ఇన్వెన్షన్ కీ డిస్కవరీకీ తేడా తెలిసేది కాదు నాకు చిన్నప్పుడు. అప్పుడు నాన్న చెప్పారు "ఏదైన కొత్త విషయాన్ని కనిపెడితే "ఇన్వెన్షన్", ఆల్రెడీ ఉన్నదాన్నే కొత్తగా కనుక్కుంటే "డిస్కవరీ" అని. అలాగ ఈ మధ్యన నేను డిస్కవర్ చేసిన బ్లాగులు కొన్నింటి గురించి ఈ టపాలో రాయాలని. అసలీ సింహావలోకనం-2 ఏమిటంటే, రేడియోలో ప్రతి డిసెంబర్ 31st కీ "సింహావలోకనం" అనే కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ప్రసారమైన అన్నికార్యక్రమాల బిట్స్, విశేషాలు ఉంటాయి అందులో. క్రితం ఏడాది అలాంటి ఒక టపా రాయాలనే ఆలోచన బుర్రని దొలిచింది. ఆ టపా "ఇక్కడ" చూడవచ్చు. ఆ పోస్ట్ లో నేను అప్పట్లో చూసిన బ్లాగుల్లో నాకు నచ్చిన టపాలు కొన్ని ఏరి కూర్చాను.
కానీ ఈ సారి సగం ఏడాది దాకా అసలు నా బ్లాగు నేనే సరిగ్గా రాయలేదు. మూడు కొత్తవి తెరిచి, వాటిల్లోనూ అనుకున్నవి రాయలేకపోతున్నాను. ఇక బ్లాగులు చదవటం, వ్యాఖ్యానించటం కూడా చాలా తక్కువైపోయింది. సగం మంది బ్లాగ్మిత్రులు నన్ను మర్చిపోయారు. అడపాదడపా టపాల్రాసినా వ్యాఖ్యలు రావటం కూడా తగ్గిపోయాయి. అందుకని అప్పుడప్పుడూ ఖాళీ దొరికినప్పుడల్లా బ్లాగ్లోకంలో విహరించటం మొదలుపెట్టాను. అప్పుడు పాత బ్లాగ్మిత్రులు చాలామంది టపాలు రాయటం తగ్గించేసారని అర్ధమైంది. బ్లాగుల నాణ్యత తగ్గిపోతోందని కూడా చాలామంది అనుకుంటున్నారని తెలిసింది.
అయ్యో, తెలుగు బ్లాగుల పరిస్థితి ఇదా? అని బాధపడుతూ బ్లాగ్విహారాలు చేస్తున్న ఇటీవల సమయంలో కొత్త బ్లాగులు డిస్కవర్ చేసాను...అంటే నేను అదివరకూ చూడనివన్నమట. నాకు బాగా నచ్చాయి. బ్లాగ్లోక సాహిత్యానికి మంచి రోజులు ఉన్నాయి అనిపించింది. వీటిని మించిన మంచి బ్లాగులు ఉండి ఉండవచ్చు. కానీ నా పరిధిలో, నా విహరణలో కనబడ్డ బ్లాగులు ఇవి. బ్లాగులను పరిచయం చేసేంత ప్రాముఖ్యం నా బ్లాగుకీ, నాకూ లేకపోయినా, ఈ బ్లాగులను గురించి ఓ నాలుకు వాక్యాలు రాయాలనిపించింది.
ముందుగా అందరికీ తెలిసినదే కానీ నేను ఆలస్యంగా చూసిన మంచి బ్లాగ్..."నీలాంబరి ". నా "సినిమా పేజీ" బ్లాగ్‌లో శారదగారు రాసిన కామెంట్ వల్ల ఆ బ్లాగ్ తెలిసింది. వీరు చాలా కాలం నుంచీ బ్లాగుతున్నారని ఖజానా చూస్తే తెలిసింది. ఎన్నో జ్ఞాపకాలు, బోలెడు పుస్తకాలు, సంగీతం, సాహిత్యం..ఎన్ని కబుర్లో...చదివిన ప్రతి టపా ఈ బ్లాగర్ పట్ల అభిమానం పెంచేసింది.
