సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, October 28, 2009

ముత్యాల ముగ్గు


బాపూగారి అసంఖ్యాక అభిమానుల్లో మా నాన్న ఒకరు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువవ్వగానే బాపూను కలిసిన నాన్న ఆయన చెప్పిన మాట విని అక్కడే ఉండిపొతే ఈ సినిమా టైటిల్స్ లో తన పేరు ఉండిపోయేది కదా అని ఇప్పటికీ అనుకుంటూంటారు...!! అప్పట్లో ఈ సినిమా విడుదలైనప్పుడు బాపు గారిది,ఎమ్.వి.ఎల్ గారిది ఆటోగ్రాఫ్ మాత్రం సంపాదించుకున్నారు.(పాతవవటం వల్ల వాటికి ఫొటో తీసినా సరిగ్గా రాలేదు.)

తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ "ముత్యాలముగ్గు"(1975). సినిమాలోని పాత్రలూ, డైలాగులూ, చిత్రీకరణ, పాటల సాహిత్యం,సంగీతం అన్నీ వేటికవే సాటి.ఇటువంటి గొప్ప సినిమా గురించి నా సొంత జ్ఞానంతో, అక్షరాలతో సమీక్ష రాయటం సాహసమే. ఒక సినిమా గురించి చాలా రకాలుగా రాయచ్చు.నేను కేవలం ఈ సినిమాకున్న ప్రత్యేకతలను మాత్రమే రాయదలిచాను. ఈ సినిమా తాలూకు నవలారూపాన్ని చిన్నప్పటినుంచీ చాలా సార్లు చదివాను. మొదటిసారి సినిమాను మాత్రం మేము టి.వి కొనుక్కున్న కొత్తలో, దూరదర్శన్ వాళ్ళు మధ్యాహ్నం వేసే ప్రాంతీయ భాషా చిత్రాల్లో చూసాను...

జీరో ఫిగర్ లేదా సన్నని ఆకృతి, హెవీ మేకప్, వీలయినన్ని తక్కువ దుస్తులు, గ్లామరస్ లుక్స్....ఇవి ఇవాల్టి ఆధునిక "హీరోయిన్" అర్హతలు, గుర్తులు కూడా. కానీ పెద్ద కళ్ళు, కళ్ళనిండా కాటుక, మేకప్ లేని సహజత్వం, ముద్దబంతి లాంటి రూపం, పొడుగాటి వాల్జెడ, "బాపురే" అనిపించేలాంటి తెలుగుదనం నిండిన అమ్మాయిలు ఆయన బొమ్మల్లాంటి మన బాపూ గారి హీరోయిన్లు. ప్రతి సినిమాలోనూ పాత్రకు తగ్గ రూపం, ఈ పాత్రకి ఈవిడే కరక్ట్ అనిపించేలాంటి ఆర్టిస్ట్ లు.

"అబ్బ...ఎంత పెద్ద కళ్ళు...." అని హీరో తో పాటూ మనమూ ప్రేమలో పడిపోతాము


ముత్యాలముగ్గు లో హీరోయిన్ తో.
"ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ
మత్తైదు కుంకుమ బతుకంత ఛాయ...."
"......తీరైన సంపద ఎవరింట నుండూ
దిన దినము ముగ్గున్న లోగిళ్ళ నుండు...."
".......ఇంటి ఇల్లాలికీ ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికీ అంత వైభోగం......"
అని పాడుతున్నది సుశీల గారైనా నటించిన సంగీత పాత్రను చూసి 'భార్య అంటే ఇలా ఉండాలి' అనుకోని మగవారుండరంటే అతిశయోక్తి కాదేమో..! పనులు చేసుకుంటూనో, ముగ్గు పెట్టుకుంటూనో, ఇల్లు సర్దుకుంటునో ఈ పాటలోని ఆరుద్ర గారి సాహిత్యాన్ని పాడుకోని తెలుగు ఇల్లాలు కూడా ఉండదు.

