సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label సరదా కబుర్లు. Show all posts
Showing posts with label సరదా కబుర్లు. Show all posts

Sunday, October 12, 2014

Bright sunday !





పొద్దున్నే లేవడం లేటైనా వాకింగ్ మానలేక గబగబా తెమిలి బయల్దేరా. మిష్టర్ సూర్యదేవ్ అప్పుడే ఎదురైపోయాడు. వెలుతురు రాకుండా వాకింగ్ చేస్తే బావుంటుంది కానీ ఇలా మిష్టర్ సూర్యదేవ్ వంక చూస్తూ ఆ వెచ్చని చూపులు తనువుని తాకుతూండగా నడవడం కూడా భలేగా ఉంటుంది. లేటవడం కూడా బావుంది అనుకున్నా. ఓ ఎఫ్.ఎం లో గణేష సుప్రభాతం పాడుతున్న బాలమురళీకృష్ణగారి గాత్రం తాలూకూ బేస్ వైబ్రేషన్ నెమ్మదిగా ఇయర్ఫోన్స్ లోంచి మెదడుని తాకుతోంది.

నిన్నసలు రోజు మొదలవ్వడమే చిరాగ్గా మొదలైంది. ఒక సంఘటన చాలా బాధపెట్టేసింది. సాయంత్రం దాకా ఫీలయ్యీ ఫీలయ్యి..లయ్యీ..ఈ.... ఇక లాభం లేదనుకుని 'ఓ సామీ ఎలాగూ దీపావళి వస్తోంది కదా కాస్తలా షాపింగ్ కి తీసుకుపోదురూ' అని బ్రతిమాలా అయ్యవారిని. ఏదో పొదుపు చేసేద్దామనుకున్నప్పుడే ఖర్చులు ఇంకా పెరుగుతాయి..(నెలకి రెండు పండగలు వస్తాయి) కదా... పాపం జేబులు తడుముకుంటూ బయల్దేరారు! నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నాతో పాటూ అరడజను షాపులు తిప్పేసాకా, 'అమ్మా ఇంక వెళ్పోదామని' పిల్ల పేచీ మొదలెట్టే సమయానికి, ఆఖరికి రోడ్డు మీద ఓ పక్కగా గుట్టగా పోసి అమ్మేస్తున్న టాప్స్ లోంచి య్యగారి అనుమతితో రెండు సెలక్ట్ చేసి షాపింగ్ పూర్తి చేసా. అంతకు ముందే పిల్లకి బాగా నచ్చిన ఫ్రాక్ కొనేసాం కాబట్టి 'అమ్మా నువ్వు రెండు కొనుక్కున్నావ్..' అని పోటీకి రాలేదని. బస్సులో కూచున్నాకా 'హమ్మయ్య హేపీనా..' అనడిగారు అయ్యవారు. 'ఏదీ ఇంకా ఒక టాప్ మీదకి మ్యాచింగ్ పటియాలా బాటమ్,చున్నీ కొనుక్కోవాలి కదా..' అన్నా. 'హతవిధీ!!' అని తలకొట్టుకున్నారు పాపం :) ఏదేమైనా మూడ్ బాలేనప్పుడు షాపింగ్ చెయ్యడమే మంచి ఉపాయం...! ఇంటికొచ్చి భోం చేసి, సంగీతప్రియలో పాట పోస్ట్ పెట్టి, పురాణం చదువుకుని పడుకునేసరికీ సమయం రెండు గంటలు చూపించింది. (ఈ పురాణ పఠనం గురించి ఓ పోస్ట్ రాయాలని నెలరోజుల్నుంచీ అనుకుంటున్నా!! ఎప్పటికవుతుందో) అందుకే ఇవాళ పొద్దున్న లేవలేకపోయా. అదన్నమాట.

సరే మళ్ళీ పొద్దుటి వాకింగ్ దగ్గరికొచ్చేస్తే.. కొత్త రూట్ లో వెళ్దాం అని వేరే సందులోకి తిరిగాను. ఇదివరకూ అక్కదంతా ఖాళీ జాగా ఉండేది. ఇప్పుడు కొత్తగా ఇళ్ళు రెడీ అయిపోతున్నాయి..అక్కడుండే చెట్లు మొక్కలు అన్నీ కొట్టేసారు :( 


సెక్యూరిటీ గార్డ్ గుడిసె అనుకుంటా..బాగుంది కదా..

ఓ ఇంటి ముందర కాశీరత్నం తీగ కనబడింది. ఈ ఎర్రటి నాజూకైన పూలు నాకెంత ఇష్టమో చెప్పలేను. బెజవాడలో మా క్వార్టర్ గుమ్మానికి పక్కగా క్రీపర్ పెంచి ఎంతమందికి ఈ విత్తనాలు పంచానో..! చిన్నప్పుడు భాస్కరమ్మగారింటి వెనక పెరట్లో పిచ్చిమొక్కలతో పాటూ ఎన్ని తోగలు పెరిగేవో.. ఈ తీగ కనబడితే చాలు నేను నాస్టాల్జిక్ అయిపోతాను. నెమ్మదిగా ఆ గుమ్మం దాకా వెళ్ళి నాలుగు విత్తనాలు కోసేసుకుని చున్నీ చివర ముడి వేసేసాను. ఇంట్లో ఎవరూ లేచిన అలికిడి లేదు. ఎవరైనా కనబడితే అడిగే కోసుకుందును. గొప్ప ఆనందంతో వేరే సందులోకి వెళ్ళా. అక్కడ ఉండే ఓ ఇండిపెండెట్ హౌస్ నాకు బాగా ఇష్టం. చుట్టూరా చక్కగా  బోలెడు కూరగాయల  మొక్కలు వేస్తూంటారు వాళ్ళు. సీజనల్ కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. పపాయా పిందెలు చెట్టు నిండా ఉన్నాయి. ఇంకా వంకాయ, కాలిఫ్లవర్, చిక్కుడు వేసారు. కన్నులారా ఆ మొక్కల్ని చూస్తూ ఆ సందు దాటాను.





వంకాయలు కనబడుతున్నాయా?



సత్సంగ్ కాలనీ లో ఫస్ట్ సిటీ బస్సు ఆగి ఉంది. వాళ్ల కాలనీ బయట పెంచే మొక్కలు కూడా చాలా బావుంటాయి చూడ్డానికి. అవి చూడడానికే అటువైపు వెళ్తుంటాను నేను. అప్పుడే లోపల్నుండి పాల బెల్లు ఔంవినపడింది. వాళ్లవన్నీ ఖచ్చితమైన పధ్దతులు. మా గేటేడ్ కమ్యూనిటీలో కూడా ఉన్నారు బోలెడుమంది సత్సంగీస్. పొద్దుటే నాలుగున్నరకే ప్రయర్ కి వెళ్టూంటారు. అక్కడ రౌండ్ పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నా రోజూ నాకెదురయ్యే జంట దూరంగా వెళ్పోతూ కనబడ్డారు. నేను లేట్ కదా ఇవాళా. చెవిలో గణేశ సుప్రభాతం అయిపోయి 'ఢోల్ బాజే' పాట ఎప్పుడు మొదలయ్యిందో గమనించలేదు కానీ అది పూర్తయ్యి 'నీ జతగా నేనుండాలి..' మొదలయ్యింది. ఎదురుగా ఉన్న మిష్టర్ సూర్యదేవ్ చూపుల వేడి ఎక్కువయ్యింది. ఇక ఈ పూటకి ఎనర్జీ బానే వచ్చేసింది వాకింగ్ చాలెమ్మనుకుని ఇంటిదారి పట్టాను.

బ్లాగ్ ముట్టుకుని చాలారోజులైందనిపించి ఈ ఉదయపు నడక కబుర్లన్నీ ఇక్కడ ఇలా నమోదు చేసా. సరే మరిక కబుర్లయిపోయాయి.. మీ పనుల్లో మీరుండండి..:-)

Tuesday, March 4, 2014

క్రియేటివిటీ !


ఏవో పాటలు వెతుకుతుంటే యూట్యూబ్ లో కనబడింది ఈ ఏడ్.. బాగా నచ్చేసింది నాకు. మూడు నిమిషాల్లో ఎంత పెద్ద కథనైనా ఇట్టే ఇమడ్చటమే కదా క్రియేటివిటీ అంటే!