"అంచేత నేను చెప్పొచ్చేదేంటంతే!!!!!!" అంటూ చెప్పుకుపోయే ఈయన ఈ బ్లాగ్ మొదలు పెట్టింది చాలా కాలం క్రితమైనా టపాలు చాలా తక్కువగా రాస్తూంటారు. "SHANKY" పేరుతో బ్లాగే ఈయన రాసే పేరడీలు భలే చమత్కారంగా ఉంటాయి. ఆసక్తికరమైన ఈ బ్లాగ్‌లోని చాలా టపాలను నేనింకా చదవాల్సి ఉంది. మర్క్ చేసుకుని మరీ చదవాల్సినంత మంచి బ్లాగ్ ఇది.
అనుకోకుండా నకు కనబడ్డ బ్లాగ్ "కలం కలలు(పాత బ్లాగ్)" ఈ బ్లాగుని మూసివేస్తున్నాను...అంటూ ఫణీంద్ర అనే ఆయన రాసిన టపా ముందర కనబడుతుంది. చాలా మంది బ్లాగ్మిత్రులు రాసిన వ్యాఖ్యలు కూడా కనబడతాయి. ఎందుకు మూసేసారో తెలీదు కానీ పుస్తకాలూ,సాహిత్యం అంటూ ఎన్నో మంచి విషయాలను రాసిన ఈయన మళ్ళీ బ్లాగ్ తెరిస్తే బాగుండును అనిపిస్తుంది ఆ టపాలను చదువుతూంటే.
కొన్ని బ్లాగులు చదవాలంటే సాహిత్యం పట్ల కాసింత అవగాహన, భాషపై పట్టు ఉండాలి. అలాంటి ఒక బ్లాగ్ "కలం కలలు" పైన మెన్షన్ చేసిన బ్లాగ్ పేరూ, ఈ బ్లాగ్ పేరూ ఒకటే. మరి రెండీటికీ లింక్ ఉండా లేదా అన్నది వాళ్ళని అడగి తెలుసుకోవాల్సినదే. మేంఇద్దరం రాస్తున్నం అంటూ "మెహెర్, సంహిత" కలిసి రాసే ఈ బ్లాగ్ నాకు ఎంతో ముచ్చటగా అనిపించింది. సంహితగారు రాసే కవితలు ఎంతో భావయుక్తంగా చక్కని పదాల కూర్పుతో చదువుతూంటే తొలకరి జల్లుని, సంపెంగల సుగంధాన్ని గుర్తుకుస్తాయి. అంత మంచి కవితలవి. ఇక ఈ బ్లాగ్‌లో రాసే మిగతా సాహిత్యపు కబుర్లు కూడా సాహిత్యాభిమానులను ఆకర్షించేవిగానే ఉంటాయి.
"MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం" రెండు రోజుల క్రితం చూసిన బ్లాగ్ ఇది. బ్లాగ్ పేరు విచిత్రంగా అనిపించి చూద్దామని వెళ్ళా. చిత్తూరు గ్రీమ్స్ పేట్ మునిసిపల్ హై స్కూల్ లో చదువుకున్న విద్యార్థులు తమ సహాధ్యాయులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉండేందుకు ఈ సైట్ నిర్మింపబడినది. అని రాసారు. చిన్నప్పటి గ్రూప్ ఫోటోలూ, కబుర్లూ చూసి వాళ్ళ నెట్వర్కకింగ్ ఐడియాకు సలాం చేసేసా. ఈ బ్లాగ్‌లో చిన్ననాటి ముచ్చట్లే కాక పాటలూ, సినిమాల తాలూకూ కబుర్లు కూడా ఉన్నాయి. ఈ బ్లాగ్‌లోని గ్రూప్ ఫోటోస్ అవీ చూసి నేను కూడా నా స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకున్న...ఆ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారో...ఆటోగ్రాఫ్ బుక్ తీసి ఆ ఎడ్రస్సులకి ఉత్తరాలు రాస్తే జవాబులు వస్తాయా? అనిపించింది. అప్పట్లో ఫోన్లు కూడా అందరికీ ఉండేవి కాదు మరి. అడ్రసులే ఆధారం.
