సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, September 8, 2010

పోలాల అమావాస్య


శ్రావణమాసం చివరలో వచ్చే అమావాస్యను "పోలాలామావాస్య" అంటారు. ఆ రోజున "కంద" మొక్కకు పూజ చేయటం కొందరి ఆనవాయితీ. అమ్మవారిని పోలాంబ రూపంలో పూజించి పిల్లలు లేనివారు పిల్లల కోసం, పిల్లలు ఉన్నవారు పిల్లల క్షేమం కోరుతూ ఈ పూజ చేస్తారు. కంద మొక్కకు పూజ ఎందుకు చేస్తారంటే, కంద మొక్కకు ఎలాగైతే ఒక్క దుంప మట్టిలో వేసినా పక్కనుండి పిలకలు వేసి బోలెడు మొక్కలు పుడతాయో, అలానే పిల్లాపాపలతో ఇల్లు కళకళాలాడుతూ ఉండాలని అంతరార్ధం.

(ఒక్క దుంపలోంచి వచ్చి బోలెడు కంద పిలకలు)

తోరానికి పసుపుకొమ్ము కట్టి, ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసినవారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పసుపుకొమ్ము తోరాలు చేసి చేతికి కడతారు. గారెలు, బూరెలు, పులగం వండి నైవేద్యం పెట్టి అది రజకులకు ఇస్తారు. ఏ నైవేద్యం అయినా రజకులకు ఇస్తే కడుపు చలవ అని పెద్దలంటారు. పూజ ముగిసాకా చదివే కధలో... ప్రతిఏడూ బిడ్డను పోగొట్టుకుంటున్న ఒకావిడ, ఈ పూజ చేయటం వలన, అమ్మవారి దయతో చనిపోయిన బిడ్డలందరినీ తిరిగి ఎలా పొందగలిగిందో చెబుతారు.

ఇతర ప్రాంతాలవారు చాలా మంది తెలియదంటారు కానీ మా గోదావరి జిల్లాల్లో పోలాలమావాస్య, కంద పూజ తెలియనివారు తక్కువే. జులై,ఆగస్ట్ లలోనే మా అమ్మ కంద దుంప కొని మట్టిలో పాతిపెట్టేది. అది ఈ అమ్మావాస్య సమయానికి చక్కగా చుట్టురా పిలకలు వచ్చి బోలెడు మొక్కలు అయ్యేవి. వాటిల్లోంచి ఒక మంచి మొక్కను దుంపతో సహా తవ్వి ఇంట్లో దేవుడి మందిరం దగ్గర అమ్మ పూజ చేసేది. మొక్క ఇంట్లో పెట్టి పూజ చేయటం, పైగా ఆ పసుపుకొమ్ము తోరం కట్టుకుని స్కూలుకు వెళ్తే, అడిగినవారందరికీ కధంతా చెప్పటం చిన్నప్పుడు వింతగా ఉండేది మాకు.

చూడటానికి అందంగా ఉండే ఈ మొక్కను ఇలా ఇండోర్ ప్లాంట్లాగ కూడా వేసుకోవచ్చు.

15 comments:

వేణూశ్రీకాంత్ said...

నాకు తెలియని కొత్త విషయం చెప్పినందుకు ధన్యవాదాలు తృష్ణగారు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బావుందండీ. ధన్యవాదాలు.

పరిమళం said...

అవునాండీ ...నేనింకా పోలాల అమావాస్యంటే కార్తీక మాసంలో వచ్చేది అనుకుంటున్నా ...

భావన said...

విన్నాను కాని ఇంత క్లియర్ గా తెలియదు నాకు. థ్యాంక్స్ తృష్ణ..

కథా మంజరి said...

చాలా బాగుంది. మా ఉత్తరాంధ్ర లొ పోలేరు అమావాస్య అంటారండీ. కంద మొక్క కి పూజ మీరు చెప్పినట్టే చేస్తారు. తోరాలు కట్టడం అన్నీ మామూలే .

