సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, December 30, 2010

గొల్లపూడిగారి "సాయంకాలమైంది"


గతంలో గొల్లపూడి మారుతీరావు గారు రాసిన "ఎలిజీలు" చదివాకా ఆ పుస్తకం గురించి రాయాలనిపించింది. ఇప్పుడు "సాయంకాలమైంది" చదివగానే నాకు కలిగిన ఆలోచనలు రాయాలనిపించింది. కాబట్టి ఈ టపా నవల చదవగానే కేవలం నాలో కలిగిన అభిప్రాయాల సారం. అంతే.

అన్ని నవలల్లోనూ సాహసకృత్యాలో, రొమాన్సో, జనోధ్ధరణో చేసే హీరోనే ఉండనఖ్ఖరలేదు. కొన్ని నవలల్లో కథను తన చూట్టూ తిప్పుకునే ఒక ముఖ్య పాత్రధారి కూడా ఉంటూంటాడు. అతడే "Protagonist". ఎవరిచుట్టు అయితే కథ మొత్తం తిరుగుతుందో, ఎవరివైపైతే మన సానుభూతి వెళుతుందో, కథలో ప్రాముఖ్యత ఏ పాత్రకైతే ఉంటుందో అతడ్ని Protagonist అంటారు. "శంకరాభరణం" సినిమాలో Protagonist "శంకరశాస్త్రి"గారైతే, గొల్లపూడిగారి "సాయంకాలమైంది" నవలలో Protagonist "సుభద్రాచార్యులు" గారు. సుభద్రాచార్యులుగారి మరణంతో మొదలైన కథ ఆయన పూర్వీకుల చరిత్ర, ఆయన జీవనపయనం ఎలా గడిచిందో మొదలైన విశేషాలతో నడుస్తుంది. కథలో మిగిలిన పాత్రలు బలమైనవే అయినా మొత్తం కథకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ సుభద్రాచార్యులుగారు.

ఇది ఒక Picturesque novel. అంటే చదివే ప్రతి దృశ్యం, సన్నివేశం కళ్ల ముందు జరుగుతున్నట్లు ఉంటుంది. కళ్ళకుకట్టినట్లున్న వర్ణన ఇది కల్పితం కాదేమో ఎక్కడైనా నిజంగా జరిగిన కథేమో అనిపిస్తుంది. టైటానిక్ సినిమాలో సినిమా అయిపోయాకా పాడుబడిన షిప్లోంచి షాట్ మళ్ళీ లోపలికి వెళ్ళి అందరూ ఆడుతూ పాడుతూ ఉండే దృశ్యాన్ని చూపిస్తారు. అలాగ ఈ నవల చదవటం అయిపోయాకా అందులో పాత్రలన్నీ టాటా చెబుతూ వెళ్పోతున్నట్లు అనిపించింది. 2001లో ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో సీరియల్ గా వచ్చినట్లు పుస్తకంలో రాసారు. కానీ అప్పటికీ ఇప్పటికీ తమ పిల్లలు విదేశాలలో ఉండే చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఏమీ మారలేదని ఇంకా దిగజారిపోయిందనే అనిపించింది నాకు.

కథలో నా ఆసక్తి అంతా సుభద్రాచార్యులుగారి పైనే ఉండిపోయింది. ఒక సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ, చిన్ననాటి నుంచీ దాన్ని కాపాడుకోవటానికి ఆయన పడే ఆరాటం, తాపత్రయం, అది కాపాడుకోలేకపోతున్నప్పుడు ఆయన పడే మానసిక వేదన ప్రత్యేకంగా వర్ణించకపోయినా పుస్తకం చదువుతున్నంత సేపూ ఆ భావనలు మన అనుభూతికి అందుతాయి. సాంప్రదాయాన్ని కాపాడాలని కాకపోయినా తండ్రిని బాధపెట్టకూడదని, సదాచారానికి ఏ లోటూ రాకుండా కాపాడిన పెదతిరుమలాచార్యులవారి పారంపర్యం సుభద్రాచార్యులుగారు స్వీకరించినట్లు అతని కుమారుడు తిరుమల కొనసాగించలేకపోతాడు. తల్లి మరణించినప్పుడు అతనిలో కలిగిన ప్రకంపనలు తండ్రి మరణం సమయానికి ఉండవు. తండ్రి కర్మకాండలకు ఎప్పుడో తీసేసిన యజ్ఞోపవీతాన్ని వేయించి కర్మకాండంతా జరిపించటం బాధను కలిగిస్తుంది. ఆ వాక్యంతోనే నవలలో రచయిత చెప్పదలుచుకున్న విషయం అర్ధమైపోతుంది. పెట్టిన నవలాశీర్షికకు అర్ధం గోచరమౌతుంది.

