సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, February 26, 2011

కుంపటి


"కుంపటి". నాకు భలే ఇష్టమైన వస్తువుల్లో ఒకటి. పైన ఫోటోలోది మొన్న అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్న బుజ్జి కుంపటి.కుంపటి పై ఉన్న ఆ ట్రయాంగిల్ చట్రం గిన్నె నిలబడటానికి వాడేది. దీనితో నాకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఇంట్లో పెద్దది, చిన్నది రెండు కుంపటిలు ఉండేవి. గ్యాస్ స్టౌ మీద వంట చేసినా కూడా కిరోసిన్ స్టవ్, బాయిలర్ స్నానానికి నీళ్ళు కాచేందుకు, కొన్ని పదార్ధాలు చేసేందుకు కుంపటి వాడేది అమ్మ. వంకాయ కాల్చి పచ్చడి చేయటానికీ, తేగలు కాల్చటానికీ, మొక్కజొన్నపొత్తులు కాల్చటానికీ వాడేది. దోసకాయ కూడా కుంపటి మీద కాల్చి పచ్చడి చేస్తారని విన్నాను. అరటికాయ కాల్చి పొడి కూర కూడా చేస్తారు. ఇలా రకరకాలుగా కుంపటి వాడుతూండేది అమ్మ.

మాఘమాసంలో గుండ్రని ఇత్తడిగిన్నెలో పాలు,బియ్యం వేసి కుంపటి మీద అమ్మ చేసే అన్నం పరమాన్నం ఎప్పుడు నైవేద్యం పెడుతుందా అని ఎదురు చూసేదాన్ని...త్వరగా తినేయటానికి. చిక్కుడు కాయలకు పుల్లలు గుచ్చి రథంలా తయారుచేసి, చిక్కుడాకుల మీద వండిన పరమాన్నం పెట్టి నైవేద్యం పెట్టాకా తినటానికి ఇచ్చేది...ఆ రుచే రుచి. గ్యాస్ స్టౌ మీద అన్నం పరమాన్నం చేసినా కుంపటి మీద అమ్మ వండిన ఆ రుచి రాదు. ఇంకా ఉల్లిపాయలు కాల్చి పెట్టేది కుంపటి మీద. గోంగూర పచ్చడి చేసుకుని, కుంపటి మీడ కాల్చిన ఉల్లిపాయలు నంచుకుని తింటే ఉంటుందీ...ఆహా ఏమి రుచీ అని పాడుకోవాల్సిందే.


ఏదైనా చేసే ముందు కుంపటి వెలిగించే డ్యూటీ నాకిచ్చేది అమ్మ. బొగ్గులు వేసి, కాస్తంత కిరసనాయిలు పోసి, కాగితం ముక్కలూ అవీ వేసి కుంపటి వెలిగించి, విసనకర్రతో బొగ్గులు మండేలా చేయటం ఎంత కష్టమైన పనో అసలు. అయినా సరదా కొద్దీ ఎప్పుడూ ఆ పని తమ్ముడికి ఇవ్వకుండా నేనే చేసేదాన్ని. మధ్యలో ఆరిపోతూ ఉండే బొగ్గుల్ని మళ్ళీ మండించటం కూడా ఓ పెద్ద పనే. చాలా రోజుల్నుంచీ అమ్మ దగ్గర నుంచి కుంపటి తెచ్చుకోవాలని. ఇన్నాళ్ళకు కుదిరింది. ఇనుము ఊరికే తీసుకోకూడదని కాస్తంత డబ్బులు ఇచ్చి, అటక పైకెక్కి వెతుక్కుని మరీ అమ్మ దగ్గర నుంచి (పెద్దది అమ్మకు ఉంచేసి)ఈ బుజ్జి కుంపటి తెచ్చుకున్నాను. "తాతా చూడు, బయటవాళ్ళకు ఇచ్చినట్లు అమ్మ అమ్మమ్మకు డబ్బులు ఇస్తోంది" అని మా అమ్మాయి నవ్వు. ప్రస్తుతం బొగ్గులు, కిరసనాయిలు సంపాదించే మార్గం చూడాలి. వీధి చివరి ఇస్త్రీ వాళ్ళని అడిగితే ఇస్తారేమో మరి.

