"मुझॆ प्यार की कमी नही हैं..कमी है तॊ सिर्फ थॊडी इज्जत की..." అంటుంది శశి. ఈ సినిమాలోని female protagonist ! మొత్తం సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఇది. ఈ ఒక్క పాయింట్ మీదే మొత్తం సినిమా నిలబడి ఉంటుంది. అదే ప్రేక్షకుల మనసులకూ సినిమాకూ వారధి కూడా. Toronto Film Festival లో ఈ చిత్రం ప్రీమియర్ చేయబడినప్పుడు, చివర్లో "standing ovation" ఇచ్చారుట అక్కడి ప్రేక్షకులు. అంతటి మర్యాదను పొందే పూర్తి అర్హతలున్న సినిమా ఇది.
సినిమా చూస్తున్నంత సేపూ కథ తో పాటూ మనమూ కనక్ట్ అయి చూసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలా ప్రతి ఒక్కరూ సినిమాలోని పాత్రలతో(శశి లో, ఆమె భర్త లో, కూతురిలో) తమను తాము identify చేసుకునే సినిమా "English Vinglish". తొంభై శాతం ప్రతి భారతీయ కుటుంబం లోనూ జరిగిన, జరుగుతున్న కథే ఈ సినిమాలోనూ కనబడుతుంది. ఇల్లాలిని లోకువగా చూడటం. ఇంటెడు చాకిరీ చేసి, అందరు అవసరాలను చూసే అమ్మని కొందరు పిల్లలు లక్ష్యపెట్టరు. ఇంటినీ, కుటుంబాన్ని తీర్చిదిద్దే భార్యను కొందరు లోకువ కట్టేస్తారు. సినిమాలో "శశి"కి ఇంగ్లీషు రాదని భర్త, కూతురు హేళన చేసి లోకువ కట్టేస్తూంటారు. కానీ కొన్ని ఇళ్ళల్లో ఇంగీషు మాత్రమే కాదు ఇంకా చాలా విషయాల్లో ఇల్లాల్ని లోకువ కట్టేస్తూ ఉంటారు. శశి అన్నట్లు చాలా చోట్ల ప్రేమ ఉంటుంది కానీ గౌరవమే ఉండదు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని తెరపైకి ఎక్కించడానికి కారణం తన తల్లి అంటారు దర్శకురాలు "గౌరి షిండే"(ఈవిడ "చీనీ కమ్", "పా" దర్శకుడు బాల్కీ భార్య).
"I made this film to say sorry to my mother." అంటున్న గౌరి ఇంటర్వ్యూ క్రింద లింక్ లో.
http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/I-am-a-better-director-than-Balki-Gauri-Shinde/articleshow/16697950.cms
నేను కూడా బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో మా అమ్మ గురించి ఓ టపా రాసాను! ఎందుకంటే నాకు అమ్మ విలువ పెళ్ళయ్యాకా కానీ తెలీలే. అసలు పెళ్ళాయ్యాకా కానీ ఏ అమ్మాయికీ అమ్మ పూర్తిగా అర్ధం కాదేమో అనుకుంటాను నేను. ఎన్నో సందర్భాలో "అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా" అమ్మ పట్ల నాకు గౌరవం పెరిగిపోయేది. మనకు తెలీకుండానే మనం అమ్మని ఎన్ని వందలసార్లు బాధపెట్టి ఉంటామో అనుభవం లోకి వచ్చాకా కానీ తెలీదు. ఎందుకంటే మనం కసిరినా, కోప్పడినా,తిట్టినా, అరిచినా, మాట్లడకుండా ఉన్నా... మనల్ని భరించేది అమ్మ ఒక్కతే!!
ఈ కొత్త దర్శకురాలి మీద ఆశలు పెట్టుకోవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తుందీ సినిమా. ప్రతి పాత్ర తమ తమ పరిమితుల్లో ఉండి, ఎవర్నీ ఎవరూ డామినేట్ చేయకుండా తమతమ పాత్రల్లో(చిన్నవైనా) ఒదిగిపోయారు నటులందరూ. Female protagonist గా శ్రీదేవి డామినేట్ చేసేస్తోంది అని ఒక్కచోట కూడా అనిపించదు. చక్కని కథనంతో, ఆకట్టుకునే డైలాగ్స్ తో, మనసును హత్తుకునే సన్నివేశాలతో మనల్ని బాగా ఆకట్టుకుంటుందీ సినిమా. మనుషుల్లో వస్తున్న మర్పుని గమనించి అందుకు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. బరువైన థీం ని లైట్ గా చూపించటం కొత్త పంథా ఏమో మరి. "బర్ఫీ" అలానే ఉంది. ఇప్పుడు ఇదీ అలానే తీసారు. చాలాచోట్ల మానసు భారంగా అయిపోయినా, వెంఠనే నెక్స్ట్ ఫ్రేమ్ లో మన మూడ్ లైట్ అయిపోతుంది. సినిమా అయ్యాకా ప్రతిభావంతురాలైన ఈ దర్శకురాల్ని అభినందించకుండా ఉండలేం మనం.