ఈ సినిమా గురించి చెప్పాల్సిన విశేషాలు చాలా ఉండటం వల్ల కధ గురించి క్లుప్తంగా --
అపార్ధాలతో విడిపోయిన ఒక జంట చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కధాంశం.
స్నేహితుని చెల్లెలి పెళ్ళికి వెళ్ళి, అనుకోని పరిస్థితుల్లో ఆమెను వివాహమాడి ఇంటికి తెస్తాడు శ్రీధర్. అమాయకత్వంతో పాటూ లోకజ్ఞానం కూడా మెండుగా ఉన్న పల్లెటూరి అమ్మాయి లక్ష్మి.పేదింటి పిల్లను కోడలిగా మొదట్లో అంగీకరించలేకపోయినా, ఆమె వల్ల పోయిన దేముడి నగలు దొరకటంతో కోడలు లక్ష్మి తన ఇంటి మహాలక్ష్మి అనే నమ్మకానికి వస్తారు శ్రీధర్ తండ్రి రాజా రామదాసుగారు. ఆయన బావమరిది సోమరాజుకు తన కూతురుని శ్రీధర్ కు కట్టబెట్టి రామదాసుగారి ఆస్తినంతా అనుభవించేయాలని దురాశ. శ్రీధర్ ఒక పేదపిల్లని పెళ్ళాడి రావటం, రామదాసుగారు ఆమెను అంగీకరించటం సహించలేక నూతన దంపతులను విడదియ్యాలని కుట్ర పన్ని ఒక కాంట్రాక్టరు సాయంతో వారిద్దరినీ విడదీస్తాడు. దురాశ దు:ఖానికి చేటు అన్నట్లుగా తాను చేసిన పనికి కూతురివల్ల, కాంట్రాక్టరు వల్ల సోమరాజు ఎన్ని అవమానాలకూ నిందలకూ గురయ్యాడు, తాను తీసిన గోతిలో కాంట్రాక్టరు ఎలా పడ్దాడు, శ్రీధర్,లక్ష్మిల కవల పిల్లలు తెలివిగా తల్లిదండ్రులను చివరికి ఎలా కలిపారు అన్నది మిగిలిన కధ.

చాలా సినిమాలకు ఇతివృత్తాలు మన హిందూ పురాణాల నుంచే సేకరించబడ్డాయి. ఆ సినిమాలు బాగా ఆడాయి కూడా.అలాగే ఉత్తర రామాయణం ఆధారంగా ఈ సినిమా తీయబడిందని అంటారు. బాపు గారికి రాముడంటే ఎంత ఇష్టమో "సంపూర్ణ రామాయణం" "సీతా కల్యాణం" "అందాల రాముడు" మొదలైన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ముత్యాల ముగ్గులో కూడా శ్రీరామ పట్టాభిషేకానంతర కధని ఒక సాంఘిక సినిమా రూపాన్నిచ్చి ఎంతో అందంగా మనకందించారు బాపూరమణలు. నారాయణరెడ్ది గారు రచించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన "శ్రీరామ జయ రామ సీతా రామ.." కూడా బాపుగారి రామ భక్తికి నిదర్శనమే !

ఈ సినిమాలో గుర్తుంచుకోదగ్గ "డవిలాగులు"

" యస్సారు గాదు. కళ్ళెట్టుకు సూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో. సూరిఇడు నెత్తురుగడ్దలా లేడూ"

"ఆ ! మడిసనాక కస్సింత కలాపోసనుండాలయ్యా!! ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటుంది."

"ఆ ముక్క, నే లెక్కెట్టే ముందు సెప్పాల. అసలు నే లెక్కే పెట్టనని నీ ఎదవ ఆలోచన. తప్పు కదూ! జాగర్త డిక్కీలో పెట్టించేస్తాను. "

"కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుంది. అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది. "
(ఇది బాపూగారికి కూడా బాగా నచ్చిన డైలాగుట.)

"సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు"

సినిమాకు సంబంధించి కొన్ని విశేషాలు, కబుర్లు

* పన్నెండున్నర లక్షలు ప్రొడక్షన్ కాస్ట్ పెట్టి తీసిన ఈ సినిమా మొదటి రిలీజు ఇరవై నాలుగోవారానికి రెండు కోట్లు వసూలు చేసిందిట.

* రొటీన్ గా వస్తున్న "విలన్" పాత్రకు కొత్త రూపాన్నిచ్చింది ఈ సినిమా. ఈ కొత్త తరహా విలన్ అసాధ్యుడు. అనుకున్నది సాధించే పనితనం ఉన్నవాడు, తన
పనివాడి నమ్మకద్రోహాన్ని కూడా పసిగట్టేంత తెలివైనవాడు, తాను చేసేది దుర్మార్గం అని ఒప్పుకోటానికి వెనుకాడని సాహసి. ఈ పాత్ర స్వర్గీయ రావు గోపాలరావు గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ వారీ చిత్రంలో చెప్పిన డైలాగులను అనుకరిస్తున్నారు అంటే ఎంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్నరో వేరే చెప్పనవసరం లేదు.

* "ముత్యాల ముగ్గు" లోని బంగళా షూటింగ్ శ్రీమతి ఇందిరా ధన్ రాజ్ గిర్ గారి అనుమతితో హైదరాబాద్ లోని జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ లో జరిగింది. సినిమాలో చూపిన కొన్ని నగలు కూడా ఇందిరగారివేనని అంటారు.

