సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label పండుగలు పర్వదినాలు. Show all posts
Showing posts with label పండుగలు పర్వదినాలు. Show all posts

Tuesday, November 11, 2014

కోటి దీపోత్సవం





నాగయ్య గారి 'త్యాగయ్య' సిన్మాలో ఆయన "ఎందరో మహానుభావులు.." పాడాకా, ఆ సభలో ఒకరు "బ్రహ్మానందాన్ని కలిగించారు త్యాగయ్య గారూ.." అంటారు. అలాక నిన్న అనుకోకుండా మాకు బ్రహ్మానందాన్ని కలిగించారు మా గేటేడ్ కమ్యూనిటీ మిత్రులొకరు. నగరంలో ఎన్.టి.ఆర్. గార్డెన్స్ లో పదిహేనురోజులుగా జరుగుతున్న భక్తి టివీ వారి "కోటి దీపోత్సవం" వి.ఐ.పి పాసులు ఇచ్చారు. మొన్న(ఆదివారం) వాళ్ళు వెళ్తూ వెళ్తూ మమ్మల్నీ తీసుకువెళ్దాం అనుకున్నారుట గానీ మావారి ఫోన్ లైన్ దొరక్క వాళ్ళు వెళ్ళివచ్చేసారుట. అదే మాకు మంచిదయింది. నిన్న కార్తీక సోమవారం నాడు వెళ్ళే అవకాశం దొరికింది. పైగా నిన్నటి మూడవ కార్తీకసోమవారం శివరాత్రితో సమానమట +  కోటిదీపోత్సవం ఆఖరిరోజు కూడానూ. 


మాకు కేబుల్ టివీ లేదని; భక్తి టివీ రెగులర్ ప్రేక్షకురాలైన మా అత్తగారు ఫోన్లో మాకు ఈ కార్యక్రమం తాలూకూ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. జనం బాగా ఉంటారు అని మేము వెళ్ళాలని అనుకోలేదు. వి.ఐ.పి పాస్ అన్నాకా కాస్త దగ్గరగా కూచోవచ్చు కదా అని రెడీ అయ్యాం. ఆఖరిరోజ్ని లేటవుతుందేమో.. మా పాప అంతసేపు కూచుంటుందో లేదో అని భయపడ్డాం కానీ పాపం బానే కూర్చుంది. ఐదింటికి బయల్దేరితే ఆరున్నరకి వెళ్ళాం అక్కడికి. అప్పటికి ఎక్కువ జనం ఇంకా రాలేదు గనుక ముందర్లోనే కూర్చోగలిగాము. గ్రౌండ్ అంతా కార్పెట్లు వేసేసి అందర్నీ క్రిందనే కూచోపెట్టారు. స్టేజ్ మీద వేసిన సెట్ కైలాసం సెట్, అలంకారం బాగున్నాయ్. గ్రౌండ్ లో అక్కడక్కడా శివలింగాలూ, శివుని విగ్రహాలు, పువ్వులతో అలంకరించిన గణేశ, అమ్మవారి ఆకృతులు.. వాటి అంచునే అమర్చిన దీపాలు.. మధ్య మధ్య గుండ్రని స్టాండ్ లలో అమర్చిన ప్రమిదలు.. అరేంజ్మెంట్స్ చాలా బావున్నాయి. చివరి రోజవడం వల్ల బాగా జనం బాగా ఉన్నారు. ఇలాంటి గేదరింగ్స్ కంట్రోల్ చెయ్యడమనేది మాత్రం చాలా కష్టతరమైన సంగతి. 


ప్రమిదల్లో పొయ్యడానికి నూనె బాటిల్స్ పంచారు. జనాలు పదేసి ప్రమిదల్లో ఒక్కళ్ళే  నూనె పోసేయ్యడం.. దీపాలు వెలిగించేప్పుడు కూడా ఒక్కళ్ళే పదేసి దీపాలు వెలిగించెయ్యడం.. కొంచెం నచ్చలా నాకు.:( 
ఎలాగోలా మేమూ ప్రమిదలో నునె పోసి.. చివర్లో తలో దీపం వెలిగించాము.