మా ప్రాంతం లొ కుండి గుర్రాలని పిల్లలు గుడ బంద్ల మీద ఉంచి ఆ రోజు వీధుల్లో త్రిప్పడం ఒక వేడుక.

మానస said...

ఈరోజే మా అమ్మకి ఫోను చేస్తే నాన్నగారు చెప్పారు అమ్మ కంద మొక్క కి పూజ చేసుకుంటోంది అని.నెను ఎలాగూ అవి చెయ్యను కాబట్టి నాకు చెప్పదనుకోండి అది వెరే సంగతి.దాని కధా కమామీషు మరలా గుర్తు చేసారు మీరు.:)

శిశిర said...

బాగుందండి. పోలాల అమావాస్యనాడు తప్పనిసరిగా కొట్టుంగబుట్టలు వండుతారు కదండి. అది చెప్పలేదే మీరు?

శ్రీలలిత said...

అవును. ఈ పూజ గురించి బాగా చెప్పారు. నేను కూడా అలాగే కందపిలకలను తయారు చేసుకుని పూజ చేసుకుంటాను. ఈసారి కుదరలేదనుకోండి. కాని మీ టపా నా పూజను గుర్తు చేసింది.

తృష్ణ said...

@శిశిర: కొందరు చేస్తారని తెలుసుగాని మా ఇంట్లో అలవాటు లేదండి. అందువల్ల రాసేప్పుడు గుర్తురాలేదు.


వ్యాఖ్య రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

కథా మంజరి said...

మీ పోలేరమ్మ చాలబాగుంది. మా ఉత్తరాంధ్ర జిల్లాలలో భాద్రపద బహుళ అమావాస్య నాడు ఈ పూజ చేస్తారు.పూజ, నైవేద్యాలు మీరు చెప్పినట్టే. బూరెలు, గారెలతో పాటు తిమ్మనం పోలిరొట్టె 9 రకాలకూరగాయలతో(ఆలగడ్డ ఉల్లికేరట్ లాంటివి కాకుండా)కలగూరపులుసు చేసి నైవేద్యం పెడతారు

తృష్ణ said...

@పంతులు జోగారావు: ఇవాళ కందమొక్క పూజ చేస్కుంటుంటే మీ వ్యాఖ్య గుర్తు వచ్చింది.. జవాబు ఆలస్యంగా రాస్తున్నానని ఏమనుకోకండి.
ధన్యవాదాలు..

SHANKAR.S said...

నాదీ శిశిర గారి మాటే. కొట్టుంగ బుట్టల ప్రస్తావన లేకుండానే పోలాలఅమావాస్య పోస్టా? అసలు వాటి టేస్టే వేరు. సూపరో సూపరు. అన్నట్టు గోడమీద పసుపుతో రౌండ్ గా సర్కిల్ గీసి బొట్టు పెట్టి పూజిస్తారు ఈ పండగకేనాండీ? (నాకు సరిగ్గా చెప్పడం రాలేదేమో. కుసింత నా భావం అర్థమయిన వాళ్ళు వివరించగలరు :( )

తృష్ణ said...

@శంకర్.ఎస్: అదే అదే కానీ "కొట్టుంగ బుట్టలు" అసలు నాకు తెలీదండి. మా అమ్మ + అత్తగారు ఇద్దరు ఎప్పుడు చెయ్యలేదు. పులగం, గారెలు, బూరెలు.. ఇవే నైవేద్యానికి వండుతారు మా ఇంట్లో. ప్రాంతాలవారిగా పధ్ధతుల్లో తేడా ఉంటుండి కదా.
గోడమీద అలా పసుపు రాసి, బొట్టు పెట్టి అమ్మవారి రూపంలాగ పూజిస్తారండి. అదీ సంగతి..!

ఆ.సౌమ్య said...

మా ఉత్తరాంధ్రలో చేసుకుంటామండీ...పోలాల ఆమావాస్య, పోలేరు అమావాస్య అంటారు. మాకు తెలుసు ఇది.

తృష్ణ said...

@ఆ.సౌమ్య: అవునట కదా.. పైన పంతుల జోగారావు గారు చెప్పారు.
ధన్యవాదాలు.