దూరదర్శన్ మాత్రమే ఏకఛత్రాధిపత్యం వహించిన ఎనభై దశకంలో ఎందరో నటీనటులు ప్రాంతీయ, భాషాభేదం లేకుండా మనలో చాలా మందికి ఆప్తులుగా మారిపోయారు. నిజజీవితానికి, ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టేలా ఉండేలాంటి అప్పటి టీవీ సీరియళ్ళు కొన్ని ఇప్పటికీ మన మనసుల్లో బంగారపు ఇళ్ళు కట్టుకుని ఉండిపోయాయి.
హిందీ భాష నేర్పడం నుంచీ మొదలుపెట్టి, ఎంతో విజ్ఞానాన్ని అందించిన అప్పటి దూరదర్శన్ గురించి అసలు ఒక ప్రత్యేకమైన టపానే రాయాలి. కానీ ప్రస్తుతానికి నన్ను కదిలించిన నిన్నటి వార్త గురించి నాలుగు మాటలు - నటుడు సతీష్ షా మరణం! చిన్నప్పుడు "ఏ జో హై జిందగీ" అని ఒక సిరీస్ వచ్చేది. షఫీ ఇనాందార్, స్వరూప్ సంపత్ అందులో ముఖ్య పాత్రలు. ఆ సీరియల్ లో ఒక్కో ఎపిసోడ్ కీ ఒక్కో పాత్రలో సతీష్ షా కనిపిస్తారు. బొద్దుగా, అందంగా ఉండే ఆయన రూపం కూడా చూడగానే చిరునవ్వు తెప్పిస్తుంది. హాస్య నటుడిగా ఆయనది ఒక ప్రత్యేకమైన రీతి. బుల్లి తెరపై గానీ, వెండితెరపై గానీ సతీష్ షా కనిపించగానే సీరియస్ గా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా నవ్వులు పూస్తాయి. పోషించినవి లీడ్ రోల్స్ కాకపోయినా, చిన్న పాత్రలే అయినా, కొందరు ఉత్తమ నటులు మనసుకి దగ్గరగా ఉండిపోతారు. అందులో హాస్య నటులు మరీనూ. 'జానే భీ దో యారో' మొదలుకొని ఎన్నో సినిమాల్లో ఆయన పోషించిన హాస్య పాత్రలు చిరస్మరణీయం.
హాస్యనటులు అంటే నాకు మొదటి నుంచీ చాలా అభిమానం. ఎందుకంటే హాస్యం పండించడం తేలికైన పనేమీ కాదు. సీరియస్ రోల్స్ కూడా బాగా చెయ్యగలిగే కొందరు పెద్ద నటులు కూడా తెరపై హాస్యరసాన్ని సరిగ్గా పండించలేరు. అదీకాక మనిషిని ఆహ్లాదపరిచేదీ, మనసుని తేలికపరిచేది హాస్యమే. ఎప్పుడైనా బాగా చిరాకుగా ఉన్న ప్రతిసారీ నేను పాత బ్లాక్ అండ్ వైట్ రమణారెడ్డి, రేలంగీ హాస్యాన్ని చూస్తూ ఉంటాను. రిలాక్సింగ్ కి అంతకు మించిన మందు లేదనిపిస్తుంది నాకు. హాయిగా గట్టి గట్టిగా నవ్వేస్తే మనసు తేలికైపోతుంది. హాస్యానికి అంత పవర్ ఉంది. మనల్ని మనసారా నవ్వుకునేలా చేసే ప్రతి హాస్యనటుడూ ఒక గొప్ప మెజీషియన్ తో సమానం.
విలక్షణ హాస్యనటుడు సతీష్ షా కు నా హృదయపూర్వక శ్రధ్ధాంజలి.

No comments:
Post a Comment