కార్యక్రమాలు మొదలయ్యాయి. పాటలు, నృత్యాలు అయ్యాకా జొన్నవిత్తుల గారు శివుని గురించీ, కార్తీక దీపాల విశిష్టత గురించీ చెప్పారు. తర్వాత స్టేజీ పైన అందంగా అలంకరించిన మండపంలో "పార్వతీ కల్యాణం" జరిగింది. జరిపించిన పురోహితుడు గారు ఉత్సాహవంతంగా బాగా మట్లాడారు. అది జరుగుతుండగా జనాల మధ్యలో ప్రతిష్టించి ఉన్న శివలింగానికి పెద్దలు అభిషేకాలు చేసారు. కల్యాణం జరిగిన తరువాత శివపార్వతీ విగ్రహాలను జనాల మధ్యకు ఊరేగింపుకు తెచ్చారు. అప్పుడు వెనకాల  
"పౌర్ణమి" చిత్రంలో "భరత వేదముగ" పాట లో లిరిక్స్ రాకుండా మిక్స్ చేసిన మ్యూజిక్ వేసారు. పెద్ద పెద్ద స్పీకర్స్ లో ఆ పాటలోని ఢమరుకనాదాలు, గంటలు, హర హర మహాదేవ నినాదాలు అందరినీ భక్తిసముద్రంలో ముంచేసాయి. నాక్కూడా చాలా ఆవేశం కలిగేసింది ఆ కాసేపు :) 




తర్వాత నిన్న మరొక విశేషం కూడా ఉందిట. "సంకష్టహర చతుర్థి". కాబట్టి గణేశ పూజ కూడా చేసారు. ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన పదకొండు మఠాల పీఠాధిపతులను స్టేజ్ మీదకి ఆసీనులను చేసారు. వారిలో ముగ్గురు పీఠాధిపతులు తమ సందేశాలను క్లుప్తంగా అందించారు. అవన్నీ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. హంపీ విరూపాక్షపీఠం నుండి వచ్చిన విరూపాక్షసదానంద స్వామి వారు హంపీ విరూపాక్షుడి గురించి, దీపాలు వెలిగించడం ఎంత మంచిదో చెప్పారు. ఉడుపి నుండి వచ్చిన విశ్వేశ్వర తీర్థ స్వామి వారు హిందీలో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం జరగడం భాగ్యనగరం యొక్క భాగ్యం అన్నారు. బాగా మాట్లాడారు ఆయన. 




తర్వాత, కార్యక్రమానికి వచ్చిన తమిళ్నాడు గవర్నర్ రోశయ్య గారు చిన్న సందేశాన్ని అందించారు. అప్పుడు, శ్రీపురం బంగారు ఆలయం నుండి వచ్చిన శ్రీలక్ష్మీ అమ్మవారికి  పుష్పయాగం చేసారు. అన్ని రకాల పూలతో పూజ చేయబడి, అందంగా మెరిసిపోతున్న బంగారు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళూ చాలలేదంటే నమ్మాల్సిందే! కార్యక్రమంలో చివరగా దీపోత్సవం మొదలైంది. స్టేడియంలో  లైట్లన్నీ ఆపేసారు. ఇందాకటి మాదిరి ఒక్కరే పదేసి ,ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించెయ్యడం. కొందరు వత్తులు తెచ్చుకుని ఆ ప్రమిదల్లో వేసి వెల్గించేస్తున్నారు. మైకులో కార్యకర్తలేమో ఏ చీర కొంగుకి దీపాలు తగలకుండా చూడండీ , 365వత్తులు ప్రమిదల్లో వెయ్యకండి.. దీపాలు ఎక్కువ మంట వెలిగితే ప్రమాదం అని చాలాసార్లు జనాలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు పాపం! బంగారు అమ్మవారిని తీసుకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా దగ్గరగా చూడడానికి కాస్త తోపులాట అయ్యింది. చక్కగా ఇందాకా పూజ చూశారు కదా ఇంకేం కావాలసలు?! 


ఇక ప్రసాదాల వరకూ ఆగలేదు మేము. జనాలందరూ లేచి తిరిగేస్తున్నారు...  జాగ్రత్తగా బయటపడ్డాము. ఏదేమైనా ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన "నరేంద్ర చౌదరి"గారు అభినందనీయులు. ఇందరిని ఒక చోట కూర్చడం, ఎరేంజ్మెంట్స్ చేయడం..అన్నీ కూడా అంత సులువైన పనులేమీ కాదు. ఒక గొప్ప సంకల్పం ఇది. ఏ అవాంతరం కలగకుండా మొత్తానికి పదిహేనురోజుల కార్యక్రమాలూ దిగ్విజయంగా జరిగాయి. ఖచ్చితంగా అంతా ఈశ్వరుడి దయ! 



మొత్తమ్మీద..కార్తీకమాసంలో శివమహాపురాణం  చదివిన ఆనందంతో పాటూ, ఇవాళ నిజంగా కైలాసానికి వెళ్లామా.. అనిపించేలాంటి గొప్ప అనుభూతిని హృదయాంతరాళలో నిలుపుకుని, ఒక పర్వదినాన కోటి దీపార్చనలో పాల్గొన్నామన్న తృప్తితో బ్రహ్మానందభరితులమై ఇంటి మొఖం పట్టాము.



