సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, October 8, 2009

గుండె ధైర్యం..

కొన్ని పరిస్థితులను, కొన్ని విషయాలను వినటానికే కాదు; కొన్ని సందర్భాల్లో "స్పందించటానికి" కూడా కొంత గుండెధైర్యం అవసరం.అది ఒక్క రోజులో రాదు...కాలాన్ని,పరిస్థితులను బట్టి మనిషిలో స్థిరత్వాన్ని ఏర్పర్చుకుంటుంది.ఇప్పుడది నాలో కొంతైనా ఉంది....దానికి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు....

డిగ్రీ చదివే రోజుల్లో ఒక శెలవుదినాన నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను.తను బయటకు వెళ్తోంది.
."ఎక్కడికి?" అని అడగకూడదు కాబట్టి అడగలేదు."నాతో వస్తావా?" అంది.అలాగేనని తలఊపాను.
"మీ ఇంట్లో పాత బట్టలు ఏమైనా ఉన్నాయా?" అంది. "ఊ " అన్నా."పద మీ ఇంటికి" అంది.మళ్ళీ వెనక్కి మా ఇంటికి వెళ్ళాం. నా డ్రెస్సులు,అమ్మ చీరలు కొన్ని తీసుకుని బయల్దేరాం. "అక్కడ నువ్వేమీ ఫీలయిపోకూడదు.." ముందుగానే చెప్పింది. అర్ధం కాలేదు.

"నువ్వు గోరింటాకు బాగా పెడతావు కదా,అక్కడ అవసరం ఉంటుంది" అని 2,3 మెహందీ కోన్స్ కొంది దారిలో.
రిక్షా దిగి చూసాను.."నిర్మల్ హృదయ్ భవన్"(the house for mentally handicapped and physically handicapped) అని రాసి ఉంది.తను,వాళ్ళ ఫామిలీ అక్కడికి రెగులర్గా వెళ్తూంటారు.నాకు తెలుసు.లోపలికి వెళ్లగానే కొందరు పిల్లలు "అక్కా.." అని తనని చుట్టుముట్టారు."ఇదిగో మా ఫ్రెండ్ గోరింటాకు బాగా పెడుతుంది కావాల్సినవాళ్ళు పెట్టించుకోండి" అని వాళ్ళతో చెప్పి ,మేము తెచ్చినవి తీసుకుని తను లోపలికి వెళ్ళింది.వెళ్తూ వెళ్తూ, నా వైపు చూసి "నువ్వు పని అయ్యాకా ఇక్కడే ఉండు.లోపలికి రాకు".అంది.మళ్ళీ అర్ధం కాలేదు...

సరే,నా పనిలో నే పడ్డా.దొరికిన చేతులన్నింటికీ గోరింటాకు పెట్టడం నాకు చాలా ఇష్టమైన పని.తెచ్చిన మెహందీ కోన్లు అయిపోయాయి.పిల్లలంతా వెళ్ళిపోయారు.నా ఫ్రెండ్ ఇంకా లోపల్నుంచి రాలేదు.సందేహపడుతూనే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాను...నా గుండె ఆగిపొయింది కాసేపు... physically and mentally handicapped పిల్లలు బోలెడు మంది...నా స్నేహితురాలు ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకుని ఆడిస్తోంది..ఆ పిల్లవాడికి ముక్కు ఉండాల్సిన చోట పెద్ద కన్నంలా ఉంది...చుట్టూరా అలాంటి పిల్లలే...ఎవరు కన్న బిడ్డలో...చూడలేకపోయాను...!పరుగున బయటకు వచ్చి నించున్నా...

నా కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు...ఐదు నిమిషాల్లో నా ఫ్రెండ్ వచ్చింది.."నేను రావద్దన్నాను కదా,ఎందుకు లోపలికి వచ్చావు?" అంది కన్నీళ్ళు నిండిన నా మొహంలోకి చూస్తూ....అప్పుడర్ధమైంది తను నాకు ఎందుకు రావద్దని చెప్పిందో..!ఆ సమయంలో నాకు తనొక కొత్త వ్యక్తిలాగా,తను ఒక పెద్ద శిఖరం మీద ఉన్నట్లూ,నేను పాతాళంలో ఉన్నట్లూ అనిపించింది.డబ్బు,బట్టలు లాంటి సహాయాలు అందరూ చేస్తారు...అదేమ్ గొప్ప కాదు...కానీ చూడటానికే భయం వేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఆప్యాయంగా వాళ్లను అక్కున చేర్చుకున్న తన పెద్ద మనసుకు మనసులోనే జోహార్లు చెప్పాను...ఎందుకంటే నాకు ఆ సమయంలో మాటలు రాలేదు...

