Tuesday, September 8, 2026

దివ్యమైన అనుభూతిని అందించిన "HANUMAN ANSH"



                                             

 క్రిందటి వారం, 'అమ్మా ఇది చూడు' అని టివీలో మరొక ట్రైలర్ చూపెట్టింది మా ఇంటి బంగారం. అరే, ఇది నీమ్ కరోలీ బాబా మీద తీశారే.. అన్నాను. రేపు పరీక్ష అవ్వగానే ఈ సినిమాకి వెళ్దాం అంది. ఓటిటిలో వచ్చాకా చూడచ్చు కదా అన్నాను. విడుదల అయి నెల అవుతున్నా ఇంకా సక్సెస్ఫుల్ గా ఆడుతోందమ్మా. ఇలాంటి సినిమాలు హాల్లో చూడాల్సిందే. మరే విధంగానూ చూడకూడదు.. అని టికెట్లు కొనేసింది. ఇక నేను ఈ సినిమా గురించిన శోధన మొదలుపెట్టాను. అమ్మాయికి తెలీదు కానీ నాకు నీమ్ కరోలీ బాబా సుపరిచితులే. పుస్తకాల ద్వారా! గత దశాబ్ద కాలంలో అదృష్టవశాత్తూ నేను పోగుచేసుకున్న అమూల్యమైన ఆధ్యాత్మిక పుస్తక భాండాగారంలో ఈయన గురించిన ఎన్నో ప్రస్తావనలు కొన్ని పుస్తకాలలో చదివాను. అల్మారాలో వెతకాలి అనుకున్నాను!


మర్నాడు మేము వెళ్ళిన హాలు చూస్తూండగానే నెమ్మది నెమ్మదిగా నిండిపోయింది. ప్రేక్షకులు చాలావరకూ తెలుగువారు కాకపోయినా యువత ఎక్కువ శాతమే కనిపించారు. ఎంతో ఆనందం కలిగింది. ఈమధ్య భావితరాల పట్ల ఎంతో ఆశ, నమ్మకం కలిగేటువంటి వారిని ఎందరినో చూస్తున్నాను. ఇక సినిమా అయ్యాకా ఎండ్ టైటిల్స్ లో ఒకమ్మాయి(బహుశా ఆమె కూడా ఒక ప్రొడ్యూసర్ అనుకుంటా) రామ నామంతో సినిమా పోస్టర్ మొత్తం తయారుచెయ్యడం చూపెట్టారు. మనసు తృప్తితో నిండిపోయింది. ఇంత మంచి సినిమా చూపెట్టినందుకు మా అమ్మాయికి థాంక్స్ చెప్పాను. కృష్ణావతారం తర్వాత మరొక అద్భుతమైన చిత్రాన్ని చూశాను. ఇక కృష్ణావతారం మత్తు లోంచి హనుమత్ భక్తిలోకి జారిపోయాను. 


ఇంటికి రాగనే ముందు పుస్తకాల బీరువా తెరిచి వెతకడం మొదలుపెట్టాను. రెండు రోజులకు ఒక మూడు పుస్తకాలు ఛాప్టర్లతో సహా రిఫరెన్సులు తియ్యగలిగాను. ఇదివరకు చదివినవే అయినా ఆత్రంగా మళ్ళీ ఆ అధ్యాయాలను చదివి ఆనందించాను. Genre ఏదైనా, మనసుకు హత్తుకునేలా సినిమా తీస్తే బ్రహ్మరథం పట్టే ప్రేక్షకులు ఈనాడూ ఉన్నారనడానికి ఈ చిత్రమే సాక్ష్యం. ఒక ప్రమోషన్ లేదు, ఏ విధమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేవు, కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా నెల రోజుల్లో వందకోట్ల మైలురాయిని దాటడం ఒక అద్భుతమే. ఇవాళ్టికి ఈ చిత్రం విడుదలయి నెలరోజులైంది!


