సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, January 7, 2010

ఇక కావలసినదేమి...


వాగ్గేయకారుల్లో నాకు అత్యంత ఇష్టమైన "త్యాగయ్య" గురించి ప్రత్యేకం చెప్పటానికేముంది? పొద్దున్నే ఆయన కృతులు వింటుంటే ఈ కృతిని బ్లాగ్లో రాయాలనిపించింది..."బోంబే సిస్టర్స్"(సరోజ,లలిత)పాడిన కృతి వినటానికి పెడుతున్నను...




త్యాగరాజ కృతి, బలహంస రాగం, ఆది తాళం :

పల్లవి
: ఇక కావలసినదేమి మనసా సుఖముననుండవదేమి

అనుపల్లవి
: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథుడు
అంతరంగమున నెలకొనియుండగ (ఇక)

చ1: ముందటి జన్మములను జేసినయఘ బృంద విపినముల-
కానంద కందుడైన సీతా పతి నందక యుతుడైయుండగ (ఇక కావలసిన)

చ2
: కామాది లోభ మోహ మద స్తోమ తమమ్ములకును
సోమ సూర్య నేత్రుడైన శ్రీ రామచంద్రుడే నీయందుండగ (ఇక కావలసిన)

చ3: క్షేమాది శుభములను త్యాగరాజ కామితార్థములను
నేమముననిచ్చు దయా నిధి రామభద్రుడు నీయందుండగ (ఇక కావలసిన)


త్యాగరాజ కృతికి అర్ధాన్ని రాసేంతటి గొప్పదాన్ని కాదు కానీ నాకు అర్ధమైన అర్ధాన్ని కూడా రాయటానికి సాహసించాను...

అర్ధం:

ఓ మనసా, ప్రశాంతంగా ఎందుకుండవు? ఇంకేమికావాలి నీకు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే నీ మనసునందు నిండి ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఆనందకారకుడైన శ్రీరాముడు తన నందక ఖడ్గంతో పుర్వ జన్మలందు చేసిన పాపారణ్యములను నాశనం చేయటానికి సిధ్ధముగానుండగ ఇంకేమి కావాలి నీకు?

నీలోని కామము,లోభము,మదము,మోహమూ మొదలైన అంధకారములను తొలగించటానికి, సూర్య చంద్రాదులను తన నేత్రాలలో నింపుకున్న శ్రీరామచంద్రుడు నీలో కొలువై ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఈ త్యాగరాజాశించెడి క్షేమాది శుభములను నీకొసగ గలిగిన దయానిధి అయిన శ్రీరామభద్రుడు నీలో ఉండగా ఇంకేమి కావాలి నీకు?
ఓ మనసా....

14 comments:

R Satyakiran said...

Aura!.... aascharyam!!! :-?

Nuvvena... idi nuvvena...

తృష్ణ said...

@ki:హమ్మా! అదేమరి....ఇది నేనే...ఎం టివీ ఏమీ భక్తి చానల్ లా మారిపోలేదు...
మైఖేల్ జాక్సన్, మార్క్ ఆంటోనీ, ఎన్రిక్ లనే కాదు...త్యాగరాజ కీర్తనలు కూడా వింటాను నేను...:)

సుజాత వేల్పూరి said...

తృష్ణా, కంగ్రాట్స్! ఇదీ మీ నుంచి నేను ఎదురు చూసింది. థాంక్యూ!

తృష్ణ said...

@సుజాత:ఇంకా ఇంకా చూస్తారు...తృష్ణ నుంచి బయటకు రావాల్సినవి చాలా ఉన్నాయి...

జయ said...

మంచి కీర్తన ఇది. అందరూ ఇష్టపడేది. త్యాగరాజ కీర్తనలు ఒకదాన్ని మించి ఒకటి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అన్ని వేల కీర్తనలూ వినేయాలనిపిస్తుంది.

Sujata M said...

మేమూ ఎదురు చూస్తున్నాం ! మీరు ఇంకా ఇదే 'ఇది' తోటి ముందుకు పోవాలి!

మీక్కూడా చాలా 'హేపీ న్యూ ఇయర్ !'


వివరణ చాలా బావుంది. కీర్తన విన్లేదు. మళ్ళీ తీరిక చూస్కుని వింటాను.

శ్రీలలిత said...

త్యాగరాజకీర్తనలు వింటుంటే మన పక్కన మన మేలుకోరేవారు కూర్చుని హితవు చెపుతున్నట్టు, ప్రేమ పంచుతున్నట్టు, భక్తి పారవశ్యం కలుగజేస్తున్నట్టూ వుంటుంది. మంచి కీర్తన. అర్ధం బాగా చెప్పారు. వినడానికి కూడా బాగుంది..నేను divshare కి వెళ్ళి download చేసుకుని విన్నాను. చాలా బాగుంది.

ప్రేరణ... said...

వివరణ చాలా బాగుందండి!

SRRao said...

తృష్ణ గారూ 1
' ఇక కావలసినదేమి....' మాకు, ఇలాంటి మంచి కీర్తనలు వినిపిస్తానంటే ! కాకపోతే మీ బ్లాగులో ప్లే కావటంలేదు. డౌన్లోడు చేసుకుని వినాల్సి వస్తోంది. ఎందుకో మరి !

తృష్ణ said...

జయగారూ, నిజమేనండీ...త్యాగరాజ కీర్తనలన్నీ జీవన సారాన్ని నింపుకున్న అద్భుత గుళికలు అనుకుంటూ ఉంటాను నేను విన్నప్పుడల్లా...

సుజాత, కీర్తన ఎందుచేతో ప్లే అవటం లేదండీ..వేరే మార్గమ్ చూస్తాను...చాలా థాంక్స్....!

తృష్ణ said...

@శ్రీలలిత: ఇదే మొదటి ప్రయత్నం అండీ...ఇంకొన్ని ప్రయత్నించాలని అభిలాష...డౌన్లోడ్ మార్గం చెప్పి మంచి పని చేసారు. ప్లే అవటం లేదు ఎలాగా అని నేననుకుంటున్నాను...ధన్యవాదాలు.

@ప్రేరణ: ధన్యవాదాలు.

తృష్ణ said...

@SR rao:అది సరి చేసే ప్రయత్నంలోనే ఉన్నానండీ...ధన్యవాదాలు.



ఈ నా మొదటి ప్రయత్నానికి ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలందించిన బ్లాగ్మిత్రులందరికీ కృతజ్ఞతలు.

కొత్త పాళీ said...

"ఇంతకన్నానందమేమీ?" :)

తృష్ణ said...

కొత్తపాళీ: మీ వ్యాఖ్య కన్నా ఆనందమేమి.....:)
ధన్యవాదాలు.