సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, September 27, 2020

"నువ్వు లేవు నీ పాట ఉంది"




"ఇప్పుడు నువ్వు లేవు నీ పాట ఉంది 

నా లోపల లోపల 

ఆరిన కుంపటిలో రగులుతున్న 

ఒకే ఒక స్మృత్యాగ్నికణంలాగ"

 He has left a vacuum that can never be filled by any other voice!! తెలుగు భాష మాత్రమే కాదు, సినీ సంగీతం బ్రతికి ఉన్నంతవరకూ బాలూ గళం ప్రజల మన్ననలు పొందుతూనే ఉంటుంది. ఆచంద్రార్కము, అమరం అనే పదాలకు బాలూ గళమే సరైన ఉదాహరణ అనిపిస్తోంది ఇవాళ.


తెలుగు పాట కాకపోయినా ఈ తమిళగీతం నాకు ఎంతో ఇష్టమైనది -


"నా ఏడుపు నాకు తప్ప లోకానికి వినిపించనివేళ

నే కూరుకుపోతున్న చేతకానితనపు వానాకాలపు బురద మధ్య

నీ పాట ఒక్కటే నిజంలాగ 

నిర్మలమైన గాలిలాగ 

నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే శుక్తిగత మౌక్తికంలాగ

ఇంటి ముందు జూకామల్లెతీగలో అల్లుకుని 

లాంతరు వెలుతుర్లో క్రమ్ముకొని 

నా గుండెల్లో చుట్టుకుని 

గాలిలో ఆకాశంలో

నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని 

నీరవంగా నిజంగా ఉంది

జాలీగా హాయిగా వినబడుతూ ఉంది"


గత రెండు రోజులుగా రేడియోలో రకరకాల ఛానల్స్ లో వినిపిస్తున్న బాలూ పాటలు వింటూంటే నాకు పదే పదే ఈ పైన రాసిన కవితా వాక్యాలు గుర్తుకువస్తున్నాయి. ఒకటా రెండా? ఇది, అది అని ఏ పాటను ప్రత్యేకించి చెప్పాలో తెలియటంలేదు. చిన్నప్పుడు రేడియోలో విన్న"సిరిమల్లె నీవే" నుంచీ ఇటీవలి ’శతమానం భవతి’ లోని "నిలువదే మది నిలువదే" పాట వరకూ ఉదహరించ వీలుకాని వేలకొద్దీ ఎన్నో గొప్ప పాటలు!! దేశం యావత్తూ మత్తెక్కినట్లు ఊగిపోయిన శిఖరాగ్రంలోని "శంకరాభరణం" పాటలు ఓ పక్కన పెడితే; "బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది" అని కాలేజీ పిల్లలందరూ పాడుకున్నా, "ఓలమ్మీ తిక్కరేగిందా" అని యువత ఉర్రూతలూగినా, "ప్రేమా ప్రేమా.." అంటూ ప్రేమికులు పాడుకున్నా, పదాలు ఉదహరించలేని కొన్ని ప్రత్యేకమైన శృంగారగీతాలు మత్తెక్కించినా, "ఆనాటి ఆ స్నేహమానందగీతం" అని నడివయస్సు వాళ్ళు పాడుకున్నా, "అంతర్యామీ అలసితి సొలసితి" అని వయసుమీరినవారు స్వగతాలుగా పాడుకున్నా, ఆ గొప్పతనం ఆ పాటల సాహిత్యానిది మాత్రమే కాదు, ఆ సాహిత్యాన్ని మన మనసుకు హత్తుకునేలా వినిపించిన బాలూగళానిది కూడా! రిక్షా నడిపే శ్రామికుడి మొదలు ఖరీదైన గదుల్లో రిలాక్సయ్యే ధనవంతుల వరకూ ప్రతి ఒక్కరూ నిత్యం విని ఆస్వాదించే ఆ మధురగళం బాలూని అందరివాడిగా మార్చేసింది. He is not just a singer, He is Family! అదీ మన తెలుగువారింట మాత్రమే కాదు, తను పాడిన ప్రతి పాటనూ పలికేవారందరికీ బాలూ ఒక కుటుంబసభ్యుడు. అందుకే ఇవాళ తను లేని లోటు అందరినీ బాగా దిగులుపెడుతోంది.


