సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, February 28, 2011

వంటరాని మగాడు (Just for fun..)


"వంటొచ్చిన మగాడు" అని మా అన్నయ్యను దృష్టిలో పెట్టుకుని చాలా కాలం క్రితం ఒక టపా రాసాను. ఆ తరువాత "వంటరాని మగాడు" అని రెండవ భాగం రాస్తానని అన్నాను కానీ అది రాయటం కుదరనేలేదు. కొందరు బ్లాగ్మిత్రులు రెండవభాగం ఏదని అడిగారు అప్పట్లో.. అయినా ఎందుకనో ఆ రెండవభాగం రాసే మూడ్ అప్పుడు పోయింది. ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ రెండవ భాగం రాయాలని సంకల్పం కలిగింది. రెంటికీ లింక్ అయితే లేదు కానీ మొదటిది చదవనివారు అక్కడకు వెళ్ళి ఓ లుక్కేస్తే బాగుంటుందని అభిప్రాయం.
( http://trishnaventa.blogspot.com/2009/10/just-for-fun.html )
************
వంటరాని మగాడు:

వంటరాని మగవాళ్ళలో నాకు తెలిసినంతలో ముఖ్యంగా మూడు రకలవాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా ఉంటారేమో నాకైతే తెలీదు..:))

1) కొందరికి వండటం రాదు కానీ వారు పెట్టినది తిని ఎంజాయ్ చెయ్యగలరు. వీరితో ఏ ఇబ్బందీ ఉండదు.

2)మరొకరకం వారు వండటం రాకపోయినా వంటలకు వంకలు పెడుతూ ఉంటారు వండిపెట్టేవారి ఒళ్ళుమండెలా. భోజనం తింటున్నంతసేపూ వారి సాధింపుల రికార్డ్ మోగుతూనే ఉంటుంది. ఆ వంకలన్నీ టేస్ట్ లు తెలియటం వల్ల కదా అని ఈ రకం వారితో కూడా కాస్తంత సర్దుకుపోవచ్చు అని నా అభిప్రాయం.

3)కానీ మూడో రకం వారున్నారే వారితోనే మహా కష్టం. వాళ్ళకు వండటమూ రాదు. తినటమూ రాదు. అసలు ఫలానాది తినాలన్న కోరికా ఉండదు. పదార్ధాల్లో ఉప్పు కారాలు ఎక్కువయ్యాయో, తక్కువయ్యాయో తెలియదు. ఏం వండాలో, ఎంత వండాలో, వండితే తింటారో తినరో కూడా తెలీని ఈ రకం వారితోనే అసలైన తంటాలన్నీ!!

ఇప్పుడు ఈ మూడు రకాలవాళ్లతో భార్యల సంభాషణలు ఎలాగుంటాయంటే : (ఇది ఎవరినీ నొప్పించటానికి కాదు...కేవలం సరదాకే అని మరొకసారి మనవి)

1) వండటం రాకపోయినా తినేవారు:


"ఇవాళ ఏం వండను?"
"ఏదో నీకు తోచినది వండు. ఏదైనా పరవాలేదు."

"ఆహా చారు అదిరింది. ఎంత బాగుందో"
"ఈ కూర కూడా సూపర్. అసలు నీ వంటే వంట. ఉండు ఈసారి మా బాస్ ను భోజనానికి పిలుస్తాను"

"ఏమిటీ ఊరు వెళ్తావా? మరి నా భోజనం? అసలే నాకు బయట తిండి పడదు. త్వరగా వచ్చేయ్..."
" ...?? మీకు వండి పెట్టడం కోసం నేను వచ్చేయాలా? అంటే మీకు మీ తిండిని గురించిన జాగ్రత్తే తప్ప నా మీద బెంగ ఉండదన్న మాట...."

