సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label సంగీతప్రియ. Show all posts
Showing posts with label సంగీతప్రియ. Show all posts

Thursday, February 20, 2020

'రంగపుర విహార' గానామృతం




దక్షిణ భారత కర్ణాటక సంగీత విద్వాంసులలో చెప్పుకుని తీరాల్సిన కళాకారుడు టి.ఎం. కృష్ణ. గాయకుడే కాక మంచి రచయిత కూడా. కొన్నేళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈయన గురించి నేను చదివింది హిందూ దినపత్రికలో. ఈయన పుస్తకం ఒకటి రిలీజ్ అయినప్పుడు పెద్ద ఇంటర్వ్యూ వేశారు పేపర్ లో. అది చదివి ఆసక్తి కలిగి ఈయన సంగీతామృతాన్ని వినడం జరిగింది. అది మొదలు నాకు అత్యంత ఇష్టమైన గాయకుల జాబితాలో చేరిపోయారు టి.ఎం. కృష్ణ. ఆసక్తి ఉన్నవారు ఈయన గురించిన మరిన్ని వివరాలు క్రింద లింక్స్ లో తెలుసుకోవచ్చు.
https://en.wikipedia.org/wiki/T._M._Krishna 
https://tmkrishna.com/

టి.ఎం. కృష్ణ కాన్సర్ట్స్ లో అన్నింటికన్నా నాకు బాగా నచ్చినది ముత్తుస్వామి దీక్షితార్ రచన "రంగపుర విహారా.." ! ఈ కృతి వేరే ఎవరు పాడినదీ నాకు అంతగా రుచించదు. ఈయన పాడినది మాత్రం అసలు ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. వింటూంటే... ఏవో గంధర్వలోకాల్లో విహరిస్తున్నట్లు, అమృతం ఇలా ఎవరో చెవిలో పోస్తున్నట్లు, మనసంతా హాయిగా దూదిలా తేలికగా గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది నాకు. ఆసక్తి ఉన్నవారు వినండి -




సాహిత్యం:

రచన : ముత్తుస్వామి దీక్షితార్
రాగం: బృందావనసారంగ


పల్లవి:
రంగపుర విహార జయ కోదండరామావతార  రఘువీర 
శ్రీ రంగపుర విహార ll ప  ll

అనుపల్లవి:
అంగజ జనక దేవ బృందావన 
సారంగేంద్ర వరద రమాంతరంగ  
శ్యామళాంగ విహంగ తురంగ 
సదయాపాంగ సత్సంగ ll ప  ll

చరణం:
పంకజాప్త కులజలనిధిసోమ 
వరపంకజముఖ పట్టాభిరామ 
పదపంకజజితకామ రఘురామ 
వామాంక గత సీతా వరవేష
శేషాంకశయన భక్తసంతోష 
ఏణాంక రవినయన మృదుతర భాష 
అకళంక దర్పణ కపోల విశేష 
మునిసంకట హరణ గోవింద 
వేంకటరమణ  ముకుంద 
సంకర్షణ మూలకంద
శంకర గురుగుహానంద విహార ll ప  ll

Friday, November 22, 2019

HINDI RETRO - myTuner Radio app




" my Tuner Radio " ! నా ఫోన్ లో ఇదిక inbuilt app. చాలా కాలంగా ఎప్పుడూ పట్టించుకోలేదు. కొన్ని అద్భుతమైన వస్తువులు/విషయాలు వాటి విలువ తెలిసేవరకూ అలా అజ్ఞాతంలోనే ఉంటాయి. వాకింగ్ లో వీలుగా ఉంటుందని hands free earphones కొనుక్కున్నాకా సదుపాయం బాగా కుదిరింది కానీ రోజూ వినే ఎఫ్.ఎమ్ రేడియో అందులో వినపడ్డం మానేసింది. గంటకు పైగా ఏమీ వినకుండా నడవడం నావల్ల కాదు. సో, ఆల్టర్నేట్ కోసం వెతుకుతుంటే నా ఫోన్ లోనే ఇన్నాళ్ళూ మూగగా పడి ఉన్న ఈ యాప్ కనబడింది. ట్రై  చేస్తే hands free earphones లో వినపడుతోంది.  ఇదేదో బానే ఉంది అని అన్ని ఛానల్సూ వింటూ వెళ్తూంటే అందులో "HINDI RETRO" స్టేషన్ దగ్గర నా చెవులు ఆగిపోయాయి. ఆ రోజు నుంచీ ఇంట్లో కూడా చెవుల్లో అదే మోగుతోంది. ఈ మత్తు కొన్నాళ్ళలో దిగేది కాదని అర్థమైంది.  ఆ అమృతాన్ని ఇంకెవరన్నా ఆస్వాదించి శ్రవణానందాన్ని పొందుతారని ఇక్కడ రాయడం! ఈ యాప్ ని విడిగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇంతకీ "HINDI RETRO" లోని ప్రత్యేకత ఏమిటంటే ఈ స్టేషన్లో నిరంతరం 70s&80s లోని హిట్ హిందీ సాంగ్స్ వస్తూ ఉంటాయి.  ఏ సమయంలో పెట్టినా ఏదో ఒక అద్భుతమైన పాట అమాంతం మన మూడ్ ని మార్చేసి ఆనందంలో ముంచెత్తేస్తుంది. కాబట్టి పాత హిందీ పాటల మీద మక్కువ ఉన్న వారు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఛానల్ ని తప్పకుండా ఆస్వాదించాలని ప్రార్థన :) 
జయహో HINDI RETRO !!

Tuesday, September 11, 2018

This is Raagam 24x7 DTH..

 
 
"This is Raagam 24x7 DTH - Indian Classical Music Channel" అంటూ పలుమార్లు వినబడే ప్రకటనతో సాగే ఒక రేడియో ఛానల్ "రాగం". 2016, జనవరి26న మొదలైంది ఈ ఛానల్. ఇది ఒక 'AIR Mobile App'. Android, iOS , ఇంకా Windows లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
ఈ ఛానల్ లో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఇరవై నాలుగు గంటలూ కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే వస్తుంది. సంగీతప్రియులకు ఇది ఒక మ్యూజికల్ ఫీస్ట్ అనే చెప్పాలి. కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలతో పాటూ వాద్య సంగీతం కూడా ఇందులో ప్రసారమవుతుంది. 
 
ఫోన్ లోనో, లేప్టాప్ లోనో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కని శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. పొద్దున్నే భక్తి సంగీతం, భజన్స్ వేస్తారు. తర్వాత వీణ, సితార్, వేణువు, జల తరంగిణి, సంతూర్ మొదలైన వాద్య సంగీత కచేరీలు వస్తాయి.

 
వీణ కచేరీ వింటుంటే ఏదో గంధర్వ లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. సంతూర్ వాదన వింటూంటే వర్షంలో తడుస్తున్నట్లు, జల తరంగిణి వింటుంటే ఉత్సాహంగానూ ఉంటుంది. సితార్ వాదన వింటూంటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మా ఇంట్లో ఇదివరకటి ఎఫ్.ఎం ల స్థానంలో నిరంతరం ఇదే మోగుతూ ఉంటుంది ఇప్పుడు. మనసు ఏ రకమైన స్థితిలో ఉన్నా ఆహ్లాదకరమైన సాంగత్యాన్ని శాస్త్రీయ సంగీతం తప్ప మరేమి ఇవ్వగలదు?

ఈ కచేరీలలో ఎక్కువగా బాగా పేరున్న సంగీత విద్వాంసుల పాత రికార్డింగ్స్ ఎప్పటివో కూడా వేస్తూ ఉంటారు. అన్ని రేడియో స్టేషన్స్ వారి రికార్డింగ్స్ ఇందులో వంతులవారీగా ప్రసారమవుతూ ఉంటాయి.

