏదన్నా రాయాలని చాలా మనసైంది. రాయాలని చాలాసార్లు అనిపిస్తుంది కానీ సమయం చిక్కదు. గతంలో ఇంట్లోని మిగతావారు పరుగులు పెడుతుంటే, వాళ్లకి కావాల్సినవి అందించి, ఇల్లు నిశ్శబ్దంగా మారాకా వార్తాపత్రికనో, నచ్చిన పుస్తకాన్నో చదువుతూ, బాల్కనీలో ప్రశాంతతని ఆస్వాదిస్తూ ఎన్నో క్షణాలు ఏకాంతంగా, ఆనందంగా గడిపిన రోజులు ఉండేవి. గత పదినెలలుగా ఆ ఏకాంతం, ఆ ప్రశాంతత కరువైపోయాయి. ఇంటి బాధ్యతలతో పాటూ, అదనంగా అందిన పనిమనిషి ఉద్యోగం జీవితాన్ని తలకిందులు చేసిందనే చెప్పాలి. అంట్లు తోమి తోమి చేతులు బండబారిపోయాయనే చెప్పాలేమో! మధ్యలో రెండునెలల పాటు ఇల్లు మార్పు, అటు ఇటు తిరుగుడు, చేస్తోన్న బండ చాకిరీతో పాటూ చేత్తో బట్టలు ఉతకాల్సి రావడం, లిఫ్ట్ లిఫ్ట్ పనిచెయ్యకపోవడం,  మూడుపూటలా వంటింట్లో అదనపు డ్యూటీలు, పెరుగుతున్న వయసునీ, తరుగుతున్న ఆరోగ్యాన్నీ పదే పదే గుర్తుచేసుకునేలా చేశాయి. నష్టపోతున్నది సమయాన్నో, ఆరోగ్యాన్నో తెలీకుండా చేసేసింది ఈ 2020. 

ఇంత చెత్త సంవత్సరాన్ని ఇన్నేళ్లల్లో చూడలేదు. ఇంటి మనుషులు ఇంట్లో కళ్ళెదుట ఉంటే ఆనందమే. కానీ పనిమనిషి, వంటమనిషి, చాకలి అందరి పదవులూ ఇల్లాలికి దక్కించిన ఈ సంవత్సరాన్ని తిట్టుకోని ఇల్లాలు ఉంటుందా? చేతులు కడిగి కడిగి అరిగిపోయాయి, సానిటైజర్లు వాడి వాడి పర్ఫ్యూమ్స్ కూడా వాడాలంటే వెగటు పుడుతున్నాయి, ఆన్లైన లో తెప్పించిన వస్తువులు, కూరగాయలు కడిగి, తుడిచి, ఆరబెట్టి, అలసి సొలసి వంటిల్లంటే విరక్తి కలగని మహిళ, "i need a break" అనుకోని మహిళా ఉంటుందా అసలు అనుకుంటూ ఉంటాను.

ఇక ఈ ఆన్లైన్ క్లాసులేమిటో.. నిద్దర్లు పోతూ, ఆవులిస్తూ, స్క్రీన్ మీద టీచరమ్మలూ,మాష్టార్లు వాళ్లపాటికి వాళ్ళు పాఠాలు చెప్పుకుంటూంటే, స్క్రీన్ మ్యూట్ చేసి తమ తని తాము చేసుకునే పిల్లలే ఎక్కువైన ఈ సంవత్సరంలో అందరు పిల్లల చదువులు అటకలెక్కాయని నొక్కి వక్కాణించాల్సిందే!! ఇంక అప్పుడప్పుడూ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు ఏమాత్రం జాగ్రత్తలు పాటించని ప్రజానీకాన్నీ, మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా పెళ్ళిళ్ళూ పేరంటాలూ చేసేసుకుంటున్న ధైర్యస్తులని, మరో పక్క అతి దీనావస్థలో ఉన్న చిన్నపాటి రోజువారీ వ్యాపారస్తులని, రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలనీ చూస్తూంటే దు:ఖం, బాధ, కోపం, అసహనం, నిస్సహాయత మొదలైన భావాలన్నీ కట్టకట్టుకుని బయటకు తన్నుకు వస్తున్నాయి. ఇలాంటి భావాలనే అనుకుంటా అదేదో సినిమాలో frustration..frustration అన్నారు. ఈ విపత్తు కాలంలో ఇటువంటి frustration అందరి కంటే ఎక్కువ మా ఇళ్ళాళ్ళమే భరించాము అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. 

పది రోజులకు ఒకసారైనా ఏదో పని పెట్టుకుని బయటకు వెళ్ళి రాకపోతే నాకు తోచదు. తలెత్తి ఆకాశాన్ని చూసి, స్వేచ్ఛగా గాలినీ పీల్చి ఎన్నాళ్ళైందసలు?! ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. అయిపోయిందనుకుంటుంటే మళ్ళీ భయపెడుతున్నారు. రాబోయే రోజులు ఇటువంటి frustration నిండిన క్షణాలనే ఇస్తాయని జోస్యాలు కూడా ఎక్కువగానే వింటున్నాం. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం కన్నా చెయ్యగలిగింది ఏముంది? నిజం చెప్పాలంటే ఇలా సింహావలోకనం చేసుకునే సమయం కూడా ఇన్ని నెలల తరువాత ఇవాళే దొరికింది. ఈ మహమ్మారి పుణ్యమా అని నా ఆఫీసు పనులు బాగా తగ్గిపోయినా, ఇంటి పనులు మాత్రం ఓవర్ టైం చెయ్యల్సినంత ఉంటున్నాయి. అందుకే ఇవాళ కాస్త నిద్రను త్యాగం చేసి అయినా ఈ దశాబ్దపు ఆఖరి రోజున నాలుగక్షరాలు రాయాలనిపించింది. ల్యాప్టాప్ దుమ్ము దులిపి, నాకై నేను మిగిలే ఈ క్షణాలను మిగుల్చుకోవాలని ఆశ కలిగింది.

రేపటి రోజు బాగుంటుందని ఆశగా ఎదురుచూడడం మనిషి నైజం. ఆశావాదుల దృక్పధం. ఇదే ఆశతో ఎదురుచూస్తాను...
కనీసం ఇంటి పనులకైనా స్వేచ్ఛగా బయటకు వెళ్లగలిగే రోజు కోసం..
ఇష్టంగా కొనుక్కున్న పుస్తకాల పేజీలు ఆత్రంగా తిప్పగలిగే రోజుల కోసం..
మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకునే రోజుల కోసం..
మాస్క్ లేకుండా రోడ్డుపై వెళ్తూ సూర్యోదయాలనూ, సూర్యాస్తమయాలనూ చూసే రోజు కోసం..
అంట్లు తోమక్కర్లేని రోజు కోసం..
మాస్కులు, సానిటైజర్ వాడక్కర్లేని రోజు కోసం..
రైలు కిటికీలోంచి వేగంగా వెళ్పోతున్న పచ్చని చెట్లని చూసే రోజు కోసం..
లిస్ట్ రాసుకున్న పుణ్య క్షేత్రాలను ఒక్కొక్కటిగా దర్శించే రోజుల కోసం..
ఈ దశాబ్దపు ఆఖరి రోజున నేను ఎదురుచూస్తాను -
నాకై నేను మిగిలే మరిన్ని క్షణాల కోసం..
ఏ భయాలూ లేని రోజు కోసం..
ప్రజలు ఆనందంగా, క్షేమంగా తిరిగే రోజుల కోసం!

సర్వేజన:సుఖినో భవంతు!

Wednesday, March 4, 2020

ఇప్పుడన్నీ తేలికే..



ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన చాలా ఇష్టమైన కొన్ని పనులు.. మధ్యలో వదిలేయడం చాలా కష్టమే. కానీ ఆ పనులు మన మార్గానికే ఆటంకమై, ముందడుగు పడనీయనప్పుడు, ఆగిపోవడమో, వేరే దారిని వెతుక్కోవడమో.. ఏదో ఒకటి చెయ్యాలి. 

నాలుగేళ్ల క్రితం టువంటి  టంకం ఏర్పడినప్పుడు.. ఇది నా సమయం కాదు అనుకుని మౌనంగా ఆగిపోయాను. నాకు ప్రాణ కన్నా ఎక్కువైన ఈ బ్లాగుని కూడా మూసేసాను. వెనక్కు తిరిగి చూసిందే లేదు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటైన పనే. ఈసారి భగవంతుడు నాకు మరో చక్కని మార్గాన్ని చూపెట్టాడు. ఆరేళ్ల బ్లాగ్ రాత వెతను మిగిల్చినా, మరో విధంగా ఉపయోగపడింది.. ఒక పనిలో ఒదగగలిగాను. ఇక తీరదనుకున్న ఒక చిరకాల కోరిక నెరవేరింది ! స్వల్పమే అయినా సొంత సంపాదన ఎంత ఆనందాన్ని ఇస్తుందో, వాటితో కావాలనుకున్న వస్తువులు కొనుక్కోవడం అంతకు మించిన తృప్తిని ఇస్తుంది.

కానీ రాయాలనే బలమైన కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది. మనకి ఆనందాన్ని కలిగించి, మనసు పెట్టి చేసే ఏ పనినీ ఆపకూడదంటారు పెద్దలు. చేతనయినంతలో ఏ కోరికనూ మిగిలిపోనీయకూడదనే ఆలోచనతో నాలుగేళ్ళ తరువాత మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. కేవలం రాయడం మాత్రమే..! కామెంట్ బాక్స్ ని తొలగించడం కూడా చాలా తేలిగ్గా చేసిన పని. ఎప్పుడో చెయ్యాల్సినది.. ఇప్పటికైనా ఆలస్యంగా చేసాను.

ఇవాళ ఇంకో పని చేసాను..నా 'సంగీతప్రియ ', 'సినిమా పేజీ' బ్లాగులను డిలీట్ చేసేసాను. అందులోని టపాలన్నీ ఈ బ్లాగ్ లోకి ఇంపోర్ట్ చేశాను. అప్పట్లో.. ఏడు నెలలు మోసిన బిడ్డను కోల్పోయినప్పుడు, ఆ బాధను మరవటానికి నాలుగు కొత్త బ్లాగులు కావాలని మొదలుపెట్టి, మరో ఆలోచన అనేది రాకుండా బ్లాగుల్లో తోచింది రాసుకుంటూ బాధను మరిచేదాన్ని! ఇవాళ నా చేతులతో నేనే ఆ బ్లాగులు డిలీట్ చేశాను.  ఒకప్పుడైతే బాధపడేదాన్నే.. కానీ ఇప్పుడు చాలా బావుంది. తేలికగా ఉంది. ఓడిపోయాననిపించడం లేదు. అల్లిబిల్లిగా పెరిగిన మొక్కలను ప్రూనింగ్ చేసినట్లు ఉంది. చిన్న మొక్క నుండీ చెట్లు గా మారిన తోటలో మందారాలు, నందివర్ధనాలూ శుభ్రంగా ట్రిమ్ చేసినట్లు! కొమ్మలు కట్ చేసేప్పుడు చివుక్కుమనిపిస్తుంది, చేతులు రావసలు. కానీ కొత్త చిగుర్లు కనబడగానే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎందుకనో అనిపించింది..డిలీట్ చేసేసాను.

అయినా చెట్టంత మనుషులే పుటుక్కున మాయమైపోతున్నారు... వాటితో పోలిస్తే ఇదెంతనీ!!