"స్వర్ణకమలం"లో "ఇదేంటి సార్, మీ మొహం ఇలా కుంపట్లో కాలిన కుమ్మొంకాయలాగ అయిపోయింది" డైలాగ్, మొన్న మొన్నటి "అష్టాచెమ్మా" సినిమాలో తనికెళ్ళభరణిగారు స్వయంగా కుంపటిపై వంకాయ కాల్చి పచ్చడి చేసే సీన్ మర్చిపోగలమా? గ్యాస్ స్టౌ లు, కనీసం కిరసనాయిలు స్టౌ లు కూడా లేని పూర్వం మన అమ్మమ్మలు, బామ్మలూ మరి అద్భుతమైన వంటలన్నీ ఈ కుంపటి పైనే చేసేవారు. అంతటి ప్రశస్తమైన చరిత్ర కలిగిందీ కుంపటి. ఐదు నిమిషాల్లో కుక్కర్ కూత రాకపోతే గాభరా పడే మనం అసలు వాళ్ళు అలా ఎలా వండేవారా అని వండరవ్వక మానం. తల్చుకుంటే అమ్మో అనిపిస్తుంది. ఓర్పూ, సహనం అనేవి ఇలా నెమ్మదిగా కుంపటిపై వండటం వల్లనే వాళ్ళకి అలవడేవేమో అని నాకో అనుమానం. అసలు ఇప్పటికీ ప్రతీ ఇంట్లోనూ ఒక కుంపటి ఉండాలని నా అబిప్రాయం. ఏమంటారు?

34 comments:

SHANKAR.S said...

"మాఘమాసంలో గుండ్రని ఇత్తడిగిన్నెలో పాలు,బియ్యం వేసి కుంపటి మీద అమ్మ చేసే అన్నం పరమాన్నం ఎప్పుడు నైవేద్యం పెడుతుందా అని ఎదురు చూసేదాన్ని...త్వరగా తినేయటానికి. చిక్కుడు కాయలకు పుల్లలు గుచ్చి రథంలా తయారుచేసి, చిక్కుడాకుల మీద వండిన పరమాన్నం పెట్టి నైవేద్యం పెట్టాకా తినటానికి ఇచ్చేది...ఆ రుచే రుచి."

రధసప్తమి రోజు కదా. ఆ టేస్ట్ భలే ఉంటుందండీ.

దీని కాంబినేషన్ విసనకర్ర ఫోటో కూడా పెడితే బావుండేదండీ.

అసలు కుంపటి మీద కాచిన మొక్కజొన్న పొత్తులు, తేగలు కేకో కేక.

"అసలు ఇప్పటికీ ప్రతీ ఇంట్లోనూ ఒక కుంపటి ఉండాలని నా అబిప్రాయం."

నేనూ ఏకీభవిస్తున్నాను.

అయితే పాపం ఎందుకో ఈ కుంపటిని కొన్నిసార్లు నెగెటివ్ సెన్స్ లో కూడా వాడతారు మన తెలుగులో

like గుండెల మీద కుంపటి, సొంత కుంపటి / వేరు కుంపటి :)

ప్రవీణ said...

పల్లెటూరిలో కట్టెల పొయ్యి పై స్నానానికి కాసిన నీళ్ళలో ఒకరకమైన వాసన ఉంటుంది. మా చిన్నప్పుడు అమ్మగారి ఇంట్లో మధురమైన జ్ఞాపకం..మీ పోస్ట్ చదువుతుంటే గుర్తువచ్చింది.

ప్రవీణ said...

పల్లెటూరిలో కట్టెల పొయ్యి పై స్నానానికి కాసిన నీళ్ళలో ఒకరకమైన వాసన ఉంటుంది. మా చిన్నప్పుడు అమ్మగారి ఇంట్లో మధురమైన జ్ఞాపకం..మీ పోస్ట్ చదువుతుంటే గుర్తువచ్చింది.

veera murthy (satya) said...

