సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, January 6, 2011

తోటయ్య


పని మీద బయటకు వెళ్ళివస్తున్న నాకు మా సందు మొదట్లో సైకిల్ మీద భుజానికి కొబ్బరితాడుతోనో దేనితోనో తయారుచేసిన గుండ్రని బంధాలు రెండు తగిలించుకుని, నడుంకి కత్తి కట్టుకుని వెళ్తున్న ఒక వ్యక్తిని చూడగానే "తోటయ్య" గుర్తుకొచ్చాడు. కాకపోతే సైకిల్ అబ్బాయి సైకిల్కు కుండ కూడా వేళ్ళాడుతోంది. కాబట్టి ఇతను తాడిచెట్టో, ఈతచెట్టో ఎక్కి కల్లు తీసే మనిషై ఉంటాడు. మా తోటయ్య మత్రం కొబ్బరికాయలు తీసిపెట్టేవాడు. ఆ అవతారాన్ని పరికరాల్నీ చూడగానే నాకు "తోటయ్య" గుర్తుకొచ్చాడు. జీవితంలో అనుబంధం లేకపోయినా ఏళ్లతరబడి చూసిన కొందరు వ్యక్తులు అలా గుర్తుండిపోతారు.


కాకినాడలో మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను తరచూ చూస్తూండేదాన్ని తోటయ్యని. సన్నగా నల్లగా తలపాగాతో, పాతబడి నలిగి మాసిన తెల్ల పంచెతో ఓ పాత డొక్కు సైకిల్ మీద వస్తూండేవాడు. మేం వెళ్పోయే ముందు రోజు మా నాన్నమ్మ అతనికి కబురు పంపేది. "పాపగారూ, ఎప్పుడు వచ్చారు?" అని పలకరించేవాడు. అతను నవ్వగానే గారపట్టి అక్కడక్కడ ఊడిన పలువరస కనబడేది. కాస్త దగ్గరగా వెళ్తే చుట్ట కంపు కొట్టేది. మా దొడ్లో మూడు కొబ్బరు చెట్లు ఉండేవి. ఆ ఇల్లు అమ్మేదాకా మేం బయట కొబ్బరికాయలు కొని ఎరుగం. ఆ తరువాత చాలా రోజులు బయట కొట్లో కొబ్బరికాయ కొనటానికి మనసొప్పేది కాదు. ప్రతిసారీ మా సామానుతో పాటూ కొబ్బరికాయలతో నిండిన పెద్ద సంచీ కూడా మాతో ప్రయాణం చేసేది సర్కార్ ఎక్స్ ప్రెస్ లో.


ఇంతకీ తోటయ్య సందులోంచి దొడ్లోకి వస్తూనే వేషం వేసేసుకునేవాడు. చొక్కా తీసేసి, పంచె కాళ్లకూ, నడుంకీ బంధాలు తగిలించుకుని(కొబ్బరిపీచుతోనో దేనితోనో చేస్తారేమో మరి..వాటిని బంధాలని అనేవారు) చెట్టు ఎక్కటం మొదలెట్టేవాడు. పైన ఫోటోలో మనిషి కాళ్ళకి వేసుకున్నలాంటిదే ఇంకా మందంగా ఉన్నవి భుజాన తెచ్చుకుని, ఒకటి నడుముకీ, ఒకటి కాళ్ళకీ వేసుకుని కొబ్బరిచెట్టేక్కేవాడు మా తోటయ్య. స్పైడర్ మేన్ లాగ చెక చెకా చెట్లు ఎక్కుతున్న అతన్ని వింతగా చూసేవాళ్లం ఎక్కిన ప్రతిసారీ. "లోపలికి వెళ్లండి కాయలు మీద పడతాయి" అని నాన్నమ్మ కసురుతూంటే దొడ్డిగుమ్మం కటకటాలు దగ్గర నిలబడి చూస్తూండేవాళ్లం. పడిపోకుండా అలా ఎలా ఎక్కుతాడు? అని భలే ఆశ్చర్యం వేసేది. "ఇలా ఎక్కటం ఎక్కడ నేర్చుకున్నావు తోటయ్యా?" అని అడిగితే "భలేవారే పాపగారు" అని నవ్వేసేవాడు. మేం పెద్దయ్యాకా కూడా వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయలు దింపేవాడు తోటయ్య. పెద్దరికం మీదపడిన ఆనవాళ్ళు, ముడతలు బడిన చర్మం, మరింత సన్నబడిన శరీరం...ఎలా ఉన్నా ఎప్పుడూ అదే స్పీడ్, మార్పు లేని ఆ ఎక్కే పద్ధతి నన్ను అబ్బురపరిచేవి.