Saturday, December 28, 2019

కథ లాంటి నిజం


సినిమాల్లో మాత్రమే చూసేలాంటి కథ ఒకటి ఎదురుగా కనబడితే? సినిమా కష్టాలు అనేలాంటి కష్టాలన్నీ మూకుమ్మడిగా ఒకరి జీవితంలో కనబడితే? వినడానికే హృదయం పగిలిపోతూంటే అనుభవించే ఆ మనసుకు ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు..ఎన్ని సమస్యలో!! అసలు ఒకే మనిషిని ఇన్ని కష్టాలు చుట్టుముట్టగలవా? అంటే ఆ కర్మఫలం ఎంత ఎక్కువ ఉందో...!! ఎవరా జీవి? ఏమిటా కష్టాలు అంటే చెప్పలేను. మరొకరి జీవితాన్ని గురించి రాసే హక్కు నాకెక్కడిది? నాకా హక్కు లేదు. అది తప్పు కూడా. కానీ బాధను తట్టుకోలేక నా సొంతమనుకునే ఈ బ్లాగులో ఈ నాలుగు వాక్యాలూ రాసుకుంటున్నాను. 
అబ్బా! నిజంగా పొద్దున్నుంచీ తట్టుకోలేకుండా ఉంది. ఆ మనిషికి దేవుడు అలా అన్నీ ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసేసుకుంటూంటే అసలు ఏమనాలో నాకైతే తెలీట్లేదు. అవును.. ప్రాప్తం, పూర్వజన్మ పాపం, కర్మఫలం, ఋణాలూ ఎక్సట్రా ఎక్సట్రా... అన్నీ తెలుసు. అందులో సత్యం ఉంది. అయినా కూడా పాపం కదా..అయ్యో.. అనుకుంటూ ఎన్ని అఫ్సోస్ లు పడ్డా దు:ఖం తీరట్లేదు..అయ్యో, నేనా మనిషికి ఏ సహాయమూ చెయ్యలేనే అనే బాధ నన్ను తొలిచేస్తోంది.. :( 
అనుభవాలు మనిషికి గట్టిదనాన్ని నేర్పుతాయి అంటారు. రాటుదేలాలి అంటారు. నేనేమిటో రాను రానూ ఇంకా ఇంకా బలహీనంగా, ఏదీ తట్టుకోలేనంత సెన్సిటివ్ గా అయిపోతున్నాను. ఇది తప్పు అని తెలుసు. జీవితంలో అన్నింటినీ తట్టుకోవాలి. ఎప్పటికప్పుడు కొన్నింటిని మర్చిపోవాలి. నిలబడాలి. పోరాడాలి. బతకాలి. ఉదాహరణగా మిగలాలి.. అంటారు జ్ఞానులు. ఎవరి ఊతమూ లేకుండా నిలబడడం అయితే వచ్చింది ఇన్నేళ్లకి. కానీ ఒక దు:ఖాన్ని చూసి చలించిపోయి, అతలాకుతలం అయిపోయే బలహీనత మాత్రం పోవట్లేదు. ఇలా అన్నింటికీ కదిలిపోతుంటే ఎన్ని వందల మైళ్ళు నడిచి, ఎన్ని రకాల మిల్లెట్లు తిని, ఎన్ని కషాయలు తాగితే మాత్రం లోనున్న రోగం తగ్గుతుంది? నా ఆరోగ్యం కూడా నేను చూసుకోవాలిగా! తామరాకు మీద నీటిబొట్టు స్థాయికి రావాలంటే ఎంతో సాధన కావాలి. భగవంతుడా నాకు ధైర్యాన్ని ఇవ్వు. శక్తిని ఇవ్వు. అన్నట్లు, నేనొక పనిచెయ్యగలను...అవును.. ఆ మనిషికి సరైన సహాయాన్ని, మార్గాన్ని చూపెట్టమని భగవంతుడిని ప్రార్థించగలను. ఇప్పుడు ఇలా రాయడం వల్లే ఇంత మంచి ఆలోచన వచ్చింది. అవును..ఆ పని చేస్తాను. ప్రార్థిస్తాను. ఆ మనిషి కోసం, నా కోసం కూడా..! ఇలా అనుకుంటే కాస్త ఊరటగా బావుంది.

Wednesday, April 10, 2019

Old wine in new bottle




మంచి కథలు ఎక్కడ నుంచి పుడతాయి? ఊహల్లోంచి పుట్టే కథలు బావుంటాయి కానీ కొన్నాళ్ళకి మర్చిపోతాము. వాస్తవంలోంచి పుట్టిన కథలు మాత్రం మనసుకి హత్తుకుంటాయి. ఎన్నాళ్ళైనా మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మంచి కథలు కావాలంటే మన చుట్టూ వందల కొద్ది దొరుకుతాయి. సమాజాన్నీ, జీవితాలనీ, మనుషులనీ దగ్గరగా గమనిస్తే వందల ఉదాహరణలు దొరుకుతాయి కథలు పుట్టించడానికి. 

ఒక సినిమా కోసం మంచి కథ, మనసుని కదిలించే కథ, గుర్తుండిపోయే కథ కావాలంటే జీవితాల్లో వెతుక్కోవాలి. మన చుట్టూ వెతుక్కోవాలి. అప్పుడా కథలు కలకాలం నిలుస్తాయి. మంచి కథని పాత సినిమాల్లో ఎందుకు వెతుక్కుంటారో నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. పాత కథల్ని అటు తిప్పీ, ఇటు తిప్పీ, మనుషులనీ, పరిస్థితులనీ మార్చేసి, మసి పూసి మారేడు కాయ చేసేసి ఇది కొత్త కథ, ఉత్తమైన వాస్తవికమైన కథ అని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? పోనీ ఫలానా సినిమా నాకు ఇస్పిరేషన్, ఫలానా కథ నాకు చాలా ఇష్టం, అలాంటి కథ తీయాలనే ప్రయత్నమిది అని కూడా చెప్పరు.

కొన్నేళ్ల క్రితం ఒకానొక మహానుభావుడైన దర్శకుడు తీసిన మరపురాని చిత్రరాజం "సాగరసంగమం"!  కాస్త కథనీ, కొన్ని పాత్రలనీ మార్చేసి అదే కథని మళ్ళీ సినిమాగా తీస్తే అది గొప్ప సినిమా అయిపోతుందా? ఈ కథ తెలియని నేటి తరం ప్రేక్షకులు ఉన్నరేమో కానీ ఆ చిత్రాన్ని మర్చిపోని ప్రేక్షకులు ఇంకా ఉన్నారు.  ఆ చిత్రరాజం గుర్తున్న నాలాంటివాళ్లం ఈ చిత్రాన్ని ఒక గొప్ప చిత్రం అని ఒప్పుకోలేము. గొప్ప కథేమో, మరో గొప్ప చిత్రమేమో అని ఆశపడిపోయి, తీరా సగమన్నా చూడకుండానే ఇది అదే కదా అని గుర్తుకొచ్చేస్తే ఎంత నిరాశగా ఉంటుందో.. !!!! కొత్త ఒరవడిని సృష్టించే సత్తా ఉంది అనుకున్న కొత్త దర్శకులు కూడా ఇలా చేస్తే ఇంకా బాధ వేస్తుంది!!

అవే అవే పాత కథల్ని వెనక్కీ, ముందుకూ తిప్పి లేక రెండు మూడు పాత సినిమాలని కలిపేసి ఒక కొత్త వంట వండడం. ప్రతి కొత్త చిత్రానికీ ముందర మాదో విభిన్నమైన కథ, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని గొప్ప కథ అని ప్రచారం చేస్తారు. తీరా చూస్తే ఎనభై శాతం కథలు ఏదో పాత చింతకాయ పచ్చడికో , మాగాయ పచ్చడికో కొత్త పోపు. అంతే. ఎందుకిలా? అసలు కొత్త కథలు ఎందుకు పుట్టవు? ఒక్క క్షణం ఆగి పరికిస్తే మన చుట్టూ ఎన్నో కథలు కనిపిస్తాయి! సమాజంలో ఎన్నో సమస్యలు. ఎన్నో ప్రేరణాత్మకమైన ఉదంతాలు. 

సినిమా సరదాగా ఉండాలి. ఆటవిడుపుగా ఉండాలి. నిజమే. కానీ అది ఒక పవర్ఫుల్ మీడియా. దానిని కేవలం ఒక వినోదాత్మకమైన మాధ్యమం గా మాత్రమే కాకుండా దానిని ఒక సందేశాత్మక మాధ్యమం లాగ ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో, పాత తరం దర్శకులలా చిత్రాలు తయారుచేస్తే చాలా బావుంటుంది. భావితరాలు బాగుపడతాయి.



Saturday, March 23, 2019

అత్తయ్యగారు


ప్రియమైన అత్తయ్యగారికి నమస్కరించి,

మేమంతా కులాసా. మీరు ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళయిందో కదా మీకు ఉత్తరం రాసి! మేము బొంబాయి లో ఉన్నప్పుడు మీరు మీ అబ్బాయి మీద బెంగ పెట్టుకున్నారని వారానికో ఉత్తరం అన్ని విశేషాలతో తప్పనిసరిగా రాసేదాన్ని. మీరెంత మురిసిపోయేవారో ఆ ఉత్తరాలు చదువుకుని. మళ్ళీ ఇన్నాళ్ళకి మీకు ఉత్తరం రాస్తున్నాను.

మిమ్మల్ని తలుచుకోని రోజు లేదండీ. ఏదో ఒక విషయంలో, ఏదో కారణంగా మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు. ఒకటా రెండా పదిహేనేళ్ల సాంగత్యం మనది. నిజం చెప్పాలంటే మీ అబ్బాయి కన్నా మీతోనే కదా నేను ఎక్కువగా గడిపినది. కానీ మనం కలిసి ఉన్న ఏడేళ్ళూ కూడా మీరు అత్తగారిగా, నేను కోడలిగానే మసిలాము. మీకు అత్యంత ప్రియమైన అబ్బాయిని నాకు ఇచ్చేసాన్న మీ బాధ నన్ను ఒక కోడలిగా మాత్రమే చూసేలా చేసింది. మిమ్మల్ని సంతృప్తి పరచాలని, మీతో మెప్పించుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో దేవుడికి బాగా తెలుసు. నా ప్రతి పనిలోనూ మీరు వెతికే పొరపాట్లు..నన్ను చాలా బాధ పెట్టినా, అవి ఇప్పుడు నేను ప్రతి పనినీ పర్ఫెక్ట్ గా చేసేలా చేసాయని ఇప్పుడు కదా నాకు అర్థం అయ్యింది! "మీ అమ్మాయికి అభిమానం ఎక్కువ, చిన్న మాట కూడా పడదు" అని మీరు అమ్మతో చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. ఇన్నాళ్ళకు ఒక్క విషయం నాకు బాగా అర్థం అయ్యిందండీ.. ఇష్టం ఉన్నచోట తప్పు కూడా చిన్న పొరపాటులానే అనిపిస్తుంది. ఇష్టం లేని చోట చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పులానే తోస్తుంది. ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం లోనే ఉంటుంది.

మనిద్దరి దృష్టికోణం మారడానికి పదేళ్ళు పట్టింది. ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎదురుచూసిన నాకు మీరు ఏకంగా ప్రసంశల శాలువానే కప్పేశారు. మీరు నా మీద ప్రేమగా రాసిన కవితని ఎంత భద్రంగా దాచుకున్నానో!!

జీవితంలో కొన్ని చేదు అనుభవాలు మనకి చాలా మంచిని చేస్తాయనే సత్యం స్వానుభవం మీదనే ఎవరికైనా అర్థం అవుతుందేమో. ఐదేళ్ల క్రితం నా జీవితంలో నాకు తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బకి ఏడాది దాటినా నేను నిలదొక్కుకోలేక,  బాధతో విలవిల్లాడిపోతుంటే ఎంత ధైర్యం చెప్పారూ..! అసలు అది ఎంతో పెద్ద సర్ప్రైజ్ నాకు. ఆ సాయంత్రం నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నా పక్కన కూర్చుని, కళ్ల నీళ్ళు తుడిచి.. పదేళ్ళుగా నేను మీ నోటి వెంట విన్నలని తపనపడుతున్న మాటల కన్నా పదిరెట్లు ఎక్కువ మెచ్చుకోలు మాటలు చెప్పి, ఎంతగా ఓదార్చారో! నా జీవితపు చివరి క్షణాల దాకా ఆ మాటలు నేను మర్చిపోనండీ. అంతగా ధైర్యం చెప్పారు. ఈవిడ మనసులో నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందా? ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయాను. నేను మొదటిసారి మీ ప్రేమను అర్థం చేసుకున్నది ఆరోజే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక కోడలిగా నేనేనాడూ నా బాధ్యతను విస్మరించలేదు. మీకూ తెలుసు. కానీ ఆ రోజు నుండీ నా బాధ్యతకు, అభిమానం కూడా తోడైంది.
నేను వినాలని తపించిన మాటలనే కాకుండా, మరో రెండు మూడు ప్రశంసా వాక్యాలు మీ నోట వినడం నిజంగా నా అదృష్టం. నాతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా ఎంతో సంతృప్తిగా మీరన్న మాటలు నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని మిగిల్చాయండీ. ఈ జీవితానికి అంతకన్నా ఏం కావాలి? నాకు ఎదురైన చెడు ఈ విధంగా మిమ్మల్ని నాకు దగ్గర చేసింది.