హర హర మహాదేవ! 


మరికొన్ని ఫోటోలు ఇక్కడ...
http://lookingwiththeheart.blogspot.com/2014/11/blog-post.html

Tuesday, November 4, 2014

తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి..



ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసీ పూజ వేళ వినేందుకు గానూ తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి.. క్రింద వీడియోస్ లో:
(వీడియో లింక్స్ పనిచేయకపోతే పేర్ల క్రింద డైరెక్ట్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను.) 





తులసీ స్తోత్రం:
http://youtu.be/Dxptk_6cgss



తులసీ మంత్రం, తులసీ నామాష్టకం :
http://youtu.be/cAvzwnc16Ag




తులసీ వివాహం :
 https://www.youtube.com/watch?v=iWs142GBCVs



తులసీ హారతి:
http://youtu.be/T9JH9h0qL6M

Monday, March 31, 2014

ఉగాది శుభాకాంక్షలు



బ్లాగ్మిత్రులందరికీ శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు..

Monday, January 13, 2014

సంక్రాంతి శుభాకాంక్షలు..


బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

Tuesday, December 10, 2013

'కాలభైరవాష్టకం'





ఇవాళ "కాలభైరవాష్టమి" ! మార్గశిర శుద్ధ అష్టమి నాడు "కాలభైరవ ష్టమి" అని కాలభైరవుడిని పూజిస్తారు. కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు. ఆయన గురించిన పురాణకథ ఇక్కడ చదవచ్చు :
http://archives.andhrabhoomi.net/archana/k-184


శ్రీ శంకరాచార్యులు రచించిన 'కాలభైరవాష్టకం' :

http://youtu.be/oVdFsADSIoc


 

Monday, October 21, 2013

"అట్లతద్దోయ్ ఆరట్లోయ్ .."





మరేమో ఇవాళ అట్లతద్ది కదా.. పొద్దున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ "మునుపు రేడియోలో అట్లతద్ది పాటలు వేసేవారు 'జనరంజని'లో అయినా... ఇవాళ ఒక్క పాటా వెయ్యలేదే.." అంది. సరే నే వినిపిస్తానుండు అని నెట్లో వెతికి ఫోన్లోనే రెండు పాటలు వినిపించా.. అమ్మ సంతోషపడింది. సరే ఆ పాటలు బ్లాగ్లో పెడితే అమ్మాలాగా అట్లతద్ది పాటలు వినాలనుకునేవారెవరన్నా వింటారు కదా.. అని అవుడియా వచ్చింది. అదన్నమాట..:)


నేను అట్లతద్ది నోములాంటివి ఏమీ నోచలేదు కానీ అమ్మ ప్రతి ఏడూ గోరింటాకు పెట్టేది. అమ్మావాళ్ళు చిన్నప్పుడు ఎంత సరదాగా అట్లతద్ది చేసుకునేవారో చెప్పేది. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అని ఫ్రెండ్స్ అందరూ అరుచుకుంటూ వెళ్ళి ఉయ్యాలలూ అవీ ఉగడం, అమ్మమ్మ అట్లు చేయడం మొదలైన కబుర్లు ప్రతి ఏడూ అప్పుడే వింటున్నట్లు మళ్ళీ కొత్తగా వినేవాళ్లం!
అట్లతద్ది నోము కథ లింక్ దొరికింది..చూడండి:
http://www.teluguone.com/devotional/content/atla-taddi-nomu-113-1441.html 


పాత సినిమాల్లో అట్లతద్ది పాటలు కాసిని ఉన్నాయి గానీ నాకు మూడ్నాలుగే దొరికాయి.. అవే పెడుతున్నాను..

 
1) రక్త సింధూరం చిత్రంలో పాట "అల్లిబిల్లి పిల్లల్లారా ఇల్లా రండి మీరు.. ఇలా రండి అట్లాతద్ది కన్నెనోము నోచాలండి.. నేడే నోచాలండి.." సుశీల బృందం పాడారు..ఆరుద్ర రచన ..

2) పవిత్రబంధం చిత్రంలో ఓ పాట ఉంది.. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్ ఆటలనోము అట్లతద్ది ఆడపిల్లలు నోచేతద్ది వేడుకమీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే జీవితమే పూచునే.." అని!