మధ్య మధ్య కొన్ని ప్రత్యేకమైన సంగీత రూపకాలు, సంగీత విద్వాంసులతో ఇంటర్వ్యూలు కూడా ప్రసారమవుతూ ఉంటాయి. మనకు తెలియని ఎందరో గొప్ప కళాకారులు ఈ ఇంటర్వ్యూల ద్వారా మనకు పరిచయమౌతారు. ఏ భాష వారి అనౌన్స్మెంట్ వాళ్ళు ఇస్తారు. తర్వాత ఆ అనౌన్స్మెంట్ లకు ఆంగ్లంలో అనువాదం కూడా వస్తుంది. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే ఇంత చక్కని ఛానల్ ని తయారు చేసిన All India Radio వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
 

ఇదివరకూ దాదాపు పదిహేనేళ్ల క్రితం ఇలా రకరకాల సంగీతాలు వచ్చే రేడియో ఒకటి ఉండేది. క్లాసికల్, రాక్,జాజ్, వెస్టర్న్, పాత హిందీ పాటలు ఇలా రకరకాలు ఉండేవి. దానికి ఒక ప్రత్యేకమైన ఏంటన్నా కొనుక్కుంటే ఆ ప్రసారాలు వచ్చేవి. అందులో కూడా నిరంతరం శాస్త్రీయ సంగీతం వచ్చే ఛానల్ ఉండేది కానీ అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. నెలకో, ఆర్నెల్లకో పేమెంట్ ఉండి, ఏంటన్నా కూడా ఉండాల్సివచ్చేది ఆ రేడియోకి. ఇప్పుడా అవసరం లేదు. అన్ని యాప్స్ లాగ మొబైల్ లో డౌన్లోడ్ చేసేసుకుంటే, రాగంతో పాటూ మరో పది పదిహేను భాషల AIR వారి రేడియో ఛానల్స్ ఈ యాప్ లో ఉన్నాయి. 
 
 
 

 
 
 
 
 
 
ఈ యాప్ గురించి తెలియని సంగీతప్రియులు ఈ సదుపాయం ఉపయోగించుకుంటారని ఇక్కడ రాస్తున్నాను.

 

Sunday, March 1, 2015

తులసి మొక్కలా... 'Dum Laga Ke Haisha'


నిన్న రాత్రి చూసిన ఈ సినిమా పూర్తయ్యేసరికీ విషయం తక్కువ  హంగామా ఎక్కువ అనిపించేట్లు ఉంటున్న ఈ కాలపు సినిమాల మధ్యన ఈ చిత్రం నిజంగా "...వనంలో తులసి మొక్క" అనిపించింది. ఇటువంటి మణిపూసని మనకందించిన దర్శకుడు శరత్ కతారియాను అభినందించి తీరాలి. ఈ చిత్రం యాష్ రాజ్ ఫిల్మ్స్ నుండి రావడం గొప్ప ఆశ్చర్యం! ఆ ప్రొడక్షన్ హౌస్ అదృష్టం.  చిత్రాన్ని గురించి ఇంకేమైనా చెప్పేముందు ఈ పాట వినండి(చూడండి)..




ఊ..చూసేసారా?! అమేజింగ్ కదా అసలు. పాట మొదలవగానే అసలు ఏదో లోకంలోకి వెళ్పోయాను నేనైతే. లుటేరా లో "సవార్ లూ.." పాడిన అమ్మాయి మోనాలీ ఠాకుర్ ఈ పాట పాడింది. ఆ పాట కన్నా ఈ పాటలో క్లాసికల్ బేస్ ఉన్న మోనాలీ ట్రైన్డ్ వాయిస్ బాగా తెలిసింది. ట్యూన్ అలాంటిది మరి. చాలా రోజులకి అనూ మాలిక్ కంపోజ్ చేసారు. ఇదే పాటకు మేల్ వర్షన్ Papon అనే పేరుతో ప్రసిద్ధుడైన గాయకుడు అంగరాగ్ మహంతా పాడారు. మనసుని సున్నితంగా తట్టే ఈ పాటకు సాహిత్యాన్ని వరుణ్ గ్రోవర్ అందించారు. నా దృష్టిలో "ఎక్స్ట్రార్డినరీ" పదం ఒక్కటే ఈ పాటకు, అది తయారవడానికి కారణమైనవారందరికీ సమంగా సరిపోతుంది. ప్రముఖ గాయకుడు కుమార్ సానూ కూడా చాలారోజులకి ఒక పాట పాడి, సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.

కుమార్ సానూ పాట:





ఇంతకీ ఇదెలాంటి సినిమా అంటే ఎలా చెప్పాలి...
తావి లేని కనకాంబరాల మధ్యన గుబాళించే మల్లె మొగ్గలా..
చుక్కల మధ్య మెరిసిపోయే చందమామలా..
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందమైన పువ్వులా..
ఉంది సినిమా. డెభ్భైలు, ఎనభైల్లో బాలీవుడ్ లో తయారైన మధ్యతరగతి కథలు, తళుకుబెళుకులు లేని అతి మామూలు సదాసీదా కామన్ మేన్ జీవిత కథలతో తయారైన చిత్రాలు ఒక్కసారిగా గుర్తు వచ్చాయి.  సినిమాల్లో, తద్వారా మనుషుల్లో పెరిగిపోయిన అసహజత్వాలనీ
, ఆర్భాటాలనీ పక్కన పెట్టి ఇలాంటి డౌన్ టూ ఎర్త్ సినిమాను తీయాలనే ఆలోచనకు గొప్ప ధైర్యం కావాలి. ఇమేజ్ నూ, పాపులారిటీను పక్కన పెట్టి తండితో ప్రాక్టికల్ గా చెప్పు దెబ్బలు తినే ఒక నిరాశాపరుడైన, పిరికి అబ్బాయి పాత్రను ఒప్పుకున్నందుకు హీరో ఆయుష్మాన్ ఖురానా మరింత నచ్చేసాడు. "విక్కీ డోనర్" లో కన్నా ఎక్కువగా! (ఒక నటుడిగా మాత్రమే :))

చిత్రకథ తొంభైల కాలం లాంటిది. ఆ కాలం నాటి హిట్ హిందీ చిత్ర గీతాలు తెలిసిన వాళ్ళు, 'శాఖ ట్రైనింగ్' గురించి తెలిసినవాళ్ళూ సినిమాని బాగా ఎంజాయ్ చెయ్యగలరు. బాగా కనక్ట్  అవుతారు. గాయకుడు "కుమార్ సానూ" వీరాభిమాని హీరో. పదవ తరగతి రెండుసార్లు ఫెయిలయి, హరిద్వార్ లో తండ్రి నడిపే ఒక కేసెట్ రికార్డింగ్ సెంటర్ లో పాటలు రికార్డ్ చేసే పని చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల, తండ్రి బలవంతం వల్ల బీఎడ్ చదివి టీచరవబోతున్న అమ్మాయిని ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటాడు. గుడిలో జరిగిన పెళ్ళి చూఫుల్లోనే కాస్త ఎక్కువ బొద్దుగా ఉన్న పెళ్ళికూతురు నచ్చదతనికి. ఒక అమ్మాయి బీయిడీ చదువుకుంది.. 'టీచర్ అవ్వాలన్నది ఆమె చిన్ననాటి కల' అన్న సంగతి ఇంకా నచ్చదతనికి. మరి తను 10th ఫెయిల్ కదా! చాలా అయిష్టంగానే ఒక సామూహిక వివాహవేదిక మీద సంధ్య వర్మ(
భూమీ పెడ్నేకర్) ను పెళ్ళాడతాడు ప్రేమ్ ప్రకాష్ తివారీ(ఆయుష్మాన్ ఖురానా). అదిమొదలు తన అయిష్టాన్నీ ప్రకటించడానికి అతగాడు, భార్యగా తన స్థానాన్ని కాపాడుకోవాలని సంధ్య చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏదీ కలిసిరాక ఒకానొక అవమానకరమైన సందర్భంలో అభిమానం దెబ్బతిని అత్తవారిల్లు విడిచి వెళ్పోయి, తర్వాత విడాకుల నోటీసు పంపిస్తుంది సంధ్య. విడాకుల మంజూరుకు ముందు ఓ ఆరునెలలు కలిసి ఉండమని ఆ జంటను కోర్టు ఆదేశిస్తుంది. ఈ ఆరు నెలల్లో ఏమౌతుంది? ఉత్తర దక్షిణ ధృవాల్లా మారిపోయిన ఆ భార్యాభర్తలు కలుస్తారా? అన్నది మిగిలిన చిత్ర కథ.