కానీ అసలు మీరు ఎందుకని వెళ్పోయారండీ? ఎందుకంత తొందరపడ్డారు? ఏమంత వయసైందని? మీరు లేకపోతే మీ పిల్లలు ఎలా తట్టుకోగలరనుకున్నారు? ఎంత ప్రేమగా పెంచారు వాళ్లని.. మీ ప్రపంచమంతా వాళ్ళతోనే నింపుకుని, వాళ్ళే లోకమై బ్రతికారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు దిగమింగారో, ఎన్ని అవమానాలు సహించారో మీ అబ్బాయి చెప్పినప్పుడూ, తల్చుకున్నప్పుడూ నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మొదట్లో మీ వైఖరి వల్ల మీపై కోపం ఉన్నా కూడా, మీలో ఉన్న ఈ గొప్ప తల్లిప్రేమను చూసి నేను చలించిపోతూ ఉండేదాన్ని. మీపై కొండంత గౌరవం ఉండడానికి కూడా కారణం ఇదే. మీలాంటి గొప్ప తల్లిని నేనెక్కడా చూడలేదండీ. నిజం! ఖాళీగా ఎప్పుడూ ఉండేవారు కాదు. ఓపిక ఉన్నంతవరకూ చివరిదాకా తోచిన సాయం చేశారు. మీరు బాలేకుండా ఉండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండిపోండి.. అంటే అలాగే అనేసి, కాస్త బావుండి నడవగలిగే ఓపికరాగానే బ్యాగ్ సర్దేసేవారు. నేను కోప్పడితేనేమో, "అమ్మలా కోప్పడుతున్నావు.. పోనీలేమ్మా. ఇక్కడ కూర్చునేది అక్కడ కూర్చుంటా. నేను చేసేదేముందని..పిల్లలకి కాపలా. అంతేగా" అనేసి నా నోరు మూసేసేవారు. వచ్చి వెళ్పోయే ప్రతిసారీ మాత్రం "వస్తాలే. బాధపడకు. ఎప్పటికైనా మీ దగ్గరకు రావాల్సిందాన్నేగా. చివరిరోజులు పెద్దకొడుకు దగ్గరే.." అనేవారు. మాట నిలబెట్టుకున్నారు. చివరికి వచ్చారు. కానీ ఎలా వచ్చారు? కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లుగా... ఎంత పిలిచినా పలకలేనంత నిద్రలోకి వెళ్పోయి, ఎన్ని మాటలు మాట్లాడినా కళ్లు విప్పలేనంత నిద్రలోకి వెళ్పోయి వచ్చారు. మీరు అదృష్టవంతులు. అనాయాస మరణం ఎందరికి దక్కుతుంది?  పది నెలలు అయిపోయాయి అత్తయ్యగారూ... మేమే ఇంకా నమ్మలేకపోతున్నాం. ఇంకా ఆ షాక్ లోంచి బయటకు రాలేకపోతున్నాం. నిత్యం తలుస్తున్నాం. మీరు నాకు అప్పుడప్పుడూ చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ఎంతగా పనికి వస్తున్నాయో, ఎంత అనుభవంతో చెప్పారో  కదా అని రోజూ అనుకుంటూ ఉంటాను. మిమ్మల్ని తలిచినప్పుడల్లా ఎటువంటి గిల్టీనెస్ నాకు లేకుండా చేసి వెళ్పోయారు. అదీ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం.

ఇవాళ మీ పుట్టినరోజు! పదిహేనేళ్ళుగా మీకు పుట్టినరోజుకు చీర పెట్టడం అలవాటు. ఈసారి ఎవరికి పెట్టను? కొని అయితే ఉంచాను. ఎవరికో ఒకరికి పెడతానులెండి. చీర పెట్టినప్పుడల్లా "నా పుట్టినరోజు నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోవు" అనేవారు. పొద్దున్నుంచీ మీ మాటలు, అలోచనలు, అవే తలపులతో గడిపాను. ఎవరికైనా సరే కడుపునిండా భోజనం పెట్టడం మీకు ఇష్టం కదా అందుకని మీ అబ్బాయితో అన్నదానానికి డబ్బు కట్టించాను. మీరు తప్పకుండా ఆనందిస్తారని నాకు తెలుసు.

మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీర్వచనాలు మాకు తప్పక ఉంటాయి. అవే మాకు శ్రీరామరక్ష. చాలా రాసేసాను. ఇంక ఉంటానండీ, missing you...
                                                        ప్రేమతో.. మీ కోడలు.

Friday, March 15, 2019

ఆత్రుత







లిటరల్  గా లాప్టాప్ పై పేరుకున్న దుమ్ముని గుడ్డముక్కతో తుడిచి, ఈ అక్షరాలు రాయడం మొదలుపెట్టాను. ఉదయం నుంచీ మనసులో తిరగాడుతున్న భావాలను అక్షరాలుగా మార్చాలన్న ఆత్రమే దానికి కారణం. క్రింద ఫ్లోర్ లో జరిగిన సహస్రనామ పారాయణ పూర్తయి ఇంట్లోకి అడుగుపెట్టగానే నా కోసం ఎదురుచూస్తున్న కొరియర్ ని చూడగానే ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం కలిగింది. 19-27 మధ్య అంటే నెక్స్ట్ వీక్ లో రావాల్సిన పుస్తకం అప్పుడే వచ్చేసింది. ఇదివరకూ కష్టపడి బస్సుల్లో కాసేపూ, కాలినడకన కాసేపూ వెళ్ళి, నాలుగైదు షాపుల్లో వెతికితే కావాల్సిన పుస్తకాలు దొరికేవి. ఇప్పుడు కేవలం ఫోన్ లో ఓ బటన్ నొక్కితే చాలు కావాల్సిన పుస్తకం ఇంటికొచ్చేస్తోంది. ఎంత హాయో! కానీ చదవడానికి సమయం ఏదీ? చదవాలని గత కొన్నేళ్ళుగా కొంటున్న రెండు, మూడు వందల పుస్తకాలు అలా క్యూ లో నిలబడి ఉండగా... మధ్యలో ఎప్పుడో మూడేళ్ల క్రితమేమో నా reading genre మారిపోయింది. సొంత సంపాదనతో కొంటున్నానన్న ఇష్టం వల్లనో, నేను దృష్టి పెట్టిన కొత్త సాహితీ ప్రకియపై ఉన్న మక్కువ వల్లనో ఆర్డర్ చేసి తెప్పించుకున్నవి చాలా వరకూ చదివేస్తున్నాననే చెప్పాలి. ఇప్పుడసలు పాత పుస్తకాలపై ధ్యాస పోవట్లేనే లేదు. నా సాహితీ తృష్ణ కేవలం నా కొత్త సాహితీ ప్రకియపైనే స్థిరంగా నిలిచిపోయింది. ఎందుకో ఇవన్నీ కొన్నాను.. ఇప్పుడిక ఏం ఉపయోగం నాకివి? అనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి.  గతమంతా నిరర్థకం, నేటి ఉనికే యదార్థం! అనే స్థితికి చేర్చిన ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞురాలిని. కానీ పాత పుస్తకాల్లో చాటిచెప్పాల్సిన కొన్ని ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు ఉన్నాయి. సమయం అనుకూలిస్తే వాటి గురించి రాయాలనే సంకల్పం మాత్రం ఉంది.

ఇంతకీ అసలు చెప్తున్న కథ నాకు వచ్చిన కొత్త పుస్తకం గురించి కదూ.. ఆత్రంగా చదవాలని కవర్ కట్ చేసి పుస్తకం బయటకు తియ్యగానే, ఈమధ్య నాలో బలంగా ఏర్పడిన ఒక లక్ష్యం కళ్లముందు కనబడగానే ఎంతో ఆనందం. ప్రేమగా అట్టని తడిమాను. పేజీలు కాస్త అటు ఇటు తిప్పేసరికీ భోజనాల టైమైంది. తినేస్తే హాయిగా పుస్తకం చదువుకోవచ్చు కదా అని గబగబా ఆ పని పూర్తి చేసి, అంట్లు పెడదామని బాల్కనీ లోకి వెళ్లగానే మిషన్లో ఆరిన బట్టలు కనబడ్డాయి. అయ్యో ఇవి ఆరెయ్యనేలేదు అనుకుని గబగబా ఆపని చేసి, బకెట్టు పెట్టేద్దామని బాత్రూమ్ లోకి వెళ్లగానే పొద్దున్నే మిషన్ లో వెయ్యకుండా అతి ప్రేమగా నానపెట్టిన తెల్ల బట్టలు కనబడ్డాయి. చచ్చాన్రా దేవుడా అనుకుని గబగబా అవి ఉతికి ఆరేసి లోపలికి వస్తూంటే నిన్న బయటకు వెళ్తూ వెళ్తూ మడతపెట్టకుండా కుర్చీలో పాడేసిన నిన్నటి బట్టల కుప్ప దీనంగా పిలిచింది. లాభంలేదు అనుకుని అవన్నీ మడతలు పెట్టి, అలమార్లలో సర్దేసి హాల్లోకి వచ్చేసరికీ సోఫాలో మావిడల్లం కవర్ కోపంగా చూసింది. క్రితం నెల్లో హార్టీకల్చర్ ఎక్స్పో లో ఎంతో మోజుతో కొన్న అరకేజీ మావిడల్లం! పచ్చడి చేద్దామని ఇప్పటికి నాలుగుసార్లు ఫ్రిజ్ లోంచి తియ్యడం, టైమ్ లేక సాయంత్రమో రాత్రో తిరిగి ఫ్రిజ్ లో పెట్టేయడం. మావిడల్లం కొన్నప్పుడు తాజాది కావడం వల్ల ఇంకా బాగుంది. లేకపోతే ఎండిపోయేదే. ఇవాళన్నా పచ్చడి చేసేయాలి అని దాని పని పట్టాను. ఈలోపూ పనిమనిషి వచ్చే టైమైపోయి, తను వచ్చేసింది. తను పని పూర్తిచేసి వెళ్ళగానే ఇంక రొటీన్ మామూలే. మొక్కల పని, ఆ తర్వాత వాకింగ్, పూజ, మళ్ళీ వంట.. వరుస పనులే. పొద్దున్ననగా పుస్తకం వస్తే రాత్రి దాక చదవడానికి కాదు కదా ఈసారి తిరగెయ్యడానికే టైం లేదు. క్లైమాక్స్ లో ఏమౌతుందో అర్థం కాకుండా ఉన్న సస్పెన్స్ సినిమా ప్రేక్షకుడిలా ఉంది నా ఆత్రుత. రేపటికైనా ఈ పుస్తకం చదవడానికి టైమ్ దొరికితే బాగుండు. 

ఈ పోస్ట్ రాయకుండా ఈ పది నిమిషాలూ పుస్తకం చదవడానికి వాడుకుని ఉండచ్చు. కానీ దుమ్ము పేరుకున్న లాప్టాప్ పై దృష్టి పడగానే ఎందుకనో ఇవాళ రాయాలనిపించింది. కారణాలు లేకుండా ఏమీ జరగవు కదా. తీరిగ్గా ఊసుపోకుండా గడిపేలాంటి సమయం నాకు ఐదేళ్ల క్రితమూ లేదు. ఇప్పుడూ లేదు.  ఒకప్పుడు ఇష్టమైనవి, ఇవే నా తోడు అనుకున్న వాటి కోసం తీరుబడి చేసుకుని, పనిమనిషిని పెట్టుకోకుండా కూడా చాలా పనులే చెయ్యగలిగాను. ఏనాడైతే కొన్ని భ్రమలు బూడిదయ్యాయో, అప్పుడిక తీరుబడిలేని మరో దినచర్యని తయారుచేసుకుని, భగవంతుడు చూపెట్టిన మరో దారిలో నడక మొదలుపెట్టాను.

పుస్తకం చదవడం త్వరగా పూర్తయితే.. ఆ కబుర్లు త్వరలో పంచుకుంటాను.

Saturday, December 27, 2014

yes.. ఇంకా ఉంది..



"It is not what life takes away from you that counts, 
It is what you make of what is left with you" - 
Hubert humphrey 

చాలా రోజుల్నుండీ కొనాలనుకుంటున్న ఒక సబ్జక్ట్ తాలూకూ పుస్తకం కనబడింది.. ఆ పుస్తకం వెనకాల పైన రాసిన కొటేషన్ చూడగానే 'పబ్లికేషన్స్ డివిజన్'(పుస్తక ప్రదర్శన) లో ఆ పుస్తకం కొనేసాను. కొన్న పుస్తకాలు ఒక్కొక్కటే ఇందాకా సర్దుతూంటే ఈ పుస్తకం చూసి మళ్ళీ పని ఆపి ఇది చదవడంలో మునిగిపోయాను.. 

 పుస్తకం సంగతి పక్కన పెడితే ఈ కోట్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. జీవితంలో చాలాసార్లు కొన్ని సందర్భాల్లో - 'ఇంకేం ఉంది.. అసలు ఇంకా ఏమైనా మిగిలిందా? ' అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక కారణంతో ఆ సందర్భాన్నీ, ఆ నిరాశనీ దాటి ముందుకు వెళ్తూ ఉంటాము. ఒక్కో రోజూ మర్నాటికి పాతగా, నిన్న ఒక అఙ్ఞానంలా తోస్తూ ఉంటుంది. ఇలానే ప్రస్తుతం నిన్నలన్నీ పాతగా, చిన్నతనంలా, తెలియనితనంలో ఉన్న పసిపిల్లల్లా అనిపిస్తున్నాయి..! Iam seeing the brighter side..
 yes.. ఇంకా ఉంది.. జీవితం ఇంకా ఉంది.. నాకు నేను మిగిలినంతలోనే మళ్ళీ మొదలుపెడతాను.. పయనాన్ని మళ్ళీ సాగిస్తాను..ఆశతో.. నడుస్తాను.. మళ్ళీ..


