సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, October 19, 2009

యాస్మిన్

బంధుత్వం, సన్నిహితమైన స్నేహం లేకపోయినా కొందరు వ్యక్తులు మన జీవితాల్లో ఎంతో విలువను ఆపాదించుకుని స్మృతుల లోతుల్లో, జ్ఞాపకాల దొంతరలో ప్రియమైన వ్యక్తులుగా మనకు గుర్తుండిపోతారు. నా జీవితంలో అటువంటి కొందరు వ్యక్తుల్లో ఒకరు "యాస్మిన్".

పెద్ద పెద్ద చెట్లతో, అడవిలా అనిపించేది ఆ ప్రదేశం. దాన్ని బాగు చేసి ప్రభుత్వం క్వార్టర్స్ నిర్మించింది. బాబోయ్ అడవిలాగుంది..అనేవాళ్ళందరూ....కాని నాకు చాలా నచ్చేవి... ఆ పెద్ద పెద్ద చెట్లు, పొద్దున్నే పలకరించే రకరకాల పక్షులు, మేము పెంచిన తోట...అన్నీను. ఇంటర్, డిగ్రి, పిజీ.... చదివే రోజుల్లో మేము క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. మేము రెండో అంతస్తులో ఉంటే, రోడ్డుకు మరో పక్క ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో "యాస్మిన్" వాళ్ళు ఉండేవారు. వాళ్ల ఇంటి చుట్టూ ఒక కంచె కట్టుకుని బోలెడు మొక్కలు అవీ పెంచేవారు. అవి చూసి సరదాపడి; నేనూ, మా మొదటి ఫ్లోర్లో ఉన్న నా ప్రాణ స్నేహితురాలూ ఇద్దరం క్రింది వాటావాళ్ళ అనుమతి తీసుకుని చెరొక "గార్డెన్" పెంచటం మొదలుపెట్టాము. మా మా పేర్లతో ఆ గార్డెన్లకి బోర్డులు కూడా తగిలించాము. ఆ తోట పెంపకానికి, మరిన్ని మొక్కల కోసం, మేము "యాస్మిన్" ను పరిచయం చేసుకున్నాము. వాళ్ళ దొడ్లోంచి కొన్ని మొక్కలు సంపాదించాము. గులాబీ, చామంతీ, బంతి, కనకాంబరం మొదలైన పూల చేట్లతో పాటూ బెండ, కాకర, గోంగూర, వంగ, పాలకూర, కొత్తిమీర, చుక్క కూర...మొదలైనవన్నీ కూడా పెంచేవాళ్ళం. నేను సంక్రాంతికి ముగ్గులు పెడుటూంటే వచ్చి చూసి వెళ్తూండేది తను.


ఒకరిళ్ళకు ఒకరం ఎప్పుడూ వెళ్ళలేదు. కేవలం రోడ్డు స్నేహమే...! అప్పుడప్పుడు కనబడినప్పుడల్లా నేను యాస్మిన్ తో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒక అర కిలోమీటరు రోడ్దు అయ్యాకా మైన్ గేట్ ఉండేది. మా ఇద్దరి ఇళ్ళ మధ్యన ఉన్న రోడ్దు మీదే మేము కబుర్లు చెప్పుకునేవాళ్ళం. యాస్మిన్ నా కన్నా రెండు,మూడేళ్ళు పెద్దది. బంధువులం కాదు, సమ వయసు కాదు, ఒకే చదువు కాదు, ప్రాణ స్నేహితులం కూడా కాదు...అయినా రోడ్దు మీద కనబడితే మాత్రం ఏమిటో అలా గంటల తరబడి...నిజమే..గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నన్ను చాలా మంది చాలా పేర్లతో పిలిచేవారు...కాని తను మాత్రం ఆప్యాయంగా, అభిమానంగా ఎవ్వరూ పిలవని ఒక పేరుతో నన్ను పిలిచేది. నేనెప్పుడూ అలా పిలవమని అడగలేదు...!

రోడ్దు మీద అటుగా వెళ్ళేవాళ్ళు మమ్మల్ని పలకరించి, దాటి వెళ్పోయి...పని అయ్యాకా తిరిగి వచ్చేప్పుడు ఇంకా అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న మమ్మల్ని చూసి నవ్వేవారు...వాళ్ళ గుమ్మం లో నిలబడ్డ వాళ్ళ అమ్మగారు ఎప్పుడు వస్తుందా అన్నట్లూ చూస్తూ ఉండేవారు....ఇక పైనుంచి మా అమ్మ కూడా పిలుస్తూ ఉండేది...ఆ(... వస్తున్నా.. అనేవాళ్ళం కానీ మా కబుర్లు తెమిలేవి కావు....ఇక రెండు మూడు సార్లు పిలిచాకా ఇయిష్టంగానే ఇళ్ళకు వెళ్ళేవాళ్ళం.అంత సేపు ఏం మాట్లాడుకుంటారే? అనేది అమ్మ. ఏవో..అలా ఒక దాన్లోంచి ఒకదాన్లోకి...చదువులు,సినిమాలు,కాలేజీ కబుర్లు...అలా ఏవో..పిచ్చాపాటి...! ఏమిటో ఆ బంధం మరి..కొందరి వ్యక్తులు అలా ఆత్మీయులైపోతారు.ఆ అనుబంధం, స్నేహం ఏర్పడ్ద వ్యక్తులకి తప్ప మిగిలిన వాళ్ళకు అది అర్ధం కాదు...! కొన్ని బంధాలంతే.

