సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కవిత. Show all posts
Showing posts with label కవిత. Show all posts

Saturday, October 26, 2024

లేనేలేదు మన్నింపు !

 

ప్రారబ్ధమో, కర్మో, నిష్కపటమో, తెలియనితనమో.. 

దుస్సంగతో, దురాగతమో, పొరపాటో, వెన్నుపోటో.. 

కారణమేదైనా, పెట్టే పేరులో ఏముంది గానీ.. 

నష్టమెంతో కష్టమైంది, లోతెరగని గాయమైంది!


నేరం ఒప్పకపోయినా, కన్నీరు ఇంకిపోయినా,

మౌనమే ఆయుధమై పోరాటం ఒంటరిదయినా,

వెలుగు మరుగై వెతలు మిగిలినా,

నిక్కమెన్నటికైనా ఉదయించేనా?


ఇక పయనమాగినా, శ్వాస ఆగినా,

తీర్పు ఎవరిపరమైనా, తోడెవరూ నిలవకున్నా,

ఏ జ్ఞానమెంతపెరిగినా.. లేనేలేదు మన్నింపు !

మనమున లేనేలేదు మన్నింపు!!


Thursday, November 21, 2019

నిట్టూర్పే మివులు !





కలలు 
కోరికలు
ఆశలు
ఆశయాలు
అపారం!
నిరాశ 
నిట్టూర్పు
అవమానం
అభిమానం
వాటికి అడ్డకట్ట!

గాయాలు మానినా
గురుతులు మానవు
తేదీలు మారినా
తేడాలు మాయవు!

ఉషోదయాల వెంబడి
జ్ఞాపకాల నిశీధి వెన్నంటు!

కనుగొనే ఆనందాలకి 
కన్నీటి పొర ఆకట్టు
చిరునవ్వు చివరన 
నిట్టూర్పే మివులు !

Friday, March 6, 2015

అక్షరాలు..





అక్షరాలే స్నేహితులు
అక్షరాలే శత్రువులు

ఙ్ఞాపకాలు తియ్యవైనా
ఙ్ఞాపకాలు బరువైనా

అభిమానాల్ని నిలిపినా
లోకువను ఆపాదించినా

అవమానాల్ని రాజేసినా
విరక్తిని మిగిల్చినా

అక్షరాలే కారణభూతాలు
అక్షరాలే దృష్టాంతాలు 

Thursday, November 20, 2014

కొన్ని రోజులు..



కొన్ని రోజులు ఝామ్మని జారిపోతూంటాయి
దూకే జలపాతంలా..

కొన్ని రోజులు సాదాగా నడిచిపోతూంటాయి
నిఠారైన నిలువుగీతలా..

కొన్ని రోజులు గజిబిజిగా ప్రశ్నిస్తూంటాయి
బోలెడు చుక్కల మెలికల ముగ్గులా..

కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచిపోతుంటాయి
స్తబ్దుగా నిశీధిలా.. 

కొన్ని రోజులు దిశారహితంగా ఉంటాయి 
అచ్చంగా జీవితంలా..


Thursday, October 24, 2013

వాన..





వాన.. వాన.. వాన..
నిన్నట్నుండీ
కురుస్తూనే ఉంది..

తడుపుతోంది..
పుడమినీ.. దేహాన్నీ.. మనసునీ..
కడుగుతోంది..
అరుగునీ.. అడుగులనీ.. ఆలోచనల్నీ..
ఊపుతోంది..
కొమ్మలనీ.. పూలనీ.. కలలనీ..
చలిస్తోంది..
నిశ్శబ్దాన్నీ.. మాపునీ.. నన్నూ..

వాన..వాన.. వాన..
ఇంకా
కురుస్తూనే ఉంది..



Monday, July 1, 2013

అవసరమా?




సందర్భానుసారం రంగులు మారే నైజాలే అందరివీ..
సంజాయిషీలు అవసరమా?

