రంగులు దిద్దుతున్న మా "ముగ్గుగుమ్మ" |
దశాబ్దపు మొదటిరోజు అయితే ఏమన్నా కొమ్ములుంటాయా? ఏమీ ఉండవు. అదీ ఒక మామూలు రోజే...it's just an other day...another day !! కానీ నేను మాత్రం bryan adams "Here I am - this is me" పాట గుర్తొచ్చి "It's a new day - it's a new plan ... It's a new world ... it's a new start ..." అని పాడుకున్నా !! ఎందుకంటే మనిషి ఆశాజీవి. నిన్న నిరాశను మిగిల్చినా రేపు బాగుంటుందేమోని అని ఆశ పడతాడు మనిషి. ఈ ఆశ లేకపోతే కొత్త ఉదయాలను చూడటం కష్టం. కొత్త కేలండర్లతో అలాంటి ఆశలు రేపేకొత్త సంవత్సరం అంటే నాకు ఇష్టం. మామూలుగానే గడచిపోవచ్చు..మరో ఏటికి ఇది just another year అయిపోవచ్చు. కానీ ప్రస్తుతానికి it's a new start.
చాలాసందర్భాల్లో నేను మారిపోయాననుకుంటూ ఉంటాను...కానీ మనిషిలో ఆలోచనకు మార్పు వస్తుంది కానీ బేసిక్ స్వభావం ఏదైతే ఉందో అది అరిచి గీపెట్టినా మారదు. గ్రీటీంగ్స్ తయారు చేసి పోస్ట్ చేసేరోజులు పోయాయి కాబట్టి ఎప్పటిలానే రెండ్రోజుల ముందరే (అందరికన్నా ముందు విషస్ చెప్పాలనే అజ్ఞానపు తాపత్రయం) మైల్ బాక్స్ లో ఉన్న ఎడ్రస్లన్నింటికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాను. ఎప్పటిలానే మావారూ నవ్వారు.."వీళ్ళలో సగం మంది కూడా తిరిగి జవాబివ్వారు. ఎందుకు పంపిస్తావు?" అని. ఒక విష్ పంపినందువల్ల తప్పేముంది? కొట్టరు కదా. "Be aware that your kindness may be treated as your weakness...but still be kind" అన్నరు స్వామి. నా అలవాటునాది. ఓపిక, వీలు ఉన్నన్నాళ్ళు పంపిస్తాను. అంతే.
కౌన్ట్ డౌన్ లెఖ్ఖపెట్టుకుంటూ టీవీ చానల్స్ తిప్పుతూ కూచునే రోజులు పోయి నాలుగైదేళ్ళు అయ్యింది. చిన్నప్పుడు, పెద్దయ్యాకా కూడా హడావుడి పడిపోయి ప్రోగ్రామ్స్ మొదలెయ్యేలోపూ బయట న్యూ ఇయర్ ముగ్గు పూర్తి చేసేసి, టివీ ముందుకి చేరిన రోజుల్ని, పన్నెండవ్వగానే లైన్స్ కలవవని ఓ అరగంట ముందుగానే స్నేహితులకీ, బంధువులకీ ఫోన్లు చేసిన క్షణాల్ని తలుచుకుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు. ముగ్గు వెయ్యటం మాత్రం ఇప్పటికీ మానలేదు నేను. ఈసారి నా న్యూ ఇయర్ ముగ్గు వేస్తూండగానే మొదలయ్యింది. ఆ నిశ్శబ్దంలో నేనూ, చీకటిలో ఓపిగ్గా తోడు నించున్న తనూ ఇద్దరమే ఒకరికొకరం విషెస్ చెప్పుకున్నాం. పేచీపెట్టి రంగులు కొనిపించుకుని తానే రంగులు మా పాప వేస్తానని మరీ మరీ చెప్పటం వల్ల ముగ్గు మాత్రం వేసి ఊరుకున్నా. పొద్దున్నే లేచి రంగులు ప్లేట్లో పెట్టుకుని పాప ముగ్గుకి రంగులు దిద్దుతూంటే "ముగ్గు గుమ్మ" అనుకున్నా. నా వారసత్వాన్ని,అభిరుచుల్నీ అన్నివిధాలా కాపాడుతుంది