’కరోనా తనని తీసుకుపోయింది ’, ’ఫలానావారిది తప్పు’ అంటూ ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నా, నాకు మాత్రం ఒక్కటే అనిపిస్తోంది - ఇవన్నీ just reasons. Death has to have a reason. It finds its way in any of the directions. "మృత్యుదేవత నేరం తన మీద పెట్టుకోదమ్మా.. ఏదో ఒక వ్యాధి రూపంలో వచ్చి, నేరాన్ని దాని పైకి నెట్టేస్తుంది" అంటూ ఉండేది మా తాతమ్మ. ఘనమైన, వైభవోపేతమైన కళాజీవితం, చివరలో ఓ నెల రోజుల అనారోగ్యం ఆయన destinyలో ఉన్నాయన్నమాట అనిపించింది.


ఆమధ్యన ఒకరు మీ ఫేవొరేట్ సింగర్ ఎవరు అని అడిగితే "హరిహరన్" అని చెప్పాను. మరి మీకు? అని అడిగితే, "ఇంకెవరూ.. బాలూ! నవరసాలనూ అంత బాగా పలికించగల మరో గళం నాకు కనబడదు" అన్నారు ఆవిడ. తర్వాత చాలా సేపు ఆలోచించాను - నిజమే కదా ఎప్పుడూ ఆ కోణంలోంచి చూడలేదు.. ఏ పాట విన్నా ఆ హీరోకో, ఆ సందర్భానికో అతికినట్టు పాడడం ఒక్క బాలూకే సొంతం. తన ప్రతి పాటా తను పాడినట్లు మరొకరు ఎప్పటికీ పాడలేరు అన్నది నూరుశాతం సత్యం. మనసు గదిలో ముందువరుసలో హరిహరన్ నిలబడినా, లోపల్లోపల నాకూ బాలూ అంటే ప్రేమ ఉంది అని అప్పుడు అనిపించింది. బహుశా అందుకేనేమో ఆ రోజు రాత్రి ఫోన్ అప్డేట్స్ లో కమల్ హాసన్ బాలూను చూసి వెళ్లారుట అన్న వార్త చదివినప్పటి నుండీ మనసులో ఏదో దిగులు, సన్నని బాధ నిదురపోనివ్వలేదు. వినకూడదనుకున్న వార్త వినాల్సివచ్చిన రెండు రోజుల తర్వాత ఇప్పటికి ఈ వాక్యాలు రాయగలుగుతున్నాను. 


నాన్న స్నేహితుడైన మూర్తిబాబయ్య (సంగీత దర్శకుడు ఈ.ఎస్.మూర్తి) ఎస్.ఏ.రాజ్ కుమార్ దగ్గర పనిచెయ్యని క్రితం మొదట్లో కొన్నేళ్ళు బాలూ గారి దగ్గర కూడా ఉన్నారు. అందువల్ల వారి సాన్నిహిత్యం ఎంతో అపురూపమైనది. దూరంగా ఉండే మనలాంటివారికే ఇంత బాధ ఉంటే, కొన్నేళ్ల పాటు సన్నిహితంగా ఉండి, కలిసి పనిచేసినవారికి ఎంత బాధగా ఉంటుంది? నాన్న పలకరిస్తే, "జీవితంలో ఇంత శూన్యంగా ఎప్పుడూ లేదండీ" అన్నారట తను. బాలూ స్వగృహంలో వాళ్ళు కలిసినప్పుడు తీసుకున్న ఈ చిత్రాన్ని షేర్ చేసి, నేను వ్యాసంలో ప్రచురించడానికి అనుమతి ఇచ్చినందుకు బ్లాగ్ముఖంగా మూర్తిబాబయ్యకు ధన్యవాదాలు.



ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో నాన్న పనిచేసినప్పుడు, 1971లో బాలూగారిని నాన్న ఇంటర్వ్యూ చేసినప్పటి చిత్రం -



చిన్నప్పటి నుండీ ఎరిగి, మా తెలుగువాళ్ళు అని మనం గర్వంగా చెప్పుకునే మహామహులంతా ఒక్కొక్కరే మాయమైపోతున్నారు. వేటూరి, బాపూ, రమణ, బాలమురళీకృష్ణ, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం!! ఇలా మన తెలుగుభాషని జాతీయ స్థాయిలో గర్వంగా నిలబెట్టినవారంతా వెళ్ళిపోతుంటే, ముందుముందు మన తెలుగుతనపు ఘనతని చరిత్రలోనే చదువుకోవాలేమో అనిపిస్తోంది :( 


***                   ***              ***

బాలూ గురించి జానకమ్మ గారి ఆప్యాయమైన మాటలు -



-----------------------------------

** (వ్యాసంలోని కవితా వాక్యాలు దేవరకొండ బాల గంగాధర తిలక్ "అమృతం కురిసిన రాత్రి"లోని "నువ్వు లేవు నీ పాట ఉంది" కవిత నుండి)





No comments: