సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label ఆరోగ్యమే మహాభాగ్యం. Show all posts
Showing posts with label ఆరోగ్యమే మహాభాగ్యం. Show all posts

Thursday, March 5, 2015

Millet Fest - 2015


వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు గృహవిఙ్ఞాన విభాగం.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్న చిరుధాన్యాల ప్రదర్శన ఈ ఏడు కూడా క్రిందటి నెలాఖరులో జరిగింది. "Millet Fest 2015" ప్రకటన ఆఖరిరోజున అనుకోకుండా పేపర్లో చూసి అప్పటికప్పుడు బయలుదేరాం.  ఆ రోజు పేపర్ చూడకపోతే అదీ మిస్సయిపోదును. ఇది నాలుగవ ప్రదర్శనట. 2013 Fest కబుర్లు Millet Fest - 2013 లో రాసాను. నిరుడు టపా రాయలేదు కానీ వెళ్ళాను. ఈమధ్యన ఒంట్లో బాలేక ప్రతి ఏడూ వెళ్ళే హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ , మరికొన్ని పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కూడా మిస్సయిపోయాను..:(  ఈ Millet Fest మాత్రం ఎలాగైనా చూడాలని బయలుదేరాను. ఆరోగ్యకరమైన, ఉపయోగకరమైన విషయాలు తెలుస్తాయి +  చిరుధాన్యాలతో చేయదగిన కొత్త రెసిపీస్ తెలుస్తాయని నా ఆశ. నా అంచనా తప్పలేదు. మరిన్ని కొత్త విషయాలు తెలిసాయి. 

ఈ ప్రదర్శన వివరాలు తెలిపే వెబ్సైట్ కూడా ఉందిట.. మళ్ళీ ఏడు ఎవరైనా ఈ ప్రదర్శనకు వెళ్ళాలనుకుంటే ఈ వెబ్సైట్ చూస్తూండండి.. ప్రదర్శన తారీఖులు తెలుస్తాయి. 



ఈసారి చివరిరోజు ఆదివారం అవడంతో సందర్శకులు బాగా ఉన్నారు. కొనుగోళ్ళు చూస్తూంటే చిరుధాన్యాల పట్ల ఆసక్తి కూడా బాగా పెరిగినట్లు అనిపించింది. ఈ రోజుల్లో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు కదా! ఇదీ ఒకందుకు మంచిదే. ఏ పదార్థాలు ఎక్కువ తినాలో, ఏది మానేయాలో తెలుసుకోవడం అనేది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఎలా ఉంచుకోవాలో తెలియడమే. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇది 'ఆరోగ్య శాఖ' మరియు 'వ్యవసాయ విశ్వవిద్యాలయం' వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శన కాబట్టి ఇందులో పెట్టే వస్తువులు రిలయబుల్ మరియు వారు చెప్పే విషయాలు కూడా నమ్మదగినవీనూ!

మిల్లెట్స్ తో చేసిన వంటలు ఉంచిన ఫుడ్ కోర్ట్ లో కూడా బాగా జనాలు ఉన్నారు. అన్ని పదార్థాలూ బాగా సేల్ అవడం చూసి సంతోషం కలిగింది. వాటిల్లో నేనిదైవరకూ బ్లాగ్ లో రాసిన ఒక హెల్త్ డ్రింక్ "అమృతాహార్" పేరుతో పెట్టారు. ఇంకా రాగి జావ , తేనె కలిపిన సబ్జా గింజల నీరు , సజ్జ ఉప్మా, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి ఫ్రూట్ పంచ్, జొన్న మంచూరియా, జొన్న నూడుల్స్.. మొదలైన ఎన్నో రకాల వంటకాలు అమ్మారు. ఇవన్నీ చూసి నాకు కొత్త రెసిపీలకి బోలెడు ఐడియాలు వచ్చాయనేసరికీ పాపం అయ్యగారి ఫేస్ లో కలర్స్ మారాయి :-)


స్టాల్స్ లో ఒకచోట జొన్న రొట్టెలు తయారుచేసే మషీన్ ఒకటి పెట్టారు. అంటే అది చిన్న పరిశ్రమకు ఉపయోగపడేలాంటి పెద్ద పరికరం. భలేగా జొన్న రోటీలు వత్తేస్తోంది ఆ మషీన్.





పిల్లలు సరదాగా స్పూన్ కూడా తినేసేలాగ బియ్యం, జొన్నలు, గోధుమలు, వాము, జీలకర్ర, ఉప్పు మొదలైన వాటితో చేసిన ఈటబుల్ స్పూన్స్ ఒకచోట పెట్టారు. అవి బాగా అమ్ముడౌతున్నాయి. 



జొన్న, రాగి బిస్కెట్స్, లడ్డూలు మురుకులు, టేస్టీ బైట్స్ కాక ఒక చోట మొత్తం ఆరు రకాల మిల్లెట్స్ తో చేసిన లడ్డూస్ అప్పటికప్పుడు చేసి అమ్ముతున్నారు.


ఇంకా.. విజయవాడ కు చెందిన ఒక స్టాల్ నన్నాకర్షించింది. (మా బెజవాడ కదా :)) ఆ వివరాలు..



అన్ని చిరుధాన్యాల్లోకెల్లా ఎక్కువ ఫైబర్ కొర్రల్లో(foxtail millet) ఉంటుందని తెలిసాకా ఈమధ్యన నేను కొర్రలు, కొర్ర బియ్యం కూడా వాడకం మొదలుపెట్టాను. వీటిల్లో ఎర్ర కొర్రలు, తెల్ల కొర్రలు రెండు రకాలు ఉంటాయిట. ఒక స్టాల్ లో దాదాపు కొర్ర బియ్యం లాగానే ఉన్న వరిగలు(proso millet) అమ్ముతూంటే అదో పేకెట్ కొన్నాను. ఏ ఉప్మా ప్రయోగమో చేయచ్చని.