వరదమ్మ కాలంచేసాకా "సుభద్రాచార్యులవారి కథకు కాళ్ళు చేతులు లేవు" అంటారు రచయిత. ఆయన జీవితంలో ఆమె లేని లోటు ఆ ఒక్క వాక్యం చెబుతుంది. "మడిబట్ట ఆరవేసుకోవటం కొత్త...నళీనాక్షమాల పెరిగిపోతే నల్లదారంతో అతుకులు వేసుకోవటం కొత్త" "ఏభైఏళ్ళు అలవాటైన పిలుపు పిలిస్తే వరద పలకకపోవటం కొత్త" లాంటి వాక్యాలు భార్యను పోగొట్టుకున్న భర్త ఏం కోల్పోతాడో తెలుపుతాయి. ఇద్దరు పిల్లల్ని కని కూడా చివరిరోజుల్లో అలా ఒంటరిగా, వండిపెట్టే దిక్కులేని దీనస్థితిలో ఉన్న ఈ నిష్ఠాగరిష్ఠులు జీవితంలో సాధించిందేమిటి? అనిపిస్తుంది. అంతవరకూ కాస్తో కూస్తో అభిమానం ఉన్న ఆయన పిల్లలపై కోపం వస్తుంది. రెక్కలు రాగానే కష్టనష్టాలు భరించి పెంచిన తల్లిదండ్రులను మరిచి ఎగిరిపోయే కృతజ్ఞత, బాధ్యత తెలీని పిల్లలపై కోపం వస్తుంది.

ఈ ఉత్కృష్టమైన కథలో ఉదాత్తమైన పాత్ర ఎవరిదైనా ఉందీ అంటే అది సంజీవి పాత్ర.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో నిండిన ఆ పాత్ర బరువు మిగిలిన పాత్రల మంచితనాన్ని ఆక్రమించేస్తుంది. పెళ్ళి రోజు బహుమతిగా నవనీతాన్ని తిరుమలతో మాట్లాడించినప్పుడే అతని వ్యక్తిత్వం ఆకాశం అంత ఎదిగిపోతుంది. మరొకరిని ప్రేమించే స్త్రీని మనస్ఫూర్తిగా తనదాన్నిగా చేసుకోవటం, జీవితాంతం అదే అనురాగాన్ని, అభిమానాన్ని అందివ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఉద్రేకాలు, భేదాలు, ఖేదాలు లేని తృప్తి నిండిన ఆదర్శప్రాయమైన జంట వాళ్లది. మనస్థైర్యం, జీవనవేదాంతం ఉండాల్సిన పాళ్లలో ఉన్న నిండుకుండ నవనీతం పాత్ర.. తనపై జరిగిన అత్యాచారం తన శరీరానికే గానీ మనసుకు, ఆత్మకూ కాదన్న సత్యం అర్ధం అయిన స్థితప్రజ్ఞత నవనీతానిది. తిరుమలతో ఆమెకున్న అనుబంధం ఆత్మబంధం. వాళ్ళిద్దరూ ఆత్మబంధువులు. అంతే. కళ్ళు లేని "నారిగాడిని" పెంచుకుందానని భర్తను అడిగిన ఆమె కోరికలో మరొక బిడ్డ అనాథగా పెరగకూడదన్న సద్భావం కనబడుతుంది.

తల్లిని, చెల్లెలిని గొప్పగా అభిమానించి, ప్రేమించే తిరుమల తండ్రిపై గౌరవాభిమానాలున్నా వాటిని నిలబెట్టుకోలేని అసమర్ధునిలానే కనిపిస్తాడు. తరతరాలుగా మహోన్నతంగా కాపాడబడి వెలిగించబడిన శ్రీవైష్ణవ ఆచారం, సాంప్రదాయం అతని హయాంలో సన్నగిల్లుతుండగా చూసి బాధపడని పాఠకుడు ఉండడేమో. ఎంత వయసు ప్రభావం అని సరిపెట్టుకుందామన్నా శ్యామల విషయంలో అతని తొందరబాటూ, అమెరికాలో పాడ్ తో ప్రేమాయణం తిరుమల పాత్రలోని గాంభీర్యాన్ని పోగొడతాయి. నవనీతం వంటి ఉత్తమురాలితో అతని వివాహం జరగకపోవటమే మంచిదయింది అనిపిస్తుంది. సంజీవి తరువాత నన్ను ఆకర్షించిన మరో పాత్ర కూర్మయ్యది. విద్య వివేకాన్నీ, వినయాన్ని ఇస్తుందన్న వాక్యానికి ఉదాహరణ ఈ పాత్ర.. నవలలో కన్నతల్లిగా వరదమ్మ చూపెట్టిన పుత్రవాత్సల్యం సహజమైనదే. కానీ తండ్రుల్లో కూడా కన్నతల్లికి మించిన పుత్రవాత్సల్యాన్ని "రేచకుడు" పాత్రలో చూసి మనసు ఆర్ద్రమౌతుంది.