* ప్రముఖ సినిమాటోగ్రాఫర్ "ఇషాన్ ఆర్య" ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. కొన్ని "కోకకోలా ఏడ్ ఫిల్మ్స్" చూసాకా బాపు గారికి ఈయనతో పని చేయాలనే ఆలోచన కలిగిందట.

*ఇక అవార్డుల విషయానికి వస్తే, 1975 లో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డ్ గెలుచుకుంది. బెస్ట్ కలర్ ఫొటోగ్రఫీ కి ఆల్ ఇండియా అవార్డ్ ను కూడా సినిమాటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య సంపాదించుకున్నారు. ఇవేకాక ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ద్వారా మరెన్నో అవార్డులని కుదా ఈ చిత్రం సొంతం చేసుకుంది.

* బాపు రమణలు సంగీతప్రియులు. మధురమైన కె.వి.మహాదేవన్ సంగీతంతో పాటూ, నూతన దంపతుల సన్నిహిత దృశ్యాల చిత్రీకరణలో ప్రముఖ మేండొలీన్ విద్వాంసుడు Sri Sajjad Hussain గారి 16 నిమిషాల మేండొలిన్ బిట్ అందుకు సాక్షి .

* పేరుపెట్టేదాకా సినిమాను "ముత్యాల ముగ్గు" అని సరదాగా పిలిచేవారట. తర్వాతర్వాత అదే పేరు బాగుందని ఉంచేసారట.

* ఈ చిత్రంలో మాడా, ఆంజనేయస్వామి, పుజారిగారి కుటీరం, సంగీత చీరలు, హలం కట్టుకున్న సింపుల్ చీర, ముద్దొచ్చే కవల పిల్లలూ అన్ని సూపరే...ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారు ఆఖరు సీను లో....చాలా బాగా చేస్తారు. ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు ఏక్సిడెంట్ లో మరణించారట. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చి "బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం" అనేవారుట .

* స్వర్గీయ ఎన్.టి.ఆర్ గారికి ఎంతో ఇష్టమైన సినిమాట ఇది. డైలాగులు, సీన్లు తన చిన్ననాటిరోజులను గుర్తుకు తెస్తున్నాయని అనేవారట. స్కూలు పిల్లలకి వీడియో పాఠాలు తయారుచేసే ప్రోజక్ట్ బాపూరమణలకు అప్పజెప్పినప్పుడు ఇవి "ముత్యాలముగ్గు అంత బాగుండాలి" అనటం ఆ సినిమాకు పెద్ద ప్రశంసే మరి.

* ముళ్లపూడి వెంకటరమణగారి డైలాగులు ఈ చిత్రానికి ప్రాణాలు.


సినిమాలో గుర్తుండిపోయే విషయాలు:

తోటలో సంగీత జామకాయలు కోసి శ్రీధర్ కు కాకెంగిలి చేసి ఇచ్చే సీన్, శాంత శ్రీధర్ కు తేగ పెట్టేప్పుడు చెప్పే కబుర్లు, శ్రీధర్ ఫోటో పడేసుకుని వెళ్పోతే అది తీసుకుని లక్ష్మి ఆనందించే దృశ్యం, రాము ఆంజనేయస్వామితో మాట్లాడే మాటలు... గుర్తుండిపోతాయి.

సినిమాలో పాటలన్నీ బాగుంటాయి కానీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఏకైక సినిమా పాట "నిదురించే తోటలోకి...." , "ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ..." నాకిష్టమైనవి. అందరు నటులు తమ తమ పాత్రలకు ప్రాణం పోసారు. శ్రీధర్ నటన కంటే నాకు సంగీత నటనే ఎక్కువ నచ్చుతుంది. బహుశా కధలో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంవల్ల కావచ్చు. చిన్నప్పుడు ఈ సినిమా చూసి అంత ప్రేమించే భర్తకు భార్యపై నమ్మకం లేదేంటి? అది ప్రేమెలా అవుతుంది? అనుకునేదాన్ని. కానీ భార్యాభర్తల మధ్య అనుబంధానికి పునాది "నమ్మకం". అది లేని నాడు బంధాలు తెగిపోతాయి, కాపురాలు కూలిపోతాయి అనే సత్యాన్ని ఈ సినిమా తెలుపుతుంది అని పెద్దయ్యాకా అర్ధమైంది. సినిమా వచ్చి ముఫ్ఫైనాలుగేళ్ళు అయినా ఇంకా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అపురూపమైన చిత్రంగా మిగిలిపోవటానికి సినిమా అంతా నిండిఉన్న తెలుగుదనమే కారణం అనిపిస్తుంది నాకు.




ఇంత రాసినా ఇంకా ఏదో మిగిలిపోయింద నిపిస్తోంది... :)


36 comments:

భావన said...