నేను డిగ్రీ ఫైనల్లో ఉండగా ట్రాన్స్ఫర్ మీద వాళ్ళు వేరే ఊరు వెళ్పోయారు.ఆ తరువాత ఎప్పుడూ కలవలేదు. ఇప్పుడెక్కడున్నారో కూడా తెలీదు...జ్ఞాపకాల దొంతరలో మాత్రం ప్రియమైన వ్యక్తిగా గుర్తుండిపోయింది...!!

17 comments:

sreenika said...

ఇద్దరు వ్యక్తులు కలిసినపుడు మన(మస్తిష్కం)లో జరిగే అసంకల్పిత రసాయనిక చర్య స్నేహం అనుకుంటాను.
రెండు వ్యక్తిత్వాలు రెండు రసాయనాల్లా చర్య జరిగి ఒకదాని నుండి మరొకటి ప్రేరేపింప బడతాయి.బహుసా మీ యాస్మిన్ కూడా ఎక్కడో కిటికీలు తెరచి మీకోసం ఎదురు చూస్తూంటుందేమో. ప్రతి పువ్వులో మీ రూపాన్ని చూసుకుంటూ..

SRRao said...

రైలు ప్రయాణం లాంటి జీవితంలో ఎంతోమంది ప్రవేశిస్తూ ఉంటారు. విడి పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కొద్దిసేపట్లో ఆత్మీయులైపోయి తమ గమ్యం రాగానే దిగి పోతారు. సాగిపోతున్న జీవితంలో మళ్ళీ కలిసే అవకాశం లేకపోయినా మనసు మర్చిపోదు. మంచి జ్ఞాపకంగా మిగిలి పోతారన్న సత్యాన్ని జ్ఞాపకాల వేదిక మీద అందంగా ఆవిష్కరించారు.

జయ said...

ఇవే మరపురాని, తీయని జ్ఞాపకాలు. తలుచుకుంటూ ఉన్నా కలుసుకొన్న ఆనందమే కలుగుతుంది. నా 10త్ క్లాస్ ఫ్రెండ్ ఒకమ్మాయి ఉంది. ఎప్పుడూ గుర్తుకొస్తు ఉంటుంది. ముందు ముందు జీవితంలో ఎప్పుడన్నా కలిసినా గుర్తుపట్టలేనేమొ! ఇప్పుడెక్కడుందో కూడా తెలియదు. కాని నా జ్ఞాపకాల్లో మాత్రం కలకాలం నాకు దగ్గరగానే ఉంటుంది. మీ యాస్మిన్ మీకు మళ్ళీ కనిపించాలని కోరుకుంటున్నాను.

గీతాచార్య said...

:-)

భావన said...

హ్మ్మ్.. బాగుంది తృష్ణా.. అవును నాకు చాలా ఇష్టమైన కిరణ్ ప్రభ గారి కవిత ఒకటి గుర్తు వస్తోంది "కొన్ని పరిచయాలు విరజాజిరేకులంత స్వల్పమే ఐనా దాని సుగంధం ఎదను సదా కదిలిస్తుంది" అని. అలా వుంది సుమబాల తో మీ స్నేహం.. ఎక్కడో ఇంకో తెరిచిన గవాక్షపు నీడల లో కదిలే విరి సుగంధమై మీ స్నేహం ఆమెనూ పలకరిస్తుంది లెండి..

పరిమళం said...

తృష్ణ గారు ,ఆ అనుబంధం ,స్నేహం ....నాకు సుపరిచితం !నేనూ నా స్నేహితుల జాడకోసం ఎదురుచూస్తున్నాను .

తృష్ణ said...

@ శ్రీనిక: నాకీ రసాయనాలూ అవీ బొత్తిగా బోధపడవండీ...నేను ఆర్ట్స్ స్టూడెంట్ ని... (సరదాకి రాసాను ఏమీ అనుకోకండి..)

మీరు నిన్న కబుర్లాడటంలేదని అడిగారనే రాసాను..


@ఎస్.ఆర్.రావు: ధన్యవాదాలు.

తృష్ణ said...

@ జయ : యాస్మిన్ కనబడే అవకాశాలు చాలా తక్కువేనండీ...

తృష్ణ said...

@గీతాచార్య: :)

@భావన : కిరణ్ ప్రభగారి కవిత బాగుంది. ధన్యవాదాలు.

తృష్ణ said...

@ పరిమళం: ఫ్రెండ్ షిప్ డే నాడు మీ బ్లాగ్ లో రాసారు ఆ కబుర్లు..గుర్తుంది..ఎప్పటికైనా కలిస్తే బావుంటుంది మరి...

మురళి said...

కొన్ని స్నేహాలు చాలా చిత్రంగా మొదలై అంతే చిత్రంగా ముగుస్తాయి.. బాగుందండీ టపా...

తృష్ణ said...

@murali: ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

అదేంటీ, ఇంకా ఆర్కుట్లోనో ఫేస్బుక్లోనో కనబళ్ళేదా? :)

కొత్త పాళీ said...

@ sreenika .. మీరు కెమిస్ట్రీ మేష్టారా?

తృష్ణ said...

@kottapaaali: :)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

చదువుతుంటే నాకు పెంచలకుమార్ అనే పేరు గుర్తొచ్చింది. వాడు-నేను మాజామచెట్టూకొమ్మమీద కూర్చుని గంటల తరబడి మాట్లాడుకునే వాళ్లం. ఈట్రాన్స్ఫర్‌ అన్నేది ఉంది చూడండి పెద్దళ్లకి ఏమోగానీ పిల్లలకి మాత్రం ....

తృష్ణ said...

చైతన్య: " మా పెరటి జామ్ చెట్టు...." పాట గుర్తొచ్చింది....:)