"సంత" అంటే కొన్ని చిన్న చిన్న దుకాణాల సముదాయం...అంటే మార్కెట్ అనుకోవచ్చు. అన్నిరకాల వస్తువులు దొరికే సంతలు ఉంటాయి. మల్టీపర్పస్ అన్నమాట. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన సంతలు కూడా ఉంటూంటాయి. అక్కడ దొరికే వస్తువుని బట్టి ఆ సంతకు ఆ పేరు ఉంటుంది. పూల సంత, పుస్తకాల సంత, కూరల సంత, పశువుల సంత...అలా అన్నమాట. పూర్వం పల్లెటూర్లలో, గ్రామాల్లో ఊరి చివరలో వారంలో ఒక రోజున, ఎక్కువగా ఆదివారాలు ఈ సంతలు ఏర్పాటు చేసేవారు. పట్టణాల్లో కూడా సంతలు పెడుతూంటారు. మా అత్త, నాన్న, నాన్నమ్మ మొదలైనవారు చెబితే వినటమే కానీ నేనెప్పుడూ ఏ సంతా చూడలేదు. ఈ మధ్యనే ఓ నెల నుంచీ మా వీధిలో కూరల సంత పెడుతున్నారు కొత్తగా.
ఇక కూరలమార్కెట్ కో, రిలయన్స్ కో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి శనివారం హాయిగా ఇంటి దగ్గరే తక్కువ రేట్లకు కూరలు కొనేసుకుంటున్నాను. అసలు మార్కెట్ కు వెళ్ళి కూరలు కొనటం అనేది నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఆకుపచ్చగా, తాజాగా ఉన్న కూరలను చూస్తూంటే ఉత్సాహం పెరిగిపోయి, చేతిలోని సంచీ నిండి, చెయ్యి ఆ బరువును మొయ్యలేకపోతోంది అన్న స్పృహ కలిగేదాకా కూరలు కొనేస్తునే ఉంటాను. ఒకటా రెండా? దాదాపు పధ్ధెనిమిది,ఇరవైఏళ్ల అలవాటు. పైగా నాకు కరివేపాకు కోసమో,కొత్తిమీర కోసమో అడుగడుక్కీ వీధిలోకి పరుగెట్టడం ఇష్టం ఉండదు. వారనికి సరిపడా కూరలతో పాటూ కర్వేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు మొదలైన "కుక్కింగ్ ఏక్సెసరీస్" అన్నీ మర్చిపోకుండా తప్పనిసరిగా కొనేస్తాను. మా వీధిలోని సంత పుణ్యమా అని అన్నీ అందుబాటులోకి వచ్చేసరికీ అసలా కూరల్ని చూడగానే ఆనందతాండవమే. మొదటి రెండువారాలూ భారీజనాలను చూసి భయపడి నేను అటుకేసి వెళ్ళలేదు కానీ ప్రతి శనివారం "కూరల సంత" పెట్టడం చూసి రెండువారాల నుంచీ నేనూ కొనటం మొదలెట్టా.
సాయంత్రం ఆరుదాటితే జనం పెరిగిపోతారని గమనించి మూడూ నాలుగు మధ్యన వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. కూరలే కాక ఉసిరి కాయలు, చింతకాయలు, పండు మిర్చి, పెద్ద మిరపకాయలు మొదలైనవి కూడా ఉంటున్నాయి. క్రితం వారం పండు మిర్చి ఓ పావు కొని కొరివికారం, పెద్ద మిరపకాయలతో ఊరు మిరపకాయలు పెట్టాను. నిన్న ముద్దుగా బొద్దుగా ఉన్న చింతకాయలు కొన్నా. ఇంకా పచ్చడి పెట్టాలి. అప్పుడే తోటలోంచి కోసుకొచ్చినట్లు ఉన్న ఆకుకూరలు, తాజా కూరలు భలే ముచ్చటగా ఉన్నాయి. కూరలు అమ్మే ఒకమ్మాయి నన్ను గుర్తుపట్టి "అమ్మా నువ్వు మార్కెట్టుకు వస్తూంటావు కదా" అని అడిగింది. "ఎలా తెలుసు నేను?" అనడిగాను. మేము అక్కడివాళ్ళమే. జనాలు ఎక్కువరావట్లేదని ఇలా ఒకో వారం ఒకో వీధిలోకీ వచ్చి అమ్ముతున్నామమ్మా. ఇలా వస్తే మాకూ బేరాలు బాగా అవుతున్నాయి. నువ్వు వస్తూంటావు కదా నిన్ను గుర్తుపట్టా" అంది. "జనాల దగ్గరకు మీరు వెళ్లండి..."అన్న "మిష్టర్ పెళ్ళాం" సినిమాలో ఆమని డైలాగ్ గుర్తు వచ్చింది.
