సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, February 7, 2014

ఆబ్దీకం


స్నానాలూ, మడిబట్టలు, బ్రాహ్మలు, గదిలోపల కార్యక్రమంలో హోమం.. ఇంటి నిండా పొగ, పిండాలూ, నల్ల నువ్వులూ, వంటింట్లో వంటావిడ హంగామా, ఇంట్లో బంధువులు, కబుర్లు, ఆపై భోజనాల్లో నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, గారెలు, పరమాన్నం, అప్పాలో..అరిసెలో.., ముద్దపప్పు, నెయ్యి, కమ్మటి పెరుగు.. అరిటాకుపై కడుపునిండా భోజనం..  చిన్నప్పుడు 'ఆబ్దీకం' అంటే తెలిసిన అర్థం ఇదే!


మా అమ్మమ్మ,తాతయ్యల మరణాల మధ్య పదిహేను ఇరవైఏళ్ళ అంతరం ఉన్నా వాళ్ల ఆబ్దీకాలకు మధ్యన ఒక రోజే తేడా! ఏడాదికోమాటు తాతయ్య ఆబ్దీకానికి, ఆ తర్వాత ఇద్దరి ఆబ్దీకాలకీ మా కజిన్స్ అందరం మావయ్య ఇంట్లో తప్పనిసరిగా కలిసేవాళ్లం. ఈ వంకతో అయినా అందరం ఓసారి కలుస్తున్నాం అని తృప్తి ఉండేది మాకు. రాన్రానూ చదువులూ, ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ మా అందరిమధ్యన దూరాలను కూడా పెంచేసాయి. మా ఇంట్లో అయితే నాన్న ఏడాదికి మూడు ఆబ్దీకాలు పెట్టేవారు. కొడుకుల్లేని వాళ్ల అమ్మమ్మకు ఏకైక మనవడిగా వాళ్ల అమ్మమ్మ,తాతయ్యలదీ, వాళ్ల నాన్నగారిదీ! ఆ తరవాత పదిహేనేళ్ళుగా మా మామ్మయ్య(నాన్నమ్మ)దీ మొత్తం కలిపి నాలుగు! ఎప్పుడైనా శెలవు రోజైతే ఆబ్దీకం భోజనం తినేవాళ్లం తప్ప స్కూలుకి, కాలేజీలకీ వెళ్పోయేవాళ్లం కాబట్టి మాకు ఇంట్లో జరిగే కార్యక్రమం గురించి పెద్దగా అవగాహాన ఉండేది కాదు. మంత్రం చెప్పే ఆయన, ఇద్దరు భోక్తలు మొత్తం ముగ్గురు బ్రాహ్మలు వచ్చేవారని మాత్రం గుర్తు. అప్పట్లో పప్పు రుబ్బటానికి రుబ్బురోలే కాబట్టి వంటావిడ రుబ్బలేకపోతేనో, రావడం లేటు చేస్తేనో "నేనే పప్పు రుబ్బానని.." అమ్మ చెప్తే ఓహో అనేవాళ్లం తప్ప ఆ కష్టం ఏపాటిదో ఊహకైనా తెలిసేది కాదు! ఆబ్దీకాలైన ప్రతిసారీ "నా కూతుర్ని పెద్ద కొడుక్కో, ఒక్కడో కొడుక్కే ఇవ్వను బాబూ.." అని అమ్మ అంటూండడం మాత్రం బాగా గుర్తుంది! 