Sunday, March 24, 2013

కొత్త పుస్తకాలు

(కొత్త పుస్తకాలకింకా ఫోటో తియ్యలే..ఇది పాత ఫోటోనే)


అప్పుడప్పుడు దాచుకున్న కాయితం ముక్కలతో పర్సు నిండగానే మనసు పుస్తకాల షాపు వైపు పరుగులు తీస్తుంది. గత ఏడాది మూడు దఫాలుగా కొన్న పుస్తకాలన్నీ చదవటం అవ్వనేలేదు.. మళ్ళీ కొనటం ఎందుకని కాస్త ఆగాను. పది పదిహేను రోజుల క్రితం ఒక కొత్త పుస్తకం గురించి విన్నాకా శ్రీవారికి ఫోన్ చేసి అడిగితే, పాపం ఆఫీసు నుండి రెండు ప్రముఖ షాపులకూ వెళ్ళి ఇంకా రాలేదన్నారని వచ్చేసారు. కాస్తాగి మళ్ళీ ఇవాళ చేస్తే నవోదయాలో ఉందని చెప్పారు. సరే పదమని శ్రీవారిని బయల్దేరదీసా. " ఆ పుస్తకమేదో మొన్ననే దొరికి ఉంటే బావుండేది... నువ్వు బయల్దేరితే..." అని పాపం భయపడ్డారు. "అబ్బే మీ జేబుకేం భయంలేదు.. నా పర్సు ఈమధ్యన కాస్త బరువెక్కిందిలెండి" అని అభయమిచ్చాను :)


ఎవరెంత దూరంలో ఉండాలో దేవుడంతే దూరంలో ఉంచుతాడుట. అందుకేనేమో పుస్తకాల షాపులకీ నాకూ మధ్యన  మైళ్ళు బాగా ఎక్కువైపోయాయి. అంచేత బండి పక్కనబెట్టి బస్సు మార్గాన్నేఎంచుకున్నాం. ఎర్రని ఎండలో రెండు బస్సులు మారి గమ్యం చేరాం. పుస్తక ప్రదర్శన తర్వత మీరు మళ్ళీ రాలేదేం అని ఆప్యాయంగా పలుకరించారు షాపులో ఆయన. "మొన్న మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించామని మేము బాగా ఫీలయ్యామండీ.." అంటూ మావారి చేతిలో నాక్కావాల్సిన పుస్తకాన్ని పెట్టారు ఆయన. "అక్కడివ్వండి.. ఈసారి ఆవిడదే బిల్లు.." అంటూ దొరికిందే ఛాన్సని మరో నాలుగు ఛలోక్తులు విసిరారు అయ్యగారు. "అబ్బే ఆవిడ ఖచ్చితంగా అలా అని ఉండరు.." అని షాపాయన నాకు సపోర్టందించారు. నేను తీసుకున్న పుస్తకాలు కాక మరో ఐదారు పుస్తకాలు బిల్లు జాబితాలో చేర్పించాకా "ఈ కథలు కూడా బావుంటాయి చూడండి.." అని మరో పుస్తకాన్ని అందించారు. వద్దు మహాప్రభో...ఇక చాలన్నాను. ఆయన వెంఠనే పుస్తకాన్ని తెరిచి ఓ కథ చూపెట్టి, "ఈ కథ చదవండి. నచ్చకపోతే పుస్తకం వెనక్కి తెచ్చి ఇచ్చేయండి. ఈ ఒక్క కథ కోసం ఈ పుస్తకం కొనచ్చు" అన్నారు. ఇహ అది కూడా కలిపి ఓ పదిపదిహేను పుస్తకాలు రెండు క్లాత్ కవర్లల్లో నింపుకుని, తృప్తిగా మిగతా పనులు ముగించుకుని ఇల్లు చేరేసరికీ రాత్రి భోజనసమయం దాటిపోయింది. 


ఇంటికొచ్చి గబగబా వంటచేసి, తిని, పిల్లని పడుకోబెట్టి, అన్ని పనులూ పూర్తి చేసుకునేసరికీ గడియారం ముల్లు ఇవాళ్టి తేదీ చూపించేసింది. కొత్తగా కొన్నపుస్తకాలు ఇంటికొచ్చాకా ఓసారి మళ్ళీ అన్నీ తిరగేసి, అన్నింటిపై కొన్నతేదీ వేసి, సంతకం పెట్టుకోవటం నాకు అలవాటు. రేపు ఆదివారమే కదా అందుకని లేటయినా తీరుబడిగా అన్నీ ఓసారి తిరగేసి, షాపాయన బాగుంటుందన్న కథ చదువుతూ లోకం మర్చిపోయినా, మధ్యలో ఓసారి తలెత్తి 'నాకు లేటవుతుంది.. మీరు నిద్రోండి..' అని చెప్పేసా! మనసు బరువైపోయినా వెంఠనే రెండవసారి మళ్ళీ చదివా! కథయ్యేసరికీ ఈ సమయమైంది. అసలు ఆ కథ గురించి రాద్దామని బ్లాగు తెరిచా.. కానీ ఈ కథంతా రాయాలనిపించి రాసేసా :) ఎందుకనో ఈసారి కొన్న పుస్తకాలన్నీ చాలా ఆనందాన్నీ, మంచి పుస్తకాలు కొన్నానన్న తృప్తినీ కలిగించాయి. వీటిల్లో ఎన్నింటి గురించి టపాలు రాయగలనో... చూడాలి మరి !


వచ్చేప్పుడు దారిలో నాన్న డాక్టరు దగ్గరకు వెళ్తే, పుస్తకాలు చూపించచ్చు అని అక్కడికి వెళ్ళా. నాన్న అన్నీ చూసి "బావున్నాయే.." అని "మరి చిరిగిన చొక్కా ఏదీ.." అన్నరు :-)

Saturday, March 16, 2013

పనసచెట్టు - పనస పొట్టు




అనగనగా మా ఊరు. మా ఊరి పెరటితోటలో పెద్ద పనసచెట్టు. దాని నిండా ఎప్పుడూ గంపెడు పనసకాయలు ఉండేవి. పైన ఫోటోలో ఉన్నట్లు బుజ్జి బుజ్జి కాయలు కూర కు వాడేవారు. శెలవులయిపోయి బెజవాడ వెళ్పోయేప్పుడు మా సామానుతో పాటు ఓ గోనె బస్తా.. దాన్నిండా బుజ్జి బుజ్జి పనసకాయలు, ఓ పెద్ద పనసకాయ ఉండేవి. చిన్నవి కూర కాయలని ఇరుగుపొరుగులకి పంచేసి, పెద్ద కాయ మాత్రం అమ్మ కోసి తొనలు పంచేది.


మా చెట్టు పనసకాయలో అరవై డభ్భై దాకా తొనలు ఉండేవి. కొన్ని కాయల్లో వందా దాకా తొనలు ఉండేవి. మహా తియ్యగా ఉంటాయని అందరూ చెప్పుకునేవారు. అలా ఎందుకు అంటున్నానంటే నేనెప్పుడూ పనసకాయ తిని ఎరుగను ! నాకా వాసనే గిట్టదు..:( ముక్కు మూసేసుకుంటాను. మా అన్నయ్య నాతో ఒక్క పనస తొన అయినా తినిపించాలని పనసతొనలు పట్టుకుని నా వెనకాల తిరిగేవాడు.. ముక్కు మూసుకుని ఇల్లంతా పరిగెట్టించేదాన్ని తప్ప ఒక్కనాడు రుచి చూడలేదు. అందుకే అన్నారు "ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి.." అని గేలి చేసినా సరే! పనసకాయ కోసే దరిదాపులకి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు నా కూతురు వాళ్ల నాన్నతో కలిసి నన్ను ఆటపట్టిస్తూ పనసతొనలు తింటుంది. బజార్లో కూర కోసం పనసపొట్టు, పాప కోసం పనస తొనలు కొంటుంటే నాకు మా పెరట్లోని చెట్టు గుర్తుకు వస్తుంది.. ఎంత పెద్ద చెట్టో ఎన్ని కాయలు కాసేదో.. ! కాలజాలంలో ఇల్లు, పెరడు అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడిలా కొనుక్కుని తింటున్నాం కదా అని మనసు చివుక్కు మంటుంది..:( నువ్వు ఒక్క పనసచెట్టు గురించి ఇంతగా అనుకుంటున్నావా..? మాకు పనస తోట ఉండేది.. తెల్సా అన్నారు నాన్న!


 పనసతొనలు తినను కానీ పనస పొట్టు కూర మాత్రం చక్కగా చేస్తాను, తింటాను. ఇంతకీ ఇప్పుడు సంగతేంటంటే మా అన్నాయ్ మాంగారూ ఊర్నుండి కూర పనసకాయ తెచ్చిచ్చారు. వద్దనలేను కదా.. తెచ్చేసా ! 
కానీ ఎట్టా పొట్టు చెయ్యాలి? నా దగ్గర కత్తి లేదు కత్తిపీటా లేదు :(
"చాకుతో పనసపొట్టు తీసే మొహం నేనూను..:( " అనేస్కుని.. 
మొత్తానికి సక్సెస్ఫుల్ గా పొట్టు తీసి, ముక్కలు చేసి గ్రైండర్ లో వేసి పొట్టు చేసేసానోచ్ !!! 












తీరా పావు వంతు కాయ కొడితేనే బోలెడు పొట్టు వచ్చింది.. నే కూరకి కాస్త తీసి, మిగిలింది ఎవరికి దానం చెయ్యాలా అని ఆలోచన..?! ఎక్కడ తెలుగువాళ్ళే తక్కువ..పనసపొట్టు కావాలా అని ఎవర్ని అడుగుతాం?
ఇంకా ముప్పాతిక కాయ ఉంది ! అంచేత నే చెప్పొచ్చేదేమిటంటే, పనసపొట్టు ఎవరిక్కావాలో చెప్పండి బాబు చెప్పండి...


***    ***    ***

పనసపొట్టు కూర గురించి ఇక్కడ రాసా..  
http://ruchi-thetemptation.blogspot.in/2011/11/blog-post_23.html 





Thursday, January 17, 2013

ఆలోచనలు..