ఇక "ఇందు" గారి చేస్తున్న "వెన్నెలసంతకం" గురించి నేను కొత్తగా ఏం చెప్పేది? ఈవిడ తోటలోని సీతాకోకచిలుకలు బాగున్నాయి నా తోటలోకి కూడా పంపించమని అడిగాను...ఎప్పటికి పంపుతారో...! ఈ బ్లాగ్ రచయిత్రి కథలు కూడా చాలా బాగా రాయగలరు అని మొదటి కథతోనే నిరూపించేసుకున్నారు.
బ్లాగ్ మొదలెట్టింది క్రితం ఏడాది. రాసినవి ఆరో ఏడో టపాలు. "ఈ పేరు నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు" అని గోల పెట్టిన "శివరంజని"గారి పేరు మాత్రం బ్లాగ్లోకంలో మారుమ్రోగిపోతోంది.
ఇది మౌనరాగం కాదంటూ "మనసుపలికే" అపర్ణగారు ఆలపించే మధురమైన రాగాలు బ్లాగ్లోకమంతటా వినిపించేస్తున్నాయి. మా గోదావరి అమ్మాయిలు ఎక్కువైపోతున్నారే అని నేను సంబర పడిన బ్లాగ్ ఇది. ఇటీవలే ఈ బ్లాగ్‌లో పెట్టిన పాపికొండల ట్రిప్ ఫోటోలు అమాంతం గోదావరి దగ్గరకెళ్ళిపోయి ఆ సోయగాల్ని చూడాలనిపించేలా ఉన్నాయి.
"ఎన్నెల రామాయణం" అని మాలికలో చూసి అటువెళ్ళిన నేను ఆ వెన్నెల చల్లదనం చూసి మైమరచిపోయాను. అంత బాగుంటుంది ఆ చందమామ ఫోటో. టపాలు ఎక్కువ లేకపోయినా ఈ "ఎన్నెల" ఎందుకో మరి నా మనసు దోచేసింది. "వెన్నెల" పేరులో ఉన్న మేజిక్ అది. తెలంగాణా స్లాంగ్ లో ఈవిడ రాసిన ఎన్నెల రామయణం ఎంత చదువుదామని ఆత్రుత పడ్డా ఆ భాషరాక పట్టుమని నాలుగు లైనులైనా చదవలేకపోయాను..:( ఆ టపాలకు వచ్చిన వ్యాఖ్యలు ప్రశంసల వెన్నెలలు వెదజల్లాయి. ఈవిడ మరిన్ని మంచి మంచి టపాలు రాసి చిరునవ్వుల ఎన్నెలలు కురిపించాలని మనవి.
ఈ పల్లవులు కనుక్కోగలరా అని ఈ బ్లాగర్ విసురుతున్న సవాళ్ళు ఎన్నో పాత పాటలనూ, అంతే మంచి జ్ఞాపకాలనూ గుర్తుకు తెస్తున్నాయి. పాటలపై ఆసక్తి ఉన్నవారికి నచ్చే బ్లాగ్ ఇది. జ్ఞాపకాల గులాబీల పరిమళాలు అంటూ " మెహక్ " గుర్తుచేసే పాటలు అన్నీ మధురమైనవే.
గోదారి సుధీర గారి "పాపాయ్" నేనీమధ్యన చూసిన బ్లాగుల్లో ఒకటి. ఖలీల్ జిబ్రాన్ మాటలతో స్వాగతం చెప్పే ఈ బ్లాగ్‌లో బెంగాలీ సాహిత్యంతో పరిచయమున్న ప్రతివారికీ ఇష్టమయ్యే "శరత్" ఇల్లు, ఇంకా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఉండే ప్రదేశం తాలూకూ కబుర్లు, కొన్ని కథలతో ఆసక్తికరమైన బ్లాగ్ ఇది.
టపాలు తక్కువగా ఉన్నా మంచి అభిరుచి ఉందే అనిపించే బ్లాగ్ "కలభాషిణి" . ఈ బ్లాగ్‌లో టపాలు చదివితే ఆ సంగతి అర్ధమౌతుంది.