బయటకు వచ్చి నడుస్తున్నాము...నేను తల వంచుకుని ఆలోచనల్లో ములిగిపోయాను..."హలో మేడం..ఎక్కడికి వెళ్ళిపోయావు?వెనక్కు వచ్చేయ్...ఆ గేటుతోనే అది మర్చిపోవాలి" అంది.ఆ తరువాత నన్ను మౌనంగా వదలకుండా ఇంటికి వెళ్ళేదాకా ఏవో కబుర్లు చెప్తూనే ఉంది...!! ఆ రోజు నాకనిపించింది...నిజంగా నాకు గుండెధైర్యం లేదు..అని...!

కానీ ఆ తరువాత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నాకు కొంతైనా అది ఏర్పడిందనే అనుకుంటున్నాను.ఎందుకంటే 15ఏళ్ళ క్రితం మాకు అత్యంత సన్నిహితుడైన మా మేనమామ కేన్సర్ వ్యాధితో నరకయాతన అనుభవించటం కళ్ళార చూసాను.ఆయన కన్ను మూసినప్పుడు దగ్గరే ఉన్నాను...!పన్నెండేళ్ళ క్రితం మా నాన్నమ్మ చనిపోయినప్పుడు..కటకటాల గదిలో ఆవిడను పడుకోబెట్టినప్పుడు...తెల్లారి జనాలందరూ వచ్చేదాకా గడపకు ఒక పక్క అమ్మ,మరో పక్క నేను...రాత్రంతా మేమిద్దరమే...నిర్జీవమైన ఆవిడ శరీరం దగ్గర కుర్చునే ఉన్నాం!! అప్పుడు నాలో కించిత్తైనా భయం కలగలేదు...

రెండేళ్ళు అనారోగ్యంతో నానా యాతనా పడి, క్రితం ఏడు మా మామగారు కాలం చేసినప్పుడు....అంతక్రితం రెండు నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్న నేను... నిలబడ్డాను...! మరి "పెద్ద కో్డలిని"...వయసు లేకపోయినా, బాధ్యత తెచ్చిన పెద్దరికం అది...అలా నాకెదురైన పరిస్థితులు నాలో కొంతైనా గుండె ధైర్యాన్ని తెచ్చాయి....ఎప్పుడైనా వెనక్కువాలి ఆలోచనల్లోకి వెళ్ళినప్పుడు...కాలం తెచ్చిన మార్పంటే ఇదేనేమో మరి అనిపిస్తూ ఉంటుంది...!!

24 comments:

జయ said...

తృష్ణ గారు, మనిషికి అనుభవం చాలా నేర్పుతుంది. 'నిర్మల్ హృదయ్ ' అని బొంబై లో ఒక మెంటల్లీ హాండీకాప్డ్ సొసైటీ ఉండేది. నేను రీసర్చ్ చేసే రోజుల్లో బాంబే యూనివర్సిటీ కి దగ్గర్లో ఉన్న అక్కడికి తరచూ వెళ్ళే దాన్ని. హైదరాబాద్ లో 'మానస ' అని ఒక మెంటల్లీ హాండీ కాప్డ్ సొసైటీ ఉంది. అక్కడంతా చిన్న పిల్లలే. వాళ్ళని చూసి తట్టుకోటం చాలా కష్టం. వాళ్ళకి గ్రీటింగ్స్ చేయటం నేర్పిస్తాను. ప్రతి న్యూ ఇయర్ కి ఆ గ్రీటింగ్సే వాళ్ళ పేర్లతో ఎంతో మందికి పంపిస్తాము. ఆగస్ట్ 15త్ ఆ పిల్లలు ఎంత చక్కగా జరుపుతారో.

నీహారిక said...