3) "అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అంటూ పాడిపంటలు సినిమాలో మరో పాట ఉంది కాని అది ఓ పట్నం అమ్మాయిని ఉడికిస్తూ పాడే పాట. అందుకని అట్లతద్ది కన్నా ఎక్కువ తెలుగుతనం ఉట్టిపడేలా ఎలా ఉండాలో చెప్పేపాట ఇది.
పాట ఇక్కడ వినండి:
 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3112 



4) బొబ్బిలి యుధ్ధం లో "ముత్యాల చెమ్మచెక్క.." పాట అట్లతద్ది పాట అవునో కాదో గుర్తులేదు కానీ అందులో "ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె.." అనే వాక్యం ఉంటుంది.. కాబట్టి బాగుంటుందని ఆ పాటని కూడా జతచేస్తున్నానిక్కడ :)

Wednesday, August 28, 2013

కృష్ణం వందేజగద్గురుమ్




వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకి పరమానందం కృష్ణం వందేజగద్గురుమ్ ll

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం
రత్నకంకణకేయూరం కృష్ణం వందేజగద్గురమ్ ll








Tuesday, November 13, 2012

దీపావళి శుభాకాంక్షలు





తీపిగురుతులు.. స్మృతుల సవ్వడులు
మిలమిలలాడే రంగురంగుల ఆకాశం
మధురమైన అభినందనలు
నోరూరించే తీపివంటలు
ఇల్లంతా దీపాలు
మనసు నిండా ఆనందాలు
దీపావళి కానుకలు !

శాంతి సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలూ
ఈ దీపావళి రోజున అందరికీ అందాలని.... ఆకాంక్ష !
దీపావళి శుభాకాంక్షలు.






Wednesday, October 24, 2012

శ్రీ దుర్గా ఆపదుధ్ధార స్తోత్రం


శ్రీ దుర్గా ఆపదుధ్ధార స్తోత్రం



 

 బ్లాగ్మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

Friday, March 23, 2012

బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు




శ్రీ నందననామ నూతన సంవత్సరం ప్రతి ఇంటా విజయాన్నీ, ఆనందాన్నీ నింపాలని,
అందరికీ ఆయురారోగ్యాలను అందివ్వాలని మనసారా కోరుకూంటూ...
బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.

Sunday, January 15, 2012

Saturday, November 26, 2011

ఈ కార్తీకం కబుర్లు





హమ్మయ్య ! పొద్దున్నే లేచి "పోలి స్వర్గం" దీపాలు వెలిగించేసాను. ఈ ఏటి కార్తీకమాస పూజలన్నీ సమాప్తం. అసలు పుణ్యప్రదమైన కార్తీక మాసంలో ముఖ్యంగా చెయ్యాల్సినవి దీపారాధన, పురాణ శ్రవణం లేదా పఠనం, ఉపవాసం, నదీస్నానం, దీపదానం, వనభోజనాలు మొదలైనవిట. వీటిలో కుదిరినవి చేసాను మరి. నదీస్నానం వీలయ్యేది కాదు కాబట్టి అది కుదరలేదు. ఉపవాసాలు చిన్నప్పుడు అమ్మతో ఉండేదాన్ని కానీ పెద్దయ్యాకా ఎందుకో వాటి జోలికి పోవాలనిపించలే. ఉండలేక కాదు కానీ ఏమిటో నమ్మకమూ, ఆసక్తి లేవంతే. so, ఉపవాసాలు కూడా చెయ్యలేదు.

నెలరోజులూ సాయంత్రాలు తులశమ్మ దగ్గర దీపంతో పాటూ కార్తీకపురాణంలో ఒకో అధ్యాయం చదివేసుకున్నా. కార్తీకపురాణంలో, సోమవారాలు శివలయంలో పొద్దున్న కానీ, సాయంత్రం కానీ దీపం వెలిగిస్తే బోలెడు పుణ్యమని రాసారు కదా అని శ్రధ్ధగా ప్రతి సోమవారం వెళ్ళి ఉసిరి చెట్టు క్రింద ఆవునేతిదీపం పెట్టేసి, పట్టుకెళ్ళిన పుస్తకంలోంచి నాలుగైదు స్తోత్రాలు అవీ చదివేసుకుని మరీ వచ్చేదాన్ని. ఆ గుడి ప్రాంగణం విశాలంగా ఉండి పేద్ద పేద్ద చెట్లు ఉంటాయి. నాకిష్టమైన కాగడా మల్లెపూల చెట్టు కూడా. దాని క్రిందే కూచునేదాన్ని మంచి సువాసన వస్తూంటుందని....:))


మధ్యలో ఓ ఆదివారం కీసరగుట్ట వెళ్ళి రామలింగేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్న పార్కులో అందరూ వనభోజనాలు చేస్తూంటే మేమూ సేదతీరాం. ఓ చెట్టు క్రింద కూచుని గుళ్ళో కొన్న పులిహార పేకేట్లు తినేసాం. తీరా చూస్తే మేం కూచున్నది బిళ్వవృక్షం క్రిందన. చుట్టూరా బోలెడు మండి వంటలు కూడా అక్కడే వండుకుంటున్నారు. భలే భలే మనకూ వనభోజనాలయిపోయాయి అనేసుకున్నాం.




