సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, December 5, 2010

కొత్త పాఠం


ఒకోసారి మనం అస్సలు చెయ్యద్దు..వద్దు అనుకున్న పనులు చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే సరైన కారణం చెప్పలేం కానీ చేసేస్తూ ఉంటాం. కానీ తల బొప్పి కట్టాకా అప్పుడు అనిపిస్తుంది ఇలా చేసి ఉండాల్సింది కాదు అని. సరే తల బొప్పి కడితేనే కదా కొత్త పాఠం నేర్చుకునేది.


మనం చేసిన పని 'సద్భావంతో చేసాం' అని మనం అనుకుంటే సరిపోతుందా? ఎదుటివారు ఎలా అనుకుంటారో అని ఒక్క క్షణం ఆలోచిస్తే కొన్ని పనులు మనం అసలు చేయనే చేయం. మన సద్భావం వాళ్ళకు వెర్రితనంగానో, పిచ్చితనం గానో అనిపించే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ విధి వక్రించటం వల్లో, మనకు ఆవేళ తలనెప్పి వచ్చే అవకాశాలు రాసిపెట్టి ఉండటం వల్లనో కొన్ని పనులు అలా చేసేస్తాం అంతే. ఆ తర్వాత ఎంత పీక్కున్నా ఏం లాభం? అయితే ఒక పని మాత్రo చేయచ్చు వందోసారి తప్పు చేసాకా కూడా నూటొక్కోసారి సరిదిద్దుకోవచ్చు. బుర్రలో ఏ కొద్దిపాటి బుధ్ధి అయినా మిగిలి ఉంటే.


చాలా సందర్భాల్లో ఏ ఇద్దరు మనుషుల అభిప్రాయాలూ ఒకేలా ఉండవు. అలాంటప్పుడూ మనం "మంచి" అనుకున్నది ఎదుటివాళ్ళు కూడా 'మంచి' అనుకుంటారు అనుకోవటం కేవలం మన 'అపోహ' అని మనం అర్ధం చేసుకోవాలి. అతిమంచితనం ఎప్పుడూ అనర్ధాలకే దారి తీస్తుంది అని తెలుసుకోవాలి. వంద పొరపాట్లు చేసాకా అయినా సరే. కనీసం నూటొక్కోసారి అయినా పొరపాటు చెయ్యకుండా ఉంటాం.


ఆదివారం పొద్దున్నే ఈ సుభాషితాలేమిటండీ అంటారా? ఇది పాతదే అయినా మళ్ళీ మరోసారి నేను నేర్చుకున్న కొత్త పాఠం.

అతి సర్వత్ర వర్జయేత్ ! ( excess of anything is bad) అని ఊరికే అన్నారా పెద్దలు..!!

3 comments:

Sravya V said...

ఓహ్ తృష్ణ గారు మీరు ఈ టపా ఎందుకు ఇప్పుడు రాసారో తెలియదు కాని , ఇది ఇవాళా నేను ఫీలయింది కూడా
---------------------------------
అతి సర్వత్ర వర్జయేత్ ! ( excess of anything is bad)

జయ said...

Yes Trishna, too much of anything is good for nothing:)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నేర్చుకుంటూ ఉందాం. అప్పుడప్పుడూ పాతపాఠాలే. కాకపోతే ఆరోజు కొత్తగా అంతేతేడా