శ్రీదేవి కట్టిన సాదాసీదా కాటన్ చీరలు చాలా బాగున్నాయి. |
అయితే శ్రీదేవిని ఒక కొత్త నటిలా నేను చూడగలిగాను తప్ప ఆమెలో పాత శ్రీదేవిని ఒక్క క్షణం కూడా పోల్చలేకపోయాను . somehow i felt pitiful to see a skinny sridevi. అందమైన పెద్ద పెద్ద కళ్ళు తప్ప ఇంకేం బాలేదనిపించింది. ఏభైలకి దగ్గర పడుతున్న ఏ స్త్రీ అయినా, శరీరాకృతి కోసం ఎంత శ్రమించినా.. జీవనసంఘర్షణ తాలూకూ ఆనవాళ్ళని దాచిపెట్టలేదేమో!!! ఏదేమైనా Beauty has to wither some day..కదా...అనుకున్నా!
సినిమాలో నాకు నచ్చిన కొన్ని సంగతులు:
* సినిమా మొదట్లో అందరికీ అన్నీ సమకూరుస్తూ తన కోసం కలుపుకున్న కాఫీ తాగుతు పేపర్ కూడా చదువుకునే తీరిక దొరకదు శశికి. పిల్లాడితో ఆమె సమయం గడపటం, వాళ్ల మధ్యన అనుబంధం లాంటి చిన్న చిన్న డీటైల్స్ చూపించటం బాగుంది. మళ్ళీ భర్త అమెరికా వచ్చిన మర్నాడు అతను కాఫీ అనగానే చదువుతున్న పేపర్ ఆపేసి కాఫీ కోసం వెళ్తుంది శశి. చివరలో "వీళ్ళు నా ముఖ్యమైన స్నేహితులు" అని శశి చూపిస్తే "నీక్కూడా స్నేహితులా " అన్నట్లు చూసే చూపు.. అలాంటి మరి రెండు సన్నివేశాల ద్వారా టిపికల్ భర్తల స్వభావాన్ని బాగా చూపించారు.
* శశి వెళ్ళే ఇంగ్లీష్ క్లాస్ లో స్టూడెంట్స్ బాగున్నారు. ప్రపంచంలో ఎన్నిరకాలవాళ్ళున్నారో ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వెళ్ళేవాళ్ళు అనిపించింది.
*శశిని ఇష్టపడే ఫ్రెంచ్ దేశీయుడు క్లాస్ లో నిర్భయంగా తన భావాలను చెప్పటం బావుంది. అతనిలోని నిజాయితీ ఆ పాత్రకు నిండుతనాన్ని ఇచ్చింది.
* క్లాసులు అయ్యేకొద్దీ భాష నేర్చుకుంటున్న వాళ్లలో ధైర్యం, వాళ్ళ నడకలో పెరిగే కాన్ఫిడెన్స్ బాగా చూపెట్టారు.
* "మగవాడు వంట చేస్తే కళ అంటారు.. అదే ఆడది చేస్తే అది తన బాధ్యత అంతే అంటారు.." అనే డైలాగ్ ; అలానే "పిల్లలకు తల్లిదండ్రుల లోటుపాట్లను ఎత్తిచూపి వేళాకోళం చేసే హక్కు ఎక్కడుంది?" అని శశి ఆవేదన పడే సన్నివేశం కళ్ళు తడిచేస్తుంది.
* శశి తన కుటుంబం నుండి గౌరవాన్ని కోరుకుంటోంది అని చెప్పటం కోసం తగినన్ని కారణాలు చూపించారే తప్ప భర్తను గానీ పిల్లని గానీ తక్కువగా చూపెట్టలేదు. అలా వాళ్ళ పాత్రలను మర్యాదపూర్వకంగా నిలబెట్టి ఉంచటం బావుంది.