మనం ఇతరులతో మట్లాడే మాటల కన్నా మనతో మనం మాట్లాడుకునేదే ఎక్కువేమో అని చాలాసార్లు నాకనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మనవాళ్లతో; బయట, కాలేజీ, ఆఫీసు.. లాంటి చోట్ల మిత్రులతోనో, ఎదురుపడ్డవాళ్లతోనో మాట్లాడతాం. మిగతా సమయాల్లో అంటే పని చేస్కునేప్పుడు, బస్సులోనో ఆటోలోనో్.. నడచి వెళ్ళేప్పుడో, మనకి మనమే మిగిలే ఏకాంతాల్లో.. ఎక్కువగా మనలో మనమే కదా మాట్లాడుకునేది. అలా చూస్తే మనం అందరికంటే ఎక్కువగా గడిపేది మనతోనే. మన ఆలోచనల్లోనే..! 


ఇంతకీ ఆ ఆలోచించేది ఏమిటీ అంటే కొదిసార్లు మత్రమే సీరియస్ విషయాలు ఉంటాయి. చాలాసార్లు ముఖ్యమైనది ఏమీ ఉండదు. ఎదుటివారు చెప్పేమాటల పట్ల మనకి శ్రధ్ధ లేకపోవటమో, ఆసక్తి లేకపోవటమో ఒక కారణమైతే, మనకి ఏకాగ్రత లేకపోవటం మరో కారణం అవుతూంటుంది. కారణం ఏదైనా ఆలోచనల్లో ములిగిపోవటం అనేది మనకి తెలియకుండానే మనం తరచూ చేసే పని. పుస్తకం చదువుతూ ఆలోచిస్తాం. నడుస్తూ ఆలోచిస్తాం. పని చేస్తూ ఆలోచిస్తాం. ఆఖరికి ఎవరితోనన్నా మాట్లాడుతూ కూడా ఒకోసారి ఆలోచనల్లో పడుతుంటాం. 


నా అనుభవాలు చెప్పాలంటే... కాలేజీలో ఉన్నప్పుడు మా పోలిటిక్స్ లెక్చరర్ పాఠం మొదలు పెట్టగానే ఎక్కడలేని ఆలోచన్లూ ముసిరేసేవి. మహా అయితే ఓ పావుగంట పాఠం తలకెక్కేదేమో.. ఆ తర్వాత నాదారి నాదే. ఏవో ఆలోచనలు.. చూపులు లెక్చరర్ పైనే ఉండేవి కానీ బుర్ర మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉండేది. ఎందుకో పాపం ఆవిడ ఒక్క క్లాసే అలా అయ్యేది. మిగతా క్లాసులన్నీ బానే వినేదాన్ని. ఆవిడ క్లాసు కూడా శ్రధ్ధగా వినాలని చాలాసార్లు ప్రయత్నించాను...కానీ ఎప్పుడూ కాసేపయ్యాకా ఆలోచనల్లో ములిగిపోయేదాన్ని. హటాత్తుగా గుర్తుకొచ్చేది.. అయ్యో ఇవాళ కూడా పాఠం వినలేదే అని ..:(  

ఇంకా ఎవరన్నా ఎక్కువసేపు  మాట్లాడితే నా తలకెక్కదు. కాసేపు బుధ్ధిగా వినేసి ఆ తర్వాత నా ఆలోచనల్లో నేను పడిపోతాను. బెజవాడలో ఉండగా తుమ్మలపల్లిలోనో, రోటరీ క్లబ్ లోనో బోలెడు కార్యక్రమాలకి, సభలకీ వెళ్ళేవాళ్ళం. ఆ సభల్లో కార్యక్రమాలకన్నా ముందు ముఖ్య అతిథి వీ, మిగిలిన వక్తల ఉపన్యాసాలు ఉండేవి. ఆ ప్రసంగాలు అయితే అసలు చెవికెక్కేవి కాదు ఏమిటో. పెద్దపెద్దవాళ్లంతా ఏవో చెప్తూండేవారు... నాపాటికి నేను ఏవో ఆలోచిస్తూ ఉండిపోయేదాన్ని. ఇంట్లో కూడా నాన్న ఎప్పుడైనా పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నప్పుడు చెవిలో వేలుపెట్టి ఇలా...ఆడిస్తుంటే... "నీ బుర్రకేమీ ఎక్కటం లేదని అర్ధమైంది ఇక వెళ్ళు.." అనేవారు. "లేదు నే వింటున్నాను.." అని చెప్పినా ఇంకేమీ చెప్పేవారు కాదు. ఆయనకు అర్థమైపోయేది పాపం నేను వినట్లేదని ! 

ఇంకా.. ఒకోసారి ఎవరితోనన్నా ఫోన్ లో మాట్లాడేప్పుడు కూడా అర్జెంట్ గా ఏదో గుర్తొచ్చి దాని గురించి ఆలోచించేస్తాను. కాసేపు మాట్లాడాకా అవతలివాళ్ళు ఏదో ప్రశ్న వేసేసరికి గుర్తుకు వస్తుంది నేను వాళ్ళు చెప్పేది వినట్లేదని...:( ఫోన్లో మాట్లాడేది బాగా తెలిసినవాళ్లైతే ఇందాకా సరిగ్గా వినలేదు..మళ్ళీ చెప్పమని బుధ్ధిగా నిజం చెప్పేస్తాను కానీ కొత్తవాళ్లైతే...:(( పాపం వాళ్ళు !!


అలా రకరకాల సందర్భాల్లో మనం రకరకాల ఆలోచనల్లోకి వెళ్పోతూ ఉంటాం. ఆలోచనల్లోంచి ఒక్కసారిగా మేల్కొని "అరే ఏమిటీ ఇలా ఆలోచించేస్తున్నాం..." అని మనలో మనం అనుకునే సందర్భాలే ఎక్కువ అనటం అతిశయోక్తి కాదు. ఆఖరికి నిద్రను కూడా ఖాళీగా వదలం మనం. మంచివో, చెడ్డవో.. కలలు కనేస్తూ ఉంటాం.   అసలు ఏ పనీ లేకుండా ఎప్పుడన్నా ఉంటామేమో కానీ ఏ ఆలోచనా లేకుండా ఖాళీగా ఎప్పుడైనా ఉంటామా మనం? అసలలా ఉండగలమా అని సందేహం కలుగుతుంది నాకు. అలా ఏమీ ఆలోచించకుండా ఉందామని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యను కూడా..:) నిజంగా అసలు ఏమీ ఆలోచించకుండా ఐదు నిమిషాలన్నా ఖాళీగా ఎవరన్నా ఎప్పుడన్నా ఉన్నారా? కాస్త చెప్దురూ...



Wednesday, October 31, 2012

స్కూల్ ప్రాజక్ట్





"ఏదన్నా వెహికిల్ మోడల్ చేసి పంపమని" పిల్లకి స్కూల్లో ప్రాజక్ట్ వర్క్ ఇచ్చారు. అసలు శలవుల్లో ఇచ్చిన ప్రాజక్ట్ వర్కులన్నీ పూర్తిచెయ్యమని తను అమ్మమ్మ ఇంటికి వెళ్ళేప్పుడు చెప్పి పంపితే సగమే పూర్తి చేసుకు వచ్చింది పిల్ల. అవన్నీ ఆదివారం రాత్రి, సోమవారం పొద్దున్న కూచుని అతికష్టం మీద పూర్తిచేసా. ఈ ఒక్కటీ నావల్ల కాదని ఈ వెహికిల్ ప్రాజెక్ట్ ని వదిలేసా. క్లాస్ లో కొందరు మోటార్ బైక్, సైకిల్ అలా చేసుకువచ్చారుట. "రేపే లాస్ట్ డే..ఎలాగన్నా చేసి తెమ్మన్నారు EVSసార్.. కార్డ్ బోర్డ్ తో చెయ్యాలి" అని నిన్న స్కూల్ నుండి వస్తూనే పిల్ల గొడవ.  అంతకు ముందు రోజే అన్ని ప్రాజక్ట్స్ చేసిన మీదట "నావల్ల కాదు నన్నొదిలెయ్యి తల్లీ, మీ నాన్న వచ్చాకా చూసుకోండి" అనేసా నేను.

అయ్యగారు ఆఫీసు నుండి వచ్చాకా బేరం పెట్టింది పిల్ల. అలానే చేసేద్దాం అని అభయమిచ్చేసారు ఈయన.  "ఇదిగో..పువ్వులు, ఆకులు అంటే చేస్తాను కానీ ఈ వెహికిల్స్ అవీ నాకు రావు నావల్ల కాదు. మీరూ మీరూ చూసుకోండి" అని చెప్పేసా. నిన్న రాత్రి పిల్ల బజ్జున్నాకా ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్లారు. కాసేపయ్యాకా పెద్ద పెద్ద థర్మొకోల్ షీట్లు, కార్డ్ బోర్డ్ తెచ్చారు. నెట్లో ఏవో వెతుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తే "ఫార్ములా వన్" మోడల్స్ డెస్క్ టాప్ మీద పెట్టి చేసేద్దాం..రా.. అన్నారు. నాకు బోలెడు కోపం వచ్చింది. అసలు నేను చెయ్యనన్నా కదా,ఇప్పుడీ ఫార్ములా కార్లెవరు చేస్తారు? నావల్ల కాదు. ఏ సైకిలో చేసేయచ్చు కదా" అన్నాను. అందరిలా మనమూ చెయ్యటమేంటి వెరైటీ గా ఉంటుంది. హెల్ప్ చెయ్యి.." అన్నారు. నిజం చెప్పద్దూ.. ఆ మోడల్ కార్లు చూస్తే నాకూ సరదా వేసింది. ఈజీగా ఉన్న ఓ మోడల్ కంప్యూటర్ స్క్రీన్ మీద పెట్టి, ఆ ప్రకారం ఇద్దరం చిన్నపిల్లల్లా కూచుని ఆ మోడల్ చెయ్యటం మొదలెట్టాం. నాకు తృప్తి కలగలేదు కానీ ఏదో ఓ మాదిరిగా చేసాం.  టైమ్ ఉంటే ఇంకా బాగా చేద్దుము అనుకున్నాం.