Tuesday, August 12, 2014

It's all coming back to me..:-)


"కాస్త హెల్ప్ చెయచ్చు కదా... కనీసం వాటర్ బాటిల్స్ లో నీళ్ళు పట్టడం, కంచాలు, మంచినీళ్ళు పెట్టడంలాంటి చిన్నచిన్న పనులు చేయచ్చు కదా"

"అబ్బా..బోర్ అమ్మా.."

***
 

"నేను ముగ్గు పెడతా.. నువ్వు పెట్టకు "
"ఆ వంకరటింకర గీతలు బాగోట్లేదు..వద్దే.."
"ఆ...ముగ్గు పెడతా.. ఏదీ వద్దంటావ్..నువ్వింతే ఎప్పుడూ"

***

"ఈ రెండు ముద్దలు ఎక్కువయ్యాయా..? అన్నం పాడేస్తే పాపం!"
"ఇంక ఒక్క స్పూన్ కూడా నేను తినలేను. నాకు చాలు. వద్దంటే వద్దు"

***

"పాలు బలం..తాగాలి.."
"నాకు వద్దు.. వద్దంటే అంతే!"


***


"ఇవాళ్టికి పప్పు వండాను తినెయ్యవే.."

"నాకీ పప్పు వద్దు...! నాన్న ఊరెళ్తే కూర వండవామ్మా? నాన్న ఊరెళ్తే మనం అన్నం తినడం మానేయ్యాలా? "



***

"ఇవాళ ఆ కూర వండు.. పైన కొత్తిమీర చల్లు..కాడలు వెయ్యకు"

 
"అట్టు మీద ఉల్లిపాయలు వద్దు..."
 




 

"వద్దు..వెళ్ళిపో వంటింట్లోంచి.."

" ఊ.. నేను చెక్కు తీస్తా... లేకపోతే ఆ పొటాటో తరుగుతా... ఊ..."

"చెయ్యి కోసుకుంటావ్...వెళ్పో.."

"ఊ... ఎప్పుడూ వద్దంటావ్..."

***

 

"నేను చపాతీ వత్తుతా..."

"వద్దు.."

"పోనీ కాలుస్తా.."

"వద్దు!! పెద్దయితే ఎలానూ తప్పదు..ఇప్పట్నుంచీ ఎందుకే తాపత్రయం తల్లీ..."

 

 
***
 

 

"నాన్నా.. అమ్మెప్పుడూ నన్ను తిడుతుంది.."

"ఇప్పుడు నిన్ను తిట్టకపోతే.. రేపు నువ్వు పెద్దయ్యాకా నిన్నెవరూ ఏం అనరు.. నన్నందరూ తిడతారు.. మీ అమ్మ ఇలానే పెంచిందా... ఏం నేర్పలేదా అని"

 

***


"ఇంతదాకా నీక్కావాల్సింది చూశావు కదా.. రిమోట్ నాకు ఇవ్వు.."

"ఊహూ.. ఇంకొంచెం ఉంది ఉండమ్మా.."

"కొంచెం కొంచెం అని అరగంట నుంచీ నువ్వే చూస్తున్నావు.."

 

***


"నా సబ్బు నాకు కావాలి.. మీరు వేరేది వాడుకోండి.."
"...."

***


"నువ్వు కొత్త చెప్పులు కొనుక్కున్నావ్.. మరి నాకో.."

"ప్రతీదానికీ నాతో పోటీ ఏమిటే ఇప్పట్నుంచీ..."

"నాకవన్నీ తెలీదు.. నువ్వు ఏది కొనుక్కుంటే అది నాక్కూడా కొనాలంతే"

***

 

"అబ్బా.. గోల.. సౌండ్ తగ్గించు.."

"తగ్గించాను కదమ్మా... ఇంతకంటే తగ్గిస్తే బావుండదు"


***

 

"నీకేం తెలీదు ఉండమ్మా... అలా కాదు.. ఇలా చెయ్య్..."

***

ఇలా ఎన్నని రాయను? ప్రతి మాటా, అక్షరం అక్షరం...
టేప్ వెనక్కి రెవైండ్ చేసి వింటునట్లు ఉంది..
ఇప్పుడే ఏమైంది... ఫ్రెంట్ లైస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అనిపిస్తూ ఉంటుంది.. :)

నే కూడా ఇలానే అమ్మని ఎంతగా విసిగించి ఉంటానో కదా అనిపిస్తూ ఉంటుంది... నాకేనా.. అందరు అమ్మాలకూ ఇలానే అనిపిస్తుందా??
 

***

ఏమైనా.. అమ్మతనంలోని కమ్మదనాన్ని ఏ సిరులందివ్వగలవూ...
ఇదొక తియ్యని వరం కదూ..
 

Wednesday, May 28, 2014

ఐదేళ్ల పయనం...






ఇవాళ్టికి ఐదేళ్ళు పూర్తవుతుంది నే బ్లాగ్ మొదలుపెట్టి..! 100, 200, 300 అని బ్లాగ్ పోస్ట్లు లెఖ్ఖపెట్టుకుంటుంటాను కానీ బ్లాగ్ పుట్టినరోజు నేనెప్పుడూ చేసుకోలేదు ఈ ఐదేళ్లలో. చాలా పెద్ద పోస్ట్ రాసాను ఇందాకట్నుండీ కూచుని.. కానీ ఎందుకో అనిపించింది...ఎందుకు ఇవన్నీ రాయడం... నేనేమిటో తెలిసినవాళ్ళు... నన్ను అర్థం చేసుకున్నవాళ్ళు నా రాతలని అభిమానంతో చదువుతూనే ఉంటారు. అర్థం చేసుకోనివాళ్లకు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా ఎలానూ అర్థం చేసుకోరు.. అనిపించి మొత్తం డిలీట్ చేసేసా :-)


నన్ను ప్రోత్సహిస్తూ, నా బ్లాగ్ కబుర్లన్నీ ఓపిగ్గా వింటూ, తోచిన సలహాలిస్తూ సహకరిస్తున్న శ్రీవారికి బ్లాగ్ముఖంగా బోళెడు థాంక్యూలు. మొదట్లో చదివేవారు కాదు కానీ ఇప్పుడు నా ప్రతి పోస్ట్ కీ ఫస్ట్ రీడర్ తనే. ఏవైనా మార్పులు కూడా చెప్తూంటారు. ఇక ఇప్పుడు ఏం చేసినా, ఏం రాసినా తనకి చూపించడం, తన సలహా తీసుకోవడం అలవాటైపోయాయి నాకు. ఇంకా నేను బ్లాగింగ్ చేస్తుండటానికి కారణం తనే. నే మానేస్తానన్న ప్రతిసారీ ఎన్నో ఉదాహరణలూ, సలహాలూ చెప్పి నాకు ధైర్యాన్ని ఇస్తారు. "తృష్ణ" గా నాకొక ఉనికి ఏర్పడి, నా ఈ బ్లాగ్ పయనంలో విజయాలేమైనా చూసానూ అంటే..అన్నీ తన వల్లే! తన ప్రోత్సాహం వల్లే! 


ఎవరి జీవితంలో అయినా ఐదేళ్ళంటే చాలా విలువైన సమయం.. ఈ సందర్భంగా.. ఈ ఐదేళ్ల పయనంలో నా వెంట ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన నా బ్లాగ్ రీడర్స్ కీ, ఇంకా బ్లాగ్మిత్రులందరికీ మరోసారి మన:పూర్వక ధన్యవాదాలు. 

 

Saturday, April 26, 2014

'Queen' సినిమా... కొన్ని ఆలోచనలు..



'బావుంది చూడమని' కొందరు మిత్రులు చెప్పాకా మొత్తానికి ఇవాళ ఈ సినిమా చూసాను. మొదటిసారి నేను కంగనా ని "గ్యాంగ్ స్టర్" సినిమాలో చూసాను. ఆ సినిమా బాగా నచ్చింది అనేకన్నా నన్ను బాగా కదిలించేసింది అనాలి. ఆ తర్వాత చాలా రోజులు పట్టింది ఆ కథ తాలూకూ బాధలోంచి బయట పడడానికి. ఆ తర్వాత మళ్ళీ మరో కంగనా సినిమా.. అది మధుర్ భండార్కర్ "ఫ్యాషన్"! అది కూడా చాలా నచ్చింది నాకు. ఈ రెండు సినిమాలూ చాలు కంగనా ఎంత ఫైన్ ఏక్ట్రస్సో తెలియడానికి. గాసిప్స్ & రూమర్స్ సంగతి ఎలా ఉన్నా, ఒక మంచి నటిగా గుర్తుంచుకోదగ్గ ఆర్టిస్ట్ కంగనా. ఇప్పుడు "క్వీన్" సినిమా దగ్గరికి వచ్చేస్తే ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ! మొత్తం కథంతా హీరోయిన్ భుజాలపైనే నడుస్తుంది. రాణీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది కంగనా.


కథలో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. సన్నివేశాలు కాస్త స్లో గా ఉన్నా కథాబలం వల్ల చిత్రం నడిచిపోతుంది. ఈ కథ ద్వారా డైరెక్టర్ చెప్పదలుచుకున్న పాయింట్ చాలా నచ్చింది. అది ఏమిటంటే మనుషుల కన్నా జీవితం చాలా గొప్పది. ఎన్ని ఆటంకాలు వచ్చినా జీవితం ఆగిపోదు.. life goes on..! కొద్దిగా మనకొచ్చిన సమస్య లోంచి తల బయటకు పెట్టి జీవితాన్ని పరికించి, పరిశీలిస్తే చాలు! తిరిగి జీవించడానికి మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. మన జీవితంలోకి ఎందరో మనుషులు వస్తూంటారు.. వెళ్తూంటారు. కొందరు వెళ్పోయినప్పుడు మనం రియాక్ట్ అవ్వము కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలా ఎందుకు జరిగింది అని చాలా బాధపడతాము. చాలాకాలం నిలదొక్కుకోలేము కూడా. కానీ "when God closes one door, he'll open another" అన్నట్లు మరో దారి.. ముందరి కన్నా మంచి దారి భగవంతుడే మనకు చూపెడతాడు. ఈ సినిమా చివర్లో తనను కాదన్న పెళ్ళికొడుకు దగ్గరకొచ్చి ఉంగరం ఇచ్చేసి, మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి వెళ్తుంది రాణి. ఆ సీన్ నాకు చాలా చాలా నచ్చింది. ఒకోసారి కొందరు మన జోవితంలోంచి వెళ్పోవడమే మంచిది. అప్పుడు కానీ మనం వాళ్లకి ఎంత అనవసరపు ప్రాముఖ్యతను ఇస్తున్నామో మనకు అర్థమవ్వదు.


చిత్రంలో పెళ్ళి తప్పిపోవడం ప్రధాన అంశం కానీ ఈ కథ నాకు చాలా మందిని గుర్తుచేసింది. ఆడ, మగ అని కాదు. ప్రేమ, పెళ్ళీ అని కాదు. అసలు ఏదో ఒక పరిచయం, అనుబంధం పేరుతో జోవితాల్లోకి ప్రవేశించి అర్థాంతరంగా మాయమైపోతుంటారు కొందరు. అలాంటివాళ్ళు గుర్తుకు వచ్చారు. కేవలం నా జీవితం అనే కాదు నా మిత్రులు, పరిచయస్థులు కొందరి జీవితాల్లో కూడా ఇలాంటివాళ్ళను చూశాను నేను. జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఇలానే ఉంటుందేమో అనుకుంటూంటాను నేను. మనం పట్టించుకోనంతవరకూ మనకెంతో విలువ ఇస్తారు. వెనక వెనకే ఉంటారు. కానీ ఒక్కసారి మనం పట్టించుకుని ప్రాముఖ్యతనిచ్చి నెత్తిన పెట్టుకున్నామా...అంతే! మనల్ని లోకువ కట్టేసి ఇగ్నోర్  చేసేయడం మొదలుపెడతారు. అంతకు ముందర చూపెట్టిన శ్రధ్ధ, ఆసక్తి ఏమౌతాయో తెలీదు. బహుశా వాళ్ల అవసరం తీరేదాకానో, మన వల్ల పొందాల్సిన సహాయమేదో అయ్యేదాకానో అలా బిహేవ్ చేస్తారేమో అనుకుంటాను నేను. లేదా వాళ్ళు కావాలనుకున్నది మన దగ్గర లభించదు, మన వల్ల వాళ్ల పనులు అవ్వవు అని అర్థమయ్యాకా ఇంక వదిలేస్తారు. కానీ అంతకు ముందు వాళ్ళు చూపెట్టిన శ్రధ్ధనీ, అభిమానాన్నీ చూసి మనం వాళ్ళకు అలవాటు పడిపోతాం. అవతలి వాళ్ళ నిర్లక్ష్యాన్ని భరించి, అధిగమించి, మళ్ళీ ఆ అలవాటు నుండి బయటపడడానికీ మన జీవితం మనం జీవించడానికీ ఎంతో సమయం పడుతుంది. దీనికంతటికీ ఎవర్నో ఏమీ అనలేము. మనమే దానికి బాధ్యులం. ఒక వ్యక్తికో, అభిమానానికో, అలవాటుకో బానిస అయిపోవడం మన బలహీనత. కానీ అందులోంచి బయటపడ్డాకా కానీ తెలీదు మనం కొందరికి ఎంత అనవసరపు ప్రాముఖ్యత ఇచ్చామో. అలాంటి ఒక బలహీనత లోంచే బయటపడుతుంది "క్వీన్" చిత్రనాయిక "రాణీ". సినిమాలో ఏ రకమైన సన్నివేశాలు చూపెట్టినా నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి తన బాధలోంచి బయటపడటం. 


