సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, October 24, 2009

సహనం

పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే ఎంత ఆనందిస్తామో..వాళ్ళు కొంచెం నలత పడితే అంత ఆందోళన చెందుతాము. మళ్ళీ తగ్గేదాకా ఆదుర్దా తప్పదు తల్లిదండ్రులకి...పాపకు రెండు, మూడు రోజుల నుంచీ బాలేదు. మోకాలు మీద చిన్న దెబ్బ తగిలి, అది పుండై, సెప్టిక్ అయ్యి నానా హంగామా...నడవలేదు, నెప్పి, ఏడుపు, గోల...నాల్రోజులుగా స్కూలుకు పంపలేదు కాబట్టి ఇంట్లో తినటానికి నేను ఎంచక్కా రెడిగా దొరికే "ఫాస్ట్ ఫుడ్" ని కూడా దానికి.

ఈపుటే కాస్త సర్దుకుంటోంది అని ధైర్యం వచ్చింది. పాప కోసం హాస్పటల్ కు వెళ్ళిన రెండు మూడుసార్లూ కొత్తగా చేరిన ఆ నర్సుని గమనించాను. "ఆమె"ను గురించే ఈ టపా..

జ్వరాల సీజన్ కాబట్టి హాస్పటల్ నిండా బోలెడు పిల్ల పేషంట్స్... కూర్చోవటానికి కూడా ఖాళీ లేదు..దాన్ని ఎత్తుకుని అరగంట నించునే సరికే నా నడుం లాగటం మొదలెట్టింది. ఆ నర్సుది డాక్టర్గారి గుమ్మం దగ్గర నిలబడి పేషంట్లను లోపలికి పంపే డ్యూటీ. పాతిక ముఫ్ఫై మధ్య వయసు.సన్నగా, పొడుగ్గా, కాటుక కళ్ళతో, చిరునవ్వుతో నన్ను ఇట్టే ఆకట్టుకుంది. ఆమె కూర్చునే కుర్చిలో కూడా పేషంట్లు ఉన్నారు. చిన్న చిన్న పాపలు, బాబులు...మొహాలు వేళ్ళాడేసినవాళ్ళు, జ్వరంతో మూలుగుతున్న వాళ్ళు, నిద్రోతున్న పసిపాపలూ...వాళ్ళ తాలూకూ ఆందోళిత తల్లులు,తండ్రులు.

నెంబరు తీసుకుని వెళ్ళేవారి మధ్యలో రిపోర్ట్ లు చూపించటానికి వచ్చే మరి కొందరు, అర్జంట్ గా వచ్చిన కేసులు...ఇలా రకరకాల వాళ్ళకు అందరికీ ఎంతో ఓపిగ్గా, చిరునవ్వుతో సమాధానాలు చెప్తోంది. "పంపిస్తానండీ..అదిగో వాళ్ళ తరువాత మీరు...వీళ్ళ తరువాత మీరు.." అంటోంది. ఆమె సహనానికి మనసులోనే జోహార్లర్పించాను.రెమ్డు రోజుల క్రితమ్ ఎలా ఉందొ, ఇప్పుడు అదే నవ్వు మొహం. చిన్నప్పటినుంచీ నేను చూసిన చాలా మంది నర్సులు చిరాకుగా, వచ్చిన పేషంట్స్ కి డిక్టేటర్స్ లాగ కసురుకోవటం, ఒక్క చిన్న చిరునవ్వు కూడా లేక చిందులేస్తూ ఉండటమే చూసాను. వాళ్ళ చిరాకులూ పరాకులూ వాళ్ళవి.నిజమే. కానీ వచ్చిన పేషంట్స్ ఎంత కంగారుగా ఉంటారు..అని వీళ్ళు ఆలోచించరా అనుకునేదాన్ని.

అలాంటిది మొదటిసారి అర్భకంగా ఉండీ, గంటలు గంటలు నిల్చుంటూ కూడా, ఓపిగ్గా సమాధానాలు చెప్తూ, అందరినీ గొడవ పడకుండా హేండిల్ చేస్తున్న ఆమె సహనానికి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాను. Great job..!! అనుకున్నాను. కానీ అర్జెంట్ గా వచ్చిన ఒక కేసుని చూసి మాత్రం చెలించిపోయాను..చిన్న పాప..ఒక సంవత్సరం ఉంటుందేమో...జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చాయిట. తల్లి సంగతి సరే, పాపని ఎత్తుకున్న తండ్రి కూడా ఏడుస్తున్నాడు..ఎవరయితేనేం పాపం అన్పించింది....నాకు చిన్నాప్పుడు పాప ICU లో ఉండటం అవీ గుర్తు వచ్చేసాయి..పుట్టిన పదిహేను రోజులదాకా దాని మొహమే చూడలేదు నేను...అసలు ఒళ్ళోకి పాప వస్తుందా అని ఏడుస్తు గడిపిన క్షణాలు...అబ్బ...ఆ నరకాన్ని తలుచుకోవటమే మనేసాను. ఈలోపూ ఆఫీసు నుంచి మావారు
డైరెక్ట్ గా హాస్పటల్ కు వచ్చేసారు. ఆయన్ను చూడగానే జారుతున్న గుండె కొంచెం ధైర్యం తెచ్చుకుంది.