చాలా బాగుంది తృష్ణా మీరు ముత్యాల ముగ్గు గుర్తు చెయ్యటం. నాకు బాపు గారి విశ్వనాధ్ గారి సినిమాలు చూసి అలా నది ఒడ్డున రెల్లు గడ్డి ఇల్లు గురించి ఎన్ని కలలు కనే దానినో చిన్నప్పుడు... నాకు బాగా గుర్తు రావటం లేదు కాని సాధారణం గా బాపు గారు ఒక రాముల వారి సీతమ్మ విగ్రహాలు చూపిస్తారు ఆయన సినిమాలలో ఎంత అందం గా వుంటారంటే వాళ్ళు ఇద్దరు. అబ్బ చెప్పలేను నేనైతే.. ఆ విగ్రహాలు ఈ సినిమా నుంచే మొదలయ్యాయి అనుకుంటా. అవునా? "నిదురించే తోట లోకి" పాట ఎంత బాగుంటుంది.. ఆయన "ప్రేమ కు నమ్మకం పునాది", "అసూయ ప్రేమ కొలిచే సాధనం" అంటూ ఎన్ని సినిమాలు తీసేరో కదా, అన్ని బాగుంటాయి. :-) మంచి సినిమా గుర్తు చేసేరు. ఆ సినిమా చూసినప్పుడు నేను కూడా ఎంత ఆశ పడ్డానో ఆంజనేయ స్వామి అలా కనపడతారు కామోసు అని మా సందు చివర గుడికి వెళ్ళి చూసే దానిని. :-)

Giridhar Pottepalem said...

బాగుందండీ మీ సమీక్ష. ఈ సీనిమా గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది. బాపు గారి చేతిలో రూపు దిద్దుకున్న అందమైన కళా కావ్యం.
- గిరిధర్ పొట్టేపాళెం

శ్రీ said...

ఈ సినిమాకి ఏమ్వియాల్ కూడా పని చేసారు అంది.. అయన నవలీకరించిన ముత్యాల ముగ్గు కూడా బాగా అమ్ముడు పోయింది. ఏమ్విఎల్ గారి తెలుగు పాతం అంటే ప్లే గ్రౌండ్ ఎప్పుడు కాళి . ఆ క్లాసు మిస్ అయితే బోలెడు మిస్ అయినట్టు ఫీల్ అయ్యేవారు స్టూడెంట్స్. అయన ఒక్క రోజు కూడా తరగతి కి పుస్తకం తీసుకు రాగా చూడలేదు అని అంటారు. ఇవి మా అక్క వాళ్ళ చెప్పిన ఏమ్వియాల్ గారి కబుర్లు.
అప్పట్లో చందమామ పుస్తకాల్లో పిల్లలు చెప్పినట్టు ఈ సినిమా కథ కూడా ఉంది. శ్రీధర్ చిత్రా లలో ఇది చాలా పెద్ద హిట్. సంగీత కి ఈ సినిమా ఇమేజ్ ఇప్పటికి అలాగే ఉంది. సంగీత గారు చెప్పిన కొన్ని కబుర్లు ఇక్కడ చదవండి
http://www.telugucinema.com/c/publish/stars/interview_sangeetha_2007.php

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఇంతచదివినా ఇంకా ఏదో మిగిలిపోయిందనిపిస్తుంది

తృష్ణ said...

@భావన:నాక్కూడా ఎంత ఇష్టమో అలా నది ఒడ్దున చిన్న రెల్లు గడ్డి ఇల్లు....అలా కట్టేసుకుని అక్కడ ఉంటున్నట్లు కలలు కనేదాన్ని నేను..:)

బాపూ గారి రామ భక్తి, విశ్వనాథ్ గారి శివారాధన ల గురించి చెప్పేదేముందండీ....

సినిమా డైలాగు కరక్ట్ గా చెప్పాలంటే, "అసూయ ఘాటైన ప్రేమకు ధర్మామీటర్.."

ఆంజనేయస్వామి కనబడలేదు కాని కలల్లో చాలా సార్లు కొందరు దేముళ్ళు నాకు కనిపించారండోయ్...

తృష్ణ said...

@ గిరిధర్ పొట్టేపాళెం : ధన్యవాదాలు.

@ శ్రీ : ఆ నవలేనండీ మా ఇంట్లో ఉన్నది.
మీ అక్కగారు చెప్పిన కబుర్లు బాగున్నాయి.
సంగీత గారి ఇంటర్వ్యూ లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

చైతన్యాఆఆఆఆఆఆఅ,

అర్ధమైంది నువ్వు వచ్చావని....

ఇక చదువు పాత టపాలన్నీ...

చదవకపొయావో...చెప్తా నీ పని....

Anonymous said...

తృష్ణ గారు, ముత్యాలముగ్గు సినిమాలాగే , మీ రివ్యూ కూడా చాలా,చాలా బావుందండి.