మొత్తం అయ్యాకా రంగు వేద్దాం అని వెతికితే అన్ని కలర్స్ ఉన్నాయి కానీ టైర్లకి కావాల్సిన బ్లాక్ కలర్ మాత్రం లేదు. ఫ్యాబ్రిక్ కలర్స్,పోస్టర్ కలర్స్ అన్ని వెతికాం, ఆఖరుకి పిల్ల వేసుకునే వాటర్ కలర్స్ లో కూడా బ్లాగ్ కలర్ అయిపోయింది. అప్పటికే రాత్రి ఒంటిగంట అయ్యింది ! ఇక పొద్దున్న ఆరున్నరకే ఏ షాపన్నా తెరుస్తారేమో అని బయల్దేరారు తను. మా ఏరియా నుంచి మార్కెట్ రోడ్డు చాలా దూరం. ఎనిమిదింటికే పాప ఆటో వచ్చేస్తుంది. పది నిమిషాల తక్కువ ఎనిమిదికి కలర్స్ బాక్స్ తీసుకొచ్చారు. అప్పుడు టైర్లకి గబగబా బ్లేక్ కలర్ వేసాను. కానీ ఎంత ఫ్యాన్ క్రింద పెట్టినా పది నిమిషాల్లో ఎక్కడ ఆర్తాయి? ఇంతలో ఆటో వచ్చేసింది. పిల్ల వెళ్పోయింది. "ఆటో స్కూల్ గేట్ దాకా వెళ్ళటానికి టైం పడుతుంది.. ఈలోపు ఆరబెట్టేస్తాను.. పట్టుకెళ్ళండి" అన్నా. ఆఫీసుకి లేటయిపోతుంది ఇప్పుడిక కుదరదు.రేపు పంపు..అంతే" అన్నారు. నాకు బోలెడు కోపం,బాధ,ఉక్రోషం అన్నీ వచ్చేసాయి. "రేపు పంపేదానికి నిన్న రాత్రంతా అంత కష్టపడటం ఎందుకు?పొద్దున్నే మీరు రంగుల కోసం ఊరంతా తిరగటం ఎందుకు? పైగా ఇవాళే లాస్ట్ డే అని వాళ్ల సార్ చెప్పరుట.. రేపటికి ఇస్తేఒప్పుకోరేమో... మనదంతా వృధా ప్రయాస అయిపోతుంది.." అని నేను గొడవ పెట్టాను. ఏమయినా ఆఫీసుకి వెళ్పోవాలి అని తను తయారైపోయారు. ఈ మోడల్ చెయ్యటం కోసం రాత్రంతా ఎంత కష్టపడ్డామో తలుచుకుంటే నాకు చాలా బాధ కలిగింది. మూడ్ అంతా దిగులుగా అయిపోయింది.


 అంతలో నాకు తటాలున ఒక ఐడియా వచ్చింది. పట్టుకెళ్ళి క్లాసులో ఇమ్మని స్కూల్ఆటో అబ్బాయికి ఫోన్ చేస్తే..? అని. వెంఠనే చేసాం. ముందు కుదరదన్నాడు. తర్వాత డబ్బులిస్తాం రమ్మంటే సరేనన్నాడు. ఓ అరగంటలో వచ్చి పట్టుకెళ్ళాడు. ఈ హడావుడిలో పిల్లకి ఇవాళ హాఫ్డే అని మర్చిపోయి కేరేజ్ కూడా ఇచ్చేసాను నేను. (నెలలో లాస్ట్ వర్కింగ్ డే హాఫ్ డే వాళ్ళకి.) మధ్యాహ్నం బెల్లు కొడితే ఎవరో అనుకుని తలుపు తెరిస్తే పిల్ల ! అప్పుడు గుర్తుకొచ్చింది హాఫ్ డే సంగతి. ఇంతకీ సార్ ఏమన్నారు అనడిగితే "బావుందన్నారు. అందరి వెహ్కిల్ మోడల్స్ క్లాస్ లోనే గూట్లో పెట్టారు. నాది ఏక్టివిటీ రూమ్ లో పెట్టించమని పంపారు" అని చెప్పింది. ఇంకేముంది.. నా మొహంలో వంద చిచ్చుబుడ్లు, వెయ్యి మతాబలూ ఒక్కసారిగా వెలిగిపోయాయి. వెంఠనే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పా. "వెరీ గుడ్ వెరీ గుడ్!" అన్నారు. లోపల్లోపల మాత్రం "బ్రతికానురా దేవుడా!" అనుకుని ఉంటారు..:-)




Thursday, October 4, 2012

నీవల్లే.. నీవల్లే..



రేపు శెలవు అంటే ఇవాళ రాత్రి ఏవన్నా సిడీలు(సినిమాలు) పెట్టుకుని చూడటం మాకు అలవాటు. పొద్దున్నే లేచి పరుగులు పెట్టక్కర్లేదని. అలాగ మొన్న వికెండ్ లో ఒక రోజు రాత్రి ఏదన్నా సీడీ పెట్టండి కాసేపు చూద్దాం.. అని నేను వంటింట్లోకి వెళ్పోయా.

త్వర త్వరగా వంటిల్లు క్లీన్ చేసేసుకుని హాల్లోకి వచ్చేసరికీ అయ్యగారు సీరియస్ గా "Rudali" సినిమా చూసేస్తున్నారు. ఇదేమిటీ విధివైపరీత్యం అని హాచ్చర్యపడిపోయేసా. భాషాభేదం లేదు కానీ అసలు సీరియస్ సినిమాల జోలికే తను పోరు. "సినిమా అంటే హాయిగా నవ్వుకునేలా ఉండాలి" అన్నది తన సిధ్ధాంతం. అలాంటిది Rudali లాంటి గంభీరమైన సినిమా..అదీ వీకెండ్ లోనా? నాకే చూడాలనిపించలేదు. పాటలు బావుంటాయి కదా అని పెట్టాను అన్నారు. అది నిజమేననుకోండి కానీ ఇప్పుడా... అని నేను నిరాసక్తంగా కూచున్నా. సరే ఏదోఒకటిలే..ఆయనతో కలిసి చూడాలనే కదా నా కోరిక అని సగం అయిపోవస్తున్న సినిమాని నేనూ చూడ్డం మొదలెట్టా.

"దిల్ హూం హుం కరే.." పాట మొదలయ్యింది. జై భూపేన్ హజారికా.. అహా..ఓహో... అనేసుకున్నాం. "ఝూటి మూటి మితవా ఆవన్ బోలే..", "బీతేనా..బీతేనా రైనా..", "సమైయో... ధీరే చలో.." అన్నీ అయిపోయాయి. రాజ్ బబ్బర్ గురించీ, రాఖీ గురించీ, డింపుల్ టేలెంట్ గురించీ చర్చలు అయిపోయాయి. సినిమా అయిపోవచ్చింది. అదేమిటీ ఇంకా ఆ పాట రాలేదు అన్నారు తను. "ఏ పాట?" అన్నా నేను. అదే లతా పాట "యారా సీలీ సీలీ.." అన్నారు తను. "నేనొచ్చేసరికీ సినిమా సగం అయిపోయింది. మీరు ఏవన్నా సీన్స్ ఫాస్ట్ చేసేప్పుడు మిస్సయి ఉంటారు. వెనక్కి తిప్పి చూడండి.." అన్నా. అయ్యో నేను ఆ పాట కోసమే ఈ సినిమా పెట్టాను. ఏం పాట అసలు..ఏం పాట అసలు... లతా ఎంత అద్భుతంగా పాడుతుంది.." అంటూ మళ్ళీ సినిమా మొదటినుంచీ పెట్టారు. కాస్త కాస్త ఫాస్ట్ చేస్కుంటూ ఇద్దరం మళ్ళీ సీరియస్ గా సినిమా రెండోసారి చూట్టం పూర్తిచేసాం. సినిమా రెండోసారి అయిపోయింది కానీ పాట కనబడలేదు.

"ఇదేమిటీ పాట లేదు.." అన్నాన్నేను. కాసేపాగి..."అసలా పాట ఏ సినిమాలోదో కూడా మర్చిపోయావు నువ్వు?" అన్నారు. నాకప్పటికి కూడా గుర్తు రాలేదు. "యారా సీలీ సీలీ..పాట "Lekin" సినిమాలోది కదా..ఎలా మర్చిపోయావు? ఇంత సీరియస్ సినిమా రెండోసారి కూడా చూపించేసావు" అన్నారు. "ఇది మరీ బావుంది. ఈ సినిమా కావాలని పెట్టుకున్నది మీరు... పోనీలే అని చూస్తూ కూర్చున్నందుకు నన్నంటారేం?" అన్నా నేను. "రెండోసారి మళ్ళీ పెట్టినప్పుడైనా గుర్తుకు రాలేదా నీకు? పాటలన్నీ నా నోటిమీదుంటాయి అంటావుగా.." అన్నారు. "అవునవును.. అలానే ఉండేవి పెళ్లయ్యేవరకూ..." అన్నాను. "సరేలే ఇప్పుడు చరిత్రలెందుకు.. వీకెండ్ పూటా ఇలాంటి సినిమా నాకు రెండుసార్లు చూపించేసావు.." అన్నారు. "అసలు రెండిటిలోనూ "డింపుల్.." ఉంది అందుకే కన్ఫ్యూజ్ అయ్యా.." అన్నా నేను. అలా నీవల్లే.. నీవల్లే.. అని కాసేపు అనేసుకున్నాకా.. మళ్ళీ Rudali సినిమా గుర్తుకొచ్చి ఇద్దరం పడీ పడీ నవ్వుకున్నాం.