మా నంబరు రావటంతో లోపలికి వెళ్ళాం. "తగ్గిపోతుంది పర్వాలేదు" అని డాక్టర్ ధైర్యం చెప్పాకా స్తిమితపడ్ద మనసుల్తో ఇల్లు చేరాం. ఇవాళ పొద్దున్నకి కాస్త ఎరుపు తగ్గి పుండు మానే స్టేజ్లో కనిపించింది. ఆ నర్సు "సహనాన్ని" గురించి చెప్పాలని నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి నిన్నంతా మూసేసిన బ్లాగ్ తెరిచి ఈ టపా...!!

22 comments:

శేఖర్ పెద్దగోపు said...

తృష్ణ గారు,
మొన్న కమెంట్ లో నేను ఒక కుళ్ళు జోక్ జోకాను కదా..అప్పుడు మీరు నవ్వలేదేంటబ్బా అని అనుకున్నాను..ఇదన్నమాట సంగతి..

ముందుగా ఆమెలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించిన మీరు అభినందనీయులు.
మనసులో ఆవిడ గురించి అంత గొప్పుగా అనుకున్న మీరు ఇంటికి వచ్చేసేటప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళీ మీరనుకున్నది అనుకున్నట్టు చెప్పుంటే ఆవిడ మీరిచ్చిన కాంప్లిమెంట్ కి చాలా ఆనందపడేది కదా!! అఫ్ కోర్స్...ఆ నర్స్ బిజీగా ఉండొచ్చు..మీరు మీ పాప హడావిడిలో ఉండి ఉండొచ్చు...ఎనీవే అలా చేసుంటే మీ సంతృప్తి రెట్టింపు అయ్యేదని నాకు అనిపించింది...

చిలమకూరు విజయమోహన్ said...

అలాంటి మంచి మనుషుల ఆత్మీయ పలకరింపే సగం జబ్బును నయంచేస్తుంది.

జయ said...

ప్రతీ నర్స్ ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్. వాళ్ళ ఆదర్శం అదే. మా ఇంటి దగ్గిర ఒక హాస్టల్ నర్స్ స్టూడెంట్స్ కోసం ఉంది. చాలా మంది మళయాళీలే. చాలా చిన్నవాళ్ళు. ఒకటే ఏజ్ వాళ్ళు. కలిసి పోతూ ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ఎంతో ప్రశాంతత కనిపిస్తుంది నాకెప్పుడు. కనిపించినప్పుడల్లా చిరునవ్వులొలకబోస్తారు. ఎంత బాగనిపిస్తుందో.
ఇప్పుడు మీ పాప కెలా ఉందండీ. జయా ఆంటీ అడిగింది అని చెప్పండేం.(ఏమడిగిందీ, అనకండి మళ్ళీ)...

తృష్ణ said...

శేఖర్ గారు, నిజమేనండి. నాకు ఇంటికి వచ్చాకా మీరు అన్నట్లే అనిపించిందండి...కాని మళ్లి మీరన్నట్లే నర్సూ బిజీగా ఉంది, నేనూ పాపకి అన్నానికి లేట్ అయిపోతోందన్న హడావిడిలో వచ్చేసాను.

విజయమోహన్ గారు, అవునండీ..అలా నవ్వుతు పలకరిస్తె సగం జబ్బు అప్పుడే తగ్గినట్లనిపిస్తుంది.

తృష్ణ said...

జయగారు, తప్పకుండా చెప్తానండీ..దానికి నా బ్లాగ్ గురించి బానే తెలుసు.

మా ఇంటి పక్కన కూడా మొన్నటిదాకా ఒక నర్స్ స్టూడెంట్స్ హాస్టల్ ఉండేది.
క్రితం నెల్లోనే దాన్ని పడగొట్టేసి ఒక పెద్ద బిల్డింగ్ మొదలెట్టారు.. ఆ పిల్లలు కూడా మేడ మీంచి మా పాపని పలకరించటం, దానితో కబుర్లు చెప్పటం చేసేవారు.. ఇళ్ళకి ఫొన్లు మాట్లాడుతూ,ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటు ఆ పిల్లలు కనిపిస్తునే ఉండేవారు..ఇప్పుడు ఆ నవ్వులూ,సందడి అక్కడేమి లేదు..కొత్తగా మొలుస్తున్న గోడలు తప్ప..