అనిపించే నా బంగారాన్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఇక పొద్దున్నే పనులన్నీ అయ్యాకా నేను చేసిన మంచి పని ఏమిటంటే ఫోన్ నంబర్ల బుక్ దగ్గర పెట్టుకుని అందరు మిత్రులకీ ఫోన్లు చేయటం. ఇది గత కొన్నేళ్ళుగా నేను మానేసిన పని. కొందరి లైన్లు కలవలేదు. కొందరు పలికారు. నాతో ఇంగ్లీష్ ఎంఏ చదువుకున్న ఒక పాత స్నేహితురాలు లైన్ దొరికింది. ఇప్పుడు బొంబాయిలో ఉన్నారుట. ఇద్దరు అబ్బాయిలు. బోలెడు జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తాలే అన్నా. "నువ్వు ఉత్తరాలు బాగా రాస్తావు. మళ్ళీ నీ ఉత్తరం చదవాలని ఉంది. ఈ ఎడ్రస్ కి ఉత్తరం రాయవే" అని పోస్టల్ ఎడ్రస్ ఇచ్చింది. దాదాపు మూడునాలుగేళ్ళ క్రితాం దాకా ఏ ఊరు మారినా తనకు లెటర్స్ రాస్తూనే ఉండేదాన్ని. లెటర్ పాడ్స్, స్టాంపులు, రంగురంగుల ఎన్వలాప్ కవర్లు... గత జన్మేమో అనిపిస్తాయి ఆ జ్ఞాపకాలు.
ఆ తరువాత మైల్ బాక్స్ తెరిచాను ఎవరన్నా జవాబులు రాసారేమో అని. కొందరు రాసారు. ఒక కాలేజీ మిత్రురాలు డిగ్రీ క్లాస్మేట్స్ కొందరు కలిసారనీ వివరాలు అవీ రాసింది. ఆశ్చర్యంగా కొన్ని పేర్లు నాకు గుర్తుకు రాలేదు. నాక్కూడా మరపు వచ్చేస్తోంది అని అర్ధమైంది. లేకపోతే నేను ఏదన్నా మర్చిపోవటమా? ఎంఏ ప్రెండ్ చెప్పిన కొన్ని వార్తలు, ఇప్పుడీ స్నేహితురాలు రాసిన కొన్ని విషయాలు చాలా బాధాకరమైనవి ఉన్నాయి. న్యూ ఇయర్ పూటా ఇలాంటి వార్తలేమిటీ అనుకున్నాను... కానీ నాకు ఒక సంగతి అర్ధమైంది. బహుశా దేవుడు నాకు పెద్ద గీత చూపిస్తున్నడేమో అని. పెద్ద గీత ముందు చిన్న గీత ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది కదా. గతించిన కాలంలో నీపై రోకలి పోటు పడకుండా సుత్తి దెబ్బతో సరిపెట్టాను అని దేవుడు చెప్తున్నాడన్న మాట అనుకున్నాను.
విజయవాడలో పుస్తక ప్రదర్శన మొదలు. పధ్నాలుగేళ్ళు పాటు విడువకుండా వెళ్ళాను. వీలవదు కానీ ప్రతి ఒకటవ తారీఖున వెళ్ళాలని మనసు కొట్టుకుంటుంది. ఇంకా...బయట అమ్మొచ్చిన మొక్కలబ్బాయిని పిలిచేసి, నన్ను బయటకు పిలిచేసి నాతో చేమంతి మొక్కలు కొనిపించేసింది మా చిన్నారి.బయటకు వెళ్ళి వస్తూంటే దారిలో పండగకు ముగ్గు వెయ్యటానికి అని మరో ఐదారు రంగుల పేకెట్లు వాళ్ళ నాన్నతో కొనిపించేసుకుంది. మరోసారి పుత్రికోత్సాహం పెల్లుబికింది. మిగిలిన దినచర్య మామూలే.. కొత్త సంవత్సరం అని పొద్దుపోక మానుతుందా? వెలుతురు నిశీధిగా మారింది. రాత్రి గడిచి మరో ఉదయం ప్రారంభమైంది...ఎన్నో సత్యాలను కళ్ల ముందు ఉంచిన ఈ దశాబ్దపు మొదటి రోజు ఇలా గడిచింది.
మరొక ఉదయం
మరొక రేపు
మరొక చిరునవ్వు
మరొక వసంతం
మరొక హేమంతం
మరొక సంవత్సరం...మళ్ళీ మొదలు !!
