సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కొన్ని రెసిపీలు. Show all posts
Showing posts with label కొన్ని రెసిపీలు. Show all posts

Wednesday, May 25, 2011

Today's breakfast







రెగులర్ టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా ప్రయోగాలు చేస్తుంటాను నేను. ఇవాళ ఏం చేసానంటే:

*mixed veg. కార్న్ soup
*wheat flakes (నాకు)
*corn flakes with chocos(శ్రీవారికి)
*mixed sprouts salad

నాకున్న కొద్దిపాటి పాకజ్ఞానంతో ఒక కొత్త రకం salad రెండు రకాలుగా చేసాను. వివరాలు "ఇక్కడ". ఈ రెండు రకాలు సలాడ్స్ నిన్న రాత్రి, ఇవాళ పొద్దున్న తిన్నాకా మేం కాబట్టి మీరూ ప్రయత్నించవచ్చు...:)

Wednesday, April 7, 2010

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - ఒక హెల్త్ డ్రింక్

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక హెల్త్ డ్రింక్ గురించి..వివరాలు.
క్రింద చెప్పిన పాళ్ళలో ఆయా వస్తువులు కొనుక్కుని మర ఆడించుకోవాలి.

రాగులు - 500గ్రాములు
గోధుమలు - 50 గ్రా
జొన్నలు - 50 గ్రా
వేరుశెనగలు - 50 గ్రా
సగ్గు బియ్యం - 50 గ్రా
ఉప్పుడు బియ్యం - 50 గ్రా
సజ్జలు - 50 గ్రా
మొక్కజొన్నలు - 25 గ్రా
సొయాబిన్ - 25 గ్రా
పుట్నాల పప్పు - 25 గ్రా
బార్లీ - 25గ్రా


ఫ్లావర్ కోసం:

బాదాం - 25 గ్రా
జీడిపప్పు - 25 గ్రా
ఏలకులు - 25 గ్రా
ఈ మూడూ మనం ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.అనవసరం అనుకుంటే ఫ్లేవేర్ కోసం వాడే బాదాం,జీడిపప్పు కలుపుకోవటం మానేయటమే.

పైన రాసిన పదార్ధాల్లో Proteins,folic acid, calcium,fibre,iron,copper,carbohydrates,magnesium మొదలైన పోషక విలువలన్ని ఉంటాయి. షాపు వాళ్ళలాగ ఏది ఎంత % అన్నది చెప్పలేను. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కేలొరీలు బాగా ఖర్చు అవుతాయి కాబట్టి పిల్లలకు ఇది చాలా ఉపయోగకరం.

తయారి విధానం:

ఒక 2 స్పూన్లు పవుడర్ను తీసుకుని అర గ్లాసు నీళ్ళలో కలుపుకుని పొయ్యి మీద పెట్టాలి. మరుగుకు వచ్చాకా మరొక అరగ్లాసు పాలు తీసుకుని అర గ్లాసు నీళ్ళలో కలుపుకుని పొయ్యి మీద పెట్టాలి. మరుగుకు వచ్చాకా మరొక అరగ్లాసు పాలు తీసుకుని అందులో కలుపుకుని బాగా కలిసాకా పంచదార వేసుకుని దింపేసుకోవాలి. పెద్దలు షుగర్ తినకూడనివాళ్ళు ఉంటే నీళ్ళలొ మరిగించుకున్నాకా చల్లర్చి మజ్జిగలో కలుపుకుని త్రాగచ్చు.

Monday, November 2, 2009

బ్లాగ్వనంలో వనభోజనాలు...వంటకాలతో నేను రెడీ...

ఈ కార్తీక పౌర్ణమి రోజున భోజనాలకి ఈ మావిడి చెట్టు క్రింద కూర్చుందామా..?
జ్యోతి గారి ఆహ్వానంతో వనభోజనాలకు వంటకాలతో రెడీ... (కానీ ఇవాళ నేను ఉపవాసం..ఇవేమీ తినటానికి లేదు..)