కట్ చేస్తే... నేను ఓ ఇంటి పెద్దకోడల్నే అయ్యాను!! దురదృష్టవశాత్తూ ఏడేళ్ల క్రితం మా మావగారు కాలం చేసారు. మడిబట్ట ఎలా కట్టుకుంటారో కూడా తెలీదప్పటికి నాకు. అప్పటికి మా పాపకు రెండేళ్ళూ, నాకు ఒక మిస్కేరేజ్ అయ్యి రెండు నెలలు కూడా పూర్తవ్వలేదు. చణ్ణీళ్ల స్నానాలు, మడిబట్టలు.. నెలా నెలా మాసికాలు.. ఆ కార్యక్రమాలు.. మళ్ళీ అందులో గోదారిజిల్లా రూల్స్ వేరు..కృష్ణాజిల్లా రూల్స్ వేరు... అంతా గందరగోళంలా ఉండేది. అమ్మ, అత్త, మామ్మయ్య, తాతమ్మా.. అంతా ఇంతేనా? ఇలానే తడిబట్టలు, మడిబట్టలు, కట్టుకుని ఉండేవారా? ఒక్క చీరనే కట్టుకుని ఎలా ఉండాలి? వచ్చినవాళ్లంతా మనల్నే చూస్తూంటారు కదా...అయినా ఇంతేనా..  మడిబట్ట మార్చేదాకా మధ్యలో బాత్రూం లోకి కూడా వెళ్లకూడదా... ఇవేమి రూల్స్? ఎవరు పెట్టారు? ఇలానే ఎందుకు చెయ్యాలి? చదువులూ, ఉద్యోగాలూ, సమాజం..మార్పు.. ఇవన్నీ పుస్తకాలకీ, సినిమాలకీ, కాయితాలకీ, కవితలకే పరిమితమా? సవాలక్ష సందేహాలు... 


మావగారి సంవత్సరీకాలు కాశీలో చేసాం. గయా వెళ్లాం.. అక్కడ కూడా కొన్ని విధులు పూర్తిచేసాం. వచ్చాకా కాశీసమారాధన మొదలైన కార్యక్రమాలు అయ్యాయి. ఆ తర్వాత నుండీ ఏడాదికోమాటు ఆబ్దీకాలు ఇంట్లోనే జరుపుతున్నాం. "అమ్మా.." అని ఆప్యాయంగా పిలిచే మావగారి పిలుపు.. "కాస్త చాయ్ పెట్టిస్తావామ్మా..", "చపాతీలు ఇలా వత్తాలి..", "టమాటా పచ్చడి నే రోట్లో రుబ్బితే అంతా వచ్చి రుచి చూసాకా చివరికింత ముద్ద మిగిలేది.." అంటూండే ఆయన మాటల్ని తలుచుకుంటూండగానే ఏడేళ్ళు గడిచిపోయాయి. కానీ అబ్దీకం వస్తోందంటే అది పూర్తయ్యేదాకా గుబులు మాత్రం పోవట్లే..! ఎవరితోనూ మాటపడకుండా కార్యక్రమం పూర్తిచెయ్యాలి. అత్తగారు తృప్తిపడాలి. వచ్చినవాళ్ళు కడుపునిండా భోజనం చేసి వెళ్లాలి. పెద్దకోడలిగా నా బాధ్యత నేను నెరవేర్చాలి. ఇదీ నా తాపత్రయం. ప్రతి అబ్దీకానికీ అమ్మ, పిన్ని, అత్త.. ఇలా అంతా గుర్తుకువస్తారు..! పది మంది, మహా అయితే ఓ పదిహేను మందికే నేను అతలాకుతలం అయిపోతుంటే, గ్రైండర్లు లేని రోజుల్లో ప్రతి ఆబ్దీకానికీ నలభైకి తక్కువకాకుండా బంధువులకి చేసిపెట్టిన పెద్దవాళ్లను తల్చుకుంటే అసలు చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. 


నిన్న మా మామగారి ఏడవ ఆబ్దీకం జరిపాము.ఈమధ్యన రెండేళ్ళుగా ఆరోగ్యం బాగోక నే వడ్డన చెయ్యలేక వంటావిడనే వడ్డనకి కూడా మాట్లాడుకుంటున్నాం. నిన్న భోజనం చేస్తుంటే మా సీతత్త గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సీతత్త మా మేనమామ భార్య. మా అమ్మమ్మా తాతయ్యల ఆబ్దీకాలకి వాళ్ల ఎనమండుగురు సంతానం, వారి పిల్లలు అంతా కలిపి రెండు మూడు బ్యాచ్ లలో భోజనాలు చేసేవారు. అందరికీ దగ్గరుండి వడ్డన చేస్తూ, "ఇదిగో నువ్వీ గారెలు తిను", "పరమాన్నం బావుంది మరికాస్త వేయించుకో", "కొబ్బరిపచ్చడి కావాలా?" , "ఈ కూర వేయించుకో..వద్దనకు", "తాతగారి ప్రసాదం తినాలి.." అంటూ నవ్వుతూ అందరికీ కడుపునిండా భోజనాలు పెట్టించి, చివరికెప్పుడో నాలుగింటికి తను భోజనం చేసి మడిబట్ట మార్చుకుని వచ్చేది తను. నేను వడ్డన చెయ్యకపోయినా బ్రాహ్మల భోజనం అయ్యి, వారి విస్తళ్ళు తీసి, నేలంతా తుడిచేసరికే చుక్కలు కనబడ్డాయి నాకు.


