సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 12, 2012

"దేవరకొండ బాలగంగాధర తిలక్" -- "శిఖరారోహణ"


ఆధునిక తెలుగు సాహిత్యంలో అతితక్కువ రచనలతో తనదైనటువంటి గాఢముద్రను వేసిన శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి జీవితం,సాహిత్యం గురించి కవి, రచయిత, విమర్శకుడు శ్రీ ఇంద్రగంటి శ్రికాంతశర్మ గారు ఒక పుస్తకం రాసారు. పుస్తకం పేరు "దేవరకొండ బాలగంగాధర్ తిలక్". సాహిత్య అకాదెమీ వారి ప్రచురణ. (వెల నలభై రూపాయిలు). శర్మగారు చిన్నప్పుడు తణుకులో తాను తిలక్ గారిని కలుస్తుండే రోజుల నుండీ ప్రారంభించి, తిలక్ జీవితం, తిలక్ జీవనదృక్పథం , సాహిత్య వ్యక్తిత్వం, కథలు, కవితలు, నాటకాలు, నాటికలు మొదలైన తిలక్ ఇతర రచనలన్నింటి గురించీ ఎంతో వివరంగా చెప్పుకుంటూ వచ్చారు ఈ పుస్తకంలో. పుస్తకం చివరలో మార్క్సిస్టు విమర్శకులు "అర్వీయార్" గారి వ్యాసం "తిలక్ కవిత్వంలో విషాద అలంకారికత" అనే అనుబంధాన్ని కూడా జత చేసారు. 


తిలక్ గురించి శర్మ గారు చెప్పిన కొన్ని విశేషాల సారం: 

ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయోద్యమకాలానికి చెందిన కవి, కథకుడు, నాటకరచయిత శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్(1921-1966). అందమైన రూపం, ఆ రూపాన్ని మించిన అందమైన మనసు; సున్నితత్వం,భావుకత కలగలిసిన వ్యక్తిత్వం వారిది. ప్రారంభంలో భావకవిత్వాన్ని రాసినా ఆ తర్వాత ఆనాటి అభ్యుదయోద్యమప్రభావాన అభ్యుదయ గీతాలను, వచన పద్యాలనూ రాసారు. ఆదర్శవంతమైన నాటకాలనూ, ఉత్తమమైన కథలనూ కూడా తిలక్ రాసారు. ఆయన మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న "అమృతం కురిసిన రాత్రి"; ఇంకా "గోరువంకలు", "తిలక్ కథలు" ; "సుప్తశిల", "సుశీల పెళ్ళి" నాటికలు మొదలైన రచనలు సాహిత్యాభిమానుల మన్ననలనందుకున్నాయి. 


సాహిత్యంలో తన ముందు తరానికి చెందిన కాల్పనికతకు, తన కాలం నాటి సామ్యవాద ధోరణికీ సమన్వయాన్ని సమకూరుస్తూ తనకు మాత్రమే సొంతమైన ఒక ప్రత్యేకశైలిని ఏర్పరుచుకున్న కవి శ్రీ తిలక్. మద్రాసులో ఇంటర్ చదివిన తిలక్ ఆ తర్వాత మరెక్కడా చదవలేదు. పధ్నాలుగు పదిహేనేళ్ల వయసు నుండే పద్య రచనను ప్రారంభించిన తిలక్ అభ్యుదయ రచనోద్యమకాలంలో కవిగా , సోషలిస్ట్ గా మారారు. డిగ్రీలు చదవకపోయినా తమ ఇంట్లోని ఐదారువేల పుస్తకాల వల్ల తిలక్ తెలుగు,ఇంగ్లీషుల్లో మంచి చదువరి అయ్యారు. స్వస్థలమైన తణుకులోనే ఉండిపోయారు. తిలక్ కవిత్వంలో కృష్ణశాస్త్రి గారి ప్రభావంతో కాల్పనిక సౌందర్యమూ, శ్రీశ్రీ ప్రభావంతో సామాజిక వాస్తవికత చోటు చేసుకున్నాయి. కవిత్వంలో తిలక్ ది ప్రత్యేకమైన శైలి. తెలుగు,సంస్కృత, అన్యదేశ సమాసాలు ఆయన రచనలలో కనబడతాయి. ఆయన కథల్లో మానసిక విశ్లేషణ, తాత్వికత, విశ్వశాంతి, అభ్యుదయభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యం అధ్యయనం చేసేవరికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందేమో అనిపించింది నాకు. 

తిలక్ సొంత గళంలో ఆయన "వెన్నెల" కవితనిఇదివరకూ బ్లాగ్లో పెట్టాను.. http://trishnaventa.blogspot.in/2009/11/blog-post_17.html

***   ***    *** 

 శిఖరారోహణ: 

'ముందుమాట'లో శ్రీకాంత శర్మ గారు విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి బాలగంగాధర్ తిలక్ జీవన సాహిత్యాల గురించి ప్రసారమైన ఒక డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించారు. తను ఆకాశవాణిలో పనిచేసే కాలంలో శర్మగారే రచించిన ఈ డాక్యుమెంటరీ పేరు "శిఖరారోహణ". దీనికి ప్రయోక్తగా శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి(మా నాన్నగారు) వ్యవహరించారు. ఆ కార్యక్రమంలో ఆనాటి ప్రముఖ రచయితలు శ్రీ సోమసుందర్, ఆర్.ఎస్.సుదర్శనం, నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తిలక్ సోదరులు గంగాధర రామారావు పాల్గొన్నారు. ఆకాశవాణి కళాకారులు పద్యాలు, వచన కవిత్వం చదివారు. గంట నిడివి ఉన్న ఈ కార్యక్రమం 1983లో ప్రసారమైంది. తిలక్ కవిత్వం పై ఆసక్తి ఉన్న పాఠకులు ఈ కార్యక్రమాన్ని క్రింద లింక్ లో వినగలరు.. 