ఒకప్పుడు మన వంటశాలలు నిత్యాగ్నిహోత్రాలు...
అగ్గిపెట్టెలు లేనిరోజుల్లో నిప్పుని దాచడానికి కుంపటే వాడేవాళ్ళు.
రాత్రి వంటయ్యిన తరువాత పొయ్యిలోని నిప్పులని కుంపటిలో వేసి , నిప్పులపై బూడిద కప్పి దానిపై మట్టిమూత పెట్టేవాళ్ళు. ఉదయానికి ఆ నిప్పులని మంటకోసం ఉపయోగించేవారు.
బూడిద అంట్లు తోమడానికి . బొగ్గు పండ్లు తోముకోవడానికి.
పేదోడికి మట్టి తో చేసిన కుంపటి ఉండేది.
నిప్పులేని ఇంటిని, కుంపటిలేని ఇంటిని అశుభంగా భావించేవాళ్ళు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాగుందండీ. నాకూ చాలా ఇష్టమైనదీ కుంపటి. మా అమ్మ కూడా కుంపటి వాడేది.నాకూ కొనాలనుంది.
ఇస్త్రీ వాళ్ళు అన్ని ఇవ్వలేరండి. ఎక్కడ అమ్ముతారో కనుక్కొని మనమే కొనుక్కోవాలి.
జలుబు చేస్తే పొగ వేసుకోటానికి మా వారు కొద్దిగా కొంటూ ఉంటారు.

భావకుడన్ said...

కుంపటి ఏమో కానీండి చిన్నప్పుడు బాయిల కింద పడ్డ బూడిదను చిన్నచూపుతో కాలితో ఊడ్చేయబోయిన నా పాదానికి మిగిల్చిన మచ్చ, ఆ గర్వభంగం మాత్రం నాకింకా గుర్తే :-)

ఆ కుంపట్లు, బాయిలర్లు, బొగ్గులు కాలే వాసనలు-ఇవన్నీ నిజంగా అద్భుతమైన జ్ఞాపకాలే అనుకుంటా. మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు థాంక్స్.

చిక్కుడు గింజలకు పుల్లలు గుచ్చి కాల్చుకు తినటం అంటే వెజ్ కేబాబ్స్ లాగా అనమాట :-) ఎపుడైనా ట్రై చెయ్యాలి.

తృష్ణ said...

@shankar.s: every coin has two sides.. అంటారు కదండి "పద ప్రయోగాలూ" అందుకు కావచ్చు...:)

మా అమ్మ రథసప్తమికే కాక ప్రతి మాఘపాదివారమూ(all 4 weeks) పాలు పొంగించి పరమాన్నం చేసేదండి. అసలే చిన్నప్పుదంతా మేము తీపివారం కాబట్టి ఎన్నిసర్లు వండినా ఊడ్చేసేవాళ్లం.

@ప్రవీణ్ కొల్లి: మా ఊరు వెళ్ళినప్పుడు మా తాతమ్మగారు(నాన్నగారి అమ్మమ్మ) దొడ్లో కట్టేపొయ్య దగ్గర పీట వేసుక్కూర్చుని ఇంట్లోని అందరికీ నీళ్ళు కాచేవారండీ. కొబ్బరి డొక్కలూ,ఎండిన కొమ్మలూ అవీ వేసి నిప్పు అంటించే సరికీ దొడ్డంతా పొగ... మీరు రాసినట్లు వాసన వచ్చేది..అదీ ఒక మధుర స్మృతేనండి...మీ వ్యాఖ్యతో అదంతా గుర్తు వచ్చింది.ధన్యవాదాలు.

తృష్ణ said...

@సత్య: "రాత్రి వంటయ్యిన తరువాత పొయ్యిలోని నిప్పులని కుంపటిలో వేసి , నిప్పులపై బూడిద కప్పి దానిపై మట్టిమూత పెట్టేవాళ్ళు. ఉదయానికి ఆ నిప్పులని మంటకోసం ఉపయోగించేవారు.బూడిద అంట్లు తోమడానికి . బొగ్గు పండ్లు తోముకోవడానికి.."

exactly..మా నాన్నమ్మగారు చెప్తూండేవారు ఇవే వాక్యాలు.