అడగటానికి చాలానే ఉంటాయి ప్రశ్నలన్నీ..
అన్నింటికీ జవాబులు అవసరమా?

జీవనసమరంలో విసిగివేసారిన ప్రాణాలే అన్నీ..
కారణాన్వేషణ అవసరమా?

విరిగిపోయినా, అతుకులతో నడిచిపోయేవే మనసులన్నీ..
అతకడం అవసరమా?

తెంచుకుంటే తెగిపోయేంత అల్పంకావీ బంధాలన్నీ.. 
ముడేసుకోవటం అవసరమా?

ఎప్పటికైనా అపార్థాలను మిగిల్చేవే మాటలన్నీ.. 
మాటలు అవసరమా?



Sunday, March 10, 2013

??




ఎన్ని చికాకులు  ఎన్ని గందరగోళాలు
ఎన్ని దిగుళ్ళు  ఎన్ని నిట్టూర్పులో
బతుకుబండి నడవాలంటే
దాటాల్సినవెన్ని టుపోటులో !

ఎన్ని మాటలు  ఎన్ని మౌనాలు
ఎన్ని కూడికలు  ఎన్ని తీసివేతలో.. 
మంచితనపు చట్రంలో నిలవాలంటే
భరించాల్సినవెన్ని సమ్మెటపోటులో !!



Monday, February 25, 2013

"అనువాదలహరి" లో



నా బ్లాగ్ రెగులర్ పాఠకుల కోసం:

కవిత్వం అంటే ".....spontaneous overflow of powerful feelings from emotions recollected in tranquility" అని Wordsworth అన్నట్లు ఏవన్నా  స్ట్రాంగ్ ఇమోషన్స్ కలిగినప్పుడు కవిత్వాన్ని రాస్తూంటారు కవులు ,కవయిత్రులూ. కానీ నేను అవలీలగా కవితలు రాయగలిగే కవయిత్రిని కానే కాదు. ఏవైనా అనుభూతులు గాఢంగా మనసుని కదిపినప్పుడు మాత్రమే నాలుగువాక్యాలు రాసుకుంటూంటాను. బ్లాగ్ నా సొంతం కాబట్టి అందులో నే రాసుకున్న వాటిని కూడా పొందుపరిచాను.

"అనువాదలహరి" బ్లాగ్ లో ఉత్తమమైన ఆంగ్ల కవితలను తెలుగులో అనువదిస్తుంటారు ఎన్.ఎస్.మూర్తి గారు.  సాహిత్యంలో తమకంటూ ప్రత్యేక స్థానాలు సంపాదించుకున్న ఎందరో కవులు, కవయిత్రుల రచనల మధ్యన నాకూ కాస్త చోటు ఇచ్చారు "అనువాదలహరి" బ్లాగర్ మూర్తి గారు.. 

http://teluguanuvaadaalu.wordpress.com/2013/02/24/sometimes-trishna-telugu-indian/

 ఆ సంతోషాన్ని నా బ్లాగ్ పాఠకులతో పంచుకుందామనే ఈ టపా.. ఇన్ఫర్మేషన్ కోసమే కాబట్టి కామెంట్ మోడ్ పెట్టడం లేదు.


Tuesday, October 9, 2012

నా ఉదయాలు..




రివ్వున వీస్తున్న పవనాలు మనసుని చల్లబరుస్తాయి
పచ్చదనంతో మెరుస్తున్న పైర్లు తలలుపుతూ శుభోదయం చెప్తాయి
కరెంట్ తీగ మీద వాలిన నీలిరంగు పిట్ట నా అందం చూడమంటుంది
హడావుడిగా పరిగెడుతున్న తొండ తలఊపి హలో చెప్తుంది.