క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసే పూజ నాకు చాలా ఇష్టం కాబట్టి అది బాగా చేసుకున్నా. ఈసారి అమ్మ మాటికి వచ్చింది. నేను, అమ్మ, పాప కలిసి పూజ చేసుకుంటుంటే భలే ఆనందం వేసింది. మళ్ళీ కార్తీకపౌర్ణమి పూటా శివాలయంలోనూ , ఇంట్లో తులశమ్మ దగ్గరా 365 వత్తులతో, ఉసిరి కాయతోనూ దీపం వెలిగించానా, ఇంకా ఎందుకైనా మంచిదని విష్ణుసహస్రనామాలు అవీ కూడా చదివేసా. మధ్యలో నాగులచవితి వచ్చిందా...అప్పుడు కూడా పుట్టకు వెళ్ళే ఆనవాయితీ లేదు కాబట్టి ఇంట్లోనే తులశమ్మలోని మట్టితో పుట్టలా చేసి, అందిమీద నావద్ద ఉన్న రాగి నాగపడగను కూచోబెట్టి ఇంట్లో అందరితో పాలు పోయించా. చిమ్మిలి, చలివిడి చేసి నైవేద్యం పెట్టా కానీ పుట్టకు ఫోటోతియ్యటం మర్చిపోయా...:( ఇక పౌర్ణమి అయిపోతే కార్తీకంలో మేజర్ పూజలన్నీ అయిపోయినట్లే. మిగిలిన రోజులు సాయంత్రాలు దీపం పెడుతూ ఉండటమే. నిన్నటి అమావాస్య దాకా.

అమావాస్య వెళ్ళిన పాడ్యమి తెల్లవారుఝామున "పోలి" అనే ఆవిడ కార్తీక దీపాలు ఇంట్లోనే, అదీ వెన్న చిలికిన కవ్వానికున్న వెన్నతో దీపాలు శ్రధ్ధగా పెట్టిన కారణంగా స్వర్గానికి వెళ్ళిందట. అందుకని ప్రతిఏడూ కార్తీకమాసం అయిపోయిన మర్నాడు పాడ్యమి తెల్లవారుఝామున లేచి నదీస్నానం చేసి, అరటిదొప్పలో ఆవునేతివత్తులు వేసి నదిలో దీపాలు వదులుతారు చాలామంది. నెలంతా దీపాలు పెట్టలేకపోయినా ఈ రోజు ముఫ్ఫై దీపాలూ పెడితే చాలని అన్ని దీపాలూ వదులుతారు. నదీ స్నానం చేసి అక్కడ దీపాలు పెట్టడం కుదరనివారు ఇంట్లోనే తులసమ్మ దగ్గర పళ్ళేం లోనో, పేద్ద బేసిన్ లోనో నీళ్ళు పోసి అందులోనే దీపాలు పెడతారు అమ్మలాగ. చిన్నప్పుడు అలా పళ్ళేంలో నీళ్ళల్లో అమ్మ దీపాలు పెట్టడం బావుండేది చూట్టానికి. ఇప్పుడు నేనూ అమ్మలాగ రాత్రే ఆవునెయ్యిలో వత్తులు వేసి ఉంచేసి, పొద్దున్నే అరటిదొప్పలో వత్తులు వెలిగించి నీళ్ళల్లో దీపాలు వదులుతున్నను క్రింద ఫోటోలోలాగ.




ఇంకా, కార్తీక మాసంలో ఎవరైనా పెద్ద ముత్తయిదువను పిలిచి పసుపు రాసి, పువ్వులు, పళ్ళు, పసుపు, కుంకుమ పెట్టి చీర పెడితే చాలా పుణ్యమని ఓ పుస్తకంలో చదివాను. ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తూంటే అమ్మనాన్న ఉన్నారని మా పిన్నిలిద్దరూ, మరికొందరు కజిన్స్ అంతాకలిసి ఓరోజు ఇంటికొచ్చారు. ఇంకేముంది నాకు పండగే పండగ. మొత్తం అయిదుగురినీ కూచోపెట్టి పసుపు రాసేసి, మిగిలినవన్నీ పెట్టి అందరికీ తలో చీరా పెట్టేసి దణ్ణం పేట్టేసా. ఎంత పుణ్యమో కదా. శభాష్ శభాష్... అని భుజం తట్టేసుకున్నా..! నేనూ ఖుష్. బంధువులూ ఖుష్. దేవుడూ ఖుష్.