******* ********** ********
2) వండటం రాకపోయినా తింటున్నంత సేపూ వంకలు పెట్టేవారు:

"ఏమండీ ఇవాళేం వండమంటారు?"
"గుత్తివంకాయ కూర , కొబ్బరి పచ్చడి చేసి, పప్పుపులుసు పెట్టు"

"ఏమిటిది? ఇదసలు గుత్తివంకాయ కూరేనా? అసలు మసాలా ఏది? ఏమేం వేసావిందులో..?
ఇది కొబ్బరి పచ్చడా? దీన్నిండా కొబ్బరి ముక్కలే కనబడుతున్నాయి. మెత్తగా గ్రైండ్ చెయ్యటం రాదా నీకు? మా అమ్మయితే రోట్లో కూడా ఎంత మెత్తగా రుబ్బేదనుకున్నావు"
(ఇలా ఎవరితోనన్నా కంపారిజన్ లు చేసినప్పుడు సదరు అమ్మగారికి రోకలి తెచ్చి అయ్యగారి నెత్తిన ఒక్కటిచ్చుకోవాలన్నంత కోపం వస్తుంది.)

"ఇది పప్పు పులుసా? చారా? తేడా ఏం కనబడటం లేదు. ఈ పోపేమిటి ఇలా మాడిపోయింది? మాడిపోయిన పోపుని చూస్తే నాకెంత ఒళ్ళుమంటో నీకు తెలుసుకదా? అయినా మాడిస్తే ఏమిటర్ధం?...."
"అయితే మీకు నచ్చేట్టు మీరే వండుకోండి. వండిన ప్రతిదానికీ వంక పెడితే నేను వండలేను.."
"నాకు వంటొస్తే నిన్నెందుకు చేసుకోవటం? హాయిగా నాక్కావాల్సిన పదార్ధం నేనే వండుకుని తినేవాడిని"
"అంటే కేవలం వండిపెట్టడానికే నన్ను చేసుకున్నారా..?"

****** ******* ******

3) వండటమూ రాదు. తినటమూ రాదు :

"ఏమండీ ఇవాళ ఏం వండను?"
" రోజూ ఎందుకలా అడుగుతావు? ఏదో ఒకటి వండు."
"ఇవాళ ఇది చెయ్యి అని అసలెప్పుడూ అడగరా?"
"ఏమో నాకు అలా అడగాలని అనిపించదు.."

**** ***** ******

"కూర బాగుందా?"
"బానే ఉంది."
"పప్పు?"
"బానే ఉంది"
"రాత్రికి మొన్న చేసిన కూర చెయ్యనా?"
"ఏ కూర? నాకు గుర్తులేదు.."

**** **** *****
"ఎందుకు కూర ఉంచేసారు? మొన్న తిన్నారు కదా?"
"ఆ రోజు నచ్చింది. ఇవాళ నచ్చలేదు. ఎప్పుడు వండినా తినితీరాలని రూల్ లేదుగా.."

"ఈ పచ్చడెందుకు వదిలేసారు?"
"నేనెప్పుడూ తినలేదిది"
"ఓసారి టేస్ట్ చేసి చూడచ్చు కదా నచ్చుతుందేమో..?"
"ఎప్పుడూ తినని కొత్త పదార్ధాలు నేను తినను"

**** ***** *****

"ఇది మీరు చిన్నప్పటినుంచీ బాగా తినే కూర అన్నరు కదా..వదిలేసారేం?"
"చూడటానికి బాలేదు"
"తింటే బాగుంటుందేమో...ట్రై చేయచ్చు కదా.."
"ఇదివరకూ చెప్పను నీకు చూడగానే బాగుంటే తప్ప నేను ఏదీ తిననని"
"మరి ఇక ఏం వండాలి నేను?"
"......."
"ఏరోజూ ఇది కావాలని అడగరు. కొత్త పదార్ధాలు తినరు. పాత పదార్ధాలు ఒకోసారి తింటారు. ఒకోసారి తినరు. మీతో వేగటం నావల్ల కాదు బాబూ.."
"చేసుకున్నాకా తప్పదు మరి...ఈ జన్మకిలాక్కానీ..."

