"అంతరా చౌదరి" ప్రముఖ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి కుమార్తె. ఆమె చిన్నప్పుడు "మీనూ" అనే అమోల్ పాలేకర్ తీసిన హిందీ చిత్రంలో "తేరీ గలియోంమే హమ్ ఆయే.." అనే పాటను పాడించారు. శాస్త్రీయంగా హిందుస్తానీ తో పాటుగా వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకున్న ప్రతిభగల కాళాకారిణి. పాటలకు బాణీలు సమకూర్చగలరు. ఆమె పియానో కూడా చక్కగా వాయించగలరు. బెంగాలీలో పిల్లల పాటలతో ఆమె ఎన్నో ఆల్బమ్స్ రిలీజ్ చేసారు. అయితే ప్రతిభ ఉన్నా కూడా, పిల్లల పాటలు పాడే గాయని అనే ముద్ర నుంచి తప్పుకోలేకపోయారు. అయితే గాయనిగా ఆమె తన తండ్రి దగర ఎన్నో మెళుకువలు నేర్చుకున్నారు.
నా చిన్నప్పుడు ఒకసారి డిడి-1లో సి.పి.సివాళ్ళు ప్రసారం చేసిన సలీల్ చౌదరీ ఇంటర్వ్యూ ప్రసారమైంది. అన్నింటిలానే అది కూడా రికార్డ్ చేసాం. సలీల్ చౌదరీ సంగీతం అంటే ప్రత్యేకమైన ఇష్టం నాకూ, నాన్నకూ. అందంగా, పాడటానికి సులువుగా ఉంటూనే ఎంతో కాంప్లికేటెడ్ గా ఉంటాయి ఆయన ట్యూన్స్. ఆయన సంగీతం సమకూర్చిన పాటలు నేర్చుకోవటం అంత తేలికైన పని కాదు. ఇంతకీ ఆ కార్యక్రమంలో ఆయన స్వరపరిచిన కొన్ని ప్రైవేట్ గీతాలను వినిపించారు. ఎన్ని సార్లు ఆ కేసెట్ మొత్తం వినేవాళ్ళమో లెఖ్ఖ లేదు. వాటిల్లో అంతరా చౌదరి పాడిన ’బీత్ జాత్ బర్ఖా రుత్, పియ న ఆ..యేరీ...’ అనే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట సంగీతం, సాహిత్యం రెండూ చాలా అద్భుతంగా ఉంటాయి.
ఈ పాటను "మధుర్ స్మృతి" అనే ఆల్బమ్ లో రిలీజ్ చేసారు. కానీ అది బయట దొరకలేదు నాకు. నా దగ్గర ఉన్నది డిడి లోంచి రికార్డ్ చేసుకున్న పాట మాత్రమే. పాటను ఆసక్తి ఉన్నవాళ్ళు క్రింద వినండి. మొదట్లో ఉన్నది సలీల్ చౌదరి ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు...
No comments:
Post a Comment