ఇక చెప్పుకోవాల్సింది హీరోయిన్ భూమీ పెడ్నేకర్ గురించి. కాస్త ఎక్కువ బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉందీ అమ్మాయి. మొదటి సినిమా అయినా నటనలో పి.హెచ్.డి ఇచ్చేయచ్చు. నటిగా మారే ముందు కాస్టింగ్ డైరెక్టర్ ట  అమ్మాయి! ఆ కాన్ఫిడేన్స్, ముఖ కవళికలు, భావ ప్రకటన అన్నీ చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ అమ్మాయి వాయిస్ ఎంత స్వీట్ గా ఉందో అసలు. కోపంలో ఉన్నప్పుడు హీరో అంటుంటే తప్ప లావు అనే పాయింటే గుర్తుకురాలేదు. అంత అందంగా నటించిందా అమ్మాయి. యాష్ రాజ్ ప్రొడక్షన్స్ లో మామూలుగా కనబడే చిట్టి పొట్టి దుస్తుల గ్లామరస్ అమ్మాయిలకు విభిన్నంగా!


ఈ ఇద్దరి తర్వాత హీరో తండ్రి పాత్రధారి సంజయ్ మిశ్రా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఇంతకు ముందు " jolly LLB" లో హవాల్దార్ పాత్రలో అలరించిన ఈ నటుడి ప్రతిభకు తగ్గ పాత్రలు ఇంతవరకూ ఎక్కువ దక్కలేదనే చెప్పాలి. హీరో ఇంట్లో ఉండే అతని మేనత్త పాత్ర కూడా గుర్తుండిపోతుంది. ఒక ఉదయాన ఆవిడ మరిది నుండి ఫోన్ వచ్చే సన్నివేశం చాలా టచ్చింగ్ గా ఉంది. హీరోయిన్ తల్లిగా వేసినావిడ చిన్నప్పుడు దూరదర్శన్లో ఫేమస్ అయిన "బునియాద్" సీరియల్లో ఉన్నారని గుర్తు. ఇక పదవ తరగతి చదివే సంధ్య తమ్ముడు చెప్పే డైలాగ్స్ భలే నవ్వు తెప్పిస్తాయి. హీరో హీరోయిన్స్ ఫ్యామిలీస్ రెండింటిలో అందరు కుటుంభ సభ్యుల మధ్యన అన్యోన్యత, దగ్గరతనం బాగా చూపించారు. ఫ్యామిలీ కోర్ట్ లో కుటుంబసభ్యులందరి మధ్యా వాగ్వివాదాలయ్యే సీన్ కూడా భలే నవ్వు తెప్పిస్తుంది. కోర్టులో కలవగానే వియ్యపురాళ్ళిద్దరూ కాగలించుకుని దు:ఖపడే సీన్ కదిలిస్తుంది.


 తొంభైల్లో పాపులర్ పాటల ద్వారా భార్యాభర్తలు తమ నిరసనలు వ్యక్తం చేసుకునే సీన్ సినిమాకే హైలైట్. హాల్లో అంతా పొట్ట చక్కలయ్యేట్టు నవ్వులే నవ్వులు. ఆ పాటలు తెలిసినవాళ్ళు ఆ సీన్ చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ సాంగ్స్ అన్నీ కూడా. ప్రేమ్ గదిలో చిందర వందరగా పడిఉన్న కేసెట్ల్స్ ద్వారా అతడి జీవితాన్ని, తాను వచ్చాకా అవి సర్దిన సంధ్య మనస్తత్వాన్నీ సింబాలిక్ గా బాగా చూపెట్టారు. చివర్లో భార్యను ఎత్తుకు పరిగెత్తే పోటీ కూడా భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక అనిపించింది. ఈ పోటీలో బరువుని ఎత్తడం అనే విషయం కన్నా ఇద్దరి మధ్యన ఉండే సంయమనమే విజయాన్ని ఇస్తుంది. పోటీ అయిపోయాకా ఆమెని దింపకుండా ఇంటిదాకా తీసుకుపోయే సీన్ నాకు బాగా నచ్చింది.



ఇంకా.. రెండు మూడు సన్నివేశాల్లో భార్యాభర్తలు లో గొంతుకల్లో గుసగుసగా మాట్లాడుకునే డైలాగ్స్,
వాళ్ళ మధ్యన నిశ్శబ్దం,
వాళ్ల కన్నీళ్ళూ,
వారి వారి స్థానాల్లో వారు కరక్టేననిపించే సందర్భాలూ,
రిక్షలో ప్రయాణాలు,
హరిద్వార్,
ఆ పాత పట్టణపు వాతావరణం,
చిత్ర సన్నివేశాల వెనుక మౌనంగా ప్రవహిస్తూ కనబడే పవిత్ర గంగానది,
ఓ పాటలో కనబడే లక్ష్మణ్ ఝూలా,
వేలితోనో పెన్ను తోనో పాడయిన కేసెట్ లోకి టేప్ చుట్టే సన్నివేశం,
ఇవన్నీ కూడా మనల్ని రకరకాల పాత ఙ్ఞాపకాల్లోకి తీశుకువెళ్ళి సినిమాతో బాగా కనక్ట్ అయ్యేలా చేస్తాయి.


మరో విశేషం ఇటాలియన్ కంపోజర్ Andrea_Guerra అందించిన అద్భుతమైన నేపధ్య సంగీతం.  నటీనటుల భావావేశాల ప్రవాహంలో మనల్నీ కొట్టుకుపోయేలా చేస్తుందీ సంగీతం.

చివరిగా ఏం చెప్పనూ... విభిన్నతకు నాంది పలికే ఓ మంచి నిజాయితీ నిండిన ప్రయత్నమీ చిత్రం. వాస్తవికతకు దగ్గరగా ఉండే ఇలాంటి అతి మామూలు సినిమాలు ఇంకా ఇంకా రావాలంటే మనం ఇలాంటి సినిమాలని ఆదరించాలి. చివరలో డ్యూయెట్ అనవసరం అనిపించింది. అంత చూసే ఓపిక మన జనాలకి ఉండదు కదా! షూట్ చేసేసిన పాటను మధ్యలో పెట్టే అవకాశం లేక చివరలో ఇరికించి ఉంటారనుకున్నాం
.

చిత్రంలో నాకు బాగా నచ్చిన పాట "Moh Moh Ke Dhage" మేల్ వర్షన్తో post పూర్తి చేస్తాను. 


***    ***

Friday, February 20, 2015

హృదయ తంతృల్ని మీటిన పాట..