ఎన్ని మార్లు కాయలు ఉంటాయి? పనేం లేదు.వెళ్పో...అస్తమానూ వచ్చేస్తున్నాడు డబ్బులు వస్తాయి కదా అని ఒకోసారి నాన్నమ్మ విసుక్కునేది. అయినా వెళ్పోకుండా డొక్కలేమన్నా కొట్టాలేమో చూడండి...అనేవాడు. ఎండిన మట్టలు అవీ కొట్టించి, దొడ్లో ఇంకేమన్నా పని ఉంటే చేయించుకుని పాత చొక్కాలూ,పాంట్లూ, నాలుగు డబ్బులిచ్చి పంపేసేది నాన్నమ్మ. పోనీలే పాపం అని నేను తృప్తి పడేదాన్ని. ఖాళీ చేతులతో అతన్ని పంపటం నాకేకాదు నాన్నమ్మకీ నచ్చేది కాదు. వేసంకాలం శెలవుల్లో అయితే బొండాలు దింపి పెట్టేవాడు. చివర చివరలో చూపు సరిగ్గా ఆనేది కాదు. అయినా వచ్చేవాడు. కాయలు కోసేవాడు. అప్పటికే పెద్దవాడు.. తోటయ్య ఇప్పుడు ఈ భూమి మీద లేడేమో కూడా...! రోడ్డుపై ఇలా భుజాన బంధాలు తగిలించుకుని, నడుంకి కత్తి కట్టుకుని వెళ్ళే ఎవర్ని చూసినా తోటయ్యే గుర్తుకొస్తాడు...ఇవాళ్టిలాగే.


ఇలా కాకినాడతో అనుబంధం గుర్తుచేసే వ్యక్తుల గుర్తించి చెప్పాలంటే ఎందరో ఉన్నారు. సామర్లకోట నుంచి ప్రతి నెలా పప్పునూనె తెచ్చిపెట్టే అబ్బాయి, రోజూ సైకిల్ బండి మీద కూరలు తెచ్చి రోజూ దెబ్బలాడుతూనే కూరలు ఇచ్చివెళ్ళే కూరలబ్బాయి, ఆ ఇల్లు కొన్నప్పటినుంచీ, మేం పుట్టి పెరిగి పెళ్ళిళ్ళయి, మళ్ళీ ఆ ఇల్లు అమ్మేదాకా మా ఇంట్లో పని చేసిన పనమ్మాయి లక్ష్మి, ఏ కరంట్ రిపేరు పనులొచ్చినా వచ్చే ఆస్థాన కరంటబ్బాయి...ఎందరో..!!


ఈ క్రింద వీడియోలో కొబ్బరిచెట్టేక్కుతున్న మనిషిని చూడండి.

9 comments:

SHANKAR.S said...

అయ్!!!! భలే భలే.....మా కాకినాడ కబుర్లు. మీరు తిన్నగా ఉండరు కదా, కాకినాడ పేరు చెప్పి ఏవేవో జ్ఞాపకాలు తట్టి లేపారు. వీలయినంత త్వరగా మా ఊరి మీద పోస్ట్ రాసేయ్యకపోతే ఇక నిద్ర పట్టేలా లేదు.

మనసు పలికే said...

హ్మ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఙ్ఞాపకాలు కదూ తృష్ణ గారు.. మా ఊర్లో కూడా ఉండేవాళ్లు కొబ్బరి కాయలు, తాటి కల్లు తీసేవాళ్లు:) నిజంగా భలే విచిత్రంగా ఉండేది అలా చెట్లు ఎక్కుతుంటే. మీ టపాతో నా స్మృతుల్ని నిద్ర లేపారు. చాలా బాగుంది టపా:))

ఆత్రేయ said...