నిర్మల్ హృదయ్ భవన్ లో old people ఉంటారనుకున్నాను.రోజూ అటు వైపె వెళ్ళినా మీ friend లాగా ఆ వయసులో చేయలెకపోయినా ఇపుడు చేయగలగుతున్నాను.

తృష్ణ said...

jayagaaru,thats a great thing madam.i use to make greetings for b'days and newyears with my another friend.but its only for personal use...
can you give your mail id?

మురళి said...

నిజమేనండీ.. జీవితం చాలా నేర్పిస్తుంది.. మనం నేర్చుకుంటూనే ఉంటాం...

తృష్ణ said...

niharika gaaru, Nirmal Hruday bhavan in vijayawada has two branches as far as i know.one is for old age people and the other is for physically and mentally handicapped.

congrats for doing a great job.

Bhãskar Rãmarãju said...

పరీస్థితులు మనసుల్ని హృదయాల్ని బండబారుస్తాయి. ఒక్కోసారి దాన్ని ధైర్యం అనికూడా అనుకోవచ్చు. ఒక్కోసారి హా!! కమిట్మెంట్ అనేస్కుని ముందునూ వచ్చు.

Bhãskar Rãmarãju said...

ఒక్కసారి ఇది చదవండి
http://ramakantharao.blogspot.com/2009/09/blog-post_17.html

SRRao said...

తృష్ణ గారు,
జయగారు చెప్పినట్లు మనిషికి అనుభవం చాలా నేర్పుతుంది. అనుభవంతో పరిణితి చెందిన మనిషి మరింతమందికి తన అనుభవాల వెలుగు పంచినపుడే ఆ జన్మకు సార్థకత. ఏమైనా నిస్సహాయస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే మానవత్వం ఉంది. అది మీలో పుష్కలంగా ఉంది. Keep it up.

తృష్ణ said...

@ మురళి:అందుకేనండీ జీవితమే ఒక పాఠశాల అన్నారు...

@ భాస్కర్ రామరాజు:మీ లింక్ చూసానండి..వ్యాఖ్య కూడా రాసేసా...

తృష్ణ said...

@ SR Rao: నన్ను మించిన వారెందరో ఉన్నారండీ...నేను మహా సాగరంలో ఒక నీటి బొట్టును మాత్రమే...!

భావన said...

తృష్ణా నిజం గా మీ ఫ్రెండ్ గ్రేట్.. అవును ధన సహాయం చెయ్యటం గొప్పే కాని అలా వాళ్ళను దగ్గరకు చేర్చుకుని ప్రేమించగలగటం చాలా గ్రేట్.. అవును పరిస్తితులు అనుభవాలు నెమ్మది గా ధైర్యాన్ని తెస్తాయి మనలో... అంటారు కద "necessity is mother of invention" అని, అలానే ఇది కూడా... మంచి విషయాన్ని అందించి చాలా ఆలోచనల తుట్టె రేపేరు...

బుజ్జి said...

తృష్ణ గారు....

ఇలా ఎందరవొ ఒంటరి బతుకులు...

మరెన్నొ గుండెల్లొ ఆరని చితులు....

బతుకు వారికిప్పుడు సమరం....

కాస్తంత మన సహయమే వారికి కొండంత ఉపకారం....

సుభద్ర said...

manchi post andi trustnagaaru.
naaku matalu raavatam ledu.karam adagakamdi.naaku imkaa teliyadu.

sreenika said...

తృష్ణ గారు,
దైనందిన జీవితమ్లో ఇలాటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే భగవంతుడు మనకి కల్పిస్తాడు. అవి మనం సద్వినియోగపరుచుకుంటామా లేదా అన్నది మన విజ్ఞత మీద ఆధారపడుతుంది.
Good keep it up.

మరువం ఉష said...

Live and learn అంటారు అందుకే. నేను యన్.యస్.యస్. ద్వారాగా కొన్ని సాంఘిక సేవలు చేసిన అనుభవాలు గుర్తుకు తెచ్చారు. కష్టం, నష్టం మనవి కొంత, ప్రక్కవారివి చూసి మరికొంత జీవితం ఇచ్చే ధైర్యం తరగనిది. అంతే కాదు, చిన్న గీత, పెద్ద గీత మాదిరిగా మనకున్న వాటి విలువ అవి లేని వారిని చూసాకనే అర్థం అవుతుంది.

