సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label లలిత సంగీతం. Show all posts
Showing posts with label లలిత సంగీతం. Show all posts

Friday, January 3, 2014

మరచిపోవబోకె బాల..

అడివి బాపిరాజు


కవి, చిత్రకారుడు, నాటక కర్త, స్వాంతంత్ర్య సమరయోధుడు, మానవతావాది, లాయరు, ప్రిన్సిపాల్, పాత్రికేయుడు, గాయకుడు, కళా దర్శకుడు, అయిన అడివి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి. తన గేయాలను చాలావరకూ ఆయన పాడి మిత్రులకు వినిపించేవారుట. గాంధీజీని గురించి ఆయన పాడుతూంటే తన్మయంతో వినేవారుట అందరూ. బాపిరాజు గారి గేయాలలో "మరచిపోవబోకె బాల" నాకు బాగా నచ్చుతుంది. ఈ గీతంలోని భావానికి అంతే చక్కని సంగీతాన్నీ, మధురమైన గాత్రాన్నీ అందించి శ్రీ కె.బి.కె. మోహన్ రాజు గారు ఆ అక్షరాల్లోని ఆత్మను తన గాత్రంలో నింపుకుని పాడారేమో అనిపిస్తుంది..


ఈ గీతాన్ని క్రింద లింక్ లో వినవచ్చు.. అక్కడ లిస్ట్ లో మూడవ పాట..
http://kbkmohanraju.com/songslist.asp?tab=Lalithageethalu#

సాహిత్యం: 

మరచిపోవబోకె బాల మరచిపోవకే
అరచి అరచి పిలువలేను 
తరిచి తరిచి వెదకలేను
పరచి ఎగురుకాంక్షలతో 
పడిచెదురును నా గుండెలు
((మరచిపోవబోకె బాల ))

హోరుమనేవారి రాశి 
మారుమోగె నా పాటలు
విరిగిపడే తరగలలో 
నురుగులలో పరుగులలో
((మరచిపోవబోకె బాల ))

ఒఖ్ఖడ్నేఇసుకబయలు
ఒఖ్ఖడ్నే కదలిచదలు
దవ్వుదవ్వుల జరిగిపోవు 
దశదిశాంతరాళమందు
((మరచిపోవబోకె బాల ))

అదుముకున్న నీ తలపుల 
చిదికిరాలు హృదయసుమము
ఏరలేను రేకలను 
ఏరలేను పుప్పొడిని
((మరచిపోవబోకె బాల ))



Saturday, October 27, 2012

శ్రీమతి బి.వరహాలుగారు పాడిన "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే..."




ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి స్మృత్యర్థం ..

ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి లలిత గీతాల్లో "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే "నాకు చాలా ఇష్టమైన పాట. 

రాత్రిపూట పిల్లలను జోకొడుతూ "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే నాకు బెంగ.." అని పాడే తల్లులు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. నామటుకు నేనే చిన్నప్పుడు ఫ్యామిలీ గేదరింగ్స్ లో.. ఈ పాట తప్పక పాడేదాన్ని. నేను పాడకపోతే " అమ్మదొంగా నువ్వు పాడకుంటే నాకు బెంగ .." అని మా మావయ్యా పాడేవాడు :) 

బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో ఈ పాట గురించి ఒక టపా కూడా రాసాను. అది వేదవతీ ప్రభాకర్ గారు పాడిన పాట. అదే బాగా ప్రచారంలోకి వచ్చింది కూడా. కానీ ఇదే పాటను శ్రీమతి ’బి.వరహాలు’ అనే గాయని విజయవాడ రేడియోస్టేషన్ కొరకు పాడారు. వరహాలు గారి మధురమైన స్వరంలో అది కూడా బావుంటుంది.


శ్రీమతి బి.వరహాలుగారు పాడిన "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే..." క్రింద లింక్ లో వినవచ్చు:





సాహిత్యం:
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ(2)

కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

కధ చెప్పే దాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తొచనీక మూతిముడిచి చూసేవు
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు నీవైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే పదివేలు
కలతలు కష్టాలు నీదరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే... నాకు బెంగ !!
====================

అమ్మదొంగా వేదవతీ ప్రభాకర్ గారు పాడిన పాట క్రింద వినవచ్చు. ఇది నేను ఎప్పుడో టివిలో వస్తుంటే చేసుకున్న రికార్డింగ్.

 

Wednesday, June 13, 2012

మల్లాది సూరిబాబు గారి "వేదనలో హాయికై.."



మల్లాది సూరిబాబు గారి గురించీ, ఆయన పాడిన "వీడకుమా విడనాడకుమా" పాటతో పాటుగా తృష్ణ లో ఓ టపాలో రాసాను. (http://trishnaventa.blogspot.in/2011/03/blog-post_16.html)

నాకెంతో ఇష్టమైన వారి గళం నుండి మరో లలిత గీతం.. " వేదనలో హాయికై వెదకువాడను నేను" చాలా బావుంటుంది. ఆయనే స్వరపరుచుకున్నారు ఈ పాట. విని ఆ హాయిలోని వేదనని మీరూ వినేయండి..