ఇక ఇవాళ పొద్దుటే దీపాలు వదలటంతో కార్తీకం అయ్యింది. హామ్మయ్య అనుకుని గాఠ్ఠిగా ఊపిరి తీసుకుని ఓ పుస్తకం పట్టుకున్నానా, మార్గశిర శుధ్ధ పాడ్యమి నాడు విష్ణుసహస్రనామం చదివితే మంచిది అని ఉంది ఆ పుస్తకంలో. సరే ఇంత పొద్దుటే చీకట్లో చేసే పనేముంది అనేసుకుని ఆ సహస్రనామాలు కూడా పూర్తయ్యాయనిపించా !!




ఈ విధంగా ఈసారి నా అకౌంట్ లో ఎప్పుడూకన్నా కాస్తంత ఎక్కువ పుణ్యమే పడేసుకున్నా...:)) దాంట్లోంచి ఎలాగూ సగం శ్రీవారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుందనుకోండి. ( భర్తల పాపంలో మనకూ వాటా ఉంటుందిట, మన పుణ్యంలో వారికి వాటా వెళ్తుందిట....:(( అసలిది దేవుడితో డిస్కస్ చేయాల్సిన పేద్ద విషయం.) మరీ నాలుగింటికి లేచానేమో.. బాగా నిద్ర వస్తోంది. ఇంక కాసేపు బజ్జుంటా.

యూట్యూబ్ లో పోలి స్వర్గం కథ రెండూ భాగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చూడండి:
http://www.youtube.com/watch?v=a9459H0nerI&feature=related




Monday, August 22, 2011

ఎస్.జానకి గారు పాడిన అరుదైన రెండు కృష్ణ గీతాలు





వైవిధ్య సుమధురగాయని ఎస్.జానకి గారు పాడిన రెండు కృష్ణుని గీతాలను ఈ కృష్ణాష్టమి పూటా బ్లాగ్మిత్రులకు వినిపించాలని...


మొదటిది ఎస్.జానకి గారు ఒక రేడియో ఇంటర్వూ లో వేసినది. తమిళం లో ఒక సినిమా కోసం ఆవిడ స్వయంగా ఈ రాసిన పాటను మళ్ళీ తెలుగులో రాసి ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లో పాడినట్లు తెలిపారు. మూడేళ్ళ పాప కృషుడి కోసం పాడుతున్నట్లున ఈ పాటను , జానకి గారి మాటలని క్రింద లింక్ లో వినేయండి మరి ...


Get this widget |Track details |eSnips Social DNA




రెండవ పాట " అంత మహిమ ఏమున్నది గోపాలునిలో.." అనీ మద్రాసు ఆకాశవాణి రికార్డింగ్.

రచన: ఎం. గోపి (వీరు అతి తక్కువగా మంచి సినిమాపాటలు కూడా రాసారు)

Get this widget |Track details |eSnips Social DNA


కవిత్వంలో నిందాస్తుతి లాంటి ఈ పాట సాహిత్యం బావుంటుందని ఇక్కడ రాసాను:

ప: అంత మహిమ ఏమున్నది గోపాలుడిలో
నన్ను నేను మరిచేందుకు వాడి ధ్యాసలో


1చ: యశోదమ్మ తల్లైతే అంతా కన్నయ్యకే
రేపల్లె వంటి పల్లేలో అందరూ గోపాలురే
ఊరివారు భరియిస్తే ప్రతివారూ ఘనులే
అంత మంది వరియిస్తే అందరూ శ్రీకృష్ణులే ((అంత మహిమ))


2చ: చిరునవ్వులె తప్ప తనకు నిట్టూర్పులు తెలుసా
ఆలమందలేమో గానీ ఆలివెతలు తెలుసా
వెదురుల రుచి తెలిసినంత పెదవుల రుచి తెలుసా
గీత పలికెనేమో గానీ ఈ రాధ గీత తెలుసా ((అంత మహిమ))

------------------

ఇస్కాన్ టెంపుల్ లో ఇవాళ తీసిన ఫోటోలు ’మనో నేత్రం’లో చూసేయండి...




Monday, April 4, 2011

ఉగాది శుభాకాంక్షలు


మరొక ఉదయం
మరొక రేపు
మరొక చిరునవ్వు
మరొక చైత్రం
మరొక సంవత్సరం...మళ్ళీ మొదలు !!