ఈ చిత్రంలో ఓ పెళ్ళికొడుకు ఓ అమ్మాయి వెంట పడి, పెళ్ళి చేసుకొమ్మని బ్రతిమాలి, తీరా ఆమె ఒప్పుకుని అతడ్నే నమ్ముకుని, అతడికి అలవాటు పడిపోయి, పెళ్ళికి అన్ని సన్నాహాలూ పూర్తయ్యాకా హటాత్తుగా పెళ్ళి వద్దని వెళ్పోతాడు. కన్నీళ్ళతో ప్రాధేయపడినా వినడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి ప్రపంచమంతా తలక్రిందులైపోతుంది. కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళి జీవితాన్ని చూశాకా ఆ అమ్మాయి రియలైజ్ అవుతుంది. తన దు:ఖం జీవితాన్ని తలక్రిందులు చేసేది కానే కాదని. మనుషుల చుట్టూ, అనుబంధాల చూట్టూ జీవితాన్ని ముడిపెట్టేసుకోవడం కన్నా జీవితాన్ని జీవించడంలో ఎంతో ఆనందం ఉందని తెలుసుకుంటుంది. ఆ అబ్బాయి వద్దన్నాడు కాబట్టే తను ఆ సంగతిని కనుక్కోగలిగింది. అందుకే చివర్లో థాంక్స్ చెప్తుంది. ఇదే సత్యాన్ని మనం చాలా సందర్భాలకు అన్వయించుకోవచ్చు. ఒక చెడు సంఘటన, చేదు అనుభవం మొత్తం జీవితాన్ని చీకటి చేసేయదు. ఆ క్షణంలోనే ఉండిపోతే తప్ప!! ఆ క్షణాన్ని దాటి ముందుకు వెళ్తే తెలుస్తుంది జీవితం ఎంత గొప్పదో.. మనకు ఎన్ని ఆనందాలను ఇవ్వగలదో! నేనూ ఇలాంటి ఎన్నో క్షణాలను దాటి ముందుకు నడిచాను కాబట్టే నాకు ఈ చిత్రం నచ్చింది. 


ఇవాళ్టిరోజున నేను మనుషులనూ, అనుబంధాలనూ, సిధ్ధాంతాలనూ.. ఏమీ నమ్మను. జీవితాన్ని మాత్రం నమ్ముతాను. జీవితం అందించే పాఠాలను నేర్చుకుంటాను.. మనుషుల కన్నా జీవితమే ఎక్కువ ఆనందాలను ఇవ్వగలదని నమ్ముతాను.. ఎందుకంటే నేను దాటిన చీకటి క్షణాల నుండి నేను జీవితాన్ని ప్రతిక్షణం జీవించడం నేర్చుకున్నాను కాబట్టి..!

Wednesday, April 23, 2014

ఈ పాటతో ఆరొందలు!





ఇవాళ రెండు విశేషాలు.. అన్ని బ్లాగుల్లో కలిపి 882 పోస్ట్ లు ఉన్నా, నాకెంతో ప్రియమైన 'తృష్ణ'లో ఆరొందల స్వగతాలు పూర్తయ్యాయి. ఒక నెల తక్కువ ఐదేళ్ళూగా నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు.


రెండవది.. ఇవాళ సుప్రసిధ్ద గాయని ఎస్.జానకి పుట్టినరోజు! అందుకని స్పెషల్ గా ఆవిడ పాడిన తెలుగు పాటలు కాకుండా నాకు బాగా ఇష్టమైన ఓ తమిళ్ పాటని వినిపిస్తున్నాను. జానకి చాలా బాగా పాడిన పాపులర్ సాంగ్స్ లిస్ట్ లో తప్పక ఉండే పాట ఇది. తమిళంలో భారతీరాజా తీసిన "Alaigal Oyivathillai" (తెలుగులో  "సీతాకోకచిలుక") చిత్రంలోని గీతం ఇది.

చిన్న క్విజ్ కూడా... ఈ పాట 'పల్లవి'ని ఇళయరాజా మళ్ళీ ఎక్కడ, ఏ రూపంలో వాడుకున్నాడో చెప్పగలరా ఎవరైనా?

Friday, February 28, 2014

ఒక నిన్న...



27-2-14,
గురువారం
శివరాత్రి!

పొదున్నే హడావుడిగా తెమిలి ముగ్గురం హాస్పటల్ కు చేరుకున్నాం. అప్పుడే నాన్నను లోపలికి తీసుకువెళ్ళారని అన్నయ్య చెప్పాడు. ఓ ముప్పావుగంట అయ్యాకా అన్నయ్యని పిలిచారు. 'ఇదివరకు పెట్టిన స్టెంట్స్ బాగానే ఉన్నాయి. కొత్త ప్రమాదాలేమీ లేవు. హీ ఈజ్ ఓకే' అని చెప్పారుట డాక్టర్. హమ్మయ్య! అని ఊపిరితీసుకున్నాం.


 పొద్దుట ఏంజియో తీస్తారని నిన్ననే చెప్పారు. గతకొన్నాళ్ళుగా ఎదో ఒక ఇబ్బందితో అవస్థ పడుతున్న నాన్న మొన్న రాత్రి బాగోలేదని చెప్తే ఎమర్జన్సీ ఎడ్మిషన్ చేసారుట. నేనొట్టి కంగారుమనిషినని రాత్రి చెప్పకుండా నిన్న పొద్దున్న తను ఊరు నుండి వచ్చాకా అప్పుడు అమ్మ చెప్పింది ఇలా అని..! ఆఫీసు పనిలో బిజీగా ఉండి అన్నయ్య కేబ్ మాట్లాడితే వాళ్ళిద్దరే వెళ్లారుట హాస్పటల్కి. రాత్రంతా అమ్మ ఒక్కర్తే కంగారుగా గడిపింది పాపం! ముగ్గురు పిల్లలం ఉన్నాం.. ఏం లాభం? చాలాదూరంలో తమ్ముడు, ఆఫీసులో పీకల్లోతు పనిలో అన్నయ్య, విషయం తెలియక నేను.. ముగ్గురం ఉపయోగపడలేదు. అంతేనేమో ఒక స్టేజ్ వచ్చాకా.. భార్యాభర్తలిద్దరే ఒకరికి ఒకరు తోడు.. అదీ ఇద్దరిలో ఒకరైనా ఆరోగ్యంగా ఉంటే రెండోవారిని చూసుకోవడానికి ఉంటుంది! సరే, కాసేపుండి తను ఆఫీసుకెళ్ళిపోయారు. పాపను రూం లోకి అలో చెయ్యమని హాస్పటల్ స్టాఫ్ చెప్పేసారు. ఓ ల్యాపీ ఇస్తే ఏవో కార్టూన్స్ చూసుకుంటుందిలే అని పాపను అన్నయ్య వాడితో ఆఫీసుకు తీస్కెళ్ళాడు.


ఆ పూటకి అమ్మకు తోడుగా నేను ఉండిపోయాను హాస్పటల్లో. రకరకాల సందర్భాల్లో గతంలో చుట్టిన నానారకాల ప్రదక్షిణల మూలంగా హాస్పటల్ అంటేనే పరమ చిరాకు, భయం నాకు. అయినా ఇప్పుడు పూర్వంలా లేవు హాస్పటల్స్ కూడా. ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఫీలింగ్. విశాలమైన రూమ్స్, సోఫాలు, ఏసీ, టివీ, ఫోన్ చేస్తే టిఫిను, కాఫీ-టీలు, భోజనాలు క్షణాల్లో ప్రత్యక్ష్యమౌతున్నాయి. మధ్యలో డ్యూటీ నిమిత్తమై కిలకిల్లాడే మళయాళీ నర్సులు! పేషేంట్ రోగం సంగతెలా ఉన్నా వాళ్ళకీ, వాళ్ళ వెంటనున్నవాళ్ళకీ వైభోగమే! పచ్చకాగితం పవరది...!! ఇంత పెద్ద హాస్పటలూ పేషేంట్స్ తో కిటకిటలాడిపోతోంది. రూమ్స్ ఖాళీ లేవుట అస్సలు :(  ఐసీయూ లో పేషంట్స్, బయట హాల్లో వాళ్ల తాలూకా మనుషులు వెయిట్ చేస్తున్నవారెందరో! రకరకాల కథలు..కన్నీళ్ళూ.. అనారోగ్యాలూ.. వాటికి వందరకాల ఆధునిక వైద్యాలూ! కేథ్ రూమ్ బయట ఆ అరగంటలో నాలుగు కథలు విన్నా! దినచర్యల్లో, తినే ఆహారంలో మార్పులే ఇన్ని రకాల ఆరోగ్యసమస్యలకు దారితీస్తున్నాయి అనిపించింది.


చిన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే బైపాస్ సర్జరీనే మార్గం. ఇప్పుడేమో ఇక్కడ గంటకు నాలుగు ఏంజియోగ్రాములు తీస్తున్నారు.. ఎక్సరేలు, స్కానింగ్ లు చేసినట్లు! అసలు వీటిల్లో ఎన్ని అత్యవసరమో తెలీదు. మొన్న మా బంధువులొకరు విజయవాడలో ఏంజియో పదిహేనువేలన్నారని కాకినాడ వెళ్ళి తొమ్మిదివేలకు చేయించుకు వచ్చారు. స్టెంట్స్ కి కూడా హాస్పటల్ ని బట్టి, పేషంట్ ని బట్టి రకరకాల రేట్లు. ఏంజియోలు మాత్రం తప్పవు.. స్టెంట్స్ అక్కర్లేని కేసులు కొన్ని.. అప్పటికప్పుడు స్టెంట్స్ వేయాల్సిన కేసులు కొన్ని.. అవి వేయడం కోసమే చేస్తున్న ఆంజియోలు కొన్ని! మళ్ళీ ఆ స్టెంట్స్ లో మూడు నాలుగు రకాలు. హాస్పటల్లో ఒక రేటు, బయట కొంటే ఒక రేటు, ఏజెంట్ ద్వారా ఎక్కడ్నుంచైనా తెప్పించుకుంటే ఒక రేటు, డయాబెటిక్ పేషేంట్స్ కి కోటెడ్ స్టెంట్స్ అంటూ అవో రకం..! ఈ వైద్యాలకు పేదా, గొప్పా తేడాలేమీ లేవు. ఎవరికైనా అదే గుండె, అదే సమస్య, అదే స్టెంట్ మరి! మనసు లేకుండా మనుషులు ఉండగలరు కానీ గుండే లేకుండా మనుషులు ఉండలేరు కదా మరి!!