********** ******** *********

విశ్లేషణ:వంట రాని మగవాళ్ళలో మొదటి కేటగిరీనే బెస్ట్. అవసరార్ధం తప్పదనో, నిజంగానే భార్య వంట నచ్చో మెచ్చుకుంటూ తినేస్తారు. ఎవర్నన్నా భోజనానికి పిలిచినా, పిలవకపోయినా భార్య వంట మెచ్చుకుంటారు.

ఇక రెండో రకం వారితో సర్దుకుపోవచ్చు. వంకలు పెడ్తున్నారని కోపం వచ్చినా ఫలానాది తినాలని ఉందనీ, ఫలానాది బాలేదనీ చెప్పటం వల్ల కాస్త తినటం పట్ల ఆసక్తి ఉందని గమనించొచ్చు. వంట వచ్చిన ఇల్లాలికి మనశ్శాంతి.

కానీ ఆ మూడో రకం వాళ్ళతో మాత్రం చాలా కష్టం.

ఏమైనా నా ఓటు మాత్రం వంటొచ్చిన మగవాళ్ళకే. వీరి తాలూకూ భార్యలు చాలా అదృష్టవంతులు అని నా అభిప్రాయం.(ఇక్కడ మా అన్నయ్యకూ జై...!!)అదేం లేదు.దూరపు కొండలు నునుపు.. అంటారా?

21 comments:

Anonymous said...

హ హ హ
వంట వచ్చిన వాళ్ళతో ఇంకా ఇబ్బంది తృష్ణ గారు
వాళ్ళు చేసే వంటలు మెచ్చుకోలేక మనం ఏడవాలేమో !!

బులుసు సుబ్రహ్మణ్యం said...

ప్రతి మగవాడు మొదట 1.వ రకం వాడు. భార్య చేసిన వంటలు తిని 2.వ వాడుగా మారుతాడు. తిని తిని 3.వ వాడుగా మారుతాడు. తిని తిని తిని తిని రుచి అన్నపదాన్ని నిఘంటువులోంచి పీకి పారేస్తాడు.

(ఇది నిజంగానే సరదాకి. :):):))

SHANKAR.S said...

మరి వంట వచ్చీ రుచుల గురించి పట్టింపు ఉండీ కూడా భార్య చేసిన దాన్ని మెచ్చుకుని తినే (అంటే నాకు నచ్చినట్టు చేస్తుంది లెండి) నాలాంటి వాళ్ళు ఏ కేటగిరీ లోకి వస్తారండీ?

Sujata M said...

@subramanyam garu

what a logic... ? sooper andi.

Trishna garu,

funny post andi.

స్వామి ( కేశవ ) said...

@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ ,

మీరు నిజంగానే జీనియస్ సార్ ..
అనుభవం నేర్పిన పాఠం కాదు కదా ?
:)

Ennela said...

తృష్ణ గారూ, ఎవ్వరి మాటా వినని మా సీతయ్య యీ పోస్టు లోంచి కొన్ని, మీ పాత పోస్టులో కొన్ని లక్షణాలను కొట్టేసిన సుగుణాల రాశి. ప్రాక్టికల్ గా చూస్తే కానీ..వర్ణించడం కష్టం

శంకరా ...నువ్వు ప్రస్తుతానికి ఒకటవ రకం లో సర్దుకుపో. స్వాతి తో మాట్లాడాక సీతయ్యకీ, నీకూ కలిపి ఇంకో బ్యచీ క్రియేట్ చేస్తాం..తృష్ణ గారు, మీరు ఇంకొక పోస్టు వ్రాయడం తప్పేలా లేదండీ...

గీతిక బి said...

చాలా చాలా బాగుంది వంటల మీద... వంట రాని మగాళ్ళ మీద మీ రీసెర్చ్.
conversations super....

said...

వంట వచ్చిన వాళ్ళను మెప్పించటం చాల కష్టం. మా ఆవిడ నాతో పడలేక ఇప్పుడు అందరికి అదే చేపుతుంది, వంట వచ్చినవాడిని చేసుకోడుడదు అని.