ఒక స్టాల్ లో అన్నంలో కులుపుకునే ఉసిరి పొడి, కాకర పొడి, ఒక హెర్బల్ టీ పౌడర్ కొన్నాను. మంజిష్ఠ, ఏలకులు, జాజికాయ, శొంఠి మొదలైన వాటితో తయారుచేసిన ఈ టీ పౌడర్ కాస్తంత మామూలుగా పెట్టుకునే టీలో కలుపుకోవచ్చు లేదా విడిగా ఈ పౌడర్ తోనే టీ పెట్టుకోవచ్చుట. అధిక ఫైబర్ మరియు Omega 3 fatty acids ఎక్కువగా ఉండే  Flax seeds(అవిసెలు) ఉపయోగాలు తెలిసాకా కొన్ని నెలల క్రితం ఫ్లాక్స్ సీడ్స్ కొన్నా కానీ వాటితో ఏమీ చెయ్యలేదు. కర్వేపాకు పొడిలాగ చేయచ్చు అని ఎక్కడో చదివాను. ఒక చోట ఆ పొడి అమ్ముతుంటే అది కొన్నాను కానీ తర్వాత మా అన్నయ్యతో ఈ సంగతులన్నీ చెప్తుంటే మరో స్టాల్ లో ఉన్న ఒక రీసర్చ్ స్టూడెంట్ విని, మమ్మల్ని పిలిచి, "సారీ ఫర్ ఓవర్ హియరింగ్..అన్చెప్పి, ఈ పొడులూ అవీ వేస్ట్.. దానివల్ల అందులోని పోషకాలన్నీ పోతాయి. ఫ్లాక్స్ సీడ్స్ లోని పోషకాలు డైరెక్ట్ గా శరీరానికి అందాలంటే ఒక్కసారి జస్ట్ డ్రైగా టాస్(toss) చేసి అలానే తినేసేయండి అదే బెస్ట్ అని  చెప్పారు. నిజానికి ఫ్లాక్స్ సీడ్స్ ఉత్తినే తిన్నా బానే ఉంటాయి.


మరో చోట పచ్చి అరటికాయ పొడి అమ్ముతుంటే కొన్నా. ఏక్చువల్ గా అది ఒకటే పేకెట్ సాంపిల్ గా పెట్టారుట. ఆ స్టాల్లో ఉన్న ఒక పరిశోధకుడు(కొంచెం పెద్దాయనే) చెప్పిన విషయం ఏమిటంటే అరటి పండులో ఉన్న షుగర్ అరటి కాయలో ఉండదుట. చాలా పరిశోధనల తరువాత ఇటీవలే అరటికాయను డయాబెటిక్ పేషంట్స్ కూడా తినచ్చని నిర్ధారించారుట. పచ్చి అరటికాయలో ఉండే స్టార్చ్ మంచిదిట. పచ్చి అరటి కాయ నుంచి చేసిన ఈ పొడిని కూరల్లో, సూప్స్ లో, చపాతీ పిండిలో కలుపుకోవచ్చుట. ఇంకా అది ఏమేమి చేస్తుందో.. అలా బోలెడు ఉపయోగాలు చెప్పాకా మాకు కావాలని అడిగితే ఉన్న ఆ ఒక్క పేకెట్ అమ్మేసారు ఆయన. మార్కెట్లోకి వస్తుందన్నారు త్వరలో. ఎప్పుడు వస్తుందో మరి.

ఇదివరకూ కొనని రెండు రెసిపీ బుక్స్, ఎరువు ఎలా తయారు చేసుకోవాలో,  గార్డెన్ కేర్ గురించిన పుస్తకమూ కొన్నాను.





ఇంకా ఊళ్ళో ఉన్న రెండు మిలెట్ ఫుడ్ కోర్ట్స్ గురించి తెలిసింది. ఎప్పుడన్నా వెళ్లచ్చు..




కేవలం సైంధవ లవణం(rock salt) అమ్ముతున్న ఒక స్టాల్ ఉంది. అందులో ప్రదర్శనకు ఉంచిన పెద్ద ఉప్పు గడ్డ భలే ఉంది. ఈ ఉప్పు ఉపయోగాలు క్రింద కాగితంలో...





ఈ విధంగా సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన సమాచారాన్ని అందుకుని సజ్జల ఉప్మా, జొన్న మంచూరియా, జొన్న నూడుల్స్, జొన్న సలాడ్ లు తిని, అమృతాహార్ జావ తాగి మేమూ, అన్నయ్య ఇళ్ళదారి పట్టాం.


ప్రదర్శన తాలూకూ మరిన్ని ఫోటోలు:
http://lookingwiththeheart.blogspot.in/2015/03/millet-fest-2015.html

Thursday, April 18, 2013

WATER - A miracle Therapy





2002లో విజయవాడ పుస్తక ప్రదర్శనలో కొన్నాను ఈ పుస్తకాన్ని. అందరికీ ఎంతో ఉపయోగకరమైన ఈ పుస్తకం గురించి రాయాలనుకుంటూ ఉన్నా.. ఇవాళ మూడ్ కుదిరింది :) అప్పట్లో యోగా క్లాసెస్ కి వెళ్ళినప్పుడు పొద్దున్నే లీటర్ నీళ్ళు తాగే అలవాటు అయ్యింది. ఆ ఆసక్తి వల్ల ఈ పుస్తకం కొన్నాను. ఇంజినీర్, రచయిత అయిన ఏ.కె.హరి ఈ పుస్తకం రాసారు. మానవ జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యత గురించీ, నీళ్ళు తాగటం ఎంతో ఆరోగ్యకరం అనీ, ఆరోగ్యం బాగుండడానికీ, మెరుగుపడడానికీ నీళ్ళు తాగటం చాలా అవసరం అని రచయిత చెప్తారు. అందుకు రకరకాల ఉదాహరణలూ, ఏ రకమైన నీటిలో ఎంత ఎనర్జీ ఉంటుందో, ప్రపంచవ్యాప్తంగా నీళ్ళు తాగటం గురించి జరిగిన పరిశోధనలు మొదలైనవాటి గురించి వివరిస్తారు హరి గారు. మనం తాగే నీళ్లకు ఇంతటి శక్తి ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది ఈ పుస్తకం చదివితే. 

"Having starved our body of nature's most precious liquid, water, we are beset with multiple ailments like headaches,arthritis,asthma,urinary problems, general debility, blood pressure etc. Missing the root cause of the problem, we rush to doctors - only to have antibiotics pumped into us that offer short-term 'relief' while turning into long-term nightmares." 

" The root cause of every disease is dehydration. Hydrate the body properly and you will recover without any medication."  అంటే మొక్క వాడిపోయిన కుండీలో నీళ్ళు పోస్తే ఎలాగైతే మళ్ళీ మొక్క చైతన్యవంతమైతుందో అలానే శరీరం కూడా సరిపడా నీరు అందితే బాగవుతుంది అంటారు ఆయన.

పుస్తకం లోని మరికొన్ని విశేషాలు:

* నీటిని ఒక క్రమ పధ్ధతిలో తాగుతూ ఉంటే మందులు అక్ఖర్లేకుండానే చాలా మటుకు రోగాలు నయమయిపోతాయి. వృధ్ధాప్యపు ఆనవాళ్లను కూడా నీరు తాగటం వల్ల దూరం చెయ్యగలం.