నేను 2,3 రకాల వంటకాలను రాస్తున్నాను..


ముందుగా ఒక టిఫిన్ --
పావ్ భాజీ :(కావాల్సినవి)
ఒక నలుగురికైతే 10,12 పావ్ లు తెచ్చుకోవాలి.(బేకరీల్లో దొరుకుతాయి)
100gms నెయ్యి
2,3 చెంచాల నూనె.
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి, కూరలో పిండటానికి 2,3నిమ్మ చెక్కలు

కూర కొసం:
* ముందురోజు ఒక మీడియం గ్లాసుడు బఠాణీలు నానబెట్టుకుని ఉంచుకోవాలి.
* నానిన బఠాణీల తో పాటుగా చిన్న కాలీ ఫ్లవర్,ఒక పెద్ద బంగాళాదుంప,2 కేరెట్లు, ఇష్టం ఉంటే కొద్దిగా క్యాబేజీ తరిగినది...ఇవన్నీ కలిపి బాగా ఉడకపెట్టాలి. కుక్కర్ లో అయితే కొంచెం ఎక్కువ విజిల్స్ రానివ్వాలి.
* దింపాకా మొత్తం బాగా మేష్ చెయ్యాలి.(అంటే చిదిమెయాలి)
* 2 తొమాటోలు, 2 ఉల్లిపాయలు బాగా ముద్దగా గ్రైండ్ చేసి బాగా వేగనివ్వాలి.
* తరువాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికొద్దిగా వేగాకా,బాగా మేష్ చెసి పెటుకున్న కూర ముక్కల ముద్దని దాంట్లో వేసి, ఒక 3 చెంచాల 'పావ్ భాజి మసాలా పౌడర్" వెయ్యాలి.
ఈ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్లలోను దొరుకుతుంది. చివరగా ఒక చెంచా నెయ్యి వెయ్యాలి.
* తరువాత , పెనం పెట్టి పావ్ లని నెయ్యితో కాని బటర్తో కానీ మాడకుండా కాల్చాలి...బ్రెడ్ కాల్చుకున్నట్లే.

సర్వ్ చేసేప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి, నిమ్మరసం పిండి..ఇవ్వాలి..

పైన ఫొటోలో లాగన్న మాట..:)

**********
ఇప్పుడు భోజనంలోకి ఒక చపాతీ కూర, కొత్తరకం దోసావకాయ.
పచ్చి బొప్పాయి కూర: (చూడటానికి క్యాబేజి కూరలా ఉన్న దీనిని అన్నంలోకి కూడా తినచ్చు.)
కావల్సినవి:

ఒక మీడియం సైజు బొప్పాయి తురుము.
1/2 కొబ్బరి చెక్క తురిముకోవాలి.

పొపుకి : ఆవాలు,మినప్పప్పు,సెనగ పప్పు, 2 పచ్చి మిర్చి, జిలకర్ర,కర్వేపాకు, కావాలంతే ఒక ఎండుమిర్చి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు.


1)బొప్పాసి తొక్కు తీసేసి, తురిమేసి,కొద్దిగా నీరులో తగినంత ఉప్పువేసి ఒక్క పొంగు వచ్చేదాకా ఉడకబెట్టాలి.ముద్దగా అవ్వకుండా కొద్దిగా ఉడికినట్లు అనిపించగానే దింపేసుకోవాలి.

2)నీరు మిగిలి ఉంటే వడబోసేయాలి పుర్తిగా.

3)మూకుడులో పోపు వేసుకుని కొబ్బరి తురుము వేసుకుని, 2 నిమిషాలయ్యాకా ఉడికిన బొప్పాయి తురుము వేసి 3,4 నిమిషాలలో ఆపేసుకోవాలి.

ఇది చపాతీలలోకి చాలా బాగుంటుంది.
మావారు పూర్తిగా ఖాళీ చేసే ఏకైక కూర ఇది.కాబట్టి ఎక్కువ చేస్తూ ఉంటాను.