అయినా నిజంగా అంత ఇష్టమైన పాట ఏ సినిమాలోదో కూడా గుర్తులేనంత మరపు వచ్చేసిందా? అని నాలో నేనే కాసేపు మధనపడిపోయా! ఈ చిలిపిజగడానికి మూలకారణమైన ఆ అద్భుతమైన పాట ఇదే...

 

Tuesday, September 4, 2012

పుట్టినరోజు


" అమెరికా ప్రెసిడెంట్ పుట్టినరోజు ఎప్పుడో తెలిస్తే, ఆయనకు కూడా తలంటు పోసేసి, హేపీ బర్త్ డే చెప్పేసి వస్తుంది మీఅమ్మ" అనేవారు నాన్న. " పాలవాడిదీ, పేపరబ్బాయిదీ కూడా పుట్టినరోజులు కనుక్కోవే.." అనీ, " అసలుజంధ్యాలకు చెప్పు నాన్నా.. శ్రీలక్ష్మితో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నెక్స్ట్ సినిమాకి తయారుచేసుకుంటారు" అనీ అనేవాళ్లంమేము. అలా మేం ఎన్ని వేళాకోళాలు చేసినా అమ్మ మాత్రం ఇప్పటికీ తన హాబీ కంటిన్యూ చేస్తూనే ఉంది. అదేమిటంటేతనకు తెలిసిన బంధుమిత్రులందరి పుట్టినరోజులూ, పెళ్ళిరోజులూ గుర్తు ఉంచుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పటం. మా చిన్నప్పుడు అయితే గ్రీటింగ్ కార్డో, ఇన్లాండ్ కవరో లేదా కనీసం కార్డ్ ముక్క లో అయినా విషెస్ రాసేసేది. ఇప్పుడుఫోన్లు చేస్తోంది. అంతే తేడా.

సన్నిహిత మిత్రులకూ, సమీప బంధువులకూ శుభాకాంక్షలు చాలా మంది చెప్తారు. కానీ అమ్మ వెరైటీగా పక్కింట్లో ఖాళీచేసి వేరే ఊరు వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని "వదినగారూ మీ రెండోవాడి పుట్టినరోజు రేపు. మా అందరి విషెస్చెప్పండి..." అంటూ కార్డ్ రాసి పోస్ట్ చేసేది. ఇది విజయవాడలో మా పక్కన ఉండి వెళ్ళిపోయినవాళ్ళ సంగతి మాత్రమే. కాకినాడలో మా పై ఇంట్లో అద్దెకు ఉండి వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని కూడా శుభాకాంక్షలు తెలపటం మాకునవ్వు తెప్పించేది. ఒకళ్ళు బ్యాంక్లో చేసేవారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీలేదు. విజయవాడలో మాకు తెలిసినవాళ్లఅబ్బాయి పెళ్ళి కుదిరితే, పెళ్ళికూతురు కూడా అదే బ్యాంక్ అని తెలిసి, అమ్మ వాళ్ల బ్యాంక్ కు వెళ్ళి అమ్మాయినిపరిచయం చేసుకుని ఫలానావాళ్ళు తెలుసా? ఫలానా సంవత్సరంలో ఫలానా ఊళ్ళో చేసారు.. అంటూ వివరాలు చెప్పి పెళ్ళికూతురు ద్వారా మొత్తానికి వాళ్ల అడ్రసు సంపాదించింది. చిన్నప్పుడు వేళాకోళం చేసినా పెద్దయ్యాకా నాకూ పిచ్చిఅంటుకుంది. చాలా ఏళ్ళపాటు బంధుమిత్రులందరికీ స్వయంగా గ్రీటింగ్స్ తయారు చేసి మరీ పంపేదాన్ని. ఈమధ్యఈమధ్యనే విసుగెత్తి చాలావరకూ పంపటం మానేసాను. అతిమంచితనానికి పోయి విషేస్ చెప్తే జవాబివ్వనివారుకొందరైతే, ఏదో అవసరం ఉండి వంకతో పలకరిస్తున్నాననుకుని అపార్ధాలు చేసుకునేవారు కొందరు. అమ్మ మాత్రంఇప్పటికీ అక్కచెళ్ళెళ్ళ,అన్నయ్యల పిల్లలవీ, వాళ్ళ మనవలవీ, సన్నిహిత మిత్రులందరివీ పుట్టినరోజులన్నీ గుర్తుఉంచుకుని అందరికీ ఫోన్ చేసి విషెస్ చెప్తుంటుంది.

ఊళ్ళోవాళ్ళ సంగతి ఇలా ఉంటే ఇక ఇక ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులు అమ్మ ఎలా చేస్తుంది? మా అందరికీ డేట్స్ ప్రకారం, తిథుల ప్రకారం రెండు పుట్టినరోజులూ జరిపేది. అలా ఏటా మాకు రెండుపుట్టినరోజులు చేసుకోవటం అలవాటేపోయింది. అంతేకాక నాకూ, నాన్నకూ స్పెషల్గా మూడు పుట్టినరోజులు ఉన్నాయి. ఎలాగంటే ఓసారి ఒకాయన మాఇంట్లోవాళ్లజాతకాలన్నీ వేసి, నాన్న పుట్టినరోజు ఎప్పుడూ చేసుకునే రోజు కాదనీ, ఆయన పుట్టిన సంవత్సరంలో ఫలానానెలలో ఫలానాతారీఖనీ చెప్పారు. కానీ అప్పటికి నలభైఏళ్లపైగా పుట్టినరోజు జరుపుకుంటూ వస్తున్న తారీఖునిమార్చలేక అదీ, కొత్తగా తెలిసిన తారీఖుదీ, తిథుల ప్రకారం కలిపి నాన్నకు మూడు పుట్టినరోజులూ చేసేయటంమొదలెట్టింది అమ్మ. ఇక నేనేమో అసలు అధికమాసంలో పుట్టానుట. కానీ అధికమాసం అస్తమానం రాదుకదా...వచ్చినప్పుడు మూడూ చేసేసేది అమ్మ. అందుకని నావీ మూడు పుట్టినరోజులే!

విధంగా రెండేసి,మూడేసి పుట్టినరోజులు జరుపుకునే సరదాని మా అందరి నరనరాల్లో జీర్ణింపచేసింది మా అమ్మ. నాపెళ్ళి కుదిరిన తర్వాత జాతకాల నిమిత్తం అబ్బాయి జాతకం పంపారు పెళ్ళివారు. మరో వారంలో అబ్బాయి పుట్టినరోజని కాయితంలో చూసి అందరం హడావిడి పడిపోయాం. నేనేమో కష్టపడి నాన్న కేసెట్లన్నీ వెతికి
వివాల్డీ, మొజార్ట్ దగ్గరనుండీ ఎల్.సుబ్రహ్మణ్యం వరకూ నానారకాల సంగీతాలతో ఒక సీడీ తయారుచేసి అబ్బాయికి పంపించాను. ఏంఅంటాడో అని ఆత్రంగా ఎదురుచూస్తూంటే అబ్బాయి ఫోన్ వచ్చింది... "సీడీ విన్నాను..బాగుంది. కానీ నాకు పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు..." అన్నాడు. దాందేముంది పెళ్లయాకా మాకులాగానే రెండుకాకపోయినా ఒక్క పుట్టినరోజన్నా చేద్దాంలే అనుకున్నా నేను. తీరా పెళ్లయ్యాకా చూస్తే సెలబ్రేషన్ సంగతటుంచి అసలుపుట్టినరోజుకి అయ్యగారు కొత్త బట్టలు కూడా కొనుక్కోరని తెలిసి అవాక్కయ్యాను. 'రేపు మీ పుట్టినరోజండి..' అని నేనేగుర్తుచేసాను. అంతలో మరో కొత్త విషయం చెప్పి నా గుండెల్లో బాంబు పేల్చారు..

