సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, January 4, 2010

పందార...పందార...


బాసుందీ, జీడిపప్పు పాకం, పూతరేకులు, గవ్వలు, బొబ్బట్లు, కాకినాడ కాజాలు,గులాబ్ జాం, మడత కాజాలూ, కజ్జికాయలు, పంచదార పూరీలు, పేటా(బుడిది గుమ్మడితో చేసే స్వీట్), బొంబే హల్వా, సేమ్యా హల్వా, చక్రపొంగలి.....ముఖ్యంగా ఇవి...ఇంకా కొన్ని...ఇవన్నీ ఏమిటి? అంటే నాకిష్టమైన తీపి పదార్ధాలు ! ఇంకా వివరంగా చెప్పాలంటే అసలు "తియ్యగా" ఉంటే చాలు ఏవన్నా నోట్లోకి వెళ్పోయేవి ఒకప్పుడు...!

మేం అన్నిరకాలూ తినాలని మా అమ్మ అన్నింటిలో "పందార"(పంచదార కి కొల్లోక్వియల్ పదమన్నమాట) వేయటం మొదలెట్టింది. టమాటా, బీరకాయ, ఆనపకాయ, మొదలైన కూరల్లో, వాటి పచ్చళ్ళలో, ఆఖరుకి కొబ్బరి పచ్చడిలో కూడా పందారే..! ఉప్మా తింటే పైన పంచదార చల్లుకుని, పూరీలు తింటే, ఆఖరులో ఒక పూరీ పందార వేసుకుని తినకపోతే పూరీ తిన్న తృప్తే ఉండేది కాదు. చారులో, పులుసుల్లో కూడా పందారే. ఈ పదార్ధాలన్నీ పందార లేకుండా కూడా వండుకుంటారని అసలు తెలియనే తెలియదు. కాఫీలో,టీ లో కూడా మన పాళ్ళు ఎక్కువే. అలా పందార మా జీవితాల్లో ఒక భాగమైపోయింది.

కేనింగ్ సెంటర్(పదార్ధాలు మనం తీసుకువెళ్తే, జామ్లు అవీ మనతో చేయించే సెంటర్) కు వెళ్ళి మా కోసం పెద్ద హార్లిక్స్ సీసాడు(నే చాలా ఏళ్ళు తాగిన హెల్త్ డ్రింక్) మిక్స్డ్ ఫ్రూట్ జామ్, ఆపిల్ జామ్, ఇంకా రెమ్డు మూడు రకాల జూస్ లూ చేసి పట్టుకు వచ్చేది అమ్మ. ఇంక మజ్జిగలోకి,ఇడ్లీల్లోకి, దోశల్లోకి అన్నింటిలోకీ జామే..! సీసా అయిపోయేదాకా నేనూ, మా తమ్ముడూ పోటీలుపడి తినేసేవాళ్ళం. శెలవులకు మా తమ్ముడు వస్తే వాడున్న వారం,పది రోజులూ రొజుకో రకం స్వీట్ చేసేసేదాన్ని.నా పెళ్ళయాకా అల్లుడికి లడ్డూలూ, సున్నుండలూ ఇష్టం అని తెలిసి మా అమ్మ తిరుపతి లడ్డు సైజులో మిఠాయీ, సున్నుండలు చేయించింది సారెలోకి. నా సీమంతానికి పన్నెండు రకాల స్వీట్లు తెచ్చింది మా అమ్మ.

