"కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం
ఓడద్దు అంటే లేదు యుద్ధం
లేకుంటే కష్టం హాయి వ్యర్థం
ఎవరి కోసం మారదద్దం "
చిత్రాన్ని చూసి వారం అవుతున్నా ఇదే పాట పదే పదే అప్రయత్నంగా హమ్ చేస్తున్నాను.
"ఓటమెరుగని ఆట కనగలరా...." పల్లవితో కృష్ణకాంత్ రచించిన ఈ పాట చాలా బావుంది. వెరీ ఇన్స్పిరేషనల్! కానీ డబ్బింగ్ పాటకి లిరిక్స్ రాసినట్లు పొందిక సరిగ్గా కుదరలేదు. నాలుగుసార్లు వింటే గానీ కొన్ని వాక్యాలు తెలీట్లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో అనుకుంటా ఈయన రాసిన ఇంకో పాట "నువ్వంటే నా నువ్వు" పాట కూడా చాలా బావుంటుంది.
ఈ చిత్రాన్ని గురించి వెంఠనే రాయాలనిపించినా... రాద్దామా వద్దా అనే మీమాంసలో ఉండగానే నిన్న మరో మంచి సినిమా చూడడం జరిగింది. ఇక ముందర మన తెలుగు సినిమా గురించి రాయకుండా ఎలా అని మొదలుపెట్టాను. ఈమధ్యన రెండు, మూడు తెలుగు చిత్రాలు చూశాకా, తెలుగులో మంచి సినిమాలు వచ్చేస్తున్నాయి అని బోలెడు ఆనందం కలిగింది. హీరో గారు కాలు నేల కేసి కొట్టగానే భూకంపాలూ, ఒక్క గుద్దు గుద్దగానే మైలు దూరం వెళ్ళి పడడాలు, గాల్లోకి బళ్ళు ఎగరడాలు.. హీరోలు మారినా అవే దృశ్యాలు ఏళ్ల తరబడి తీసీ, తీసీ వీళ్ళకి విసుగెత్తదా అనిపించేది. కాస్త ట్రెండ్ మారుతోందని ఇన్నాళ్ళకి గట్టిగా అనిపిస్తోంది. నాని టాలెంట్ కి సరిపోయే చిత్రం ఇన్నాళ్లకు వచ్చింది. పాత్రలో నటుడిని కాకుండా పాత్రని చూడగలిగినప్పుడే కదా సత్తా బయటపడేది. జెర్సీ లో "అర్జున్" మాత్రమే కనిపిస్తాడు. ఏవరిదైనా యదార్థ గాథేమో అనిపించే ఈ పాత్రని ప్రేమించకుండా అసలు ఎవ్వరూ ఉండలేరు. అందుకే ఈ వేసవిలో వర్షంలాంటి ’జెర్సీ ’ మనసు దోచేసింది. దర్శకుడి రెండవ ప్రయత్నం కూడా బావుంది. హ్యాట్రిక్ కోసం ఎదురుచూడాల్సిందే!
ఇది ఒక ఆటగాడి కథ అనేకన్నా, ఒక తండ్రీ కొడుకుల కథ అనాలి. తండ్రీ కొడుకుల మధ్య చూపెట్టిన ప్రతి సన్నివేశం అపురూపంగానే ఉంది. జెర్సీ కొనలేకపోయిన తండ్రికి తాను బాధపడడం లేదని కన్విన్స్ చేయడం కోసం పిల్లాడు చెప్పిన మాటలు, అల్మారాలో పోస్టర్ మార్చినప్పుడు చెప్పే మాటలు,
"ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయనిది నా కొడుకొక్కడే. వాడికి మా నాన్న ఉద్యోగం చేస్తాడా, డబ్బులు సంపాదిస్తాడా, సక్సెస్ఫుల్లా? ఫెయిల్యూరా?ఇదేం సంబంధం లేదు? వాడికి నేను నాన్న !! అంతే." అనే డైలాగ్ విన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఛారిటీ మ్యాచ్ అయ్యాకా కొడుకు చేతులెత్తి అప్లాస్ చెప్తూంటే అర్జున్ మొహంలో కనబడ్డ ఆనందం వర్ణనాతీతం!
ఇంకా -
"మా ఇంట్లో ఒకళ్ల మీద ఒకళ్ళం అరుచుకోవడం ఉండదు, నేనే అరుస్తాను. నేనే బాధపడతాను. నేనే ఏడుస్తాను"
"అర్జున్ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు.. సక్సెస్ అవ్వలేకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది"
ఇలా.. చాలా బావున్న డైలాగ్స్ బోలెడున్నాయి.