తన డేట్ ఆఫ్ బర్త్ విషయంలో డౌట్ ఉందని చెప్పేసరికీ ముచ్చెమటలు పోసాయి నాకు. పుట్టినరోజు అంటే అదోఅద్భుతమైన రోజని నమ్ముతూ సంవత్సరం అంతా రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాను నేను. ఊరందరికీపుట్టినరోజులు చేసేస్తుంది మా అమ్మ. అలాంటిది శ్రీవారి డేట్ ఆఫ్ బర్తే డౌటంటే... ఎలా? అని తెగ బాధ పడిపోయాను. అప్పుడిక లాభం లేదని విక్రమార్కుడి చెల్లెల్లు అవతారం ఎత్తేసాను. మా అత్తగారి ఊళ్ళో ఆయన హాస్పటల్లో పుట్టారోకనుక్కుని, అక్కడికి మనిషిని పంపి, నానా తంటాలు పడి మొత్తానికి నెలరోజుల్లో శ్రీవారి అసలైన పుట్టినరోజుకనుక్కున్నా. అదృష్టవశాత్తు పాత రిజిస్టర్లు ఇంకా హాస్పటల్లోవాళ్ల దగ్గర ఉండటం వల్ల అది సాధ్యమైంది. హమ్మయ్య! అనుకుని అప్పటినుండీ చక్కగా తన పుట్టినరోజు కూడా నేనే చేసేసుకుంటున్నా. అంటే పట్టుబట్టి సెలబ్రేట్ చేసేది నేనేకాబట్టి విధంగా ఇదీ నా పుట్టినరోజు క్రిందే లెఖ్ఖలోకి వస్తుందన్నమాట..:)

ఇంతకీ అసలు చెప్పొచ్చేదేమిటంటే
ఇవాళ నా పుట్టినరోజు! ఇది అధికబాధ్రపదం కాబట్టి నా నిజమైన తిథులపుట్టినరోజుకూడా నిన్ననే అయ్యింది. ఇంకా ఎప్పుడూ చేసుకునే తిథులపుట్టిన్రోజు మళ్ళీ నెల్లో ఇంకోటి ఉంది :)


Friday, March 30, 2012

మోరీ పళ్ళు - Chironji






నిన్న ఒక టపా రాసాను "ఈ పళ్ళు ఏమిటో తెలుసా? " అని. పైన ఫోటో లోనిది ఆ పళ్ళు కాసే చెట్టు.నిన్నటి టపాలో ఇద్దరు(కృష్ణ గారు, సైలజ గారు) సరైన సమాధానం రాసారు.





ఇది ఒక ఔషధవృక్షం. ఈ పళ్ళను "మోరీ పళ్ళు" అంటారు. ఇవి ఈ సీజన్లోనే దొరుకుటాయి. చెట్టు నిండా పళ్ళు విరగ కాస్తాయి.జనవరి ఫిబ్రవరిల్లో ఈ చెట్టు నిండా పువ్వులతో నిండిపోతుందిట. ఇలా







మార్చి, ఏప్రిల్ నెలల్లో పళ్ళు కాస్తాయిట. గుండ్రంగా, ఆకుపచ్చ గా ఉండి తర్వాత నల్లగా మారిపోతాయి ఈ పళ్ళు. అచ్చం నేరేడు పళ్లలాగే వగరుగా,తియ్యగా,పుల్లగా ఉంటుందీ పళ్ళ రుచి.






వీటిలోపల గింజలను ఎండబెట్టి ఓపిగ్గా కొట్టుకుంటే లోపల పప్పు ఉంటుంది. ఆ పప్పునే మనం "సారపప్పు" అంటాం. ఇంగ్లీషు లో chironji అంటారు. స్వీట్స్ లోనూ, ఖీర్ లోనూ వేస్తారు.







ఈ చెట్టు వివరాలు, సారపప్పు వివరాలూ ఆసక్తి ఉన్నవారు క్రింద వెబ్సైట్ లింక్స్ లోకి వెళ్ళి చూడవచ్చు.











Thursday, March 29, 2012

ఈ పళ్ళు ఏమిటో తెలుసా?


చిన్నగా, గుండ్రంగా, నల్లగా ఉన్న ఈ పళ్ళ పేరు తెలుసా?
నేరేడుపళ్ల రుచి కలిగి ఉంటాయి ఈ పళ్ళు. అన్నికాలాల్లోనూ రావు ఇవి.

బహుశా ఇది ఈ పళ్ళు దొరికే సీజనేమో మరి.. నిన్నను దొరికాయి.

పళ్ల క్రింద ఉన్నవి ఆ చెట్టు ఆకులే.


ఈ ఫొటోలోవి ఈ పండు లోపల ఉన్న గింజలు.

ఇవి ఎండబెట్టి లోపల ఉన్న పప్పు కూడా తింటారు.







Friday, February 24, 2012

Bheem మాయ చేసాడే !!



ఐదేళ్ళ వచ్చేదాకా మా అమ్మాయిని టివీ జోలికి వెళ్లకుండా కాపాడుకున్నా. రెండేళ్ల క్రితం మాత్రం మా తమ్ముడి పెళ్ళికి వచ్చిన బంధువుల పిల్లలు దానికి "పోగో టివి, కార్టూన్ నెట్వర్క్ " చూపెట్టారు. అప్పటి నుంచీ మొదలైంది పోగో టివి మా ఇంట్లో కూడా. కాకపోతే అదృష్టవశాత్తు మా అమ్మాయికి నచ్చినవి రెండే రెండు కార్టూన్ సిరీస్ లు. వేరే ఏమీ చూడదు. కృష్ణ, ఛోటా భీమ్. మాఇంట్లో రోజూ "ఛోటా  భీమ్ " జపమే. కొత్తవైనా, వేసినవే వేసినవే వేసినా, ఎలాగున్నా సరే "ఛోటా భీమ్" సీరియల్ చూడాల్సిందే. టివీలోనే కాక ఈ "భీమ్" కి ఒక అఫీషియల్ వెబ్బ్సైట్ కూడా. అందులో గేమ్స్ , వీడియోలూ గట్రా ! ఇవాళ "ఛోటా భీమ్" తెలియని స్కూల్ పిల్లలు... ఆ భీమ్ పుస్తకాలూ, వీడియోలు కొనిపెట్టమని అమ్మానాన్నల్ని విసిగించని పిల్లలూ ఉండరంటే నమ్మకతప్పదు మరి..:) అంతగా మాయ చేసేసాడు ఛోటా భీమ్ !!


పోగో వెబ్సైట్లోని వివరాల్లోకి వెళ్తే, రెండువేల సంవత్సరాల క్రితం "ఢోలక్ పూర్" అనే పల్లెటూళ్ళో జరిగిన తొమ్మిదేళ్ల "భీమ్" అనే శక్తివంతుడైన కుర్రాడి కథ ఈ సీరియల్ అని చెప్తాడు. చుట్కీ, రాజూ, జగ్గు అనే కోతి, ఆ ఊరి రాజుగారి కూతురు ఇందుమతి వీళ్లంతా భీమ్ కి స్నేహితులు. ఆ ఊరిలోవారికి గానీ, ఎవరికైనా గానీ ఆపద వస్తే భీమ్ తక్షణం సహాయపడతాడు. భీమ్ విప్పలేని చిక్కుముడి ఉండదు, తప్పించుకోలేని ఆపద ఉండదు, ఓడించలేని శత్రువు ఉండడు. భీమ్ తినని లడ్డూ కూడా ఉండదు. అతనికి అత్యంత ఇష్టమైన లడ్డూ తినగానే అమితమైన శక్తి వచ్చేసి శత్రువుని చితగ్గొట్టేస్తుంటాడు భీమ్. అబ్బా..అలా తినగానే వెంఠనే బలం వచ్చేసే మందేదైనా ఉండకూడదు అన్ని పనులు చకచకలా చేసేసుకోవటానికీ అనుకుంటూ ఉంటాను నేను. తెలివి, చమత్కారం, బుధ్ధిబలం, కండబలం అన్నీ నిండుగా ఉన్న ఈ తొమ్మిదేళ్ళ కుర్రాడిని ప్రేమించకుండా నేను కూడా ఉండలేను !


ఇంతేకాక "కృష్ణ" సీరియల్లోంచి బుల్లి కృష్ణుడిని తీసుకువచ్చి, ఛోటా భీమ్ కి మిత్రుడిని చేసేసారు. ఇక ఇద్దరు కలిసి మరిన్ని విజయాలను చూస్తుంటారు. ముద్దొచ్చే బుల్లి కృష్ణుడిని, భీమ్ నీ ఒకే చోట చూడటం కూడా నయనానందమే. ఈ చోటా భీమ్ కి వాయిస్ ఇచ్చే కుర్రాడు ఎవరో గాని నాకు భలే నచ్చేస్తుంది ఆ గొంతు. స్వచ్చమైన మంచి హిందీ పలుకుతాడు అతను. కొన్ని సీరియల్స్ లో మరో వాయిస్ కూడా వాడుతుంటారు. ఇది కొద్దిగా వయసు పెద్ద ఉన్న కుర్రాడి వాయిస్. ఇతని కన్నా రెగులర్ గా డబ్బింగ్ చెప్పే వాయిస్ నాకు బాగా ఇష్టం. ఈ సీరియల్ డైరెక్టర్ కూడా తెలుగువాడేనేమో..."రాజీవ్ చిలకలపూడి" అని వస్తుంది టైటిల్స్ లో. ఒకోసారి "రాజీవ్ చిలకా" అనీ వస్తుంది. "భీమ్ భీమ్ భీమ్..చోటా భీమ్..చోటా భీమ్" అని వచ్చే టైటిల్ సాంగ్ కూడా నాకు భలే ఇష్టం.