* శరీర బరువుని బట్టి ఎవరు ఎంత నీరు తాగాలి అన్నది నిర్ణయించుకోవాలి. సుమారు ఒకరు అరవై కేజీల బరువు ఉంటే, వాళ్ళు రోజులో కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగాలి. పొద్దున్న లేవగానే 300ml, టఫిన్ కి అరగంట ముందు 300ml, భోజనానికి గంట ముందు 300ml, భోజనం మధ్యలో అస్సలు నీళ్ళు తాగకూడదు. (తప్పనిసరైతే కాసిని తాగచ్చు), భోజనం అయిన రెండున్నర గంటల తర్వాత 300ml, మళ్ళీ రాత్రి డిన్నర్ కి గంట ముందు, డిన్నర్ అయిన రెండున్నర గంటల తర్వాత 300ml తాగాలి. మధ్యలో కావాల్సినప్పుడు, రాత్రి పడుకునే తాగచ్చు. ఈ పధ్ధతి ప్రకారం చేస్తే ఎన్నో రోగాల నుండి బయటపడవచ్చుట. కానీ ఇదంతా ఫ్యామిలీ డాక్టర్ ని సంప్రదించి చెయ్యాలి.

* జలపాతాల్లో, పారే నదుల్లోనూ ఎక్కువ జీవశక్తి ఉంటుంది. ఏ ప్రాణినయినా సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయగల శక్తి ఈ జలపాతాల తాలుకూ నీటికి, ప్రవహించే నదుల్లోని నీటికీ ఉంది. రకరకాల పైపుల ద్వారా ఆ నీరు మన ఇళ్ళకి చేరేసరికీ అందులోని జీవశక్తి పూర్తిగా నశించిపోతుంది. నదీ స్నానాలకి అందుకే ఎంతో ప్రాధాన్యత ఉంది. 

* ఆగమశాస్త్రాల్లో మన పూర్వీకులు దేవతా విగ్రహాలకు వాడే రాళ్లను గురించి చెప్తారు. కొన్ని రాళ్లపై నీళ్ళు పోసినప్పుడు, ఆ నీరు బ్యాక్టీరియా రహితంగా మారి, మరింత ఎనర్జీని పొందుతుందిట. విగ్రహాలకు అభిషేకాలు చేసేప్పుడు శంఖంలోంచి పోసేవారు. శంఖంలో పోస్తే నీటికి ఎనర్జీ వస్తుంది. అది మళ్ళీ ప్రత్యేకమైన రాయితో తయారు చేసిన విగ్రహాల పై నుండి జారి మరింత శక్తివంతం అవుతుంది. అటువంటి జీవశక్తి గల నీటిని తీర్థ రూపంలో కాస్తైనా పుచ్చుకోవటం ఎంతో మంచిది. తీర్థ మిచ్చేప్పుడు చదివే మంత్రం,  (ప్రథమం కార్య సిథ్యర్థం, ద్వితీయం ధర్మ సిధ్యర్థం, తృతీయం మోక్షమాప్నోతి) + దేవతా విగ్రహం అభిషేకించిన నీళ్ళు రెండూ కలిసి భక్తునికి ఎంతో శక్తినిస్తాయి.

* సంధ్యావందనం  పూర్వం నది ఒడ్డున చేసేవారు. ప్రవహించే నదిలోని జీవశక్తి కాక, నీటితో శరీరంలోని రకరకాల చోట్ల తాకటం ’రీకీ’ లాంటి ప్రక్రియే, అది శరీరాన్ని ఎంతో శక్తివంతం చేస్తుంది. సంధ్య చేసే మూడు కాలాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. ప్రకృతిలోని శక్తంతా సంపూర్ణంగా ఉండే సమయాలు అవి.






Dr.Fereydoon batmanghelidj అనే డాక్టర్ గారు నీటి వాడకం, ఉపయోగాలను గురించి చేసిన ప్రయోగాలను ఒక చాప్టర్ లో చెప్తారు హరి గారు. అందులో వారి వెబ్సైట్  కూడా ఇచ్చారు. ఆ వెబ్సైట్ లొ ఏ ఏ అనారోగ్యాలకు నీటి వాడకం పనిచెస్తుందో చెప్పారు ఆ డాక్టర్ గారు. ఇదే ఆ లింక్:
http://www.watercure.com/wondersofwater.html


నెట్లో ఈ పుస్తకం వివరాలకై వెతికితే, పుస్తకం తాలూకూ 29pages preview ఉన్న లింక్ ఒకటి దొరికింది. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవండి:
http://books.google.co.in/books?id=JwhTgUMqeVoC&printsec=frontcover#v=onepage&q&f=false


11yrs క్రితం నే కొన్న ఈ పుస్తకం ఇప్పుడు షాపుల్లో దొరుకుతోందో లేదో తెలీదు కానీ amazon.com లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది:
http://www.amazon.com/Water-Miracle-Therapy-R-Hari/dp/9381384800


***

అదండి సంగతి ! కాబట్టి అందరూ నీళ్ళు బాగా తాగటం మొదలుపెట్టండి. భోజనానికి మధ్యన ఎక్కువ నీళ్ళు తాగకండి, భోజనo అయ్యాకా కనీసం గంట తర్వాత నీళ్ళు తాగటానికి ప్రయత్నించండి. చక్కని ఆరోగ్యాన్ని, జీవశక్తినీ సొంతం చేసుకోండి. 


Sunday, March 31, 2013

Millet Fest - 2013





ఆహారం మరియు పౌష్ఠికాహారం బోర్డ్-భారత ప్రభుత్వం వారు, ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికర్చరల్ యూనివర్సిటీ(ANGRAU) సహకారంతో  నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో మూడు రోజులపాటు జరిగే "Millet Fest - 2013" ను నిన్న ప్రారంభించారు. ప్రజలు ఫాస్ట్ ఫుడ్స్ కి, ఇన్స్టెంట్ ఫుడ్స్ కి అలవాటు పడ్డం వల్ల చిరుధాన్యాలను కొనటం తగ్గిందని, అందువల్ల వాటి ఉత్పత్తి శాతం బాగా తగ్గిపోయిందట. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు,సాములు మొదలైన చిరుధాన్యాలపై ప్రజల్లో తగ్గుతున్న ఆసక్తిని పెంచేందుకు, ఈ చిరుధాన్యాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, ఉపయోగాలూ తెలిపేందుకు ఈ ప్రదర్శనను క్రిందటేడు నుండీ నిర్వహిస్తున్నారుట. 