పువ్వుల చుట్టూ తిరగాడే రంగురంగుల సీతాకోకచిలుకలు.. 
నా కెమేరాకు అందకుండా కవ్విస్తాయి
మంచుతో తడిసిన గడ్డిపరకలు తళుక్కుమంటుంటాయి
మబ్బుల మధ్యనుండి తొంగి చూస్తున్న సూరీడు 
అప్పుడే రానా.. వద్దా.. అని ఊగిసలాడుతూంటాడు
 తోటలోని ఎర్రని,తెల్లని గులాబీలు విరగబూసి 
నన్ను చూడు..నన్ను చూడు అంటూ గోముగా పిలుస్తూంటాయి



ఈ అందాలతో పనిలేదన్నట్లు ఆ పూరిపాకలోని పాప.. 
తనలోకంలో తాను కేరింతలు కొడుతుంటుంది
ఎర్రని చిగుర్లతో వేపచెట్లు నోరారా పలకరిస్తాయి కానీ
చేతులు చాచుకుని కూచున్న చింతచెట్లు ఎందుకో భయపెడతాయి!


ముళ్లచెట్టు మధ్యన నీలిపూలు మనోహరంగా కనబడతాయి
విరగబూసిన నందివర్థనాలు వెన్నెలని తలపిస్తాయి
నాకు తోడుగా చెవిలో కబుర్లాడుతున్న రేడియో జాకీ
కమ్మని పాటలతో నా ఆనందం పరవళ్ళుతొక్కుతుంది..


అలా.. ఈ ప్రకృతితో నేనూ మమేకమై పరవశించేవేళ
కుయ్యి మన్న రైలు కూతతో ఉలిక్కిపడతాను!
సందుచివర్లో కనబడుతున్న స్కూలు బస్సులు
ఇక చాలు ఈ లోకంలోకి వచ్చేయమని తొందరపెడతాయి
ప్రతి రాత్రీ రేపటి అనుభూతి గురించి కలలు కంటూ నిద్దరోతానా..
మళ్ళీ ఉదయానే నిన్నటి అనుభూతుల్ని వెతుక్కుంటూ నడచిపోతాను...





Monday, November 28, 2011

చాలా సేపైంది..


చాలా సేపైంది
ఎంత సేపని కూర్చోను...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..

చీకట్లు కమ్మే సంజెవేళ ఎంతసేపని నిరీక్షించడం
ఆశనిరాశల తక్కెడకి ఎటుమొగ్గాలో తెలీని సందిగ్ధం
గెలుపుఓటమిల నడుమ మనసు ఆడుతోంది కోలాటం
రేపైనా వస్తావన్నది ఒక రిక్త నమ్మకం..

జీవిత చక్రాల క్రింద నలుగుతున్న రేయీపగళ్ళు..
చూస్తూండగానే పేజీలు మారిపోతున్న కేలెండర్లు !
జ్ఞాపకాల మాటున కదలాడే నీ ఊసులు
అలుపెరుగని కెరటాల లాస్యాలు
ఎంత దూరం పరుగులెట్టినా వద్దని
మళ్ళీ నీ దరికే చేరుస్తాయినన్నవి !!

ఎదురుచూపులు నావరకే ఎందుకు
నువ్వూ నాకోసం కలవరించకూడదూ..
అని తహతహలాడుతుంది మనసు
వెర్రిది.. దానికేమి తెలుసు
నీ మనసు రాయి అని
ఈ జన్మకు అది జరగని పని అని
అయినా ఎందుకో ఈ ఎదురుచూపు..
నాకోసం నువ్వొస్తావని... కలలు తెస్తావని..

చాలా సేపైంది..
ఎంతసేపని కూర్చోనూ...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..