కొత్తరకం దోసావకాయ:

దోసావకాయ అంటే చాలామందికి ఎర్ర మిర్చి కారంతో చేసుకునేదే తెలుసు. పెళ్ళిళ్ళలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అదికాక పచ్చి మిర్చితో చేసుకునేది మరొకటి ఉంది.

కావాల్సినవి:
ఒక మీడియం దొసకాయ ఇలా తరిగినది.

మేము కారం తక్కువ కాబట్టి ఆ దోసకాయకి నేను 8,9 పచ్చి మిర్చి తీసుకుంటాను.
అన్నీ పేస్ట్ చేసి ఉంచాలి.
దీనిలోకి 2,3 చెంచాల పచ్చి ఆవ పొడి వేసి,(మార్కెత్లో దొరుకుతుంది. లెకపోతే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.) 4,5 చెంచాల నూనె,తగినంత ఉప్పు వెసి బాగా కలపాలి.

ఈ ముద్దలోకి తరిగిన దోసకాయ ముక్కలు వేసి బాగా కలపాలి.


"ఆవ" వేడి చేస్తుంది కాబట్టి ఇది తిన్న రోజు మజ్జిగ ఎక్కువ తాగాలి.
ఇది నాకు చాలా ఇష్టమైన పదార్ధం.


**********
ఇవాళ స్పెషల్ వంటలు అన్నారు కాబట్టి నెయ్యి,నునె గట్రా బాగా వాడే పదార్ధాలు రాయటం అయ్యింది.
మిగిలిన రొజులు కట్టడిగా తిన్నా, నెలకి ఒక్కసారి తినచ్చు ఇలాగ...:) :)

నిన్న ఇవన్నీ చేసి మా అమ్మగారింట్లో అందరికీ పెట్టాను...బ్లాగ్ కోసం నేను చేసిన పదార్ధాలకి ఫొటోలు తీస్తూంటే
....ఓసినీ..ఇదేమిటి ఇవన్నీ మా కోసం కాదా చేసింది....నీ బ్లాగ్ కోసమా అని మా తమ్ముడు హాచ్చర్యపడి..కించిత్ అలక వహించాడు..!!


Sunday, September 20, 2009

ఈ వారం వంట -- క్యాబేజీ పచ్చడి

మా ఇంట్లో అన్నంలోకి పప్పు,కూర,చారుతో పాటు రోజూ ఏదో ఒక పచ్చడి(పొద్దున్న పచ్చడి,రాత్రి అయితే పెరుగు పచ్చడి) చేసేది మా అమ్మ.ఎందుకంటే మా ఇంట్లో ఆవకాయలు గట్రా తినటం చాలా తక్కువ.అన్ని రకాల ఆకుకూరలతో,కూరలతోనూ పచ్చళ్ళు చేసేది.వాటిల్లో ఒకటి -- క్యాబేజీ పచ్చడి.

క్యాబేజీ లోని పోషకాలూ,ఉపయోగాలు:
* క్యాబేజీలో క్రొవ్వు,కొలెస్ట్రాల్ రెండూ తక్కువే.
* Dietary Fiber చాలా ఎక్కువ.ఇంకాదీనిలో Vitamin C, Vitamin K, Folate,
Potassium, Manganese, Vitamin A, omega 3 fatty acids,Thiamin,Vitamin B6,
Calcium,Iron and Magnesium మొదలైన పోషకాలు ఉన్నాయి.
* దీనిలోని పోషకాలు కొన్ని రకాల కేన్సర్లను నివారిస్తాయి.
* శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* బరువు తగ్గటానికి కూడా క్యాబేజీ ఉపయోగపడుతుంది.
* పాలిచ్చే తల్లులు ఎక్కువగా తింటే పాలు పెరుగుతాయి.
* చలవ చేస్తుంది,బలకరం,రక్త వృధ్ధి కలిగిస్తుంది.
* పచ్చి క్యాబేజీని కోరేసి చపాతీ పిండిలో కలిపేసి చపాతీలు చేసుకుంటే బాగుంటుంది.