అసలు ఈ కాలంలో అప్పటి ఓపికలు ఎందుకు ఉండట్లేదు? మా పరిస్థితే ఇలా ఉంటే అసలు ముందుతరాల మాటేమిటి? ఒకవేళ ముందు తరాలవాళ్ళు తల్లిదండ్రులకి ఇలా కార్యక్రమాలు నిర్వహించలేకపోతే...?  అసలు కొడుకే లేకపోతే..? ఎవరు ఇవన్నీ జరిపిస్తారు? ఎవరో ఒక బంధువులు చేస్తే కొడుకు చేసినంత శ్రధ్ధగా చేస్తారా? వాళ్ళు ఈ శ్రార్థకర్మలన్నీ విధిగా జరపలేకపోతే మరి చనిపోయినవాళ్లకు ఏం నష్టం జరగదా? అసలు ఇవన్నీ ఇలానే చెయ్యాలా? ఎవరి చేసినా చెయ్యకపోయినా చనిపోయాకా మనకి ఏం తెలుస్తుందసలు? ఇలా అల్లిబిల్లిగా ముసురుకున్నాయి ఆలోచనలతో మనసు బరువైపోయింది... 


ఇంతలో "పెద్దమ్మా నాకు కలర్ చాక్పీస్ ఇయ్యవా? నే బొమ్మ వేస్తా" అని మా మరిది కూతురు, "బెద్దమ్మా..నాక్కూడా ఇంకో స్లేట్ ఈయ్.. నే కూడా మంఛి బొమ్మ వేస్తా.." అన్న దాని తమ్ముడి ముద్దుముద్దు మాటలతో ఆలోచనాలోకం నుండి బయటపడి వాళ్ల కేరింతలకు నా నవ్వులను జత చేసేసా! 

11 comments:

రాధిక(నాని ) said...

Hm :( ituvanti karyakramalu maku anta undavu kani miru cheppindi nijamandi.mana peddavallu chesinattu manam cheayaleaka potunnaam. Memu kuda chala vishayallo alane anukuntamu.radhika nani

సుమ చామర్తి said...

మీ ఓపిక కూడా తక్కువేమి కాదనిపిస్తోMది.  ఇన్ని బ్లాగులు నిర్వహిస్తూ ఇంత ఓపికగా రాయగలుగుతున్నారు.  మీ ప్రస్తుత పోస్త్ చాలా బాగుMది.

తృష్ణ said...

@రాధిక(నాని): అవునండీ.. ధన్యవాదాలు.

@సుమ: ఇదివరకటికన్నా టపాలు రాయడం బాగా తగ్గిందండీ..:)
ధన్యవాదాలు.

Sreenivas said...

ముందు తరాల మాటేమిటి?
మీరన్నది నిజమే.. ముందు తరాలవాళ్ళు ఇలాంటివి పట్టించుకుంటారో లేదో... పూర్తిగా వదిలెయ్యకపొయినా.. ఇంత పద్ధతిగా చెయ్యలేరు... మా ఇంట్లో నేను కూడా మడి కట్టుకొని వంట,వడ్డెన లో సాయం చేస్తుంటానులెండి.... అందుకే మీ టపా చూడగానే అన్ని గుర్తొచ్చాయి..

sphurita mylavarapu said...

మా అమ్మగారు 60 ఏళ్ళు వచ్చీ మా తాతగారి ఆబ్ధీకానికి పట్టుబట్టి మరీ తనే వంట చేస్తూ వుంటారు. నాకు పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఆఫీస్ కి వెడితేనే కళ్ళు తిరిగిపోతున్నట్టుంటుంది. మన తరవాతి తరం వాళ్ళని తల్చుకుంటేనే భయవేస్తుంది.