అర్జున్ ని "బాబూ.." అని హీరోయిన్ పిలవడం భలే తమాషాగా ఉంది. కొన్ని సీన్స్ కూడా బాగా గుర్తుండిపోతాయి.
* రైల్వే స్టేషన్ లో అరవడం ఐడియా చాలా బావుంది. ఎప్పుడైనా ప్రయత్నించచ్చు.
* "అమ్మ అడిగితే నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు" అని అర్జున్ కొడుకుని అడిగే సీన్ !
* లేడీ జర్నలిస్ట్ కి ఆమె ప్రేమికుడిని వదలద్దని చెప్పే సీన్.
* "మా నాన్న సంకల్పం ఎంత గొప్పదంటే.." అంటూ చివరలో అర్జున్ కొడుకు చెప్పే స్పీచ్.
ఎనభైల్లో కథ అని చెప్పడమే కాక ప్రతి సీన్ లోనూ సెట్టింగ్స్ కూడా చాలా ఏప్ట్ గా వేశారు. ఒక సీన్ లో గోడ దగ్గర బల్ల మీద పాత కాలంనాటి సింగిల్ స్టీరియో టేప్ రికార్డర్. అతి మామూలు సాదా సీదా ఇల్లు. చివరి సీన్ లో గ్రూప్ ఫోటో కోసం తంటాలు పడడం చూస్తే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. సెల్ఫీలు తీసుకోవడం ఎలా అనే కోర్సుల్లో చేరుతున్న నేటి తరాలవారికి ఆనాటి మధుర జ్ఞాపకాలు ఎలా అర్థమౌతాయి. ఐదొందలు సంపాదించాలని అర్జున్ పడే పాట్లు డబ్బుకి విలువే తెలియని ఈతరం యువతకి అర్థమౌతుందా? అనిపించింది. కష్టం తెలీకుండా, కాలు కిందపెట్టనివ్వకుండా, అపురూపంగా పెంచేస్తున్నారు పిల్లల్ని చాలామంది. రూపాయి రూపాయికీ వెతుక్కుని, చెమటోడ్చి సంపాదించినవాళ్ళకే రూపాయి విలువ, మనిషి విలువ తెలుస్తాయి. కష్టపడితేనే సుఖం విలువ అర్థమౌతుంది.
కారణాలు ఏవైనా, పని ఎలాంటిదైనా, ఒక ఇష్టమైన పని చేయడం ఆపేస్తే మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా బాగా చూపెట్టాడు దర్శకుడు! భార్య ఎంత తిడుతున్నా స్పందన లేకపోవడం, ఏ పనినీ ఆసక్తిగా చెయ్యలేకపోవడం, కరెంట్ బిల్లు డబ్బుతో నిర్లక్ష్యంగా పేకాట ఆడడం మొదలైనవి చూసి ఈ పాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నాడీ దర్శకుడు? అని ఆశ్చర్యపోయాను. స్టేడియంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించిన కట్టప్పగారితో "ఈ లోకంలో తప్ప బయట బతకలేనని అర్థమైంది సార్" అన్నప్పుడు నాకు అర్థమైంది ఈ పాయింట్ ని స్ట్రెస్ చెయ్యాలని ఆ క్యారెక్టర్ ని అలా చూపించారన్న మాట అని!
కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి. పుస్తకం అచ్చైన తర్వాతే ఎందుకు జెర్సీ పంపారు? అన్నేళ్లదాకా క్రికెట్ బోర్డ్ వాళ్ళు అర్జున్ కుటుంబాన్ని కాంటాక్ట్ చెయ్యలేదా? ఏ ఆటలో అయినా ఆటగాళ్లకు మెడికల్ టెస్ట్ లు అవీ చేస్తారు కదా.. మరి అర్జున్ కి హార్ట్ ప్రాబ్లం ఉందని ఆ మెడికల్ టెస్ట్స్ లో తెలియలేదా? తెలిస్తే అన్ని మ్యాచ్ లు ఎలా ఆడనిచ్చారు? మొదలైన సందేహాలు! ఆట మానేసాడన్న సంగతి మొదటిసారి విన్న అతడి భార్య, మిగతా సన్నిహితుల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉండి ఉండచ్చేమో!
చివరాఖరి సందేహం ఏమిటంటే - ఈ పాత్రని నాని కాకుండా ఎవరో కొత్త వ్యక్తి, ఇంతే బాగా నటించినా కూడా చిత్రాన్ని ఇలానే ఆదరించేవారా?? అని :)