మీరు కొబ్బరి చెట్టు జ్ఞాపలాలు బాగున్నై. బందర్లో మా ఇంట్లో కూడా అచ్చం ఇలానే జరిగేది,
మీకు తెలుసా కొబ్బరి చెట్టు ఎక్కే ముందు వాళ్ళు ఒక రక మైన వింతైన కూత కూసే వాళ్ళు "కోత కోత కూచ్చ్ అంటూ ఇలాగే ఏదో (i forgot actual) మూడు సార్లు కూసి ఎక్కేవాళ్ళు. అది ఎందుకో తెలిసేది కాదు ఎవరూ చెప్పే వాళు కాదు.తర్వాత కొన్నాళ్ళకి పెద్దాళ్ళు చెప్పారు చెట్టు ఎక్కే ముందు అలా కూస్తే చుట్టుపక్కల ఇళ్ళ స్నానాల గది( ఓపెన్ టాప్) లో ఉన్న వాళ్ళు alert అయ్యేవ్వాళ్ళుట.
మీరు పెట్టిన అలేప్పీ వీడియో చూస్తె ఒళ్ళు మండింది. అలేప్పీ లో బోటు హౌస్ లో ఉండి ఫ్రెష్ గోగోనాట్ (వాళ్ళు అలాగే అన్నారు మరి) తాగుదామని అడిగితే ఒకోటి పాతిక రూపాయలట. కేరళ లో గొబ్బరి బొండం మాహా చీపు అనుకున్న నాకు అదేదో ఏనుగు సామెత లా అయింది. ( సమేత ఏంటో అడగొద్దు బాగోదు మరి),

DurgaHema said...

memu kakinada vallame andi. idivaralo oka sari meeru kkd kaburlu raste comment vesenu kuda chala bagunnayani. meerenduko publish cheyaledu mari.ante kadu ma ammamma valladi Khandavilli kudanu. mee kaburlu chala varaku nenu connect avvagalanu. inchu minchu ma intlo vunnatte untundi mee posts chuste. prastutam US lo untunnam memu.

Ennela said...

నాకు మాల్దివుల్లొ ముస్తఫా గుర్తొచ్చాడండీ, చీకట్లో చెట్లెక్క కూడదనే రూల్కి విరుద్దంగా నా కోసం చీకట్లో కొబ్బరి బోండాలు తెచ్చాడు ఒంట్లో బాగా లేదని....ఆయన పిల్లలకి చదువు చెప్పానని కృతజ్ఞతట..అక్కడ పెద్దోళ్ళందరూ పొద్దున్న దాకా ఆగక పోయావా అంటూనే..ఎన్నెల కోసమా ఫర్వాలేదులే అనేసారు పాపం...మంచి మనుషుల్ని గుర్తు తెచ్చినందుకు మీకు బోల్డు త్యాంక్యూలు

తృష్ణ said...

@shanky:రాసేయండి మరి.చదివేస్తాం.
ధన్యవాదాలు.

@మనసుపలికే: గుర్తుకుతెచ్చుకుంటూంటే కబుర్లు వస్తూనే ఉంటాయి. ఙ్ఞాపకాలకు అంతనేది లేదండి...ధన్యవాదాలు.

తృష్ణ said...

@ఆత్రేయ: మా తోటయ్య అలా ఎప్పుడూ అరవలేదండి..నాకు తెలీదు మరి.
ధన్యవాదాలు.

@కనక: అలాంటిదేంలేదండి..నాకు అసలు మీ వ్యాఖ్య చూసిన గుర్తులేదు. రాసేప్పుడు ఏదైనా పొరపాటు జరిగి ఉంటుంది... ధన్యవాదాలు.

తృష్ణ said...

@ఎన్నెల: మీరు మాల్దీవుల్లో ఉన్నారా? మరి కాసిని ఫోటోలెట్టేయండి మకోసం...ఓ పనైపోతుంది...మంచి చేసినవాళ్ళనూ, చెడు చేసినవాళ్లనూ రెండు రకాల మనుషుల్నీ ఎప్పటికీ మర్చిపోలేమండి..ధన్యవాదాలు.

Ennela said...

tRsHna gaaru,
avunandee, 5.5 yrs kritam ikkadikochchaamu..akkada 4yrs..cheeting..sorry teaching chesaamu iddaram..kaanee appatiki digital cameras andubaatulo levo..maa settayya gaariki ishtam leko..naaku sariggaa teliyadu...physical photos indialo vadilesi vachchaamu..friends ni adigi choostaanu..recentvi yemainaa unnayemo....