సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, December 17, 2014

కిటికీ బయటి వెన్నెల



కథలు రకరకాలు. ఉల్లాసాన్ని, ఆనందాన్నీ కలిగించే కథలు చాలానే కనిపిస్తూంటాయి కానీ ఆలోచింపచేసే కథలు అరుదుగా కనబడతాయి. వాడ్రేవు వీరలక్ష్మిగారి కథలు చదివినప్పుడల్లా నాకు ఆలోనలతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతూంటుంది.. దైనందిక జీవితంలో సామాన్యంగా మనం తక్కువగా ఆలోచించే విషయాలపై కథ రాయాలనే ఆలోచన వీరికి ఎలా కలుగుతుందా.. అని! అయితే ఈ విషయాలు తేలికపాటివి కావు. సమాజంలో మార్పు రావాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు, అంశాలూనూ. 


వాడ్రేవు వీరలక్ష్మి గారి మూడవ కథాసంపుటి "కిటికీ బయటి వెన్నెల" చదువుతుంటే నాకు అందులో ప్రకృతి, చెట్లు, పువ్వులు తాలూకా సున్నిత భావుకత్వం కన్నా కథల్లో దాగున్న విషయాంశాలూ, వాటిల్లో చర్చించిన గంభీరమైన సమస్యలు ఎక్కువగా ఆలోచింపజేసాయి. బహుశా నా మనసు సున్నితత్వాన్నీ, భావుకత్వాన్నీ దాటి సమాజంలోని సమస్యలను చూసే స్థాయికి ఎదిగి ఉంటుంది! వీరలక్ష్మి గారి "ఆకులో ఆకునై"తో మొదలైన నా అంతర్జాల సాహిత్య వ్యాసాలు పరిణితి చెందుతూ నాలో నాకే ఒక కొత్త కోణాన్ని చూపెడుతున్నాయనుకుంటాను నేను! నాకు లభ్యమైన 'కొండఫలం' , 'మా ఊళ్ళో కురిసిన వాన' , 'భారతీయ నవల' మొదలైన ఆవిడ పుస్తకాల గురించి రాసాను కానీ "సత్యాన్వేషి చలం" గురించి ఇంకా రాసే సాహసం చెయ్యలేదు నేను. అందుకు గానూ ముందు చలం రచనలన్నీ చదవాల్సి ఉంది. చదవగలనో  లేదో ప్రస్తుతానికి తెలీదు. ఇంకా వీరలక్ష్మి గారి 'ఉత్సవ సౌరభం', 'సాహిత్యానుభవం' పుస్తకాలు సంపాదించవలసి ఉంది. 


"జీవితానికి పరిమళం అద్దిన కథలు" అంటూ సత్యవతి గారు ఈ కథానికలకు రాసిన ముందుమాట అసలు ఇంకేమీ రాయక్కర్లేనంతగా, రాయడానికేమీ మిగలనంతగా బాగుంది! వీటిలో మూడు కథల్ని ముందరే చదివాను. "కిటికీ బయటి వెన్నెల" 'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక' లో , "బరువు భారాలు" ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో, "గీతల్ని చెరపవచ్చు" నవ్య పత్రికలోనూ చదివాను. నాలుగు నెలల క్రితం నవ్య పత్రికలో ప్రచురితమైన ఆ కథ బాగుందని నే రాసినప్పుడు, త్వరలో మూడవ సంపుటి రాబోతోందని చెప్పి సభకు ఆహ్వానించారు వీరలక్ష్మిగారు. ఆ తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఎంతో అభిమానంగా "కిటికీ బయటి వెన్నెల" పుస్తకావిష్కరణకు రావలసిందని సాదరంగా ఆహ్వానించారావిడ. నే కూడా పొంగిపోయాను.. కానీ సరిగ్గా సమయానికి ఆరోగ్యం బాగోలేక ఆ సభకు వెళ్లలేకపోయాను :( ఆలస్యంగానన్నా పుస్తకం ఇన్నాళ్ళకు చదవగలిగాను.. నా అభిమాన రచయిత్రి స్వయంగా పంపించబట్టి. ఆవిడ సంబోధన చూసినప్పుడల్లా అనుకుంటాను.. ఆవిడ అక్షరాల్లాగానే మనసు, మాట కూడా మెత్తన అని. ఏదో ముఖస్తుతి కోసం చెప్తున్న మాటలు కావివి. పెద్దగా పరిచయం లేకపోయినా ఎంతో ఆప్యాయంగా పలకరించగలగడం కొందరికే సాధ్యపడుతుంది. 


