మర్నాడు మేము వెళ్ళిన హాలు చూస్తూండగానే నెమ్మది నెమ్మదిగా నిండిపోయింది. ప్రేక్షకులు చాలావరకూ తెలుగువారు కాకపోయినా యువత ఎక్కువ శాతమే కనిపించారు. ఎంతో ఆనందం కలిగింది. ఈమధ్య భావితరాల పట్ల ఎంతో ఆశ, నమ్మకం కలిగేటువంటి వారిని ఎందరినో చూస్తున్నాను. ఇక సినిమా అయ్యాకా ఎండ్ టైటిల్స్ లో ఒకమ్మాయి(బహుశా ఆమె కూడా ఒక ప్రొడ్యూసర్ అనుకుంటా) రామ నామంతో సినిమా పోస్టర్ మొత్తం తయారుచెయ్యడం చూపెట్టారు. మనసు తృప్తితో నిండిపోయింది. ఇంత మంచి సినిమా చూపెట్టినందుకు మా అమ్మాయికి థాంక్స్ చెప్పాను. కృష్ణావతారం తర్వాత మరొక అద్భుతమైన చిత్రాన్ని చూశాను. ఇక కృష్ణావతారం మత్తు లోంచి హనుమత్ భక్తిలోకి జారిపోయాను.
ఇంటికి రాగనే ముందు పుస్తకాల బీరువా తెరిచి వెతకడం మొదలుపెట్టాను. రెండు రోజులకు ఒక మూడు పుస్తకాలు ఛాప్టర్లతో సహా రిఫరెన్సులు తియ్యగలిగాను. ఇదివరకు చదివినవే అయినా ఆత్రంగా మళ్ళీ ఆ అధ్యాయాలను చదివి ఆనందించాను. Genre ఏదైనా, మనసుకు హత్తుకునేలా సినిమా తీస్తే బ్రహ్మరథం పట్టే ప్రేక్షకులు ఈనాడూ ఉన్నారనడానికి ఈ చిత్రమే సాక్ష్యం. ఒక ప్రమోషన్ లేదు, ఏ విధమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేవు, కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా నెల రోజుల్లో వందకోట్ల మైలురాయిని దాటడం ఒక అద్భుతమే. ఇవాళ్టికి ఈ చిత్రం విడుదలయి నెలరోజులైంది!
యూట్యూబ్ లో దర్శకుడు విశాల్ చతుర్వేదీ గారి ఇంటర్వ్యూలు కొన్ని ఉన్నాయి. ఒకటి విన్నాను. ఈ చిత్ర దర్శకుడి స్వీయ రచన అయిన Divine Detour: That Changed My Life ఆధారంగా సినిమా తీశామని, ట్రైలజీ గా రూపొందిస్తున్న తదుపరి భాగాలు కూడా తెరపైకి వస్తాయని ఆయన చెప్పారు.
ఇక "హనుమాన్ అంశ్" చిత్రం కబుర్ల లోకి వచ్చేస్తే, నటించింది మొదటి చిత్రమే అయినా నీమ్ కరోలీ బాబా పాత్రలో ఒదిగిపోయిన శోభినవ్ సత్యా గురించి, మహరాజ్ గారి చిన్ననాటి పాత్రను పోషించిన బాల నటుడు విహాన్ గురించీ, నలుగురు ప్రొడ్యూసర్లలో ఒకరైన చిన్న అమ్మాయి అనుప్రియ గురించి, "మైనే తేరే హి భరోసే హనుమాన్" పాటను పాడిన సునీల్ లోఢీ గురించి , గమ్మత్తైన "పార్వతి " పాటను రచించి, స్వరపరిచి, గాత్రాన్నందించిన సాధు తివారీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ కూడా తమ తమ పాత్రలను ఎంతో బాగా పోషించారు. నాకు గోపాల్ పాత్రధారి బాగా నచ్చాడు. గుహలో ధ్యానంలో ఉన్న బాబాను చూశాకా అతడు చూపెట్టిన హావభావాలు అద్భుతం. ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పడం కన్నా తప్పక చూడమని చెప్పడమే ఉత్తమం.
ఈ చిత్రాన్ని చూస్తూంటే నాకు స్వామినారాయణ సంప్రదాయాన్ని నెలకొల్పిన నీలకంఠ వర్నీ జీవనప్రయాణం గుర్తు వచ్చింది. భక్తులు ఆయనను కృష్ణ అంశగా భావిస్తారు. ఢిల్లీలో ఉన్న స్వామి నారాయణ్ మందిర్ ను మేము ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా దర్శిస్తూ ఉండేవాళ్ళం. ఆలస్యంగానైనా ఈమధ్యనే హైదరాబాదులో కూడా చక్కని స్వామి నారాయణ మందిర్ ని చూశాము. యూట్యూబ్ లో ఆయన జీవన ప్రయాణం మొత్తం ఎనిమిది భాగాల్లో అనుకుంటా ఒక సిరీస్ ఉంది. మోషన్ పిక్చర్ యానిమేషన్ లాగ తీసిన ఆ స్వామినారాయణ గారి బయోపిక్ చాలా చాలా బాగుంది. ఇలాగే, సినిమా కాదు కానీ అగస్త్యముని గురించిన ఒక డాక్యుమెంటరీ సిరీస్ ని ఒక తమిళ భక్తుడు ఒకాయన యూట్యూబ్ లో పెడుతున్నారు. స్వీయ అనుభవాలతో నిండిన ఆ డాక్యుమెంటరీ చాలా ఆసక్తికరంగా ఉంటోంది.
మన భారతదేశం ఎందరో సాధువులు, మహాత్ములకు నెలవైన పుణ్యభూమి. గతంలో చాలామంది అవధూతలు, మహాత్ముల గురించిన ఆధ్యాత్మిక చిత్రాలు మన తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ ఎన్నో వచ్చాయి.. త్యాగయ్య, యోగి వేమన, విప్రనారాయణ, భక్త తుకారాం, సతీ సక్కుబాయి, మీరాబాయి, భక్త జయదేవ, పురందరదాసు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద మొదలైనవి నేను చిన్నప్పుడు చూసిన , గుర్తున్న సినిమాలు. ఇంకా నే చూడనివి ఎన్నో ఉండి ఉంటాయి. ఆధ్యాత్మిక చిత్రాలు ఏ భాషలో తీసినవయినా ఆచరణీయమైన సందేశాలను, మనసుకు సాంత్వనను అందిస్తాయి.
ఆధ్యాత్మిక చిత్రాలను ఇప్పటితరానికి అర్థం అయ్యేలా, వాళ్లకి ఆసక్తి కలిగేలా, అనవసరమైన సన్నివేశాలను జోడించకుండా, ఈనాటి కాలంలో తియ్యడం అనేది కష్టతరమైన, మెచ్చుకోదగ్గ విషయం. కాబట్టి, ఈ చిత్ర దర్శకుడు విశాల్ చతుర్వేదీ గారిని తప్పక మెచ్చుకుని తీరాలి. ఇటువంటి చిత్రాలను చూసినప్పుడు కొన్ని విషయాలపై సడలుతున్న నమ్మకం నిలబడుతుంది. ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. మనం భరతభూమిపై పుట్టినందుకు గర్వం కలుగుతుంది. కావున - మనుషులు, తద్వారా సమాజమూ తరించేలాగ - ఇంకా ఎందరో మహానుభావుల, కారణ జన్ముల గురించిన బయోపిక్ లు ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
జై సీతారామ్ !!


No comments:
Post a Comment