*సినిమా చివరలో నూతన వధూవరులకు శశి చెప్పే వాక్యాలు చాలా బాగున్నాయి. అవి భార్యాభర్తలకే కాదు స్నేహితులకీ, మరే బంధమైనా నిలబడటానికి ఉపయోగపడేలా ఉన్నాయి.
కథ పెద్దగా లేకపోవటం వల్ల సినిమా కొన్ని సన్నివేశాల్లో సాగదీస్తున్నట్లు స్లోగా నడిచింది. అయినాకూడా ఎక్కడా బోర్ కొట్టలేదు. కుటుంబం మొత్తం వెళ్ళి హాయిగా చూసిరావచ్చు. ప్రేమించటంతో పాటూ అమ్మను,భార్యనూ గౌరవిస్తూ కూడా ఉండాలి అనే సంగతి ఓసారి గుర్తుచేసుకుని కూడా రావచ్చు.
11 comments:
తృష్ణ గారూ, రివ్యూ చాలా బాగా వ్రాశారు. congrats
_అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా_
మీ పోస్ట్ లో ఆ పేరా లో , నేను identify అయ్యాను.
రివ్యూ బాగుంది తృష్ణ గారు. ఈ మధ్యకాలంలో నాకు చాలా నచ్చిన సినిమా ఇది. మీరు హైలైట్ చేసిన పాయింట్స్ చాలా బాగున్నాయ్. స్టూడెంట్స్ నడకలో తేడాని సైతం గమనించడం చూస్తే మీరు ఎంత శ్రద్దగా పూర్తిగా ఇన్వాల్వ్ అయి సినిమా చూశారో అర్దమవుతుంది :)
అమ్మవిలువతో పాటు ఒక స్త్రీ ఫీలింగ్స్ ని కూడా చక్కగా చూపించారు ఈ చిత్రంలో. మంచి రివ్యూ తృష్ణగారు.
మీరు అంతా బాగానే రాసారు,కాని మధ్యలో ఆంగ్ల వాక్యాల అవసరం ఏమొచ్చింది? తెలుగులో మీ భావాన్ని తెలియజేయ లేమనుకున్నారా? లేక తెలుగు భాషలో పదాలు సరిపోవను కున్నారా?
Very well written Trushna garu.. Waiting to see the movie...
చాలా బాగుందండీ..
నేను మిస్సవ్వను.. ఎలాగోలా చూసేస్తాను.
మీ రివ్యూ చదవగానే చూడాలనిపించింది..మంచి విశ్లేషణను అందించారు. జీవన సంఘర్షణ ఆనవాళ్ళు దేహంపై తప్పక వుంటాయన్న వ్యాఖ్య చాలా నచ్చింది. లేని దారుఢ్యాన్ని కిలోల కొద్దీ మేకప్ లు పూసుకొని చేసే నటులకంటే సహజంగా శ్రీదేవి చేయడం బాగుంది. మంచి సినిమాను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..
@శైలజ గారూ, ధన్యవాదాలు.
@వేణూగారూ, అందుకే అన్నానండి ప్రతిఒక్కరూ ఇన్వాల్వ్ అయి చూసేది అని.:)
ధన్యవాదాలు.
@ప్రేరణ: అవునండి..ప్రతి భావననీ ప్రేక్షకులు గమనించేలా మరీ చూపించటం బావుంది. ధన్యవాదాలు.
@బాలాజీ గారూ, 'నీ personal blog లో మధ్య మధ్య ఇంగ్లీషు వాక్యాలు రాస్తే బెంచీ ఎక్కించేస్తాం' అని ఎవ్వరు బెదిరించలేదండి మరి..:)
టపా నచ్చినందుకు ధన్యవాదాలు.
@ప్రసీద: టపా నచ్చినందుకు ధన్యవాదాలు. తప్పక చూడండి. నిరాశపరచదు.
@రాజ్: తప్పకుండా చూసి నీ అభిప్రాయం కూడా బ్లాగ్ లో రాయి రాజ్.thank you.
@కెక్యూబ్ వర్మ: నిజమేనండి.. ధన్యవాదాలు.
మీ రివ్యూ బాగుంది,ఆలోచింపజేస్తుంది.చదివాక అమ్మకి phone చేసి sorry చెప్పానండి .. మీరు అన్నట్లు పెళ్ళయ్యాక కానీ ఆడపిల్లలకి అమ్మ అర్ధం కాదేమో ..నాకు కూడా అమ్మ ఇప్పుడిప్పుడె అర్ధమౌతుంది.. :(నేను సినిమా ఇంకా చూడలేదు
తప్పకుండా సినిమా చూడాలి .Thanks అండి..:)
Post a Comment