ఆ విధంగా పందార తిని, తినీ పెరిగిన నేను అత్తారింట్లో వంటల స్పెషలిస్ట్ ననే ధీమాతో, అన్ని పనులు బాగా చేసేసి అందరి మన్ననలు పొందెయ్యాలనే "అజ్ఞానం"లో మొదటిసారి వంట చేసాను. అందరూ బావుందంటారనే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చూస్తున్నా...."ఈ కూరలో ఎన్ని పచ్చిమెరపకాయలు వేసావమ్మా?" అనడిగారు మామగారు."ఈ పచ్చడేమిటి తియ్యగా ఉంది?" అనడిగారు శ్రీవారు. "ఇది చారా పానకమా?" అనడిగాడు మరిది. "మేము చారులో,పచ్చడిలో పంచదార వేసుకుంటాము" అన్నాను ఎర్రబడిన మొహంతో..! ఆ మర్నాడు మా అత్తగారు దగ్గరుండి కూరలో ఐదారు పచ్చిమెరపకాయలూ, తీపి లేని చారు, పందార లేని పచ్చడి చేయించారు. నాకు విడిగా కాస్త కారం తక్కువగా కూర, పందార వేసిన పచ్చడి చేసుకున్నా...!ఆ తర్వాత కొన్నాళ్ళు అలా విడిగా తీసుకున్నాకా విసుగొచ్చి మానేసి, నేనూ "వాళ్ళ మెనూ"లో జాయినయిపోయా. నేను తీపి వేసుకోవటం మానేసాను. కాలక్రమంలో వాళ్ళూ కారం కాస్త తగ్గించారు. ఇప్పుడిక ఇంటికి వెళ్తే తియ్యకూరలు వండకు అని నేనే చెప్తాను అమ్మకి. "పెళ్ళయాకా ఇది మారిపోయింది" అంటారు అమ్మావాళ్ళిప్పుడు.

చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూలు,కాలేజీ ఎగ్గొడదామంటే "జ్వరమన్నా రాదేమమ్మా...." అంటే అమ్మ తిట్టేది. అటువంటి రాయిలాంటి ఆరోగ్యం కాస్తా ఒక్క డెలివెరీ తో చిందర వందర అయిపోయింది. సిరియస్ వి కాకపోయినా ఏవేవో రకరకాల సమస్యలు. ఇక స్వీట్లు, ఫాటీ పదార్ధాలూ తినకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడో సుగరు,బి.పీలూ వచ్చాకా మానేయటం కన్నా ముందుగానే మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం శ్రేయస్కరం అనిపించింది. పైగా ఇప్పుటినుంచీ మానేయటం వల్ల ముందు ముందు విపరీతమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా, రక్తంలో కొవ్వు శాతం "మితంగా" ఉంటే ఆయా ఆరోగ్య సమస్యల వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా వరకూ తగ్గుతాయి అని నేను చేసిన నెట్ సర్వేతో నాకర్ధమైన విషయం. ఐదేళ్ళ నుంచీ టీ లో "పందార" కూడా వేసుకోవటం మానేసాను. ఏస్పర్టీమ్, సర్కోజ్ వంటి "ఆర్టిఫీషియల్ స్వీట్నర్లు" కాక ఒక "నేచురల్ స్వీట్నర్" గురించి తెలుసుకుని అది వాడటం మొదలెట్టాను. దాని గురించి తదుపరి టపాలో...

"ఏది జరిగినా మన మంచికే" అని నమ్మే మనిషిని నేను. తలెత్తిన ఆరోగ్య సమస్యలు "తీపి" మీద నాకున్న మోహాన్ని వదలగొట్టాయి. ఇప్పుడు ఐస్ క్రీం చూసినా, ఏదన్నా స్విట్ చూసినా తినాలనే ఏవ పూర్తిగా పోయింది. పెళ్ళిలలో, పండుగల్లో తప్ప "పందార" "స్విట్"ల జోలికే పోను.చేసి అందరికీ పెడతాను కానీ నేను మాత్రం తినను."దంపుడుబియ్యం" మంచిదని తెలుసుకుని అది కూడా తినటం మొదలుపెట్టాము ఇంట్లో."ఆరోగ్యమే మహాభాగ్యం" అనేసుకుని, ఇలా రకరకాల కారణాలతో నాకు చాలా ఇష్టమైన వాటి పట్ల నాకున్న మోహాన్ని పోగొడుతున్న భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను.

31 comments:

శేఖర్ పెద్దగోపు said...

బాగున్నాయి మీ తీపి కబుర్లు..మేము కూడా పందార అనే అంటాము ఇంట్లో...

మైత్రేయి said...