తిరుమల ఉన్నతికీ, అతనిలోని ప్రతిభ బయటకు రావటానికీ కారణభూతుడైన వెంకటాచలం ఎంత మంచిపని చేసాడనిపించినా, చివరలో అతనికి వచ్చిన వ్యాధి, కష్టాలు చదివితే నిష్ఠాగరిష్ఠులైన సుభద్రాచార్యులు వంటి అమయక వైష్ణవుడిని మోసం చేసిన పాపమే అదని అనిపిస్తుంది. ప్రేమ ఎంత గొప్పదైనా తల్లిదండ్రుల గౌరవప్రతిష్ఠలను గాలికి వదిలేసి కూర్మయ్యను వివాహమాడిన ఆండాళ్ళు పాత్ర కూడా అటువంటిదే. తండ్రి పార్ధివశరీరాన్ని దగ్గర నుంచి చూసి, ఆఖరి నమస్కారం చేసుకోలేని దుస్థితి స్వయంకృతమే. కానీ "To err is human" కదా. అందుకనేనేమో మనకు కూడా perfection ఉన్న పాత్రల కన్నా పొరపాట్లు చేసే పాత్రల పట్లే సానుభూతి, దగ్గరితనం కలుగుతుంది. ఎందుకంటే అవి సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలు కాబట్టేమో. అలా సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రల్లో మనల్ని మనం పోల్చుకోవటం వల్లనేమో చాలా నవలలు, వాటిల్లోని పాత్రలు మనకు గుర్తుండిపోతాయి.

"భరించరాని దు:ఖం మనిషిని ఆవరించినప్పుడు ఎండు జరుగుతాయి. వేదన గల మనిషి పిచ్చివాడయినా అవుతాడు. అంత:కరణ గల వ్యక్తి ఊహించని మలుపుతో ఏకోన్ముఖుడౌతాడు."
"కన్నీళ్ళు ఆర్ద్రతకీ, అభిమానానికీ, క్షమాపణకీ, పశ్చాత్తాపానికీ, ప్రేమకీ, ఆవేశానికీ అన్నిటికీ నిదర్శనమనే సంస్కృతిని చాలా చిన్నతనంలోనే నష్టపోయిన దురదృష్టవంతుడతను";
"ఇంకా సెంటిమెంటుకు దూరం కాని 22ఏళ్ళ నల్ల పిల్ల";
"కొత్త ఆకర్షణలు అలవాటయి, అవసరమయి, వ్యసనమయి, వదులుకోలేని లంపటమయి...";
"మేధస్సు అగ్నిశిఖలాంటిది. దాని ఆకర్షణకి లోనైన ఏ పదార్ధాన్ననినా అది జీర్ణం చేసుకుంటుంది."
"మృత్యువు కొందరికి విముక్తి, కొందరికి విజయం, కొందరికి ముగింపు, కొందరికి అవకాశం" మొదలైన నవలలోని ఎన్నో వాక్యాలు గొల్లపూడిగారి జీవితాన్ని, మనుషులనూ ఎంత బాగా అర్ధం చేసుకున్నారో తెలుపుతాయి. శ్రీవైష్ణావ సాంప్రదాయాన్నీ, పధ్ధతుల్నీ ఎంతో శ్రధ్ధతో తెలుపుతూ రాసిన రచనావిధానం ముచ్చటగొలుపుతుంది. అయితే అక్కడక్కడా కథలో చోటు చేసుకున్న కొన్ని "వర్ణనలు" అవసరమా అనిపించాయి. బహుశా ఒక వారపత్రికలో సీరియల్ కోసం రాసినదవటం వల్ల ఆ విధంగా రాయాల్సివచ్చిందేమో మరి. అటువంటి వర్ణనలు, సన్నివేశాలు లేకపోయినా ఈ ఉత్కృష్టమైన కథకు వచ్చే లోటేమీ లేదనిపించింది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

చదివిన చాలాకాలం మనసు పొరల్లో గుర్తుండిపోయే కథ, పాత్రలు రెండూ ఈ నవల ప్రత్యేకతలే. కేరెక్టర్ ఎనాలసిస్ కు ఉపయోగపడేలాంటి రకరకాల స్వభావాలు గల పాత్రలున్న ఈ నవలను పిజీ స్టూడెంట్స్ సిలబస్ లో ఒకపుస్తకంగా చేరిస్తే బాగుంటుండేమో అని కూడా అనిపించింది. అలాంటి ప్రతిపాదన ఇప్పటికే ఉందేమో తెలీదు మరి.

