మన తెలుగు భాషను, తెలుగు సంప్రదాయాన్ని తమ అక్షరాలతో, సినిమాలతో, పాటలతో, గాత్రాలతో వెలుగులద్ది, భాషను పదింతలు అందంగా మార్చి, వైభవాన్ని పెంచిన మహామహులందరూ గత కొన్నేళ్లుగా స్వర్గానికి నిచ్చెన వేసుకుని అక్కడే సమావేశమవుతూ వచ్చారు. అంతవరకూ బానేఉంది. కానీ వారి సాంగత్యాలు సంపూర్ణమవ్వలేదనో ఏమో, మిగిలిన అతి కొద్దిపాటి హేమాహేమీలను కూడా తమ వద్దకు పిలిపించుకుంటున్నారు. ఇటీవలి వాణి జయరాం గారి నిష్క్రమణ నుంచి తేరుకోక ముందే... నిన్న మొన్నటి శ్రీ రమణగారూ...! ఏమంత వయసైపోయిందని సార్ అంత తొందరపడ్డారు...ఇంకొన్నాళ్ళు ఉంటే మన భాషకు మరింత వైభవాన్ని పెంచేవారు కదా! తెలుగు భాషపై మీకున్న మమకారం, ప్రేమాభిమానాలు, దాని మనుగడ కోసమూ, వ్యాప్తి కోసమూ మీరు చేసిన కృషి.. ఎంతో హర్షనీయం.
బాపూ గారిని, రమణ గారినీ తలిచినప్పుడల్లా ఠక్కున వెంఠనే గుర్తొచ్చే మరొక వ్యక్తి శ్రీ రమణగారు. నాకు శ్రీరమణ గారంటే ఎంతో గౌరవం, చెప్పలేనంత అభిమానం! సాహిత్యపరంగా నాకు శ్రీ రమణగారు పరిచయం అయ్యింది వెండితెర నవలల ద్వారా. చిన్నప్పుడు మా ఇంట్లో బాపూగారి సినిమాల వెండితెర నవలలు ఉండేవి. ముత్యాల ముగ్గు, వంశ వృక్షం, రాధా కల్యాణం, గోరంత దీపం మొదలైన వెండితెర నవలలన్నింటికీ నవలీకరణ శ్రీ రమణ గారే చేశారు. ఒక్క బాపూగారి సినిమాలకు మాత్రమే ఇలా నవలీకరణ చేసారేమో ఆయన తెలీదు మరి. కానీ మళ్ళీ మళ్ళీ చదువుకునేలా ఎంతో ఆసక్తికరంగా ఉండేవి అందులోని డైలాగులూ, మాటలూ అవీ.
ఆయన రాసిన కాలమ్స్ పుస్తకరూపంలో వచ్చాకే చాలావరకూ చదివాను కానీ ఒక కథ మాత్రం విజయవాడలో ఉన్నప్పుడే చదివాను. ఆ ఒక్క కథకే మా ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోయాం! ఒకరోజు నాన్న ఆఫీసు నుంచి ఎవరో ఇచ్చారని A4సైజు పేపర్లలో ఉన్న ఒక కథ జిరాక్స్ చేయించి తెచ్చారు. అందరినీ కూర్చోపెట్టి చదివి వినిపించారు. సైలెంట్గా మొత్తం వినేసాం. ఎంత బావుందో..ఎంత బావుందో అనుకుంటూ. అదే "బంగారు మురుగు" కథ. కథలో బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రాలు -
* "నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం"
* "మొక్కకి చెంబుడు నీళ్ళు పొయ్యడం...పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం. ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం, నాకు తెలిసిందివే" బాగా గుర్తుండిపోయాయి.
అదో అద్భుతమైన కథ! "పచ్చటి గొడుగు పాతేసినట్లు ఉన్న బాదం చెట్టు" గురించి చదువుతూంటే కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు.. భాస్కరమ్మగారి ఇంట్లో ఉండేప్పుడు మా దొడ్లో పొద్దున్నే కాకులు బాదంకాయలు పడేసి వెళ్తూ ఉండేవి. అమ్మ మాకు ఆ కాయలు కొట్టి బాదం పప్పులు పెట్టేది. పప్పు విరగకుండా బాదం కాయలు కొట్టుకోవడం బాగా ప్రాక్టీస్ అయ్యింది మా పిల్లలకు. ఇప్పుడు మా సొసైటీలో కూడా మేం వచ్చిన కొత్తల్లో ఎవరో వేసిన రెండు బాదం చెట్లు పెద్ద పెద్ద వృక్షాలై రోజూ బోలెడు కాయలు, ఆకులూ రాలుస్తూ ఉంటాయి. ఆ చెట్ల కోసం నేను రోజూ వాకింగ్ కి అటువైపే వెళ్తూ ఉంటాను. ఆ రకంగా నాకు బంగారు మురుగు కథ గుర్తుకు రాని రోజే లేదు.
కొన్నేళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చాకా నాన్న నవోదయాలో ఒక పుస్తకం కొని తెచ్చారు - "మిథునం". అందులో ’బంగారు మురుగు’ తో సహా ఏడెనిమిది కథలు ఉన్నాయి. అన్నింటిలోకీ చివరిదైన "మిథునం" కథ మరొక అద్భుతం. బాపూ గారి మిథునం దస్తూరీ తిలకం చాలు ఈ కథ గొప్పతనం కొలవడానికి. అదొక masterpiece అంతే!