సరే ఇక నాన్నకు కొత్త ఇబ్బందులేమీ లేవు.. మందులు కాస్త మార్చి ఇస్తామన్నారు మా డాక్టరు. నాన్నకు రూమ్ కు తీసుకువచ్చాకా అమ్మా, నేను కాసేపు శరీరాలూ, ఆరోగ్యాలూ, డాక్టర్లు,ఖర్చులు గురించి కాసేపు మాట్టాడేసుకున్నాం. కరెంట్ పోయిందని నేను మూడో అంతస్థులో ఉన్న ఆ రూమ్ అద్దం కిటికీ తెరిచాను. క్రిందన చిన్న మురికివాడ ఉంది. రేకు టాపులతో ఓ పదిపదిహేను ఇళ్ళు ఉన్నాయ్. మధ్యన ఓ చిన్న గుడి కూడానూ. పిల్లల్లు, పెద్దలు ఎవరిపనుల్లో వాళ్ళున్నారు. నీళ్ళు పట్టేవాళ్ళూ, అంట్లు తోముకునేవాళ్ళూ, ఉన్న ఆ కొద్దిపాటివాకిలీ తుడిచేవాళ్ళూ.. ఓ పక్కగా శివరాత్రి అనేమో మైక్లో పెద్దగా సినిమా పాటలు పెట్టారు. నే గమనించినదేమిటంటే అన్ని ఇళ్ళల్లో ఈ క్లీనింగ్ పని ఆడవాళ్ళే చేస్తున్నారు. వంట, అంట్లు తోమడం, ఇల్లు-పరిసరాలు శుభ్రం చేయడం, చంటి పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం ఇవన్నీ ఎక్కడైనా ఆడవారి పనులే...ఎక్కడైనా ఇంతే కదా అని నవ్వొచ్చింది! అభ్యుదయం, సమానత్వం, వంకాయ, బీరకాయ పది శాతం జనాభాలో మాత్రమే నాకు కనబడుతుంది. చదువులేనివాళ్ళు ఇళ్ళలో చాకిరీ చేస్తే, చదువుకున్నవాళ్ళు ఆఫీసుల్లో+ఇళ్ళల్లో రెండుచోట్లా చాకిరీ చేస్తున్నారు. డబ్బు, సౌఖ్యం ఉన్నా శారీరిక శ్రమ కూడా రెట్టింపు ఉంటోంది కదా..ఇంతకన్నా పూర్వకాలం అమ్మమ్మలూ,మామ్మలే నయమేమో ఇంటిపనులయ్యాకా కాస్తైనా విశ్రాంతి దొరికేది వాళ్ళకి! ఇంటాబయటా పనులతో సతమతమయ్యే నేటి మహిళల పరిసరాల్లో 'స్ట్రెస్ అండ్ స్ట్రైన్' తప్ప 'రెస్ట్' అనే పదం ఎక్కడైనా కనబడుతోందా..?! ఈలోపూ మళ్ళీ కరెంట్ రావడంతో ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి కిటికీ మూసేసి ఇవతలకొచ్చేసా !


కాసేపు నే ప్రస్తుతం చదువుతున్న పుస్తకం తాలూకూ కథనీ, రచయిత గురించి అమ్మానాన్నలకు చిన్న సైజు లెక్చర్ ఇచ్చేసా! సాయంత్రం తను అన్నయ్య వద్దనుండి పాపను తీసుకుని హాస్పటల్ కి వచ్చాకా, నాన్నని రేపు డిస్చార్జ్ చేస్తారని తెలుసుకున్నాకా మళ్ళీ ముగ్గురం ఇంటిదారి పట్టాం. ఎంతరాత్రైనా గుడికి తీసుకువెళ్ళాల్సిందే నాన్నా అని పిల్ల ఆర్డర్! దారిలో శివాలయానికి వెళ్ళి హరహర మహాదేవా! అని పొద్దుటి నుండీ ఎక్కువైపోయిన హృదయభారాన్ని అక్కడే దింపేసి, కొంత ప్రశాంతతని  మళ్ళీ మనసులో నింపుకిని, కాసిని క్షణాలక్కడ గడిపి పదవుతుంటే ఇల్లు చేరాం! అప్పుడు మళ్ళీ పొద్దుట చెయ్యని పూజాకార్యక్రమాలు పూర్తిచేసి, ఇంటిలోని ఈశ్వరుణ్ణి స్తుతించేసరికీ పొద్దుటి నుండీ అలుముకున్న అలజడంతా ఒక్కసారిగా దూరమయినట్లయ్యింది. అలా హడావుడిలో కూడా లోటు లేకుండా తన పూజలు తాను జరిపించుకున్నాడీవాళ శివయ్య!!

నిన్న ఇవాళ్టికి నిన్నే కానీ నిన్నటికి ఇవాళే కదా! 

Friday, February 7, 2014

ఆబ్దీకం


స్నానాలూ, మడిబట్టలు, బ్రాహ్మలు, గదిలోపల కార్యక్రమంలో హోమం.. ఇంటి నిండా పొగ, పిండాలూ, నల్ల నువ్వులూ, వంటింట్లో వంటావిడ హంగామా, ఇంట్లో బంధువులు, కబుర్లు, ఆపై భోజనాల్లో నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, గారెలు, పరమాన్నం, అప్పాలో..అరిసెలో.., ముద్దపప్పు, నెయ్యి, కమ్మటి పెరుగు.. అరిటాకుపై కడుపునిండా భోజనం..  చిన్నప్పుడు 'ఆబ్దీకం' అంటే తెలిసిన అర్థం ఇదే!


మా అమ్మమ్మ,తాతయ్యల మరణాల మధ్య పదిహేను ఇరవైఏళ్ళ అంతరం ఉన్నా వాళ్ల ఆబ్దీకాలకు మధ్యన ఒక రోజే తేడా! ఏడాదికోమాటు తాతయ్య ఆబ్దీకానికి, ఆ తర్వాత ఇద్దరి ఆబ్దీకాలకీ మా కజిన్స్ అందరం మావయ్య ఇంట్లో తప్పనిసరిగా కలిసేవాళ్లం. ఈ వంకతో అయినా అందరం ఓసారి కలుస్తున్నాం అని తృప్తి ఉండేది మాకు. రాన్రానూ చదువులూ, ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ మా అందరిమధ్యన దూరాలను కూడా పెంచేసాయి. మా ఇంట్లో అయితే నాన్న ఏడాదికి మూడు ఆబ్దీకాలు పెట్టేవారు. కొడుకుల్లేని వాళ్ల అమ్మమ్మకు ఏకైక మనవడిగా వాళ్ల అమ్మమ్మ,తాతయ్యలదీ, వాళ్ల నాన్నగారిదీ! ఆ తరవాత పదిహేనేళ్ళుగా మా మామ్మయ్య(నాన్నమ్మ)దీ మొత్తం కలిపి నాలుగు! ఎప్పుడైనా శెలవు రోజైతే ఆబ్దీకం భోజనం తినేవాళ్లం తప్ప స్కూలుకి, కాలేజీలకీ వెళ్పోయేవాళ్లం కాబట్టి మాకు ఇంట్లో జరిగే కార్యక్రమం గురించి పెద్దగా అవగాహాన ఉండేది కాదు. మంత్రం చెప్పే ఆయన, ఇద్దరు భోక్తలు మొత్తం ముగ్గురు బ్రాహ్మలు వచ్చేవారని మాత్రం గుర్తు. అప్పట్లో పప్పు రుబ్బటానికి రుబ్బురోలే కాబట్టి వంటావిడ రుబ్బలేకపోతేనో, రావడం లేటు చేస్తేనో "నేనే పప్పు రుబ్బానని.." అమ్మ చెప్తే ఓహో అనేవాళ్లం తప్ప ఆ కష్టం ఏపాటిదో ఊహకైనా తెలిసేది కాదు! ఆబ్దీకాలైన ప్రతిసారీ "నా కూతుర్ని పెద్ద కొడుక్కో, ఒక్కడో కొడుక్కే ఇవ్వను బాబూ.." అని అమ్మ అంటూండడం మాత్రం బాగా గుర్తుంది! 


కట్ చేస్తే... నేను ఓ ఇంటి పెద్దకోడల్నే అయ్యాను!! దురదృష్టవశాత్తూ ఏడేళ్ల క్రితం మా మావగారు కాలం చేసారు. మడిబట్ట ఎలా కట్టుకుంటారో కూడా తెలీదప్పటికి నాకు. అప్పటికి మా పాపకు రెండేళ్ళూ, నాకు ఒక మిస్కేరేజ్ అయ్యి రెండు నెలలు కూడా పూర్తవ్వలేదు. చణ్ణీళ్ల స్నానాలు, మడిబట్టలు.. నెలా నెలా మాసికాలు.. ఆ కార్యక్రమాలు.. మళ్ళీ అందులో గోదారిజిల్లా రూల్స్ వేరు..కృష్ణాజిల్లా రూల్స్ వేరు... అంతా గందరగోళంలా ఉండేది. అమ్మ, అత్త, మామ్మయ్య, తాతమ్మా.. అంతా ఇంతేనా? ఇలానే తడిబట్టలు, మడిబట్టలు, కట్టుకుని ఉండేవారా? ఒక్క చీరనే కట్టుకుని ఎలా ఉండాలి? వచ్చినవాళ్లంతా మనల్నే చూస్తూంటారు కదా...అయినా ఇంతేనా..  మడిబట్ట మార్చేదాకా మధ్యలో బాత్రూం లోకి కూడా వెళ్లకూడదా... ఇవేమి రూల్స్? ఎవరు పెట్టారు? ఇలానే ఎందుకు చెయ్యాలి? చదువులూ, ఉద్యోగాలూ, సమాజం..మార్పు.. ఇవన్నీ పుస్తకాలకీ, సినిమాలకీ, కాయితాలకీ, కవితలకే పరిమితమా? సవాలక్ష సందేహాలు... 


మావగారి సంవత్సరీకాలు కాశీలో చేసాం. గయా వెళ్లాం.. అక్కడ కూడా కొన్ని విధులు పూర్తిచేసాం. వచ్చాకా కాశీసమారాధన మొదలైన కార్యక్రమాలు అయ్యాయి. ఆ తర్వాత నుండీ ఏడాదికోమాటు ఆబ్దీకాలు ఇంట్లోనే జరుపుతున్నాం. "అమ్మా.." అని ఆప్యాయంగా పిలిచే మావగారి పిలుపు.. "కాస్త చాయ్ పెట్టిస్తావామ్మా..", "చపాతీలు ఇలా వత్తాలి..", "టమాటా పచ్చడి నే రోట్లో రుబ్బితే అంతా వచ్చి రుచి చూసాకా చివరికింత ముద్ద మిగిలేది.." అంటూండే ఆయన మాటల్ని తలుచుకుంటూండగానే ఏడేళ్ళు గడిచిపోయాయి. కానీ అబ్దీకం వస్తోందంటే అది పూర్తయ్యేదాకా గుబులు మాత్రం పోవట్లే..! ఎవరితోనూ మాటపడకుండా కార్యక్రమం పూర్తిచెయ్యాలి. అత్తగారు తృప్తిపడాలి. వచ్చినవాళ్ళు కడుపునిండా భోజనం చేసి వెళ్లాలి. పెద్దకోడలిగా నా బాధ్యత నేను నెరవేర్చాలి. ఇదీ నా తాపత్రయం. ప్రతి అబ్దీకానికీ అమ్మ, పిన్ని, అత్త.. ఇలా అంతా గుర్తుకువస్తారు..! పది మంది, మహా అయితే ఓ పదిహేను మందికే నేను అతలాకుతలం అయిపోతుంటే, గ్రైండర్లు లేని రోజుల్లో ప్రతి ఆబ్దీకానికీ నలభైకి తక్కువకాకుండా బంధువులకి చేసిపెట్టిన పెద్దవాళ్లను తల్చుకుంటే అసలు చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. 


నిన్న మా మామగారి ఏడవ ఆబ్దీకం జరిపాము.ఈమధ్యన రెండేళ్ళుగా ఆరోగ్యం బాగోక నే వడ్డన చెయ్యలేక వంటావిడనే వడ్డనకి కూడా మాట్లాడుకుంటున్నాం. నిన్న భోజనం చేస్తుంటే మా సీతత్త గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సీతత్త మా మేనమామ భార్య. మా అమ్మమ్మా తాతయ్యల ఆబ్దీకాలకి వాళ్ల ఎనమండుగురు సంతానం, వారి పిల్లలు అంతా కలిపి రెండు మూడు బ్యాచ్ లలో భోజనాలు చేసేవారు. అందరికీ దగ్గరుండి వడ్డన చేస్తూ, "ఇదిగో నువ్వీ గారెలు తిను", "పరమాన్నం బావుంది మరికాస్త వేయించుకో", "కొబ్బరిపచ్చడి కావాలా?" , "ఈ కూర వేయించుకో..వద్దనకు", "తాతగారి ప్రసాదం తినాలి.." అంటూ నవ్వుతూ అందరికీ కడుపునిండా భోజనాలు పెట్టించి, చివరికెప్పుడో నాలుగింటికి తను భోజనం చేసి మడిబట్ట మార్చుకుని వచ్చేది తను. నేను వడ్డన చెయ్యకపోయినా బ్రాహ్మల భోజనం అయ్యి, వారి విస్తళ్ళు తీసి, నేలంతా తుడిచేసరికే చుక్కలు కనబడ్డాయి నాకు.


అసలు ఈ కాలంలో అప్పటి ఓపికలు ఎందుకు ఉండట్లేదు? మా పరిస్థితే ఇలా ఉంటే అసలు ముందుతరాల మాటేమిటి? ఒకవేళ ముందు తరాలవాళ్ళు తల్లిదండ్రులకి ఇలా కార్యక్రమాలు నిర్వహించలేకపోతే...?  అసలు కొడుకే లేకపోతే..? ఎవరు ఇవన్నీ జరిపిస్తారు? ఎవరో ఒక బంధువులు చేస్తే కొడుకు చేసినంత శ్రధ్ధగా చేస్తారా? వాళ్ళు ఈ శ్రార్థకర్మలన్నీ విధిగా జరపలేకపోతే మరి చనిపోయినవాళ్లకు ఏం నష్టం జరగదా? అసలు ఇవన్నీ ఇలానే చెయ్యాలా? ఎవరి చేసినా చెయ్యకపోయినా చనిపోయాకా మనకి ఏం తెలుస్తుందసలు? ఇలా అల్లిబిల్లిగా ముసురుకున్నాయి ఆలోచనలతో మనసు బరువైపోయింది... 