11 comments:

సూర్యుడు said...

ఈ నవల ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?

తృష్ణ said...

@సూర్యుడు: "విశాలాంధ్ర"లో ప్రయత్నించండి. ఇది "జ్యేష్ఠ లిటిరరీ ట్రస్ట్, విశాఖపట్నం" వాళ్ళ పబ్లికేషన్ అండి. పుస్తకంలో వాళ్ళ ఇచ్చిన ph.no:0891-535550. నాకైతే నాకైతే పుస్తకప్రదర్శనలో దొరికిందండీ.

సూర్యుడు said...

థ్యాంక్సండీ.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

:)
ఇదెందుకో తెలుసుగా.
అక్కడ కొన్నమిగతా పుస్తకాల గురించికూడా రాయాలిమరి. ఎదురుచూస్తుంటా. ఒకసారి ఈపుస్తకాన్ని చదివితేగానీ టపాలో రాసిన కొన్నివాక్యాలు అర్థంకావు.

Anonymous said...

నేను దీన్ని ఆంధ్రప్రభలో సీరియల్ గ వచ్చినప్పుడు చదివాను. ఈరోజుకీ గుర్తున్న పాత్ర రేచకుడు. ఈ పుస్తకం కొనుక్కోవాలని చాల రోజులనుండీ అనుకుంటున్నాను. యెన్నాళైనా వెంటాడే, మర్చిపోలెని పుస్తకాల్లో ఇది ఒకటి.

పద్మవల్లి

Anonymous said...

చాలా మంచి పుస్తకాని పరిచయం చేసారు తృష్ణగారూ. నేనింతవరకూ చదవలేదు. దొరికినప్పుడు చదవాలి.
శారద
I envy all you people who went to that book exhibition :)

Somasekhar said...

చాలా detailed review.
గొల్లపూడి గారిదే 'వెన్నెల కాటేసింది' అని ఇంకో చిన్న నవల ఆయన blog లో దొరికితే recentగా ఒకసారి చదివాను. అవ్వడానికి అది just ఒక routine story ye అయినా ఆయన writing style చాలా నచ్చింది. ముఖ్యంగా నాకు నచ్చినది, దాచుకోదగిన మంచి quotations లాంటి మాటలు చాలా ఉన్నాయి ఆ రచన లో. 2,3 pages చదివే సరికే కనీసం 5 మంచి quotations లాంటి వాక్యాలు మనకి కనిపిస్తాయి.
ఇప్పుడు మీ review చూస్తుంటే ఈ పుస్తకం కూడా అలాగే అనిపిస్తోంది. ఇదే review మీరు ఒక వారం ముందు post చేసి ఉంటే, ఈ book కొనేసేవాడినే నేను. మొన్న book fair కి వెల్లినప్పుడు ఈ పుస్తకం కనిపించినా, ఎలా ఉంటుందో అనిపించి కొనలేదు.
Awaiting reviews of other books that you bought at book fair.

తృష్ణ said...

@సూర్యుడు: ధన్యవాదాలు.

@చైతన్య: :) <- ఎందుకు? అర్ధం కాలా.
పుస్తకాల గురించి రాయాలంటే అవి చదివే సమయం కూడా ఉండాలి కదా...:) ప్రయత్నిస్తాను. థాంక్స్.

@పద్మవల్లి: మంచి పుస్తకమండీ. తప్పక చదవండీ.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@శారద: మీ వ్యాఖ్య సంతోషం కలిగించిందండీ. ప్రదర్శన ఏర్పాటైతే మరి వెళ్ళకుండా, వెళ్ళి కొనకుండా ఉండగలమాండీ...:)
ధన్యవాదాలు.

@సోమశేఖర్: చాల సంతోషం. అయితే అదీ చదువుతాను. ప్రదర్శనలో కుదకకపోతేనేం షాపుకెళ్ళి కొనుక్కోవచ్చు కదా...:)
ధన్యవాదాలు.

జ్యోతిర్మయి said...

తృష్ణ గారూ మీ బ్లాగ్ ఈ మధ్యనే చూస్తున్నాను..మంచి పుస్తకాల గురించి ప్రస్తావించారు. చాలా మంచి పుస్తకాలు పరిచయం చేశారు. ధన్యవాదాలు

తృష్ణ said...

@జ్యోతిర్మయి: నే రాసిన పరిచయాలు నచ్చినందుకు ధన్యవాదాలు.