బ్లాగ్ మొదలెట్టిన ఏడాది తర్వాతేమో నాన్న గురించి సిరీస్ రాసిన తర్వాత ఒకరోజు ఒక కామెంట్ వచ్చింది. కాకినాడలో మీ అన్నయ్యగారి ఫ్రెండ్ ని. నేను ఫలానా. మీ అన్నయ్య మెయిల్ ఐడీ ఇవ్వగలరా? అని. అలా మొదలైన ఒక చిన్న పరిచయం స్నేహశీలత నిండిన ఒక ఆత్మీయ పరిచయంగా మారింది. పరిచయానికీ, స్నేహానికీ మధ్యన ఎక్కడో ఉండే ఒక మధ్య మెట్టులోనే ఆ పరిచయం ఉండేది. అయితే, ఎప్పుడో అప్పుడప్పుడూ జరిగే రెండు వాక్యాల పలకరింపుల్లో కూడా ఎంతో స్నేహశీలత, ఆప్యాయత తొంగిచూసేవి. సద్భావన, సచ్ఛీలత, సహృదయత నిండుగా మూర్తీభవించిన మనిషి రామ్ గారు. సుప్రసిధ్ధ రచయిత, ముత్యాల ముగ్గు సినిమా నిర్మాత శ్రీ ఎం.వీ.ఎల్ గారి అబ్బాయి శ్రీ ఎమ్.వీ.ఎస్.రామ్ ప్రసాద్ గారు. ఇది ఆయన బ్లాగ్ లింక్ -
http://mvl-yuvajyothi.blogspot.com/
దాదాపు నేను రెగులర్ గా బ్లాగ్ రాసినన్నాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు. చివర చివరలో ఆఫీసు పని వత్తిడులలో చాలా బిజీ అయిపోయారు ఆయన. నేనూ బ్లాగ్ మూసేసాకా అసలు ముఖ పుస్తకం, బ్లాగులు, బ్లాగిళ్ళు...వేటి వంకా కన్నెత్తయినా చూడని కారణంగా గత ఐదేళ్ళుగా అసలు ఏ పలకరింపులూ లేవు. ఆ స్నేహపరిచయం అలా ఆగిపోయింది. 2017 చివర్లో ఎం.వీ.ఎల్ గారి రచనల పుస్తకావిష్కరణ జరిగిందని, మొదటి పేజీలో కృతజ్ఞతలలో మీ పేరు కూడా ఉందని ఆ పేజీ కాపీ పంపించారు. ధన్యవాదాలు తెలిపాను. అదే చివరి ఈ-మెయిల్.
ఒకసారి ఇండియా వచ్చినప్పుడు మాత్రం నాన్నగారింట్లో రామ్ గారూ, అన్నయ్య, నేనూ, మా వారూ అంతా కలిసాము. వారం రోజుల క్రితం అన్నయ్య నుంచి వచ్చిన మెసేజ్ చదివి దిగ్భ్రాంతి చెందాను. రామ్ గారి హఠాన్మరణం గురించి!!! ఎంతో దారుణమైన వార్త! నమ్మశక్యం కాని ఆ వార్తను జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇవాళ పొద్దున్నకి ఆయన భౌతికశరీరం ఇండియా వస్తుందని, ఎయిర్పోర్ట్ కి వెళ్తానని అన్నయ్య రాత్రి చెప్పాడు. బహుశా ఈ సమయానికి ఆయన సొంతఊరైన నూజివీడు లో అంతిమకార్యక్రమాలు జరుగుతూ ఉండిఉంటాయి. ఆ ఊరంటే ఎంతో ప్రేమ రామ్ గారికి. కనీసం ఈరకంగా అయినా ఆయన ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను.
వాళ్ల నాన్నగారి రచనలను వెతికి, వాటిని ప్రచురణ వరకు తీసుకువెళ్లడమే భగవంతుడు ఆయనకు కేటాయించిన ముఖ్యమైన పనేమో! ఆ రకంగా బాధ్యత తీర్చేసుకున్నారు. కానీ ఎంతో ప్రతిభ ఉన్న ఒక మంచి మనిషి ఇలా అర్థాంతరంగా వెళ్పోవడం చాలా బాధాకరం. ఆయన ప్రతి మాట, ప్రతి అక్షరం ఎంతో మాజికల్ గా ఉండేవి. ఆయన శ్రధ్ధ పెట్టలేదు కానీ ఎంతో గొప్ప కవి లేదా రచయిత అయి ఉండేవారు రచనా ప్రపంచంలోకి గనుక వచ్చి ఉంటే! అక్షరాలతో మేజికల్ గా పదాలల్లడంలో ఆయనకు ఆయనే సాటి. రామ్ గారు పండుగలకు శుభాకాంక్షలు తెలుపడం కూడా గమ్మత్తుగా ఉండేది. తెల్ల కాగితంపై అందమైన చేతి వ్రాత తో, ఏ పండగ అయితే ఆ పండుగకు సంబంధించిన పదాలతో అల్లిన ఒక అద్భుతమైన కవిత పి.డి.ఎఫ్ రూపంలో ఈమయిల్ కు అటాచ్ అయి వచ్చేది. అందులో పన్లు,సెటైర్ లు, ప్రాసలూ అనేకం కలగలిపి ఉండేవి. ఈకాలంలో అటువంటి ప్రజ్ఞాశాలిని అరుదుగా చూస్తాము. It's a great loss. I express my deepest condolences to his family.
క్రితం వారం కలిసినప్పుడు అన్నయ్య, రామ్ గారితో తన మొదటి పరిచయం గురించి చెప్పాడు. కాకినాడలో ఓ పాటల పొటీకి వెళ్ళారుట. రామ్ గారు "బ్రోచేవారెవరురా" పాడితే, అన్నయ్య "ఊహా పథాలలో..." అనే లైట్ మ్యూజిక్ సాంగ్ పాడాడుట. "లిరిక్ చాలా బావుంది.. మీరెవరు?" అంటూ వచ్చి పరిచయం చేసుకున్నారుట రామ్ గారు. ఇంజినీరింగ్ కాలేజీలో రామ్ గారు తనకు సీనియర్ అని అప్పుడు తెలిసిందిట.
కొన్ని పరిచయాలకి పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు కానీ మనసులో ఆ పరిచయానికి ఓ పేరు ఎప్పుడూ ఉంటుంది. రామ్ గారు అనగానే ఆప్యాయంగా పలకరించే ఓ పెద్దన్నయ్య అనిపించేవారు నాకు. బ్లాగింగ్ గురించి మాట్లాడినప్పుడల్లా ఎన్నో సలహాలు, సూచనలు అందించేవారు. బ్లాగులో ఫీడ్జిట్ కౌంటర్ ఇస్టాల్ చేసుకోమని ఎన్నో సార్లు చెప్పారు. లింక్ కూడా మెయిల్ చేశారు. అప్పట్లో ఎందుకో అది ఇన్స్టాల్ చేయడం సరిగ్గా తెలియలేదు నాకు. ఇందాకా ప్రయత్నించాను కానీ పనిచేయట్లేదు. వేరే ఏదైనా తప్పకుండా ఇన్స్టాల్
చేయడానికి ఇప్పుడన్నా ఆయన కోరిక మేరకు ప్రయత్నిస్తాను.
రామ్ గారూ! మీరు ఎప్పుడూ చెప్పేవారు కదా.. రాస్తూనే ఉండమని! తప్పకుండా గుర్తుంచుకుంటానండీ! మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
సెలవు...