భలే రాసారు.
నాక్కూడా పందార తో పాటు బెల్లం తో తయారు కాబడిన ఏ పదార్ధమైనా ఇష్టం.
అసలు ఆ స్వీట్ పేర్లు చూసే మీ బ్లాగ్ ఓపెన్ చేశా..
నేనింకా వైరాగ్యం లో కి రాలేదు. ఇంకా స్వీట్ తినని చిక్కిన జనాలని చూసి జాలి పడుతున్నాను.
స్వీట్ వదల్లేక బోల్డు కష్ట పడి ఎరోబిక్స్ చేస్తున్నా.. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో ..
అన్నట్టు మీరు రాస్తే నా మాటే మీరు రాసినట్లు ఉంటుంది నాకు చాలా సార్లు.

నాగప్రసాద్ said...

అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరుగుతోంటే, పంచదార రేటేమిటబ్బా ఇలా పడిపోయింది అనుకున్నాను ఆ మధ్య. మీరు తినడం మానేశారా. గ్రేట్. :) (Just kidding)

నేను said...

పంచదార "ధార" కాస్త తగ్గుతూ పూర్తిగా ఆగిపోయిందా....
ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం కదా ...

కొత్త పాళీ said...

ఏంటో, ఎన్ని కష్టాలో .. ప్చ్!!

Padmarpita said...

తియతీయగా వున్నాయి మీ పందార కబుర్లు...

Kranthi said...

మీరు మీ అరోగ్యం కోసం తీపి తినడం మానేసి ... మా అరోగ్యం కోసం మీ బ్లాగు ద్వారా ఆ తీపిని పంచుతున్నారన్నమాట !!! :) ఈమధ్యే మీ బ్లాగిట్లోకి అదుగుపెట్టాను...చాల బావుందండి... మీ బ్లాగు బహు బాగు .

వేణూశ్రీకాంత్ said...

హ్మ్ ఎన్ని కష్టాలో అనిపిస్తుంది కానీ, మీరిలా లిస్ట్ చదివేసి నోరూరించేయడం ఏమీ బాగాలేదండీ :-)

తృష్ణ said...

@శేఖర్: నాకు తెలిసీ చాలామంది అలానే అంటూంటారండీ...

@మైత్రేయి: తృప్తిగా స్వీట్లు తిని ఆరోగ్యంగా ఉండగలగటం అదృష్టమేనండీ. కాని తినటంవల్ల శరీరానికి భవిష్యత్తులో హాని జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిసి తినటమ్ అవివేకమండీ నా దృష్టిలో...చిక్కటానికి మాత్రం నేను స్వీట్లు మానలేదు...:)

నా మాట మీమాటగా అన్పించటం బావుందండీ...మీరు అదివరకెప్పుడో ఒక వ్యాఖ్య రాసిన గుర్తు...

తృష్ణ said...

@నాగప్రసాద్: మరే నేను "పందార" తింటూ ఉండి ఉంటే అది కుడా కిలో వందకు చేరేదేమోనండీ...:)

@నేను: అవునండీ...ఎన్నున్నా "ఆరోగ్యం" సరిగా లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండీ...

తృష్ణ said...

@కొత్తపాళీ: ఏమండీ మీరు నా "సింహావలోకనం" టపా చూడలేదాండీ..? వీలుంటే చూడండి.

మరీ అన్ని కష్టాలేం లేవండీ...iam a happy soul అననుగానీండి... no regrets అని మాత్రం చెప్తానండీ...అయినా జీవితానికి సరిపడా తిపి చిన్నప్పుడే తినేసాలెండి..:)

తృష్ణ said...

@పద్మార్పిత: కొత్త సంవత్సరంలో తియ్య తియ్యగా టపాలు మొదలెడదామని ఇలా రాసానండీ...

@what to say about me!! :

నా బ్లాగ్ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...
మీ వ్యాఖ్య కూడా బాగు బాగు..!!

తృష్ణ said...

వేణూగారూ, పైన కొత్తపాళీగారికి రాసిన జవాబే మీకూనండీ...తినేసి శరిరాన్ని దు:ఖపెట్టుకోవటం కన్నా కాపాడుకోవటం నయం కదాండీ...