Saturday, May 28, 2011

ప్రశ్నలే ఉండవు


తలుపులు మూసినా తలపు ఆగదు
గాయం మానినా గురుతు చెరుగదు
అపోహ పెరిగితే అపార్ధం తరగదు
అపార్ధం బరువైతే నిజాయితీ కనబడదు


అవమానం ఎదురైతే అభిమానం మిగలదు
స్నేహమే ప్రశ్నైతే మాటలే మిగలవు
నమ్మకం లేకుంటే ఏ బంధమూ నిలవదు
మనసు మూగైనా ఏ పయనమూ ఆగదు


అన్నీ చింతలే ఐతే సాంత్వన దొరకదు
చిక్కులే లేకుంటే చిరునవ్వే చెరగదు
ప్రశ్నలకు బదులే దొరికితే ఏ కలతా కలగదు
జీవితమవగతమైతే అసలు ప్రశ్నలే ఉండవు

 

Thursday, April 14, 2011

పయనం






నాకై నేను అన్వేషించుకునే పయనంలో
ఎన్ని గెలుపులు.. ఎన్ని ఓటమిలో

నిదుర రాని చీకటిపొద్దులో
చక్కిలి జారే ఎన్ని నిట్టుర్పుచుక్కలో

అలుముకున్న గాఢనిద్రలో
ఎన్నియలలో ఎన్ని కలలో

రెప్పపాటులో దూరమయ్యే దీవెనలు
ఎడారిలో ఒయాసిస్సులు

గుండెను భారం చేసే దిగుళ్ళు
దాచినా దాగని వాస్తవాలు

ఆపినా ఆగని కన్నీళ్ళు
గట్టుదాటి పొంగే నదీతీరాలు

రెక్క విప్పుకుని నింగికెగసే చిరునవ్వులు
రూపు మారిన సీతకోకచిలుకలు

కలవరం లేని రేపటికోసం ఎదురుచూపు
నింగికెగసిన ఆశాసౌధం

నిరాశను అశాంతం చిదిమేసే మనోనిబ్బరం
ఇప్పుడే కళ్లుతెరిచిన పసికందు

ఎన్ని మలుపులు తిరిగినా దొరకదు గమ్యం
అందని జాబిలిలా

నిరంతరం భాషిస్తూనే ఉంటుంది అంతరాత్మ
ఘోషించే సాగరంలా

ఎన్ని నిరాశలు ఎదురైనా ఓడదు మనసు
అలుపెరుగని అలలా

నాకై నేను అన్వేషించుకునే పయనంలో
ఎన్ని గెలుపులు.. ఎన్ని ఓటమిలో

Saturday, March 19, 2011

నిరీక్షణ..


నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

చిరుగాలి సవ్వడికి తల ఊపే
ప్రతి పువ్వు కదలికకి
ఆకురాలు నిశ్శబ్దంలోకి
తొంగి తొంగి చూసాను..
దారి పొడుగునా..అడుగడుగునా
పరీక్షించి...ప్రతీక్షించి
వేచి వేచి చూసాను..
ఎక్కడా నీ పాదాల జాడే లేదు.
ఏ చోటా నీ ఆచూకీ దొరకనేలేదు.
ఏమయ్యావు నువ్వు?

క్రితం జన్మలో ఎప్పుడు విడిచావో
ఈ చేతిని...
ఇంతదాకా మళ్ళీ అందుకోనేలేదు..
ఎక్కడని వెతకేది నీ కోసం?
నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాను..

చినుకురాలినప్పుడు..
కమ్మని మట్టివాసన
గుండెనిండా నిండినప్పుడు..
దూరాన గుడిగంటలు
హృదయంలో ప్రతిధ్వనించినప్పుడు..
చల్లని వెన్నెల కిరణాలు
చెట్లమాటు నుంచి
నావైపు తొంగిచూసినప్పుడూ..
మధురమైన రాగానికి పరవశించి
నా గొంతు శృతికలిపినప్పుడూ..
ఎప్పుడూ..
నిన్ను తలుస్తూనే ఉన్నానూ.
కనుల కలలవాకిల్లో నీ రూపాన్ని
ఊహించ ప్రయత్నిస్తూనే ఉన్నాను.