ఈ కథాసంకలనంలోని పాత్రలు నిత్యం మన చుట్టూ కనబడేవారే. అందుకనే కొన్ని సందర్భాల్లో ఈ కథల్లో పాత్రల ఆలోచనలు కూడా మన ఆలోచనాధోరణి లాగానే ఉంటాయి. ప్రతి కథా ఒకో సమస్యను, వాటి విభిన్న దృక్కోణాలనూ చూపెడుతుంది. సమస్యలన్నీ కూడా ఎక్కువశాతం స్త్రీలవే. పాత్రలు, వాళ్ల ఆలోచనలూ మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు చదువుతుంటే ఈ సమస్యపై ఎవరైనా ఎక్కువ దృష్టి పెడితే బాగుండును.. సమస్య తీరవచ్చు లేదా ఏదైనా పరిష్కారం దొరకచ్చేమో అనిపిస్తుంది. కొన్నింటిలో ఆశావాహమైన ముగింపు పాఠకులకు కూడా చీకటిలో మిణుకుమనే నక్షత్రంలా దారి చూపగలదు.


'పునరుత్థానం' కథలో అన్ని రకాలుగా చిన్నాభిన్నమైపోయిన తన జీవితాన్ని ఆదిలక్ష్మి బాగుచేసుకున్న తీరు మోడులోంచి చిగురించే ఆకుపచ్చని ఆశలా తోస్తుంది. రచయిత్రి చెప్పినట్లు బతుకు బరువైనప్పుడల్లా ఎవరో ఒక ఆదిలక్ష్మి మనకు ప్రేరణ అవ్వగలదేమో.
'ఈ విషానికి ఈ తేనె చాలు' కథానికలో వింధ్య, అనురాధల జీవితాలు ఆలోచింపజేస్తాయి. వింధ్యను నిర్వేదం నుండి బయటకు లాగడానికి అనురాధ పడే తాపత్రయం, ప్రయత్నాలు బాగున్నాయి కానీ చివరలో వినోద మాటలు ఎందుకనో పూర్తిగా ఒప్పుకోలేకపొయాను. 

'దిశానిర్దేశకులు' అన్నింటిలో నాకు బాగా నచ్చిన కథ. కాలేజీ స్టూడెంట్స్ పై సినిమాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఒక అధ్యాపకురాలి కన్నా బాగా ఎవరు చెప్పగలరు? విద్యార్థులను ఈ రాంగ్ నోషన్స్ నుండి, సినిమా ప్రభావం నుండీ తప్పించగలిగితే దేశ భవిష్యత్తు ఎంతో బాగుపడగలదు అని నేను నిరంతరం అనుకుంటూ ఉంటాను. "తన్మయి"లో బామ్మ తాయారు కథ వెనుకటి కాలంలోని ఎందరో నిస్సహాయ స్త్రీల వేదనకు అద్దం పడుతుంది.


"కిటికీ బయటి వెన్నెల" కథ చదివితే నాకు మా పాత ఇంటి ఎదురు వీధిలో మా బాల్కనీ వైపుకు కనబడే మరో బాల్కనీలో రోజూ కనబడుతుండే ఆంటీ గుర్తుకువచ్చారు. రచయిత్రి లాగనే నేనూ ఆ బాల్కనీ లోంచి కనబడే సన్నివేశాలనూ, మనుషులనూ బట్టి ఫలానా కాబోలు.. బహుశా ఇలా జరిగిందేమో అనుకుంటూ ఉండేదాన్ని. ఏ మాత్రం పరిచయం లేకపోయినా రోజూ చూడ్డం వల్ల ఓ వారమెపుడైనా కనబడకపోతే ఏ ఊరెళ్ళారో.. ఎలా ఉన్నారో.. అనుకుంటూ ఉండేదాన్ని. వినాయకచవితి పందిట్లో కనబడితే దగ్గరకు వెళ్ళి పలకరించి నేను ఫలానా అని చెప్తే.. అవును ఇల్లు ఖాళీ చేసేసారుటగా అన్నారావిడ!

