సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, October 29, 2012

అతను




నిన్న మేము బస్సులో ఎక్కేసరికీ లేడీస్ సీట్లు ఖాళీ లేవు. లేడీస్ సీట్ లో కూచున్న ఒకతన్ని వెనక ఖాళీగా ఉన్న సీట్ చూపెట్టి వెనక్కు కూచోమని అనడిగా. వెంఠనే అవతల పక్క సీట్లో ఉన్న ఆయన "అతన్ని లేపకండి.. ఇక్కడ కూచోండి" అని తన సీట్ ఖాళీ చేసి వెనక్కు వెళ్పోయాడు. మా పాప వాళ్ల నాన్న దగ్గర కూచుంది. నేను సీట్లో కూచున్నాకా ఇందాకటి మనిషి చేతిపై గాయం ఉండటం చూసాను. కట్టు లేదు కానీ దూది అంటుకుపోయి ఉంది అరచేతి వెనుకవైపు. ఎవరైనా రిలెటివ్స్ ఏమో  అందుకనే అతన్ని లేపవద్దన్నారు అనుకున్నా. అంతేతప్ప అతడిని పెద్దగా పరీక్షగా చూడలేదు.

నే కూచున్న సీట్ కాళ్ళ దగ్గర ఒక పాత, చిరిగిన రగ్గు ఉంది. ఎవరిదో ఇలా పడేసారు..అనుకున్నా. బ్యాగ్ లోంచి పుస్తకం తీసి అందులో మునిగిపోయా. కాసేపటికి నా పక్క సీట్ ఖాళీ అయ్యింది. ఇక పుస్తకం మూసి కిటికీ వైపు జరిగి బయటకు చూస్తూ కూచున్నా. అంతకు ముందు జరిగిన సంఘటనల వల్ల మనసు చిరాగ్గా ఉంది. ఎందుకో నే తల తిప్పేసరికీ ఇందాకటి దెబ్బ తగిలినతను నెమ్మదిగా నా సీట్ క్రింద ఉన్న రగ్గు లాగుతున్నాడు. ఇదేమిటి ఈ పాత రగ్గుని లాగుతున్నాడు? అని అప్పుడతన్ని బాగా పరీక్షగా చూశా. పాత మాసిన బట్టలు, ఎవరినీ పట్టించుకోకుండా తన లోకంలో తానున్నట్లున్నాడు. ఈ రగ్గు ఇతనిదా అని ఆశ్చర్యపోయా. ఇందాకా బస్సు ఎక్కిన హడావుడిలో అతన్ని సరిగ్గా చూడలేదు.. అనుకున్నా. అప్పటికి బస్సు సగం పైగా ఖాళీ అయిపోయింది. అతను నెమ్మదిగా సీట్లోంచి లేచి ఎవరినీ చూడకుండా, ఏ సంకోచం ప్రకటించకుండా బస్సులోని అటు ఇటు సీట్ల మధ్యన ఉండే నడవలో ఆ దుమ్ముకొట్టుకుపొయిన పాతరగ్గు కప్పుకుని పడుకుండిపోయాడు. అతనలా పడుకుంటుంటే బస్సులో కండక్టర్ తో సహా ఆతన్నిఎవరూ ఏమీ అనకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా వెనుక సీట్ ఖాళీగా ఉందని కండక్టర్ అక్కడే కూర్చున్నాడు.  లేచి వెనుక సీట్లో పడుకో అన్నాడు అతనితో. అతని ఓసారి కండక్టర్ వైపు మళ్ళీ లేవలేనన్నట్లు చూసి.. పక్కకు వత్తిగిల్లి పడుకుండిపోయాడు. కండక్టర్ ఇంక ఏమీ అనలేదు. లోకంతో ప్రమేయం లేకుండా ఎంత హాయిగా పడుకుండిపోయాడో!

బహుశా అతను రోజూ అదే బస్సులో వెళ్తుంటాడేమో. ఈ రూట్లో వెళ్ళే కొంతమందికి అతను తెలుసేమో. ఇందాకా నాకు సీట్ ఇచ్చిన వ్యక్తి కూడా అందుకనే అతన్ని లేపవద్దన్నాడేమో అని అప్పుడనిపించింది. ఎక్కడో తిరుగుతున్న నా ఆలోచనలన్నీ ఆ వ్యక్తి వైపుకి తిరిగాయి. అతనికెవరన్నా ఉన్నారో లేదో? ఇల్లూ వాకిలీ ఉందో లేదో? ఆ దెబ్బ ఎలా తగిలిందో? మతిస్థిమితం కాస్త ఉండే ఉంటుంది...మరీ పిచ్చివాడిలా లేడు కానీ ఇలా బస్సు మధ్యలో ఎలా పడుకుండిపోయాడు?.... ఇలా ఆలోచిస్తుంటే అంతకు ముందు నుంచీ నన్ను ఇబ్బంది పెడ్తున్న వేరే ఆలోచనలు మాయమైపోయాయి. ఎక్కడ పడుకుంటున్నాడో కూడా తెలీకుండా, జీవితానికి ఏ ఆధారం లేకుండా, నా అనేవాళ్ళు లేకుండా ఉన్న ఇతనిలాంటివాళ్ళు ఈ ఊళ్ళో, దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో బోలెడు మంది ఉంటారు కదా.. అలాంటివాళ్ల బ్రతుకులు ఎంత దయనీయమైనవి! మరి నాకున్న లోటేమిటి? నా చుట్టూ నా కోసం నా వాళ్ళు బోలెడుమంది. ఇతనిలా చిరిగిపోయిన రగ్గు కప్పుకునే పరిస్థితి అసలే లేదు. ఉన్నంతలో దేనికీ లోటు లేదు.  అతనిలా దిక్కులేని పరిస్థితి కాదు. మరెందుకు నేను బాధ పడుతున్నాను? చిన్న చిన్న సమస్యలను భూతద్దం లోంచి ఎందుకు చూస్తున్నాను? పెద్ద కష్టం వచ్చేసినట్లు ఎందుకు మనసు కష్టపెట్టుకుంటున్నాను? ఓపిగ్గా ఆలోచిస్తే ఏ సమస్యకైనా ఏదో ఒక మార్గం దొరుకుతుంది కదా! అలా అనుకోగానే ఇందాకటి నుంచీ ఉన్న చికాకు మాయమైపోయింది. మనసు తేలికైపోయింది.. కిటికీ బయట నుంచి వీస్తున్న చల్లగాలి ఆహ్లాదాన్ని పెంచింది.