 యూనివర్సిటీ వాళ్ళు పరిశోధనల్లో భాగంగా చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు, బిస్కెట్లు, మురుకులు మొదలైనవి ప్రదర్శనలో ఉంచారు. అవి ఇంకా కావాలంటే యూనివర్సిటీ స్టోర్స్ లో లభ్యమౌతాయని కూడా చెప్పారు. ఇవే కాక వివిధ సంస్థలు(NGOs) చిరుధాన్యాలతో తయారు చేసిన రకరకాల పదార్థాలూ, వారు పండించిన ఆర్గానిక్ చిరుధాన్యాలు మొదలైనవి అమ్మకానికి పెట్టారు. నేటితరం మగ్గు చూపుతున్న పీజాలు,బర్గర్లు మొదలైన ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంత హానికరమో, మన పూర్వీకులు ఎంతగానో ఆస్వాదించిన ఈ చిరుధాన్యాలు, వాటితో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చునో కూడా ప్రదర్శనలో తెలుపుతున్నారు. నిజానికి ఆరోగ్యానికి హాని చేసే శనగపిండితో చేసిన పదార్థాలకన్నా ఆరోగ్యానికి మేలు చేసే జొన్న పిండి, రాగి పిండి మొదలైనవాటితో చేసిన పదార్థాలు ఎంతో మంచివి. ఎందుకంటే పిల్లలకు కావాల్సిన కేల్షియం, ఇనుము మొదలైనవి చిరుధాన్యాలలోనే ఎక్కువగా లభిస్తాయి.







 ఇంత చక్కని ప్రదర్శన నగరంలో జరగటం, మాకులాగానే ఎంతోమంది విచ్చేసి ఈ వివరాలన్నింటిని తెలుసుకోవటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే గత ఏడాదిగా నేను ఈ చిరుధాన్యాలతో చేయగల వివిధ పదార్థాలను గురించి, వంటకాలను గురించీ విస్తృతమైన పరిశోధన జరుపుతున్నాను. జొన్న రవ్వ ఉప్మా, రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి, సోయా పిండి మొదలైనవి చపాతీ పిండి ఏ ఏ పాళ్ళలో కలిపితే చపాతీలు ఎలా వస్తాయో, అట్లల్లో మైదా బదులు జొన్న పిండి, పకోడీల్లో కూడా జొన్న పిండి కలపటం, రాగి పూరీలు మొదలైన ప్రయోగాలు చేస్తూ వస్తున్నా :) అందువల్ల వాళ్ళు అమ్మకానికి పెట్టిన మల్టీ గ్రైన్ ఆటా, మల్టీ గ్రైన్ రవ్వ, మల్టీ గ్రైన్ బ్రెడ్ నాకు కొత్తవి కాదు. కొన్నేళ్ళూగా నేను కొంటున్నవే. కొత్తగా నాకు తెలిసినవి ఏంటంటే మురుకులు, జంతికలు, ఖాక్రా లాంటివి కూడా జొన్న పిండితో చేసుకోవచ్చని. ఇలా కొత్తవి ఏం చేసుకోవచ్చో తెలుసుకోవటానికే మేము ఈ ప్రదర్శనకు వెళ్ళాం. కొన్ని రెసిపి బుక్స్ కూడా కొన్నాను. ఆర్గానిక్ చిరుధాన్యాలన్నింటినీ అమ్మే షాపు వివరాలు కూడా తెలుసుకున్నాం. బేగం పేటలో ఉందట వాళ్ళ షాపు.





మరోవైపున చిరుధాన్యాలతో చెసిన జొన్న రొట్టెలు, రగి రొట్టెలు మొదలైన వంటకాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా వంటకాలు తయారవుతున్నాయి. అవి సాయంత్రమే తింటానికి పెడతారుట. 



న్యూస్ పేపర్లో ప్రకటన అయితే వేసారు కానీ ప్రదర్శన సమయం రాయలేదు. మేము నిన్న మధ్యాహ్నం వెళ్ళాము. "స్టాల్స్ చూడండి కానీ అమ్మకాలు సాయంత్రమే" అన్నారు. మళ్ళీ పాతిక కిలోమీటర్లు రాలేము అని రిక్వెస్ట్ చేస్టే కొన్ని స్టాల్స్ లో పదార్థాలు కొనుక్కోనిచ్చారు. ఇటువంటి ఉపయోగకరమైన ప్రదర్శనలు నిర్వహించేప్పుడు  సరైన సమయం, ఎన్నాళ్ళు ఉండేది, ఇలాంటి ప్రదర్శనకు వెళ్ళటం వల్ల ఉపయోగాలు మొదలైనవాటి ప్రచారం సమంగా జరిపితే ప్రదర్శకుల శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహవంతంగా తమతమ ప్రయోగాలను గురించిన వివరాలు తెలియజేసారు.

ప్రదర్శన తాలుకూ ఫోటోలు:




murukus with jowar


like khakhras


recipe books

Wednesday, June 22, 2011

జుట్టు ఊడకుండా ఉండేందుకు ఒక మంచి powder తయరీ:

అరే పొరటున వేరే బ్లాగ్ అనుకుని వెళ్లిపోకండి...ఇది తృష్ణ బ్లాగే ! చాలా రోజుల్నుంచీ ఈ టిప్ రాయాలని అనుకుంటూ బధ్ధకిస్తున్నాను. నాకు తెలిసీ ఒత్తైన జుట్టు ఇష్టపడనివాళ్ళు అరుదుగా కనిపిస్తారు. కానీ స్ట్రెస్ వల్లనో, కొన్ని మందుల వాడకం వల్లనో, హార్మోన్ల లోపాల వల్లనో చాల మందికి జుట్టు రాలిపోవటం, జడలు సన్నబడటం జరుగుతూ ఉంటుంది. కొందరి శిరోజాలు ఎటువంటి పోషణా తీసుకోకపోయినా అస్సలు ఊడవు. అది వారి వారి అదృష్టం. కొందరికి ఎంత సేవ చేసినా ఊడే జుట్టు ఊడుతూనే ఉంటుంది.

నా జడ వేయటానికి మా అమ్మకు కష్టమయ్యేంత ఒత్తైన పొడువైన జడ ఉండేది నాకు. అలాంటిది ఒకసారి టైఫాయిడ్ వచ్చినప్పుడు నా జడ బాగా సన్నబడిపోయింది. అప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఒకావిడ ఒక విధానం చెప్పారు. చాలా ఏళ్ళు నేను ఆవిడ చెప్పిన పొడాలు అన్నీ కలిపి జుట్టుకు వాడాను. జుట్టు అస్సలు ఊడేది కాదు. పెళ్ళయ్యాకా కుదరక మానేసాను. సిజేరియన్లు, అనారోగ్యాలు కారణాంగా మళ్ళీ జడ సన్నబడిపోయింది. ఈమధ్యనే మళ్ళీ ఆంటీ చెప్పిన పొడాలన్నీ కొనుక్కుని జుట్టుకి పెట్టడం మొదలెట్టాను. జుట్టు ఊడటం బాగా తగ్గింది. కాబట్టి ఎవరైనా అవసరం ఉన్నవాళ్లకు ఉపయోగపడుతుంది కదా అని ఈ టపాలో రాస్తున్నాను. కొంచెమ్ శ్రమ అనిపించినా క్రింద రాసిన విధంగా చేస్తే కొత్తగా పెరగకపోయినా, జుట్టు ఊడటం మాత్రం బాగా తగ్గుతుంది. నేనీ విధానం చెప్పిన చాలా మంది మంచి ప్రయోజనం కనబడిందనే చెప్పారు.