క్యాబేజీ పచ్చడికి కావల్సిన పదార్ధాలు:
1) సన్నగా తరిగిన పావు కిలో క్యబేజీ.
2) చిన్న నిమ్మకాయంత చింతపండును కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకోవాలి.
3) తగినంత ఉప్పు.
4) 2,3 చెంచాల నూనె.
5)చిటికెడు పసుపు
పోపుకు:
ఆవాలు(1/2 tsp),మినపప్పు(1 tsp),జీలకర్ర(1/2 tsp),
ఇంగువ(a pinch),ఎండు మిర్చి--1, పచ్చి మిర్చి--1

చేసే విధానం:
* ముందు 1చెంచా నూనెలో పోపు వేయించుకోవాలి.అది పక్కకు పెట్టుకుని అదే మూకుడులో
* 2 టీ స్పూన్ల నూనెలో సన్నగా తరిగిన క్యాబేజీని పచ్చివాసన పొయేంతవరకు కొద్దిగా వేయించాలి.
* అది చల్లారాకా, నానబెట్టిన చింతపండు,ఉప్పు,మిర్చి,పోపుతో వేయించిన ఎండు మిర్చి,పచ్చిమిర్చి,చిటికెడు పసుపు వేసి మరీ ముద్దలా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.(ఐడెంటిటీ లేకుండా పేస్ట్ లా అయిపొతే నాకయితే నచ్చదు.)
Tips:
* పచ్చడిలో కారం వేయటం కన్నా పోపుతో పాటూ వేయించిన మిరపకాయలయితే రుచి బాగుంటుంది.
* మిర్చి ఎవరు తినే కారానికి సరిపడా వాళ్ళు వేసుకోగలరు. నేను తక్కువ వాడతాను కాబట్టి రెండే రాసాను.
* గ్రైండ్ చేసిన పచ్చడిలో పోపు ఆఖరులో కలుపుకుంటే బాగుంటుంది.కొందరు పచ్చడితో పాటూ గ్రైన్డ్ చేసేస్తారు.
కానీ వేగిన మినప్పప్పు పోపు, పచ్చడి గ్రైండ్ చేసాకా కలుపుకుంటేనే బాగుంటుంది.Freshness ఉంటుంది.

ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే....!!
క్యేబేజికూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి బాగుందని తినేస్తారు.(చాలా మందిపై ప్రయోగించాను :) )

******************************
(నా బ్లాగ్ రెగులర్ రీడర్స్ కి: ఇది నా 99వ పోస్ట్.సెంచరీ కోసం ఓ వారం ఎదురు చూడాల్సిందే మరి...శెలవు !!)

Saturday, September 12, 2009

మెంతికూర సాంబారు

(ఫోటోలోని సాంబారు నేను చేసినది కాదు.అది మెంతికూర సాంబారు కుడా కాదు .)

ఈ వారం వంట -- మెంతికూర సాంబారు.
సాంబారు అందరూ చేసుకునేదే.కాని మెంతికూరతో సాంబారు చాలా బాగుంటుంది + ఆరోగ్యదాయకం.
మెంతికూరలో పోషకాలు:
1)దీనిలో potassium, calcium, iron వంటి మినరల్స్ ఉన్నాయి.
2)మెంతులు,మెంతికూర రెండూ శరీరానికి చలవ చేస్తాయి.
3)అరుగుదలను పెంచుతాయి.
4)రాత్రి పూట ఒక స్పూను మెంతులు మింగి పడుకుంటే,కాన్స్టిపేషన్ సమస్య ఉంటే;మెంతుల్లో ఎక్కువ శాతం ఫైబర్ ఉండటం వల్ల పొద్దుటికి సర్దుకుంటుంది.
5)పాలిచ్చే తల్లులకి పాలు పెంచుతాయి.
6)మధుమేహాన్ని అదుపు చేయటంలో కూడా ఉపయోగపడతాయి.
7)కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