మధ్యాన్నం ఒంటిగంట నుంచీ రాత్రి తొమ్మిదింటిదాకా ఉంటున్నారు వీళ్ళంతా. ధరలన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. పావుకేజీలు కావలన్నా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎవరి జాగాల్లో తుక్కు వారే క్లీన్ చేసుకుని తీసుకెళ్ళిపోవాలని రూల్ కూడా పెట్టడంవల్ల మర్నాడు పొద్దున్నే వీధంతా సంత మొహం ఎరుగనట్లు మామూలుగా కూడా ఉంటోంది. అది మరీ నచ్చేసింది నాకు. ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ కాలంలో ఇలాంటి సంతలు ఎంత అవసరమో అనిపించింది. కూరల మార్కెట్ రేట్లకు డబుల్ రేటు పెంచేసి అమ్మే వీధుల్లోని కూరల కొట్లువాళ్ళకీ, సూపర్ మార్కెట్ల వాళ్లకీ ఇలాంటి సంతలే తగిన సమాధానం.
17 comments:
"జనాల దగ్గరకు మీరు వెళ్లండి..."అన్న "మిష్టర్ పెళ్ళాం" సినిమాలో ఆమని డైలాగ్ గుర్తు వచ్చింది."
చిరస్మరమణీయమైన వ్యాపార సూత్రమది.
అయితే ఇక మీ "రుచి...the temptation" కూడా ఊపందుకుంటుందన్నమాట :)
మా చిన్నప్పుడు విజయవాడలో బావాజీపేట లో కృష్ణ దేవరాయలు విగ్రహం చుట్టూ కూరగాయలు నేల మీద పెట్టి అమ్మేవారు. అప్పట్లో సత్యనారాయణపురం స్టేషన్ ఉండేది. మీరు ఉంచిన ఫోటోలు చూసి, ఎప్పుడో 45 -50 సంవత్సరాల క్రితం విషయాలు గుర్తుకు వచ్చినాయి. ఇప్పటికీ ఆ విగ్రహం ఉన్నదికాని, దాని చుట్టూ తాపీ పనివాళ్ళు పొద్దున్నే పని వెతుక్కోవటానికి అక్కడ గుమికూడుతుంటారు.
santala gurinchi baga chepparandi.
మా టౌన్షిప్ బయట ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకెళ్తే తెగనచ్చేసింది తనకి.
టపా చదువుతున్నంత సేపూ సూపర్‌మార్కెట్లూ, రిలయన్సులూ ఇటు మద్యతరగతివాళ్ళని ఎలా దోచుకుంటూన్నారో, అటు చిన్నవ్యాపారుల్ని ఎలా దెబ్బతీశారో ఆలోచిస్తూ నాలో ఇంతపెద్ద కమ్యూనిష్టు ఇంతకాలం ఎక్కడదాక్కున్నాడా అని హాచ్చిర్యపోయా! బహుశా ఎర్రటీషర్టు వేసుకున్న ఎఫక్టేమో!!
@శంకర్.ఎస్: మరి అలాగే ఉంది చూడబోతే..
ధన్యవాదాలు.