తృష్ణ said...

@ లలిత : అయ్యో...అంతేం లేదండి..ఏదో నాకు తెలిసింది,తోచింది రాసానంతే...ధన్యవాదాలు.

Hima bindu said...

చిన్నప్పుడు రాజమండ్రి లో చూసాను,అప్పుడే మొదటి సారి తేగలు దానిలోపల చందా మామ తెలిసింది దాని రుచి తెలిసింది. సంగీత అందం మరీ మరీ నచ్చింది .'ఏదో ఏదో అన్నది మసకవెలుతురు"పాటంటే చాలా ఇష్టం .జ్ఞాపకం గుర్తుచేశారు .

Padmarpita said...

చాలా బాగుంది మీ సమీక్ష.నా కలక్షన్స్ లో ఇది కూడా ఉందిగా.....

మురళి said...

పరమ నాస్తికులైన ఆరుద్ర 'ముత్యమంతా పసుపు ..' పాట రాయడాన్ని విశేషంగా చెప్పుకున్నారు..
"అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది అద్దంలా మారిపోతుంది. " ..పటంగా మారిపోతుంది అండి, అద్దం గా కాదు..
తను ఎప్పుడూ వేసే గయ్యాళి వేషాలకి భిన్నంగా, రావు గోపాల రావు భార్యగా అమాయకత్వం నిండిన ఇల్లాలిగా కలిపించారు సూర్యకాంతం..
రాణి ఇందిర గారు గుంటూరు శేషేంద్ర శర్మగారి సతీమణి.. బాపు, రమణలు ఆవిడకి సోదర సమానులు..
'ఏదో..ఏదో..' నాక్కూడా చాలా ఇష్టమైన పాట.. రామకృష్ణ పాడిన వాటిల్లో ది బెస్ట్ అనొచ్చు.. 'ఎంతటి రసికుడవో..' పాట చిత్రీకరణ ప్రత్యేకంగా ఉంటుంది.. వ్యాంప్ సాంగ్ ని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా..
హమ్మో..ఇదే ఒక టపా అయిపోయేలా ఉంది..
@భావన: ఆ సీతారాముల బొమ్మలు బాపు స్కెచ్ కి అనుగుణంగా తయారు చేయించారని అనిపిస్తుందండీ నాకు..

శేఖర్ పెద్దగోపు said...

"ఏదో ఏదో అన్నది.." సాంగ్ ట్యూన్ పరంగా గానీ, ఫోటోగ్రఫీ పరంగా గానీ, సాహిత్యం పరంగా గానీ, సంగీత అభినయం పరంగా గానీ...ఇలా వేటికవే సూపర్బ్. నిజమే ఈ సినిమా అవార్డ్ లతో పాటు చాలా మంది హృదయాలను గెలుచుకుంది.
మంచి సినిమాను గుర్తుచేశారు. బాగా రాసారు కూడా.

తృష్ణ said...

@ చిన్ని : ఆ తేగల సీన్ నాకు భలే ఇష్టం అండీ..

@ పద్మార్పిత: మనిద్దరికీ రోజూ సేం పించే...:)

తృష్ణ said...

@ మురళి:
1)అది రాయటం మర్చిపోయాను..
2)తొందరలో అచ్చు తప్పు...సరిచేస్తానండీ..
3)సూర్యాకాంతం గారు ఇంతకు మునుపు కూడా కొన్ని నెగటివ్ షేడ్స్ లేని పాత్రలు వేసారు...అందుకని అది ప్రత్యేకమైన పోయింత్ అనిపించలేదు..
4)ఆ విషయం మొన్న శేషేంద్ర సర్మ కవిత టపా వ్యాఖ్యల్లో దొర్లింది..వివాదాస్పదమనిపించి... ఇక రాయలేదు...

5)హలం చీరల్ని బాగుంటాయని రాసానంతే....ఇక చిత్రీకరణను గురించి ప్రత్యేకం రాయలేదు మరి...

ఇంతకీ ఎన్ని మార్కులు వేసారో చెప్పలేదు మాష్టారు..?? ఏదొ బాగుందని ఒక్క ముక్కలో తేల్చి చెప్పకుండా మంచి పోయింట్లు రాసినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

శేఖర్ గారూ, ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

ఈ సినిమాలో ఎంవీయెల్ గారు కూడా కనిపిస్తారొక క్షణం! సంగీత పెళ్ళిలో!

మధ్య తరగతి సౌందర్యాన్ని బాపు , జంధ్యాల, విశ్వనాథ్ తీసినట్లు ఎవరూ తీయలేరు. సంగీత ఆహార్యం చూడండి, , మరీ ఇలియానలాగా రేపో ఎల్లుండో చచ్చేలా ఉండదు. మరీ లావుగానూ ఉండదు. మధ్యస్తంగా మధ్యతరగతి తెలుగింటి ఆడపిల్లలా అందంగా ఉంటుంది.