@మందాకిని: బొగ్గులను "సాంబ్రాణి" పొగ వేయటం కోసం మా అమ్మ కొంటూ ఉండేది. టపాలో రాయటం మర్చిపోయానండి...బాగా పెద్ద పొడుగాటి జద ఉండేది నాకు. కుంకుడు కాయలు కొట్టి వాటిని నానబెట్టి ఆ రసంతో తలంటు పోసి, చక్కగా సాంబ్రాణి పొగ వేసేది నా జుట్టుకి మా అమ్మ.
త్వరగా మీరూ కొనేసుకోండి కుంపటి..

తృష్ణ said...

@భావకుడన్: అయితే చిక్కుడు గింజలు ట్రై చేస్తే పనస గింజలు కూడా ట్రై చేయండి. కాల్చుకుని తింటే బావుంటాయి.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మరిచిపోయిన రుచులని గుర్తు చేసి మళ్ళీ పాత కాలంలోకి తీసుకెళ్లిపోయారు. మినప రొట్టి అను దిబ్బరొట్టి మరియు కొయ్యరొట్టి కూడా కుంపటి మీద చేస్తేనే రుచి. తేగలు, పనస గింజలు, మొక్క జొన్న పొత్తులు, జీడి కాయలు ఇత్యాదులు కుంపటి మీదనే కాల్చాలి అని చట్టం చేస్తే బాగుండును.:):)

>>"అసలు ఇప్పటికీ ప్రతీ ఇంట్లోనూ ఒక కుంపటి ఉండాలని నా అబిప్రాయం."
శంకర్ గారు ఆల్రెడీ ఏకీభవించారు కాబట్టి నేను రెండీభవిస్తున్నాను.

Saahitya Abhimaani said...

కుంపటి ప్రాశస్త్యాన్ని గమనించే పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు, తన 'ఇల్లాలి ముచ్చట్లు" శీర్షిక లోగో (తెలుగులో చిహ్నం అనవచ్చునేమో)లో కుంపటిని ప్రముఖంగా ఉండేట్టుగా బొమ్మ వేయించారు. అప్పటికీ ఇప్పటికీ తెలుగు పత్రికలలో ఒక శీర్షికకు లోగో కలకాలం నిలిచినది అదొక్కటే.

చాలా జ్ఞాపకాలు తీసుకు వచ్చారు తృష్ణ గారూ. 1978 నుంచి దాదాపుగా 1981 82 వరకూ పెళ్ళికాక ముందు కుంపటి మీద వంట తిప్పలూ, బాగా చిన్నతనంలో కొన్ని రోజులు తప్పనిసరిగా వంట చేయవలసి రావటం వంటి మరుగున పడిన అనేక జ్ఞాపకాలు, మీరు ఉంచిన ఫోటోతో బయటకు వచ్చినాయి.

మీరు చెప్పిన చిక్కుడుకాయలు వేసిన అన్నం పరమాన్నం రధసప్తమికి, సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలను పిడకలు చేసి వాటిని వెలిగించి వండేవారు. ఆ రుచి మరి అద్భుతమే.

రాధిక(నాని ) said...

కుంపటి ,మీ జ్ఞాపకాలన్నీ చాలా బాగున్నాయండి.
మేము రోజు వంటకి గాస్ స్టౌ ,కట్టెల పొయ్యి కూడా ఉపయోగిస్తాము..కట్టెల పొయ్యిలో నిప్పులే కుంపట్లో వేసి దానిమీదకుడా చేస్తాము .

Ennela said...