నిశ్శబ్దాన్ని ప్రేమిస్తూ, ప్రపంచాన్ని పట్టించుకోకుండా ప్రశాంత ఏకాంత జీవితం గడిపే ప్రయత్నంలో ఉన్న నన్ను అక్షరాల వెంట పరుగులు పెట్టించడానికి వినపడిందో పాట ఇవాళ..! ఇక మౌనాన్ని వీడక తప్పలేదు. హృదయ తంతృలను కదిపే పాట విన్నప్పుడు, ఆ అనుభూతిని పంచుకోకుంటే మన ఆనందం కూడా సంపూర్ణమవ్వదు కదా..! 

సాయంత్రపు నడకలో రోజూలాగే రేడియో(102.8) వింటూ నడుస్తుంటే "స్వానంద్ కిర్కిరే" ఇంటర్వ్యూ చివరి భాగం మొదలైంది. ఆమధ్యెప్పుడో మొదటి భాగం విన్నాను. తరవాత అదే రోజు విన్నానో మర్చిపోయాను. రెండో భాగం మిస్సయ్యాను. మళ్ళీ ఇన్నాళ్ళకి అదృష్టవశాత్తూ మూడవ, చివరి భాగం వినడం అయ్యిందీవాళ. కార్యక్రమం మధ్యలో ఓ పాట వేసారు. అదే నా మనసుని కదిపింది..


గీత రచయిత, సంభాషణా రచయిత, గాయకుడు, నటుడు అయిన ఈ బహుముఖ ప్రఙ్ఞాశాలి మాటలు కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయి. "లుటేరా" చిత్రం కోసం ఈయన పాడిన "మోంటా రే" పాట గురించి ఇదివరకూ ’చలువ పందిరి’ లో రాసాను. ముంబై ఆకాశవాణి వారి మొదటి ఇంటర్వ్యూ లో తన సాహితీ ప్రస్థానం వివరాలు , ఇష్టమైన పాటలు గురించి చెప్పారు. ఇవాళేమో కొన్ని పాటలు ఎలా రాసారు, వాటి వెనుక కథలేమిటో చెప్పారు. నిజానికి ఈ సున్నితమైన భావాల్ని, ప్రేమల్ని, స్నేహాభిమానాలనీ, ఆప్యాయతలూ గట్రాలన్నింటిపై  నమ్మకమే పోయింది. (ఊ.. అచ్చంగా నేనే ఈ మాట అంటున్నది!!) కానీ ఎందుకో ఇవాళ ఈ గీత రచయిత మాటలు వింటుంటే ఇంకా ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి భావాలు మిగిలున్నాయేమో అన్న అనుమానం, ఆశ కలిగాయి. ఎందుకంటే ఒక పాట రాయాలంటే ఇలాంటి సున్నితమైన భావాలను నమ్మాలి.. ఆ భావంలో మమేకమవ్వాలి.. అప్పుడే లలితమైన పాట పుడుతుంది. ఈయన ఇలాంటి పాటలు ఇంకా రాయగలుగుతున్నారంటే మరి సున్నితత్వం ఇంకా బ్రతికే ఉందని నమ్మాలేమో..

ఇంతకీ ఈ పాట నాకు మాత్రమే కొత్తదని, ప్రపంచానికి పాతదేనని ఇంటికొచ్చి నెట్లో వెతికాక తెలిసింది. సినిమా పాట కాదు "సత్యమేవ జయతే" పేరిట టివీలో ప్రసారమైన కార్యక్రమం తాలూకూ పాట అదని. స్వయంగా రచయితే పాడారు. సో.. పాట పాతదే. మూడేళ్ళుగా కేబుల్ కనక్షన్ కి దూరంగా ఉన్నందువల్ల నాకు తెలీదు. తెలిసిన వాళ్ళూ మరోసారి, లేదా ఒకవేళ నాలా ఎవరన్నా తెలియనివాళ్ళు ఉంటే మొదటిసారి,  ఈ హృద్యమైన పాటను ఆస్వాదించండి..


పాటలో "हम नॆ सॊचा नही
तू जॊ उड जायॆगी
यॆ जमी तॆरॆ बिन
सूनी रेह जायॆगी
किसकॆ दुम पॆ सजॆगी मॆरा अंगना.."  అన్న వాక్యాలు వింటుంటే మన పాలగుమ్మి వారు రాసిన "అమ్మ దొంగా" పాటలో 
"ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా.. గూడు నిదురపోవునా.." లైన్స్ గుర్తుకు వచ్చాయి..

Monday, December 15, 2014

Holy Chants on Lord Ganesha & తోటకాష్టకమ్


క్రితం ఏడాదిలో అనుకుంటా మా అన్నయ్య Sacred Chants, Holy Chants సీరీస్ సీడీలు కొన్ని కొన్నాడు. ఫ్యూజన్ మ్యూజిక్ పధ్దతిలో చేసిన కొన్ని స్తోత్రాలూ, అష్టకాలు ఇందులో ఉన్నాయి. వినడానికి చాలా బావుండి, మనసులో అలజడిగా ఉన్నప్పుడు ప్రశాంతత నింపే విధంగా ఉన్నాయి సీడీలు. అన్నయ్య కొన్న చాలా రోజులకి ఈమధ్యనే అవి కాపీ చేసుకుని తెచ్చుకున్నా నేను. వాకింగ్ కి వెళ్ళినప్పుడు, వంటింట్లో పని చేస్కునేప్పుడు ఎఫ్.ఎం లు వినడం మానేసి ఇవే పెట్టుకుని వింటున్నా! చాలా బావుంటోంది. 

gaana.com లో చాలావరకూ ఈ సీడీలన్నీ వినడానికి దొరుకుతున్నాయి. Holy Chants సిరీస్ లో గణేషుడి మీద చేసిన ఆల్బం చాలా బాగుంది. ఆ లింక్ క్రింద ఇస్తున్నాను. ఇందులో ఎనిమిదవదైన 'Ganesha Stavarajaha' చాలా బావుంది. పాడినది - G. Gayatri Devi, Saindhavi, R. Shruti.

'Holy Chants on Lord Ganesha' మొత్తం సీడీ క్రింద లింక్ లో వినవచ్చు:
http://gaana.com/album/holy-chants-on-lord-ganesha


***


Sacred Chants

Sacred Chants series యూట్యూబ్ లో కూడా చాలానే లింక్స్ ఉన్నాయి.



***    ***


మామూలుగా నాకు తోటకాష్టకమ్ బాగా నచ్చుతుంది.  అష్టకాలు అవీ చదివేప్పుడు ఇది కూడా చదువుతూ ఉంటాము మేము. శంకరాచర్యులవారి శిష్యులైన తోటకాచార్యుడు ఆశువుగా చెప్పినదే ఈ తోటకాష్టకమ్. ఎక్కడో గుర్తురావట్లే కానీ ఈ తోటకాచార్యులవారి కథ ఈమధ్యనే చదివాం కూడా. ఈ ఫ్యూజన్ తోటకాష్టకం బాగుంది, North Indians పలికే విధానం అదే గానీ "భవ షంకర" "దేషిక మే రణం" మొదలైన పదాలే వినడానికి కష్టంగా ఉంది :( 





తోటకాష్టకమ్:
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే 
హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం 
కరుణావరుణాలయ పాలయమాం భవసాగరదుఃఖవిదూనహృదం 
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవశంకర దేశిక మే శరణం ll

భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే 
కలయేశ్వరజీవవివేకవిదం భవశంకర దేశిక మే శరణం

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసికౌతుకితా 
మమవారయ మోహమహాజలధిం భవశంకర దేశిక మే శరణం

సుకృతే ధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా 
అతిదీనమిమం పరిపాలయమాం భవశంకర దేశిక మే శరణం 

జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః 
అహిమాంశురివాత్ర విభాసిగురో భవశంకర దేశిక మే శరణం 

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోపి సుధీః 
శరణాగతవత్సల తత్త్వనిధే భవశంకర దేశిక మే శరణం

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తిగురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం ll

Monday, December 8, 2014

సంగీత కళాశిఖామణికి సంగీత నివాళి..


image from - google

సంగీత కళాశిఖామణి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి సంగీత నివాళి.._/\_

సంగీత విద్వాంసులు ఉన్నారు..ఇంకా పుడతారు... 
కానీ ఇటువంటి మహా విద్వాంసులు ఇక పుట్టబోరేమో...:(
ఈ అద్భుతమైన కచేరీ వినిపిస్తూ, నేను వింటూ ఆనందించడం మినహా ఏమీ చెయ్యగలను... చాలా అల్పురాలిని!



యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో డా.పప్పు వేణుగోపాలరావు గారితో శ్రీ కృష్ణమూర్తి గారి సంభాషణ... చివరలో యూనివర్సిటీవారికి ఆయన చెప్పిన సలహా వాళ్ళు పాటించారో లేదో తెలీదు మరి..

Friday, December 5, 2014

आज भी है मॆरॆ कदमॊं कॆ निशा आवारा..


మధుర గాయకుడు హరిహరన్ స్వయంగా స్వరపరిచిన "Horizon(1988)" అనే గజల్స్ ఆల్బం ఉండేది మా ఇంట్లో. హరిహరన్ వాయిస్ మొదటిసారి విన్నది అందులోనే నేను. ఆ ఆల్బమ్ లో మొత్తం ఎనిమిది గజల్స్ ఉంటాయి. అన్ని బాణీలూ హరిహరన్ వే .అన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. గజల్స్ మధ్యన వచ్చే సంతూర్ వాదన వింటుంటే మనసు ఎటో గాల్లో తేలిపోతూ ఉంటుంది. అంత బాగా స్వరపరిచారు హరిహరన్. ఆ కేసెట్లో మొదటి గజల్ "ఆజ్ భీ హై మెరే కద్మోం కే నిషా ఆవారా.." ! సాహిత్యాన్ని రాసినది ముమ్తాజ్ రషీద్

మొదటిసారి విన్న గజల్, అదీ హరిహరన్ వాయిస్ అవడంతో నాకు తెలిసిన గజల్స్ అన్నింటిలోకీ ఇది అత్యంత ప్రీతిపాత్రమైనదైపోయింది. కాస్త ఉదాసీనమైన సాహిత్యమని నేను వినడం మానేసాను కానీ ఇప్పటికీ చాలాసార్లు అప్రయత్నంగా నానోటి వెంట ఈ గజల్ వచ్చేస్తుంటుంది. ఇందులో "जिसकॊ भी चाहा उसॆ टूट कॆ चाहा राशिद.. कम मिलॆंगॆ तुम्हॆं हम जैसॆ यहां आवारा" అన్న వాక్యాలు పాడుకుంటే లోపల దాగున్న వేదనేదో తేలికైనట్లు అనిపిస్తుంది. ఈ గజల్ లో సాహిత్యం కన్నా హరిహరన్ తీసే గమకాలు నాకు చాలా ఇష్టం. మళ్ళి మళ్ళీ విన్నప్పుడు బాగా తెలుస్తాయి. 


Ghazal: Aaj bhi hai mere..
Lyrics: Mumtaz Rashid
Singer & Composer: Hariharan





సాహిత్యం:
ప: आज भी है मॆरॆ कदमॊं कॆ निशा आवारा
तॆरी गिलयॊं में भटकतॆ थॆ जहा आवारा
((आज भी है मॆरॆ..))

1
చ: तुझसॆ क्या बिछ्डॆ तॊ यॆ हॊगई अपनी हालत..
यॆ हॊगई अपनी हालत..
जैसॆ हॊ जाऎ हवावों में धुवां आवारा(२)
((तॆरी गिलयॊं में..))


2చ: मॆरॆ शॆरॊं की थी पेह्चान उसी कॆ दम सॆ..
उसी कॆ दम सॆ..
उसकॊ खॊ कर हुए बॆ­नाम­ निशा आवारा(२)
((तॆरी गिलयॊं में...))


3చ: जिसकॊ भी चाहा उसॆ टूट कॆ चाहा राशिद..
उसॆ टूट कॆ चाहा राशिद..
कम मिलॆंगॆ तुम्हॆं हम जैसॆ यहां आवारा(२)
((तॆरी गिलयॊं में...))


***   ***

ఈ ఆల్బమ్ లో మిగిలిన గజల్స్ లో
* फूल कॆ आस पास रेह्तॆ हैं
* हमनॆ काटी हैं तॆरी याद मॆं रातॆं अक्सर
* शराब ला.. शराब दॆ
* बन नही पाया..
* क्या खबर थी..
మొదలైనవవి చాలా బావుంటాయి. మొత్తమ్ ఆల్బమ్ ని క్రింద లింక్ లో వినవచ్చు:
http://play.raaga.com/hindi/album/ghazals­by­hariharan­horizon­g0000381


 

Monday, November 17, 2014

मोहब्बत करनेवाले कम ना होंगे..


ఇందాకా నెట్ లో వార్తలు చదువుతుంటే.. అమితాబ్ చెప్పిన వాక్యాలు విని లతాజీ కళ్ళల్లో నీళ్ళు తిరుగాయని, ఆవిడ ట్వీట్ చేసారన్న వార్త కనబడింది. (http://zeenews.india.com/entertainment/celebrity/when-amitabh-bachchan-made-lata-mangeshkar-cry_1500535.html)
ఆ వాక్యాలు ఒక ప్రముఖ గజల్ లోనివి. వెంఠనే గజల్ రారాజు మెహదీ హసన్ పాడిన "मोहब्बत करनेवाले कम ना होंगे" అనే ఆ అద్భుతమైన గజల్ వెతుక్కుని విని ఆనందించాను. నాలాంటి సంగీతప్రియుల కోసం ఇక్కడ షేర్ చేద్దామనిపించింది.


ఈ గజల్ సాహిత్యాన్ని రాసిన ఉర్దూ కవి పేరు అబ్దుల్ హఫీజ్. 'హోషియార్ పూర్' అనే ఊరివాడవడం వల్ల ఆయనను "హఫీజ్ హోషియార్ పురీ" అని పిలుస్తారు. మెహదీ హసన్ గళమే కాక ఈ గజల్ సాహిత్యం చాలా చాలా బావుంటుంది. ఇదే గజల్ ఇక్బాల్ బానో గారూ, ఫరీదా ఖన్నుమ్ గారూ పాడిన లింక్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. కానీ మెహదీ హసన్ పాడినది వింటుంటే మాత్రం గంధర్వ గానం.. అనిపించకమానదు!ఆ ఆలాపనలు.. స్వరం నిలపడం.. ఆహ్.. అంతే!

మెహదీ హసన్ మాటలతో ఉన్న ఓల్డ్ రికార్డింగ్:
http://youtu.be/NQ3rRwSl__8




సాహిత్యం:

मोहब्बत करनेवाले कम ना होंगे
तेरी महफ़िल में लेकिन हम ना होंगे

ज़माने भर के ग़म या इक तेरा ग़म
ये ग़म होगा तो कितने ग़म ना होंगे

अगर तू इत्तफ़ाक़न मिल भी जाये
तेरी फुरक़त के सदमें कम ना होंगे

दिलों की उलझनें बढ़ती रहेंगी
अगर कुछ मशवरे बहम ना होंगे

'हफ़ीज़' उन से मैं जितना बदगुमाँ हूँ
वो मुझ से इस क़दर बरहम ना होंगे

Tuesday, November 4, 2014

తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి..



ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసీ పూజ వేళ వినేందుకు గానూ తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి.. క్రింద వీడియోస్ లో:
(వీడియో లింక్స్ పనిచేయకపోతే పేర్ల క్రింద డైరెక్ట్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను.) 