టైటిల్స్ పడేటపుడే ఇదొక సంగీత రస కావ్యమని అర్థమయ్యేలా ఉంటుంది.బాల మురళి సినిమా పాటల్లో ఇది నాకు బోల్డు ఫేవరెట్! జమీందారు కొడుకైనా ఆ భేషజాలేవీ అంటని భావుకుడిగా శ్రీధర్ తప్ప ఇంకెవరూ సరిపోరనిపిస్తుంది.అతని భావుకంతంతా "ఏదో ఏదో అన్నది"పాటలోనే మనకు అర్థమయ్యేలా ఉంటుందా పాట!

అలాగే వాంప్ చేత శాస్త్రీయ నాట్యం చేయించడం(ఎంతటి రసికుడవో) బాపుకే చెల్లింది.

నా ఆల్ టైమ్ ఫేవరెట్ పాట "నిదురించే తోటలోకి"! శేషేంద్ర శర్మ గారు రాసిన ఆ పాటకు అక్షర లక్షలివ్వొచ్చు.ఆ పాటలో సుశీల గొంతులో దుఃఖం ఉండదు. నిర్వేదం ఉంటుంది. దాన్ని ఆమె ఎంత బాగా పలికించారో వర్ణించలేం, పాట వినాల్సిందే!

ఇక రమణ గారి మాటలా....అవి మాటలు కావు తూటాలు! రావు గోపాల రావుకు రాసిన మాటలు ఈ నాటికీ ప్రతి తెలుగు నాలుక మీదా తారట్లాడుతుండే అచ్చ తెలుగు తేనె వూటలు!

ఇందులో నాకు నచ్చిన డైలాగుల్లో ఒకటి "కన్నె పిల్ల మనసు అద్దంలా ఉంటుందట...."అనేది!

చిన్నప్పుడు ఈ సినిమా చూశాక ఆంజనేయస్వామి నా ఫేవరెట్ గాడ్ ఐపోయాడు. అప్పటినుంచీ(ఇప్పుడు కూడా)ఒంటరిగా నడుస్తుంటే ఆంజనేయస్వామి వెంటే వస్తాడని గొప్ప నమ్మకం! ఇలాంటి నమ్మకాలు చిన్నప్పుడు,పెద్దయ్యాకా కూడా భలే ఆనందాన్నిస్తాయి కదూ తృష్ణా?

ఈ కథ ఉత్తర రామాయణ కథే అని తర్వాత అమ్మ చెప్తే తెలిసింది. ఇద్దరూ అపార్థాలతో చెరో చోటా ఉండటం, కవల పిల్లలు పుట్టడం,అమ్మనీ నాన్ననీ వాళ్ళే కలపడం...అదీ హనుమంతుడి సాయంతో!

నా డివీడీ కలెక్షన్లో నాకిష్టమైన సినిమాల్లో ఇదొకటి!

జాన్‌హైడ్ కనుమూరి said...

NICE TO READ
IT LEAD ME TO MY TEENAGE

AND I TOO WROTE SOMETHING ON THIS MOVIE, I HAVE TO SEARCH FOR IT

తృష్ణ said...

@ సుజాత: ఎన్నాళ్లకెన్నాళ్ళకు మీ రాక....
చాలా బాగా చెప్పారు...మొన్నొక రోజు గుంటూరు శే.శర్మగారి కొన్ని కవితలని రాసాను చూసారా? అందులో కూడా ఈ పాట రాసాను..అర్ధం తెలియని రోజులనుంచి ఈ పాట నాకు ఇష్టం...

చెప్పాలంటే ఈ సినిమా గురించి బోలెడు కబుర్లు...

మీ వ్యాఖ్య బాగా నచ్చింది నాకు మీ టపాల్లాగే..:)

తృష్ణ said...

@ జాన్‌హైడ్ కనుమూరి : ఈ టపా మీకు మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు సంతోషం.

మురళి said...

'ముత్యాల ముగ్గు' కి మార్కులేసేంత ఎదగలేదండీ ఇంకా.. మీరు ఎప్పటిలాగే బాగా రాశారు..

Unknown said...

Taken me into heavens. Very nice. :)

జయ said...

హాయ్ తృష్ణా, కంగ్రాట్స్. పర్ఫెక్ట్ సమీక్ష. ఇంక మిగిలింది ఏమీ లేదు అందులో. నిదురించె తోటలోకి పాట చాలా ప్రత్యేకంగా ఎంతో బాగుంటుంది.

తృష్ణ said...