ఇవాళ కాస్త నడవగలుగుతోంది పాప.థాంక్స్ అండీ.

budugu said...

పసిపిల్లలకి జబ్బు చేయడమంత నరకం ఇంకోటి ఉండదు. ఇంట్లో అందరి ప్రాణం పోయినట్టుంటుంది. పాపకు బాగవుతోందని తెలిసి హాయిగ అనిపించింది.

తృష్ణ said...

@buDugu ; thanks amdi.

మురళి said...

ఉచిత సలహా అనుకోకపోతే చిన్న విషయం అండీ.. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది కదా.. దెబ్బని చూడగానే డెట్టాల్ తోనో, టించర్ తోనో క్లీన్ చేసి, బొరిక్ పౌడర్ వేస్తే గాయం పెద్దది అవ్వదు.. మీరు రాసిన దానిని బట్టి గాయాన్ని మీరు ఆలస్యంగా చూశారనుకున్నాను.. ఇక నర్సుల విషయం.. సహనవంతులు, అసహనవంతులూ సమ సంఖ్యలో ఉన్నారనిపిస్తుంది నాకు..

Unknown said...

కొన్ని మనసులో భావాలూ చెప్పుకుంటే దాని లోని ఘాడత తగ్గి పోతుంది .అవి ఫీల్ అయ్యి మనసులోనే కృతః జ్నతలు చెప్పుకోవాలి అంతే గాని నీలో వున్న సహనం చూసి నా హృదయం ద్రవించిందనో లేదా మీ పేషన్స్ కి జోహారనో అన్నా మీ మనసులో ఫీల్ అయిన భావం రాదు .రోజు తిని బోర్ కొట్టే'' మీ '' ఫాస్ట్ ఫుడ్ కన్నా వాళ్ళ స్కూల్ లో స్నేహితుల ఫాస్ట్ ఫుడ్ కోసమన్నా మీ అమ్మాయి monday స్కూల్ కి వెళ్తుంది చూడండి .

పరిమళం said...

తృష్ణ గారు , నిజంగా నర్సులు దేవదూతల్లా కనిపిస్తారండీ ...చాలామంది సహనంగానే ఉంటారు ముఖ్యంగా ట్రైనడ్ నర్సులు .కొందరుమాత్రం రోగం రెట్టింపయ్యేలా బిహేవ్ చేస్తారు.ఏదేమైనావారి సహనానికి జోహార్లు .

SRRao said...

తృష్ణ గారూ !
మీ వ్యక్తిత్వ పరిశీ్లన బాగుంది. మీలా ఎదుటివారి ప్రవర్తనను పరిశీలించి విశ్లేషించగలిగితే వారి పట్ల మన ప్రవర్తనను అనుగుణంగా మార్చుకోవచ్చు. ఫలితంగా ఎన్నో ఉపద్రవాలు తప్పి పోయే అవకాశం ఉంది. పాప ఆందోళనలో మునిగి కూడా మీరు అంత బాగా పరిశీలించడం నిజంగా అభినందనీయం. నిజానికి అలాంటి సమయంలోనే సంయమనం కావాలి. మీ పాపకు త్వరగా నయం కావాలని కోరుకుంటూ....

తృష్ణ said...

@ మురళి : ఆలస్యంగా చూడలేదు కానీ చాలా చాలా చిన్నగా ఉండటం వల్ల అసలు పస్ ఫార్మ్ అయ్యిందన్న అనుమానం రాలేదండీ. అది నెప్పి అని బాధపడేదాకా ఆ గాయం అంత పెద్దదని మేమిద్దరమూ తెలుసుకోలేకపోయాము. బాధ పడే టైమ్. అంతే. ఇప్పుడు తగ్గింది. పర్వాలేదండి.

మంచి సలహాలు ఉచితంగా ఇచ్చినా ఎప్పుడూ విలువైనవేనండీ..


@ రవిగారు: మీరు చెప్పినది కొంతవరకే నిజమండీ...ఎందుకంటే కొన్ని భావాలు, అభిప్రాయాలు బయటకు చెప్తే, కొత్తవారికైతే "ఆనందం" కలుగుతుంది. మనం తెలిసినవాళ్ళకైతే "అర్ధం" అవుతుంది. (అలా చెప్పకపోవటం వల్ల అప్పుడప్పుడు ఎదుటివాళ్ళు మనల్ని అపార్ధం చేసుకునే అవకాశాలు కూడా ఉంటూంటాయండి.. :) )

తృష్ణ said...

@పరిమళం: ట్రైన్డ్ నర్సులు..ముఖ్యంగా కేరళా నర్సులు ఎంతో సహనంగా ఉంటూంటారు నేను గమనించినంతవరకూ..మీరు రాసినట్లు కొందరిని చూస్తే భయం కూడా వేస్తుంది..