'నీడ' కథలో ఈ వాక్యాలు బాగా నచ్చాయి "...ముఖ్యంగా సమాజ సేవ చెయ్యడానికి మనం ఎందుకు ముందుకొస్తున్నామో ఒక్కసారి ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి సార్. లోకాన్ని మనం ఒక్కళ్ళం బాగుచెయ్యలేం. కానీ బాగుచెయ్యాలన్న తపనలో మన లోపల కల్మషాలు పోవాలి. పోతాయి కూడా. ఎప్పుడంటే - హృదయం పనిచేసినపుడు, హృదయం మాత్రమే పనిచేసినపుడు.. "


"ఆ రాత్రి" కథలో  "...కానీ ఇది మరెందరో ఆడపిల్లల భద్రతను దెబ్బ తియ్యడం లేదూ.." అన్న రజని ప్రశ్న పుస్తకం మూశాకా కూడా పదే పదే నా మనసులో తిరిగింది. నిజమే! ఇదే అసలు చాలా నేరాలకు మూల కారణం. కానీ ఎవరు మారుస్తారు ఈ అలవాట్లనీ, ఈ సమాజాన్నీ, ఈ పధ్ధతులనీ??


మనుషుల్ని మనుషుల్లా చాలామంది చూస్తారు. కానీ రచయిత్రి తన సునిశితమైన పరిశీలనాదృష్టితో మనిషి మనసులోని భావాల్ని కూడా చదవగలరు. మనుషుల్లో ఇంకా దయ, మానవత అనేవి పుష్కలంగా ఉన్నాయనీ, అవసరమైనప్పుడు అవి తప్పక బయటకు వస్తాయని "గీతల్ని చెరుపుకోవచ్చు" కథ ద్వారా ఒక ఆశావహ దృక్పధాన్ని చూపెడతారు రచయిత్రి. "ఈ విభజన రేఖలూ, సరిహద్దులూ, దూరాలూ ఉంటాయి. కానీ జీవితం అప్పుడప్పుడు వాటిని చెరిపేసి, మనుషుల్ని కలిపే సందర్భాలను కూడా పట్టుకొస్తుంది" అంటారావిడ. మానవత్వం పై , మనుషులపై ఎంత నమ్మకమో వీరికి అనిపించక మానదు ఈ కథ చదివితే.


ఒక బస్సు ప్రయాణంలో పూర్తయిన ఈ కథల పుస్తకం పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయా.. స్టాప్ వచ్చింది దిగమని శ్రీవారు వెనుకనుండి కదిపేవరకూ!! "బాధలన్నీ పాత గాధలైపోయెనే.." అని బుక్ కవర్ పై ఓ చివర్న రాసినట్లుగా పాతవైనా మెరుపు తగ్గని కథలు ఇవి. మరిన్ని ఆలోచనాత్మకమైన కథల్ని వీరలక్ష్మిగారి నుంచి ఆశిస్తున్నాను..

***    ***     ***

* "మనిషి ఎదుటి మనిషిని రాగద్వేషమిశ్రితమైన మనిషిగా అంగీకరించగలగటం ఎంతో గొప్ప సంగతి. అదే జరిగితే ఈ వాదాలేవి అక్కర్లేదు. ఈ అర్ధం చేసుకోలేకపోవడాల దగ్గరే మానవ దు:ఖమంతా ఉంది."
- వాడ్రేవు వీరలక్ష్మీదేవి.
('ఆకులో ఆకునై', 'మా ఊళ్ళో కురిసిన వాన' రెండు పుస్తకాల్లో ఉన్నాయి నాకెంతో ఇష్టమైన ఈ వాక్యాలు. ఇవొక్కటే చాలు నేనావిడ అభిమానినని గర్వంగా చెప్పుకోవడానికి.)

***    ***    ***

4 comments:

Unknown said...

good review trushna gaaru
navya lo vacchina katha naakuu nacchindi kaakapote chaduvutaa kaanee mee anta gurtu pettukolenu :)
Radhika (nani)

తృష్ణ said...

Thanks radhika garu.

Unknown said...

mee sameeksha nisithamgaaanu,sunnithamganukooda vundi. pusthakam tittle rachayithri bhava soundaryanni chati chebhuthondi.nijaniki ee book release ki nenu missayyanu. mee sameeksha choosaka ventane chadivi theeralane aasakthi kaligindi. meeku veeralakshmaadevi gariki abhinandanalu


తృష్ణ said...

@Mannem Sarada: తప్పకుండా చదవండి. పుస్తక పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు శారద గారూ. ఫేస్ బుక్ లో ఈ వ్యాసాన్ని పంచుకున్నందుకు రచయిత్రి వీరలక్ష్మిగారికి కూడా మరోసారి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.