బ్లాగ్మిత్రులందరికీ..

Wednesday, March 2, 2011

మహా దేవ శంభో ...



(బిక్కవోలు గుడిలో ఫోటో)

శివరాత్రి సందర్భంగా శివునిపై కొన్ని ఓల్డ్ గోల్డీస్...

మహా దేవ శంభో (భీష్మ)

హర హర మహాదేవ(దక్ష యజ్ఞం)

దేవ దేవ ధవళాచలమందిర(భూకైలాస్)


నీలకంధరా దేవా(భూకైలాస్)

శైలసుత హృదయేశా(వినాయక చవితి)


------------------------

అదివరకూ నేను టపాయించిన తనికెళ్ల భరణిగారి రచించి, పాడిన "నాలోన శివుడు కలడు" పాటలు:
http://trishnaventa.blogspot.com/2009/11/blog-post_16.హ్త్మ్ల్

ఆదిశంకరాచార్య విరచిత "నిర్వాణ షట్కం" :
http://trishnaventa.blogspot.com/2010/05/blog-post_18.హ్త్మ్ల్

Friday, December 17, 2010

గీతాసారం

రెండు పర్వదినాలు ఇవాళ ఒకేసారి వచ్చేసాయి. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి. ముక్కోటి ఏకాదశి గురించి ఇక్కడ అదివరకూ రాసాను. ఇక "గీతా జయంతి" సందర్భంగా సంక్షిప్తం చేసిన గీతాసారం:


గీతా సారం:

* ఏమి జరిగిందో, అది బాగా జరిగింది.
* ఏమి జరుగుతోందో, అది బాగా జరుగుతోంది.
* ఏమి జరగబోతోందో, అది కూడా బాగానే జరగబోతోంది.
* నీది ఏది పోయింది, ఎందుకు నీవు బాధ పడుతున్నావు?
* నీవు ఏమి తెచ్చావని,
* అది పోయిందని బాధ పడుతున్నావు?
* నీవు ఏమి సృష్టించావని అది నష్టపోయిందనడానికి?
* నీవు ఏమి తీసుకున్నావో, ఇక్కడ నుంచే తీసుకున్నావు.
* నీవు ఏమి ఇచ్చావో, ఇక్కడనే ఇచ్చావు.
* ఈవేళ ఏది నీదో, అది న్నిన్న ఎవరిదో మరెవరిదో అయిపోతుంది.
* పరివర్తన సంసారం యొక్క నియమం.

********************************

పైన రాసిన "గీతాసారం" ఒక కేలండర్లో మా హాల్లో ఉండేది చాలా ఏళ్ళు. చాలా మంది బాగుందని రాసుకుని వెళ్ళేవారు కూడా. క్రితం ఏడు "గీతా జయంతి"నాడు నేను ఊళ్ళో లేనందువల్ల టపా రాయలేక, చైతన్యను తన బ్లాగ్లో పెట్టమని చెప్పాను. ఆ టపా ఇక్కడ. అప్పుడు నా బ్లాగ్లో రాయలేదన్న లోటూ ఈసారి ఇదిగో ఇలా తీర్చేసుకున్నాను...:)

Thursday, December 16, 2010

ధనుర్మాస ప్రారంభం - మొదటి ముగ్గు !!






ఇవాళ నుంచీ ధనుర్మాసం మొదలు. ముగ్గులు మొదలు. కానీ ఇదేమిటి మొదటి ముగ్గు అని మూడు ముగ్గుల ఫోటోలు పెట్టాను? చిన్నది తులశమ్మ దగ్గర ఎలాగో ఫిక్స్ అయిపోయింది. ఇక పెద్ద ముగ్గులు రెంటిలో ఏ ముగ్గు పెడదామా అని ఆలోచిస్తున్నానన్నమాట. అందుకని మూడూ పెట్టేసాను...:) నాకు మామూలు ముగ్గుల కన్నా మెలికల ముగ్గులు బాగా ఇష్టం. ఎక్కువగా అవే వేస్తాను.

ముగ్గులు గురించి అదివరకూ రెండు సార్లు( 1, 2) రాసేసాను. అందుకని ఇక రాయటం లేదు.

Friday, October 15, 2010

దసరా శుభాకాంక్షలు

ఇదివరకెప్పుడో వేసిన "Durga eyes"

బ్లాగ్మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.

Friday, September 10, 2010

వినాయకచవితి శుభాకాంక్షలు




బ్లాగ్మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.