జూన్ నుంచీ మొదలైన "శ్రీసుగన్ ధ్" బ్లాగ్‌లో కూడా ఆరేడు టపాలకు మించి లేవు. కానీ వీరు టపాలు ఎక్కువ రాస్తే బాగుంటుంది అనిపించేలా ఉన్నాయి 'కేకే'గారి టపాలు.
*****************************
చిగురించే కొత్త ఆశలతో
పెదవుల నవ్వుల హరివిల్లులతో
గెలుపుబాటనే పయనంతో
మధుర క్షణాల జ్ఞాపకాలతో
మీ మరొక సంవత్సరం
నిండాలని మనసారా కోరుతూ
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
తృష్ణ.
32 comments:
తృష్ణ గారూ మీ సింహావలోకనం లో నా బ్లాగుకూ చోటిచ్చినందుకు ధన్యవాదాలు.
అలాగే నాదో చిన్న కోరిక. మీ "సంగీత ప్రియ" బ్లాగులో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారికి చోటిస్తే చూడాలని ఉంది.(భజగోవిందం పెట్టారు కానీ దాన్ని శంకరాచార్యులవారు డామినేట్ చేసేసారు :) )
అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!! మీకూ, మీ కుటుంబానికి, ముఖ్యంగా మీ అన్నయ్య గారికి (ఏదో కాకినాడ ఫీలింగ్ కొద్దీ ప్రత్యేకంగా మెన్షన్ చేశా :) ) ఈ కొత్త సంవత్సరం బోల్డంత బావుండాలని, 2012 నాటికి బోల్డన్ని తీపి జ్ఞాపకాలను మిగల్చాలని కోరుకుంటున్నాను.
చక్కటి పరిచయం తృష్ణా, బాగుంది. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ పాప కోరికలన్నీ, అన్నీ అంటే అన్నీనూ... తీర్చాలి మరి:)
మీ బ్లాగు కమలాన నేనున్న చాలు , ఎందుకొ నాకింక నందనవనాలు...
నీ బ్లాగు మీద పుట్టుమచ్చనయి చెల్లెమ్మొ ...తోబుట్టు రుణం తీర్చుకుంటినే తృష్ణమ్మొ...
ఈ ఎన్నెల..హహహ...ఈ చల్లని ఎన్నెల...తృష్ణ గారి బ్లాగ్‌లోనూ వెలిగె ఎన్నెలా...అహ అహహహ
మదిలో బ్లాగులు మ్రోగే...తృష్ణ గారి దగ్గరాగే..కలనయిన కనని ఆనందం...యీ బ్లాగ్న కురిసె యీ నాడే..
'యేమని వర్ణింతును..మా మంచి రాతను..మా మంచి చేతను...ఎన్నెల మనసున్న మా తృష్ణమ్మను...'...
కమ్మనీ కలలకు ఆరంభం, వెచ్చనీ చెలిమికి శ్రీ కారం....'హ్యాప్పీ న్యూ యియర్...'..తృష్ణ గారు..మీకు మీ కుటుంబానికీ....నూతన సంవత్సర శుభాకాంక్షలు....మీ ఇంట్లో చల్లని వెన్నెల కురియాలని కోరుకుంటున్నాను..
బాగుంది తృష్ణ గారు, నేను చదవని బ్లాగులను కొ్నిటిని పరిచయం చేశారు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
తృష్ణ గారూ,
నా గురించి రెండు మంచి మాటలు రాసినందుకు ధన్యవాదాలు.
I hope to deserve your compliments. ఇంకెవరో చెప్పినట్టు మనం బ్లాగ్లోకంలోనే ఎంతో మంచి స్నేహితులని సంపాదించుకుంటున్నాము.
మీ ఈ టపా వల్ల నేనూ ఇంకొన్ని మంచి బ్లాగుల గురించి తెలుసుకున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ,బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శారద
త్రిష్ణ గారు మీబ్లాగ్ నేను చూస్తూనే ఉంటాను .దాదాపు అన్నిపోస్టులు చదివాను .thankyou trishna gaaru .మీ అమ్మాయికి నా శుభాశీస్సులు happy new year to you also..