ఇంతలో "పెద్దమ్మా నాకు కలర్ చాక్పీస్ ఇయ్యవా? నే బొమ్మ వేస్తా" అని మా మరిది కూతురు, "బెద్దమ్మా..నాక్కూడా ఇంకో స్లేట్ ఈయ్.. నే కూడా మంఛి బొమ్మ వేస్తా.." అన్న దాని తమ్ముడి ముద్దుముద్దు మాటలతో ఆలోచనాలోకం నుండి బయటపడి వాళ్ల కేరింతలకు నా నవ్వులను జత చేసేసా! 

Thursday, January 30, 2014

తగిన సమయం


ప్రతీ విషయానికీ... అది జరగడానికీ, అగి.. సాగడానికీ, లేదా పూర్తిగా ఆగిపోవడానికీ,ఒక 'తగిన సమయమంటూ' ఉంటుంది. ఆ సమయం వచ్చేదాకా మనం ఎంత కిందామీదా పడ్డా కొన్ని సంగతులు, ఆగిన పనులు ముందుకు కదలవు. సమయమంటూ వచ్చాకా ఎంతసేపు నిరీక్షించామో అంతకన్నా వేగంగా ఆ పనులు అయిపోతాయి. ఆ సంగతులు జరిగిపోతాయి. ఇంత సులువుగా జరిగిపోయిందేమిటీ? అని మనం హాచ్చర్యపడిపోతాం కూడా! ఇదంతా జరిగేలోపూ మనం పడే వేదనో, బాధో, కంగారో, చిరాకో కూడా ఆ ఫలానా పని జరిగిపోగానే ఠక్కున మాయమైపోతుంది. అప్పుడూ 'ఓసి చిరాకానీ ఇన్నాళ్ళు ఇంత సతాయించి ఇప్పుడిలా మాయమైపోయావేమిటే' అని చిరాకు మీదే చిరాకు పడిపోతాం కూడా మనం లేదా 'ఓస్ దీనికేనా ఇంత చింతించాము...' అని నవ్వేసుకుంటాం.


ఒకోసారి పని జరగదేమో అనిపించినా, అది మనకి తెలిసిన విషయమే అయినా మనం గమనించము. కావాలనే గమనించమేమో కూడా. ఫలానాది.. ఫలానాది.. అని మనకి జరగాలనుకున్న ఏదో ఓ సంగతి గురించి నిరంతరం చింతిస్తూ గడిపేస్తాం. మనం చింతించడం వల్ల అది జరగదని తెలిసినా కూడా. కొన్ని విషయాలైతే ఎంత త్వరగా వదిలేస్తే అంతగా మనసుకూ, ఆరోగ్యానికీ కూడా మంచిది.. అని మనకు తెలిసినా మనం వాటిని వదలం.. వదలాలా వద్దా అనే మీమాంస తాలూకూ త్రిశంకు స్వర్గంలో వేళ్లాడుతూ ఉంటాం. ఏదో ధోరణిలో అలా కొట్టుకుపోతూండగా ఒక్కసారిగా ఏదో స్ఫురిస్తుంది.. 'ఇలా చెయ్యి' అని మనసు గట్టిగా చెప్తుంది. అదే 'తగిన సమయం' రావడం అంటే!


నాకూ అలానే ఓ విషయమై తగిన సమయం వచ్చింది. వచ్చేదాకా నాకూ తెలీదు అదే తగిన సమయమని. చాలాకాలంగా మధనపడుతున్న ఆలోచనలనన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చేసి... ఎనఫ్.. దిస్ ఈజ్ ద ఎండ్ అని గట్టిగా నిర్ణయించేసుకుని.. చరమగీతం పాడేసా! నాకు తెలుసు ఆ విషయానికి అదే పరిష్కారమని! కానీ ఇన్నాళ్ళూ నేనే అలక్ష్యం చేస్తూ వచ్చా. కానీ నాకూ ఎందుకో హఠాత్తుగా అనిపించింది.. తగిన సమయం వచ్చినట్లుంది అని!! ఇంక ఆలస్యం చెయ్యలేదు. చెయ్యవలసింది చేసేసాను. అసలిన్నాళ్ళు ఈ పని చెయ్యకుండా ఎందుకున్నాను.. అని ఆలోచిస్తే అనిపించింది.. ఇన్నాళ్ళూ తగిన సమయం రాలేదని.. ఈ సమయం వచ్చేదాకా నే పడాల్సినవన్నీ పడి తీరాలని రాసి ఉందన్నమాట!


ఇప్పుడు చాలా అంటే చాలా హాయిగా ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏదైనా కూడా మనం పట్టుకుని వేళ్ళాడినంతసేపే నెప్పిగా ఉంటుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా వదిలేసామా... ఇంక ఏ చింతా ఉండదు. 
Feeling very happy and refreshed.. 
specially relieved.. !!



Thursday, January 9, 2014

ఏకాంతం..





ఒంటరితనానికీ ఏకాంతానికీ చాలా తేడా ఉంది.. రెండూ నిశ్శబ్దంలో జనించేవే అయినా ఒంటరితనం దు:ఖ్ఖాన్ని పెంచితే, ఏకాంతం ఆ భారాన్ని తగ్గిస్తుంది. మనలో మనం, మనతో మనం ఉండేలా చేసి మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజులో కొద్దిపాటి ఏకాంత ప్రశాంత క్షణాలు గడిపినా అవి జీవితాన్ని స్థిరంగా గడపడానికి సరిపోయేంతటి ఇంధనాన్ని మనకి అందివ్వగలవు.

చాలా ఏళ్ల క్రితం మాట... మేము విజయవాడ రేడియో క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఓ మూడేళ్ళూ సెకెండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మా బాల్కనీ వీధివైపు రోడ్డు కనబడేలా ఉండేది. మా బ్లాక్ లోపలికి ఉండడం వల్ల మా బాల్కనీ లోంచి గేటు దాకా ఉన్న పొడుగాటి రోడ్డూ, లోపల్నుండి బయటకు వెళ్తూ,వస్తూ ఉండే జనం కనబడుతూ ఉండేవారు. అంతే కాక చుట్టూ ఉండే పెద్ద పెద్ద చెట్లూ, పక్షులు, ఆకాశం అన్నీ కలిపి ఓ మంచి వ్యూ ఉండేది. 10th, ఇంటర్ రెండేళ్ళూ స్కూలు, కాలేజీ అయ్యి రాగానే ఆ బాల్కనీ లో ఉండే ఉయ్యాల లోనే నా మకాం ఉండేది. టేప్ రికార్డర్ కూడా అక్కడే పెట్టేసుకుని పాటలు వింటూ, ఆ ఉయ్యాల లో కూచుని అక్కడే కాఫీ, టిఫిన్, చదువు, తిండి..అన్ని అక్కడే! ఎండనీ, వర్షాన్నీ , చలినీ కాలాల మార్పులన్నింటినీ ఆ ఉయ్యాలలో కూచునే గమనిస్తూ ఉండేదాన్ని. ఆ నిశ్శబ్దం, ఆ ఏకాంతం నాకెంతో హాయిని ఇచ్చేవి. ముఖ్యంగా రాత్రి పూటలు ఏ వాద్య సంగీతమో, భూలే బిస్రే గీత్ నో వింటూ గడిపే ఏకాంతాలకు తిరుగేలేదు.. అవన్నీ మరువలేని మధురస్మృతులు నాకు..!


ఆ ఇల్లు వదిలాకా మళ్ళీ ఇన్నేళ్ళలో అలాంటి బాల్కనీ వ్యూ దొరకలేదు నాకు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడున్న ఇంటి బాల్కనీ లోంచి మళ్ళీ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం వచ్చింది. ఈసారి ఇది వీధి వైపు కాదు పొలాలవైపు. మనుషులసలు కనబడరు. ఉయ్యాల వెయ్యలేదు కానీ బీన్ బ్యాగ్ ఒకటి అక్కడ వేసేసి ఉంచా. పొద్దున్నే టీ తాగుతూ ఆ మంచునీ, ఎర్రబారుతున్న ఆకాశాన్నీ చూడడం ఓ అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది కానీ పొద్దుటే పని హడావుడిలో ఎక్కువసేపు కూచోవడం కుదరదు. మధ్యాహ్నమో సాయంత్రమో మాత్రం ఏ పుస్తకమో పట్టుకునో, ఖాళీగానో కనీసం ఓ గంట అయినా ఇక్కడ గడుపుతాను. తీ తాగుతూ మౌనంగా ఉన్న ఆకాశాన్నీ, వలయాకరంలో తిరుగుతున్న ఇరవైముఫ్ఫై దాకా ఉండే పావురాల గుంపునీ చూడటం ఒక వ్యాపకమైపోయింది నాకు. ఒక్కరోజు కూడా మానకుండా రోజూ ఆ పావురాలు అలా ఆటలాడుకుంటాయి. కోతలైపోయి, ఎండిపోయిన వరిపొలాలపై గుంపుగా చేరి కాసేపు కూచుంటాయి. మళ్ళీ పైకెగిరి ఓ రౌండ్ తిరుగుతాయి. గుంపుగా అన్నీ కలిసే తిరుగుతాయి చిత్రంగా. ఒకసారి కాదు ఓ గంట పైగా అలా తిరుగుతూనే ఉంటాయి. చూసేందుకు మనకి విసుగు రావాలి కానీ తిరిగేందుకు వాటికి రాదేమో!


"పద పదవే వయ్యారి గాలిపటమా.." అంటూ దూరంగా ఆకాశంలో మూడు నాలుగు గాలిపటాలు పోటీ పడుతూ ఎగురుతూ ఉంటాయి. దూరంగా ఆడుకుంటున్న పిల్లల అరుపులూ, కేరింతలు..! పక్కనే పల్లెలోంచి అప్పుడప్పుడు మైకుల్లోంచి పాటలు, ఉపన్యాసాలు, భజనలు వినబడుతూ ఉంటాయి. టైం ప్రకారం రోజులో నాలుగైదుసార్లు ’అల్లా హో అక్బర్...’ కూడా వినబడుతుంది. గంటకోసారి ఏదో ఒక రైలు పక్కనున్న రైల్వే ట్రాక్ మీంచి కుయ్యిమని వెళ్తూ నిశ్శబ్దాన్ని చెదరగొడుతుంది కానీ అలా వెళ్ళే రైలుని చూడ్డం కూడా బాగుంటుంది. ప్రపంచంతో, ట్రాఫిక్ హోరుతో, మనుషులతో ఏమాత్రం సంబంధం లేని ఈ ఏకాంతం మళ్ళీ ఇన్నాళ్ళకు నాకు చేరువయ్యింది.. ఆ చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెస్తూ..!! 


చీకూ చింతా లేని ఆ చిన్నప్పటి రోజుల్లోని ప్రశాంతత ఇప్పుడు మనసుకు లేకపోయినా, ఇన్నాళ్ళకు నాతో నేను గడిపగలిగే కొన్ని ఏకాంతపు క్షాణాలను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూంటాను రోజూ.. ఇప్పుడు కూడా బాల్కనీలో కూచునే ఈ టపా రాస్తున్నా! చీకటి పడితే మాత్రం ఇక్కడ ఉండలేం..దోమలు పీకేస్తాయి.. ఇంక లోపలికి పోవాలి మరి... !!




Thursday, January 2, 2014

అంతర్లోచన...



ప్రతి ఏడాదీ జనవరి 1st న ఎప్పుడో కుదిరినప్పుడు కాసేపు కూర్చుని ఇంతదాకా ఏం చేసాను? ఇకపై ఏం చెయ్యగలను? అని నాలో నేను మాట్టాడుకోవడం అలవాటు నాకు. నిన్న అలా ఖాళీగా కూచునే సమయమే దొరకలేదు :(  మొన్న రాత్రి కాలనీలో జరిగిన న్యూ ఇయర్ పార్టీ ఎగ్గొట్టేసాం. చాలా బిజీ ఏమీ కాదు కానీ చాలా మామూలుగా గడిచిపోయింది నిన్నంతా! ఆఫీసు కి శెలవు లేక కేరేజీ తీసుకుని శ్రీవారు ఆఫీసుకెళ్ళిపోయారు. మా పాప బుక్స్ సర్దుతుంటే నే చూడని, మిగిలిపోయిన హోం వర్క్ కనబడింది! అయ్యబాబోయ్..అని భయపడిపోయి రాత్రిలోపూ అది పూర్తి చేయించే ఫుల్ టైమ్ పనిలో పడ్డా! ఇవాళ్టి నుంచీ స్కూలు మొదలు వాళ్లకి. 