సాంబారుకి కావాల్సిన పదార్ధాలు:
(ఇది ఐదారుగురికి సరిపోయే సామగ్రి)
* కందిపప్పు :3/4కప్పు
* సన్నగాతరిగిన మెంతికూర :1 కట్ట,చిన్న మెంతి అయితే 2 కట్టలు

(ఆకుకూర తరగకుండా రెండుమూడుసార్లు బాగా కడగాలి.తరిగాకా కడిగితే పొషకాలు ఉండవు.)
*సన్నగా పొడుగా తరిగిన పెద్ద ఉల్లిపాయ :1(చిన్నవి అయితే 2 )
*పచ్చిమెరప :2 or 3 (తినే కారాన్ని బట్టి)
*ఎండుమిర్చి :1
*చింతపండు పెద్ద నిమ్మకాయంత
*నెయ్యి 2 tsps
(చారులోకి,సాంబారులోకి పోపు నెయ్యితో వేసుకుంటే మంచి రుచి వస్తుంది)
*బెల్లం తరుగు 1 tsp (వద్దనుకుంటే ఇది మానేయచ్చు)
*సాంబారు పౌడర్ 2 1/2 tsps
* ఉప్పు 2 tsps(కావాలంటే తగ్గించుకోవచ్చు)
*ఆవాలు 1 tsp
*జీలకర్ర 1/2 tsp
*ఇంగువ 1/4 tsp
(*మెంతికూర వెయ్యని మామూలు సాంబారు పోపులో మెంతులు కూడా నేనైతే వేస్తాను)

మెంతికూర సాంబారు తయారీ :
1) రెండున్నర కప్పుల నీటితో పప్పుని చిటికేడు పసుపు(ఇలా వేయటం వల్ల పప్పుకి మంచి రంగు వస్తుంది,పసుపు ఆరోగ్యకరం కూడా) వేసి,ఒక గిన్నెలో మూత పెట్టి,కుక్కరులో ఉడికించుకుని,మెత్తగా పేస్టులా మాష్ చెసి పెట్టుకోవాలి.
2 ltrs ఉన్న బుల్లి కుక్కరులో అయితే డైరెక్ట్ గా పప్పు పెట్టేసుకోవచ్చు.
2)చింతపండుని 1 1/2 కప్పుల నీటిలో నానబెట్టి ,రసం తీసుకుని,వడబోసుకుని ఉంచుకోవాలి.
3)వెడల్పాటి kaDaiలో లేదా లోతున్న నాన్స్టిక్ పాన్ లో నెయ్యివెసి,ఆవాలూ,జీలకర్ర,ఇంగువ,ఎండు మిర్చి వేసి పోపు వేసుకోవాలి.
4)తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 2,3 నిమిషాల తరువాత సన్నగా తరిగిన మెంతి ఆకు వేసి వేయించాలి.
5)మెంతికూర వేగాకా మంచి వాసన వస్తుంది.అప్పుడు స్టవ్ ఆపేసి,వేగినదంతా వేరే ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి.
అదే ముకుడులో చింతపండు రసం,ఉప్పు,బెల్లం తరుగు వేసి మరగనివ్వాలి.
6)చింతపండు రసం తాలూకూ పచ్చివాసన పోయాకా,మెత్తగా చేసి పెట్టుకున్న పప్పు,సాంబార్ పౌడర్ వేసి బాగా కలపాలి.(సాంబార్ పౌడర్ ముందుగా కాస్త అర కప్పు చన్నీళ్లలో కలుపుకుని అప్పుడు వేసుకుంటే పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుంది)
7)తరువాత ఇందాకా వేయించి ఉంచుకున్న మెంతి ఆకుని ,ఉల్లిపాయ ముక్కలని అందులో కలుపుకోవాలి.
8)తగినన్ని నీళ్ళు కలుపుకోవచ్చు అవసరాన్ని బట్టి.సాంబారు చిక్కబడినట్టు అనిపించాకా దింపేసుకోవటమే.

ఇది అన్నంలోకీ,చపాతిల్లోకీ కూడా బాగుంటుంది.