తృష్ణ గారు...ఎంత సర్ప్రైస్ చేసారు :)
మీ పోస్ట్ చదువుతూ "సాగర సంగమం" లో కమలహాసన్‌లా శారద గారు, మెహర్ గారు, Shanky గారు,సుధీర గారు ఈసారి అందరూ పెద్ద వాళ్ళే,అయినా రాసిపెట్టి ఉండాలి,తృష్ణ గారికి నచ్చిన బ్లాగ్ లిస్ట్‌లో ఉండాలంటే అనుకుంటూ కిందిదాకా వస్తే .....నా బ్లాగు. హెంత ఆనందపడ్డానో :)))
మీకు బోల్డు టాన్కూస్.
మీకు,మీ కుటుంబానికి హాప్పీ హాప్పీ హాప్పీ న్యూ హియర్ (ఎమోషనల్ గొంతన్నమాట) తృష్ణ గారు .....
happy new year తృష్ణ garu.. :)
మా మైత్రి వనం గురించి మీరు రాసిన మంచి అభిప్రాయాలకు మా అందరి తరపున, ధన్యవాదాలండి
రామకృష్ణ
బాగుంది మీ టపా. నేనూ ఈ మధ్య బ్లాగుల్ని రెగ్యులర్‌గా చూడటం లేదు. మీ టపా ద్వారా కొన్ని కొత్త మంచి బ్లాగులు తెలిసాయి.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
కొత్త బ్లాగ్ లు పరిచయం చేసేరు థ్యాంక్స్ తృష్ణ. నూతన సవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి.
థాంక్యూ తృష్ణ గారు .మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)
ఈ కొత్త సంవత్సరంలో మీ ద్వారా కొన్ని కొత్త బ్లాగుల పరిచయం బావుంది మీకు మీకుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు !
హై హై..:))) ఎంత సర్ప్రైజ్ ఇచ్చారు.. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా తృష్ణ గారు:) మీకు బోలెడన్ని థాంకులు నా గురించి నాలుగు ముక్కలు మీ టపాలో రాసినందుకు, ఇంకా మరి కొన్ని మంచి బ్లాగులు పరిచయం చేసినందుకు:)
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు:)
happy new year
తృష్ణగారికి
కొన్ని మంచి బ్లాగులతో పాటు, నా బ్లాగ్గురించి కూడా మీ బ్లాగ్‌లో ప్రస్తావించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరన్నట్లు రోజు రోజుకీ మంచి బ్లాగులు నల్లపూసలైపోతున్నాయి. క్రొత్త సంవత్సరంలోనైనా నాణ్యతగల బ్లాగులు వస్తాయని ఆశిద్దాము.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
@SHANKY:నాకూ ఆ ఆలోచన ఉందండి.తప్పకుండా ప్రయత్నిస్తాను. ఎప్పుడో రాసిన వ్యాఖ్యలోని అన్నయ్య ఇంకా గుర్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండీ.
@జగ్గంపేట: మీక్కుడానండీ. ధన్యవాదాలు.
@జయ: చాలా సంతోషం కలిగిందండీ మీ వ్యాఖ్య చూసి. తప్పకుండాను...:)
ధన్యవాదాలు.
@ఎన్నెల: మీ వ్యాఖ్య చూసి చాలా సంబరపడ్డానండీ. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: నా ప్రయత్నం కూడా అదేనండీ. ధన్యవాదాలు.
@ఎస్.ఆర్.రావు: మీక్కూడా నండీ. ధన్యవాదాలు.
@శారద: you deserve many more compliments అండి. నేను రాసినది తక్కువే. ధన్యవదాలు.
@గోదారి సుధీర: అవునాండీ. చాలా సంతోషం. చూశ్తూ ఉండండీ మరి..:)
ధన్యవాదాలు.