యూట్యూబ్ లో దర్శకుడు విశాల్ చతుర్వేదీ గారి ఇంటర్వ్యూలు కొన్ని ఉన్నాయి. ఒకటి విన్నాను. ఈ చిత్ర దర్శకుడి స్వీయ రచన అయిన Divine Detour: That Changed My Life ఆధారంగా సినిమా తీశామని, ట్రైలజీ గా రూపొందిస్తున్న తదుపరి భాగాలు కూడా తెరపైకి వస్తాయని ఆయన చెప్పారు.

                                                       

 

ఇక "హనుమాన్ అంశ్" చిత్రం కబుర్ల లోకి వచ్చేస్తే, నటించింది మొదటి చిత్రమే అయినా నీమ్ కరోలీ బాబా పాత్రలో ఒదిగిపోయిన శోభినవ్ సత్యా గురించి, మహరాజ్ గారి చిన్ననాటి పాత్రను పోషించిన బాల నటుడు విహాన్ గురించీ, నలుగురు ప్రొడ్యూసర్లలో ఒకరైన చిన్న అమ్మాయి అనుప్రియ గురించి, "మైనే తేరే హి భరోసే హనుమాన్" పాటను పాడిన సునీల్ లోఢీ గురించి , గమ్మత్తైన "పార్వతి " పాటను రచించి, స్వరపరిచి, గాత్రాన్నందించిన సాధు తివారీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ కూడా తమ తమ పాత్రలను ఎంతో బాగా పోషించారు. నాకు గోపాల్ పాత్రధారి బాగా నచ్చాడు. గుహలో ధ్యానంలో ఉన్న బాబాను చూశాకా అతడు చూపెట్టిన హావభావాలు అద్భుతం. ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పడం కన్నా తప్పక చూడమని చెప్పడమే ఉత్తమం.


ఈ చిత్రాన్ని చూస్తూంటే నాకు స్వామినారాయణ సంప్రదాయాన్ని నెలకొల్పిన నీలకంఠ వర్నీ జీవనప్రయాణం గుర్తు వచ్చింది. భక్తులు ఆయనను కృష్ణ అంశగా భావిస్తారు. ఢిల్లీలో ఉన్న స్వామి నారాయణ్ మందిర్ ను మేము ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా దర్శిస్తూ ఉండేవాళ్ళం. ఆలస్యంగానైనా ఈమధ్యనే హైదరాబాదులో కూడా చక్కని స్వామి నారాయణ మందిర్ ని చూశాము. యూట్యూబ్ లో ఆయన జీవన ప్రయాణం మొత్తం ఎనిమిది భాగాల్లో అనుకుంటా ఒక సిరీస్ ఉంది. మోషన్ పిక్చర్ యానిమేషన్ లాగ తీసిన ఆ స్వామినారాయణ గారి బయోపిక్ చాలా చాలా బాగుంది. ఇలాగే, సినిమా కాదు కానీ అగస్త్యముని గురించిన ఒక డాక్యుమెంటరీ సిరీస్ ని ఒక తమిళ భక్తుడు ఒకాయన యూట్యూబ్ లో పెడుతున్నారు. స్వీయ అనుభవాలతో నిండిన ఆ డాక్యుమెంటరీ చాలా ఆసక్తికరంగా ఉంటోంది. 


మన భారతదేశం ఎందరో సాధువులు, మహాత్ములకు నెలవైన పుణ్యభూమి. గతంలో చాలామంది అవధూతలు, మహాత్ముల గురించిన ఆధ్యాత్మిక చిత్రాలు మన తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ ఎన్నో వచ్చాయి.. త్యాగయ్య, యోగి వేమన, విప్రనారాయణ, భక్త తుకారాం, సతీ సక్కుబాయి, మీరాబాయి, భక్త జయదేవ, పురందరదాసు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద మొదలైనవి నేను చిన్నప్పుడు చూసిన , గుర్తున్న సినిమాలు. ఇంకా నే చూడనివి ఎన్నో ఉండి ఉంటాయి. ఆధ్యాత్మిక చిత్రాలు ఏ భాషలో తీసినవయినా ఆచరణీయమైన సందేశాలను, మనసుకు సాంత్వనను అందిస్తాయి. 