 హఠాత్తుగా మరో ఆలోచన వచ్చింది. బహూశా నా ఆలోచనలో మార్పు తేవటం కోసమే అతను ఇలా బస్సులో కనబడ్డాడేమో అని. ఏదేమైనా ఈ చిన్న సంఘటన నా ఆలోచనల్లో పెద్ద మార్పునే తెచ్చింది !

15 comments:

Chinni said...

ఇలా ఈ సంఘటనతో స్పూర్తి పొంది మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

మధురవాణి said...

:-)

నిషిగంధ said...

థాంక్స్ తృష్ణా, ఈ పోస్ట్ రాసినందుకు! ఇలాంటి పెద్దగీతలు మన పక్కన కనిపించకపోతే మనం జీవితాంతం మన చిన్న గీతల్నే భూతద్దంలో చూసుకుంటూ మరీ బాధని పెంచుకుంటూ పోతాము!!

శ్రీలలిత said...


మీ పొస్ట్ చదివాక ఇప్పటిదాకా చిన్న సమస్యని భూతద్దంలోంచి చూసి మథనపడుతున్న దాన్ని ఒక్కసారిగా ఆ ఆలోచనని వేరేవైపుకి మళ్ళించుకున్నాను. అన్నీ తెలిసిన విషయాలే అయినా ఆ సమయానికి పిచ్చి మనసు పిచ్చి ఆలోచనలే చేస్తుంది. ఆ సమయంలో దానిని మళ్ళించిన మీ విఙ్ఞతకు జోహారు లర్పిస్తున్నాను.

రాధిక(నాని ) said...

మీ ఆలోచనా విధానం,మీరు చెప్పిన తీరు బాగుందండి.

రాజ్ కుమార్ said...

హ్మ్మ్.. నిజం..తృష్ణగారూ

Indira said...

మీరు అనుకున్నదెంతో నిజం!!!!ఇంతక్రితం ఏ కాస్త అన్ ప్లజంట్ విషయం జరిగినా అది మనసులోంచి ఓపట్టాన పోయేదికాదు నాకు.కానీ ఈ మధ్య వెళ్ళినటూర్ లో రకరకాల మనస్తత్వాల మనుషులతో కొన్నిరోజులు గడపడం వల్ల నా వైఖరి లో నేనే గమనించేంత మంచి మార్పు వచ్చింది.నిజానికి నేననుకుంటున్నవి పెద్ద సమస్యలు కానే కావు మిగతావారితో పోలిస్తే!!!

భాను said...

nice

చెప్పాలంటే...... said...

hammayya miru digulu vadileste chaalu eka baavuntaaru

Lakshmi Naresh said...

bavundandi..nijam idi....ilantappudu mana manasulo manchi, jali, daya anni nidra lesthaayi..ayyo apardham chesukunnane anna apardha bavam tolusthundi...

Priya said...

I am happy for you :)

అనంతం కృష్ణ చైతన్య said...

మిమ్మల్ని మీరు ఎప్పుడూ పరిసీలుంచుకుంటూ, ప్రశ్నించుకుంటూ ఉంటారు కాబట్టీ ఈ అలోచన కలిగిందెమో తృష్ణ మేడంగారు??? ఎమైనా ఒక మంచి పాసిటివ్ విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు........ :)

తృష్ణ said...

@Chinniగారూ, ధన్యవాదాలు.

@ మధురా, ధన్యవాదాలు.

@నిషీజీ, అందుకేనేమో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు ఎదురౌతూంటాయి.. ధన్యవాదాలు.

@శ్రీలలిత గారూ, మీ సమస్య కూడా తీరినందుకు సంతోషమండీ.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@రాధిక(నాని), @రాజ్: ధన్యవాదాలు.

@ఇందిర గారూ, పైన నిషి గారు చెప్పినట్లు పెద్ద గీత పక్కనుంటేనే కదా చిన్నగీత చిన్నదని తెలిసేది :)
ధన్యవాదాలు.

@భాను,@ చెప్పాలంటే: ధన్యవాదాలు.

తృష్ణ said...

@లక్ష్మీ నరేష్, @ప్రియ,ధన్యవాదాలు.
@కృష్ణ చైతన్య,అంతేనంటారా..:)
ధన్యవాదాలు.