తులసీ స్తోత్రం:
http://youtu.be/Dxptk_6cgss



తులసీ మంత్రం, తులసీ నామాష్టకం :
http://youtu.be/cAvzwnc16Ag




తులసీ వివాహం :
 https://www.youtube.com/watch?v=iWs142GBCVs



తులసీ హారతి:
http://youtu.be/T9JH9h0qL6M

Saturday, November 1, 2014

Kishori Amonkar - Drishti songs


image from google


1990 లో ఉత్తమ హిందీ చిత్రం జాతీయ  పురస్కారాన్ని అందుకున్న చిత్రం "దృష్టి". గోవింద్ నిహలానీ దర్శకత్వంలో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందుస్తానీ గాయని కిశోరీ ఆమోంకర్(Kishori Amonkar/किशोरी आमोणकर) సంగీతాన్ని చేసారు. నాలుగు పాటలూ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతబాణీలే. పాటలు కూడా ఆమే పాడారు. ఒకటి మాత్రం డ్యూయెట్ ఉంది. అది కూడా హిందుస్తానీ శాస్త్రీయ బాణిలోనే ఉంటుంది. సాహిత్యం వసంత్ దేవ్. 



ఈ చిత్రంలో రెండు పాటలు యూట్యూబ్ లో దొరికాయి.. రెండూ చాలా బావుంటాయి. 

1.)మేఘా ఝర్ ఝర్ బర్సత్ రే.. 
ఇది ఏ రాగమో గానీ అద్భుతంగా అనిపిస్తుంది ఈ పాట.. 
(సంగీతం మరియు గాయకురాలు: కిశోరీ ఆమోంకర్) 



 2) ఏక్ హి సంగ్ హోతే.. జో హమ్ తుమ్.. కాహే బిఛురారే... (ఈ పాట క్రింద ఇచ్చిన గానా.కామ్ లింక్ లో క్లియర్ గా ఉంది) ఈ పాట వింటుంటే 'రుడాలీ' లో "సునియో జీ అర్జ్ మ్హారీ.. " పాట గుర్తుకు వస్తుంది.. బహుశా రెండూ ఒకటే రాగమై ఉంటాయి. 

  

 'ఆలాప్' తో పాటూ చిత్రంలో అన్ని పాటలూ gaana.com లింక్ లో వినచ్చు: http://gaana.com/album/drishti-hindi



Friday, October 31, 2014

Surdas Bhajans - M.S. Subbalakshmi

ఫోటో కర్టసీ: గూగుల్

పదిహేనవ శతాబ్దానికి చెందిన సంత్ సూరదాసు(सूरदास) ప్రసిధ్ధి చెందిన కవి, వాగ్గేయకారుడు, కృష్ణభక్తుడు. పుట్టుకతో అంధుడైన సూరదాసుకి పేదరికం మూలానో ఏమో తల్లిదండ్రుల లాలన అందక ఆరేళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టేసి వ్రజ్ లో స్థిరపడిపోయాడు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మథురానగరి సమీపంలోని ప్రాంతం ఇది. సుధ్ధాద్వైత గురువు వల్లభాచార్యులు అతడిని శిష్యుడిగా స్వీకరించి ఆదరించాకా అతని జీవితం మెరుగుపడి భక్తిమార్గంలో పయనించింది. ఉత్తర భారతదేశంలో అప్పట్లో ప్రబలంగా ఉన్న Bhakti movementలో సగుణ భక్తి , నిర్గుణ భక్తి అని రెండు శాఖలుండేవి. సగుణ భక్తి శాఖలో కృష్ణ భక్తి, రామ భక్తి అని మళ్ళీ రెండు శాఖలు. అందులో 'కృష్ణభక్తి శాఖ'కి సూరదాసు చెందుతాడు. 


సూరదాసు రచనలన్నీ 'సూర్ సారావళి', 'సాహిత్య లహరి', 'సూర్ సాగర్'  అనే మూడు గ్రంధాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. సూరదాసు వందలు వేలల్లో రాసిన రచనలు చాలావరకూ అందుబాటులో లేవని చెప్తారు. మూడూ గ్రంధాల్లోనూ కృష్ణుడి లీలాగానామృతంతో నిండి ఉన్న 'సూర్ సాగర్' బాగా ప్రసిధ్ధి చెందింది. అంధుడైన వ్యక్తి కృష్ణలీలలను అంత అద్భుతంగా కన్నులకు కట్టినట్లు ఎలా రచించగలిగాడని అంతా ఆశ్చర్యపోయేవారుట. కృష్ణలోలలను వర్ణిస్తూ సాగే సూరదాసు భజనలు పిక్చరస్క్ గా , 'మధురాష్టకం'లాగ ఎంత మధురంగా ఉంటాయో మాటల్లో చెప్పడం కష్టం. 


ఇటువంటి మధురమైన సూరదాసు భజనలు కొన్నింటిని గానకోకిల ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారితో పాడించారు HMVవారు పదిహేనేళ్ళ క్రితం. కేసెట్ లో మొత్తం ఎనిమిది భజనలు ఉన్నాయి. అవన్నీ క్రిం ఉన్న raaga.com లింక్ లో వినవచ్చు:
http://play.raaga.com/hindi/album/The-Spiritual-Voice-Of-MSS-Surdas-Bhajans-hd001394

Track list:  
1) Prabhuji tum bin kaun sahaai
2) Nis din basrat nain hamaari
3) Raakho laaj hari tum meri
4) Kunjani kunjani Bbjati murli
5) Akhiyan hari darshan ki pyasi
6) Madhuban tum kyon rahat hare
7) He deen dayal gopal hari
8) Suneri maine nirmal ke balram


యూట్యూబ్ లో ఒక మూడు భజనలు దొరికాయి..
1) అఖియా హరి దర్శన్ కీ ప్యాసీ...

 


 2) ప్రభుజీ తుమ్ బిన్ కౌన్ సహాయ్.. 





3) "మైయ్యా మోరీ మై నహీ మాఖన్ ఖాయో..." (ఇది కేసెట్ లో లేదు కానీ సూరదాసు భజనే)






 *** *** ***

3) "ప్రభుజీ మోరే అవగుణ్ చిత్ న ధరో.. " అని సాగే ఈ సూరదాస్ భజన నాకు చాలా ఇష్టం. "స్వామి వివేకానంద" చిత్రంలోనిది.
గాయని: కవితా కృష్ణమూర్తి

  

Thursday, October 30, 2014

Meghadutam - Vishwa Mohan Bhatt


భారతీయ తంత్రీవాయిద్యాలైన వీణ, సితార, సంతూర్ మొదలైనవాటికి తోడుగా పాశ్చాత్య వాయిద్యాలైన వయొలిన్, గిటార్, మేండొలిన్ మొదలైన వాయిద్యాలను కూడా శాస్త్రీయ సంగీత వాదనకు జతపరిచారు మన భారతీయ సంగీతకారులు. విచిత్ర వీణ, సరస్వతి వీణ, రుద్ర వీణ మొదలైన రకరకాల వీణలను శాస్త్రీయ సంగీతకారులు ఉపయోగిస్తారు. పాశ్చాత్య వాయిద్యమైన హవాయీన్ గిటార్ ను కొద్దిగా మార్చి "మోహన వీణ" అనే పేరుతో ప్రాచుర్యం లోకి తెచ్చారు హిందుస్తానీ సంగీత కళాకారులు, గ్రామీ అవార్డ్ గ్రహీత, పద్మశ్రీ పండిట్ విశ్వమోహన్ భట్ గారు.