మరి అవన్నీ నాకిష్టమైన స్వీట్లు లిస్ట్... రాసుకునన్నా తృప్తిపడదామని..:) :)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నాగప్రసాద్ మాటే నాదీ. కాకపోతే దాన్ని బాలన్స్ చేసేందుకు నేను, మురళిగారు ఉన్నాం. :)

తృష్ణ said...

అవునవును...తీపి తినేవాళ్ళందరి కోసం నేను త్యాగం చేసాను...లేకపోతే ఎవరికీ "పందార" దొరికేది కాదు...:) :)

Rani said...

(నాకున్న మోహాన్ని పోగొడుతున్న భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను)

మీ భగవంతుడిని నాకు hand loan ఇవ్వండి please. తీపి తినకుండా వుండడం నావల్ల అవ్వట్లేదు :(((

ప్రేరణ... said...

పంచదార నిజంగా తగ్గించారా?:) మీ ఆరోగ్యమే మీ ఆయుధం కదా, మంచిదే!

గీతాచార్య said...

పంచదార లేకున్నా పన్ చదార ఉంటే అదే హ్యాపీసు. అన్నట్టు అలా పంచదార ధారాళంగా వాడేవాళ్ళని మావాళ్ళలోనూ చూశాను. నాకెమ్దుకో తీపి మితంగానే అలవాటు. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు బలే అన్నమాట. కాపోతే ఐస్‍క్రీమ్ మాత్రం ఎన్నైనా లాగించేస్తాను.

ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధ నచ్చింది

అడ్డ గాడిద (The Ass) said...

సుగరున్నా తీపి మానాలంటే ఏంటో ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. ఇంత లిస్టిచ్చి నోరూరించినా ఎదురుగ్గా ఐస్క్రీం పెట్టూకుని తినగూడదని శపథం చేసుకుని, చెప్పేవాళ్ళెప్పుడూ చెయ్యరని తినేశాను. ఏమైతే అదైంది. నోరు కట్టేసుకోవద్దని. మీ నిగ్రహానికి జోహార్లు

రాధిక said...

మీ టపా నాకు తెగ నచ్చేసింది.స్వీటు అని పేపరు మీద రాసిచ్చినా రాధిక తినేస్తుందని మావాళ్ళందరూ చెప్పుకుంటారు .మీరు ఏకం గా బొమ్మలతో సహా స్వీటు టపా రాస్తే నచ్చకుండాపోతుందా? :) ఇంట్లో ఏమన్నా స్వీటు వుంటే బేలన్సు కోసం ఆ పూట అన్నం మానేసన్నా స్వీటు తినేస్తాను.ఈ విషయంలో మీరు చాలా గ్రేటు.

తృష్ణ said...

@రాణి: దేముణ్ణి నే నిచ్చేదేమిటండీ..మీరు మరీనూ...
నిజం చెప్పాలంటే డైట్ అస్సలు పాటించని ఇద్దరు పేషంట్లను, దాని వల్ల వారు రకరకాల అనారోగ్యాలతో పడిన నరకయాతననూ చూసిన తరువాత ఆటోమెటిక్ గా నాకు ఆ కంట్రోల్ వచ్చేసిందండీ...

@ప్రేరణ: నిజమేనండీ...ఇప్పుడు కూడా పంచదార లేని టీ తాగుతూ మీకు జవాబు రాస్తున్నా...:)

తృష్ణ said...

@గీతాచార్య: నేను చాలా మందిని చూశాను. ప్రస్తుతం మా అమ్మావాళ్ళు మాత్రం వాడకం కాస్త తగ్గించారు...

"A" గారూ, మొదట్లో అలానే ఉంటుందండీ...ప్రస్తుతానికి సుగర్ గట్రా లేవు కాబట్టి నేనూ అప్పుడప్పుడు తింటాను...కానీ ఆ తర్వాత ఓ రెండు కిలోమీటర్లు నడిచేసి ఆ కేలరీలు ఖర్చు చేసేస్తాను...:)

తృష్ణ said...

@రాధిక : ఓ.. అయితే మీరు ఒకప్పటి నేనేనన్నమాట..) :)

మురళి said...