ముందుగా క్రింద రాసిన పొడులన్నీ కొని ఒక డబ్బాలో కలిపి పెట్టుకోవాలి:
ఉసిరి పొడెం : అర కేజీ
షీకాయ పొడెం: అర కేజీ
కుంకుడు పొడెం: అర కేజీ
మెంటి పొడెం: వంద గ్రాములు
గోరింటాకు: వంద గ్రాములు
వేప పొడెం: ఏభై గ్రాములు

ముందుగా ముక్కుకి గుడ్డ కట్టుకుని ( ఈ పొడాలు కలిపేప్పుడు ఘాటుకి బాగా తుమ్ములు వస్తాయి)ఈ ఆరు పొడాలనీ బాగా కలిపి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఆరునెలలు దాకా ఈ పొడెం వాడచ్చు.

ఎలా వాడాలంటే:
* రేపు తలంటు పోసుకుంటాం అనగా ముందురోజు రాత్రి స్ట్రాంగ్ గా ఒక గ్లాసుడు టీ డికాక్షన్ తీసుకుని ఉంచాలి. ( ఇందుకోసం తాజ్మహల్, రెడ్లేబుల్ టీ పొడాలు కాకుండా టీ అమ్మే షాపుల్లో దొరికే మామూలు(తక్కువ రేటు) టీ పొడెం కొని వాడతాను నేను.)

* ఒక ఇనుప మూకుడు (ఇంట్లో లేకపోతే కొనుక్కోవాలి) లో ముండుకా కలుపుకున్న పైన చెప్పిన పొడెం నాలుగైదు చెంచాలు (మన జుట్టుకి సరిపోయేంత) తీశుకుని ఈ తీసుకున్న టీ డికాక్షన్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి.


* మర్నాడు పొద్దున్నే తలకు ఈ ముద్దను పట్టించుకుని ఓ గంట సేపు ఉంచాలి.

* ఈ పొడిలో షీకాయ అవీ ఉన్నాయి కాబట్టి, జుట్టు కడిగేసుకున్నాకా తలంటుకి షంపూ ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. అయితే పొడెం బాగా వదిలేలా కడిక్కోవాలి. ఎక్కువ నీళ్ళు పడతాయి.

* తలంటు పోసుకోవటం అయిపోయాకా చివరిగా ఒక నిమ్మ చెక్క రసం తీసుకుని ఉంచుకుని, దానిని ఒక మగ్గు నీటిలో కలిపి తలంతా తడిసేలా నీళ్ళు పోసుకోవాలి. అంటే "లాస్ట్ వాష" అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నీటితో కడగకూడదు తలను. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. పొడెం వాడకపోయినా మామూలుగా తలంటు పోసుకున్నాకా చివరలో ఇలా చేయచ్చు. తర్వాత తువ్వాలుతో పిడప చుట్టేసుకోవాలి.

ఇలా క్రమం తప్పకుండా వారానికి ఓసారి చేస్తే తేడా మీకే తెలుస్తుంది. నిజ్జంగా జుట్టు అస్సలు ఊడదు. నేను మధ్యలో చాలా ఏళ్ళు వాడటం మానేసాను కానీ నాకు ఈ టిప్ చెప్పిన ఆవిడ వయసు ఇప్పుడు అరవై ఐదు పైనే. ఇప్పటికీ ఆవిడ ఓపిగ్గా ఇలానే చేస్తారు. ఆవిడ జుట్టు కూడా ఇంత ఒత్తుగా, పొడవుగా ఆరోగ్యంగా ఉంది.

Monday, May 23, 2011

Alfalfa sprouts



మొన్న పొద్దున్న నాకు చాల ఇష్టమైన buffet breakfast కి వెళ్ళాం. అక్కడ మెనూ లో వేలంత పొడుగు మొక్కలు పెరిగిన ఐదారు రకాల sprouts పెట్టాడు. నేను పెసలు, మెంతులు, వేరుశనగ, శనగలు, గోధుమల sprouts చేస్తుంటాను. కానీ హోటల్లో వాడు ఒకట్రెండు కొత్త రకాలు పెట్టాడు. అవేమిటా అని నెట్లో వెతుకుతుంటే ఒక sprouts related లింక్ దొరికింది. అందులోపదిపన్నెండు రకాల sprouts, వాటిల్లోని మంచి గుణాల వివరాలు ఉన్నాయి. ఆ లింక్ ఇదిగో:
http://www.indiamart.com/sproutaminssuper/seed-sprouts.html



ఆ తరువాత నిన్న ఒక షాపింగ్ మాల్ లో అనుకోకుండా మొన్న పొద్దున్న buffet లో పెట్టిన ఒక రకం sprouts కనబడ్డాయి. వెంఠనే కొనేసా. వాటి పేరే "Alfalfa sprouts". నెట్లో వివరాలు వెతికితే అసలివేమిటి? వీటివల్ల ఉపయోగాలేమిటి? ఎలా మొక్క మొలిపించటం తదితర వివరాలు దొరికాయి. క్లుప్తంగా వీటి గురింఛి చెప్పాలంటే:

* శరీరంలో రోగనిరోఢక శక్తిని పెంచుతాయి ఇవి.
* ఎముకలను గట్టిపరిచే గుణాన్ని కలిగి, ఎముకలు త్వరగా పెరగటానికీ ఉపయోగపడతాయి.
* బ్రెస్ట్ ట్యూమర్స్ పెరగకుండా చెయ్యగల సక్తి వీటికి ఉంది.
* శరీరంపై వయసు ప్రభావాన్ని పడనివ్వవుట.. అంటే ముసలిరూపాన్ని త్వరగా దగ్గరకు రానివ్వవన్నమాట.
* బ్లడ్ ప్రజర్ ను తగ్గిస్తాయిట .

