సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, January 9, 2014

ఏకాంతం..





ఒంటరితనానికీ ఏకాంతానికీ చాలా తేడా ఉంది.. రెండూ నిశ్శబ్దంలో జనించేవే అయినా ఒంటరితనం దు:ఖ్ఖాన్ని పెంచితే, ఏకాంతం ఆ భారాన్ని తగ్గిస్తుంది. మనలో మనం, మనతో మనం ఉండేలా చేసి మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజులో కొద్దిపాటి ఏకాంత ప్రశాంత క్షణాలు గడిపినా అవి జీవితాన్ని స్థిరంగా గడపడానికి సరిపోయేంతటి ఇంధనాన్ని మనకి అందివ్వగలవు.

చాలా ఏళ్ల క్రితం మాట... మేము విజయవాడ రేడియో క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఓ మూడేళ్ళూ సెకెండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మా బాల్కనీ వీధివైపు రోడ్డు కనబడేలా ఉండేది. మా బ్లాక్ లోపలికి ఉండడం వల్ల మా బాల్కనీ లోంచి గేటు దాకా ఉన్న పొడుగాటి రోడ్డూ, లోపల్నుండి బయటకు వెళ్తూ,వస్తూ ఉండే జనం కనబడుతూ ఉండేవారు. అంతే కాక చుట్టూ ఉండే పెద్ద పెద్ద చెట్లూ, పక్షులు, ఆకాశం అన్నీ కలిపి ఓ మంచి వ్యూ ఉండేది. 10th, ఇంటర్ రెండేళ్ళూ స్కూలు, కాలేజీ అయ్యి రాగానే ఆ బాల్కనీ లో ఉండే ఉయ్యాల లోనే నా మకాం ఉండేది. టేప్ రికార్డర్ కూడా అక్కడే పెట్టేసుకుని పాటలు వింటూ, ఆ ఉయ్యాల లో కూచుని అక్కడే కాఫీ, టిఫిన్, చదువు, తిండి..అన్ని అక్కడే! ఎండనీ, వర్షాన్నీ , చలినీ కాలాల మార్పులన్నింటినీ ఆ ఉయ్యాలలో కూచునే గమనిస్తూ ఉండేదాన్ని. ఆ నిశ్శబ్దం, ఆ ఏకాంతం నాకెంతో హాయిని ఇచ్చేవి. ముఖ్యంగా రాత్రి పూటలు ఏ వాద్య సంగీతమో, భూలే బిస్రే గీత్ నో వింటూ గడిపే ఏకాంతాలకు తిరుగేలేదు.. అవన్నీ మరువలేని మధురస్మృతులు నాకు..!


ఆ ఇల్లు వదిలాకా మళ్ళీ ఇన్నేళ్ళలో అలాంటి బాల్కనీ వ్యూ దొరకలేదు నాకు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడున్న ఇంటి బాల్కనీ లోంచి మళ్ళీ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం వచ్చింది. ఈసారి ఇది వీధి వైపు కాదు పొలాలవైపు. మనుషులసలు కనబడరు. ఉయ్యాల వెయ్యలేదు కానీ బీన్ బ్యాగ్ ఒకటి అక్కడ వేసేసి ఉంచా. పొద్దున్నే టీ తాగుతూ ఆ మంచునీ, ఎర్రబారుతున్న ఆకాశాన్నీ చూడడం ఓ అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది కానీ పొద్దుటే పని హడావుడిలో ఎక్కువసేపు కూచోవడం కుదరదు. మధ్యాహ్నమో సాయంత్రమో మాత్రం ఏ పుస్తకమో పట్టుకునో, ఖాళీగానో కనీసం ఓ గంట అయినా ఇక్కడ గడుపుతాను. తీ తాగుతూ మౌనంగా ఉన్న ఆకాశాన్నీ, వలయాకరంలో తిరుగుతున్న ఇరవైముఫ్ఫై దాకా ఉండే పావురాల గుంపునీ చూడటం ఒక వ్యాపకమైపోయింది నాకు. ఒక్కరోజు కూడా మానకుండా రోజూ ఆ పావురాలు అలా ఆటలాడుకుంటాయి. కోతలైపోయి, ఎండిపోయిన వరిపొలాలపై గుంపుగా చేరి కాసేపు కూచుంటాయి. మళ్ళీ పైకెగిరి ఓ రౌండ్ తిరుగుతాయి. గుంపుగా అన్నీ కలిసే తిరుగుతాయి చిత్రంగా. ఒకసారి కాదు ఓ గంట పైగా అలా తిరుగుతూనే ఉంటాయి. చూసేందుకు మనకి విసుగు రావాలి కానీ తిరిగేందుకు వాటికి రాదేమో!


"పద పదవే వయ్యారి గాలిపటమా.." అంటూ దూరంగా ఆకాశంలో మూడు నాలుగు గాలిపటాలు పోటీ పడుతూ ఎగురుతూ ఉంటాయి. దూరంగా ఆడుకుంటున్న పిల్లల అరుపులూ, కేరింతలు..! పక్కనే పల్లెలోంచి అప్పుడప్పుడు మైకుల్లోంచి పాటలు, ఉపన్యాసాలు, భజనలు వినబడుతూ ఉంటాయి. టైం ప్రకారం రోజులో నాలుగైదుసార్లు ’అల్లా హో అక్బర్...’ కూడా వినబడుతుంది. గంటకోసారి ఏదో ఒక రైలు పక్కనున్న రైల్వే ట్రాక్ మీంచి కుయ్యిమని వెళ్తూ నిశ్శబ్దాన్ని చెదరగొడుతుంది కానీ అలా వెళ్ళే రైలుని చూడ్డం కూడా బాగుంటుంది. ప్రపంచంతో, ట్రాఫిక్ హోరుతో, మనుషులతో ఏమాత్రం సంబంధం లేని ఈ ఏకాంతం మళ్ళీ ఇన్నాళ్ళకు నాకు చేరువయ్యింది.. ఆ చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెస్తూ..!! 


చీకూ చింతా లేని ఆ చిన్నప్పటి రోజుల్లోని ప్రశాంతత ఇప్పుడు మనసుకు లేకపోయినా, ఇన్నాళ్ళకు నాతో నేను గడిపగలిగే కొన్ని ఏకాంతపు క్షాణాలను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూంటాను రోజూ.. ఇప్పుడు కూడా బాల్కనీలో కూచునే ఈ టపా రాస్తున్నా! చీకటి పడితే మాత్రం ఇక్కడ ఉండలేం..దోమలు పీకేస్తాయి.. ఇంక లోపలికి పోవాలి మరి... !!




2 comments:

phaneendra said...

ఇప్పుడింతకీ ఏ ఊళ్ళోనండీ మీరింత ప్రశాంత ఏకాంత సేవ చేసుకుంటున్నది?

తృష్ణ said...

@phaneendra: పేరుకి ఆదరబాదరా పట్టణవాసమే అయినా ప్రస్తుతానికి ఓ మారుమూల ప్రాంతానికి చేరామండి..:-)