గణనాయకాయ గణదైవతాయ
గణాధ్యక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేశానాయ ధీమహీ
గుణాతీతాయ గుణాధీశాయ
గుణప్రవిష్ఠాయ ధీమహీ

ఏకదంతయ వక్రతుండాయ
గౌరీతనయాయ ధీమహీ
గజేశానాయ బాలచంద్రాయ
శ్రీ గణేశాయ ధీమహి {2}

గానచతురాయ గానప్రాణాయ గానంతరాత్మనే
గానోత్సుఖాయ గానమథాయ గానో సుఖమనసే
గురు పూజితాయ, గురు దైవతాయ, గురు కులస్థాయినే
గురు విక్రమాయ, గుల్హ ప్రవరాయ గుణవే గుణగురవే

గురుదైత్యకలేక్షేత్రే, గురు ధర్మ సదా రక్ధ్యాయ
గురుపుత్ర పారిత్రాత్రే గురు పాఖండ్ ఖండ్ఖకాయ
గీత సారాయ, గీత తత్వాయ గీతగోత్రాయ ధీమహీ
గూఢ గుల్ఫాయ, గంధ మట్టాయ
గోజయప్రదాయ ధీమహీ

గుణాతీతాయ గుణాధీషాయ
గుణప్రవిష్ఠాయ ధీమహీ
ఏకదంతయ వక్రతుండాయ
గౌరీతనయాయ ధీమహీ
గజేశానాయ బాలచంద్రాయ
శ్రీ గణేశాయ ధీమహి {2}
శ్రీ గణేశాయ ధీమహి శ్రీ గణేశాయ ధీమహి శ్రీ గణేశాయ ధీమహి




Wednesday, September 8, 2010

పోలాల అమావాస్య


శ్రావణమాసం చివరలో వచ్చే అమావాస్యను "పోలాలామావాస్య" అంటారు. ఆ రోజున "కంద" మొక్కకు పూజ చేయటం కొందరి ఆనవాయితీ. అమ్మవారిని పోలాంబ రూపంలో పూజించి పిల్లలు లేనివారు పిల్లల కోసం, పిల్లలు ఉన్నవారు పిల్లల క్షేమం కోరుతూ ఈ పూజ చేస్తారు. కంద మొక్కకు పూజ ఎందుకు చేస్తారంటే, కంద మొక్కకు ఎలాగైతే ఒక్క దుంప మట్టిలో వేసినా పక్కనుండి పిలకలు వేసి బోలెడు మొక్కలు పుడతాయో, అలానే పిల్లాపాపలతో ఇల్లు కళకళాలాడుతూ ఉండాలని అంతరార్ధం.

(ఒక్క దుంపలోంచి వచ్చి బోలెడు కంద పిలకలు)

తోరానికి పసుపుకొమ్ము కట్టి, ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసినవారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పసుపుకొమ్ము తోరాలు చేసి చేతికి కడతారు. గారెలు, బూరెలు, పులగం వండి నైవేద్యం పెట్టి అది రజకులకు ఇస్తారు. ఏ నైవేద్యం అయినా రజకులకు ఇస్తే కడుపు చలవ అని పెద్దలంటారు. పూజ ముగిసాకా చదివే కధలో... ప్రతిఏడూ బిడ్డను పోగొట్టుకుంటున్న ఒకావిడ, ఈ పూజ చేయటం వలన, అమ్మవారి దయతో చనిపోయిన బిడ్డలందరినీ తిరిగి ఎలా పొందగలిగిందో చెబుతారు.

ఇతర ప్రాంతాలవారు చాలా మంది తెలియదంటారు కానీ మా గోదావరి జిల్లాల్లో పోలాలమావాస్య, కంద పూజ తెలియనివారు తక్కువే. జులై,ఆగస్ట్ లలోనే మా అమ్మ కంద దుంప కొని మట్టిలో పాతిపెట్టేది. అది ఈ అమ్మావాస్య సమయానికి చక్కగా చుట్టురా పిలకలు వచ్చి బోలెడు మొక్కలు అయ్యేవి. వాటిల్లోంచి ఒక మంచి మొక్కను దుంపతో సహా తవ్వి ఇంట్లో దేవుడి మందిరం దగ్గర అమ్మ పూజ చేసేది. మొక్క ఇంట్లో పెట్టి పూజ చేయటం, పైగా ఆ పసుపుకొమ్ము తోరం కట్టుకుని స్కూలుకు వెళ్తే, అడిగినవారందరికీ కధంతా చెప్పటం చిన్నప్పుడు వింతగా ఉండేది మాకు.

చూడటానికి అందంగా ఉండే ఈ మొక్కను ఇలా ఇండోర్ ప్లాంట్లాగ కూడా వేసుకోవచ్చు.