@mahek:మీరు నన్ను అన్నం వండుకోకుండా చేసేసారు. మీ వ్యాఖ్యతో నాకు కడుపు నిండిపోయిండని ఇక వంత చెయ్యనన్నానండి నిన్న...:)
చాలా థాంక్స్ అండి.
@కిరణ్: మీక్కూడా...thankyou.
@mhsgreamspet:మీ స్నేహాన్ని చూస్తే చాలా ముచ్చట వేసిందండీ. ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ: మరి వీలున్నప్పుడు పాతవన్నీ చదివేయండి...మొదట్నుంచీ వెన్ను తడుతున్నారు కదా మరి...
ధన్యవాదాలు.
@భావన: మీ కోసమెంత ఎదురుచూస్తున్నానో తెలుసాండీ? ఏమలా సైలెంటయిపోయారు..? అటూ వచ్చి వ్యాఖ్య రాసినా చూసుకుంటారో లేదో అని పొద్దున్నుంచీ రాయలేదు. ఇప్పుడే మీ వ్యాఖ్య చూసి బోలెడు సంతోషం అయ్యింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. డిసెంబర్ నెల కౌముదిలో మీరు రాసిన లేఖ ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను...!
thankyou very much for the wishes.
@చిన్ని: :) ఏడాదిన్నర స్నేహం..మర్చిపోలేం కదండి..ధన్యవాదాలు.
@పరిమళం: థాంక్సండి. అప్పుడప్పుడూ టపాలు రాస్తూండండీ. మరీ తగ్గించేసారు.
@మనసుపలికే: మల్లెపూల సుగంధం చాలా దూరం వ్యాపిస్తుందండీ. బాగా రాస్తున్నారు. కంటిన్యూ చేయండి...:)
ధన్యవాదలు.
@మాలా కుమార్: ధన్యవాదాలు.
@కేకే: తరచూ రాస్తూండండి. ధన్యవాదాలు.
మీ సింహావలోకనంలో నా బ్లాగును కూడా పరిచయం చేసినందుకు ధన్యురాలిని తృష్ణగారూ....
బ్లాగుమిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఒక చిన్న మనవి..
నలుగురి బ్లాగులు చదివే వేళల
నా బ్లాగొక పరి చదవండి.
ఆహా ! తృష్ణ గారు నా బ్లాగ్ కి ఇంత సినిమా ఉందని నాకస్సలు తెలియదు ................. అందులోను మీరు ప్రశంసించే అంత బాగుంది అని కూడా అనుకోలేదు ..అస్సలు నా బ్లాగ్ మీ దృష్టికి వచ్చింది అని కూడా అనుకోలేదు
అంత అందమైన బ్లాగ్ ల మద్య నా సోది బ్లాగ్ ని కూడా చేర్చినందుకు ఏ విధంగా తీర్చుకోగలను మీ రుణం .... ఏ పూలు తేవాలి మీ పూజకు....నాకెంత సంతోషంగా ఉందో తెలుసా తృష్ణ గారు:) మీకు బోలెడన్ని థాంకులు ....... మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
@రాధ: భలేవారే...అంతమాట ఎందుకండి..మీరు బాగా రాస్తున్నారు. ఇంకా మంచి మంచి టపాలతో మమ్మల్ని అలరించాలని కోరిక. అంతే.
ధన్యవాదాలు.
@శివరంజని: మీది మామూలు సినిమా కాదండీ...70mm సినిమా...:) మీ టపాలతో మీరు తెప్పించే నవ్వుల పువ్వులు నాదాకా వచ్చాయి మరి. అలానే నవ్విస్తూ ఉండండి.
Thank you for reading my older posts...keep reading!!
హా! నాబ్లాగుని కూడా పెట్టారు తృష్ణగారు! ఏంత మంచి వారో! మీకు సీతాకోకచిలుకలు కావలా? ఎంతసేపు! ఇలా నేను పంపిస్తా అలా మీ తోటలోకి వచ్చి వాలిపోతాయ్! సరేనా! చాలా థాంక్స్ అండీ నా బ్లాగ్‌ని గుర్తించి...గుర్తుపెట్టుకుని మీరు వ్రాసినందుకు :)
Post a Comment