ఆధ్యాత్మిక చిత్రాలను ఇప్పటితరానికి అర్థం అయ్యేలా, వాళ్లకి ఆసక్తి కలిగేలా, అనవసరమైన సన్నివేశాలను జోడించకుండా, ఈనాటి కాలంలో తియ్యడం అనేది కష్టతరమైన, మెచ్చుకోదగ్గ విషయం. కాబట్టి, ఈ చిత్ర దర్శకుడు విశాల్ చతుర్వేదీ గారిని తప్పక మెచ్చుకుని తీరాలి. ఇటువంటి చిత్రాలను చూసినప్పుడు కొన్ని విషయాలపై సడలుతున్న నమ్మకం నిలబడుతుంది. ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. మనం భరతభూమిపై పుట్టినందుకు గర్వం కలుగుతుంది. కావున - మనుషులు, తద్వారా సమాజమూ తరించేలాగ - ఇంకా ఎందరో మహానుభావుల, కారణ జన్ముల గురించిన బయోపిక్ లు ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.

జై సీతారామ్ !!



Suneel Lodhi's song -

 


పార్వతి song






                                                   

Friday, May 8, 2026

'Krishnavataram Part 1: The Heart

                                                    

మన తెలుగువారికి తెరపై కృష్ణుడంటే ఎన్టీఆరే. ఆ రూపాన్ని తెరపై చూసిన తరువాత నిజంగా కృష్ణుడు ఇలానే ఉంటాడేమో అనుకునేవారు అందరూ. అసలు మరే ఇతర నటుడినీ ఆ రూపంలో ఊహించుకోలేరు కూడా మన తెలుగు ప్రేక్షకులు. మన తెలుగు పౌరాణిక చిత్రాల కన్నా గొప్ప పౌరాణిక చిత్రాలు మరే ఇతర భాషల్లోనూ రాలేదేమో అనుకుంటూ ఉంటాను నేను. వాటిలో కొన్ని కాల్పనీకాలైనా కూడా మనకు ఎంతో ప్రియమైనవి మన పౌరాణిక చిత్రాలు. తెలుగు సినిమాని ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత మన పౌరాణికాలకే దక్కుతుంది అంటే అతిశయోక్తి కాదు మరి! 


అలా ఎన్టీఆర్ గారిని మాత్రమే కృష్ణుడి రూపంలో ఊహించుకుంటూ పెరిగిన తరువాత స్కూల్ డేస్ లో టివీ మహాభారత్ లో నితిష్ భరద్వాజ్ గారిని చూశాం. ఆయన కూడా కృష్ణుడిగా బాగా మెప్పించారు. తర్వాత ఐదారేళ్ల క్రితమేమో "రాధాకృష్ణ" అనే హిందీ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ ఛానల్ లో ప్రసారమైంది. స్టార్ భారత్ లో కూడా వచ్చినట్లుంది. దాదాపు 1145 ఎపిసోడ్ల ఆ వెబ్ సిరీస్ సీజన్ వన్ అయ్యాకా మాకు తెలిసింది. కరోనా కాలంలో అనుకుంటా నేనూ, మా కృష్ణ భక్తురాలు కలిసి ఒక ఐదురోజుల్లో మొత్తం మొదటి సీజన్ భాగాలన్నీ రాత్రిపగలు కూర్చుని అదే పనిగా పరీక్ష రాసేవారిలా గబగబా అన్ని భాగాలూ చూసేసి, అప్పుడు నడుస్తున్న రెండవ సీజన్ భాగానికి చేరుకున్నాం నేనూ, మా భక్తురాలు. మాకు అంతగా నచ్చేసింది ఆ సీరియల్.