శ్రీ విశ్వమోహన్ భట్ గారు వాద్యకారులే కాక సంగీతకారులు కూడా. కాళిదాసు 'మేఘదూతం' లోంచి ఒక పన్నెండు శ్లోకాలను తీసుకుని వాటికి విశ్వమోహన్ భట్ గారితో స్వరాలను ఆడియో కేసెట్ గా చేయించారు 'MUSICTODAY' వాళ్ళు 2002లో. ప్రముఖ గాయకులు హరిహరన్, కవితా కృష్ణమూర్తి, రవీంద్ర సాఠే గార్లు ఆ సంస్కృత శ్లోకాలకు స్వరాలాపన చేసారు. ఇందులో వాడిన వాయిద్యాల్లో 'మోహన వీణ' విశ్వమోహన్ భట్ గారే వాయించారు. మ్యూజిక్ ఎరేంజ్మెంట్ పండిట్ రోనూ మజుందార్ చేసారు. మధ్య మధ్య ఉపయోగించిన సంతూర్ వాదన కూడా చాలా మనోహరంగా ఉంటుంది.


 చాలారోజుల నుండీ ఆ కేసెట్ గురించి పోస్ట్ రాద్దామని.. ఇన్నాళ్ళకు కుదిరింది. లక్కీగా యూ ట్యూబ్ లో కవితా కృష్ణమూర్తి పాడిన ఒక్క ట్రాక్ (On Amrakuta Peak) దొరికింది..




Track list:
1. The Forlorn Yaksha 
Hariharan

2. Invocation To The Cloud 
Hariharan

3.The Path Of The Cloud
Hariharan

4. On Amrakuta Peak
Kavitha Krishna Murthy

5. Ripening Earth
Ravindra Sathe

6. Detour To Ujjain
Vishwa Mohan Bhatt(Instrumental)

7. The River Nirvindhya
Kavitha Krishna Murthy

8. The Mansions Of Ujjain
Kavitha Krishna Murthy

9. The Majesty Of Kailash
Ravindra Sathe

10. The Beautiful Yakshi
Kavitha Krishna Murthy

11. Lovelorn Yaksha
Ravindra Sathe

12. Farewell To The Cloud

Ravindra Sathe

raaga.com వాళ్ల దగ్గర ఈ కేసెట్ ఆడియో లింక్ ఉంది. మొత్తం పన్నెండు ట్రాక్స్ audio క్రింద ఉన్న రెండు లింక్స్ లో దేనిలోనైనా వినవచ్చు:

http://play.raaga.com/worldmusic/album/Kalidasas-Meghdutam-The-Cloud-Messenger-WM00111
or 
http://www.napster.de/artist/various-artists/album/kalidasas-meghdutam-the-cloud-messenger/

Wednesday, October 29, 2014

Pandit Jasraj's charukesi..



నాకెంతో ప్రియమైన హిందుస్తానీ గాయకులు శ్రీ పండిట్ జస్రాజ్ గారు...
సంగీతఙ్ఞుడిగానే గాక వ్యక్తిగా కూడా ఇష్టుడు నాకీయన. సాదాసీదాగా, చలాకీగా ఉంటారెప్పుడూ. ఎనభై ఏళ్ళ పైబడినా ఇంకా ఎంతో ఎనర్జిటిక్ గా చెక్కుచెదరని చిరునవ్వుతో కనబడుతూ ఉంటారు. 


పూర్వజన్మ పుణ్యాన ఇలా భారతావనిపై జన్మించి వారి ఖాతాలో ఉన్న సంగీతామృతాన్ని మనలపై చల్లేసి మాయమైపోయారు మన దేశంలో ఎందరో సంగీత విద్వాంసులు..


Wednesday, October 15, 2014

Uyire Uyire, Vennilave Vennilave.. & others


అర్జెంట్ గా ఊరు వెళ్ళాల్సిన పని వచ్చింది.. అందుకని ఈ టపాతో ఈ సిరీస్ ఎండ్ చేసేస్తున్నాను.. నా లిస్ట్ లో మిగిలినవన్నీ కలిపి ఒకే టపాలో ఇరింకించేస్తున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు చూడండి :)


***   ***    ***


ఇవాళ మొదట బొంబాయి సినిమాలో నాకెంతో ఇష్టమైన + నా ఫేవొరేట్ సింగర్ పాడిన పాట..  Uyire  Uyire..






Minsara Kanavu



తమిళంలో "Minsara Kanavu", తెలుగులో "మెరుపు కలలు", హిందీలో "సప్నే" పేర్లతో వచ్చిన మూడు భాషల్లోని పాటలూ బోల్డంత పాపులర్ అయిపోయాయి. ముఖ్యంగా "Ooh la la la.."!! నాకింకా "Anbendra.."(చర్చ్ లో జీసస్ దగ్గర కాజోల్ పాడే పాట), "Vennilave Vennilave.." పాటలు ఇష్టం. ఇది కూడా హరిహరన్ పాడినదే :)

అన్ని పాటలూ క్రింద లింక్ లో వినచ్చు: http://play.raaga.com/tamil/album/minsara-kanavu-t0000099 


బాగా ఇష్టమైన Vennilave Vennilave.. 




Kandukondain Kandukondain 


ప్రముఖ ఆంగ్లరచయిత్రి జేన్ ఆస్టిన్ నవల 'Sense and Sensibility'  ఆధారంగా తీసిన Kandukondain Kandukondain కూడా తెలుగులో 'ప్రియురాలు పిలిచింది' పేరుతో వచ్చింది. నాకిష్టమైన చిత్రాల్లో ఒకటి..:)
రెండు భాషల్లోని పాటలూ చాలా బావుంటాయి. రెహ్మాన్ ట్యూన్స్ కి వైరముత్తు సాహిత్యం. ఈ చిత్రంలో ఒకటీ, రెండూ అని చెప్పలేనంతగా పాటలు అన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. అందుకని అన్ని పాటలూ వరుసగా ఉన్న లింక్ ఇస్తున్నాను. 

 




                                        Rhythm




మళ్ళీ రెహ్మాన్ స్వరాలనందించిన మరో చిత్రం "రిథిమ్". సిన్మా బావుంటుంది. ఇందులో పాటలన్నీ ఫైవ్ ఎలిమెంట్స్(గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు) ని గుర్తు చేసేవిగా స్వరపరిచారు. 

ఈ ఐదు పాటల్నీ క్రింద లింక్ లో వినవచ్చు: http://play.raaga.com/tamil/album/Rhythm-T0000257 

యూట్యూబ్ లో అయితే ఇక్కడ వినచ్చు. 



Julie Ganapathy


బాలూ మహేంద్ర దర్శకత్వం వహించిన "Julie Ganapathy" చిత్రానికి 'Misery' అనే ఆంగ్ల చిత్రం ఆధారం. ఇందులో సరిత, జయరామ్, రమ్యకృష్ణ ముఖ్యతారాగణం. మెలోడియస్ గా ఉండే ఈ చిత్రగీతాలకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. రెండు పాటల్ని అప్పట్లోనే(అంటే సుమారు పంతొమ్మిది ఇరవై ఏళ్ల వయసులోనే) శ్రేయా ఘోషాల్ పాడారు. ఇతర భాషా గాయని అని పట్టుకోలేని విధంగా పాడగలగమే ఈ అమ్మాయిలోని టాలెంట్. మరోటి ఏసుదాస్, ఇంకోటి వారబ్బాయి విజయ్ ఏసుదాస్ పాడారు. చివరి పాట ప్రసన్న పాడారు. ఇది రమ్యకృష్ణ సోలో హాట్ సాంగ్ . ట్యూన్ బావుంటుంది. అందులో ముఫ్ఫై ఐదేళ్ళు దాటిన నటిలా ఏమాత్రం కనబడదీవిడ. అందుకే మరి రెండు మూడేళ్ళకే కనుమరుగయ్యే ఇప్పటి హీరోయిన్స్ లా కాక చాలా ఏళ్ల పాటు దక్షిణాది భాషాచిత్రాలన్నింటిలో తన ప్రతిభను కనబరచగలిగారు. 