 


పైన కార్యక్రమం వినలేనివారికి ఇదే కార్యక్రమంలో "అమృతం కురిసిన రాత్రి" లోని "వానలో నీతో" అనే కవిత ఒక్కటీ విడతీసి క్రింద లింక్ లో ఇస్తున్నాను. ఇందులో కవిత చదివిన గళం నాన్నగారిది. 

12 comments:

Bindu said...

తిలక్ గారి గురించి చదవటం చాలా బావుంది. మా ఇంట్లో తిలక్ గారి కథలు కూడా ఉండేవి. ఆయన కవితలే కాదు కథలు కూడా చాలా బావుండేవి!

అనంతం కృష్ణ చైతన్య said...

Thank u for posting about tilak gaaru . Excellent documentation. Meeku meerey saaTi Trisha gaaru.... :)

Manasa Chamarthi said...

శర్మ గారి నిశ్శబ్దం గమ్యం నేను మీరు చెప్పిన తరువాతే వెదుక్కుని మరీ చదివాను. ఇప్పుడు ఇంకో పని పెట్టారన్నమాట. పరిచయం క్లుప్తంగా, అందంగా బాగుందండీ. ఎప్పుడు ప్రచురింపబడిందో, ఎవరి ప్రచురణో కూడా వివరం ఇవ్వరా, వీలైతే.


మీ నాన్నగారి గొంతులో తిలక్ కవిత ఎంత చక్కగా పలికిందో. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేట్టు, చాలా చాలా బాగుంది.

Unknown said...

డియర్ తృష్ణ గారూ ,
తిలక్ గారి పై మీ నాన్నగారు చక్కగా నిర్వహించిన రేడియో కార్యక్రమం లింక్ పంపినందుకు ధన్యవాదాలు.
సమర్ధులైన సాహితీ పరులు,తిలక్ గారికి నిజమైన అభిమానులు, విశ్లేషణతో వివరించిన వారి కవితా వైభవం ఆద్యంతం చాలా బాగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమం లో జగన్నాధాచార్యులు గారు మధురంగా గానం చెసిన తిలక్ గారి పద్యాలు కొన్ని "గోరువంకలు" సంకలనం లో చూసాను. చాలా సంతోషం

వైదేహి శశిధర్

చాణక్య said...

తిలక్ కవితలంటే నాకు కూడా ఇష్టమండీ. ఈ పుస్తకం గురించి ఇంతకుముందు విని ఎరుగను. మంచి పుస్తకం పరిచయం చేశారు. ధన్యవాదాలు! :)

రామ్ said...

చాలా మంచి కార్యక్రమాన్ని అందించారు ధన్యవాదాలు . చాలా మంది ప్రముఖుల స్వరం లో తిలక్ గురించి వినటం బాగుంది . నా తణుకు జ్ఞాపకాలు తళుకుమన్నాయి ... ఆయన ఇంటి చుట్టూ చేసిన ప్రదక్షిణాల తో సహా !!

తృష్ణ said...


@బిందు: అవునండి, తిలక్ కథలు కూడా బావుంటాయి. ఈ పుస్తకంలో ఆ కథన్నింటి గురించి కూడా వివరణ ఉంది.
ధన్యవాదాలు.

@కృష్ణచైతన్య: :) ధన్యవాదాలు.

@మానసా, మొదటి పేరాలో పుస్తకం ముద్రణ, వెల రాసాను.మిస్సయ్యారేమో. "సాహిత్య అకాదెమీ" వాళ్లది.ఇటీవలి ప్రచురణే. వెల:నలభై రూపాయిలు.
నాన్నగారి తరఫున నా ధన్యవాదాలు.

తృష్ణ said...


@వైదేహిగారూ, కార్యక్రమం అంత శ్రధ్ధగా విన్నందుకు ధన్యవాదాలు.

@రామ్ గారూ, "తిలక్ గారి ఇంటి చూట్టూ ప్రదక్షిణాలు.." ఆ కబుర్లేవో మీ బ్లాగ్ ద్వారా మాతో కూడా పంచుకోరాదూ..:)
ధన్యవాదాలు.

తృష్ణ said...


@బిందు: అవునండి, తిలక్ కథలు కూడా బావుంటాయి. ఈ పుస్తకంలో ఆ కథన్నింటి గురించి కూడా వివరణ ఉంది.
ధన్యవాదాలు.

@కృష్ణచైతన్య: :) ధన్యవాదాలు.

@మానసా, మొదటి పేరాలో పుస్తకం ముద్రణ, వెల రాసాను.మిస్సయ్యారేమో. "సాహిత్య అకాదెమీ" వాళ్లది.ఇటీవలి ప్రచురణే. వెల:నలభై రూపాయిలు.
నాన్నగారి తరఫున నా ధన్యవాదాలు.

తృష్ణ said...

@చాణక్య: ఇది ఈ మధ్యనే రాసిన కొత్త పుస్తకం చాణక్యా. ధన్యవాదాలు.

SRRao said...

తృష్ణ గారూ !
తిలక్ గారిని ఇలా మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.
మీకు, మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు

శిరాకదంబం వెబ్ పత్రిక

తృష్ణ said...

@SRRao gaaru, thanks a lot for the wishes.