అందులో పాటలు మా ఫోనుల్లో ఎప్పుడూ ప్లే అవుతూ ఉంటాయి ఇప్పటికీ. అందులో కృష్ణుడిగా నటించిన సుమేధ్ ముద్గల్కర్ కి మేము పెద్ద పంఖాలయిపోయాము. ఆ కధలో చాలావరకూ కాల్పనికత జోడించారు. వాస్తవికతకు, అసలు భాగవత కథకు ఎంతో దూరంగా ఉండే ఎన్నో ఘట్టాలు నచ్చనివి ఉన్నాయి. మధ్య మధ్య కొన్ని చిరాకు తెప్పించే కంసుడి ఎపిసోడ్స్, బర్సానా లో జరిగే పిట్టకథల భాగాలు అన్నీ కూడా స్కిప్ చేసేస్తే, మొత్తమ్మీద ఆ సీరియల్ నాకెంతో నచ్చింది. ఎన్నో మార్పులకు కారణం అయ్యింది. రామారావుగారి తర్వాత మోడ్రన్ కృష్ణుడంటే సుమేధే! అన్న నిర్ణయానికి వచ్చాము. వేరే మహాభారతం సీరియల్ ఒక చోట వచ్చేది కానీ నేను అది చూడలేదు. ఆ కృష్ణుడు నాకు నచ్చలేదు. సుమేధ్ ని చూసిన కళ్లతో ఇంకెవరినీ చూడలేము అనుకునేవాళ్ళం. 

అలాంటి సమయంలో ఒక ట్రైలర్ చూపెట్టి, ఈ సినిమా మనం తప్పకుండా చూడాలి, వెళ్దాం అంది మా కృష్ణ భక్తురాలు. అమ్మో.. ఈ మోడ్రన్ జమానాలో పౌరాణికమా? అది కూడా కొత్త నటులా..నన్ను వదిలేయ్యవే అన్నా. ఇది తప్పకుండా బావుంటుందమ్మా రమ్మని మా కృష్ణ భక్తురాలు నేను ఒప్పుకునేదాకా వదల్లేదు. ఎందుకైనా మంచిదని రివ్యూలు వెతికితే పోజిటివ్గానే ఉన్నాయి. సరే పదమన్నాను. ఇవాళ వెళ్ళి వచ్చాము. ఇక మాటల్లేవ్!! It's a stunning visual feast, a retreat too. 



అంత మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడికి చేతులెత్తి దణ్ణం పెట్టచ్చు. తప్పక చూసితీరవలసిన చిత్రం. కృష్ణతత్వాన్ని ఒక సరికొత్త కోణంలో చూపెట్టారనే చెప్పాలి. సగభాగం యువత, నాశనమయ్యే బాటలో పయనిస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు తప్పక రావాలి. ప్రజల మధ్యకు బాగా వెళ్లాలి. ఎక్కువ థియేటర్లే లేవు, మా ఊళ్ళో రాలేదు, ఎక్కువ షోస్ లేవు అంటూ చాలామంది రాసిన కామెంట్లు ఈ సినిమా ట్రైలర్,పాటల కిందన చదివాను. బాధ అనిపించింది. యువతను తప్పుదోవ పట్టించే సినిమాలకు ఉండే పబ్లిసిటీ ఇటువంటి మంచి చిత్రాలకు ఎందుకు ఉండదో? అనిపించింది. కానీ కృష్ణుడి కధలో బలమే ఈ సినిమాని నడిపిస్తుంది అనే ఆశ అయితే కలిగింది. గోపికలు, అష్ట భార్యలు, అల్లరి, కొంటెతనం ఒక పక్కన పెడితే; మనిషిగా పుట్టినందుకు ఎన్ని అవాంతరాలు సహించాడో, ఎన్నీ యుధ్ధాలు చేశాడో, ఎంత బాధ అనుభవించాడో..కదా అనిపిస్తుంది కృష్ణుడి కథను చూస్తే! మానవాళికి ఎన్ని అద్భుతమైన సందేశాలను అందించాడో కదా! రాముడు ధర్మ మార్గాన్ని చూపెడితే, మన మార్గం ఎలా ఉన్నా సరే జీవితాన్ని ఎలా జీవించాలో కృష్ణుడు చూపెట్టాడు. అందుకే పూర్ణావతారం అంటారేమో కృష్ణావతారాన్ని.