@శివ: మీరు చెప్పిన విగ్రహం దగ్గర కూరల సంగతి తెలీదు కానీ సత్యనారయణపురం మార్కెట్ అయితే తెలుసండీ. విజయవాడలో రైతు బజార్ వచ్చేదాకా నేను అక్కడికే కూరలకు వెళ్ళేదాన్ని.
ధన్యవాదాలు.
@లక్ష్మి.పి: ధన్యవాదాలు. మీ బ్లాగ్లో మంచి విశేషాలు, వివరాలు తెలుపుతున్నారు.బావుందండీ.
@చైతన్య: నిజమే చైతన్య. కొన్ని సూపర్ మార్కెట్లలో, కూరల షాపుల్లో రేట్లు చూశ్తే అసలు కూరలు కొనబుధ్ధి కాదు. మార్కెట్లో కేజీ తొమ్మిది రూపాలున్న కేబేజీ ఓ షాపులో ముఫ్ఫై రూపాయిలని చూసి నోరువెళ్ళబెట్టా నేను. ఇలాంటివి ఇంకా ఎన్నో.. అందుకే ఇలాంటి సంతలు ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాను.
ఎర్ర టీషర్ట్ కీ జై..:)
ధన్యవాదాలు.
తృష్ణ గారూ మీకు సత్యనారాయణ పురం మార్కెట్టు పూర్వపు రూపం తెలియటానికి అవకాశం లేదు. మీ నాన్నగారి తరానికి చెంది విశేషం అది. 1966 చివర్లో అనుకుంటాను (నేనప్పుడు నాలుగో క్లాసో ఐదో క్లాసో చదువుతున్నాను) సత్యనారాయణపురం మార్కెట్టు ఈశ్వర్ మహల్ ఎదురుకుండా కట్టి ప్రారంభించారు అప్పటినుండి అది ఉండటం గాంధీనగర్ లో అయినా, పేరు మటుకు సత్యనారాయణపురం మార్కెట్టే.
నెల విరామం తర్వాత వచ్చిన మీ పోస్ట్లు మూడూ చదివాను. "కూరల సంత" "కుంపటి" రెండు దశాబ్దాల నాడు ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన జీవిత భాగాలు. మరి "ఉండల పొయ్యి" అని వినలేదూ? ఊకతో చేసిన ఉండలతో వేడినిచ్చే ఈ పొయ్యికి స్టవ్ కన్నా ఎక్కువ నిడివి. నాకు విశాఖపట్నం సంత మొదలుకుని సైదాబాద్ మండీ వరకు పోగులుగా చుట్టుకున్న జ్ఞాపకాల సర్పం కుబుసం విడిచినట్టుగా ఉంది.
రాయండిలాగే. రాస్తూ ఆనందం రాకపోకల వైనాలు పొందండి.
@శివగారూ, నాకు ఆ మార్కెట్ పూర్వపు రూపం,ఎప్పుడు మొదలెట్టారో అవన్నీ తెలియవండి.కానీ నేను చదువుకునే రోజుల్లో ఊర్వశీ థియేటర్ దగ్గర నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళినప్పుడల్లా సత్యనారాయణపురం మార్కెట్లోనే కూరలు కొనేదాన్ని.అదే నేను రాసినది. అరవై ఆరు ప్రాంతాల్లో అంటే అసలు నాన్న కూడా విజయవాడ ఇంకా రాలేదు...:)
@ఉష:"ఏమి నా భాగ్యమూ...' అని పాడాలేమోనండి... very happy to see your comment..thankyou..thanks a lot.