ఇవన్నీ చేస్తారనే ఆలోచనకూడా లేదు గానీ పాపం వాళ్ళ వోపిలలు ఇంకెంత తక్కువగా వుంటాయో అనిపిస్తుంది.

Ennela said...

wow! tRshna hats off

ఇందు said...

తృష్ణ గారు,

హ్మ్! అచ్చం మనసులో మాటల్లా ఉన్నాయ్ మీరు రాసినవి!

సంవత్సన్నర క్రితం మా మవయ్యగారు చనిపొయినప్పుడు... దశదినకర్మలు చేసేసరికి నేను చిక్కి శల్యం అయిపోయాను! అమెరికాలో వారానికి ఒకసారి ఇంటికి వాక్యుం పెట్టే నేను.... రోజు తలమీద స్నానాలు/ఉపవాసం/తడిచీరతో ఆ బ్రాహ్మలకి అన్నీ అందించడం/వడ్డన/శుభ్రం చేయడం....చేసేసరికి నాకు ఎప్పుడు లేని నడుం నొప్పి కూడా వచ్చేసింది. అలవాటు లేని చీరకట్టుతో చాల కష్టంగ ఉండేది(అదీ గోచిపోసి కట్టుకొలేదని సన్నాయి నొక్కులు కూడా!!) ఒక్కడే కొడుకు! అన్నీ కోడలే చేయాలి! కనీసం ఎవరు తొంగి కూడ చూసేవాళ్ళు కాదు సాయానికి. పదిరోజులు మానసికంగా బాధ.... శారీరకంగా నరకం కనిపించాయి! ఇది చాలదన్నట్టు అమెరికాలో ప్రతి నెలా మాసికం... జనవరి నెలలో...చల్లటి చలి వేళలో పొద్దున్నే లేచి వంట చేసి... బ్రహ్మణుడికోసం వెయిట్ చేసి...ఆ మాసికం కార్యక్రమం అయ్యాక ఆఫీసుకి వెళుతుంటే ఉండేది... ఆహా! ఆనక మొన్న ఇండియాలో సంవత్సరీకాలు కూదా పూర్తి చేసేసరికి.. నా తల ప్రాణం తోకకి వచ్చేసింది :) ఇన్ని బాధలు పడ్డా.. మావయ్య గారి ఆత్మకి ఉత్తమగతులు లభిస్తే చాలు అనుకుని దణ్ణం పెట్టుకునేదాన్ని. అంతకంటే ఇంకేం చేయగలం చనిపోయిన ఆత్మీయుల కోసం!

తృష్ణ said...

@Sreenivasa Rao Kamaraju:గ్రేట్ అండి మీరు ..

@స్ఫురిత మైలవరపు: కూరలు , పచ్చళ్ళు చేసేసినా పిండివంట దగ్గర మాత్రం అలసిపోతామండి .. మీ అమ్మగారు చాలా వోపికమంతులన్నమాట.. గ్రేట్ అండి !

@ Ennela :మీ అభిమానం..అంతే !

తృష్ణ said...

@indu:i can really understand indu..!!
అలా చీర కట్టుకోవడం నేర్చుకున్నా కానీ ప్రతీ ఏడూ కన్ఫ్యుజనే నాకు ఏ ముడి ఎటు పెట్టుకోవాలా అని.. :(

YVR's అం'తరంగం' said...

కళ్ళకి కట్టినట్టు ఉంది. మొన్నే పిల్లలకి ఆబ్దీకం రోజున ఇంట్లో ఉండే వాతావరణం మెమరీస్ చెప్పాం. ఇవాళ ఇది చదవడం జరిగింది. మా యింట్లో శ్రీ రామ నవమికి అటూ ఇటూ రెండు వచ్చేవి. స్కూల్లో ఆన్యువల్లీలు(ఆన్యువల్ ఎక్జామ్స్) మొదలైన టైము. పగలు ఆ తంతు, సాయంత్రం రిలాక్స్ అవడానికి నవమి పందిట్లో కోటా సచ్చిదానంద శాస్త్రి గారి హరికదకి పరుగెట్టేవాళ్ళం.
- అం'తరంగం'

తృష్ణ said...

Thanks for the comment srinivas gaaru.