నేను ఇల్లు సర్దుకుంటూంటే మా అమ్మాయికి ఒక డబ్బా దొరికింది. అమ్మా ఇవి బాగున్నాయి నాకిచ్చేయ్ అని గొడవ. దాని చేతిలోంచి అవి లాక్కుని దాచేసరికీ తల ప్రాణం తోక్కొచ్చింది. నాన్న పదిలంగా దాచుకున్నవి నేను జాతీయం చేసేసాను. ఇప్పుడు నా కూతురు నా నుంచి లాక్కోవాలని చూస్తోంది...ఇదే చిత్రం అంటే...:) అవే పైన ఫోటోలోని బినాకా బొమ్మలు. ఒకానొకప్పుడు "బినాకా టూత్ పేస్ట్" వచ్చేది కదా. ఆ టూత్ పేస్ట్ పెట్టే కొన్నప్పుడల్లా ఒక బొమ్మ ఇచ్చేవాడట. ప్రతి నెలా అట్టపెట్టె లో ఏ బొమ్మ ఉంటుందా అని ఆసక్తిగా ఆత్రంగా కేవలం ఆ బొమ్మల కోసమే ఆ టూత్ పేస్ట్ కొనేవారట నాన్న. ఇప్పటికీ రంగు తగ్గకుండా ఎంత బాగున్నాయో.
ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చిన్న చిన్న బొమ్మలకు ముందు అయితే క్రింద ఫోటోలోలాగ గోడకో, అద్దానికీ, తలుపుకో అంటించుకునేలాగ కొన్ని బొమ్మలు ఇచ్చేవాడట. నాన్న అద్దానికి అంటించిన ఈ క్రింది లేడిపిల్ల బొమ్మను చూడండి..ఈ బొమ్మ వయసు సుమారు ముఫ్ఫై ఏళ్ళ పైమాటే.
ఇవికాక చిన్న చిన్న ప్లాస్టిక్ జంతువుల బొమ్మలు కూడా కొన్నాళ్ళు ఇచ్చారు బినాకావాళ్ళు. అవయితే పెద్ద పెట్టే నిండుగానే ఉన్నాయి. వాటితో ఏదో తయారు చేద్దామని దాచాను. ఇంతవరకూ చెయ్యనే లేదు. అవి అమ్మ దగ్గరే భద్రంగా ఉన్నాయి. "బినాకా" పేరును "సిబాకా" కూడా చేసారు కొన్నాళ్ళు. తరువాత ఆ పేస్ట్ రావటం మానేసింది.
అప్పటి రోజుల్లో సిలోన్ రేడియో స్టేషన్లో అమీన్ సయ్యానీ గొంతులో బినాకావాళ్ళు స్పాన్సార్ చేసిన టాప్ హిందీ పాటల కౌంట్ డౌన్ షో "బినాకా గీత్మాలా" వినని సంగీత ప్రేమికులు ఉండరు అనటం అతిశయోక్తి కాదు. నేను సిలోన్ స్టేషన్లో బినాక గీత్మాలా వినటం మొదలెట్టాకా ఒక డైరీలో ఆ పాటలు నోట్ చేసేదాన్ని కూడా. స్టేషన్ సరిగ్గా పలకకపోయినా ట్రాన్సిస్టర్ చెవికి ఆనించుకుని no.1 పాట ఏదవుతుందా అని చాలా ఉత్కంఠతతో ఎదురుచూసేదాన్ని...అదంతా ఓ జమానా...!!
17 comments:
నాన్నగారు దాచిన ఆ బినాకా బొమ్మలు నిజమైన ఆస్తి
వాటిని గ్లాస్ షీట్ మీద అతికించి జూ లా డెకరేట్ చేసి పైన మళ్ళీ గ్లాస్ తో మూసేయండి
ఎవరూ ముట్టుకోకుండా.