Sunday, September 6, 2009

ఒక మంచి టిఫిన్:

వంటల పట్ల,కొత్త ప్రయోగాల పట్లా నాకు చాలా ఆసక్తి.నేను ప్రయత్నించిన కొన్ని ఆరోగ్యకరమైన వంటల రెసిపీలని ప్రతి వీకెండ్ లోనూ రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ వారం ఒక మంచి హేవీ టిఫిన్ తో మొదలుపెడుతున్నాను:

బ్రేడ్ తో చేసే ఇది ఒక హెవీ టిఫిన్.హెవీ అంటే కూర ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వెయ్యదు.దీని పేరు నాకు తెలీదు.మేము ముంబైలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నాకు చెప్పింది. ఆవడలు ఇష్టమైన వారికి ఇది నచ్చుతుంది.

కావల్సిన పదార్ధాలు:
1 బ్రెడ్ ప్యాకెట్ (సాండ్విచ్ బ్రెడ్ అయితే బాగుంటుంది)
4,5 (పెద్దవి) ఉడికించిన బంగాళదుంపలు
చిలికిన పెరుగు 1/2లీటర్ (కొద్దిగా నీరు కలుపుకోవచ్చు)
కొత్తిమీర సన్నగా తరిగినది-1చిన్న కట్ట
నూనె - పోపుకి తగినంత
పోపు దినుసులు:ఆవాలు,మినపప్పు,సెనగపప్పు,జీలకర్ర,చిటికెడు ఇంగువ,కర్వేపాకు 2 రొబ్బలు
కారం ఇష్టమైనవారు కూరలొనూ,పెరుగులొనూ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు.

చేసే విధానం:
1)ఉడికించిన బంగాళదుంపలతో "పోపు కూర" చేసి పెట్టుకోవాలి.
2)బ్రేడ్ స్లైసులన్నీ ఏదన్న గుండ్రటి మూతతో రౌండుగా కట్ చేసుకోవాలి.
3)చిలికిన పెరుగులో పోపు వేసుకుని ,కొత్తిమీర చల్లి ఉంచాలి.(రైతా లాగ అన్నమాట)
4)ఒక గరిటెడు బంగాళాదుంపల కూరని ఒక్కో రౌండ్ స్లైసుకి అద్ది, దాన్ని తవా పైన కూర అడుగు వైపుకి వచ్చేలాగ 1నిమిషము ఫ్రై చేసి తీసేయాలి ఇలా...

5)ప్లేటులో పైన వైపు రౌండ్ బ్రేడ్ స్లైసు వచ్చేలాగ ఓ 4 అరేంజి చేసి,
వాటిపైన చిలికిన పెరుగు బ్రెడ్ ముక్కలను కవర్ చేసేలా వేసి,
పైన కొత్తిమీర చల్లుకోవాలి.ఇలా--

ఒక సంగతి:
బంగాళాదుంపలు తినకూడదన్నది ఒక అపోహ.మధుమేహం ఉన్నవారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ తినదగిన పౌష్టికాహారం.ఉడికించిన వాటిల్లో కార్బోహైడ్రేట్స్,విటమిన్ బి,సీ,ఇంకా కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. నూనెలో వేయించితేనే అది హానికరం.పప్పు దినుసుల్లో కన్నా ఎక్కువ తేమ బంగాళాదుంపల్లో ఉంటుంది,అందువల్ల పప్పుదినుసులలో కన్న తక్కువ కేలరీలు వీటిల్లో ఉంటాయి.ఉడికించిన బంగాళాదుంపముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మరసం,కొత్తిమీర చల్లుకుని సాయంత్రాలు టీ టైం లో తినచ్చు.
అయితే,తొక్కతీసి ఉడికించినా,తొక్క బ్రేక్ అయ్యేలా ఎక్కువ ఉడికించినా వీటిలోని పోషకాలన్నీ నశిస్తాయి..
ఈ సంగతి నేనొక పుస్తకంలో చదివి తెలుసుకున్నది.