ఇందులో కొంచెం ఉప్పు తగ్గింది, ఇది కొంచెం ఎక్కువ ఉదికింది, ఇది నల్లగా అవకుండా ఎర్రగా ఉండగానే దింపేయాలి, ఇక్కడ కొంచెం కారం వెయ్యాలి, మేరపకాయలు కొంచెం వేగాలి.... ఇలా రోజు నేను వంకలు పెడతాను...

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఆహా! ఐతే నేను ఉత్తమున్‌డను ;)

కౌటిల్య said...

మీ ఈ టపా ఏమో కాని "వంటొచ్చిన మగాళ్ళు" సూపరు..ఇప్పుడే చదివా....నన్ను నేను చూసుకున్నట్టుంది...నా గురించి మా అమ్మ ఎప్పుడూ ఎలా ఫీల్ అవుతుంటుందనేది అచ్చుగుద్దినట్టు రాశారు....సూపరు...;)

Sharada said...

ఇంకొక ముఖ్యమైన టైపు మగవాళ్ళని మరిచిపోయారండీ! వీళ్ళేమిటంటే, కంచంలో వడ్డించింది వేడిగా, సరిపడా ఉప్పూ కారం వుంటే చాలు. ఇంకేమీ పట్టదన్నమాట. ఇలాటి వాళ్ళతో సంభాషణ-
"పప్పెలా వుంది?"
"పప్పా! పప్పేదీ?"
"ఇందాకే అప్పడం నంచుకుని మరీ మెక్కావుగా? పప్పేదో కనపళ్ళేదా నీ మొద్దు మొహానికి?"
తల గోక్కుంటూ, "బలే కమ్మగా వుండింది! అదేమోకానీ, ఈ బీరకాయ కూర కూడా చెప్పలేనంత బాగుంది!"
"అది బీరకాయ కాదు. వంకాయ!"
"వంకాయా? అబ్బ, ఇంత బాగా బీరకాయలా ఎలా వొండావు?"
...
"అసలు నిన్న రాత్రి నువ్వు సాంబారు చేసావు చూడూ.."
"నిన్న రాత్రి మనం బయట భోంచేసాం!"
....
యూ గెట్ ది రెస్ట్!!

శారద

ramesh said...

ఇదే వర్గీకరణ టపాలు రాసేవాళ్ళకి/చదివేవాళ్ళకి కూడా వర్తిస్తుందేమోనండి.

తృష్ణ said...

@ఆహ్లాద: నాకా ఇబ్బంది లేదండి....:) అందుకే మరి తెలీదు..!
ధన్యవాదాలు.

@సుబ్రహ్మణ్యం: మీరు ఎంతైనా చాలా అనుభవజ్ఞులు అని అర్ధమైపోయింది...కానీ మాష్టారూ, మొదటి నుంచీ మూడవ రకంగానే ఉండేవాళ్ళు కూడా ఉంటారన్న సంగతి గ్రహించాలి. మరి.
ధన్యవాదాలు.

@శంకర్.ఎస్: నేనేమో మిమ్మల్ని "వంటొచ్చిన.." కేటగిరీలో వేద్దామనుకున్నా...కానీ క్రింద ఎన్నెలగారు మరోలా శెలవిచ్చారు...మరి ఏ కేటగిరీలో ఎడ్జెస్ట్ అయిపోతారో మీరే ఆలోచించుకోవాలి...:)
ధన్యవాదాలు.

తృష్ణ said...

@sujata: నిజమేనండి. ఎంతైనా ఎక్స్పీరియన్స్ అల్లంటిది మరి.
ధన్యవాదాలు.

@స్వామి(కేశవ): :) ధన్యవాదాలు.

@ఎన్నెల: అరే మా ఇంట్లోనూ సేం ప్రోబ్లం. ఒక రకంలోకి ఎడ్జస్ట్ చేయటం కష్టం. చివర్లో శారదగారు రాసిన పాయింట్లు కూదా కలుపుకుని ఓ కిచిడీ కేటగిరీ ఏదైనా తయారుచెయ్యాలండి తప్పదు...:)
ధన్యవాదాలు.

తృష్ణ said...