//క్రితం వారం పండు మిర్చి ఓ పావు కొని కొరివికారం, పెద్ద మిరపకాయలతో ఊరు మిరపకాయలు పెట్టాను.నిన్న ముద్దుగా బొద్దుగా ఉన్న చింతకాయలు కొన్నా//
ఇవన్నీ మాకు చెప్పేస్తే సరిపోదండీ...అల్లక్కడున్న చిక్కుడు కాయలతో పాటు..మీరు పైన కొన్నవన్నీ తలో రెండు కిలోలు పార్సల్ చేసేయండి..లేకపోతే..మీ దోస్త్ కట్టీఫ్...(ఉతూతీ పార్సల్స్ ఆర్ ఆక్సెప్టెడ్)
@ఎన్నెల: సరేనండి అయితే వచ్చే శనివారం సంతలో కొని పార్సిల్ చేసేస్తాను...:) పోనీ మీరూ (ఉత్తుత్తిగా) అలా ఓసారి మా ఇంటికి వచ్చేసి నే చేసినవి టేస్ట్ చేసేసి వెళ్దురూ...
త్రిష్ణ గారు !ఎలా ఉన్నారు .మొన్నో రోజు మీ బ్లాగ్కి వచ్చేసి బోల్డు సేపు ఉండి పోయాను .చివరిగా మీ బై చూసి మళ్లీ ఎప్పుడు కనిపిస్తారోనని బెంగ కూడా పెట్టేసుకున్నాను .మీ బ్లాగ్ బాగుంది .ఇన్నేళ్ళ సాహిత్య అధ్యయనం తరువాత కూడా తిలక్ అప్పుడప్పుడు మనసు తలుపు తట్టేస్తూ ఉంటాడు .మీరు తలుపు తట్టే తిలక్ కి పిలుపునిచ్చారు .చలం ని వినాలనే ఊహ కూడా నాకు ఎప్పుడూ కలగలేదు ఎందుకో ...మొదటి సారి మీ బ్లాగ్లోనే విన్నాను .ఎస్కేపిసం గురించి. ఆ గొంతులో కూడా .ఏదో విసుగు వెటకారం తోచింది నాకు .ఇంకా మీ శారద పారిజాతం పూల మొక్క ,ఏమండీ అనే మీ పిలుపు ,మీ దిగుళ్ళు,అనిల్ కపూర్ ఆ పాట ,మీ వెన్నెల మెట్లు , ,మీ పెరటి మొక్కలు అన్నీ చుట్టబెట్టాను .నిన్న, ఇంకా శాంతినికేతన్లో ఆటోలు లేవండి అని చెప్దామనుకుని కొంత మొహమాట పడి ఊరుకున్నాను .చివరిగా ఏమనుకున్నానంటే ఈ బ్లాగ్ బాగుంది సంగీతం, సాహిత్యం ,వంట, కంప్యూటరు అన్నీ తెలిసిన పాత కొత్తలు సమ పాళ్ళలో మేళవించబడిన మంచి అమ్మాయిలాగా అని...best wishes to you trishna gaaru
సుధీరగారూ, చాలా టపాలే చుట్టపెట్టినట్లున్నరు...ధన్యవాదాలు. చాలా సంతోషం...
అయ్యో ఇంకా శాంతినికేతన్ లో ఆటోలు లేవా? ఆట్రిప్ చాలా మెమొరబుల్ అండి నాకు. ఎప్పుడన్నా రాయాలి. మొన్నెప్పుడో మీరు "సినిమాపేజీ" బ్లాగ్లో రాసిన వ్యాఖ్యలు జవాబు రాసాను. చూసారని తలుస్తాను.
మీరు కూడా చాలా మంచి కబుర్లు పంచుతున్నారు. keep blogging. Thankyou once again.
ఇది పాట బోయెనపల్లి HAL Colony లో పార్క్ దగ్గర పెట్టిన సంత లా ఉంది అవునా?
@krishnapriya:మా ఏరియాలో వారానికి ఓ రోజు ఒకోచోట పెడుతున్నారండి. అక్కడ కూడా పెడుతున్నారు, కానీ మాది మీరు రాసిన చోటైతే కాదు...:)
Entha lucky andi meeru..anni fresh, fresh, fresh.maa bad luck ikkada :((
అమ్మో కొరివి కారమే, నోరూరుతొంది కాని తింటే......
నెయ్య వేసుకొని కొరివి కారం తిని చాలా రొజులైంది.
కాముధ
Post a Comment