సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, April 19, 2019

అల్లం శేషగిరిరావు కథలు




సమకాలీన సామాజిక పరిస్థితులను, జీవితాలనీ ముందు తరాలకు అద్దం పట్టి చూపించే ఉత్తమ సాహితీ ప్రక్రియ కథానిక. తెలుగు కథానిక ఎందరో కథకుల చేతుల్లో ఎన్నో రూపాంతరాలను చేందుతూ వందేళ్ళ మైలు రాయిని కూడా దాటి ఇంకా మున్ముందుకు పయనిస్తోంది. ఇటువంటి సుదీర్ఘ ప్రయాణంలో కొందరు ఉత్తమ కథకులు తమ కలాల ద్వారా సమాజానికి అందించిన స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ ప్రతి తరానికీ పరిచయం చేయాలనే సదుద్దేశంతో సమాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తూ ’అరసం’ గుంటూరుజిల్లా శాఖవారు, ప్రముఖ కథకుల ప్రసిధ్ధ కథానికలను సమర్ధులైన సంపాదకులచే ఎంపిక చేయించి "కథాస్రవంతి"  శీర్షికతో పలు కథాసంపుటాలు ప్రచురించారు. వాటిలో ఒక కథాసంపుటి "అల్లం శేషగిరిరావు కథలు". జనవరి,2015 ప్రచురణ.


విలక్షణమైన శైలితో,అరుదైన కథావస్తువుతో రచనలు చేసిన శేషగిరిరావు గారు 17 కథలు, ఒక రేడియో నాటిక రాసారు. "శబ్దాన్ని అక్షరీకరించడం, నిశ్శబ్దాన్ని దృశ్యీకరించడం" తెలిసిన ఆయన తెలుగు హెమింగ్వే గా ప్రసిధ్ధిగాంచారు. వీరి కథలు ఇంగ్లీషు, మళయాళం, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి. ’అరణ్యఘోష ’, ’మంచి ముత్యాలు’ వీరి కథా సంపుటాలు. "బాధతో, భయంతో, బాధ్యతతో" రచించిన శేషగిరిరావుగారి కథలు మనిషికి మనిషి చేసే అన్యాయానికి దర్పణాలు. వీరికి 1981 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, నూతలపాటి గంగాధరం స్మారకసాహిత్య పురస్కారం లభించాయి. 



ఈ సంకలనంలో ప్రిన్స్ హెమింగ్వే, వఅడు, ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్, చీకటి, నరమేథం, శిధిల శిల్పాలు.. మొత్తం ఆరు కథనికలు ఉన్నాయి. అన్నీ కూడా చాలావరకూ వేట కథలే. వేటకథలు అల్లంవారి ప్రత్యేకత.  "ఎడిటర్లూ, స్నేహితులూ అంతా అడవి నేపథ్యంలోనే కథలు రాయమంటే రాస్తూ అలా ముద్రపడిపోయాననీ, ఆ ముద్రను కాపాడుకోవడం కోసం రాత్రిపూట కొండల్లో, చిట్టడవుల్లో తిరుగుతూ నానా యాతనలూ పడుతున్నానని” హాస్య ధోరణిలో రచయిత తనకు తెలిపిన వైనాన్ని పుస్తకం ముందుమాటలో ఏ.ఎన్.జగన్నాధశర్మ గారు తెలిపారు. ఈ కథలన్నీ కూడా సమాజంలోని కొన్ని అట్టడుగు వర్గాల జీవనవిధానాలను, వారి కన్నీళ్ళను, వేదనలనూ కళ్ళకు కట్టినట్టు చూపెడుతూ ఒక రకమైన ఆర్ద్రతతో మనసును కమ్మేస్తాయి. సామాజిక వ్యంగ్యానికి నిదర్శనమనిపించే "నరమేథం" కథలో ఒక నిరుపేద ఢక్కువాడి జీవితం, వాడి ఆకలి, నిస్సహాయపు చావు గుండెల్ని పిండేస్తాయి.  "నరనారాయణుల ధన,మాన ప్రాణాల రక్షణకి సాయుధులైన పోలీసులు తుపాకులతో గుడిని గస్తీ కాస్తున్నారు" అనే వాక్యం వాడిగా తగులుతుంది.