వేదనలో హాయికై వెదకువాడను నేను
వెతనైనా నన్నేలా బ్రతుకనీయవే చెలీ
వేదనలో హాయికై...(2)

కోమలీ...(2) నీ కన్నుల కోపాగ్ని రగిలినా(2)
కోరి చేరితిని..
ప్రళమమో విలయమో(2)
((వేదనలో))

తరుణీ...(2) నీ మృదుమోవి దూషణలే దూసినా(2)
తపియింతును వాటికై
విరహమో వివశమో(2)
((వేదనలో))

వెలది చషకము బూని దోసిళ్ళే నింపినా
వెలది...(2) వెలది చషకము బూని దోసిళ్ళే నింపినా
విషమై నను గ్రోలెదనో...(2)
తాపమో దాహమో...(2)
((వేదనలో))


చాలా తక్కువ క్వాలిటి తో ఉన్న ఈ ఆడియోను ఈమాత్రం వినేలా బాగుచేసిపెట్టిన మా అన్నయ్యకి బోలెడు థాంక్యూలు.


Monday, December 19, 2011

ద్వారం లక్ష్మిగారు పాడిన "పూవులేరి తేవే చెలి"


"పూవులేరి తేవే చెలి" పాట తెలియనివారుండరు. ఈపాటను టివీలో ద్వారం లక్ష్మి గారు పాడే రోజుల్లో ఆవిడ పాట ఏది వచ్చినా సరే ఎక్కడున్నా పరిగెట్టుకుని వచ్చి వినేస్తూ ఉండేవాళ్ళం. కొన్నేళ్ళ తరువాత నాన్నగారి అవార్డ్ ప్రోగ్రాంలో ఆవిడ పాడటానికి బెజవాడ వచ్చినప్పుడు, గొంతు బాగోలేకపోయినా మా ఇంటికి వచ్చి పాట పాడి వెళ్ళారు. అదొక మరపురాని జ్ఞాపకం.

ఓసారి టివీలోనే వస్తూంటే రికార్డ్ చేసుకున్న "పూవులేరి తేవే చెలి" పాట ఇక్కడ పెడుతున్నాను...అప్పట్లో కుదిరిన విధంగా ఈ మాత్రం రికార్డ్ అయ్యింది. చాల రోజులనుంచీ వెతుకుతూంటే ఇన్నాళ్ళకు కేసెట్ దొరికింది.

ఆడియో:



సాహిత్యం:

ప: పూవులేవి తేవే చెలి పోవలే కోవెలకూ
నీవలె సుకుమారములూ,
నీ వలెనే సుందరములు
పూవులేవి తేవే చెలి పోవలే కోవెలకూ(3)

1చ: తుమ్మెద కాలూననివీ, దుమ్ము ధూళి అంటనివి
కమ్మగ వలచేవి, రకరకమ్ముల వన్నెలవీ
పూవులేవి తేవే చెలీ పోవలే కోవెలకూ

2చ: ఆలసించెనా పూజా వేళ మించిపోయెనా
ఆలయమ్ము మూసి పిలుపాలింపడు ప్రభువు
పూవులేవి తేవే చెలీ పోవలే కోవెలకూ

3చ: మాలలల్లుటెపుడే.. నవమంజరులల్లేదెపుడే
ఇక పూలే పోయాలి తలంబ్రాలల్లే స్వామి పైన
పూవులేవి తేవే చెలి పోవలే కోవెలకూ..


Monday, July 6, 2009

శ్రీమతి రావు బాల సరస్వతీదేవి గారి "బంగారు పాపాయి"



శ్రీమతి రావు బాల సరస్వతీదేవి గారి కంఠం తెలుగు లలిత సంగీతప్రియులందరికీ సుపరిచితం.తెలుగు సినిమాలలో మొదటి నేపధ్యగాయణీమణులలోఈమె ఒకరు.తీయదనం,మాధుర్యం నిండిన ఆమె స్వరం ఎందరికో ప్రీతిపాత్రం.ఆమె పాడిన లలితగీతాలలో ఒక పాటను ఇవాళ ఈ టపాలోపరిచయం చేస్తున్నాను.
ఈ పాటను ప్రముఖ వైణికులు,అప్పటి హైదరాబాద్ రేడియోస్టేషన్ లో మ్యుజిక్ ప్రొడుసర్ గా పనిచేసిన మంచాల జగన్నాధరావు గారు రచించారు.సంగితం సమకూర్చినవారు సాలూరి హనుమంతరావుగారు.ఈయన సాలూరి రాజేస్వరరావుగారి సోదరులు. పాడినది:రావు బాల సరస్వతీ దేవి గారు. సాహిత్యం+ పాట లింక్

బంగారు పాపాయి బహుమతులు పొందాలి(2)

పాపాయి చదవాలి మా మంచి చదువు(2)
పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి
కళలన్నిచూపించి
ఘనకీర్తి తేవాలి

ఘన కీర్తి తేవాలి (2)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు

మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప
ఎవ్వరీ పాప అని ఎల్లరడగాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు(2)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు(2)

తెనుగు దేశము నాది తెనుగు పాపను నేను(2)
అని పాప జగమంత చాటి వెలిగించాలి
మా నోములపుడు మాబాగ ఫలియించాలి(2)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు
***********************************

(ఈ లలిత గీతం కావాలని మాలా కుమార్ గారు ఆడిగారు. క్యాసెట్ వెతికి ఇవాళ mp3 లోకి మార్చి ఈ పోస్టులో పెడ్తున్నాను.ఒక పాట కావాలంటే ...అది ఎక్కడ దొరుకుతుందో అని దాని కోసం వెతకటం...చివరకు ఆ పాట దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు స్వీయానుభవం.నా వల్ల ఒకరి చిరకాల కోరిక తీరే అవకాశం కలిగితే అంత కన్నా కావలసినదేముంటుంది?మాలాకుమార్ గారు,ఇదిగో పాట.)