11 comments:
"...లెటర్ పాడ్స్, స్టాంపులు, రంగురంగుల కవర్లు... గత జన్మేమో అనిపిస్తాయి ఆ జ్ఞాపకాలు..."
Yes! you are right.
hahah..muddugaa undi 'muggu gumma'..
trishna gaaru nenu meelaage....nene mundu... phonlu , mails..okokka saari oka nela rojulu busy gaa undi evvarikee,,, no phone no mails ani decide ayipotaanaa? naa mail box khaalee....naa phone bill lo incoming charges nil..hahaha...but adedo vankara annattu....mallee nene modalu....
wish you happy new year again...
తృష్ణ గారూ,
ఇంకో రెండు దశాబ్దాల తరువాత మీ అమ్మాయి కూడా అప్పటి న్యూ ఇయర్ కి ఇలానే ఆలోచిస్తుందేమో.
"చాలాసందర్భాల్లో నేను మారిపోయాననుకుంటూ ఉంటాను...కానీ మనిషిలోఆలోచనకు మార్పు వస్తుంది కానీ బేసిక్ స్వభావం ఏదైతే ఉందో అది అరిచి గీపెట్టినామారదు."
"లెటర్ పాడ్స్,స్టాంపులు, రంగురంగుల ఎన్వలాప్ కవర్లు... గత జన్మేమో అనిపిస్తాయి ఆ జ్ఞాపకాలు."
నిజమే.
అన్నట్టు నా బ్లాగులో మీ మొదటి కామెంట్ కూడా "ఏమైపోయింది ఆ ఉత్తరం?" అన్న పోస్ట్ కే వచ్చింది. అదే మొదటి సారి నేను మీ బ్లాగ్ చూడటం. పై లైన్ చదివితే అది గుర్తొచ్చింది. అప్పటి మీ కామెంట్ యధాతధంగా కింద ఇస్తున్నా.
తృష్ణ said...
see this post:
http://trishnaventa.blogspot.com/2009/06/blog-post_12.html
December 8, 2009 9:47 PM
తృష్ణ గారూ !
వారసత్వం, అందులోనూ కళా / అభిరుచి వారసత్వం ఎక్కడికీ పోదు అని మీ పాప ఫోటో, మీ టపా మరోసారి నిరూపిస్తోంది.
చిన్నారికి ఆశీస్సులు.
తృష్ణ గారూ !
నూతన సంవత్సర శుభాకాంక్షలు ....
Very nice.
ముగ్గుగుమ్మ - పదబంధం మీ పాపంత ముచ్చటగా ఉంది.
ఒక సూచన - తెల్ల తెరమీద నల్ల అక్షరాలే కంటికి ఇంపుగా ఉంటాయి.
తృష్ణ గారు ఏడాదిలో మొదటి రోజు గడిపిన తీరు చాలా బాగుందండి... నేనూ కొంతకాలంగా మానేసిన కొన్ని పనులు మళ్ళీ మొదలు పెట్టాలని అనుకున్నాను కానీ చేయలేకపోయాను.
మీ పాప రంగులు దిద్దుతుంటే చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో :-) దిష్టితీయండి మీ బంగారు తల్లికి.
@siva: :) thankyou.
@ఎన్నెల: 'మనిషి సంఘజీవి' అన్నారు కదండి. అందుకేమరి..
ధన్యవాదాలు.
@Shanky:నాలా ఆలోచించకుండా ఉంటేనే మంచిదండీ..:)
ఎప్పటి వ్యాఖ్యో ఇంకా గుర్తు ఉంది మీకు.చాలా చాలా థాంక్స్ అండీ.
@ఎస్.ఆర్.రావు: అదేకదండి తృప్తినిచ్చేది. ధన్యవాదాలు.
@విష్వక్సేనుడు: ధన్యవాదాలు.
@కొత్తపాళీ: ఏదో రంగుల పిచ్చి...మీ సూచనను గుర్తు ఉంచుకుని డార్క్ కలర్స్ వాడటానికి ప్రయత్నిస్తానండీ..:)
ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: ఇది మన తెలుగు సంవత్సరాది కాదు కాబట్టి పర్వాలేదండి. ఉగాదికి ఆ విధంగా చేసేయండి. ఓ పనైపోతుంది. ధన్యవాదాలు.
మీరు వ్రాస్తున్నవ న్ని చదువుతున్నాను.మీ అభిమానిని అయ్యాను. ఎంత బాగా వ్రాస్తున్నారో.
Post a Comment