ఈ Alfalfa sprouts లోని మరిన్ని పోషక విలువలు, ఉపయోగాలు గురించి ఇక్కడ ఉన్నాయి:
http://webcache.googleusercontent.com/search?q=cache:At7H-IVEVWkJ:www.juicing-for-health.com/alfalfa-sprouts-nutrition.html+alfalfa+sprouts&cd=7&hl=en&ct=clnk&gl=in&source=www.google.co.in


sprouting ఎలా చెయ్యాలో బొమ్మలతో సహా ఇక్కడ వివరంగా రాసాడు:
http://webcache.googleusercontent.com/search?q=cache:5bxIBnoRk8wJ:www.backyardnature.net/simple/alf-spr.htm+alfalfa+sprouts&cd=9&hl=en&ct=clnk&gl=in&source=www.google.co.in


ఇక ఈ Alfalfa గింజలు ఎక్కడ దొరుకుతాయో ప్రయత్నాలు మొదలెట్టాలి !!

Tuesday, May 3, 2011

"Herbvia" ( Herbal Stevia Sweetner)


వచ్చేసింది వచ్చేసింది "Herbvia". i.e Herbal Stevia Sweetner. "Stevia"(http://trishnaventa.blogspot.com/2010/01/blog-post_05.html) గురించి అదివరకూ రాసాను.


ఆ మధ్యన ఒక హెర్బల్ ఎగ్జిబిషన్ లో స్టివియా పౌడర్ వచ్చింది అని చూశాను. కానీ ఎక్కడ దొరుకుతుందో వివరాలు అడగటం మర్చిపోయాను. నిన్న బజార్లో ఓ సూపర్ మార్కెట్లో స్టీవియా పౌడర్ కొందామని వెళ్ళేసరికీ ఈ Herbvia చూశాను. చుట్టూ మనుషుల్లేకపోతే హుర్రే అని అరిచే మాటే. నేను మూడేళ్ల నుంచీ పంచదార బదులు స్టీవియా పౌడర్ కొని వాడుతున్నాను. కానీ అది సమపాళ్ళలో మరిగించుకుని, పది గంటల తరువాత వడబోసి దాచి వాడటం కొంచెం శ్రమతో కూడుకున్న పనే. కానీ నేచురల్ స్వీట్నర్ అని మిగిలిన artificial sweetners కన్నా నేను దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని.


ఇప్పుడు ఇక మరిగించుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా ఈ Herbvia పిల్స్ వాడేయచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్లకైతే స్టీవియా చాలా మంచిది. చాలామంది ఆర్టిషియల్ స్వీట్నర్స్ వాడలేక పంచదార లేకుండా ఏదీ తినలేక తాగలేక ఇబ్బంది పడుతూంటారు. అలాంటివారికి ఇది వరమనే చెప్పాలి. పైగా ఎక్కువకాలం artificial sweetners వాడటం వల్ల ఎన్నో ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ. సుగర్ ఫ్రీ స్వీట్స్ అని బజార్లో అమ్మేస్తూ ఉంటారు. వాటిల్లో వాడే artificial sweetners డయాబెటిస్ వాళ్లకు ఎంతో హాని చేస్తాయి.

* ఇవి మెదడు మీద ఎన్నో దుష్ప్రభావాలను చూపిస్తాయి.

* గర్భవతులు వీటిని వాడితే పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

* ఇవి బ్లడ్ సుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయ్యలేవు.

ఇవి కేవలం artificial sweetners యొక్క కొన్ని ముఖ్యమైన ఇబ్బందులు మాత్రమే. స్టీవియాలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స ఏవీ ఉండవు. ఈ స్టీవియాతో తయారు చేసిన Herbvia లో కూడా స్టీవియా పౌడర్ కున్న సుగుణాలే ఉన్నాయా లేవా అన్నది ఇంకా నేను ధృవీకరించుకోవాల్సి ఉంది. కానీ జనాలు ఎక్కువగా వాడే ఏస్పర్టేమ్, సర్కోస్ లాంటి artificial sweetners కన్నా డెఫినేట్ గా Herbvia నయం అని చెప్పవచ్చు.

Wednesday, April 7, 2010

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - ఒక హెల్త్ డ్రింక్

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక హెల్త్ డ్రింక్ గురించి..వివరాలు.
క్రింద చెప్పిన పాళ్ళలో ఆయా వస్తువులు కొనుక్కుని మర ఆడించుకోవాలి.

రాగులు - 500గ్రాములు
గోధుమలు - 50 గ్రా
జొన్నలు - 50 గ్రా
వేరుశెనగలు - 50 గ్రా
సగ్గు బియ్యం - 50 గ్రా
ఉప్పుడు బియ్యం - 50 గ్రా
సజ్జలు - 50 గ్రా
మొక్కజొన్నలు - 25 గ్రా
సొయాబిన్ - 25 గ్రా
పుట్నాల పప్పు - 25 గ్రా
బార్లీ - 25గ్రా


ఫ్లావర్ కోసం:

బాదాం - 25 గ్రా
జీడిపప్పు - 25 గ్రా
ఏలకులు - 25 గ్రా
ఈ మూడూ మనం ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.అనవసరం అనుకుంటే ఫ్లేవేర్ కోసం వాడే బాదాం,జీడిపప్పు కలుపుకోవటం మానేయటమే.

పైన రాసిన పదార్ధాల్లో Proteins,folic acid, calcium,fibre,iron,copper,carbohydrates,magnesium మొదలైన పోషక విలువలన్ని ఉంటాయి. షాపు వాళ్ళలాగ ఏది ఎంత % అన్నది చెప్పలేను. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కేలొరీలు బాగా ఖర్చు అవుతాయి కాబట్టి పిల్లలకు ఇది చాలా ఉపయోగకరం.

తయారి విధానం:

ఒక 2 స్పూన్లు పవుడర్ను తీసుకుని అర గ్లాసు నీళ్ళలో కలుపుకుని పొయ్యి మీద పెట్టాలి. మరుగుకు వచ్చాకా మరొక అరగ్లాసు పాలు తీసుకుని అర గ్లాసు నీళ్ళలో కలుపుకుని పొయ్యి మీద పెట్టాలి. మరుగుకు వచ్చాకా మరొక అరగ్లాసు పాలు తీసుకుని అందులో కలుపుకుని బాగా కలిసాకా పంచదార వేసుకుని దింపేసుకోవాలి. పెద్దలు షుగర్ తినకూడనివాళ్ళు ఉంటే నీళ్ళలొ మరిగించుకున్నాకా చల్లర్చి మజ్జిగలో కలుపుకుని త్రాగచ్చు.

Tuesday, January 5, 2010

స్టీవియా


"స్టీవియా" ఒక హెర్బల్ ప్లాంట్. ఈ మొక్క ఆకులు పంచదార కన్నా ఇరవై,ముఫ్ఫై శాతం తియ్యదనం కలిగి ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా "సౌత్ అమెరికా"లో కల్టివేట్ చెయ్యబడుతున్న ఈ మొక్క పధ్ధెనిమిదవ శతాబ్దంలో మిగిలిన ప్రపంచ దేశాలకి పరిచయమైంది. ఇప్పుడిది ఒక "నేచురల్ స్వీట్నర్" గా ప్రసిధ్ధి చెందిన హెర్బ్.