అందుకని ఇవాళ పొద్దున్నే కాస్త ఖాళీ చిక్కగానే కూచున్నా తీవ్రంగా అంతర్లోచన చేసేసి, డైరీ ఎలానూ సరిగ్గా రాయట్లేదు ఇక్కడైన రాసుకుందామని..:)  ఈ బ్లాగ్ మొదలెట్టాకా రెగులర్ గా డైరీ రాసే అలవాటు కూడా గతి తప్పింది. ఖాళీగా అక్కడక్కడ మాత్రమే నిండిన పది పదిహేనుకి మించని మూడేళ్లనాటి పాత డైరీలను చూసుకుని, క్రితం ఏడాది కొత్త డైరీ తీసుకోవడం మానేసా. ఓ వాడని పాత డైరీలోనే వరుసగా రాయాలనిపించినప్పుడల్లా తారీఖులు వేసి రాసుకుంటూ వచ్చా! ఈసారైతే అసలింకా వెతుక్కోలేదు పాతవాటిల్లోంచి! అంటే అన్ని వాడని పాత(కొత్తగా ఉన్న) డైరీలు ఉన్నాయి నా దగ్గర. పిచ్చో వెర్రో.. ఈ డైరీలేంటో.. ఇవన్నీ ఏం చేసుకుంటానో అని విరక్తి వేసేస్తుంది ఇల్లు సర్దినప్పుడల్లా!(ఆ కాసేపే..:)) 



రిజల్యూషన్స్ అనేవి వదిలేసి చాలా కాలమైంది. ఎందుకంటే అనుకునేదాన్ని గానీ అవెప్పుడూ సరిగ్గా అమలుపరచలేదు.. అందుకని ! (న్యూ ఇయర్ కి మానేసాను కానీ ప్రతి పుట్టినరోజుకీ మాత్రం ఏదో ఒకటి అనుకుని అది అమలుచేసే అలవాటు మానలేదు.) చాలా ఏళ్ల తరువాత ఈసారి జనవరి 1st న ఎందుకనో ఒకటి, రెండు తీర్మానాలు గట్టిగానే చేసుకున్నాను. నిజం చెప్పాలంటే బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టాకా చాలా పాఠాలని నేర్చుకున్నానని చెప్పాలి. అవన్నీ అమలులో పెట్టకపోతే ఇంక కొత్త విషయాలు నేర్చుకుని ఏం ప్రయోజనం? అసలు ఇదివరకటి రోజులు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది.. జనవరి 1st  అంటే ఏదో పండగలాగ ముందురోజు రాత్రి పేద్ద ముగ్గు, కొత్త బట్టలు, ఫ్రెండ్స్ ఇళ్లకి వెళ్ళడం, గ్రీటింగ్స్, ఫోన్ కాల్స్...బ్లా.బ్లా..బ్లా...! అప్పటిదాకా సెలబ్రేషన్ అంటే అదే డెఫినిషన్ !! అంతకు మించిన ఆలోచన ఉండేది కాదు. అసలు న్యూ ఇయర్స్ డే అప్పుడు మాత్రమే తీర్మానాలు ఎందుకు? తలకు దెబ్బ తగిలి బొప్పి కట్టిన తరువాత బుధ్ధి వచ్చిన ప్రతిసారీ తీర్మానాలు చేసుకోవచ్చు కదా? ఓహో ఇదా జీవితమంటే... అని అర్థమైన ప్రతిసారీ, కొన్ని బంధుత్వాల్లో.. స్నేహాల్లో..మనుషుల్లో.. డొల్లతనం బయటపడిన ప్రతిసారీ రేపట్నుండే నాకు న్యూ ఇయర్.. ఇకపై ఇలా ఉండద్దు..  అనుకోవాలని అప్పట్లో తెలీదు మరి! 




ఏదేమైనా ప్రతి నిన్నా ఇవాళ్టికి ఓ స్మృతిగా మిగిలిపోయేదే కదా! అందుకని స్మృతుల్లో కలిసిపోయిన నిన్నల్లోంచి అనుభవాల పాఠాలను వెతుక్కుని, వాటిని మర్చిపోకుండా నా చేతుల్లో ఉన్న ప్రతి ఇవాళనీ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చెయ్యాలన్నది... ప్రస్తుతానికి నే చేసుకుంటున్న తీర్మానం..! మీరూ ఏవో కొన్ని తీర్మానాలు చేస్కునే ఉంటారు కదా... అవి ఏదైనా, క్రింద బొమ్మలో చెప్పినట్లు అందరూ చెయ్యాలనీ, ఉండాలని కోరుకుంటున్నా!!


Friday, December 20, 2013

ఒకానొక బధ్ధకపు శీతాకాలపు మధ్యాహ్నం...




పనులేమీ చెయ్యకుండా బధ్ధకంగా గడపాలనిపించే ఓ శీతాకాలపు మధ్యాహ్నం..
చలికి తట్టుకోలేక తలుపులూ, కిటికిలన్నీ మూసేసి..
స్వెట్టరు, సాక్స్ వేసేస్కుని, స్కార్ఫ్ కట్టేసుకుని..
మంచంపై మందపాటి రగ్గు కప్పేసుకుని,
తలకు, భుజాలకు ఆసరాగా రెండు దిళ్ళు వెనుక పెట్టుకుని..
చేతిలో ఎంతో ఆసక్తికరంగా ఉన్న పుస్తకం పొద్దుట్నుండీ చదువుతూ...
గతంలో నే చదివిన ఆథ్యాత్మిక పుస్తకాలూ, ముఖ్యంగా "ఒక యోగి ఆత్మకథ" గుర్తుచేసుకుంటూ..
పాల్ బ్రంటన్ తో పాటూ అతని ఆలోచనలను నావి చేసుకుంటూ..
రహస్య భారతంలోకి అతనితో పాటే అన్వేషణ సాగిస్తూంటే...
కలుగుతున్న అలౌకిక ఆనందపు అనుభూతిని...
ఇలా మాటల్లో చెప్పడం కష్టం...!

ఇప్పటివరకు నే చదివిన అతి తక్కువ పుస్తకాలన్నింటిలో భారతదేశ సంస్కృతినీ, అందులోని ఆధ్యాత్మికతనూ, గొప్పతనాన్నీ తెలియచెప్పే గొప్ప పుస్తకం ఇదని మాత్రం చెప్పగలను.
బహుశా పుస్తకంలో చెప్పినట్లు మనిషి తీవ్రంగా దేని గురించి తపన పడతాడో.. దానికి సంబంధించిన దారి ఏదో విధంగా అతనికి ఎదురౌతుందన్న మాట నిజమనిపించింది!!
పుస్తకప్రదర్శనలో మొదటిరోజు కొన్న నాలుగైదు పుస్తకాల్లో ఇదీ ఒకటి. ఆ రోజు ఒక స్టాల్లో ఒకావిడ నా చేతిలో ఈ పుస్తకం చూసి.. 'చాలా మంచి పుస్తకం..చదవండి' అన్నారు.
చదువుతుంటే ప్రపంచం నుండి విడివడిపోయి పైన ఫోటోలో లాగ దట్టమైన అడివిలో, ఆ చిన్న కుటీరంలో ఉన్న అనుభూతి!! ఎంత గొప్ప ఆనందమో.. ఎంత సంతృప్తో...!!
ఈ బధ్ధకపు శీతాకాలపు మధ్యాహ్నం ఇంతటి అలౌకికానందాన్ని కలిగించగలదని కల్లోనైనా ఏనాడూ అనుకోలేదు...
Thank you God!

Thursday, September 26, 2013

చెలిమితో కాసేపు...


ఎందుకు పరిగెడుతున్నామో తెలియకుండా, ఎలా పరిగెడుతున్నామో తెలియకుండా, పరిగెత్తి పరిగెత్తి ఏం సాధించామో కూడా తెలియకుండా... మనందరం కాలం వెంట ఏళ్ల తరబడి పరిగెడుతూనే ఉంటాం. పొద్దున్నే లేవకపోతే ఎలా? త్వరగా తయారవ్వకపోతే ఎలా? వంటవ్వకపోతే ఎలా? బస్సు రాకపోతే ఎలా? ఆఫీసుకి లేటైతే ఎలా? ఆఫీసులో పని ఎక్కువైతే ఎలా? పిల్లలడిగినవి తేకపోతే ఎలా? శెలవు దొరక్కపోతే ఎలా? జీతం రాకపోతే ఎలా?
అబ్బా... ఎన్ని ప్రశ్నలో కదా.. 


వీటన్నింటికీ సమాధానాలు వెతుక్కునే సమయం కూడా ఒకోనాడు మనకి ఉండదు! అలా పరిగెత్తుతున్నాం అందరం రేపవళ్ల వెంట.. రోజుల వెంట.. నెలల వెంట.. సంవత్సరాల వెంట! ఫలానా ఫలానా పనులు చెయ్యాలి అని లిస్ట్ రాసుకుంటాం. కానీ లిస్ట్ ఎక్కడ పెట్టామో మర్చిపోతాం లేదా ఆ లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు. ఒకటో రెండో శెలవు రోజులు వస్తాయి మధ్య మధ్యలో.. అపుడు బడలికగా ఒత్తిగిల్లడానికో, ఆలస్యంగా లేవడానికో సరిపోతాయా శెలవుదినాలు. చూస్తూండగానే ఐదు, పది, ఇరవై అని ఏళ్ళు గడిచిపోతాయి ఇలానే...



మరి ఈ పరుగుపందాల్లో కాస్త ఊరట, కాస్త విశ్రాంతి, కాస్త ఆనందం ఎలా వెతుక్కోవాలి? మనలోకి కొత్త ఉత్సాహాన్ని ఎలా నింపుకోవాలి? మన హాబీలను వదలకుండా.. అన్నది ఒక మార్గం. సంగీతం, సినిమా, దైవ చింతన, చిత్రలేఖనం, పుస్తక పఠనం, సంఘ సేవ, స్నేహితులతో గడపడం ఇలా ఏది చేస్తే ఉల్లాసంగా ఉంటుందో అది చెయ్యడానికి చాలామందిమి ప్రయత్నం చేస్తూంటాం. ఇవన్నీ కాక నిన్న ఒక పని చేసా నేను. చిన్ననాటి స్నేహితురాలితో కాసేపు..కాదు కాదు బోళ్డు సేపు మాట్లాడా! ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. స్కూల్లో చదువుకునేప్పటి నేస్తం. ఇన్నాళ్ళూ అలా కాపాడుకుంటూ వచ్చాం మా స్నేహాన్ని ఇద్దరమూ. పూనా దగ్గర్లో ఉంటున్నారు వాళ్ళిప్పుడు. మేం కలిసి కూడా ఐదేళ్ళు దాటుతోంది. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో కూడా తెలీదు. తనకి జాబ్ తో మెయిల్స్ రాయడానికి కూడా ఖాళీ ఉండదు. ఎప్పుడైనా వీలయినప్పుడు ఫోన్లోనే మాట్టాడుకుంటాం.


 

నిన్న అలా ఇద్దరం చిన్నప్పటి కబుర్లు, ఆ రోజులన్నీ తలుచుకుంటూ, అలా మాట్టాడుకుంటే ఎంతో ఊరటగా అనిపించిందో! ఈ హడావుడి పరుగుల్లో పడి ఏదో కోల్పోతున్నామేమో అనిపించే వెలితేదో తీరినట్లు! "నాకయితే నిన్ననే జరిగాయేమో అన్నంత ఫ్రెష్ గా ఉన్నాయి ఆ జ్ఞాపకాలు.." అని తను, "అవును కదా.. ఇన్నేళ్ళేలా గడిచిపోయాయే.." అని ఆరోగ్యాల గురించీ, ఇంటివిషయాలు, స్నేహితుల గురించి, పిల్లల గురించీ.. ఇలా చాలా విషయాల గురించీ నేనూ తనూ... ఊసులడుకున్నాం.  కాసేపు నే మాట్టాడాకా, ఉండు నే చేస్తా అని తను ఫోన్ చేసింది. ఇంకాసేపు..ఇంకాసేపు అలా ఓ గంట దాకా కబుర్లు చెప్పుకున్నాకా గానీ మా కరువు తీరలేదు. లక్కీగా ఆ సమయంలో ఏ మిస్డ్ కాల్ రాలేదు, ఎవ్వరూ కాలింగ్ బెల్లు కొట్టలేదు :-)

 

ఫోన్ పెట్టేసాకా అనిపించింది.. హాబీలను కాపాడుకోవడమే కాదు చిన్ననాటి స్నేహాలను కూడా కాపాడుకుంటే ఇలా రిఫ్రెష్ అయిపోవచ్చు అని. మరి మీరు కూడా త్వరగా మీ చిన్ననాటి చెలిమితో కాసేపు కబుర్లాడేసి రిఫ్రెష్ అయిపోతారుగా...