చిత్రోపమమైన "వఅడు" కథలో ప్రతి సన్నివేశం ఒక దృశ్యాన్ని మన:ఫలకంపై నిలబెడుతుంది. అధికారుల కోపాలకి, చికాకులకీ చిరుఉద్యోగస్థులు ఎలా అన్యాయంగా బలౌతూ ఉంటారో తెలిపే కథ ఇది. ప్రధాన పాత్రధారి ’మిలట్రీ మాన్ ’ చిన్నయ్య చాలా కాలం గుర్తుండిపోతాడు. ఇలాంటి చిన్నయ్యలు ఓ పది మంది ఉంటే చాలు సమాజం ఎంతగా బాగుపడగలదో కదా.. అనిపించకమానదు. ఈ కథానిక దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్ లో "దర్పణ్" సిరీస్ లో బాసు ఛటర్జీ దర్శకత్వంలో సింగిల్ ఎపిసోడ్ గా ప్రసారమైంది. అంతేకాక రంగస్థల నాటకంగా మలచబడి 2000 లో నంది నాటకోత్సవాలలో వెండి నంది బహుమతిని పొందటమే కాక పలు పరిషత్ పోటీలలో ఉత్తమ ప్రదర్శనా బహుమతులందుకుని ప్రేక్షకాదరణ పొందింది.



"ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్" కథలో పులి వేట కోసం విశ్వాసపాత్రుడైన తన నౌకరునే ఎరగా వాడుకునే కర్కోటకుడైన కనకరాజు పాత్ర మనుషుల్లో పెరిగిపోతున్న నిర్దయతకు ప్రతికృతి. అటువంటి వంచన మొదటికే మోసాన్ని తెస్తుందన్న సత్యాన్ని చిట్టిబాబు మృతి ద్వారా తెల్పుతారు రచయిత.



ఈ కథాసంపుటిలో ఎక్కువగా ఆకట్టుకుని, చదివిన చాలాకాలం వరకూ పాఠకుల్ని ఆలోచనల్లో ముంచివేసే ఆర్ద్రమైన కథ "చీకటి". "వంశీకి నచ్చిన కథలు" కథాసంకలనంలోనూ, "కథానేపథ్యం" పుస్తకం లోనూ ఈ కథ చదివిన మీదట మూడోసారి సుపరిచితమైన పాత మిత్రుడిలా పుస్తకంలో పలకరిస్తుందీ కథానిక. తానా ప్రచురణల వారి "కథానేపథ్యం" లో ఈ కథ రాయడం వెనుక గల కథాకమామిషులను ఆసక్తికరంగా చెప్తారు శేషగిరిరావు. ఒక ఏజన్సి ప్రాంతంలో రచయిత పనిచేసినప్పుడు ఒక రిటైర్డ్ పెద్దాయన చెప్పిన విషయాల ఆధారంగా ఈ కథ రాసారుట. దానికి మూలం కూడా అతను చెప్పిన ఒక చిన్న సంఘటన. ఆ చిన్న సంఘటన నేపథ్యాన్ని ఈ కల్పిత కథకు జోడించాననీ శేషగిరిరావు చెప్తారు. వేట నేపథ్యంతో సాగే ఈ కథలో ప్రధానపాత్రధారి డిబిరిగాడు. పెంపుడు కొంగ నత్తగొట్టుని చెంకన పెట్టుకు తిరుగుతూ, అరవై దాటి  వయసు ముదురినా ఒడిలిపోని శరీరంతో, అడవి జంతువులా తీక్షణంగానూ, పరిశీలనగానూ ఉన్న చీపికళ్ళతో ఉండే డిబిరిగాడు నక్కలోళ్ళనే సంచార తెగకు చెందినవాడు. ఇటువంటి కొన్ని సంచార తెగల తాలూకూ జీవనవిధానాల గూర్చి కూడా చక్కని సమాచారం కథలో దొరుకుతుంది. రచయిత యొక్క సునిశితమైన పరిశీలనా దృష్టిని ఈ కథలోని ప్రతి వాక్యమూ తెల్పుతుంది. బాతుల వేటకై బయల్దేరిన ఇద్దరు అపరిచితుల కలయిక, విరుధ్ధమైన వారి జీవననేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలూ తెలిపుతుందీ కథ. కథలో డిబిరి గాడి జీవనగాధ విన్నప్పుడు సంచార తెగల జనజీవితం ఇంత దుర్భరంగా, హృదయవిదారకంగా కూడా ఉంటుందా.. అని దిగ్భ్రాంతి కలుగుతుంది. డిబిరిగాడి అవతారం గురించిన వర్ణన, అతడు ఎదుర్కొన్న సమస్యలు, పడిన బాధలూ వింటున్న వర్మ తో పాటు పాఠకుల రోమాలూ నిక్కబొడుచుకుంటాయి. కథ చదివిన చాలారోజుల వరకూ డిబిరిగాడి ఆకారం కలల్లో, ఆలోచనల్లో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.