సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, April 10, 2019

Old wine in new bottle




మంచి కథలు ఎక్కడ నుంచి పుడతాయి? ఊహల్లోంచి పుట్టే కథలు బావుంటాయి కానీ కొన్నాళ్ళకి మర్చిపోతాము. వాస్తవంలోంచి పుట్టిన కథలు మాత్రం మనసుకి హత్తుకుంటాయి. ఎన్నాళ్ళైనా మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మంచి కథలు కావాలంటే మన చుట్టూ వందల కొద్ది దొరుకుతాయి. సమాజాన్నీ, జీవితాలనీ, మనుషులనీ దగ్గరగా గమనిస్తే వందల ఉదాహరణలు దొరుకుతాయి కథలు పుట్టించడానికి. 

ఒక సినిమా కోసం మంచి కథ, మనసుని కదిలించే కథ, గుర్తుండిపోయే కథ కావాలంటే జీవితాల్లో వెతుక్కోవాలి. మన చుట్టూ వెతుక్కోవాలి. అప్పుడా కథలు కలకాలం నిలుస్తాయి. మంచి కథని పాత సినిమాల్లో ఎందుకు వెతుక్కుంటారో నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. పాత కథల్ని అటు తిప్పీ, ఇటు తిప్పీ, మనుషులనీ, పరిస్థితులనీ మార్చేసి, మసి పూసి మారేడు కాయ చేసేసి ఇది కొత్త కథ, ఉత్తమైన వాస్తవికమైన కథ అని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? పోనీ ఫలానా సినిమా నాకు ఇస్పిరేషన్, ఫలానా కథ నాకు చాలా ఇష్టం, అలాంటి కథ తీయాలనే ప్రయత్నమిది అని కూడా చెప్పరు.

కొన్నేళ్ల క్రితం ఒకానొక మహానుభావుడైన దర్శకుడు తీసిన మరపురాని చిత్రరాజం "సాగరసంగమం"!  కాస్త కథనీ, కొన్ని పాత్రలనీ మార్చేసి అదే కథని మళ్ళీ సినిమాగా తీస్తే అది గొప్ప సినిమా అయిపోతుందా? ఈ కథ తెలియని నేటి తరం ప్రేక్షకులు ఉన్నరేమో కానీ ఆ చిత్రాన్ని మర్చిపోని ప్రేక్షకులు ఇంకా ఉన్నారు.  ఆ చిత్రరాజం గుర్తున్న నాలాంటివాళ్లం ఈ చిత్రాన్ని ఒక గొప్ప చిత్రం అని ఒప్పుకోలేము. గొప్ప కథేమో, మరో గొప్ప చిత్రమేమో అని ఆశపడిపోయి, తీరా సగమన్నా చూడకుండానే ఇది అదే కదా అని గుర్తుకొచ్చేస్తే ఎంత నిరాశగా ఉంటుందో.. !!!! కొత్త ఒరవడిని సృష్టించే సత్తా ఉంది అనుకున్న కొత్త దర్శకులు కూడా ఇలా చేస్తే ఇంకా బాధ వేస్తుంది!!

అవే అవే పాత కథల్ని వెనక్కీ, ముందుకూ తిప్పి లేక రెండు మూడు పాత సినిమాలని కలిపేసి ఒక కొత్త వంట వండడం. ప్రతి కొత్త చిత్రానికీ ముందర మాదో విభిన్నమైన కథ, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని గొప్ప కథ అని ప్రచారం చేస్తారు. తీరా చూస్తే ఎనభై శాతం కథలు ఏదో పాత చింతకాయ పచ్చడికో , మాగాయ పచ్చడికో కొత్త పోపు. అంతే. ఎందుకిలా? అసలు కొత్త కథలు ఎందుకు పుట్టవు? ఒక్క క్షణం ఆగి పరికిస్తే మన చుట్టూ ఎన్నో కథలు కనిపిస్తాయి! సమాజంలో ఎన్నో సమస్యలు. ఎన్నో ప్రేరణాత్మకమైన ఉదంతాలు. 

సినిమా సరదాగా ఉండాలి. ఆటవిడుపుగా ఉండాలి. నిజమే. కానీ అది ఒక పవర్ఫుల్ మీడియా. దానిని కేవలం ఒక వినోదాత్మకమైన మాధ్యమం గా మాత్రమే కాకుండా దానిని ఒక సందేశాత్మక మాధ్యమం లాగ ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో, పాత తరం దర్శకులలా చిత్రాలు తయారుచేస్తే చాలా బావుంటుంది. భావితరాలు బాగుపడతాయి.