తృష్ణ said...

@ ఎస్.ఆర్.రావు: ఏం పరిశీలనా విశ్లేషణో...విశ్లేషణ ఎక్కువైపోయి ప్రమాదాలు కొనితెచ్చుకున్న సందర్భాలే ఎక్కువండీ నాకు..:) :)
Thankyou for the concern sir.

మరువం ఉష said...

స్వానుభవం రీత్యా మీరు వ్రాసింది సబబే. ఆ వృత్తే అటువంటిది. వన్నె తెచ్చేవారు, మచ్చ కలిపేవారు వుంటారు. సహనం అన్నది చాలా సహనంగా అలవరుచుకోవాల్సిన గుణం. ఉదాహరణకి నేనెంతో ప్రేమించే నా పిల్లల్నే ఒక్కోసారి విసుక్కుంటాను. అందుకే వృత్తిపరంగా అసహనం కనపరిచే వారిని ఆ రోజుకి వారేమి వత్తిడిలో వున్నారో, మనసేమన్నా విసిగిందేమో అనుకుంటాను. కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం ప్రశ్నిస్తాను.

తృష్ణ said...

@usha :మీరు రాసింది కరక్టే...కాని నేను చూసిన కొందరు మాత్రమ్ ఎప్పుడు మొహం చిట్లించుకుని ఉండగానే చూసానండి నేను...some people are like that అంతే..!

భావన said...

నిజమే అలాంటి నర్సులను చూస్తేనే సగం బాధ తగ్గుతుంది. ఇక్కడ కూడా చాలా వరకు నర్స్ లు మంచి గా నవ్వుతూ విసుక్కోకుండా చెపుతారు.. అటు వంటి ప్రొఫెషన్ ను తీసుకోవాలంటేనే ఎంతో ఆ వృత్తి పట్ల అంకిత భావం వుండాలి కదా..

వేణూశ్రీకాంత్ said...

నర్సింగ్ వృత్తి చాలా అంకితభావంతో చేయవలసినది, తనని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.. నే చూసిన వారిలో అలా విసుక్కోకుండా విధి నిర్వహించేవారు తారసపడినది చాలా అరుదు. అయితే కేకలు వేసేవార్ని చూశాను, లేదంటే పేషంట్స్ ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారినే చూశాను.

మరువం ఉష said...

తృష్ణ, ఎప్పుడూ అలా వుండేవారు దురదృష్టవంతులు. మనలా మనలేని అభాగ్యులు. ;) వదిలేయ్ వాళ్ళ కర్మానికి.

"పాపకి ఎలా వుంది" అనడిగేకన్నా "పాపకి దెబ్బ తగ్గిపోయింది కదా? అందుకే మీరు మమ్మల్ని"ఫాస్ట్ ఫుడ్" చేసుకోండిక" అని అడగటానికి వచ్చాను.

ఓ సారి పెద్ద గోడ మీంచి దూకి [అన్న తో వెసిన పందెం] నేను అలాగే దెబ్బ కొట్టుకున్నాను. అది నాన్నగారు చూడకూడదని ఫ్రాక్ కప్పుకుని వొంగి వొంగి నడుస్తూ మరిన్ని సార్లు అదే దెబ్బ మీద దెబ్బ, ఇప్పటికీ పెద్ద మచ్చగా వుండిపోయిందది.

తృష్ణ said...

వేణూ గారూ, మీరు చెప్పినది కరక్టేనండీ...

ఉషగారూ,పాపకి చాలావరకు తగ్గిందండీ. చాలా థాంక్స్.
అరె, నేనూ గోడలెక్కి, దూకి ఎన్ని దెబ్బలు తిన్నానో...ఓసారి ఓ పన్ను కూడా ఊడింది..:)

Hima bindu said...

శేఖర్ చెప్పినట్లు పనయ్యి వెళ్ళేప్పుడు చిన్న చిరునవ్వుతో చిన్న కాంప్లిమెంట్ ఇస్తే అది తన వృత్తిమరింత మెరుగుపరచుకునే టానిక్లాంటిది అయ్యేది .నా మనస్సుకి నచ్చితే నేనైతే చెప్పడానికి వెరవను .చెప్పకపోతే నాలుగురోజులు మనస్సు లాగుతది .బాగుంది పరిశీలన .

తృష్ణ said...

@ చిన్ని: నిజమేనండీ..నేనూ సాధారణంగా చెప్తూంటాను...మా పనమ్మాయి కి కూడా ఏదైనా బాగా చేస్తే బాగుంది అని చెప్తాను..కాని శేఖర్గారికి చెప్పిన సమాధానమే మీకూనూ..ఆ సమయంలొ పాప అన్నం లేటవుతోందన్న ధ్యాసే ఉంది..