ఆమె ఒక మనోహరమైన స్త్రీ. ఒక కథ. ఒక జ్ఞాపకం. భారతదేశ చలనచిత్ర జగత్తలో ఒక వెలుగు వెలిగిన అలనాటి అందాల నటీమణి లీలానాయుడు. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి కి చెందిన ప్రముఖ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ రామయ్య నాయుడు గారి కుమార్తె లీలానాయుడు. తల్లి ఫ్రెంచ్ దేశస్తురాలు.1954లో మిస్ ఇండియా గా ఎన్నుకోబడింది. అప్పట్లో "వోగ్" అనే పత్రికవారు ప్రపంచంలోని పదిమంది అత్యంత సుందరీమణూల్లో ఈమెను ఒకతెగా ప్రకటించారు. ఆమె మొదటి చిత్రం హృషీకేష్ ముఖర్జీ తీసిన "అనురాధ(1960)". నాకెంతో ఇష్టమైన సినిమాలలో అది ఒకటి. ఆ సినిమాకు ఆ సంవత్సరంలో నేషనల్ అవార్డ్ కూడా లభించింది. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమెకు నటిగా పేరును తెచ్చిపెట్టింది. ఆమె ఆంగ్ల నటి "సోఫియా లారెన్" తో పోల్చబడింది కూడా.
తరువాత 1962లో ఆమె "ఉమ్మీద్" అనే చిత్రం చేసారు. వివాదాస్పదమైన నానావతి మర్డర్ కేస్ ఆధారంగా చిత్రించిన "యే రాస్తే హై ప్యార్ కే(1963) సినిమాలోని ఆమె నటన దేశవ్యాప్తంగా గుర్తింపుని, మన్ననలనూ పొందింది. అదే సంవత్సరంలో లీలానాయుడు జేమ్స్ ఐవొరీ తీసిన "ద హౌస్ హోల్డర్" అనే ఆంగ్ల చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆమెకు ఎంతో ప్రతిష్ఠను సంపాదించిపెట్టింది.
సత్యజిత్ రాయ్ కూడా ఆమె నటనను ఎంతో ప్రశంసించి "ద జర్నీ" అనే సినిమా తీయాలని సంకల్పించారు కానీ చేయలేకపోయారు. రాజ్ కపూర్ ఆమెతో చిత్రాలు తీయాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారని చెబుతారు. ఒకసారి ఒప్పుకుని సెట్స్ కు కూడా వెళ్ళి ఆ తరువాత మరో నాలుగు చిత్రాలకు బాండ్ రాయటానికి ఇష్టపడక షూటింగ్ విరమించుకుని వెళ్ళిపోయరుట. "ద గురు(1969)" అనే సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించిన తరువాత లీలానాయుడు నటించటం మానివేసారు.
ఇరవైయేళ్ళు నిండకుండానే ఆమె ఒక పారిశామికవేత్తను వివాహమాడారు. ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె మొదటి వివాహం ఎక్కువకాలం నిలవలేదు. ఆ తరువాత 'డోమ్ మోరిస్' అనే కవిని వివాహమాడి పదేళ్ళు విదేశాల్లోనే భర్తతో గడిపారు. పత్రికా రంగంలో పేరున్న వ్యక్తి ఆయన. డోమ్ మోరిస్ ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ట్రాన్సలేటర్ గా వ్యవహరించారు. పలు పత్రికల్లో ఎడిటర్ గా, కొన్ని ఇతర దేశీయ చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసారు లీలానాయుడు.
ఎందువల్లనో ఆమె రెండవ వివాహం కూడా నిలవలేదని అంటారు. ఎన్నో సంవత్సరాల తరువాత మళ్ళీ శ్యామ్ బెనిగల్ "త్రికాల్(1985)"లో ఆమె నటించారు. ఆమె చివరిసారిగా నటించినది 1992లో. కోర్టు ఆమె ఇద్దరు కుమర్తెల సంరక్షణను మొదటి భర్తకు అప్పగించింది. ఆ కేసును ఓడిపోయాకా ఆమె చాలా కృంగిపోయారు. తరువాత గొప్ప తత్వవేత్త అయిన జిడ్డుకృష్ణమూర్తి గారి బొధనల పట్ల ఆమె ఆకర్షితులై ఆయన శిష్యులైయ్యారు. దీర్ఘకాల అనారోగ్యం తరువాత 69 ఏళ్ళ వయసులో లీలానాయుడు కన్ను మూసారు. చిన్నవయసులోనే ఎంతొ ఖ్యాతి గడించిన ఆమె...ఎందరికో ఆరాధ్యమైన ఆమె జీవితంలో ఎన్ని విషాదాలో...!
కానీ భారతీయ చలనచిత్ర రంగంలో గుర్తుంచుకోదగ్గ మంచి నటి, అపురూప సౌందర్యవతి లీలానయుడు. ఆమె జెర్రి పింటో తో పంచుకున్న జ్ఞాపకాలను "ఏ పేచ్ వర్క్ లైఫ్" అనే పుస్తకంగా పెంగ్విన్ బుక్స్ వాళ్ళు ప్రచురించారు.