పెళ్ళి నాటికి ఇరవై సంవత్సరాలు నిండిన “కమల” విద్యావంతురాలు. తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించికున్న విజ్ఞానవంతురాలైన గృహిణి. అత్తవారింట్లో ఆదర్శ గృహిణిగా తాన్ను తను తీర్చిదిద్దుకోవాలని తహ తహలాడిన స్త్రీ. సమాజంలోనూ, వ్యక్తుల్లోనూ అభివృధ్ధిని కాంక్షించే అభ్యుదయవాది. పెళ్ళైన ఏడేళ్ళలో ముగ్గురు పిల్లల తల్లి అయి, వైవాహిక జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ దాదాపు గడపివేసిన అనుభవజ్ఞురాలు. రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల” నవలా నాయిక.
“చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు మూర్ఖంగా ప్రేమించినా, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గుడ్డిగా ఆరాధించినా ఫలితం ఒకటే – అశాంతి ! మనస్పర్థ !” అన్న నేపధ్యంతో 1966లో జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన నవల రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల”. నేను 1996లో కొనే సమయానికి ఆరు పున:ముద్రణలు పూర్తి చేసుకుంది.
మూర్తిని ప్రేమించి వివాహమాడిన కమల ఎన్నో కలలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దాలనీ, భర్తకు తన చేతులతో వండివడ్డించాలనీ ఆశ పడుతుంది. కానీ పద్ధతీ తీరూ లేని అత్తవారిల్లు, మర్యాదా మన్ననా తెలియని ఇంట్లో మనుషులు, చాలా సందర్భాల్లో మూర్ఖంగా ప్రవర్తించే అత్తగారు, ఇంట్లో ఏమి జరిగినా, కారణమెవరో తెలిసినా స్పందించని భర్త, కమలను ఎంతో నిరాశకు,ఆవేదనకూ గురిచేస్తారు. దుర్మార్గురాలు కాకపోయినా కోడలిపై అధికారం చెలాయించటం జన్మ హక్కుగా భావించే సగటు అత్తగారు శేషమ్మ. పనిపాటలు తెలిసి, ఇంటిని అందంగా తీర్చిదిద్దగల నేర్పు ఉన్న కమలపై తన అత్తగారి పెద్దరికాన్ని అన్నివిధాలుగా చెలాయిస్తుంది శేషమ్మ. ఆమె చేసే మూర్ఖపు పనులు అత్తాకోడళ్ళ మధ్య సర్వసాధారణమైన మనస్పర్ధలకు తావునిస్తాయి. తర్కానికీ, న్యాయానికీ చోటులేని నిర్ణయాలు చేయటం ఆ అత్తగారి హక్కు. వాటికి తప్పనిసరిగా తలవంచటం మాత్రమే ఆ కోడలు చాలా ఏళ్లపాటు చేయాల్సివచ్చిన అనివార్యకార్యం. కొన్నేళ్ళపాటు ఎదురులేని సంసారసార్వభౌమత్వం వహించాకా కొత్తగా కోడలు వచ్చి కొత్త సవరణలు చేయటం సహించలేకపోవటం అత్తగారనబడే పాత్రకున్న జన్మహక్క మరి.
ఇంటిని అందంగా తయారుచేయాలన్న కోరికను భర్త సలహాపై తమ గదిమటుకే పరిమితం చేసుకోక తప్పదు కమలకు. పొందికగా తయారైన తమ గదిని చూసి విస్మయం చెందుతాడు ఆమె భర్త. గది నచ్చినా, మెచ్చని సుగుణం సొంతమైన అత్తగారు మెల్లగా సణుక్కోవటం వినబడుతుంది ఆమెకు. గౌరవం పొందాల్సిన మామగారి ధోరణి చిరాకునూ, జుగుప్సనూ కలిగిస్తాయి కమలకు. సర్ది పెట్టిన తమ పక్క మీద మధ్యాహ్నాలు నిద్రపోవటం మొదలెట్టిన మామగారి అలవాటుని ఇంట్లో అందరితో ఒప్పించి మాన్పించి "ఎంతైనా గడుసుది" అన్న కొత్త బిరుదు పొందుతుంది కమల.
భార్యాభర్తలకు ఏకాంతానికీ, మురిపాలకూ అడ్డంపడుతూ తలదూరుస్తు ఉండే తల్లి మూర్తి దృష్టిలో అమాయకురాలు. అతని దృష్టిలో భార్య బుర్రకి ఆలోచనలెక్కువ. ఆడంబరాలకూ, సంబరాలకూ ఆర్భాటం చేయటం, కొడుకు సంపాదనను దుబారా చేయటం, అవసరం ఉన్నా లేకపోయినా బంధువులను ఆహ్వానించి అతిథిసత్కారాలు చేయటం, కొడుకుతో అప్పు చేయించైనా ఆదపాదడపా కూతురుకి ఆర్ధిక సహాయం అందించటం శేషమ్మకు అలవాటు. అందుకు భర్త చేసే సమర్థన భార్యాభర్తల ఘర్షణను పెంచటానికి తప్ప మరెందుకు ఉపయోగపడదు. బిడ్డ కష్టార్జితంతో వేడుక చేసుకు ఆనందించే ఆ తల్లిదండ్రుల అనురాగాన్ని ఏ కోణంలోంచీ సమర్ధించలేకపోతుంది కమల. అనుమతి లేకుండా తన ఉత్తరాలను చదివే ఆడపడుచును, తల్లి అండతో వచ్చినప్పుడల్లా ఇల్లు దోచుకుపోయే ఆమె తీరు కమలను ఆందోళపరుస్తాయి.
పిల్లలు పుట్టాకా జరిగే సంఘటనలూ, పరిస్థితులు కమలను మరీ కలవరపెడతాయి. పిల్లలకు ఇష్టమైన పేరు పెట్టడానికి కూడా పేచీలు, మగపిల్లవాడికి చిన్నప్పుడే ఆడపిల్లను లోకువచేయటం నేర్పిస్తున్న అత్తమామల ప్రవర్తన ఆమెకు చాలా బాధను కలగజేస్తాయి. ఇంకా ఇంకా పెరుగుతున్న సమస్యలు, చికాకుల వల్ల భార్యాభర్తల మధ్యన పెరుగుతున్న దూరం ఎంతవరకూ వెళ్ళింది? వాళ్ళ కథ ఎలా ముగింపుకి వచ్చింది? అన్నది మిగిలిన కథ. ఒక మామూలు మధ్యతరగతి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే చక్కని కథనంతో "చదువుకున్న కమల" ప్రతి చదువుకున్న అమ్మాయి ఆలోచనలను ప్రతిబింబింపచేస్తుంది.
ఈ నవల అరుణా పబ్లిషింగ్ హౌస్,విజయవాడ ద్వారా ప్రచురింపబడింది. (వారి ఫో.నం.0866-431181)
.... ----- ...... ----- ..... ------
"వనితామాలిక"లో ప్రచురితం : ఇక్కడ చదవచ్చు..