ఈ యేనిమేషన్ విషయంలో నాకు ఒక చిన్న అసంతృప్తి.. ఎన్నో ఏళ్ల క్రితం పల్లెటూరు, ఓ రాజుగారూ అని చూపిస్తూ అందులో మళ్ళీ ఇంగ్లీషు ఎందుకు వాడతారో అర్ధం కాదు. క్రికెట్ అనీ, కాంపటీషన్ అనీ చాలా పదాలు వాడుతుంటారు. బహుశా పిల్లలు కథలతో బాగా కో-రిలేట్ అవ్వటానికే అయినా ఇంగ్లీషు వాడకుండా ఉంటే బాగుండేది కదా అనుకుంటూ ఉంటాను. కానీ ఏవో విదేశీ సీరియల్స్ డబ్బింగ్ చేసేసి చూపెట్టేయకుండా యావత్ దేశంలో పిల్లలూ ఇష్టపడే విధంగా ఒక గుర్తుండిపోయే పాత్రను సృష్టించిన వారు నిజంగా ప్రశంసాపాత్రులు. చోటా భీమ్ చూసే మా అమ్మాయి హిందీ నేర్చుకుంది అంటే అతిశయోక్తి కాదు. అంత మంచి శుధ్ధమైన హిందీ వాడతారు ఆ సీరియల్లో. నాతోనూ, వాళ్ల నాన్నతో కూడా హిందీలో మాట్లాడేంత భాష దానికి ఛోటా భీమ్ నేర్పినదే. అంతే కాదు.. గులాబ్ జామ్ తప్ప మరో స్వీట్ ఏదీ తినని మా అమ్మాయి భీమ్ ను చూసి " భీమ్ లడ్డూ" కావాలని అడిగి తెప్పించుకుని మరీ తింటోందంటే భీమ్ మాయే కదా మరి !!



Saturday, August 6, 2011

ఒకే ఒక్కటి ?!


పూసినదొక పువ్వుట..


అది వేసినదొక పిందెట..


కాసినదొక కాకరకాయట..


ఒక్క దానితో ఏం చేయాలో తెలియదట..!!









Wednesday, June 1, 2011

బాబోయ్ వర్షం !!


ఋతుపవనాలు వచ్చేసాయి వచ్చేసాయి...అని తెగ చెప్పేస్తున్నారు వార్తల్లో. వర్షాలు కూడా అలానే మొదలైపోయాయి. ఇప్పుడే ఓ అరగంట జల్లు కురిసింది. "వాన" అంటే ఇష్టం లేనివారు అరుదుగా కనిపిస్తారు. నాకూ ఇష్టమే. కానీ వానా కాలం అంటేనే భయం. గృహిణి అవతారం ఎత్తాకా మాత్రం ఎందుకనో ఇదివరకూలా ఆస్వాదించలేకపోతున్నాను. వర్షాకాలం వచ్చేసిందంటే "బాబోయ్ వర్షం.." అని భయమేస్తోంది.



ఒకప్పుడు వర్షమంటే..
కాగితం పడవలు చేసి సందంతా నిండిన వాననీటిలో వెసి ఆడుకోవటం...
చిన్నగదిలో కిటికీ గూటిలోకెక్కి సన్నటి జల్లు మీద పడుతూంటే పుస్తకం చదువుకోవటం...


ఎప్పుడెప్పుడు వర్షంలో తడుద్దామా అని ఆత్రుత..


ఆ తర్వాత..
బాల్కనీలో ఉయ్యాలలో ఊగుతూ వేడి వేడి కాఫీ తాగటం..
ఊయ్యాల ఊగుతూనే మంచి మ్యూజిక్ వినటం..
వర్షం పడినప్పుడల్లా వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు వేసుకోవటం..
వానవల్ల కాలేజీకి శెలవు దొరికితే ఆనందంతో గంతులెయ్యటం..
ఇంకా తరువాత..
హాల్లోంచి వర్షం చూస్తూ మంచి బొమ్మ వేసుకోవటం..
గుమ్మంలో కుర్చీ వేసుకుని వాన పడుతున్నంతసేపు చూస్తూ కూచోవటం..
మళ్ళీ ఎప్పుడు వాన పడుతుందా అని ఎదురుచూడటం..


కాలం గడిచే కొద్దీ మన అభిప్రాయాల్లో, ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలానే వర్షం గురించిన అభిప్రాయాలు కూడా మారిపోయాయి.
ఇప్పుడు వర్షమంటే..
అమ్మో మళ్ళీ వచ్చేసింది వాన... ఆరేసిన బట్టలు ఆరతాయా?
ఆరీ ఆరని తడిపొడీ బట్టలతో ఇల్లంతా కంపు కంపు ! మయదారి వాన..
పొద్దున్నే మొదలయ్యిందివాళ వాన..పనమ్మాయి వస్తుందో రాదో...రాకపోతే చచ్చానే..
వర్షం వల్ల స్కూల్ వాన్ రాకపోతే పిల్లని స్కూలుకి ఎలా దింపాలో?
ఇవాళ ముఖ్యమైన పని మీద వెళ్దాం అనుకున్నాను...మొదలైపోయింది వాన..ఎలా వెళ్ళేది?
వాన వల్ల ట్రాఫిక్ జామ్లు ఇంకా పెరిగిపోతాయి..తను ఇంటికి ఎప్పుడొస్తారో...
వేసంకాలమే నయం ఎండలు భరించాలే తప్ప అన్ని పళ్ళు దొరుకుతాయి...
వాన వాన వాన...వీధంతా కాలవలా ఉంది. దీన్ని దాటుకుని బయటకు వెళ్లటం ఎలా?

ఇలా సాగిపోతాయి ఆలోచనలు. ఇప్పుడు కాసేపు కుర్చీ వేసుకుని కూచుని వర్షాన్ని చూస్తూ ఆనందించాలని అనిపించదు. పనులాగిపోతాయని భయం వేస్తుంది. అప్పుడప్పుడు వస్తేనే వాన బావుంటుంది. రోజూ వచ్చేస్తే ఏం బావుంటుంది? ఎప్పుడెప్పుడు వర్షాకాలం అయిపోతుందా అనే అనిపిస్తుంది. కానీ నాకు వర్షం ఇష్టమే. కానీ వానాకాలం అంటేనే భయం.

ఎప్పుడెప్పుడా అని మేం ఎదురుచూస్తూంటే, ఇంకా వర్షాలు మొదలవ్వకుండానే నీ గోలేంటమ్మా चुप रहो ! అంటారా? సరే నేను गायब అయితే..!!

Sunday, May 15, 2011

'ఊరగాయ వైరాగ్యం' (ఈసారి ఫోటోతో)





(బ్లాగర్ ప్రాబ్లం వల్ల ఈ టపా మొన్న పెట్టిన కాసేపుకి డిలీట్ అయిపోయింది. ఆ కాసేపులో వచ్చిన నాలుగు వ్యాఖ్యలు కూడా డిలీట్ అయిపీఓయాయి. అందుకని ఈసారి ఫోటోతో పెడుతున్నాను...:))





పట్టుమని పది మావిడికాయలతో ఈసారి ఆరు రకాలు:

వెల్లుల్లి ఆవకాయ
నూపప్పు ఆవకాయ
పెసర ఆవకాయ
అల్లం ఆవకాయ
మాగాయ
తురుము మాగాయ !!
(ఇది 12thన రాసినది..:))

పొద్దున్నుంచీ బయటకు వెళ్ళి వచ్చి, వెళ్ళి వచ్చీ, వెళ్ళి వచ్చీ...
డాబాపై ముక్కలు పెట్టి..మళ్ళీ తీసుకువచ్చి..
కారం, ఉప్పు , ఆవ కొలుచుకుని
పెసరపొడి జల్లించి
మెంతులు, ఆవాలు వేయించి.. చల్లర్చి
ఇంగువ నూనె కాచి
ఒక్కొక్కటీ కలిపి...
అన్నీ మూతలు పెట్టి
గోడకి జారలబడి
ఎందుకో ఈ ఊరగాయలు పెట్టడం?
దండిగా తింటే పడేనా?
అసలివన్నీ అరోగ్యానికి ఏం మంచి చేస్తాయని?
పక్షానికో నేలకో ఓసారి నాలిక్కి రాసుకోటానికి
ఇన్ని తంటాలు అవసరమా?

కూర్చున్న చోట్నుంచి లేచాకా ఫోన్ దగ్గరకు పరుగు
అమ్మకి, అన్నయ్యకీ డప్పు కొట్టడానికి
'ఉరేయ్ నేనూరగాయలు పెట్టేసానోచ్' !!
'సాంపిల్ ఎప్పుడు తెస్తావు' అని వాడు..
'నన్నడిగితే పెట్టివ్వనా? ఎందుకన్ని తంటాలు పడటం?' అని అమ్మ...
అంటూంటే
'మరి నా సరదా తీరేదెలా?' అని నేను.
'అమ్మా, మెంతికాయ ఎలా చెయ్యాలో చెప్పవే
మళ్ళీ ఏడు చేస్తాను...'!

...దీన్ని 'ఊరగాయ వైరాగ్యం' అంటారు !!

__________________________________

జయగారు, మీరు శ్రమ తీసుకుని మళ్ళీ వ్యాఖ్య రాసినా ఇలా రెండవసారి టపా పెట్టటం వల్ల అది కూడా పోయింది...ఏమీ అనుకోవద్దండీ..! ఒకటో రెండో కాక, ఇన్నిరకాలు పెట్టడం ఇదే మొదటిసారి నాకూనూ. అన్నీరకాలు కూడా బాగా కుదిరాయి. టేస్ట్ చేసినవాళ్ళందరూ బాగుందనే అన్నారు !!


