సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, December 20, 2010

మౌనమే నా భాష


ప్రస్తుతానికి మౌనమే నా భాష. "మాటరాని మౌనమిది..." అని పాడుకుంటూ రెండు రోజులుగా కాలం వెళ్లబుచ్చుతున్నాను. కారణమేమనగా చలితిరిగింది కదా రెన్నాళ్ళ క్రితం గొంతు బొంగురుపోయింది. పోతే పోయిందని ఊరుకోక ఆదివారం శలవు దినం ఉంది కదా అని శనివారం కాసంత బయటకు తిరిగివచ్చేసరికీ కాస్తో కూస్తో బొంగురుగానైనా పలుకుతున్న గొంతు కాస్తా పూర్తిగా మూగబోయింది. ఆదివారం పొద్దుటి నుంచీ నో సౌండ్. దూరదర్షన్లో మధ్యాన్నం బధిరుల వార్తల్లో లాగ అన్నీ మూగ సైగలే. పిలవాలంటే చప్పట్లు...ఏదైనా చెప్పాలంటే పాప చదువుకునేందుకు కొన్న బోర్డ్ పై రాతలు. 'ఫోనులు చెయ్యద్దు నేను 'మాట్లాడలేను ' అని ఫ్రెండ్స్ కు ఎస్.ఎం.ఎస్ లు, మైల్స్ చేసేసాను. ఇదీ వరస.

'అబ్బ...ఎంత హాయిగా ఉందో రెండు రోజులు నేను ప్రశాంతంగా ఉండచ్చన్నమాట. రెండురోజుల్లో అదే వస్తుందిలే...' అన్న శ్రీవారి కులాసా వాక్యంతో అసలే నెప్పిగా ఉన్న గొంతు ఇంకొంచెం భగ్గున మండింది. నాకసలే ఒకటికి నాలుగు వాక్యాలు చెప్పటం అలవాటు. నోరు కట్టేసినట్లు ఉందనటానికి ఇంతకంటే గొప్ప ప్రాక్టికల్ ఎక్జాంపుల్ ఏముంటుంది? అనుకున్నాను. ఎప్పుడో స్కూల్లోనో, కాలెజీలోనో ఉన్నప్పుడు ఇంతలా గొంతు పోయింది. ఆ తరువాత మళ్ళీ ఇదే. ఎంతైనా ఇన్నాళ్ళూ నన్ను రక్షించిన "జలనేతి" ఎఫెక్ట్ తగ్గిపొతోందని గ్రహించాను. "జలనేతి" ఏమిటీ అంటే, "బీహార్ స్కూల్ ఆఫ్ యోగా" వాళ్ల దగ్గర నేను యోగా నేర్చుకున్నప్పుడు వాళ్ళు నేర్పించిన ఓ ప్రక్రియ "జలనేతి". తల పక్కకు వంచి, కొమ్ము జారీ లోంచి గోరువెచ్చని ఉప్పు నీరు ఒక నాస్ట్రిల్ లోంచి లోపలికి పోసి, ఇంకో నాస్ట్రిల్ లోంచి బయటకు వదిలే ప్రక్రియ. అందువల్ల కలిగే ప్రయోజనాలైతే కోకొల్లలు. చాలా రకాల తలనెప్పులు, ఆస్థ్మా, బ్రోంకైటిస్, సైనస్ ప్రాబ్లమ్స్, జలుబులు ఇంకా బోలెడు నయమవుతాయి. ముక్కు లోంచి శారీరంలోకి కనక్ట్ అయ్యే కొన్ని వేల నాడులు ఈ ప్రక్రియ ద్వారా శుభ్ర పడతాయి. కానీ ఇది ట్రైన్డ్ టీచర్ దగ్గరే నేర్చుకోవాలి. మొదటిసారి మేడం మాతో చేయించిన తరువాత పొందిన అనుభూతి చెప్పలేనిది. ఆ తరువాత ఆరునెలలు చాలా జాగ్రత్తగా రోజూ యోగా, జలనేతి అన్నీ మానకుండా చేసేదాన్ని. తర్వాత తర్వాత బధ్ధకం ఎక్కువై కొన్నాళ్ళు, కుదరక కొన్నాళ్ళు...అలా అలా గడిచిపోయింది.