నా దగ్గర 38 ఏళ్ళ క్రితం మా పెదన్నన్నగారు ఇచ్చిన గాంధి బొమ్మలపుస్తకం ఉంది
అది తెరిచి నప్పుడల్లా ఏడేళ్ళ పిల్లాడి నైపోతా కొత్తగా వింతా చూస్తూ...
మీ అన్ని కలెక్షన్స్ భలే ఉంటాయండీ,
చాలా బాగా రాస్తారు మీరు
నిజమే... ఆ రోజుల్లో ఈ బినాకా బొమ్మల కోసమే పేస్టు కొనే వాళ్ళం...సిలోన్ రేడియోలో ఆ గొంతు లోని మాధుర్యాన్ని ఆశ్వాదించడం కోసం.... చెవులు రిక్కించుకొని మరీ వినేవాళ్ళం.... ఈ మధురానుభూతులు ఈ తరం వాళ్ళకి తెలీదు..... మన చిన్ననాటి విషయాలు గుర్తు చేసినందుకు ధన్యవాదములు.....
చాలా బాగున్నయ్ బొమ్మలు.నాకు ఈ పేస్ట్ తెలీదు :( లెకపోతే నేను కలెక్ట్ చేసేదాన్ని ఈ బొమ్మలు :) చాలా భద్రంగా దాచుకున్నారే!
తృష్ణ గారూ !
చిన్నప్పుడు ఆ బొమ్మలకోసమే ' బినాకా ' పేస్టు కొనేవాళ్ళం.
అమీన్ సయ్యనీ గొంతు కోసమే ' బినాకా గీత మాల ' వినేవాళ్ళం.
ఈ రెండిటినీ గుర్తు చేసిన మీకు ధన్యవాదాలు.
ఇలాంటి ట్రెజర్ జాగ్రత్తగా కాపాడుకోవడం ఓ కళండి. ఇలా అప్పుడప్పుడు బయటపడితే ఎంత సంతోషంవేస్తుందోకదా.. ఈ బొమ్మల గురించి తెలీదు కాని అమీన్ సయ్యానీ గురించి తెలుసు. కొన్నేళ్ళక్రితం ఇతని వ్యాఖ్యానంతో అప్పటి బినాకా టాప్ సాంగ్స్ తో క్యాసెట్స్ కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో నాదగ్గర ఉండేవి ఇప్పుడు ఎక్కడ పోయాయో తెలీదు.
నేనూ ఈ బొమ్మల కోసం బినాకా కొనమని చాలా గోల చేసేవాణ్ణి చిన్నప్పుడు కానీ మా యింటో ఆస్థాన టూత్‌పేస్టు తప్ప ఇంకోటి కొనేవారు కాదు.
చాలా సంతోషంగా వుంది.బినాకా గీత్ మాలా,బినాకా బొమ్మలు మరపురాని నా చిన్ననాటి జ్ఞాపకాలు.మరోసారి గుర్తు చేసినందుకు Thank you.
చాలా బాగున్నాయి. విన్నాను కాని ఎప్పుడూ చూడ లేదు. పాపం చిన్న పిల్ల అడుగుతుంటే ఇవ్వక పోవటమేమిటి. ఇచ్చి మీ లాగే జాగ్రత్తగా పెట్టమని చెప్పండి మరి.
@ఆత్రేయ: బావుందండీ మీఋ చెప్పిన ఐడియా కూడా. నేను పూసలతో డోర్ కర్టెన్ చేసినట్లు ఆ బొమ్మలు వరుసగా గుచ్చి చేద్దాం అనుకున్నాను.
చిన్నప్పటి కలక్షన్స్ లో ఉండే ఆనండమే వేరండి.
@లత: ఏదో సరదా అండీ. మీలా ఆందించేవాళ్ళుంటే పంచుకోవటానికి బోలెడు కబుర్లు...:)
@వోలేటి: అమీన్ సయ్యానీ గాత్ర మాధుర్యానికి దేశమంతా సలామంది కదండి. సిలోన్ స్టేషన్ సరిగా రాకపోతే ఇంట్లో ఏ మూల బాగా వస్తుందో అని ప్రతి మూలా నక్కుతూ, ఇల్లంతా తిరుగుతూ బినాకా గీత్మాలా విన్న రోజులు మరువలేనివండీ..