ఈ నిరీక్షణకూ..ఈ అన్వేషణకూ అంతం ఎప్పుడు?
ఏ నాటికి నీ చేయి
నాకు తోడునిచ్చి అందుకునేది?
నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

*** *** *** *** ***

పైన రాసినది ఇప్పుడు రాసినది కాదు...:) 12ఏళ్ళ క్రితం రాసిన ముచ్చట. ఆ తరువాత నాలుగేళ్ళకు మా పెళ్ళి అయ్యింది. అప్పుడిక గట్టిగా చేయిపట్టేసుకుని ఈ కవితను అంకితమిచ్చేసాను...:) "మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అని బలంగా నమ్మే మనిషిని నేను. మధ్యాహ్నం "మాల గారి బ్లాగ్" లో పైన చిత్రాన్ని, ఆ తరువాత మాల గారి ఆహ్వానంపై ఈ రాజా రవివర్మగారి చిత్రానికి కవితలు రాసిన బ్లాగ్మిత్రుల ఇతర కవితలు చదివాకా వెంఠనే నాకు ఈ పాత కవిత గుర్తుకు వచ్చింది. మాల గారికి 'నేను రాస్తానని' పర్మిషన్ అడిగేసి, ఇంటికి వచ్చి పాత పుస్తకాలన్నీ తిరగేస్తే దొరికేసిది - కవిత రాసిన చిన్న స్పైరల్ నోట్ పాడ్. కానీ పనులన్నీ అయ్యేసరికీ ఇంత సమయమైంది. సరేలే ఇవాళ్టి వెన్నెల తోడుంది కదా అనేస్కుని టపా రాసేస్తున్నా.

పైన ఫోటో నాకు నెట్లో దొరికిన మరో ఇమేజ్.

Thursday, September 2, 2010

दुनिया ने कहा..



मैं खामोश रही
दुनिया ने कहा
व़ो मुस्कुराना भूल गयी ll


मैं हँसनॆ लगी
दुनिया ने कहा
उसने अपना ग़म भुलादिया ll

दुनिया क्या जानॆ
कि ऎ भी एक अदा है
ग़म छुपानॆ 
का ll

*******************************

తెలుగులో..

నేను మౌనంగా ఉన్నాను
లోకమంది
అమె చిరునవ్వును మరిచిందని

నేను నవ్వాను
లోకమంది
ఆమె దు:ఖాన్నే మరిచిందని

లోకానికేంతెలుసు
బాధని మరిచేందుకు
ఇదీ ఒక పధ్ధతని..

(తెలుగులో కూడా అర్ధం అడిగారని రాసాను. )


Friday, June 18, 2010

ఒక పాత కవిత...

ఏవో పుస్తకాలు సర్దుతూంటే ఎప్పుడో '97లో రాసిన కవిత ఒకటి కనిపించింది...చాలా రోజుల్నుంచి ఇది ఎందులో, ఎక్కడ ఉందా అని వెతుకుతున్నా..!


పట్టుచీరల రెపరెపలు, ఘాటు సెంట్ల గుబాళింపులు...
మొహమాటపు చిరునవ్వులూ, ప్రెస్టేజీ షోఅప్ లూ...
మనిషినే శాసిస్తున్న కరన్సీ నోట్లు, బ్యాంక్ బేలన్సులు...

ఇవి ఏవీ దాచలేవు - మనిషి మనసు తహతహలూ
అవి - ఎగసిపడే అంతులేని ఆశాకెరటాలు

ఇవి ఏవీ దాచలేవు - పిడికెడు గుండె సవ్వడులు
అవి - గొంతు చీల్చుకు పైగెగసే అనురాగసౌధాలు

ఇవి ఏవీ దాచలేవు - మూగకళ్ళ కన్నీటి వ్యధలు
అవి - మోముపై కదలాడే మనోభావతరంగాలు

కానీ ఇవి అన్నీ...
వెలికి రానీయవు మనిషిలోని మమతను
అజ్ఞాతమైపోయిన మానవత్వపు వెలుగును !!