చిన్నప్పుడు అస్తమానం జలుబు చేసేసేది. "మా ఆయనకు కోపం రానే రాదు. వస్తే సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది. వచ్చినప్పుడలా ఆరునెలలు ఉంటుంది" అనే సామెత లాగ నాకు జలుబు సంవత్సరానికి రెండేసార్లు వచ్చి, వచ్చినప్పుడల్లా ఆరునెలలు ఉండేది. అలాంటిది అప్పట్లో ఆరు నెలలు చేసిన "జలనేతి" వల్ల దాదాపు తొమ్మిది,పదేళ్ళు దాకా ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా ఉండగలిగాను. కొమ్ము జారీని పాడేయకుండా ఎక్కడికి వెళ్ళినా వెంటపెట్టుకుని వెళ్ళాను కానీ జలనేతి మాత్రం చెయ్యలేదు మళ్ళీ. ఈ మధ్యనే ఇక త్వర త్వరగా జలుబు వచ్చేస్తోంది. ఇక ఈసారి చలి ఎక్కువగా ఉండటం వల్ల సంపూర్ణంగా గొంతు మూగబోయింది.

మాట్లాడాలి అనుకున్నవి మాట్లాడలేకపోతున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నిజంగా. చప్పట్లు కొట్టి ఇంట్లో వాళ్లను పిలవటం, పాప బోర్డ్ మీద వాక్యాలు రాసి ఇదీ అని చెప్పటం...నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. రెండు రోజులకే ఇలా ఉంటే నిజంగా ఎప్పటికీ మాట్లాడలేని వాళ్ళ పరిస్థితి ఏమిటీ? అనిపించింది. ఏదన్నా లేనప్పుడే కదా దాని అసలైన విలువ తెలిసేది.

6 comments:

గీతాచార్య said...

హ్మ్! బాధే నేరమౌనా? ఆపై మాటేలా? హహహ ఏమి ఎప్పదలచానింతకీ? ఏమో అర్థం కాలేదు. మాట్లాడకుండా గంటల తరబడి ఉండటం, మాట్లాడితే ఇహ ఒహటే మాటలు అన్నట్టుంటుంది నా పని.

ఒక్కోసారి పనిలో మునిగిపోయో, బోరనిపించో, నాలుగైదు రోజులు నోట్లోంచీ శబ్దం కూడా చెయ్యని సందర్భాలూ, ఆపైన ఎదుటివాళ్ళ చెవులు వాచి, సాగిపోయేలా (శుభ లగ్నం బ్రహ్మీ గుర్తున్నాడా?) మాటలే మాటలూ అన్నట్టుంటుంది నా పని.

మే యువర్ వాయ్స్ రిటర్న్ బా౨క్టూయూ సూన్

ఇందు said...

అయ్యయ్యొ! పాపం బాగా జలుబు చేసేసిందిగా! పర్లేదులేండీ రెండురోజుల్లో వచ్చేస్తుందీ......నాకు ఆ జలనేతి ఏంటో భలే నచ్చేసింది.చిన్నప్పుడు డీడీలో చూపించేవారు! భయం వేసేది.కానీ ఇన్ని ఉపయోగాలుంటాయని తెలియదండీ..ఏముంది మళ్ళీ ప్రారంభించండీ...జలుబు మిమ్మల్ని చూసి పారిపొతుంది :) సరేనా!

వేణూశ్రీకాంత్ said...

అయ్యో!! మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానండి.

lakshmi sravanthi udali said...

hahahaaaaa:)
enti chappatlu kotti pilustunnaraa
naaku adi chadavagaane edo cinemaalo bramhaanamdam devudi patam kanipiste dandam pettukone vidaanam gurtochchindi :)

Ennela said...

nenayite mee laaga undalenu baboo....gontu chinchukunayina sare cheppevi cheppeyyalsinde...maa vaaru chala saarlu...'nenu nee student ni kaanu...antala cheppakkarle'antoo untaaru....anta sound partee anna maata....i wish you speedee voice recovery...yee lopu voice recorder lo record chesina mee voice vunte vinipichestoo undandi...audience ni ala vadileyyadam naaku nachchalaa..

తృష్ణ said...

వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.