కొత్త నటీనటులతో పౌరాణిక చిత్రం తీయడం ఎంతటి సాహసమో అసలు! ఎక్కడా కూడా అబ్బా ఇలా ఉందేంటి అనిపించలేదు. పాటలు, నేపథ్య సంగీతం, సాహిత్యం, విజువల్స్, నటీనటులందరి నటన, అన్నీ కూడా ఎంతో అందంగా హృద్యంగా ఉన్నాయి. ప్రసాద్ సష్టే గారి సంగీతం మనసుకి హత్తుకునేలా ఉంది. పాటలు అన్నీ ఎంత బావున్నాయో అసలు. మాధవుడు మనోహరుడు కదా. ఆయన గాధ కూడా మనోహరమైనదే. ప్రతి సీన్ ఎంతో రిచ్ గా, అందంగా, ఆహ్లాదకరంగా అనిపించింది. అందునా హాల్లో సినిమా చూసి కూడా చాలా రోజులైంది. ముఖ్యంగా ఈ కొత్త కృష్ణుడు(సిధ్దార్థ్ గుప్తా) కూడా సినిమా పూర్తయ్యేసరికీ చాలా బాగా చేశాడనిపించేసుకున్నాడు. సొంత వాయిస్ అయి ఉంటే గనుక అతని వాయిస్ కూడా చాలా బాగుంది. ఇంతటి గొప్ప, అందమైన దృశ్యకావ్యాన్ని తెరపై మలిచినందుకు దర్శకుడు హార్దిక్ గజ్జర్ గారు అభినందనీయులు. వారు ప్లాన్ చేసిన ట్రయాలజీ(trilogy)లో ఇది మొదటి భాగం. తెలుగులో చూడడానికి కొంచెం సందేహించి, హిందీ చిత్రానికే వెళ్ళము మేము. సినిమా పూర్తయ్యాకా తెలుగు వర్షన్ కూడా బానే ఉండేదేమో అనుకున్నాం. తెలుగు,హిందీ, తమిళ భాషల్లో ఇది విడుదలైందిట. మరో రెండు వారాల తర్వాత ఆంగ్ల వర్షన్ కూడా అంతర్జాతీయంగా రిలీజ్ అవుతుందిట. 

ఇతర ఆధ్యాత్మిక గ్రంధాలతో పాటూ, శ్రీ రామ్ మోరి గారు రచించిన గుజరాతీ నవల "సత్యభామ"
ఈ చిత్రానికి అధారమని టైటిల్స్ లో వేశారు.   




పుస్తక ముఖచిత్రం ఎంత అందంగా ఉందో కదా. రచయిత ఎవరో పెద్దాయన అయి ఉంటారని ఇంటికొచ్చాకా నెట్లో వెతికితే ఆయన ఒక యువ కథా రచయిత, స్క్రీన్ రైటర్ కూడా అని తెలిసింది. చాలా సంతోషం వేసింది. ఇటువంటి యువ రచయితల గురించి తెలిసినప్పుడు; మహేష్ కాలే, శివశ్రీ స్కందప్రసాద్ వంటి యువగాయకులు, వినయ్ వారణాసి వంటి ఆధ్యాత్మిక వక్తలను చూసినప్పుడు అమితానందం కలుగుతుంది. సంగీత,సాహిత్యాల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనే ఆశాభావం బలపడుతుంది. యువతను సరైన మార్గంలో నడిపేందుకు ఇటువంటి కారణజన్ములు ఎంతో అవసరం.

ఇక మన కృష్ణావతారం, part 1 సినిమా విషయానికి వచ్చేస్తే, తప్పకుండా సకుటుంబసమేతంగా చూసితీరవలసిన సినిమా. పిల్లలకు తప్పకుండా చూపెట్టాల్సినవి ఇటువంటి సినిమాలు. ఆమధ్యన వచ్చిన "మహావతార్ నరసింహ" యానిమేషన్ చిత్రం కూడా చాలా బాగా తీసారు. అది కూడా ఎంతో ప్రజాదరణ పొందింది. మంచి సినిమాలు తీస్తే, చూడడానికి ప్రజలు ఎప్పుడూ తయారుగానే ఉంటారు. పౌరాణికాల పట్ల ఆసక్తి ఉన్నవారంతా తప్పకుండా ఈ చిత్రాన్ని చూసి, ఆ కృష్ణమయ మనోహర ప్రపంచంలో కాసేపు సేదతీరండి.