Sunday, March 21, 2010

గాయం..



హృదయం ముక్కలవుతుంది
దెబ్బతిన్న ప్రతిసారీ..

మౌనం వెక్కిరిస్తుంది
మాటలు కరువైన ప్రతిసారీ..

మనసు విలవిలలాడుతుంది
అభిమానం అవమానింపబడిన ప్రతిసారీ..

గాయం మాననంటుంది
లోతుగా తగిలిన ప్రతిసారీ..

కన్నులు మసకబారతాయి
ఆరని మంటలు ప్రజ్వలించిన ప్రతిసారీ..

ఆత్మ ఆక్రోశిస్తుంది
చేయని తప్పుకు శిక్ష పడిన ప్రతిసారీ..

ఏదేమైనా లేవాటానికే ప్రయత్నిస్తాడు మనిషి
క్రిందపడిన ప్రతిసారీ..


ఒక అపార్ధం నుంచి వచ్చిన నిరసన, నిర్లక్ష్యం వల్ల కలిగిన ఆవేదనలోంచి వచ్చిన వాక్యాలు ఇవి...అవుట్లెట్ కోసం రాసినవి మాత్రమే! ఎందుకంటే మనిషికి కలిగే బాధ స్వయంకృతం. అది మనం ఎదుటి వ్యక్తికీ ఇచ్చే విలువను,ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఈ ఇహలోకపు భ్రమల్లో సంచరిస్తూ ఉన్నంతకాలం మనకు మనం విధించుకునే సంకెళ్ళు ఈ భావోద్వేగాలు...వీటిని అధిగమించటానికి భగవదనుగ్రహం కావాలి...అంతవరకు తప్పవు ఈ గాయాలు..

*******************************************

నేను పరిచయం చేస్తున్న సీరియల్ చదువుతున్న ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే వారికి ఈ గమనిక...

నిన్న కష్టపడి ఒక గంట కూర్చుని మూడవ భాగం రాసాను..కానీ రాస్తున్నది ఆన్లైన్లో అవటం వల్ల చివరి క్షణంలో కరెంట్ పోయి మొత్తం డిలిట్ అయిపోయింది. నా సిస్టం పాడయిపోవటం వల్ల కలుగుతున్న తిప్పలు... చదివేవారు కొందరైనా మొదలెట్టినది పూర్తి చేయాలి కదా..మళ్ళీ ఓపిక తెచ్చుకున్నాకా, ఈ బ్లాగ్లో టపాలు తాత్కాలికంగా ఆగిపోయేలోపు తప్పక పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాను.

--తృష్ణ.

Friday, February 26, 2010

ఎవరు నువ్వని?


కేరింతలాడుతూ పరుగులెడుతూ దోబూచులాడుతున్న
అమాయకత్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
గారాల పాపాయిని అంది.

పుస్తకాలతో కుస్తీలు పడుతూ హడావుడిపడుతున్న
రిబ్బను జడల చలాకీతనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
పోటీప్రపంచెంలోని విద్యార్ధిని అంది.

కళ్ళనిండా కాటుకతో
కలతన్నదెరుగని ఊహాసుందరిని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
విరబుసిన మందారాన్ని...కన్నెపిల్లని అంది.

చెలిమితో చెట్టాపట్టాలేసుకుని తిరగాడే
ఆర్తితో నిండిన నమ్మకాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
సృష్టిలో తీయనైన స్నేహహస్తాన్ని అంది.

అధికారంతో ఆ చేతులకు
రాఖీలు కడుతున్న ఆప్యాయతనడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
అన్నదమ్ముల క్షేమాన్ని కాంక్షించే సహోదరిని అంది.