మిథునం లోని జీవిత సత్యం -
"...దానికో లెఖ్ఖ ఉంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు.మనం పుట్టగానె..వీడికి ఇన్ని...దీనికి యిన్ని అని ఎంచి వాటికి వరసాగ్గా అంకెలు వేసేసి ఆకుల మీద దస్కత్తులు పెట్టేస్తాడు.వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో, ఇంకేముంది! మిగిలేది నేల. అయితే ఆ అంకెలు కనిపించవు మనకి. ఆ లిపి అర్థం కాదు. అంచేత అదంతా నిగూఢం"
అనామకంగా మిగిలిపోయే ఏభైలూ, వందలూ కథలు రాయక్కర్లేదు, ఏ రచయితకైనా ఇటువంటి ఒక్క కథ చాలు... జన్మ సార్థకం అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఈ ఒక్క కథా చాలు కథారచయితల జాబితాలో మొదటి అంకె దగ్గర శ్రీ రమణగారిని నిలబెట్టడానికి. ఈ రెండు కథలు నాకు ఎప్పటికీ అత్యంత ప్రీతిపాత్రమైన కథలు. భరణిగారు మిథునం సినిమా తీసినట్లు , బంగారు మురుగు ని కూడా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ గా అయినా తీస్తే బావుంటుంది.
నాన్న రేడియోలో రిటైర్ అయ్యి ఇన్నేళ్ళైనా, ఓపిక ఉన్నా లేకున్నా, వేరే ఏ పనిలో ఉన్నా కూడా, రోజూ క్రమం తప్పకుండా వందేమాతరం నుంచీ జైహింద్ దాకా రేడియో వినడం ఆయన ఇప్పటికీ ఇష్టంతో చేసే పని. ప్రొద్దుటి ప్రసారవిశేషాలలో విన్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని కేసెట్ లో రికార్డ్ చెయ్యడం, ఆ తర్వాత వాటిని సీడీ లోకో, పెన్ డ్రైవ్ లోకో మార్పించి అవి చదివిన వారికో, ఫలానా కార్యక్రమాన్ని సమర్పించినవారికో వాటిని అందించడం కూడా ఆయనకో హాబీ. అలా క్రితం ఏడాది శ్రీరమణగారివి కొన్ని టాక్స్ రేడియోలో ఓ సిరీస్ లో ప్రసారమయ్యాయి. ఎప్పటిలానే నాన్న వాటిని రికార్డ్ చేసారు. చేశాకా వాటిని సీడీగా మార్పించారు. అది అందించడానికి శ్రీ రమణగారికి ఫోన్ చేశారు. ఆయన ఎంతో బాగా మాట్లాడారుట. నాన్నకు ’చాలా సంతోషం, మీరు తెలుసు.. ’ అని చెప్పి, విజయవాడ రోజులు, కాళేశ్వర్రావు మార్కెట్లో కూరలు కొనుక్కోవడం నుంచీ ఎన్నో విజయవాడ జ్ఞాపకాలు నెమరువేసుకున్నారట. "సిడి తీసుకోవడానికి వస్తాను. అడ్రస్ చెప్పండి" అన్నారట. "అయ్యో భలేవారే. వద్దు. మీ అడ్రస్ చెప్పండి చాలు కొరియర్ చేస్తానని" అడిగి, నాన్న లోకల్ కొరియర్ లో ఆయనకు సిడి పంపించారు. అందాకా అందినట్లు ఆయనే ఫోన్ చేసి చెప్పారట కూడా. చాలా తక్కువ నిడివి గల ఆ రేడియో టాక్స్ బ్లాగ్ లో టపా రాస్తే అందులో పొందుపరచమని నాన్న మొన్న ఈ విషాద వార్త తెలిసిన రోజున అడిగారు. వాటిని తెప్పించుకున్నాను కానీ అతిపెద్ద బ్లాగ్ విరామం వల్ల ఆడియో ఫైల్ ను బ్లాగ్లో ఎలా పెట్టాలో మర్చిపోయాను. ఎలానో గూగిలించి, తెలుసుకుని ఇప్పుడు పెడుతున్నాను.
audio file 1
అనుకోకుండా నిన్న నాకు మరొక ఆణిముత్యం లాంటి వీడియో దొరికింది. గొల్లపూడిగారు శ్రీ రమణగారిని ఇంటర్వ్యూ చేసిన వీడియో. ఇందులో మిథునం కథ గురించి నేను రమణగారిని అడగాలి అనుకుంతూ ఉండే ప్రశ్నలు గొల్లపూడిగారే అడిగేసారు. అది కూడా చూడండి -
https://www.youtube.com/watch?v=pIClbNmTNk4
తెలుగు భాష మనుగడకు తోడ్పడిన ఇటువంటి భాషాభిమానులు చాలా చాలా అరుదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, దీని గురించి ఎవరు రాస్తారు? అనుకుంటే.. శ్రీ రమణగారు రాయగలరు. ఆయన ఉన్నారు అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మరి ఆయన గొప్పతనాన్ని గురించో, మరేదైనా ముఖ్య విషయాన్ని గురించో రాయడానికి ఎవరున్నారా అని వేళ్ల మీద లెఖ్ఖపెట్టుక్కునే పరిస్థితి! భవిష్యత్తుపై ఆశావహ దృక్ఫథంతో చూస్తూండడం తప్ప మనం చెయ్యగలిగినదేదీ లేదు. ఏదేమైనా శ్రీరమణగారు లేని లోటు పూడ్చలేనిది. Telugu people have lost a great Litterateur! ఆయనకు నా నమస్సుమాంజలి.
స్వర్గంలో మాత్రం దర్బారు నిండుకుంది!!
audio file 2