వెల్కం బ్యాక్ తృష్ణ గారూ,తొలకరి అంత ఆనందంగా ఉంది మీరు తిరిగొస్తే..
మా నాన్నగారికి గ్యాస్ స్టవ్లూ, కుకర్లు వచ్చిన కొత్తల్లో అవి చేసిన పెద్ద పెద్ద ఆగడాలు చూసి కొనడానికి భయం..అందువలన మా ఇంట్లో చాలా ఏళ్ళు కట్టెలూ, బొగ్గుల మీదే వంట..వర్షాకాలం మాత్రం అమ్మ పొగ గొట్టం తో ఊదీ ఊదీ..సినెమా లెవెల్లో కష్టాలు పడేది ...ఇంకా మా నాన్నకి మా ఇంటి ముందు నుంచి ఏ జీవం వెళ్ళినా...రండీ కాఫీ తాగి వెళుదురు గానీ అని పిలవడం అలవాటు..(రాక పోతే కాలర్ పట్టుకుని లాక్కొస్తారు)..పాలు అయిపోయినా, నిప్పు ఆగిపోయినా అమ్మ పాట్లు చూడాలి..తను నిప్పు రాజేసి..మమ్మల్ని పాల కోసం పరిగెత్తించేది..ఆ వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళే లెండి..టయిము లేదు టయిము లేదు అనకుండా ఈ ప్రాసెస్ అంతా అయ్యేవరకూ మంచి మంచి కబుర్లు చెబుతూ మా తండ్రి గారిని ఆనందింప చేసేవారు.అమ్మ ముందు జాగ్రత్తగా కొంచెం యెక్కువే కాచేది...యీ లోపు అతిథుల సంఖ్య పెరగకపోతే అదో ప్రపంచ వింత మాకు!..ఆయన రిటయిర్ అయ్యాకయితే అమ్మ పొయ్యి ఆర్పడం మానేసిందనే చెప్పాలి. పాలు కూడా ఇలా బజార్లో దొరికేసేవి కాకాదు.. పాలవాళ్ళని చాలా బతిమాలాల్సి వచ్చేది ఎక్కువ పాలు కావాల్సొస్తే
నీ పోస్టు కంటే నా కామెంటు పెద్దదయితే జెర సెమించెయ్ తృష్ణమ్మో, యీడ పోరి జెరంత ఎక్కువ ఎమోషన్ అయితాంది

lalithag said...

కుంపటినేగా ఇక్కడ fashionable గా బార్బెక్యూ అంటారు :)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మిగతా వాటిలాగా కుంపట్లో నిప్పులేకుండా సెగమాత్రమే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. దానివల్లే కుంపటిమీద వండితే ఆరుచే వేరుగా ఉంటుంది.
టైటిల్ చూడ్డంతోనే అష్టాచెమ్మ గుర్తొచ్చింది. సాయంత్రం కాఫీకోసం అమ్మమ్మ విసనకర్ర టపటపా కొట్టిన శబ్ధం వినిపిమ్చేసింది చదువుతూ ఉంటే. కుక్కర్ని కుంఫటిమీద ఎందుకు పెట్టరు? అన్నది చిన్నఫ్ఫుడు పెద్దప్రశ్న.

ఊకదంపుడు said...

నా హృదయం ద్రవీభవించినది, నేనూ మూడీభవిస్తున్నాను

తృష్ణ said...

@బులుసు సుబ్రహ్మణ్యం: అవునండి..పరుగుల ప్రపంచంలో ఆ రుచులన్నీ మనం మెల్లమెల్లగా మరిచిపోతున్నాం..

@శివ: అవునండి. భలే గుర్తు చేసారు. చాలా థాంక్స్ అండీ.

@రాధిక(నాని): మా ఊళ్లో అలా రెండూ వారేవారండి.

తృష్ణ said...

@ఎన్నెల: మీ స్మృతుల లోతు ఎక్కువేనండోయ్...!సెమించడమేమిటండీ మరీనూ...ఏవో ఇలా పాత జ్ఞాపకాలన్నీ నెమరువేసుకుంటూంటేనే అప్పుడప్పుడు ఖూషీ వస్తుందండి...:)

@లలితజి: మన సంస్కృతంలో కుంపటిని "హసంతి" అంటారని ఎవరో ఓసారి చెప్పారండి. ఏదో అమ్మాయి పేరులా ఉంది కదండి.

నా బ్లాగ్లో ఇదే మీ మొదటి వ్యాఖ్య. థాంక్స్ అండి.

తృష్ణ said...

@చైతన్య: అంతేనేమో. మరి మీ అమ్మమ్మగారి విసనకర్ర కబుర్లు కూడా రాసేసేయ్. పెద్దది పెట్టలేమేమో కానీ
2 ltrs,3 ltrs ఉన్న చిన్న కుక్కర్లు పెట్టి చూడచ్చేమో.

@ఊకదంపుడు: మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

కృష్ణప్రియ said...

మీ పోస్ట్ చదవగానే.. నాకూ కుంపటి తెచ్చుకోవాలని ఉంది.. బెంగుళూరు లో ఎక్కడ దొరుకుతాయి? ఎవరికైనా తెలుసా? హైదరాబాదైనా ఓకే..

తృష్ణ said...

@కృష్ణప్రియ: ఏదైనా స్టీల్ సామాన్ల షాపులోనో, ఇనుప సామాన్లు దొరికే చోట్లోనో అడిగి చూడండి. వాళ్ళైతే ఎక్కడ దొరికేదీ చెప్పగలుగుతారేమో..

Anonymous said...

"ఫ్లాష్‌బాక్‌లు తరచూ గుర్తొస్తున్నాయంటే
వ్యార్థక్యం తరుముకొస్తోందని అర్థం" :)

కుంపటికింద స్వీట్ పొటాటో, పనస గింజలు కాల్చుని తింటే అదో తుత్తి. మొక్కజొన్న ఇక చెప్పాల్సిన పనిలేదు.

కుంపటి పోజు బాగా ఇచ్చింది, ఏ కెమెరాతో తీశారు?

శ్రీలలిత said...

బాపూ,రమణగారి చిత్రాల్లో కుంపటి కనిపించడం తప్పనిసరి అనిపిస్తుంది నాకైతే. కుంపటి, రుబ్బురోట్లో పచ్చడి రుబ్బడం రెండూ కనిపిస్తాయి.
ముఖ్యంగా బుడుగు కార్టూన్ లలో ఒకటి.. ఉదయాన్నే రాధ కుంపటి దగ్గర కాఫీ కాస్తూంటుంది. గోపాళం అక్కడే కూర్చుని ఉంటాడు. నుదుటి మీద పడిన ముంగురులని రాధ పైకి సర్దుకొబోతుంటే.."ఒద్దు రాధా.. అలాగే అందంగా ఉంది.." అంటాడు గోపాళం. గుమ్మం దగ్గర నిలబడి వీళ్ళని చూస్తున్న బుడుగుకి ఖోపమన్నమాట.. తనని తల దువ్వుకోమంటారూ.. అని.. బలే బాగా గుర్తుండిపోయిందది నాకు.
హైదరాబాదులో కుంపటి బడీచౌడీలో పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న ఇనపసామాన్ల కొట్టులో దొరుకుతుంది.. చాలా చిన్న కొట్టు..

తృష్ణ said...

@snkr:"ప్లాష్ బ్యాక్ లు గుర్తొస్తే..." ఈ పాయింట్ నేనొప్పుకోనండీ...
అయినా అప్పుడే వార్ధక్యమా? ఇంకా చత్వారం కూడా రానిదే...:)

అప్పుడే కడిగి ఆరబెట్టిన మీదట కుంపటి కి ఆ అందం వచ్చిందండీ. నాది Nikon కెమేరా(Coolpix s220).

@శ్రీలలిత: అవునండోయ్. భలే గుర్తు చేసారు రాధాగోపాళాలని. థాంక్యూ..

@కృష్ణప్రియ: శ్రీలలితగారు చెప్పేసారు మరిక మీరు కొనటమే ఆలస్యం.

విరజాజి said...

హైదరాబాదులో బేగంబజారు మొదట్లో (ఉస్మానియా ఆసుపత్రి నుంచీ బేగంబజార్ వైపు వెళ్ళే దారిలో) కుంపట్లు దొరుకుతాయి. కుంపట్లేం ఖర్మ, ఇనుప (బియ్యమూ, పప్పులు బాగు చేసుకోడానికి) జల్లెడలు, చిల్లి గరిటెలు, నూనెలో వేగిన బూందీ తీసుకోడానికి సన్న జల్లెడ గరిటెలు ... ఇంకా పిండివంటలు చేసుకోవడానికి కావలసిన పాత్రలు సమస్తమూ దొరుకుతాయి.

గాసు ఆదా చేసుకోడానికి (అప్పట్లో మరి ఒకటే సిలిండరు కదా!) పెద్ద కుంపటి మీక కుక్కరు పెట్టేది మా అమ్మ. ఇక కుంపటి సన్నని సెగ పైన కాచిన పాల ను తోడు వేస్తే - ఆ పెరుగు రుచే వేరు. కుంపటి పైన రాచ్చిప్పలో పప్పు చేసేది మా నాయనమ్మ ..... చాలాసేపు ఆధరువులు వేడిగా ఉండేవి రాచ్చిప్పల్లో వండితే.

హేవిటో.. ఒక్క సారి గత స్మౄతుల్లోకి తీసుకెళ్ళిపోయారు తృష్ణగారూ!

సుమలత said...

బాగున్నాయ్ మీ టపాలన్నీ చదివాను .....
కుంపటి గురించి చెప్పాలంటే మా బామ్మా నేను ౫ క్లాసు
లో వున్నప్పుడు పాలూ కయాలంటే కుంపటి మీద
చేసేవాళ్ళు ,ఇంక పప్పు,వగైరా ... ఎప్పటి మెమరీస్
గుర్తుచేసారో ....

తృష్ణ said...

@ఉష: చాలా రోజులకు మీ వ్యాఖ్య చూసిన ఆనందంలో నిన్న రాయటమ్ మరిచాను. "ఉండలపొయ్యి" పేరు వినలేదు కానీండి "పొట్టు పొయ్యి" అని ఉంటుందని, దాంట్లో బొగ్గులు కాకుండా వడ్రంగి దగ్గర నుంచి రంపం పొట్టు తెచ్చు, అది కూరి వంటలకు వాడతారని, అది వేడి ఎక్కువ ఉంటుండని మా నాన్నగారు చెప్పేవారు. మీరు చెప్పేది ఇదీ ఒకటేనో కాదో మరి.

రకరకాల పాత పొయ్యిలు అని టైటిల్ పెట్టి ఇలా పాతకాలపు వెరైటీ పొయ్యిల గురించి టపా రాస్తే బావుంటుందేమో అని అవిడియా వచ్చేసిందండోయ్..!

తృష్ణ said...

@విరజాజి: కృష్ణప్రియ గారికి కుంపటి కొనుక్కోవటానికి రెండో ఆప్షన్స్ కూడా చెప్పేసారు. బావుందండి. "రాచ్చిప్ప". భలే. నాకు తెలుసోచ్... ఎప్పటెప్పడివో మా నాన్నమ్మ దగ్గర బోలెడు రాచ్చిప్పలు ఉండేవండి. ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నాయి అవి. మా నానమ్మ అప్పుడప్పుడు నన్ను "మొద్దు రాచ్చిప్ప" అని పిలిచేది. అందుకే గుర్తుగా నేనూ ఒక బుల్లి రాచ్చిప్ప మా ఇంటికి తెచ్చుకున్నాను. అల్లం,మిర్చి తొక్కుకోవటానికి వాడుతూ ఉంటాను...:) మీ వ్యాఖ్యతో నేనూ మా నాన్నమ్మ జ్ఞాపకాల్లోకి వెళ్పోయానండి...థాంక్యు.

తృష్ణ said...

@సుమలత: నా టపాలు నచ్చినందుకు ధన్యవాదాలు. old memories are sweet కదండి.

ఇందు said...

తృష్ణ గారు! మీరు మళ్ళీ ఫాంలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది :) మీరు టపాలు రయదం ఆపేసినప్పుడు ఎంత బాధ పడ్డానో!! మీరు ఇలాగే...బోలెడు మంచిమంచి టపాలు రాయాలని కొరుకుంటున్న మీ అభిమాని :) nd Hearty welcome once again :)

తృష్ణ said...

@ఇందు: మీక్కూడా హృదయపూర్వక ధన్యవాదాలు...:)

Unknown said...

kumpatipai chese vantaa naaku chaalaa istam chalaa kalam tharuvaatha kumpati chudaaniki dhorikindhi chaalaa thanks andi

విరిబోణి said...

Welcome back trushna gaaru,
Alrady andaruoo cheppesaru..ee anni gnapakaalu naku kooda vunnai..malla okkasari gurthu chesaaru :) thanks kumpati anagane naku gurthu vachhindi,india nundi nenu chinna rolu, rokali thechhukunna Roti pachhallu mis avvakooddu ani :)) Just sharing my memory with you again:)

Siri said...

Hats off!!!!! what a lovely post.. re visiting old memories.. I lovve kumpati.. eppatikaina India tirigivaste, tappakunda konta o kumpati.. thankso, thanksulu..
Siri