మురళి: నేను "ముత్యాలముగ్గు"కి మార్కులెయ్యమనలేదండీ :)
మీరు సినిమాల గురించి బాగా రాస్తారు కాబట్టి , నేను ఎలా రాసానో చెప్పలేదేమని అడిగానంతే... :)

సృజన: ధన్యవాదాలు.

జయ: రాయాలంటే చాలా ఉందండీ...రెండు,మూడు టపాలు రాయచ్చు...ధన్యవాదాలు.

Gopal said...

ఎమ్ వీ యల్ - పూర్తి పేరు గుర్తురావట్లేదు - రాకపోయినా ఫరవాలేదు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చారు (విజయవాడు) - ఆయన చెప్పిన పిట్టకథ - ఫిజిక్స్ ప్రాక్టికల్ లో విద్యార్ధిని ఎక్జామినర్ (పరీక్షకుడు) స్పైరో మీటర్ (? ఫిజిక్స్ మరిచిపోయి చాలారోజులయింది - అప్పట్లో ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ పాఠంలో ఉండేది - స్క్రూ గేజ్, వెర్నియర్ కాలిపర్స్ మరియు ఇది) తో బిల్డింగ్ ఎత్తు ఎలాకొలుస్తావ్ అని అడిగితే విద్యార్ధి బిల్డింగ్ పైకి ఎక్కి దానికి తాడు కట్టి క్రిందకు వదిలి ఆతాడు పొడుగు కొలుస్తానని చెప్తాడు. ఇది మాత్రం బాగా గుర్తుంది మిగిలిన పాయింట్లు గుర్తులేవు.

మీ వ్యాసం చాలా బాగుంది. ఆకవల పిల్లల్లో ఉన్న ఆడపిల్లే తరువాత శంకరాభరణం లో శంకర శాస్త్రి కూతురు క్రింద వేసింది (రాజ్యలక్ష్మి)- గుర్తు పట్టారా

తృష్ణ said...

vENu gopal gaarU,
ఎమ్.వి.ఎల్ గారి పూర్తి పేరు :మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహా రావు

వ్యాసం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఓహో, ఆ అమ్మాయి రాజ్యలక్ష్మా? మంచి విషయం చెప్పారు.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది తృష్ణ గారు. బాపుగారి సినిమా గురించి అందునా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే... మా ఇంట్లో డైలాగ్ క్యాసెట్ ఉండేది. సినిమా నేను చూడకముందే డైలాగ్ లు చాలా సార్లు విన్నాను. రాముల వారి విగ్రహాలు, రావు గారి డైలాగులూ.. అలో అలో అలో పలకరింపు, ఆంజనేయుడు, అల్లు గారు అన్నీ సూపర్.

ఈ సినిమాలో నచ్చిన వాటి గురించి అందరూ అన్నీ చెప్పేసారు కనుక నాకు నచ్చనిది ఒకటి చెప్తాను. క్యాసెట్ లో గంటన్నరకి కుదించిన డైలాగులు వినడం వలనేమో కానీ డీవిడీ వచ్చాక సినిమా చూస్తే అక్కడక్కడా సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపించింది. ప్రత్యేకించి హీరోయిన్ ఇల్లు వదిలాక కట్ చేసి నది ఒడ్డున కుటీరం దగ్గరకు వచ్చేస్తే సినిమా మరింత బాగుండు అనిపించింది.

మొత్తం మీద మళ్ళీ చూడాలి అనిపించేలా రాశారు సమీక్ష, వీలు చూసుకుని చూడాలి.

వేణూశ్రీకాంత్ said...

అన్నట్లు పాటల గురించి చెప్పడం మరిచానండోయ్... ఏ పాట బాగా ఇష్టమని చెప్దామా అని ఆలోచిస్తుంటే అన్ని పాటలు నేను ముందు నేను ముందు అంటూ పోటీ పడుతున్నాయ్.

"శ్రీరామ జయరామ" వింటుంటే భక్తి పారవశ్యం తో ఒళ్ళుపులకరిస్తే.. "ఎదో ఏదో అన్నది" పాట వింటుంటే మనసంతా మధురమైన భావన నిండి పోతుంది. "ముత్యమంత పసుపు", "నిదురించే తోటలోకి" పాటలు రెండు హాయైన అనుభూతినిస్తే.. "ఎంతటి రసికుడవో" అప్రమేయంగా ఓ అల్లరి నవ్వును పుట్టిస్తుంది. ఈ చివరి పాట క్యాసెట్ లో యధాలాపంగా విని ఓ మంచి పాట అనుకున్నాను, మొదటి సారి డివిడి లో చిత్రీకరణ చూసినపుడు అవాక్కయ్యాను.

తృష్ణ said...

vEnu gaaru,"బాపుగారి సినిమా గురించి అందునా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే... "
100%correct..