@సాధారణ పౌరుడు: మీరు మా అన్నయ్య గురింఛి రాసిన "వంటొచ్చిన..." కేటగిరీ అన్నమాట. అది చదివారా? పోలికలు కరక్ట్ గా సరిపోవచ్చు...:)
ధన్యవాదాలు.

@చైతన్య: సారీ తమ్ముడూ...ఈ డిక్లరేషన్ రాబోయే మరదలు పిల్ల చెప్తేనే ఒప్పుకునేది..:)
ధన్యవాదాలు.

@కౌటిల్య: అంతేనంటారా..? ధన్యవాదాలు.

తృష్ణ said...

@శారద: నిజమేనండోయ్...నాకూ వినబడతాయ్ అప్పుడప్పుడు ఇలాంటి డైలాగ్స్...:)
నిజంగానే మర్చిపోయా...భలే గుర్తు చేసారు.
ధన్యవాదాలు.

@రమేష్: తప్పకుండానండి. అందరం ఒక చూరు క్రిందనుండేవాళ్ళమేకదా...:)
ధన్యవాదాలు.

veera murthy (satya) said...

చెసిన పనిలో భార్యని కలుపుకుని మనసు పంచుకోవాలనుకునే భర్తలు తక్కువగా వుంటారు

కాని ప్రతీ పనినీ భర్తని కలుపుకుని మనసు పంచుకోవాలనుకునే భార్యలు చాలా మందే వుంటారు

రుచి చూసి చెప్పలనుకోవడం ఇందులో భాగమే!

బహుశా అది వారి వారి ప్రపంచ పరిది కావచ్చు.

ఒక్కోసారి, భర్త ప్రపంచం పెద్దది - భార్య ప్రపంచం చిన్నది.

కానీ రోజులు బలవంతంగా మారుతున్నాయి.

-satya

ఇందు said...

తృష్ణగారు..నేను రాద్దమనుకున్న టపా మీరు రాసేసారు ;) ఈ వంట వచ్చిన వాళ్ళతో వేగడం చాలా కష్టం బాబోయ్! అది అలా చేయి...ఇది ఇలా చేస్తే బాగుంటుంది..మా అమ్మైతే ఇలా చేస్తుంది..అద్దిరిపోతుంది తెల్సా? మా పెద్దమ్మ ఇలా చేయదు...మొన్న చేసావ్ చూడు అలా భలె చేస్తుందిలే....అని చావగొట్టి చెవులు మూస్తారు!! ఇంకా ఘోరం...వంటగదిలో ఏమన్న చేస్తుంటే...పక్కనే నిల్చుని సూచనలు-సలహాలు చెప్పే సందర్భం! దేవుడోయ్...వంట వచ్చిన మగవారితో వెసులుబాటేమో కానీ ఈ టైప్ బాధలు బోలెడు ఉంటాయండీ బాబూ!

తృష్ణ said...

@సత్య: ఎక్కువల తక్కువల గురించని కాదండి, వంట వచ్చిన/రాని వాళ్ల వాళ్ళ ఇంట్లోవాళ్ళ సరదా ఇబ్బందులు ఎలా ఉంటాయో అని కేవలం సరదా కోసం రాసిందంతే. ప్రాధాన్యతలు,ఎక్కువల తక్కువల గురించి సీరియస్ గా మాట్లాడాలంటే ఓ పుస్తకమౌతుంది. చర్చ వేడిగా కూడా మారుతుంది...:) ఏదేమైనా, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు చాలా థాంక్స్ అండి.

@ఇందు: అంతేనంటారా...? కావచ్చు....:)

veera murthy (satya) said...

nijammenandi Trushna garu...dhanyavaadaalu!

విరిబోణి said...

Maavaru ee 2 (50%) & 3 (75%) type lo vuntaaru .. aa debbaki tattukoleke india nundi thechhina chinna rokali theeddam mottadaniki anipistadi..but control chesukuntaa :)vanta koncham vachhina Tantaa ne , asalu raakapoyinaa tantaa nee ee magaallaki naa experience lo :(