సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, March 15, 2019

ఆత్రుత







లిటరల్  గా లాప్టాప్ పై పేరుకున్న దుమ్ముని గుడ్డముక్కతో తుడిచి, ఈ అక్షరాలు రాయడం మొదలుపెట్టాను. ఉదయం నుంచీ మనసులో తిరగాడుతున్న భావాలను అక్షరాలుగా మార్చాలన్న ఆత్రమే దానికి కారణం. క్రింద ఫ్లోర్ లో జరిగిన సహస్రనామ పారాయణ పూర్తయి ఇంట్లోకి అడుగుపెట్టగానే నా కోసం ఎదురుచూస్తున్న కొరియర్ ని చూడగానే ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం కలిగింది. 19-27 మధ్య అంటే నెక్స్ట్ వీక్ లో రావాల్సిన పుస్తకం అప్పుడే వచ్చేసింది. ఇదివరకూ కష్టపడి బస్సుల్లో కాసేపూ, కాలినడకన కాసేపూ వెళ్ళి, నాలుగైదు షాపుల్లో వెతికితే కావాల్సిన పుస్తకాలు దొరికేవి. ఇప్పుడు కేవలం ఫోన్ లో ఓ బటన్ నొక్కితే చాలు కావాల్సిన పుస్తకం ఇంటికొచ్చేస్తోంది. ఎంత హాయో! కానీ చదవడానికి సమయం ఏదీ? చదవాలని గత కొన్నేళ్ళుగా కొంటున్న రెండు, మూడు వందల పుస్తకాలు అలా క్యూ లో నిలబడి ఉండగా... మధ్యలో ఎప్పుడో మూడేళ్ల క్రితమేమో నా reading genre మారిపోయింది. సొంత సంపాదనతో కొంటున్నానన్న ఇష్టం వల్లనో, నేను దృష్టి పెట్టిన కొత్త సాహితీ ప్రకియపై ఉన్న మక్కువ వల్లనో ఆర్డర్ చేసి తెప్పించుకున్నవి చాలా వరకూ చదివేస్తున్నాననే చెప్పాలి. ఇప్పుడసలు పాత పుస్తకాలపై ధ్యాస పోవట్లేనే లేదు. నా సాహితీ తృష్ణ కేవలం నా కొత్త సాహితీ ప్రకియపైనే స్థిరంగా నిలిచిపోయింది. ఎందుకో ఇవన్నీ కొన్నాను.. ఇప్పుడిక ఏం ఉపయోగం నాకివి? అనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి.  గతమంతా నిరర్థకం, నేటి ఉనికే యదార్థం! అనే స్థితికి చేర్చిన ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞురాలిని. కానీ పాత పుస్తకాల్లో చాటిచెప్పాల్సిన కొన్ని ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు ఉన్నాయి. సమయం అనుకూలిస్తే వాటి గురించి రాయాలనే సంకల్పం మాత్రం ఉంది.

ఇంతకీ అసలు చెప్తున్న కథ నాకు వచ్చిన కొత్త పుస్తకం గురించి కదూ.. ఆత్రంగా చదవాలని కవర్ కట్ చేసి పుస్తకం బయటకు తియ్యగానే, ఈమధ్య నాలో బలంగా ఏర్పడిన ఒక లక్ష్యం కళ్లముందు కనబడగానే ఎంతో ఆనందం. ప్రేమగా అట్టని తడిమాను. పేజీలు కాస్త అటు ఇటు తిప్పేసరికీ భోజనాల టైమైంది. తినేస్తే హాయిగా పుస్తకం చదువుకోవచ్చు కదా అని గబగబా ఆ పని పూర్తి చేసి, అంట్లు పెడదామని బాల్కనీ లోకి వెళ్లగానే మిషన్లో ఆరిన బట్టలు కనబడ్డాయి. అయ్యో ఇవి ఆరెయ్యనేలేదు అనుకుని గబగబా ఆపని చేసి, బకెట్టు పెట్టేద్దామని బాత్రూమ్ లోకి వెళ్లగానే పొద్దున్నే మిషన్ లో వెయ్యకుండా అతి ప్రేమగా నానపెట్టిన తెల్ల బట్టలు కనబడ్డాయి. చచ్చాన్రా దేవుడా అనుకుని గబగబా అవి ఉతికి ఆరేసి లోపలికి వస్తూంటే నిన్న బయటకు వెళ్తూ వెళ్తూ మడతపెట్టకుండా కుర్చీలో పాడేసిన నిన్నటి బట్టల కుప్ప దీనంగా పిలిచింది. లాభంలేదు అనుకుని అవన్నీ మడతలు పెట్టి, అలమార్లలో సర్దేసి హాల్లోకి వచ్చేసరికీ సోఫాలో మావిడల్లం కవర్ కోపంగా చూసింది. క్రితం నెల్లో హార్టీకల్చర్ ఎక్స్పో లో ఎంతో మోజుతో కొన్న అరకేజీ మావిడల్లం! పచ్చడి చేద్దామని ఇప్పటికి నాలుగుసార్లు ఫ్రిజ్ లోంచి తియ్యడం, టైమ్ లేక సాయంత్రమో రాత్రో తిరిగి ఫ్రిజ్ లో పెట్టేయడం. మావిడల్లం కొన్నప్పుడు తాజాది కావడం వల్ల ఇంకా బాగుంది. లేకపోతే ఎండిపోయేదే. ఇవాళన్నా పచ్చడి చేసేయాలి అని దాని పని పట్టాను. ఈలోపూ పనిమనిషి వచ్చే టైమైపోయి, తను వచ్చేసింది. తను పని పూర్తిచేసి వెళ్ళగానే ఇంక రొటీన్ మామూలే. మొక్కల పని, ఆ తర్వాత వాకింగ్, పూజ, మళ్ళీ వంట.. వరుస పనులే. పొద్దున్ననగా పుస్తకం వస్తే రాత్రి దాక చదవడానికి కాదు కదా ఈసారి తిరగెయ్యడానికే టైం లేదు. క్లైమాక్స్ లో ఏమౌతుందో అర్థం కాకుండా ఉన్న సస్పెన్స్ సినిమా ప్రేక్షకుడిలా ఉంది నా ఆత్రుత. రేపటికైనా ఈ పుస్తకం చదవడానికి టైమ్ దొరికితే బాగుండు. 

ఈ పోస్ట్ రాయకుండా ఈ పది నిమిషాలూ పుస్తకం చదవడానికి వాడుకుని ఉండచ్చు. కానీ దుమ్ము పేరుకున్న లాప్టాప్ పై దృష్టి పడగానే ఎందుకనో ఇవాళ రాయాలనిపించింది. కారణాలు లేకుండా ఏమీ జరగవు కదా. తీరిగ్గా ఊసుపోకుండా గడిపేలాంటి సమయం నాకు ఐదేళ్ల క్రితమూ లేదు. ఇప్పుడూ లేదు.  ఒకప్పుడు ఇష్టమైనవి, ఇవే నా తోడు అనుకున్న వాటి కోసం తీరుబడి చేసుకుని, పనిమనిషిని పెట్టుకోకుండా కూడా చాలా పనులే చెయ్యగలిగాను. ఏనాడైతే కొన్ని భ్రమలు బూడిదయ్యాయో, అప్పుడిక తీరుబడిలేని మరో దినచర్యని తయారుచేసుకుని, భగవంతుడు చూపెట్టిన మరో దారిలో నడక మొదలుపెట్టాను.

పుస్తకం చదవడం త్వరగా పూర్తయితే.. ఆ కబుర్లు త్వరలో పంచుకుంటాను.