మీ రింకా ఈ టపా చూడలేదే అనుకుంటున్నాను... ఇంతలోమీ వ్యాఖ్య...ఈ సిన్మా కేసెట్ లేదు కాని, కొన్ని సినిమా కేసెట్లు మా ఇంట్లో కూడా ఉన్నాయండీ...అసలు ఎన్నిసార్లు వినేవాళ్ళమో అవి..మీరు రాసినట్లు అలా విని వినీ సినిమా చూసేప్పుడు కొంచెం బోర్ కొడుతుంది.

ఇక పాటలు వేటికవే సాటి...నాకు మాత్రమ్ నేను రాసిన ఆ రెండూ బాగా నచ్చుతాయి. ఒకో పాట గురిమ్చీ మీరిచ్చిన డిస్క్రిప్షన్ బాగుందండీ..thankyou.

చదువరి said...

ఒక మాస్టర్‌పీస్‌ను పరిచయం చేసారు. ఊరికే ప్రతీ సినిమానూ "గొప్ప" అంటూ పోవడంతో నిజమైన గొప్ప సినిమాను కూడా "గొప్ప సినిమా" అంటే, వాటికీ దీనికీ తేడా తెలీకుండా పోతుంది. అంచేత ముత్యాలముగ్గును గొప్ప సినిమా అని అనబుద్ధి కావడంలేదు.

సినిమాలో అన్నీ ప్రత్యేకమే, అందరూ ప్రత్యేకమే. కానీ, మరీ ప్రత్యేకమైనది కాంట్రాక్టరు పాత్ర. తెలుగు విలనుకు కొత్త హావభావాలను నేర్పించి, ఒక మేనరిజాన్ని నేర్పించి, రావుగోపాలరావంటే భయం కలిగేలా చేసారు బాపూరమణలు.

అలాగే జోగినాథమూను. అల్లు రామలింగయ్య అలాంటి పాత్రలు లక్షా తొంభై వేసాడు. కానీ ఆ కోతి అభినయం మాత్రం ఆయనకు ప్రత్యేకం. అలాగే ఆయనా ఆ పాత్రకు ప్రత్యేకమే. సినిమాలోని మిగతా పాత్రలన్నిటికీ వేరేవాళ్ళు దొరికేవారేమోగానీ, కాంట్రాక్టరు, జోగినాథాలకు మాత్రం ఇంకొకళ్ళను అనుకోలేం.

అన్నట్టు, ఎమ్వీయల్ ఈ సినిమాకు నిర్మాతనుకుంటా.

మళ్ళీ..
ఒక మాస్టర్‌పీస్‌ను పరిచయం చేసారు.

తృష్ణ said...

@ చదువరి: నిజమేనండి. కరక్ట్ గా చెప్పారు.
ఎమ్.వి.ఎల్ గారు సినిమా నిర్మాతే.
నేను కూడా ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అన్ననండీ.
Thankyou for the comment sir.

SRRao said...

తృష్ణ గారూ !
ఇన్ని మంచి మంచి వ్యాఖ్యల తరువాత నేను మళ్ళీ రాయడం చర్విత చర్వణమే అవుతుంది. అయినా కూడా నిదురించే సినిమా తోటలోకి పాటలాగ వచ్చ్హిన చిత్రాన్ని గుర్తుచేసిన మీకు కృతజ్ఞతలు చెప్పాలి కనుక రాస్తున్నాను.
ఒక విషయం. వేణుగోపాల్ గారు చెప్పినట్లు కవలపిల్లల్లో అమ్మాయి శంకరాభరణం రాజ్యలక్ష్మి కాదండి. ఆ అమ్మాయి పేరు రాధ. అబ్బాయి పేరు మురళీ.

తృష్ణ said...

@ SR Rao: oh, thankyou for the information sir..but she might be the child artist in saMkaraaabharanam...
i.e. small rajyalakshmi..?!

SRRao said...

తృష్ణ గారూ !
శంకరాభరణం లో చిన్న రాజ్యలక్ష్మి గా నటించింది వరలక్ష్మి. తరువాత చాలా చిత్రాల్లో చెల్లెలు వగైరా సహాయ పాత్రలు చేసి ఇప్పుడు బుల్లితెర మీద కొన్ని సీరియల్స్ లొ నటిస్తోంది.

తృష్ణ said...

Rao gaarU, thanks again for the correction.

విజయవర్ధన్ (Vijayavardhan) said...

తృష్ణ గారు, మీ టపా (వ్యాఖ్యలతో సహా) చాలా informativeగా వుంది.నా మిత్రులు నేను కలిసి బాపు గారి సినిమాలపైన ఒక documentary చేస్తున్నాము. మీ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని వుంది. మీ email id ఇవ్వగలరా? నా email id: bvijay@gmail.com . Thank you- Vijay