సన్నజాజుల పరిమళాలను ఆస్వాదిస్తూ
వెన్నెల్లో విహరిస్తున్న అందాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
నా రాజుకై ఎదురుచూస్తున్న విరహిణిని అంది.

పెళ్ళిచూపుల్లో తలవంచుకుని బిడియపడుతున్న
సిగ్గులమొగ్గను అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
అమ్మానాన్నల ముద్దుల కూతురుని అంది.

మెడలో మెరిసే మాంగల్యంతో
తనలో తానే మురిసిపోతున్న గర్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
దరికి చేరిన నావను..నా రాజుకిక రాణిని అంది.

వాడిన మోముతో, చెరగని చిరునవ్వుతో
తకధిమిలాడుతున్న సహనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
బరువు బాధ్యతలు సమంగా మోసే ఓ ఇంటి కోడలిని అంది.

విభిన్న భావాలను సమతుల్యపరుస్తూ
కలహాలను దాటుకుని
పయనిస్తున్న అనురాగాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా..
కలకాలం అతని వెంట
జంటగా నిలిచే భార్యను అంది.

నెలలు నిండుతున్న భారంతో
చంకలో మరో పాపతో సతమతమౌతున్న
సంఘర్షణ నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
ముద్దు మురిపాలు పంచి ఇచ్చే తల్లిని అంది.

అర్ధంకాని పాఠాలను అర్ధం చేసుకుంటూ
పిల్లలకు పాఠాలు నేర్పుతున్న ఓర్పు నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
నా చిన్నారులకు మొదటి గురువుని అంది.

ఇక్కడిదాకా రాసి ఆగిన
కలాన్ని అడిగాను ఆగిపోయావేమని...
ఇంకా అనుభవానికి రాని భావాలను
వ్యక్తపరిచేదెలా..అని ప్రశ్నించింది..!!

Wednesday, November 18, 2009

ఓ అనువాదం





నీ రాకతో వసంతాన్ని
ఒంటరితనంలో ఆనందాన్ని
ఆనందంలో ఒక బంధాన్ని
తోడిచ్చిన ప్రకృతి
ఈ ఏకాంతపు సాయంత్రం
"మనం" మాత్రమే ఉన్న కలలని
చేసింది నా సొంతం....




Wednesday, October 21, 2009

ఏమో...


ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....

ఇంతే దు:ఖం అయి ఉంటుంది....
ఇవే కన్నీళ్ళయి ఉంటాయి...
ఇదే నిస్పృహ ఆవరించి ఉంటుంది...
ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....

పగిలి ముక్కలైన మనసుని అతికాను
ఉదాసీనమైన మోములో నవ్వు చిందించాను
వెంట వస్తున్న నిరాశను సాగనంపాను
ఏమో ...మునుపెలా ఓర్చానో గాయాల్ని....

మంచితనాన్ని వాడుకున్న స్నేహపు వంచనలు దాటాను
వదలనంటూనే చేయి వీడిన నేస్తాలను వదిలాను
మాటల బాణాలతో మనసు తూట్లుచేసినా భరించాను
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....


ఈనాడిలా ఓడిపోయను...
కన్నీటిలో కరిగిపోయాను...
నిట్టూర్పులో ఆవిరయ్యాను...

చెయ్యని నేరానికి దోషినయ్యాను...
ఈనాడిలా ఓడిపోయను...
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....

Thursday, September 10, 2009

ఒకోసారి...


ఒకోసారి...
...గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది
...ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది
...వెలుగు కన్నా చీకటే బాగుందనిపిస్తుంది

ఒకోసారి...
...పరిచయంలేని అపరిచితుల వద్దే మనసు విప్పాలనిపిస్తుంది
...సమాధానం కన్నా చిరునవ్వే చాలనిపిస్తుంది
...కళ్ళు మూసుకుని గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది

ఒకోసారి...
...కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది
...నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది
...మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది

ఒకోసారి...
...నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది
...వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది
...మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది...!!