నా స్వంత చెల్లి మృతదేహాన్ని [అదీ బలాత్కార మరణానికి గురైన మనిషిని] ముందుగా చూసి, నేనే తీసుకుని, ప్రక్కనుండి పట్టుకుని మార్చురీకి తరలించటం, నాకెంతో ప్రియమైన నానమ్మని ముందుగా ప్రాణవిహీనగా చూడటం, రాత్రి నన్ను సాగనంపిన అమ్మని ఉదయానికి అచేతనగా చూడను తిరిగి వచ్చి నేనే అన్నీ చేసి చివరి వీడ్కోలు ఇవ్వటం - ఇవన్నీ అందరి జీవితంలో ఏదో రూపంలో అనుభవంలోకి వస్తాయి. కానీ ఇవి నాకు గుండె ధైర్యాన్ని ఇవ్వలేదు, గుండె ని పగలగొట్టాయి. జీవితం పట్ల నిస్తేజాన్ని కలిగించాయి.

తృష్ణ said...

ఉషగారూ, no words....నా కళ్ళల్లో నీళ్ళు...సానుభూతి వ్యక్తం చేసి మిమ్మల్ని ఇంకా బాధపెట్టె ప్రయత్నం చెయ్యట్లేదు...

అవును కొన్ని సంఘటనలు జీవితం పట్ల నిర్వేదాన్ని పెంచుతాయి...కాని నేను అవి బ్లాగ్లో రాయలేను..కాని "ఇదా జీవితం..దీని కోసమా మనుషుల వెంపర్లు.." అనిపించిన సందర్భాలు కోకొల్లలు.చాలా రోజులు మనసు తలుపులు మూసేసుకుని గడిపిన తరువాత...జివితాన్ని వృధాపోనివ్వకూడదు అని నచ్చచెప్పుకుని.. ఈ మధ్యనే జీవితాన్ని ఆస్వాదించే ప్రయత్నాలు చేస్తున్నానండి!

తృష్ణ said...

ఉషగారూ, మరో విషయం మీకు కావాల్సినంత గుండె ధైర్యం ఉండబట్టే పై వ్యాఖ్యలో మీరు రాసినవన్నీ చెయ్యగలిగారు...you (definetly) are a brave woman!!

తృష్ణ said...

@భావన: అవునండి..మా ఫ్రెండ్ నిజంగానే గ్రేట్ and iam proud to be her friend..!నాకు దూరంగా మీ అందరికీ దగ్గరగా మీ దేశంలోనే ఉందిప్పుడు!

తృష్ణ said...

@sreenika: చాలా కరక్ట్ గా చెప్పారు.భగవంతుడు ఇలాంటి అవకాశాలను,సందర్భాలను మనల్ని పరీక్షించటానికీ,మన ఆత్మస్థైర్యాన్ని పెంచటానికీ ఇస్తూంటాడు.

తృష్ణ said...

సుభద్ర గారూ,ధన్యవాదాలు.పైన ఉషగారు రాసినట్లు,పెద్దగీత ముందు చిన్న గీతని...

Memory Makers said...

బాగు౦ద౦డి.యెన్నో గుర్తుకు వచ్హాయి.ముఖ్య౦గా మా అమ్మ నాకు 21స౦ మరణి౦చారు.అన్నీ పక్కనె ఉ౦డి చూసాను.కాని మీ స్నేహితురాలు నిజ౦గా గ్రేట్.

హరే కృష్ణ said...

.మీ ఫ్రెండ్ కి అభినందనలు.. ఇటువంటివి చూసైనా చాలా నేర్చుకోవాలి ..మంచి పొస్ట్

తృష్ణ said...

@harita:చిన్న వయసులో దగ్గరివాళ్ళను పోగొట్టుకోవటం....మీరెంత బాధపడి ఉంటారో అర్ధం చేసుకోగలను.
ఒకాప్పుడు నేను చూడలేనని లొపలే ఉండిపోయాను..కానీ ఆ తరువాత తప్పలేదు...ఇంక పారిపోలేదు కూడా..!

తృష్ణ said...

@hare krishna: true...thankyou.