@ఇందు: ...:) అవునండీ. ఇలాంటివింకా ఎన్నో..
@ఎస్.ఆర్.రావు: చాలా రోజులకు కనిపించారు..."బినాకా గీత్మాలా" అంత అద్భుతమైనది మరి.
@వేణూ శ్రీకాంత్: అమీన్ సయ్యానీ గురింఛి ఒక టపా రాయాలని చాలా రోజులనుంచీ..ఎప్పుడో రాయాలండీ. ఆయన ఒక లెజెండ్. ఇప్పుడు ఆయన వాయిస్, ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో కూడా దొరుకుతున్నాయండీ.
@కొత్తపాళీ: నా చిన్నప్పుడూ మా ఇంట్లో వజ్రదంతీ(ఇప్పటికీ) లాగన్న మాట...:)
@సి.ఉమాదేవి: జ్ఞాపకాలు అపురూపమైనవి కదండీ మరి.
@జయ: పాపకి వాటిని భద్రపరిచే జ్ఞానం ఇంకా రాలేదండీ. ఇన్నాళ్ళు భద్రంగా దాచుకున్నవి పాడుచేస్తుందని భయం. ఆ పరిపక్వత వచ్చాకా నే దాచుకున్న ట్రెజర్స్ అన్నీ దానికే కదా...:)
అబ్బో! నాకూ ఉండేది ఈ బినాకా బొమ్మల పిచ్చి. అదేంటో చూడగానే ముద్దొస్తాయి. ఇంట్లో కొనమంటే అస్సలు కొనేది కాదు అమ్మ. పిన్నివాళ్లు మాత్రం బినాకా పేస్ట్ మాత్రమే కొనేవాళ్లు. వాళ్లింటికి వెళ్లినప్పుడల్లా వాళ్లు దాచుకున్నవి, ఇంకా విప్పని కొత్తపేస్డ్ డబ్బా తెరిచి ఎంతో బ్రతిమిలాడి బొమ్మలు తెచ్చుకునేదాన్ని. దానికోసం మా తమ్ముళ్లతో ఫైటింగ్ కూడా జరిగిన సందర్భాలున్నాయి.
తృష్ణ గారూ !
చిన్నప్పుడు ఆ బొమ్మలకోసం తమ్ముళ్ళ నేను పోటీలు పడేవాళ్ళం. కానీ ఎక్కువ రోజులు అవి వచ్చిన గుర్తు లేదు. అమీన్ సయాని గొంతు అన్నా బినాకా గీత మాల అన్నా చాలా పిచ్చి నాకు. అయన విడియోలు కోసం ytube లో వెతకాలి అయితే. మీరు ఆయన గురించి ఒక టపా రాయండీ ప్లీజ్.
పద్మవల్లి
ప్రఖ్య నీకన్నా జాగ్రత్తగా దాచిపెడుతుంది.
@కొత్తపాళి: 'ఆస్థాన'హహహ. అమ్మమ్మ గుర్తొచ్చింది
@జ్యోతి: బాగునాయండీ మీ బినాకా బొమ్మల కబుర్లు కూడా.
@పద్మవల్లి: ఆ ప్రయత్నం మీదే ఉన్నానండీ. తప్పకుండా రాస్తాను. అమీన్ సయానీ/యూట్యూబ్ అని గూగుల్లో కొడితే యూట్యూబ్ లింక్స్ అవే వస్తాయండీ. ఇంటర్వ్యూస్ అవీ బానే ఉన్నాయి లింక్స్.
@చైతన్య: ముందు ముందు ఏమన్నా దాస్తుండేమో కానీ ప్రస్తుతానికి చేతిలో పడితే ధ్వంసం చేయటం ఖాయం.
Post a Comment