ఈ చిత్రంలో పాటలన్నీ క్రింద లింక్ లో వినవచ్చు: http://play.raaga.com/tamil/album/Julie-Ganapathy-T0000469


 *** *** *** 

ఈ సిరీస్ ని మొదటి నుండీ ఫాలో అయినవారెవరైనా ఉంటే.. ఓపిగ్గా చదివినందుకు వాళ్ళకి ధన్యవాదాలు.


Tuesday, October 14, 2014

'Minnale' songs


మిన్నలె, చెలి, రెహ్నా హై తేరే దిల్ మే.. పేర్లతో మూడు భాషల్లోనూ వచ్చిన ఈ సినిమా పాటలు మూడూ భాషల్లోనూ సూపర్ డూపర్ గా హిట్ అయిపోయాయి. సాహిత్యం, భాషల కన్నా సంగీతానికే ఇక్కడ మార్కులు పడ్డాయి. ప్రతి గల్లీలో, ట్రైన్లో, టివీల్లో, రేడియోలో అన్నిచోట్లా రిలీజైన కొన్నాళ్ళ పాటు ఈ పాటలే. సంగీత దర్శకుడిగా "హేరిస్ జైరాజ్" మొదటి సినిమా అనుకుంటా ఇది. ఈ తమిళ్ సాంగ్స్ కేసెట్ పెట్టుకుంటే అటు, ఇటు రెండు పక్కాలా అయ్యేకే ఆపేవాళ్ళం మేము. పాటల కోసం, మాధవన్ కోసం సినిమా చూసాం కానీ భరించడం చాలా కష్టం అయ్యింది. కేవలం పాటల్ని విని ఆస్వాదించాల్సిందే తప్ప కథ జోలికి, సినిమా జోలికీ వెళ్ళకూడని సినిమాల కోవలోకి వస్తుందీ సినిమా! 

చాలా మొదట్లో మాధవన్ జీ టివీలో "బనేగీ అప్నీ బాత్" అనే సీరియల్ లో వేసేవాడు. అప్పట్లోనే మా ఫ్రెండ్స్ అందరం తెగ మెచ్చేసుకునేవాళ్ళం భలే ఉంటాడు, బాగా ఏక్ట్ చేస్తాడని. ఆ సీరియల్ కూడా బావుండేది. సాగీ..సాగి..సాగీ...ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ టైటిల్ సాంగ్ కూడా రికార్డ్ చేసుకున్నా అప్పట్లో. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడీ అబ్బాయ్. ఇతని నవ్వు చాలా బావుంటుంది. Sweet smile!


మళ్ళీ పాటల్లోకి వచ్చేస్తే... ఈ పిక్చర్ థీమ్ మ్యూజిక్ ను ఫోన్లలో కాలర్ ట్యూన్ గా ఇప్పటికీ పెట్టుకుంటున్నవాళ్ళు ఉన్నారు. 

 థీమ్ మ్యూజిక్ ..



అన్నింటిలోకీ నాకు బాంబే జయశ్రీ పాడిన "వసీగరా.." చాలా చాలా ఇష్టం. ఏ రాగమో కనుక్కోవాలి.. 

 



అన్ని పాటలూ క్రింద లింక్ లో వినచ్చు:



Monday, October 13, 2014

'Duet' songs


పదే పదే కొన్ని పాటల్ని కేవలం సంగీతం కోసమే వినాలనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం ఆ మ్యూజికల్ ఇంట్రస్ట్ వల్లే. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన అద్భుతమైన ట్యూన్స్ లో కొన్ని బాలచందర్ చిత్రం "డ్యూయెట్" లోని పాటలు. సినిమా ఓ మాదిరిగా ఉంటుంది. కేవలం పాటల కోసం భరించాలంతే. అసలు సినిమా వచ్చిన కొత్తల్లో ఆ తమిళ్ పాటలు ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖలేదు. నాకు ఆ తెలుగు డబ్బింగ్ పాటలు నచ్చక తమిళ్ కేసెట్ కొనుక్కుని అవే వినేదాన్ని. బాలూ కూడా ఎంతో అద్భుతంగా పాడారా పాటలను. అన్నింటికీ సాహిత్యం వైరముత్తు రాసారుట.


ఈ ఆల్బం కి 'రాజు' ఏ.ఆర్.రెహ్మాన్ అయినా 'మంత్రి' మాత్రం పద్మశ్రీ కద్రి గోపాల్నాథ్ గారే! ఆ Sax.. మెస్మరైజింగ్ అసలు!! ఈ ఆల్బంలో టైటిల్ ట్రాక్స్ కాకుండా మిగిలిన చిన్న చిన్న Sax bits రాజు అనే ఆర్టిస్ట్ ప్లే చేసారని వికీ చెప్పింది. మొత్తం పాటలు saxophone instrumental bitsతో పాటుగా వినాలంటే క్రింద ఉన్న రాగా.కామ్ లింక్ లో  వినవచ్చు :  http://play.raaga.com/tamil/album/duet-t0000042


యూట్యూబ్ లింక్స్ నాకు బాగా నచ్చే మూడూ పాటలకి మాత్రమే పెడుతున్నాను.. 

1) ఎన్ కాదలే ఎన్ కాదలే.. 

SPB voice అల్టిమేట్ అసలీపాటలో..




2)Vennilaavin Therileri.. 

amazing interlude bits..
 


3) anjali anjali..

just for the tune.. 
 


ఇంకా ఇవి కూడా సరదాగా బావుంటాయి...
 Kulicha Kuttalam 

Katheerika Gundu Katheerika 

Sunday, October 12, 2014

Veesum Kaatrukku..


"ఉల్లాసం" అని ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వచ్చింది. అజిత్, విక్రమ్, మహేశ్వరి.. ఇంకా రఘువరన్, బాలు కూడా ముఖ్యపాత్రల్లో నటించారు. "ఉల్లాసం" పేరుతోనే తెలుగులోకి డబ్బింగ్ చేసారు. అందులో రెండు మూడు పాటలు బావుంటాయి. కార్తీక్ రాజా నే సంగీతం. అన్నింటిలోకీ "Veesum Kaatrukku " అని ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాటొకటి నచ్చేది నాకు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కూడా బావుంటుంది. ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఎక్కడో విన్నట్టు అనిపించేది. ఓ రోజు నాన్న కేసేట్లలో వెతికి ఈ పాట అసలు మాతృక కనిపెట్టాను. ఉల్లాసం సినిమా రాక ముందు "Pocahontas" అనే యేనిమేషన్ ఫిల్మ్ ఒకటి వచ్చింది. నాకు బాగా నచ్చే యేనిమేషన్స్ లో ఒకటి అది. ఇందులో "Can you paint with all the Colors of the Wind" అనే పాటకు అకాడమీ అవార్డ్ వచ్చింది. చాలా బావుంటుందా పాట . ఇది కాక అందులో "Listen With Your Heart.. you will understand " అనే మరో పాట ఉంది. ఈ పాట పల్లవి, పల్లవి ముందర వచ్చే వేణువాదన tune ఆ పాటలోనిదే. ముందర తమిళ్ సాంగ్ వినేసి, తర్వాత క్రింద ఉన్న ఇంగ్లీష్ సాంగ్ కూడా వినండి.. తెలుస్తుంది మీకు.





Pocahontas - Listen With Your Heart  


ఈ సిన్మాలో ఇంకా Yaro yar yaro... , Muthae muthamma పాటలు బావుంటాయి.