Saturday, April 16, 2011

నాకు బాగా నచ్చిన "Airtel 3G ad"


New Airtel 3G ad STARE.wmv

"మేరా తిల్ తుమ్హారా చెక్ పోస్ట్ తో హై నహీ...ఆజ్ యహా కల్ వహా..." డైలాగ్ సూపరసలు.Good idea!

Saturday, March 26, 2011

పొద్దుటి వర్షం...వాకింగ్ కబుర్లు

(వర్షంలో తడిసిన మా గులాబి. )

ఇవాళ పొద్దున్నుంచీ వాతావరణం ఎంత బావుందో. మబ్బుల చాటున దాక్కుని సూరీడసలు బయటకు రానేలేదు. "వాకింగ్ నుంచి వచ్చావా లేదా? ఇక్కడ పెద్దవాన పడుతోంది...మీకూ పడుతోందా? ఇల్లు చేరావో లేదో.. తడుస్తున్నావేమో అని..." అంటూ అమ్మ ఫోన్ చేసింది కూడా. అప్పటికింకా మా ఇంటి దగ్గర వాన లేదు. ఈ వాతావరణంలో లాంగ్ రైడ్ కి వెళ్తే భలే ఉంటుంది అనుకుంటూండగానే పెద్ద పెట్టున వర్షం. ఎండాకాలంలో ఈ వానలేంటో. సుమారు రెండు మూడు వారాలక్రితం పొద్దున్నే ఇంతకంటే పేద్ద వాన చాలాసేపు పడింది. మావిడి పూత చాలావరకూ అప్పుడే రాలిపోయింది. ఈసారి రేట్లు ఆకాశానికి అంటుతాయి అనుకున్నాం. ఇక్కడింకా మావిడికాయ కనపడ్డంలేదు. మొన్న గుడివాడ పెళ్ళిలో పెళ్ళివారు కొత్తావకాయ కూడా తినిపించేసారు. ఎంత బావుందో...

కురుస్తున్న వర్షం..కనిపిస్తోందా?

వర్షంతో తడిసిన రోడ్డు..
*** *** ***


రోజూ వాకింక్ కు వెళ్తూ అనుకుంటాను ఈ వాతావరణం గురించి రాయాలి అని. దాదాపు కొన్ని నెలల తరువాత ఈ ఇల్లు మారాకా వాకింగ్ మొదలెట్టాను. అసలు మొదలుపెట్టింది పదిహేనేళ్ల క్రితమే. కానీ వరుసగా ఎప్పుడూ కొనసాగించలేదు. ఆర్నెల్లు నడిస్తే ఎనిమిది నెలలు అటకెక్కించేస్తూ ఉంటాను వాకింగ్ ని. కాస్త శరీరం కంట్రోల్లోకి వచ్చేసి, అందరూ మన వాకింగ్ ఎఫెక్ట్ ని గుర్తించేస్తూండేసరికీ బధ్ధకం వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది కాబట్టి ఈసారి ఎక్కువ రోజులే నడక కొనసాగవచ్చు.

రోజూ నే వాకింగ్ కి వెళ్ళే సమయానికి ఇంకా సూరీడు రాడు. వెనక్కి వచ్చే సమయానికి గుండ్రని లేత ఆరెంజ్ బంతిలా, పొడుగాటి వీధి చివ్వరికి, కుడి ఎడమల ఇళ్ళు కలుస్తున్నట్లుండే చోట, మధ్యనుంచి బొట్టులా పైకి వస్తూ ఉంటాడు. రోజూ అదే దృశ్యం. పొడుగాటి వీధి కూడా ప్రశాంతంగా విశాలమైన మంచి రోడ్డుతో(ఈకాలంలో గతుకులు లేని మంచి రోడ్లు చాలా అరుదుగా ఉన్నాయి కదా) నడవటానికి అనువుగా ఉంటుంది. పైగా ఇక్కడ అన్ని ఇళ్ళలో పెద్ద పెద్ద చెట్లు ఆకుపచ్చటి ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. దారి పొడుగునా అన్ని అపార్ట్మెంట్ల ముందర, ఇళ్ళ ముందర ఫెన్సింగ్ ఉండి, అందులో మొక్కలు పెంచారు. ఇక సొంత ఇళ్ళ వాళ్ళైతే మరీ చూసే కళ్ళు కుళ్ళుకునేలా మొక్కలు పెంచేసుకున్నారు. అవును మరి. నేల మీద సొంత ఇల్లు.. ఇంటి పెరడులో కావాల్సినన్ని మొక్కలు పెంచుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఎంత పెద్ద సొంత అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఇలాటి ఒక బుల్లి ఇల్లుకి సాటి రాదు కదా.

ఇక దారి పొడుగునా కనబడే ఇళ్ళలోని చెట్లు, మొక్కల గురించి అందరికీ చెప్పాలని ఎంత ఆరాటమో నాకు. ఒక ఇంట్లో ఆకు సంపెంగ చెట్టు. ఏమిటో రోజూ పూలు పండిపోయి కనిపిస్తాయి. వాళ్ళకు ఈ పూలు పెట్టుకుంటారని తెలీదో ఏమో. ఒక ఇంటి ముందర కాస్త జాగా ఉంచి, లాన్ అంచున, పొడుగ్గా సిమెంట్ తొట్టేలాగ కట్టేసారు. అందులో తెలుపు,లేవెండర్ కలర్స్ లో చిన్న చిన్న పూలు. అక్కడక్కడా ఎర్రవి కూడా. ఆ ఇల్లు భలే ఉంటుంది. వీధి చివరికి ఉండే మరో ఇల్లు నా ఫేవొరేట్ ఇల్లు. కానీ అందులో ఒక ఐస్క్రీమ్ తయారు చేసే కంపెనీ ఉంది ఇప్పుడు. చిన్న పెంకుటిల్లు ఓ పక్కగా ఉంటుంది. ఎల్ షేప్ లో పెరడు. చుట్టూ చిన్న పిట్టగోడ. దానికి అల్లుకుని ఉన్న ఆరెంజ్, లేవెండర్,యెల్లో కలర్స్లో పువ్వులున్న క్రీపర్స్. గోడ మీంచి లోపలి చెట్లన్నీ కనబడుతూ ఉంటాయి. అందులో ఐదు కొబ్బరి చెట్లు, ఒక బాదం చెట్టు, మావిడి, అరటి, నిమ్మ, వేప, కర్వేప చెట్లు, మల్లె పొదలు, గులాబీ వృక్షాలు(మొక్క కంటే చాలా పెద్దవి మరి), గేట్ కి అటు పక్కన సన్నజాజి పందిరి, ఇంకా ఏవో పూల క్రీపర్స్ ఉంటాయి. పెరట్లోనే ఓ పక్కకి రెండు మూడు గదులు ఉన్నాయి. షెడ్డుల్లాగ. ఎవరిదో.. అమ్మేసారో, అద్దెకు ఇచ్చారో తెలీదు కానీ భలే అందంగా ఉంటుంది. ఆ ఇల్లు చూడ్డం కోసమన్నా వాకింగ్ కి వెళ్ళాలనిపిస్తుంది.

మరో ఇంట్లో నేరేడు చెట్టు. ఇది నన్ను బోలెడు జ్ఞాపకాల్లోకి తీసుకుపోతుంది. రాజమండ్రిలో మా తాతగారి ఇంటి పక్కన ఇంట్లో ఉండేది ఒక పేద్ద నేరేడు చెట్టు. వెళ్ళినప్పుడల్లా మా పిల్లల పటాలమంతా ఆ కాయలు కొట్టే పనిమీదే ఉండేవాళ్ళం. ఆ ఇంటివాళ్ళు బయటకు రాగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అయిపోయేవాళ్ళం. ఇక నే నడిచే దారి పొడుగునా నాలుగైదు పెద్ద పేద్ద వేప వృక్షాలు. వాటి నిండా వేప పూత. పక్కగా రాగానే కమ్మని పూల వాసన మనసంతా కమ్మేస్తుంది. గుండెల నిండా ఈ వాసన పీల్చుకుని మళ్ళీ నాలుగడుగులు వేసేసరికీ మరో వేప చెట్టు. అప్పుడప్పుడు కోయిల కూత కూడా పలకరిస్తూంటుంది. ఎలాగూ చెవిలో ఇయర్ ఫోన్స్ కమ్మని పాటలు వినిపిస్తూనే ఉంటాయి నడుస్తున్నంత సేపూ. ఇయర్ ఫోన్స్ చెవిలో ఉంటే ఎంత దూరమైనా అలుపు తెలియదు నాకు.

ఇక కొన్ని సందు మొదలలో పిల్లలతో పాటూ స్కూల్ బస్ కోసం నిలబడే తల్లులు, పేపరు,పాల సైకిళ్ళవాళ్ళు, నాలానే వాకింగ్ కి వచ్చే చిన్నా పెద్దా...రోజూ చూస్తూంటాం కాబట్టి పలకరించకపోయిన పరిచయమైపొయిన పరిచయాలు ఇవన్నీ. హ్మ్...ఇలా చెప్పుకుంటూ పోతే రెండు టపాలు రాసినా నా వర్ణన అవ్వదు. కాబట్టి ఈ టపాని ఇంతటితో ఆపేస్తా. క్లుప్తంగా ఇవీ ఈ మధ్యన నేను ఆస్వాదిస్తున్న మార్నింగ్ వాక్ అందాలు..ఆనందాలు.