సుబ్రహ్మణ్య చైతన్య గారు చెప్పినట్టుగా..మేమిద్దరం ఉన్నామండీ.. ప్చ్.. నేనూ తగ్గించాల్సి వచ్చింది.. నో రిగ్రెట్స్ లెండి.. రెండు మూడు జన్మలకి సరిపడే స్వీట్స్ తినేశాగా :):)

నిషిగంధ said...

మీరు మరీను.. జన్మకి లేక రెండు మూడు జన్మలకీ సరిపడా గాలి ముందే పీల్చేసుకుంటామా ఏమిటీ.. స్వీట్సూ అంతే! ఎప్పటిదప్పుడే :)))
కాని మీ నిగ్రహానికి నా జోహార్లు.. నేనూ ఒకప్పుడు రాధిక టైపే.. ఇప్పుడు అదేపనిగా కాకుండా కొంచెం మితం చేశాను.. పైగా నాకు కేక్స్, ఐస్ క్రీంస్ మీద అంత మనసు ఉండదు.. మనదంతా మీరు టపా మొదట్లో ఇచ్చిన సెలెక్షన్.. అసలు ఆ పేర్లు చదువుతుంటేనే నాలుక తీయగా అయిపోతుంది కదా! :-)

తృష్ణ said...

@మురళి:బావుందండీ...
మనింట్లో కరెంట్ పోయినందుకు బాధ కాదు పక్కింట్లో "కూడా" పోతే కదా ఆనందం....అలాగ పర్లేదన్నమాట నాకులాగ మానేసినవాళ్ళున్నారని "తుత్తి"...:)
నేను ఈ జన్మకు సరిపడానేతిన్నాను మీరు రెండాకులు ఎక్కువే తినేసినట్టునారయితే...:)

తృష్ణ said...

@నిషిగంధ: ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఈ టపా చూడలేదేమో.. చూడమని మనవి...
http://trishnaventa.blogspot.com/2009/12/blog-post_31.html

ఇక మీ వ్యాఖ్యలోకి వస్తే...గాలిని రెండు మూడూ జన్మలకు పీల్చుకోలేము...:)
...కానీ తీపి, స్వీట్లు మాత్రం తినగలమండీ...అదేపనిగా పందార,స్వీట్లు తినీ తినీ.....!!కావాలంటే మురళిగారు కూడా రాసారు చూడండీ...:)
కాకపోతే టపా మొదట్లో రాసిన స్వీట్లన్నీ నాకు చాలా ఇష్టం...అప్పుడప్పుడు నిషేధాన్ని ఎత్తివేసుకుని లాగించేస్తూ ఉంటానులెండి...:)

నిషిగంధ said...

Thanks SO much for your wishes.. How rude of me! ముందు మీకు న్యూ ఇయర్ విషెస్ చెప్పకుండా కబుర్లు మొదలుపెట్టేశాను :(

మీకూ, మీ కుటుంబసభ్యులందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

తృష్ణ said...

@నిషిగంధ: Thanks a lot..!

మాలా కుమార్ said...

మీకు వ్యతిరేకము మా ఇంట్లో . మా అత్తగారింట్లో మీలాగానే అన్నింట్లో పంచదార వేసేవారు , చివరకు ఉత్తపప్పు లో కూడ . మా ఆడపడుచులు పంచదార లేకుండా పెరుగన్నం అస్సలు తినేవారు కాదు . అందుకే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు , మా అత్తగారు పంచదార ,పొట్లములో కట్టుకొని కొంగుకు ముడేసుకొని తీసుకెళ్ళేవారు . అక్కడ ఎవరూ చూడకుండా పిల్లల అన్నం లో కలిపేవారు . మళ్ళీ ఎవరైనా చూస్తే నవ్వుతారని మొహమాటం మరి .

భావన said...

బావున్నాయి పందార కబుర్లు. నేను అంత పందార ఫేన్ ను కాదు కాని మీరు చెప్పిన స్వీట్స్ వింటుంటే మాత్రం తినబుద్ది అవుతోంది మళ్ళీ మీ హెచ్హరిక చూస్తే ఆగ బుద్ది అవుతోంది. :-)