దాదాపు ఒక పదేళ్ళ క్రితమేమో ఆదివారం ఈనాడు పుస్తకంలో "నేచురల్ సుగర్ సబ్స్టిట్యూట్" గా "స్టీవియా" గురించి ఉన్న ఆర్టికల్ చదివాను. కట్టింగ్ దాచలేదు కానీ నాకు ఆ ఆర్టికల్ బాగా గుర్తు. భవిష్యత్తులో నేను దాన్ని వాడతానని అప్పుడు అనుకోలేదు. 1 spoon sugar లో కనీసం 25 కేలరీస్ ఉంటాయట. "పందార" మానేసి ఆ అధిక కేలొరీలన్నీ తగ్గించాలని ఐదేళ్లక్రితం నిర్ణయించుకున్నాను. కొన్నాళ్ళు "తీపిలేని టీ" తాగాను.తరువాత కొన్నాళ్ళు మార్కెట్లో లభ్యమైన "ఆర్టిఫిషియల్ సుగర్ సబ్స్టిట్యూట్స్" కొన్ని ట్రై చేసా. కానీ "ఏస్పర్టీమ్", "సర్కోజ్" వంటివాటి దీర్ఘకాల వాడకం మంచిది కాదని చాలా చోట్ల చదివి వాడటం మానేసాను.

2,3ఏళ్ళ క్రితమేమో ఒక ఎగ్జిబిషన్ లో హెర్బల్ ప్రోడక్ట్స్ స్టాల్ లో "బయో ఫుడ్ సప్లిమెంట్" అంటూ అమ్ముతున్న "స్టీవియా పౌడర్" ను చూశాను నేను. స్టాల్ లో అబ్బాయి చాలా ఉపయోగాలు చెప్పాడు. దీనిలో
కేలరీలు ఉండవు ,
బ్లడ్ సుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది,
హై బ్లడ్ ప్రజర్ ను తగ్గిస్తుంది,
అధిక బరువు తగ్గిస్తుంది,
జీర్ణ ప్రక్రియను సరిచేస్తుంది,
దంత క్షయాన్ని నివారిస్తుంది,
గొంతు నెప్పి, జలుబు లను తగ్గిస్తుంది,
గాయాలూ, కురుపులకు, చర్మ సంబంధిత సమస్యలలో కూడా ఉపయోగకరం...
అంటూ...చెప్పుకువచ్చాడు. అవన్ని కరక్టేనని తరువాత నేను జరిపిన "నెట్ సర్వే"లో తెలుసుకున్నాను.

ఏదిఏమైనా ఇది ఒక "నేచురల్ స్విట్నర్" అన్న సంగతి నాకు నచ్చింది. మిగతా ఉపయోగాల సంగతి ఎలా ఉన్నా టీ లో వాడుకోవచ్చు అని ఆ "స్టీవియా పౌడర్" కొనేసాను. అయితే దీని వాడకానికి ఒక పధ్ధతి ఉంది. ఒక కప్పు పౌడర్ కి నాలుగు కప్పుల నీళ్ళు కలిపి, బాగా మరిగించి, అవి మూడు కప్పుల నీళ్ళు అయ్యాకా దింపేసుకుని 10,15 గంటలు ఆ ద్రావకాన్ని అలా ఉంచేసుకోవాలి. అలా చేయటం వల్ల ఆకు పొడిలోని సారం అంతా ద్రావకంలోకి వచ్చి, ద్రావకం బాగా తియ్యగా అవుతుంది. తరువాత దాన్ని పల్చటి బట్టలోంచి వడబోసుకుని, ఒక సీసాలోనో, ప్లాస్టిక్ బోటిల్ లోనో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇది ఒక 2,3 వారాలు నిలవ ఉంటుంది కాబట్టి కొద్దిగానే తయారు చేసుకుంటే మంచిది. ఇది వాడేప్పుడు ఒక 1/4 స్పూన్ కన్నా తక్కువ అంటే 3,4 చుక్కలు కాఫి, టి లలో డైరెక్ట్గా కలిపేసుకుని తాగచ్చు. లేకపోతే టి మరిగేప్పుడు దాంట్లో కూడా వేసుకోవచ్చు. కాని ఎక్కువ వేసుకుంటే అ తీపి అసలు భరించలేము. ఓ సారి వాడితే ఎంత వేసుకోవాలో ఎవరికి వారికే తెలుస్తుంది.

దీనికి కొన్ని" సైడ్ ఎఫెక్ట్స్" ఉన్నాయని అంటారు. కానీ అది ఎక్కువగా వాడితేనే. పైగా నేను వాడేది ఒక్క "టీ" లోకే కాబట్టి, కాఫీ టీల వరకూ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కన్నా వాడకానికి వంద రెట్లు ఇదే నయం అని నా అభిప్రాయం. ఈ "స్టీవియా" గురించి తెలుసుకోవాలి అనుకునేవారు "ఇక్కడ" మరియూ "ఇక్కడ" చూడవచ్చు.


పైన లింక్ పనిచేయనివారు ఈ క్రింది విధంగా ప్రయత్నించి చూడండి:

1)"www.healthy.net" లోకి వెళ్ళి search లో
"stevia - The Natural Sweetener: Resources and additional links " అని కొట్టి చూడండి..

2) "http://en.wikipedia.org/wiki/Stevia." ఈ లింక్ లో చూడండి.

ఈ పౌడర్ వెల వెల వంద గ్రాములు Rs.70/- ఒకసారి కొంటే రెండు,మూడు నెలలు వస్తుంది. నాకు రెగులర్గా దొరికేది
"Trishakti farms"వారు తయారుచేసినది. పేకెట్ మీద ఉన్న అడ్రస్,ఫోన్ నంబర్ క్రింద ఇస్తున్నాను:
Trishakti Enterprises
H.no.5-115,chinnamamgalaram,
moinabad Mandal, R.R. dist
A.P.-501504
cell:9391157340

Hyd branch:
16-Vikaspuri,
ESI-AG Colony road,
S.R.nagar(PO)
HYD-38
ph:23811220

Monday, September 14, 2009

దంపుడు బియ్యం

ఆరోగ్య సూత్రాలు పాటించటంలో నేను కొంచెం చాదస్తురాలిననే చెప్పాలి.ఆరోగ్య సూత్రాలు ఎక్కడ కనిపించినా చదివి పాటించేస్తూ ఉంటాను.దాదాపు సంవత్సరంన్నర క్రితం యధాలాపంగా కొన్ని ఆరోగ్యపరమైన వెబ్సైట్లను చదువుతూంటే నాకు దంపుడు బియ్యం(brown rice)గురించి తెలిసింది.రాత్రులు చపాతీలు తినటం మాకు బొంబాయిలో అయిన అలవాటు.దంపుడు బియ్యం ఉపయోగాలు తెల్సుకున్నాకా ,పొద్దున్నపూటలు "వైట్ రైస్" బదులు "దంపుడు బియ్యం" తినటం మొదలుపెట్టాము.ఇంట్లో మిగిలినవారు వైట్ రైస్ తిన్నా,మావారి సహకారం వల్ల మేమిద్దరం మాత్రం ఉదయం దంపుడు బియ్యమే తింటాము.బరువు తగ్గటానికి ఇది చాల ఉపయోగపడుతుంది.రుచి కొంచెం చప్పగా ఉండటంవల్ల మొదట్లో ఇబ్బంది పడ్డా ఇప్పుడు అలవాటైపోయింది.కాకపోతే వారానికి ఒకరోజు "వైట్ రైస్" వండుతాను.దంపుడు బియ్యం గురించిన నేను తెల్సుకున్న కొన్ని వివరాలను ఇక్కడ తెలుపుతున్నాను.ఇది వారానికి నాలుగు రోజులు తినగలిగినా మంచిదే.

దంపుడు బియ్యం అంటే:
ధాన్యాన్ని పొట్టు తిసి,పొలిష్ చేసి వైట్ రైస్ గా మారుస్తారు.ఆ ప్రోసెస్ లో దానిలోని పోషకాలన్నీ చాలావరకూ నశించిపోతాయి.బియ్యాన్ని పోలిష్ చే్సే ప్రక్రియలో విటమిన్ B3లోన 67%,విటమిన్ B1లో 80%,విటమిన్ B6లో 90%,60% ఐరన్,సగం manganese,సగం phosphorus, మొత్తం డైటెరీ ఫైబర్ ,మిగతా అన్ని అవసరమైన "ఫాట్టీ ఆసిడ్స్" నశించిపోతాయి.వైట్ రైస్ లో విటమిన్ B1, B3, ఐరన్ ఉన్నా , పైన పేర్కొన్న nutrients అన్నీ పొలిష్,మిల్లింగ్ ప్రక్రియ వల్ల పోతాయి.


అదే
ధాన్యాన్ని పై పొట్టు(హస్క) మాత్రమే తీసినదాన్ని "దంపుడు బియ్యం" (బ్రౌన్ రైస్ ) అంటారు.పై పొర మాత్రమే తీయటంవల్ల దానిలోని పోషకాలన్నీ అలానే ఉంటాయి.శరీరానికి కావాల్సిన 14% DV(daily value) ఫైబర్ ను అందించటంతో పాటూ,ఒక కప్పు దంపుడు బియ్యంలో 88% manganese,మరియు 27.3% DV ఉండే selenium,Magnesium అనబడే ఆరోగ్యకరమైన మినరల్స్ కూడా ఉంటాయి.
manganese శరిరంలోని నాడీ వ్యవస్థ శక్తిని పెంచుతుంది.అంతేకాక ఎంతో ఉపయోగకరమైన కొన్ని ఏంటీఆక్సిడెంట్లని తయారుచేయటంలో శరీరానికి ఉపయోగపడుతుంది.
selenium అనేది శరీరమెటబోలిజంకి ఉపయోగపడే చాల రకాలైన సిస్టంలకి మూలమైనది. కేన్సర్, గుండెపోటు, ఆస్థ్మా,ర్యూమెటోయిడ్ ఆర్థరైటిస్ మొదలైన జబ్బులను నిరోధించే శక్తిని శరిరానికి ఈ selenium అందిస్తుంది.
Magnesium కండరాలను,నరాలనూ రిలాక్సింగ్ కీ,ఎముకలను గట్టిపరచటానికీ,రక్త ప్రసరణ సాఫిగా సాగిపోవటానికీ ఉపయోగపడుతుంది.

ఇవే కాక దంపుడుబియ్యం తినటం వల్ల ఉన్న మరికొన్ని ఉపయోగాలు:

* బరువు తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుంది.
* దంపుడు బియ్యం మన శరీరంలోని LDL (bad) cholesterol ను తగ్గిస్తుంది. అందుకే "రైస్ బ్రాన్ ఆయిల్" కూడా మిగతావాటికంటే మంచిది అంటారు.(ప్రస్తుతం నేను అదే వాడుతున్నాను.)cardiovascular healthకు ఈ నూనె చాలా మంచిదని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.
* ఎక్కువ శాతం కొలెస్ట్రోల్, హై బ్లడ్ ప్రషర్ మొదలైన లక్షణాలున్న మెనోపాజ్ దశ దాటిన మహిళలకు దంపుడు బియ్యం తినటంవల్ల ఆరోగ్యం చాలా మెరుగు పడినట్లు సమాచారం.
* American Institute for Cancer Research (AICR) వారి ఒక రీసర్చ్ ప్రకారం whole grains లో antioxidants ను ఉత్పత్తి చేసే phytonutrients ఉంటాయి.అవి శరిరంలో cancer-fighting potential ను,రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పరిశోధనల ప్రకారం గోధుమల్లో 77% , ఓట్స్ లో 75%, దంపుడు బియ్యంలో 56% anitioxident activity ఉంటుంది. whole grains లో fat, saturated fat, and cholesterol తక్కువశాతాల్లో ఉండటం వల్ల గుండె జబ్బులను,కొన్ని రకాల కేన్సర్లను నిరోధించే శక్తి వీటిల్లో ఉంది.
* దంపుడు బియ్యం తినేవారికి type 2 diabetes వచ్చే అవకాశాలు కూడా తక్కువ.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చదివాకా ,రుచి కొంచెం చప్పగా ఉన్నా మేము మాత్రం రోజూ ఇదే తినాలని నిర్ణయించేసుకున్నాము.కాకపోతే సరైన దంపుడు బియ్యాన్ని సిటీల్లో వెతికి కొనుక్కోవాలి.కొన్ని సూపర్ మార్కెట్లలో బాగా పొట్టు తీసేసిన దంపుడు బియ్యాన్ని అమ్ముతూ ఉంటారు.అలాటిది తిన్నా ఒకటే,తినకపోయినా ఒకటే.హోల్ సేల్ షాపుల్లో మంచి రకం దొరికే అవకాశం ఉంది.మేము కొనటం మొదలెట్టినప్పుడు కేజీ ఇరవై రూపాయలు ఉండేది.ఇప్పుడు కేజీ నలభైకి చేరుకుంది..!అయినా ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరి !!