సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, March 6, 2011

ఒళ్ళు మండుతోంది..

ఆ దృశ్యం చూసినప్పటి నుంచీ.
నిన్న పొద్దున్నుంచీ.
ఒళ్ళు మండుతోంది.
బుడుగు భాషలో చెప్పాలంటే నడ్డి మీద చంపెయ్యాలన్నంత ఖోపం. ప్రతి పనికీ ఆ వీధిలోంచి వెళ్ళక తప్పదు. నిన్న కూడా ఆ ఇంటి మీదుగా నాలుగైదుసార్లు వెళ్ళాల్సివచ్చింది. అలా వెళ్ళినప్పుడల్లా మనసు రగిలిపోయింది. ఇవాళ పొద్దున్న కూడా పాల కోసం వెళ్తూంటే మళ్ళీ అల్లంత దూరంలో ఆ ఇల్లు కనబడగానే నిన్నటి విషయం గుర్తుకొచ్చి భలే కోపం వచ్చింది. అసలు మొదటి నుంచీ అతనిది ఏదో తేడా బొమ్మ అనే అనుకుంటూ వస్తున్నా. ఇప్పుడిక కన్ఫార్మ్ అయిపోయింది. ఇప్పటిదాకా అతనిపై ఉన్న కాస్త జాలీ కూడా ఎగిరిపోయింది. దగ్గరకు వెళ్ళీ, ఏమయ్యా ! నీకసలు మనసుందా? మనిషివేనా? అని కడిగెయ్యాలని. బాగా మనసారా తిట్టాలని...అనిపించింది. కానీ ఏం చేయలేని నిస్సహాయత. నాకేం హక్కుంది? అతని ఇల్లు అతని ఇష్టం.

మేం ఈ ఏరియాలోకి వచ్చాకా ఏదన్నా పని మీద వెళ్లాలంటే ఆ వీధి లోంచే వెళ్ళాలి. బస్టాప్ దాకా వెళ్ళాలంటే ఐదు నిమిషాల నడక. దారిలో చాలా ఇళ్ళున్నా నా దృష్టి వీధికి ఎడమవైపున్న ఆ ఇంటి మీద పడటానికి ఒక బలమైన కారణం ఉంది. సన్నజాజి తీగ. నాకెంతో ప్రీతిపాత్రమైన పూలు. కాస్తా కూస్తా కాక ఇంత లావు మొదలుతో ఖాళీగా ఉన్న డాబా పైకి పాకిన పెద్ద తుప్పులా ఉన్న సన్నజాజితీగను చూసి రోజూ ఆనందిస్తూ ఉండేదాన్ని. ఇంకెంత మరో నెలారెంణెళ్ళు ఆగితే చెట్టంతా పువ్వులే అన్న ఊహ నన్ను చాలా సంబరపెట్టేది. ఆ తరువాత,ఆ ఇంటి గేటు దగ్గరే ఎప్పుడూ కనబడుతూ ఉండే సర్దార్జీ ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగేది. ఏభై యేళ్ళకు ఏ మాత్రం తక్కువ ఉండదు అతని వయసు. అంత పెద్ద ఇంట్లో అతను కాక ఒక ముసలి తల్లి మాత్రం కనబడుతూ ఉంటూంది. మరెవరూ కనబడేవారు కాదు. పైగా రోజూ ఏ వేళలో అటువైపు వెళ్ళినా ఆ గేటు దగ్గరే కుర్చీలో నిద్రోతూనో, నించునో కనబడతాడు ఆయన. రోజూ అదే దారి కావటంతో కొన్నాళ్ళకు గేట్లో ఆయన కనబడకపోతే ఆశ్చర్యం వేసేది. ఇవాళేంటి లేడు అని. ఆయన గురించి బస్టాప్ వచ్చేదాకా మాకు డిస్కషను. "ఎందుకండీ ఆయన అక్కడే నిలబడతాడు? ఏం పని లేదా? ఆ ఇంట్లో ఇంకెవరూ లేరేంటి? పెళ్ళవలేదంటారా? " అని తనని ప్రశ్నలతో వేధించేదాన్ని. "మనకెందుకు? అతని ఇల్లు అతని ఇష్టం. నించుంటాడో కూచుంటాడో." అనేవారు తను. "అలాక్కాదండీ, అలా వీధిలో నించునే ఉంటాడెందుకు? వేరే పనేం లేదా? అదేం టైం పాస్? ఏ పుస్తకమో చదువుకోవచ్చు కదా? కంప్యూటర్ లేదంటారా? లేదా టివీ చూడొచ్చు కదా? ముప్పొద్దులా అలా గేట్లోనే ఉంటాడేం? వాళ్ళీంట్లో ఏవైనా విలువైన వస్తువులున్నాయేమో? వాటికి కాపలాగా అలా నింఛుంటాడేమో?" అని అనేదాన్ని.
ఓ రోజలాగే ఏదో అనబోయాను. "అతని కాలు వైపు చూడు" అన్నారు తను. అప్పుడు చూశాను అతని ఒక కాలు బాగా లావుగా వాచి ఉంది. ఏదో కట్టు కూడా ఉంది. చూట్టానికి భయం వేసింది. "ఓహో అదన్నమాట సంగతి. ఏదో దెబ్బ తగిలి ఇలా ఇంట్లో ఉండిపోతున్నాడన్న మాట" అన్న సమాధానం దొరికింది. కానీ దెబ్బ తగిలితే ఇంట్లోనే ఉండచ్చు కదా. ఇలా వీధిలో నిలబడటం ఎందుకు? పైగా ఓ కుర్చీ కూడా వేసుకుని రాత్రిళ్ళు కూడా అక్కడే కూచుని కనిపిస్తాడు. కాలక్షేపానికి ఏం చేయాలో తెలియదా ఈయనకి?" అని బోలెడు ప్రశ్నలు నాకు. మరో రోజు వాళ్ళింటి గోడ దగ్గర ఏదో తుక్కు పోతున్నారని ఎవరినో తిడుతున్నాడు. ఆ తరువాత సంత రోజున కూరలవాళ్ళు ఆ ఇంటి ముందు కూరలు పరచబోతే ఒప్పుకోలేదు. ఇంతోటి ఇంద్ర భవనానికీ అడ్డామా అని నవ్వుకున్నాం. కూరలవాళ్ళు సణూక్కుంటూంటే మేమూ నవ్వుకున్నాం. కిరికిరీ మనిషన్న మాట. అనుకున్నాం.

ఇక నిన్న పొద్దున్నే వెళ్తూంటే ఆ ఇంటివైపు చూసి అవాక్కయ్యాను. తరువాత బోలెడు ఖోపం వచ్చేసింది. ఓళ్ళు మండిపోయింది. ఇంతకీ ఏం చేసాడో తెలుసా? అంత లావు మొదలుతో మరో నెల్లో పూయబోయే సన్నజాజి తీగ మొదలంటా నరికించేసాడు. అదేం పాపం చేసింది పాపం? నోరు లేని జీవం. పచ్చగా ఉన్న తీగను ఎలా నరకాలనిపించిందో. పరీక్షగా చూస్తే ఇంటికి రంగులేస్తున్న పనివాళ్ళు కనబడ్డారు. ఇంటికి రంగు వెయ్యటానికి అడ్డం వస్తోండని కొట్టించేసాడన్న మాట. కాసిని కొమ్మలు కొట్టించి మిగతాది ఉంచచ్చు కదా. ఇప్పుడా ఇంటి అందానికి ఇదేం అడ్డం వచ్చింది? ఉండేది ఇద్దరే కదా. ఎలాగోఅలా ఈ కిరికిరీ అంకుల్ ను మంచి చేసుకుని వేసం కాలంలో ఆ సన్నజాజి పూలూ రోజూ కోసుకోవచ్చని ఎన్ని కలలు కన్నాను..? ఒప్పుకోకపోతారా? అనుకున్నా. అంత పెద్ద తీగెకు ఎన్ని పూవులు పూస్తాయో కదా...కోసుకున్నా కోసుకోకపోయినా చూసి ఆనందించచ్చు. అటు వెళ్ళినప్పుడల్లా గుప్పుమనే వాసన ఆస్వాదించచ్చు అని ఆశపడ్డాను...

అసలు నా ఆశల సంగతి వదిలేస్తే పచ్చని చెట్టు నరకాలన్న ఆలోచన ఎంత భయంకరమైనది? మనసున్న మనిషెవ్వడూ అలా చెయ్యడసలు. మనుషులను హింసిస్తే శిక్షిస్తారు. జంతువులను హింసిస్తే కూడా శిక్షిస్తారు. కానీ పచ్చని ప్రాణమున్న చెట్టుని కొట్టేస్తే ఏ శిక్షా లేదేం? అలాంటి చట్టం కూడా ఎవరన్నా చెయ్యకూడదూ? మొక్కలకు మాత్రం ప్రాణాం ఉండదా? పొద్దున్నే లేవగానే చల్లని గాలితో ఎంత అందంగా పలకరిస్తాయి? ఆ పలకరింపులోని చల్లదన్నన్ని ఎవరూ గమనించరా? అందమైన పువ్వులతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మొక్కల మధ్యన కూచుంటే చిన్నగా తలలూపుతూ ఎన్ని కబుర్లు చెప్తాయో...అవి ఎవరికీ వినిపించవా? ఏమిటో మొక్కలంటే మనుషులకి అంత అలుసు. జంతువులు ఇంకా కుయ్యో మొయ్యో అని అరుస్తాయి. పాపం మొక్కలకు, చెట్లకు అలా అరవటం కూడా రాదు. వాటిని నరుకుతుంటే బాధ ఎవరితో చెప్పుకుంటాయి? చిరంజీవి లెవెల్లో " మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా.." అని భారీ డైలాగు వాటి తరఫున చెప్పే నాధుడు లేడనే కదా మొక్కలంటే మనుషులకు అలుసు. అందుకే ఒళ్ళు మండుతోంది...

***** ****
పూయలేకపోయిన నా ప్రియమైన సన్నజాజులు...

8 comments:

SHANKAR.S said...

ఇంటికి రంగులేయించడానికి ఏపుగా పెరిగిన జాజి తీగని కొట్టేయిన్చినవాడు సర్దార్జీ అని మీరు చెప్పకపోయినా మాకు అర్ధమై పోయి ఉండేది. (చూడుడు: సర్దార్జీ జోకులు)

మా ఇంట్లో స్వాతి ఇష్టపడి కొనుక్కున్న బటన్ రోజెస్, చామంతి మొక్కలు ఇప్పుడు నేను hyd-tirupati shuttle service వలన బాల్కనీలోకి, బయటకి మార్చలేక మారుస్తున్నా. పోనీ వదిలేసి వెళ్దామా అంటే వచ్చేటప్పటికి చచ్చిపోతాయని భయం. అందుకే ఊరెళ్ళేటప్పుడు బయట పెట్టి పక్క ఫ్లాట్ వాళ్ళని నీళ్ళు పోయామని అడగటం, తిరిగి వచ్చాక మళ్ళీ బాల్కనీకి షిఫ్ట్ చేయడం. సన్న జాజికి ఆ facility లేక అది చనిపోయినప్పుడు చాలా బాధేసింది. అందుకే పర్మనెంట్ గా ఇద్దరం ఒకేచోట ఉండేవరకు తీగ మొక్కలని మాత్రం నిషేధించాం,

The Spiritual Hobo said...

Hi,
I am a hobo that was just passing through. I like your site, so now I’m following you.
Thanks!
Signed, hobo

Saahitya Abhimaani said...

"....కానీ పచ్చని ప్రాణమున్న చెట్టుని కొట్టేస్తే ఏ శిక్షా లేదేం? అలాంటి చట్టం కూడా ఎవరన్నా చెయ్యకూడదూ? మొక్కలకు మాత్రం ప్రాణాం ఉండదా?...."

నిజమే అటువంటి చట్టం చేస్తే బాగుంటుంది. కాని, మన సోదర సోదరీమణులు ఆ చట్టాన్ని పాటిస్తారా అని నా అనుమానం. లంచగొండి అధికారులకు ఇదొక కల్పవృక్షం అవుతుంది.

కృష్ణప్రియ said...

తృష్ణ గారు,

మీ బాధ నాకర్థం అవుతోంది. మా ఇంటి మందు వాళ్ళు ఒక్కోసారి ఇలాగ ఎండిన పూల తుక్కు పడుతోందని విరజాజినీ, నీడ గా ఉందని మామిడి చెట్టునీ కొట్టేశారు. చాలా బాధనిపించింది.. కానీ ఏం చేయగలం? అది చాలదన్నట్టు మా పక్కావిడ 'Hmm.. I love that bald look on their car port.. Let me do the same' అంది :-(

David said...

అయ్యో అలా చేశాడా.....

sphurita mylavarapu said...

Totally agree with you
చెట్లని నరకకుండా కూడా ఒక చట్టం వుండాలి. కనీసం కొంతమందైనా భయపడతారు కదా...

శరత్ కాలమ్ said...

చెట్లను నరకకూడదని చట్టం చెయ్యాలి - బాగానే వుంది. మరి చట్టాల్ని నరకకుండా వుండాలంటే ఏం చెయ్యాలి?

durgeswara said...

చట్టాలచేసినమ్దువల్లమాత్రమే ఇటువంటి సున్నితభావాలు బ్రతుకవు.